• facebook
  • whatsapp
  • telegram

భూ సంపాతాలు

అమాంతం విరిగిపడే ఆపద! 


కొండచరియలు విరిగిపడ్డాయని, మంచు ప్రవాహాలు ముంచుకొచ్చాయని, రాతి ఖండాలు అమాంతం కూలిపోయాయని, అపార ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయని తరచూ వార్తలు వస్తుంటాయి. వీటికి భారీ వర్షాలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాల వంటి ప్రకృతి ప్రకోపాలతోపాటు, అడవుల నరికివేత, అస్తవ్యస్త ఇంజినీరింగ్‌ విధానాల వంటి మానవ తప్పిదాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ ప్రమాదాలను నిరోధించడానికి, నష్టతీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వాలు నిరంతరం కృషిచేస్తుంటాయి. భవిష్యత్తు ఉద్యోగులుగా అభ్యర్థులు ఈ విపత్తు నిర్వహణ విధానాల గురించి అవగాహన పెంచుకోవాలి. 


ఎత్తయిన పర్వతాలు, కొండలు, వాలు ప్రాంతాల నుంచి రాళ్లు, మట్టి, బురద జారిపడటం, నెమ్మదిగా పడటం లేదా కిందికి దొర్లుతూ వచ్చే ప్రక్రియను భూపాతం లేదా కొండచరియలు విరిగిపడటం అంటారు. ఇలా అన్నిరకాల బృహత్‌ చలనాలను భూసంపాతం (Land Slides)అంటారు.

భూపాతాలు ఎక్కువగా పర్వత ప్రాంతాల్లోనే సంభవిస్తాయి. గనుల తవ్వకాలు, భూకంపాలు, వరదలు, అగ్నిపర్వతాల విస్ఫోటాల సమయంలోనూ భూపాతాలు జరగవచ్చు. భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా కొండల ప్రాంతాల్లో భూపాతాలు ఏర్పడవచ్చు. ఇలాంటప్పుడు నదీ ప్రవాహాలను కొండచరియలు అడ్డుకోవడంతో వరదలు వస్తుంటాయి.

ప్రకృతి సంబంధ కారణాలు:

* కొండ ప్రాంతాలు ఎక్కువ వాలు కలిగి ఉండటం.

* వాలు ప్రాంతాలు గట్టిగా ఉండి చిన్న కదలికలకు కూడా విరిగిపడటం.

* తీవ్రమైన వర్షపాతం.

* రాతి ప్రదేశాలు బాగా క్రమక్షయానికి గురికావడం.

* భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, వరదలు.

* నీటిపారుదల వ్యవస్థ సరైన దిశలో లేకపోవడం.

మానవ సంబంధ కారణాలు:

* చెట్లను విచక్షణారహితంగా కొట్టివేయడంతో జరిగే మృత్తికా క్రమక్షయం.

* సరైన ప్రణాళికలు లేకుండా వాలు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించడం.

* సరైన ఇంజినీరింగ్‌ విధానాలు లేకుండా తవ్వకాలు జరపడం.

* ఇష్టానుసారంగా గనుల తవ్వకం.

* సమర్థ భూవినియోగ ప్రణాళికలు కొరవడటం.

భూపాతం రకాలు

1. ప్రపాతం (Falls): ఎత్తయిన వాలు లేదా శిఖరాల నుంచి వేరుపడిన శిలలు ఎగురుతూ, దొర్లుతూ రావడం వంటి అనూహ్య చలనాలను ప్రపాతం అంటారు.

2. శిథిల ప్రవాహం (Derbis flow): వదులైన మట్టి, రాళ్లు, సేంద్రియ పదార్థం లాంటివి గాలి, నీటితో కలిసి ముద్దగా ఏర్పడి వేగంగా దిగువకు ప్రవహించడం.

3. లహర్‌ ప్రవాహం (Lahar flow): అగ్నిపర్వతాల విస్ఫోటం వల్ల జ్వాలాబిల సరస్సులు విచ్ఛిన్నమై ఏర్పడిన బురద ప్రవాహం లేదా మంచు కరగడం వల్ల ఏర్పడిన శిథిల పదార్థం కిందికి ప్రవహించడం.

4. సర్పణం లేదా పాకడం (Creep): మట్టి లేదా శిలలు నెమ్మదిగా, నిటారుగా కిందికి జారడం. ఇవి రిటైనింగ్‌ గోడలు, కంచెలు, స్తంభాలను కిందికి నెట్టుకు వస్తాయి.

5. పంక ప్రవాహం (Mud flow): 50% ఇసుక, బురద మట్టి కలిగిన తడిపదార్థం వేగంగా ప్రవహించడాన్ని పంక ప్రవాహం అంటారు.

6. కూలిపోవడం (Topple): ఒక రాతి ఖండం ముందుకు వంగుతూ అమాంతంగా పడిపోవడాన్ని కూలిపోవడం అంటారు.

ప్రపంచ భూపాతాల దుర్బలత్వం: ప్రపంచంలో మొత్తం విపత్తుల్లో 4% భూపాతాల బెడద ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య అన్ని ఖండాల్లోనూ ఏదో ఒక ప్రాంతంలో సంభవిస్తూ ఉంటుంది.

భారత్‌లో స్థితిగతులు:

* దేశంలో మొత్తం విపత్తుల్లో భూపాతాల దుర్బలత్వం 11%గా ఉంది.

* దేశంలో అధికశాతం భూపాతాలు కొండచరియలు విరిగిపడటం వల్లే జరుగుతున్నాయి.

* దాదాపు 0.49 మిలియన్‌ చ.కి.మీ.ల్లో భూపాతాలు సంభవిస్తున్నాయి. ఈ విస్తీర్ణం దేశ భూభాగంలో 0.15%.

* అత్యధికంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ఆ తర్వాత పశ్చిమ కనుమలు, వింధ్య పర్వతాల్లో భూసంపాతాలు జరుగుతున్నాయి.

* ప్రపంచంలో మొత్తం భూపాతాల్లో 30% హిమాలయాల్లోనే నమోదవుతున్నాయి.

* నీలగిరి లోయను శిథిల సంపాత లోయ అంటారు. 1978లో అసాధారణ వర్షాలతో ఇక్కడ వంద సార్లు భూపాతాలు వచ్చాయి.

* దేశంలో దాదాపు 20 రాష్ట్రాల్లో భూపాతాల ప్రభావం ఉంది. సిక్కిం, ఉత్తరాఖండ్‌ అధిక ప్రభావిత రాష్ట్రాలు.

* శాస్త్రీయ అంచనాల ప్రకారం సిక్కిం, ఉత్తరాఖండ్‌లలో ప్రతి చ.కి.మీ.కు రెండు భూపాతాలు జరుగుతున్నాయి.

* ద్వీపకల్ప భారతదేశంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని కొండ ప్రాంతాల్లో భూపాతం కారణంగా తక్కువ నుంచి ఒక మోస్తరు ప్రమాద అవకాశాలు ఉన్నాయి.

* భారతదేశంలో భూపాతం/ కొండచరియలు విరిగిపడే విపత్తులకు సంబంధించి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) 2004 నుంచి నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఇది భూపాతపు ప్రాంతాలను పటచిత్రీకరణ చేయడం, అధ్యయనాలు నిర్వహించడం, నివారణ చర్యలు, జాగ్రత్తల గురించి సలహాలు, హెచ్చరికలు జారీ చేస్తుంది.

ఉపశమన వ్యూహాలు:

* వాలు ప్రాంతాల్లో నీటిపారుదల సరైన మార్గంలో ప్రవహించే విధంగా వరద కాలువలను ఏర్పాటు చేయాలి.

* శిలాశకలాలు కిందికి జారే ప్రాంతాల్లో వాటిని అడ్డుకోవడానికి రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మించాలి.

* భూపాతాలను ఆపడానికి వృక్ష సంపదను పెంచాలి. చెట్లు నేలకోతను ఆపి భూపాతాన్ని నిరోధిస్తాయి.

* భూపాత దుర్బలత్వ ప్రాంతాలను గుర్తించి, సరైన విపత్తు నివారణ వ్యూహాన్ని (హజార్డ్‌ మ్యాపింగ్‌) ముందుగా తయారు చేసుకోవాలి.

* ప్రజలకు అవగాహన కల్పించడం, వర్షాల సమయంలో ముందుగానే సమాచారం అందించడం లాంటివి చేయాలి.

మాదిరి ప్రశ్నలు


1. భారతదేశంలో భూపాతాలు ఎక్కువగా జరిగే చోటు

1) హిమాలయాలు       2) ఆరావళి పర్వతాలు      3) నీలగిరి కొండలు       4) తూర్పు కనుమలు

జ: హిమాలయాలు

2. భూపాత దుర్బలత్వంపై సత్వర హెచ్చరికలు జారీ చేసే సంస్థ ఏది?

1) భారత వాతావరణ శాఖ             2) బోర్డర్‌ మేనేజ్‌మెంట్‌ శాఖ

3) జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా               4) రహదారుల శాఖ

జ: జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా

3. భారతదేశ మొత్తం విపత్తుల్లో కొండచరియలు విరిగి పడే విపత్తు భాగం ఎంత?

1) 0.15 శాతం      2) 11 శాతం      3) 30 శాతం      4) 20 శాతం

జ: 11 శాతం

4. ప్రపంచ మొత్తం విపత్తు నష్టాల్లో భూపాత నష్టం ఎంత?

1) 4 శాతం      2) 10 శాతం      3) 20 శాతం      4) 11 శాతం

జ: 4 శాతం

5. మట్టి, రాళ్లు, సేంద్రియ పదార్థం కలిసి ముద్దలుగా వేగంగా దిగువకు ప్రవహించడం ఏ రకమైన భూపాతం?

1) శీఘ్రపాతం      2) శిథిల ప్రవాహం      3) కూలిపోవడం              4) పాకడం

జ: శిథిల ప్రవాహం

6. శిథిల సంపాత లోయ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?

1) హిమాలయాలు      2) పశ్చిమ కనుమలు      3) వింధ్య పర్వతాలు      4) నీలగిరి కొండలు

జ: నీలగిరి కొండలు​​​​​​​

7. మన దేశంలో భూపాతాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాలు

1) సిక్కిం, ఉత్తరాఖండ్‌         2) మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌

3) అస్సాం, పశ్చిమ బెంగాల్‌       4) తమిళనాడు, కేరళ

జ: సిక్కిం, ఉత్తరాఖండ్‌​​​​​​​

8. శిలాశకలాలు దొర్లడం, ఎగిరిపడటం వంటి భూపాతాన్ని ఏమంటారు?

1) శిథిల సంపాతం      2) శిథిల ప్రవాహం       3) ప్రపాతం       4) లహర్‌

జ: ప్రపాతం​​​​​​​

9. కిందివాటిలో భూపాతాలకు కారణాలేవి?

ఎ) కొండవాలు ఎక్కువగా ఉండటం          బి) కొండల క్రమక్షయం జరగడం

సి) కొండలు వృక్షాలతో కప్పి ఉండటం        డి) కొండలపై వృక్షాలు లేకపోవడం

1) ఎ, బి, సి, డి           2) బి, సి        3) ఎ, బి, డి        4) బి, సి, డి

జ: ఎ, బి, డి​​​​​​​

10. మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో భూపాతాలు జరిగే అవకాశం ఉంది?

1) 20        2) 10       3) 4          4) అన్ని రాష్ట్రాలు 

జ: 20

 రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌