• facebook
  • whatsapp
  • telegram

భారత జాతీయోద్యమం ఆవిర్భావం - విస్తరణ

సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం వచ్చిన ఐరోపావారు క్రమంగా భారతదేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుని వలస, వాణిజ్య, సామ్రాజ్యవాదంతో వ్యవహరించారు. ఈ క్రమంలో ఆంగ్లేయులు మిగతా ఐరోపా దేశాలను అధిగమించి భారతదేశాన్ని ఆక్రమించుకుని, తమ ప్రధాన వలస రాజ్యంగా మార్చుకున్నారు. 1757 నాటి ప్లాసీ యుద్ధం వారి రాజకీయ అధికారానికి పునాది వేసింది. 1764 నాటి బక్సార్‌ యుద్ధానంతరం ఆర్థిక పునాదిని ఏర్పాటు చేసుకున్నారు. 1773 నాటి రెగ్యులేంటిగ్‌ చట్టం ద్వారా ఆంగ్లేయులు పాలనా సంస్కరణలను ప్రారంభించారు. తమ దేశ పాలనా విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఆర్థిక దోపిడీ విధానాల ద్వారా భారతదేశ వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలను నాశనం చేశారు. వారు అనుసరించిన బలవంత మత మార్పిడి, జాత్యాహంకార విధానాలతో పాటు వారు ప్రవేశపెట్టిన సాంఘిక సంస్కరణలు భారతీయులకు ఆంగ్లేయుల పట్ల వ్యతిరేక భావాలు రావడానికి కారణమయ్యాయి. వారు ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యే వారిని భారతదేశం నుంచి పంపించడానికి కారణమైంది.


కారణాలురాజకీయ ఐక్యత

ఆంగ్లేయులు రాకముందు భారతదేశం మొఘలు చక్రవర్తుల పాలనలో ఉండేది. వారి బలహీనతల వల్ల దేశం అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. కానీ ఆంగ్లేయుల యుద్ధాలు, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, సైన్య సహకార పద్ధతి లాంటి విధానాలు; బిరుదులు, భరణాలను రద్దు చేయడం; దుష్పరిపాలన నెపంతో రాజ్యాలను ఆక్రమించడం ద్వారా మొత్తం భారతదేశాన్ని ఒకే పాలన కిందకు తెచ్చారు. ఇది భారతీయుల్లో రాజకీయ ఐక్యతకు కారణమై, తామంతా ఒకటే అనే భావన తలెత్తి జాతీయోద్యమం ఆవిర్భవించడానికి దోహదపడింది. ఆంగ్లేయులు మొదట 1740 - 1763 మధ్య జరిగిన కర్ణాటక యుద్ధాల ద్వారా ఫ్రెంచివారిని ఓడించి, కర్ణాటక, హైదరాబాదు రాజ్యాలపై ఆధిపత్యం సాధించారు. ప్లాసీ (1757), బక్సార్‌ (1764) యుద్ధాల తర్వాత బెంగాల్‌పై పట్టు సాధించారు. మైసూర్‌ యుద్ధాల ద్వారా టిప్పుసుల్తాన్‌ రాజ్యాన్ని, మరాఠా యుద్ధాల ద్వారా మహారాష్ట్రుల స్వరాజ్యాన్ని, సిక్కు యుద్ధాల ద్వారా సిక్కు రాజ్యాన్ని జయించి దేశంలో రాజకీయ ఐక్యత తెచ్చారు. వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి ద్వారా, డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మిగిలిన రాజ్యాలను జయించి మొత్తం దేశాన్ని ఏకపాలన కిందకు తెచ్చారు. ఇదే జాతీయోద్యమ భావాలు రావడానికి దోహదపడింది.
బ్రిటిష్‌వారు రావడానికి ముందే భారతదేశంలో జాతీయతావాదం ఉన్నప్పటికీ, వారి కాలంలోనే అది పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. ఈ జాతీయతా భావమే భారత స్వాతంత్య్ర పోరాటానికి దారితీసింది.


ఆర్థిక దోపిడీ విధానాలు

  ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించి, వలస రాజ్యంగా మార్చుకుని దేశ సంపదను దోపిడీ చేశారు. బ్రిటిష్‌ పాలన కారణంగా భారతదేశంలో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. వారు భారత వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టిన వ్యవసాయ వాణిజ్యీకరణ విధానాలు, తీన్‌కథియా పద్ధతులు, భూమిశిస్తు విధానాలు భారత రైతాంగాన్ని దోపిడీ చేయడానికి కారణమయ్యాయి. ప్రభుత్వం వడ్డీ వ్యాపారులకు, వర్తకులకు మాత్రమే మేలు చేకూరుస్తుందనే వాస్తవాన్ని గ్రహించిన రైతాంగం ఆంగ్ల వ్యతిరేక భావాలను పెంచుకుంది. ఆంగ్లేయులు అనుసరించిన వాణిజ్య, వలసవాద విధానాలు భారత వాణిజ్య రంగాన్ని దెబ్బతీశాయి. పారిశ్రామిక విప్లవం కారణంగా మన దేశంలో చేనేత, కుటీర, చిన్న తరహా పరిశ్రమలు నాశనమయ్యాయి. ఫలితంగా దేశంలోని కార్మికులు, వృత్తి పనివారు తమ దైన్య స్థితికి ఆంగ్లేయులే కారణమని తెలుసుకొని జాతీయతా భావాన్ని పెంచుకున్నారు. ముఖ్యంగా ఆధునిక విజ్ఞానాన్ని పొందిన భారతీయ విద్యావంతులు ఆంగ్లేయుల ఆర్థిక, దోపిడీ విధానాలను ప్రజలకు వివరించి వారిని జాతీయోద్యమం వైపు నడిపించారు. దాదాభాయ్‌ నౌరోజీ తన డ్రైన్‌ సిద్ధాంతం (సంపద తరలింపు) ద్వారా భారతదేశ సంపద హోంఛార్జీల రూపంలో ఏ విధంగా ఇంగ్లండ్‌కు తరలిపోతుందో వివరించాడు. రమేష్‌చంద్ర దత్‌ (ఆర్‌.సి.దత్‌) ఆంగ్లేయులు అనుసరించిన వాణిజ్య ప్రధాన దశ, స్వేచ్ఛా వాణిజ్య దశ, పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం లాంటి వలసవాద దశల గురించి ప్రచారం చేశాడు. ఫలితంగా భారతీయులు తమ పేదరికానికి, నిరుద్యోగానికి ఆంగ్లేయులే కారకులని గ్రహించి వారిపై పోరాటానికి సిద్ధపడ్డారు.


ఆధునిక రవాణా సౌకర్యాల కల్పన

  ఆంగ్లేయులు తమ ప్రయోజనం కోసమే భారతదేశంలో ఆధునిక రవాణా సౌకర్యాలను కల్పించారు. 1853లో డల్హౌసీ కాలంలో భారతదేశంలో తొలి రైల్వేలైన్‌ వేశారు. తంతి తపాలా వ్యవస్థలను ప్రవేశపెట్టారు. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ముడి సరుకులను ప్రధాన పట్టణాలకు, తర్వాత ఓడరేవులకు అక్కడి నుంచి ఇంగ్లండ్‌కు తరలించడానికి రైలు, రోడ్డు, జల రవాణా మార్గాలను ఆంగ్లేయులు ప్రవేశపెట్టారు. తద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు పెరగడం, ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను తెలుసుకోవడం, సుదూర ప్రాంతాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగడం జాతీయతా భావం పెరగడానికి దోహదపడింది. తంతి తపాలా వ్యవస్థల ద్వారా ప్రజలు ఒకరి సమాచారాన్ని మరొకరు తెలుసుకుని ఐక్యంగా ఉద్యమించే అవకాశం ఏర్పడింది.


ఆంగ్ల విద్య 

  మెకాలే కమిటీ సిఫారసుల మేరకు 1835లో విలియం బెంటింగ్‌ భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. ఫలితంగా అనేకమంది భారతీయులు ఆంగ్ల విద్యను నేర్చుకుని హేతువాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం అనే ఆధునిక పాశ్చాత్య భావాలను తెలుసుకోగలిగారు. ఇంగ్లండ్, అమెరికా, ఫ్రాన్స్‌ లాంటి దేశాల్లో విప్లవాలు రావడానికి గల కారణాలను గ్రహించారు. భారతీయ విద్యావంతులు స్వేచ్ఛ, సమానత్వం లాంటి భావాల ప్రాధాన్యాన్ని, వాటిని పొందడానికి మనం చేయాల్సిన పోరాటం గురించి సామాన్యులకు వివరించారు.
ఫలితంగా భారతదేశంలో ఆంగ్ల విద్య కారణంగా జాతీయతా భావాలు పెరిగి స్వాతంత్య్రోద్యమం సాధ్యపడింది. ‘పాశ్చాత్య విద్య (ఆంగ్ల విద్య) ద్వారా భారతీయులు స్వపరిపాలనా వ్యవస్థల విలువను గ్రహించి, వారు మనల్ని భారతదేశం నుంచి వెళ్లగొట్టవచ్చు’ అని లయోనల్‌ స్మిత్‌ కామన్స్‌ సభ సెలక్ట్‌ కమిటీలో చెప్పిన అభ్రిపాయం నిజమైంది. విద్యావంతులందరిలో ఒకే రకమైన భావాలు, అనుభూతులు, ఆశలు, ఆదర్శాలు పెంపొందడం వల్ల జాతీయోద్యమ భావాలు అభివృద్ధి చెందాయి.


సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాల ప్రభావం

  భారతదేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన సాంఘిక, మత సంస్కరణోద్యమ సంస్థలైన బ్రహ్మ, ఆర్య సమాజాలు, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజాల సంస్కర్తలైన రాజా రామ్మోహన్‌రాయ్, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి వారి బోధనలు భారతీయుల్లో జాతీయతా భావాలు పెంపొందడానికి దోహదపడ్డాయి. ఫలితంగా భారతీయుల్లో దేశభక్తి, ఆత్మ విశ్వాసం లాంటివి అభివృది ్ధచెందాయి. స్వామి దయానాంద సరస్వతి ‘భారతదేశం భారతీయులకే’ అనే నినాదానిచ్చారు. స్వామి వివేకానంద తన బోధనల ద్వారా యువతలో జాతీయతా భావాలు, దేశభక్తి, హిందూమతం పట్ల అభిమానాన్ని పెంచి ‘ఆధునిక జాతీయతా పితామహుడి’గా పేరొందాడు. దివ్యజ్ఞాన సమాజం ద్వారా అనిబిసెంట్‌ రాజకీయ చైతన్యాన్ని పెంపొందింపజేశారు. అన్ని మతాలు ఒకటే అని చెప్పడం ద్వారా మత సమైక్యతను పెంచి తద్వారా జాతీయోద్యమంలో అందరూ పాల్గొనేలా చేశారు.


1857 సిపాయిల తిరుగుబాటు ప్రభావం

  1857 నాటి సిపాయిల తిరుగుబాటు భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి మరో ముఖ్య కారణమైంది. ఆంగ్ల సైన్యంలో పనిచేసే భారతీయ సిపాయిలు తమపై ఆంగ్లేయులు చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా 1857, మే 10న మీరట్‌లో తిరుగుబాటు ప్రారంభించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ తిరుగుబాటు జరిగినప్పటికీ ఆంగ్ల ప్రభుత్వం దీన్ని అతి త్వరగానే అణచివేసింది. ఈ తిరుగుబాటు వైఫల్యమే భారతీయుల్లో జాతీయతా భావాలు పెరగడానికి దోహదపడింది. ఆంగ్ల ప్రభుత్వం ఈ తిరుగుబాటు కారణంగానే ‘1858 భారత ప్రభుత్వ చట్టం’ను ప్రవేశపెట్టింది. అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంగా లేకపోవడం వల్లే తిరుగుబాటు విఫలమైందని, భవిష్యత్తులో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఉద్యమిస్తే స్వాతంత్య్రం లభిస్తుందని భారతీయులు గ్రహించారు. కాబట్టే వి.డి. సావర్కర్‌ 1857 సిపాయిల తిరుగుబాటును ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సమరం’ అని పేర్కొన్నారు.

పత్రికల పాత్ర

  భారత జాతీయోద్యమ అభివృద్ధికి, వ్యాప్తికి వార్తా పత్రికలు కూడా ప్రధాన కారణమయ్యాయి. దేశభక్తి సందేశాన్ని ప్రజల్లో ప్రచారం చేయడానికి ఆధునిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ భావాలు ¨, చైతన్యాన్ని పెంచడానికి పత్రికలు ప్రధాన సాధనాలుగా ఉపయోగపడ్డాయి. వాస్తవానికి పత్రికల చరిత్ర కూడా ఆంగ్ల పాలనతోనే ప్రారంభమైంది. భారతదేశంలో తొలి పత్రిక బెంగాల్‌ గెజిట్‌ను 1780లో జేమ్స్‌ అగస్టస్‌ హిక్కీ ప్రారంభించాడు.
హిందూ పేట్రియాట్, ఇండియన్‌ మిర్రర్, అమృతబజార్, ది హిందూ, స్వదేశమిత్రన్, ఆంధ్రప్రకాశిక లాంటి అనేక పత్రికలు జాతీయతా భావాలను, ఆంగ్లపాలనా లోపాలను, ఆంగ్లేయుల ఆర్థిక దోపిడీ విధానాలను ప్రజలకు తెలిపేవి. ఫలితంగా భారతీయులు జాతీయతా భావాలను పెంపొందించుకొని, స్వాతంత్య్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.


ఆంగ్లేయుల జాత్యాహంకార విధానాలు:
భారతీయుల పట్ల ఆంగ్లేయులు అనుసరించిన జాత్యాహంకార ధోరణి కూడా జాతీయోద్యమ ఆవిర్భావానికి దోహదపడింది. భారతీయులు నల్లవారని, నాగరికత తెలియనివారని, వారిని ఉన్నతోద్యోగాల్లో నియమించరాదని లార్డ్‌ కారన్‌వాలీస్‌ లాంటి ఆంగ్ల అధికారులు బహిరంగంగానే విమర్శించేవారు. భారతీయుల్ని హింసించి, చంపినప్పటికీ తెల్లవారు తప్పించుకున్న అనేక సంఘటనలను పత్రికలు తరచూ ప్రచురించేవి. భారత న్యాయమూర్తుల విషయంలో కూడా ఇలాంటి వివక్ష ఉండేది. భారతదేశంలో ఆంగ్ల న్యాయమూర్తుల న్యాయ నిర్ణయాన్ని (తీర్పును) గురించి ఆంగ్ల చరిత్రకారుడైన ట్రెవిలియన్‌ ‘న్యాయస్థానంలో ఒక ఆంగ్ల వ్యక్తి సాక్ష్యానికి, అనేక మంది భారతీయుల సాక్ష్యం కంటే ఎక్కువ విలువ ఉంది. అధర్మ, భీతిలేని, దురాశాపరుడైన ఆంగ్ల వ్యక్తి చేతుల్లో ఒక భయంకరమైన అధికారాన్ని పెట్టే పరిస్థితి ఆంగ్లేయులది’ అని 1864లోనే పేర్కొన్నాడు. భారతీయ విద్యావంతులను సైతం ఆంగ్లేయులు బహిరంగంగా అవమానపరిచేవారు. ఈ జాతి వివక్షా విధానాలను సహించలేని అనేకమంది భారతీయ యువకులు ఉగ్రవాద చర్యలకు సైతం పూనుకున్నారు.


లార్డ్‌ లిట్టన్‌ చర్యలు
 

  1876 - 80 మధ్య వైస్రాయ్‌గా పనిచేసిన లార్డ్‌ లిట్టన్‌ అనుసరించిన విధానాలు భారతీయుల్లో జాతీయతా భావం రావడానికి కారణమయ్యాయి. భారతదేశానికి దిగుమతి అయ్యే ఆంగ్లేయుల వస్త్రాలపై సుంకాలు రద్దు చేశాడు. 1878లో ఆయుధ చట్టాన్ని దేశ భాషా పత్రికల చట్టాన్ని ప్రవేశపెట్టి భారతీయులు ఎలాంటి ఆయుధాలు ధరించరాదని, ప్రాంతీయ భాషల్లో పత్రికలు ప్రచురించరాదని ఆంక్షలు పెట్టాడు. సివిల్‌ సర్వీసు పరీక్షలు రాసే భారతీయుల అర్హత వయసును 21 నుంచి 19 సంవత్సరాలకు తగ్గించాడు. ఈ చర్యల గురించి పేర్కొంటూ ‘లిట్టన్‌ చర్యలు నిర్లిప్తంగా ఉన్న భారతీయులను మేల్కొల్పి ప్రజల్లో చురుకు పుట్టించాయి’ అని సురేంద్రనాథ్‌ బెనర్జీ అన్నారు.


 

ఇల్బర్ట్‌ బిల్లు వివాదం

భారత జాతీయోద్యమం ఆవిర్భావానికి, భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపనకు తక్షణ కారణం ఇల్బర్ట్‌ బిల్లు వివాదమని చరిత్రకారులు అభివర్ణిస్తారు. ఈ వివాదం లార్డ్‌ రిప్పన్‌ కాలంలో చోటుచేసుకుంది. భారతీయ న్యాయమూర్తులు ఐరోపా నేరస్తులను విచారించకూడదనే వివక్ష నాటి న్యాయస్థానాల్లో ఉండేది. లార్డ్‌ రిప్పన్‌ ఈ అంశంపై ఇల్బర్ట్‌ కమిటీని నియమించాడు. ఆ కమిటీ సూచన మేరకు భారతీయ న్యాయమూర్తులు కూడా ఐరోపా నేరస్థులను విచారించవచ్చని బిల్లు ప్రవేశపెట్టాడు. కానీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ భారతదేశంలోని ఐరోపావారు ఉద్యమం చేపట్టగా, ప్రభుత్వం బిల్లును వెనక్కు తీసుకుంది. ఈ సంఘటన భారతీయులకు కనువిప్పు కలిగించింది. కొంతమంది ఐరోపావారు ఉద్యమం చేస్తేనే ఇల్బర్ట్‌ బిల్లును రద్దు చేసినప్పుడు, భారతీయులంతా ఐక్యంగా ఉద్యమం చేసి ఆంగ్లేయులను వెళ్లగొట్టగలమని భావించి జాతీయోద్యమాన్ని ప్రారంభించారు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించి మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులుగా పనిచేసి చివరగా 1947లో స్వాతంత్య్రాన్ని పొందగలిగాం.

Posted Date : 21-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌