• facebook
  • whatsapp
  • telegram

న్యాయసమీక్ష - న్యాయవ్యవస్థ - క్రియాశీలత 

        భారత రాజ్యాంగ నిర్మాతలు న్యాయ సమీక్ష అనే భావనను అమెరికా నుంచి గ్రహించారు. 1803లో అమెరికాలో మార్బరీ Vs మాడిసన్ కేసు సందర్భంగా అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌మార్షల్ ఇచ్చిన తీర్పు న్యాయ సమీక్ష భావనకు ఆధారమైంది.


* కేంద్ర, రాష్ట్ర శాసన వ్యవస్థలు రూపొందించే శాసనాలు, ప్రభుత్వం జారీ చేసే సూత్రాలు, అమలు చేసే విధానాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవని న్యాయస్థానం తీర్పు ఇవ్వడాన్ని న్యాయసమీక్ష (Judicial Review) అంటారు.
* ప్రాథమిక హక్కుల పరిరక్షణ, సమాఖ్య స్ఫూర్తి పరిరక్షణ, రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటం, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ సాధనకు న్యాయ సమీక్షాధికారం దోహదపడుతుంది.
* శాసనం ద్వారా నిర్ణయించిన పద్ధతిలో ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయ సమీక్షాధికారం అనివార్యమని కె.ఎమ్. మున్షీ పేర్కొన్నారు.

* ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన శాసనాలు, ఆదేశాలు, ఇతర నోటిఫికేషన్లు చెల్లవని ఆర్టికల్ - 13 ప్రకారం సుప్రీంకోర్టు రద్దు చేయడాన్నే న్యాయసమీక్షాధికారం అంటారు.
* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ - 13(2) ద్వారా న్యాయసమీక్షాధికారాన్ని న్యాయవ్యవస్థకు కల్పించారు.

 

జె.సి. జోహారి అనే రాజనీతి వేత్త ప్రకారం న్యాయ సమీక్షకు ఆధారాలైన సిద్ధాంతాలు
1) శాసన సామర్థ్య సిద్ధాంతం - (Doctrine of Legislative Competence)
2) రాజ్యాంగ పురోభావన సిద్ధాంతం - (Doctrine of Prospectivism)
3) క్రియాశీల సిద్ధాంతం - (Doctrine of Dynamism)
4) అనుభవాత్మక నిర్ణయ సిద్ధాంతం - (Doctrine of Empirical)
5) వేర్వేరు భాగ సిద్ధాంతం - (Doctrine of Severability)
6) రాజ్యాంగ చైతన్య సిద్ధాంతం - (Doctrine of Spirit of Constitutionalism)

 

భారత్‌లో న్యాయసమీక్ష అభివృద్ధి క్రమం
* 1951లో చంపకం దొరై రాజన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు సందర్భంగా మద్రాసు రాష్ట్రంలో వైద్య కళాశాలల్లో కొన్ని కులాలకు రిజర్వేషన్ కల్పించడాన్ని మద్రాస్ హైకోర్టు కొట్టివేయగా, ఆ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
* 1951లో ఎ.కె. గోపాలన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సెమినార్ పత్రిక సంపాదకుడైన రమేష్ థాపర్‌ను కారణాలు చెప్పకుండా నిర్భందించడం వ్యక్తి స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని, అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది.

* 1952లో శంకరీ ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, 1965లో సజ్జన్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉందని, రాజ్యాంగ సవరణలు న్యాయసమీక్ష పరిధిలోకి రావని పార్లమెంటు చేసే సాధారణ చట్టాలు మాత్రమే న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయని పేర్కొంది.
* 1967లో గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఆర్టికల్, 368 ప్రకారం జరిగే రాజ్యాంగ సవరణలు కూడా ఆర్టికల్, 13లో భాగంగా న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు.
* 1969లో ఆర్.సి. కూపర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దుకోసం జారీ చేసిన ఆర్డినెన్సులు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని, అవి చెల్లవని పేర్కొంది.
* 1973లో కేశవానందభారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉందని, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం ఉల్లంఘించరాదని పేర్కొంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎమ్. సిక్రీ
* 1980లో మినర్వామిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, న్యాయసమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో అంతర్భాగమని పేర్కొంది.

* 1994లో ఎస్.ఆర్. బొమ్మై Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ప్రవేశికలోని లౌకికతత్వం అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుందని, దాన్ని రద్దు చేసే అధికారం లేదని పేర్కొంది. ఈ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎమ్.ఎన్. వెంకటాచలయ్య.
* 1997లో చంద్ర కుమార్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయసమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పునరుద్ఘాటించింది.
* 1975లో ఇందిరా గాంధీ Vs రాజ్‌నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, 39వ రాజ్యాంగ సవరణ చట్టం చట్ట సమానత్వానికి విరుద్ధమైందని, అది చెల్లదని పేర్కొంది.
* 1978లో మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, అమెరికాలో అమల్లో ఉన్న Due Process of Law అనే సూత్రాన్ని వినియోగిస్తూ, సహజ న్యాయ సూత్రాలను ప్రాథమిక హక్కులకు వర్తింపజేయాలని పేర్కొంది.
* 1992లో ఇందిరాసహాని Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.
* 2007లో అశోక్ కుమార్ ఠాకూర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, కేంద్రప్రభుత్వ విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్టికల్ - 15(5)ను చేర్చడం రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.

* 2007లో ఐ.ఆర్. కొల్హోయ్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, తమిళనాడులో రిజర్వేషన్లు 69% పెంచడానికి సంబంధించి 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలను వ్యతిరేకించింది. 1973 తర్వాత 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలేవైనా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని న్యాయ సమీక్షకు గురిచేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.
* న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించేపటప్పుడు న్యాయస్థానం ఇచ్చే తీర్పులను 2 రకాలుగా విభజించవచ్చు. అవి:
1) ఇంట్రావైర్స్: శాసన శాఖ శాసనాలు, కార్యనిర్వాహక శాఖ పరిపాలనా చర్యలు రాజ్యాంగానికి అనుగుణంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నట్లయితే వాటిని ఇంట్రావైర్స్ అంటారు.
2) అల్ట్రావైర్స్: శాసన శాఖ శాసనాలు, కార్యనిర్వాహక శాఖ పరిపాలనా చర్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాటిని అల్ట్రావైర్స్ అంటారు.
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా న్యాయస్థానాల న్యాయ సమీక్ష అధికారంపై అనేక పరిమితులు విధించింది.
* మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం 1977లో 43వ రాజ్యాంగ సవరణ ద్వారా, 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయస్థానాల న్యాయ సమీక్షాధికారాన్ని పునరుద్ధరించింది.
* భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష పరిధి నుంచి మినహాయించింది.

* అమెరికా సుప్రీంకోర్టుకు రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సమీక్ష చేసే అధికారం ఉంది. అమెరికాలో న్యాయశాఖకు ఆధిక్యత ఉంది.
* What is law is - What the Judges say (న్యాయమూర్తులు చెప్పిందే న్యాయం) అనేది అమెరికాలో అమల్లో ఉన్న నానుడి.
* భారత్‌లో న్యాయ శాఖ ఆధిక్యత కంటే రాజ్యాంగ ఆధిక్యత ఎక్కువ. అంటే భారత్‌లో న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్షాధికారం నిరపేక్షమైంది కాదు.
* మన దేశంలో హైకోర్టులకు రాజ్యాంగ సవరణలను విచారించే అధికారం లేదు.

 

మన దేశంలో న్యాయసమీక్షకు అవకాశం లేని అంశాలు
* ఆర్టికల్, 53 - దేశపాలనాధికారాలు మొత్తం రాష్ట్రపతి ద్వారా నిర్వహించడం.
* ఆర్టికల్, 74(1) - ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చే సలహాలు.
* ఆర్టికల్ 77(1) - రాష్ట్రపతి పేరు మీద, రాష్ట్రపతి ద్వారా మాత్రమే పాలన నిర్వహించడం.
* ఆర్టికల్, 105 - పార్లమెంటు సభ్యులకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలు, వసతులు.
* ఆర్టికల్, 122 - పార్లమెంటు వ్యవహారాలపై న్యాయస్థానాల జోక్యంపై పరిమితులు.
* ఆర్టికల్, 82 - డిలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ) కమిషన్ సూచనలను అనుసరించి లోక్‌సభ, శాసనసభల నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం.

* ఆర్టికల్, 154 - రాష్ట్రాల పరిపాలన మొత్తం గవర్నర్ల పేరు మీద నిర్వహించడం.
* ఆర్టికల్, 163(1) - రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్‌కు పాలనలో అందించే సలహాలు
* ఆర్టికల్, 166(1) - రాష్ట్రాల పరిపాలన మొత్తం గవర్నర్ల పేరు మీద నిర్వహించడం.
* ఆర్టికల్, 194 - శాసన సభ్యులకు కల్పించిన ప్రత్యేక రక్షణలు, సౌకర్యాలు.
* ఆర్టికల్, 212 - రాష్ట్ర శాసన సభ వ్యవహారాలు
* ఆర్టికల్, 341 - షెడ్యూల్డు కులాల జాబితాపై భారత పార్లమెంటు రూపొందించిన చట్టాలు.
* ఆర్టికల్, 342 - షెడ్యూల్డు తెగలకు సంబంధించి భారత పార్లమెంటు రూపొందించే చట్టాలు.
* ఆర్టికల్, 329 - ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన తర్వాత దాని కార్యకలాపాల్లో ....
* ఆర్టికల్, 361 - రాష్ట్రపతి, గవర్నర్లకు కల్పించిన ప్రత్యేక మినహాయింపులు.
* ఆర్టికల్, 392(2) ప్రకారం 1935 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి, ఏవైనా అంశాలను ప్రస్తుత రాజ్యాంగంలోకి తీసుకోవడానికి రాష్ట్రపతి జారీచేసే ఉత్తర్వులను పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయాలు.
* 2వ షెడ్యూల్‌లో పేర్కొన్న రాజ్యాంగ ఉన్నత పదవులు, వారి జీతభత్యాలు.
* 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న భూసంస్కరణలకు సంబంధించిన అంశాలు.

న్యాయ సమీక్షకు అవకాశం కల్పించే అంశాలు
* రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అన్వయించడంలో తలెత్తే వివాదాలు.
* ఆర్టికల్, 13 - ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండే శాసనాలు.
* ఆర్టికల్, 73 - కేంద్ర ప్రభుత్వ అధికార పరిధి విషయంలో తెలెత్తే వివాదాల సమీక్ష.
* ఆర్టికల్, 162 - రాష్ట్రప్రభుత్వ అధికార పరిధి విషయంలో తలెత్తే వివాదాల సమీక్ష.
* ఆర్టికల్, 131 - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాలు.
* ఆర్టికల్, 132 - రాజ్యాంగబద్ధమైన అప్పీళ్లను విచారించడం.
* ఆర్టికల్, 137 - సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పులను తానే పునఃసమీక్ష చేయడం.
* ఆర్టికల్, 147 - రాజ్యాంగానికి అర్థవివరణ, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం.
* ఆర్టికల్, 246 - పార్లమెంటు, శాసనసభల శాసనాధికార పరిధి.
* ఆర్టికల్, 248 - అవశిష్టాధికారాలను నిర్ణయించడం.
* ఆర్టికల్, 254 - ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య తలెత్తే విభేదాలు.
* ఆర్టికల్, 368 - రాజ్యాంగ సవరణకు సంబంధించిన వివాదాలు.
* ఆర్టికల్, 352 - జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన వివాదాలు.
* ఆర్టికల్, 356 - రాష్ట్రాల్లో విధించిన రాష్ట్రపతి పాలన
* ఆర్టికల్, 123 - రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్స్‌లు.
* ఆర్టికల్, 213 - రాష్ట్రాల గవర్నర్లు జారీచేసే ఆర్డినెన్స్‌లు.
* ఆర్టికల్, 11 - పౌరసత్వానికి సంబంధించి భారత పార్లమెంటు రూపొందించే చట్టాలు.
* మన దేశంలో న్యాయ వ్యవస్థకు ఉన్న న్యాయ సమీక్షాధికారాన్ని బ్రిటన్‌తో పోల్చినప్పుడు ఉన్నతంగా, అమెరికాతో పోల్చినప్పుడు పరిమితంగా ఉంటుంది.
* బ్రిటన్‌లో ఆ దేశ పార్లమెంటు చేసిన శాసనాలను న్యాయ సమీక్షకు గురిచేసే అధికారం ఆ దేశ న్యాయవ్యవస్థకు లేదు.
* అమెరికాలో శాసన వ్యవస్థ రూపొందించే శాసనాలను, కార్యనిర్వాహక వ్యవస్థ చర్యలను ఆ దేశ న్యాయవ్యవస్థ న్యాయ సమీక్షకు గురిచేయగలదు.

 

న్యాయశాఖ - క్రియాశీలత
* జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ ప్రకారం 'ప్రతి న్యాయమూర్తి కూడా ఒక క్రియాశీలి. అది అనుకూలంగా కావచ్చు లేదా వ్యతిరేకంగా కావచ్చు'.

* న్యాయశాఖ క్రియాశీలత అంటే న్యాయవ్యవస్థ తన అధికారాలు, విధులను మరింత చొరవగా, క్రియాశీలకంగా, ఉదారంగా వినియోగించడం. న్యాయాన్ని ప్రజలకు అందించే క్రమంలో నూతన పద్ధతులను, ప్రక్రియలను వినియోగించి సమన్యాయపాలనకు అవసరమైన చర్యలను చేపట్టడం.
* శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ తమ రాజ్యాంగ లక్ష్యాల సాధనలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల నెలకొనే పరిస్థితుల్లో ప్రజల హక్కులను కాపాడటానికి; న్యాయవ్యవస్థ స్పందించి శాసన, కార్యనిర్వాహక శాఖలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడానికి, వాటిపై ప్రభావం చూపుతూ అవి క్రియాశీలకంగా వ్యవహారించడానికి న్యాయశాఖ తీసుకునే చర్యలనే న్యాయశాఖ క్రియాశీలతగా పేర్కొంటారు.

 

న్యాయశాఖ క్రియాశీలత - ప్రాధాన్యం
* సామాన్య ప్రజలకు న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం.
* సమన్యాయపాలను, పరిపాలనలో జవాబు దారీతనాన్ని పారదర్శకతను పెంపొందించడం.
* రాజ్యాంగ లక్ష్యాలు, ఆదర్శాలు, ఆశయాలను సాధించడం.
* భారత సమాఖ్య వ్యవస్థలోని సమస్యల పరిష్కారం కోసం కృషి.
* అణగారిన, వివక్షతకు గురైన వర్గాలకు న్యాయాన్ని అందించడం.
* సున్నితమైన అంశాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకుండా, పరిష్కరించకుండా ఉన్న సందర్భంలో ప్రజలు అసంతృప్తికి గురికాకుండా పరిష్కారం చూపడంలో న్యాయశాఖ క్రియాశీలత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

* దత్త శాసనాధికారాల వల్ల కార్యనిర్వాహక శాఖ అధికారాలు విస్తృతమై అధికార దుర్వినియోగం, జవాబుదారీతనం లోపించడం.
* ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల దీర్ఘకాలిక, నిర్మాణాత్మక, అభిలషణీయమైన నిర్ణయాలను ప్రభుత్వాలు రూపొందించడంలో విఫలం కావడంతో, ప్రజల కనీస అవసరాలు తీరకపోవడం.
* ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (PIL) ద్వారా లోకస్ స్టాండి (న్యాయ అర్హతా నియమం)లో మార్పులు చేయడం, బాధితుల తరఫున వాదించడం కోసం న్యాయస్థానం అమికస్ క్యూరీని నియమించడం.
* సుమోటో కేసులను ప్రోత్సహించడం ద్వారా
* సామాజిక స్ఫూర్తి ఉన్న ప్రజా ప్రయోజనాలను ఆశించే వ్యవస్థలను ప్రోబోనో పబ్లికోగా వర్ణిస్తారు. అలాంటి వారి వాదనను న్యాయస్థానాలు అనుమతించడం ద్వారా న్యాయశాఖ క్రియశీలత వర్థిల్లుతుందని చెప్పవచ్చు.

 

న్యాయశాఖ క్రియాశీలత - కేసులు 

ఎమ్.సి. మెహతా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
* తాజ్‌మహల్ చుట్టూ కాలుష్యాన్ని వెదజల్లే 18 రకాలైన పరిశ్రమలను వెంటనే మూసివేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

సునీల్ భాత్రా Vs ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్:
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ తీహార్ జైలులో నిర్బంధించిన ఖైదీలను మానవీయ విలువలకు విరుద్ధంగా, శిక్షా గది పేరుతో క్రూరంగా పరిగణించడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని పేర్కొంది.

 

లక్ష్మీకాంత్ పాండే Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, భారతీయ బాలబాలికలను విదేశీయులు దత్తత తీసుకునే సందర్భంలో బాలల రాజ్యాంగ, చట్టపరమైన హక్కుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొంది.

 

వినాసేత్ Vs స్టేట్ ఆఫ్ బిహార్ కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, కార్యనిర్వాహక శాఖ నిర్లక్ష్యం వల్ల విచారణలో ఉన్న ఖైదీలు 20 నుంచి 30 ఏళ్ల వరకు జైలులో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, వారిని వెంటనే విడుదల చేయాలని జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

 

ఓల్గా టెల్లిస్ Vs బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఫుట్‌పాత్‌లపై నివసించే పేదలను ముందుగా నోటీస్ ఇచ్చి ఖాళీ చేయించడంతోపాటు వారు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలని పేర్కొంది.

విశాఖ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పినిస్తూ మహిళలు పనిచేసే ప్రదేశాల్లో వారిపై అత్యాచారాలు, లైంగిక వేధింపులను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలపై అనేక మార్గదర్శక సూత్రాలను జారీచేసింది.

 

ఇతర కేసులు - వివాదాలు 
* బిహార్‌లో పశుగ్రాసం కేసు
* కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఆర్. బొమ్మై తొలగింపు వివాదం
* ఫరీదాబాద్ గనుల్లో పనిచేసే బాల కార్మికుల స్థితిగతులపై బంధువా ముక్తి మోర్చా అనే స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు
* ఝార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి వివాదం
* కామన్ కాజ్ కేసు సందర్భంగా పెట్రోల్ బంకుల కేటాయింపు
* వాహనాలపై ఎర్ర బుగ్గలు, సైరన్‌ల వాడకం
* రామసేతు వివాదంలో తమిళనాడు అధికార డీఎంకే ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 కిందికి ప్రకారం రద్దుచేస్తామని హెచ్చరించడం.
* వినీతా నారాయణ్ కేసులో జైన్ హవాలా కుంభకోణంలో జైన్ సోదరుల డైరీలో పేర్కొన్న రాజకీయ నాయకులపై కేసును నమోదు చేయాలని సీబీఐని ఆదేశించడం.
* డి.కె. బసు కేసు సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన పోలీసు సంస్కరణలు

ప్లీ బార్గెయ్‌నింగ్ (Plea Bargaining)
* దీన్ని 2006 నుంచి అమలు చేస్తున్నారు. దీని ప్రకారం నిందితులు నేరాన్ని అంగీకరిస్తే న్యాయస్థానం విచారణను ఆపి, అతడికి తక్కువ శిక్షను విధించవచ్చు. ఈ పద్ధతి ద్వారా కేసులు తొందరగా పరిష్కారం అవుతాయి.

 

సామాజిక న్యాయ బెంచ్ (Social Justice Bench)
 దీన్ని 2014, డిసెంబరు 12న ప్రారంభించారు. ప్రజల సామాజిక సమస్యలను, ప్రభుత్వం ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులను త్వరితగతిన విచారించడానికి సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమే సామాజిక న్యాయ బెంచ్. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ బెంచ్ సమావేశం అవుతుంది. ఇది సుప్రీంకోర్టులో సామాజిక న్యాయానికి సంబంధించి, పెండింగ్‌లో ఉన్న కేసులతోసహా కొత్త కేసులను కూడా విచారిస్తుంది.

 

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్
 1992లో యూఎన్‌వో పర్యావరణ, అభివృద్ధి సమావేశం రియో డీ జనిరోలో చేసిన తీర్మానాల ఆధారంగా పార్లమెంటు 2010లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చట్టాన్ని రూపొందించింది.

 

ముఖ్యాంశాలు
* ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ దీనిలో ఒక ఛైర్మన్, 10 మంది సభ్యులకు తక్కువ కాకుండా 20 మంది సభ్యులకు మించకుండా, జ్యూడిషియల్ మెంబర్స్ ఉంటారు.
* దీని ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం 5 ఏళ్లు.

* సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఛైర్మన్ లేదా జ్యూడిషియల్ సభ్యులుగా నియమితులైతే వారి పదవీ విరమణ వయసు 75 సంవత్సరాలు.
* హైకోర్టు న్యాయమూర్తులు జ్యూడిషియల్ సభ్యులుగా నియమితులైతే వారి పదవీ విరమణ వయసు 67 సంవత్సరాలు.
* ఇతర నిష్ణాతులైన సభ్యుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు.

 

అధికారాలు - విధులు
* పర్యావరణానికి సంబంధించిన అన్ని ముఖ్య వివాదాలు దీని పరిధిలోకి వస్తాయి.
* అటవీ పరిరక్షణ చట్టం, జీవ వైవిద్య పరిరక్షణ చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం లాంటి వాటిని విచారిస్తుంది.
* ఈ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును ప్రత్యేక సందర్భాల్లో 90 రోజుల వ్యవధిలో సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.

 

లోక్ అదాలత్
* దీన్ని ప్రజాన్యాయస్థానం, సంచార న్యాయస్థానం అంటారు.
* మన దేశంలో న్యాయవ్యవస్థలో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించి, తక్కువ ఖర్చుతో, తక్కువ వ్యవధిలో తక్షణ న్యాయాన్ని అందించడం దీని లక్ష్యం.
* లోక్ అదాలత్ విధానాన్ని 1987లో ప్రవేశపెట్టారు.

* దీని అమలు కోసం 1987లో లీగల్ ఏడ్ అథారిటీని ఏర్పాటు చేశారు.
* ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 39(A) ప్రకారం పేదలకు ఉచిత న్యాయసహాయాన్ని అందించాలి.
* మధ్యవర్తుల సహకారంతో, రాజీమార్గం ద్వారా ఇరువర్గాల సమ్మతితో కేసులు పరిష్కారమవుతాయి.
* 2002లో లీగల్ ఏడ్ అథారిటీ యాక్ట్‌కు సవరణలు చేసి, లోక అదాలత్‌లను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశారు.
* దేశంలోని ఉన్నత న్యాయస్థానాలు మొదలుకొని, జిల్లా సెషన్స్ కోర్టు, ఇతర సబార్డినేట్ కోర్టులు కూడా లోక్ అదాలత్‌లను నిర్వహిస్తాయి.
* మోటారు వాహనాలకు సంబంధించిన కేసులు, ఇన్య్సూరెన్స్ క్లైమ్స్, ఆస్తి వివాదాలు, వివాహం, విడాకులు, భూసేకరణ లాంటి కేసులను లోక్ అదాలత్‌లో విచారిస్తారు.

 

గ్రామ న్యాయాలయాల చట్టం
* డి.ఎ. దేశాయ్ కమిషన్ సిఫారసు మేరకు చిన్న కేసులను సత్వరం విచారించే లక్ష్యంతో 2008లో భారత పార్లమెంటు గ్రామ న్యాయాలయాల చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం దేశ వ్యాప్తంగా 5067 న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేశారు.
* హైకోర్టును సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేస్తాయి.
* గ్రామ న్యాయాలయాలు 2009, అక్టోబరు 2 నుంచి అమల్లోకి వచ్చాయి.

* ఈ చట్టం జమ్మూకశ్మీర్, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు, ఆదివాసీ ప్రాంతాలు మినహా దేమంతటా వర్తిస్తుంది.
* క్రిమినల్, సివిల్ కేసులకు మరణశిక్ష, యావజ్జీవ కారాగారశిక్ష, 2 ఏళ్లకు పైబడి శిక్ష విధించే అవకాశం ఉన్న కేసులను మినహాయించి, మిగిలిన అన్నిరకాల వివాదాలపై విచారణ నిర్వహిస్తాయి.

 

ఫ్యామిలీ కోర్టులు
* 1984లో కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా కుటుంబ సంబంధ వివాదాలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటు చేశారు.
* వివాహం, విడాకులు, వారసత్వం లాంటి అంశాలపై తలెత్తే సివిల్ వివాదాలను పరిష్కరించే నేపథ్యంలో ఈ కోర్టులను ఏర్పాటు చేశారు.
* 2014లో గాంధీ నగర్ ఫ్యామిలీ కోర్టు మాజీ క్రికెటర్ దల్వీర్ సింగ్ కేసులో భార్యనే భర్తకు భరణం చెల్లించాలని అరుదైన తీర్పును ఇచ్చింది.

 

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
* 11వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2000లో మనదేశంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు.
* అపరిష్కృతంగా ఉన్న కేసులను త్వరితగతిన విచారణ చేసేందుకు వీటిని ఏర్పాటు చేశారు.

* 2000లో మనదేశంలో 492 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం వాటి సంఖ్య 1192.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 242 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉన్నాయి.
* రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ఖర్చులతో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను నిర్వహిస్తున్నాయి.

 

జాతీయ న్యాయ సర్వీసుల సంస్థ (National Legal Services Authority)
* 1987లో జాతీయ న్యాయసలహా సేవల చట్టాన్ని పార్లమెంటు రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 1998లో జాతీయ న్యాయసేవల అధికార సంస్థ ఏర్పడింది. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాన పోషకులుగా జాతీయ స్థాయిలో వ్యవహరిస్తారు. ఆర్టికల్, 39(A) ప్రకారం పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం దీని లక్ష్యం.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌