• facebook
  • whatsapp
  • telegram

లోక్‌పాల్, లోకాయుక్త

పౌరుల ఫిర్యాదులను పరిష్కరించి అవినీతిని ఎంతమేరకు అరికట్టారనేదానిపై ప్రజాస్వామ్య వ్యవస్థల విజయం; సామాజిక, ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వివిధ దేశాల్లో అత్యున్నత స్థాయిల్లో జరిగే అవినీతిని నిర్మూలించేందుకు సంస్థాగతమైన ఏర్పాట్లుచేశారు.
అవి: 1) అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ
       2) పాలనా న్యాయస్థానాల వ్యవస్థ
       3) ప్రొక్యురేటర్‌ సిస్టం
* ప్రభుత్వంలో ఉన్నతస్థాయి పదవుల్లోని వ్యక్తులపై ఉన్న అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, అక్రమాలపై విచారించే స్వతంత్ర న్యాయాధికార వ్యవస్థను ‘అంబుడ్స్‌మన్‌’ పేరుతో తొలిసారిగా స్వీడన్‌ (1809)లో ఏర్పాటు చేశారు. అంబుడ్స్‌మన్‌ అంటే ప్రజల న్యాయవాది అని అర్థం.
* స్వీడిష్‌ అంబుడ్స్‌మన్‌ను పార్లమెంటు నాలుగేళ్ల కాలపరిమితితో నియమిస్తుంది. ఈయన పార్లమెంట్, పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకు అతీతుడు. ఇది స్వయం ప్రతిపత్తి గల రాజ్యపరమైన వ్యవస్థ.
* 1919లో ఫిన్లాండ్, 1955లో డెన్మార్క్, 1962లో నార్వే దేశాలు అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న మొదటి కామన్వెల్త్‌ దేశం న్యూజిలాండ్‌. అక్కడ 1962లో ‘పార్లమెంటరీ కమిషనర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేషన్‌’ పేరుతో, బ్రిటన్‌లో 1967లో ‘పార్లమెంటరీ కమిషనర్‌ ఫర్‌ అడ్మినిస్ట్రేషన్‌’ పేరుతో అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
* సోషలిస్టు దేశాలైన సోవియట్‌ రష్యా, చైనా, పోలెండ్, హంగేరి, చెకోస్లోవేకియా, రుమేనియాలు ‘ప్రొక్యురేటర్‌ వ్యవస్థ’ పేరుతో అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి.


భారతదేశంలో...

* భారతదేశంలో అత్యున్నతస్థాయి వ్యక్తుల అవినీతి చర్యలను విచారించేందుకు ‘లోక్‌పాల్‌’ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 1959లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి సి.డి. దేశ్‌ముఖ్‌ ప్రతిపాదించారు.
* పార్లమెంటు సభ్యుడైన లక్ష్మీమాల్‌ సింఘ్వీ 1963లో ‘లోక్‌పాల్‌’ అనే పదానికి రూపకల్పన చేశారు.
* 1966లో మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలో ఏర్పడిన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం లోక్‌పాల్, లోకాయుక్త వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.
* ‘లోక్‌’ అంటే ప్రజలు, ‘పాల్‌’ అంటే సంరక్షకుడు అని అర్థం.


లోక్‌పాల్, లోకాయుక్త లక్షణాలు


* వీటి నియామకాలు రాజకీయాలకు అతీతంగా జరగాలి.
* ఇవి స్వతంత్రత, నిష్పాక్షికతను ప్రదర్శించాలి.
* వీటి హోదా దేశంలోని అత్యున్నత న్యాయాధికారులతో సమానంగా ఉండాలి.
* వీటి నుంచి అధికార పక్షం వారు ఎలాంటి ప్రయోజనాలను ఆశించకూడదు.
* తమ విధులకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు వీరికి పూర్తి అధికారం ఉండాలి.


లోక్‌పాల్‌ బిల్లు - పార్లమెంటు


* 1968లో ఇందిరా గాంధీ ప్రభుత్వం మొదటిసారిగా లోక్‌పాల్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించి రాజ్యసభలో పరిశీలనలో ఉండగా లోక్‌సభ రద్దయింది. దీంతో బిల్లు కూడా రద్దయింది. ఈ బిల్లు పార్లమెంటులో 8 సార్లు విఫలమైంది.
* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2013లో లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంలో విశేష కృషి చేసింది. ఈ బిల్లుకు 2014 జనవరి 1న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం తెలపడంతో 2014 జనవరి 16 నుంచి లోక్‌పాల్, లోకాయుక్త చట్టంగా అమల్లోకి వచ్చాయి.
* జాతీయ స్థాయిలో జరిగే అవినీతి, అక్రమాలను విచారించేందుకు స్వయంప్రతిపత్తితో చట్టబద్ధత కలిగిన వ్యవస్థను ‘లోక్‌పాల్‌’గా, రాష్ట్ర స్థాయిలో ‘లోకాయుక్త’గా పేర్కొన్నారు.


లోక్‌పాల్‌ నిర్మాణం


* లోక్‌పాల్‌లో ఒక ఛైర్మన్, ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వీరిలో సగం మంది జ్యుడీషియల్‌ పరిజ్ఞానం గల సభ్యులు; మిగిలిన సగం మంది పరిపాలన, అవినీతి నిర్మూలన, వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉంటారు. మొత్తం సభ్యుల్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గానికి చెందినవారై ఉండాలి.

నియామకం

* లోక్‌పాల్‌ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి స్వయంగా నియమిస్తారు. ప్రధానమంత్రి నాయకత్వంలో గల ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు ఈ నియామకాన్ని రాష్ట్రపతి చేపడతారు. ఈ కమిటీలో లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన సిఫారసు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక నిష్ణాతుడైన వ్యక్తి సభ్యులుగా ఉంటారు.

ఛైర్మన్, సభ్యుల అర్హతలు

* లోక్‌పాల్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యేవారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి లేదా నిష్ణాతుడై ఉండాలి.
* లోక్‌పాల్‌లో జ్యుడీషియల్‌ సభ్యులుగా నియమితులయ్యేవారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.
* నాన్‌ - జ్యుడీషియల్‌ సభ్యులుగా నియమితులయ్యే వారికి పరిపాలన, అవినీతి నిర్మూలన లాంటి అంశాల్లో సుదీర్ఘ అనుభవం ఉండాలి.

పదవీకాలం - జీతభత్యాలు

* లోక్‌పాల్‌ ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 70 ఏళ్ల వయసు వరకు. వీరు పదవీ విరమణ అనంతరం 5 సంవత్సరాల వరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంటు, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయరాదు.
* ఛైర్మన్, సభ్యులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. అక్రమ ప్రవర్తన కారణంగా సుప్రీంకోర్టు సిఫారసుల మేరకు వీరిని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
* లోక్‌పాల్‌ ఛైర్మన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, సభ్యులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.
* ఏడేళ్ల కాలపరిమితి దాటిన ఫిర్యాదులను లోక్‌పాల్‌ విచారణకు స్వీకరించదు. సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు దీనికి వర్తిస్తాయి.

అధికారాలు - విధులు

* లోక్‌పాల్‌కు స్వతంత్రంగా ఒక విచారణ, ప్రాసిక్యూషన్‌ విభాగం ఉంటుంది. ప్రధానమంత్రి సహా ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఇది విచారిస్తుంది.
* కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (CVC) విచారించిన అంశాలను, తీసుకున్న చర్యలను లోక్‌పాల్‌కు తెలియజేయాలి.
* సీబీఐతో పాటు దేశంలోని అన్ని విచారణ సంస్థలు లోక్‌పాల్‌ పరిపాలనా నియంత్రణలోకి వస్తాయి.
* జాతీయ భద్రత, ప్రజా భద్రత అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలు దీని పరిధిలోకి రావు.
* అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను స్వాధీనపరచుకోవడానికి, వారిని సస్పెండ్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఎవరినైనా విచారించడానికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. వివిధ ఫిర్యాదులపై ఆరు నెలల్లోగా విచారణ ముగించాలి.
* అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార వ్యవస్థలకు సిఫారసు చేస్తుంది. విదేశాల నుంచి డొనేషన్లు తీసుకునే స్వచ్ఛంద సంస్థలు కూడా లోక్‌పాల్‌ పరిధిలోకి వస్తాయి.
* కేసుల విచారణకు ఎలాంటి డాక్యుమెంట్లు, అఫిడవిట్లనైనా పరిశీలించే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది. ఫిర్యాదులపై దర్యాప్తును 60 రోజుల్లో, విచారణను 6 నెలల్లో ముగించాలి. విచారణను దర్యాప్తు నుంచి మినహాయించాలి. న్యాయవ్యవస్థపై విచారణ చేసే అధికారం లోక్‌పాల్‌కు లేదు.
* ప్రధానమంత్రిపై అవినీతి ఆరోపణలకు సంబంధించి లోక్‌పాల్‌ విచారణను మెజారిటీ సభ్యుల అనుమతితో జరపాలి. ఛైర్మన్‌ సహా మొత్తం సభ్యుల్లో 3/4వ వంతు మంది సభ్యులు విచారణ జరిపేందుకు ఆమోదించాలి.
* అన్నాహజారే నేతృత్వంలోని పౌరసమాజం ‘జన్‌ లోక్‌పాల్‌’ సాధన కోసం విశేష కృషి చేసినప్పటికీ అది పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోయింది.
* లోక్‌పాల్‌ 2014 జనవరిలో చట్టంగా మారినప్పటికీ, ఇప్పటివరకు దాని నిర్మాణం జరగలేదు.


లోకాయుక్త

* రాష్ట్ర స్థాయిలోని అత్యున్నత వ్యక్తుల అవినీతి, అక్రమాలను విచారించే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థను ‘లోకాయుక్త’ అంటారు. మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల్లో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటుచేశారు.
* మనదేశంలో మొదటిసారిగా ఒడిశా 1970లో లోకాయుక్త చట్టాన్ని రూపొందించింది. కానీ అది 1983 నుంచి అమల్లోకి వచ్చింది.
* మహారాష్ట్ర 1971లో లోకాయుక్త చట్టాన్ని రూపొందించి అమలు చేసింది. ఈ చట్టాన్ని అమలుచేసిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర.
* ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త చట్టం 1983 సెప్టెంబరు 23 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం మనదేశంలో 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన న్యూదిల్లీలో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటుచేశారు.

లోకాయుక్తను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు
 

లోకాయుక్తను ఏర్పాటుచేయని రాష్ట్రాలు

1) అరుణాచల్‌ప్రదేశ్‌
2) జమ్ముకశ్మీర్‌
3) మణిపూర్‌
4) మేఘాలయ
5) మిజోరం
6) నాగాలాండ్‌
7) సిక్కిం
8) తమిళనాడు
9) త్రిపుర
10) పశ్చిమ్‌బంగ

లోకాయుక్త నియామకం - పదవీకాలం

* హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తిని ‘లోకాయుక్త’గా నియమిస్తారు. ముఖ్యమంత్రి నాయకత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్‌ లోకాయుక్తను నియమించి ప్రమాణస్వీకారం చేయిస్తారు.
* హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంపిన 5 మంది జిల్లా న్యాయమూర్తుల్లో ఒకరిని ‘ఉప లోకాయుక్త’గా గవర్నర్‌ నియమిస్తారు.
* లోకాయుక్త పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు. పదవీకాలం అనంతరం తిరిగి ఈ పదవులు పొందడానికి వీరు అనర్హులు.
* లోకాయుక్త పాలనాధిపతి ‘రిజిస్ట్రార్‌’. ప్రత్యేక ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు హోదాలో విచారణ సంచాలకుడు ఉంటాడు. ఇతడికి సహాయకులుగా నలుగురు ఉపసంచాలకులు, ముగ్గురు విచారణాధికారులు ఉంటారు.
* లోకాయుక్తకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, ఉప లోకాయుక్తకు హైకోర్టు ఇతర న్యాయమూర్తులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.
* లోకాయుక్త, ఉప లోకాయుక్తలు తమ రాజీనామాను గవర్నర్‌కు సమర్పించాలి.


ఏపీ, తెలంగాణలో లోకాయుక్త విచారణ పరిధిలోకి వచ్చే అంశాలు

* ప్రభుత్వ అధికార దుర్వినియోగం.
* ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కార్యకలాపాలు.
* బాధితులు ఎవరైనా తమ అభియోగాలను లోకాయుక్త దృష్టికి తీసుకురావచ్చు.
* లోకాయుక్తకు సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు, విధులు ఉంటాయి.
* ఆరు సంవత్సరాల్లోపు జరిగిన సంఘటనలను మాత్రమే ఫిర్యాదులుగా స్వీకరిస్తుంది. లోకాయుక్త ఫిర్యాదులను విచారించి, నివేదికను తయారుచేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని అతడు పనిచేసే శాఖాధికారికి సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసులపై సంబంధిత అధికారి మూడు నెలల్లోగా చర్యలు తీసుకుని ఆ సమాచారాన్నిలోకాయుక్తకు తెలియజేయాలి.

* లోకాయుక్త వివిధ ఫిర్యాదుల ప్రాథమిక విచారణను రహస్యంగా చేయాలి. లోకాయుక్త సిఫారసులు కేవలం సలహా పూర్వకమైనవి. వీటిని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.


నిర్మాణాత్మక వ్యత్యాసాలు

* లోకాయుక్త వ్యవస్థల నిర్మాణం అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా లేదు.
* రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో లోకాయుక్తతోపాటు, ఉప లోకాయుక్త వ్యవస్థను కూడా ఏర్పాటుచేశారు.
* ఒడిశా, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఇప్పటికీ లోకాయుక్తను ‘లోక్‌పాల్‌’గా పిలుస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో లోకాయుక్తను ‘లోక్‌ ఆయోగ్‌’గా పిలుస్తున్నారు.
* ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఉత్తర్‌ ప్రదేశ్, అసోం రాష్ట్రాలు తమ శాసనసభ్యులను లోకాయుక్త పరిధిలోకి తీసుకువచ్చాయి.
* మహారాష్ట్రలో మాజీ మంత్రులు, సివిల్‌ సర్వెంట్స్‌ను లోకాయుక్త పరిధిలోకి తీసుకువచ్చారు.
* లోకాయుక్త తన కేసులకు సంబంధించిన విచారణలో రాష్ట్ర దర్యాప్తు సంస్థల సహకారాన్ని తీసుకుంటుంది.


సుప్రీంకోర్టు తీర్పు:

* లోకాయుక్త నియామకంలో రాష్ట్ర మంత్రి మండలి సలహాలను గవర్నర్‌ తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గుజరాత్‌ లోకాయుక్తగా జస్టిస్‌ ఏఆర్‌ మెహతాను అప్పటి గవర్నర్‌ కమలా బేణీవాల్‌ నియమించిన వివాదంలో ఈ తీర్పును వెలువరించింది.
 

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌