• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రాలో జాతీయోద్యమం

ఆంధ్రాలో జాతీయోద్యమం 

1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపనతో దేశంలో జాతీయోద్యమం ఉద్ధృతమైంది. ఇదే సమయంలో మితవాద, అతివాద, గాంధీ యుగాల ఉద్యమాల ప్రభావంతో ఆంధ్రదేశంలో స్వాతంత్య్రోద్యమాలు జరిగాయి. స్వాతంత్య్రానంతరం ఆంధ్రరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. ఈ పరిణామ క్రమంపై అభ్యర్థులు పరీక్షల కోణంలో దృష్టిసారించాలి.


మితవాద యుగం 

1852లో గాజుల లక్ష్మీనరసు శెట్టి మద్రాస్‌ నేటివ్‌ అసోషియేషన్‌ను స్థాపించారు. మద్రాసు రాజా రామ్మోహన్‌ రాయ్‌గా పేరొందిన ఈయన తన క్రిసెంట్‌ పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు. 1884లో పి.రంగయ్య నాయుడు అధ్యక్షతన మద్రాస్‌ మహా జనసభ ఏర్పడింది. 1885లో పార్థసారథి నాయుడు ఆంధ్ర ప్రకాశిక అనే ప్రథమ రాజకీయ వారపత్రికను ప్రారంభించాడు. 1891లో జరిగిన నాగ్‌పుర్‌ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి పి.ఆనందాచార్యులు. భారత జాతీయ కాంగ్రెస్‌కు కార్యదర్శిగా పనిచేసిన తెలుగు వ్యక్తి న్యాపతి సుబ్బారావు. 1902లో కొండా వెంకటప్పయ్య కృష్ణా పత్రికను ప్రారంభించారు. దానికి సంపాదకుడిగా ముట్నూరి కృష్ణారావు వ్యవహరించారు. 


అతివాద యుగం

 వందేమాతర ఉద్యమ కాలంలో ఆంధ్రదేశంలో అనేక ముఖ్య సంఘటనలు జరిగాయి. 1905 అక్టోబరు 16న బెంగాల్‌ విభజన అమల్లోకి రావడంతో వందేమాతర ఉద్యమం ప్రారంభమైంది. కానీ అంతకుముందే 1905 సెప్టెంబరులో మద్రాసు బీచ్‌ సమావేశం జరిగింది. దీనికి జి.సుబ్రహ్మణ్య అయ్యర్‌ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి గీతాలు ఆలపించారు. ఈ ఉద్యమ కాలంలోనే రాజమండ్రిలో బాలభారతి సమితి ఏర్పడింది. బిపిన్‌ చంద్రపాల్‌ 1907లో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి వందేమాతర ఉద్యమాన్ని ప్రచారం చేశారు. రాజమండ్రి సమావేశంలో పాల్‌ ఉపన్యాసాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహం తెలుగులోకి అనువదించారు. ఈ సమావేశంలోనే చిలకమర్తి ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ అనే ప్రసిద్ధ గీతాన్ని ఆలపించారు. వందేమాతర ఉద్యమ కాలంలోనే ఆంధ్రదేశంలో రాజమండ్రి కళాశాల సంఘటన (1907 ఏప్రిల్‌ 24న), కాకినాడ కొట్లాట కేసు  (1907 మే 31), కోటప్పకొండ సంఘటన (1909 ఫిబ్రవరి 18), తెనాలి బాంబు కేసు (1909 ఏప్రిల్‌ 6)లు జరిగాయి. 

రాజమండ్రి కళాశాల సంఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఎమ్‌.రామచంద్రరావులను ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించారు. రాజమండ్రి కళాశాల సంఘటన కాలంలో మార్క్‌ హంటర్‌ ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. కోటప్పకొండ సంఘటనలో చిన్నపరెడ్డిని ఉరితీశారు. కాకినాడ కొట్లాట కేసులో నిందితుల తరఫున న్యాయవాది న్యాపతి సుబ్బారావు, తెనాలి బాంబు కేసులో టంగుటూరి ప్రకాశం పంతులు వాదించారు. వందేమాతర ఉద్యమ కాలంలో తొలి రాజకీయ ఖైదీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఈ ఉద్యమ కాలంలోనే బిపిన్‌ చంద్రపాల్‌ బందరు జాతీయ కళాశాలను ప్రారంభించారు. దీనికి తొలి ప్రిన్సిపాల్‌ కోపెల్ల హనుమంత రావు. ఆదిపూడి సోమనాథరావు జపాన్‌ చరిత్ర, శ్రీ బ్రహ్మం జపనీయం గ్రంథాలను; అత్తిలి సూర్యనారాయణ హిందూ దేశ దారిద్య్రం అనే గ్రంథాన్ని రాశారు.

1916 - 17 మధ్య అతివాదులు హోంరూల్‌ ఉద్యమాన్ని నడిపారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు నాయకత్వంలో ఆంధ్రదేశంలో హోంరూల్‌ ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమాన్ని ఆంధ్రదేశంలో ప్రచారం చేయడానికి అనిబిసెంట్‌ వచ్చారు. ఈ సమయంలోనే చిత్తూరు జిల్లా మదనపల్లెలో జాతీయ కళాశాలను స్థాపించి, హెచ్‌.జె.కజిన్స్‌ను తొలి ప్రిన్సిపాల్‌గా నియమించారు. అనిబిసెంట్‌ ‘కామన్‌ వీల్, న్యూ ఇండియా’ లాంటి పత్రికలను స్థాపించి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. 1918లో ప్రత్యేక ఆంధ్ర సర్కిల్‌ ఏర్పడింది. దీనికి న్యాపతి సుబ్బారావు అధ్యక్షుడిగా, కొండా వెంకటప్పయ్య కార్యదర్శిగా వ్యవహరించారు.


గాంధీ యుగం

1921 - 22 మధ్య జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ఆంధ్రదేశంలో చీరాల - పేరాల ఉద్యమం, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం, పుల్లరి సత్యాగ్రహాలు జరిగాయి. 1921 మార్చి 31, ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో విజయవాడలో ప్రత్యేక కాంగ్రెస్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు. ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాల కృష్ణయ్య నాయకత్వంలో చీరాల - పేరాల ఉద్యమం జరిగింది. ఈ సమయంలోనే ఆయన రామదండు అనే వాలంటీర్‌ దళాన్ని ఏర్పాటు చేశారు. 1921 ఏప్రిల్‌ 6న గాంధీజీ చీరాలను సందర్శించారు. పల్నాడులో పుల్లరి సత్యాగ్రహాన్ని చేసిన కన్నెగంటి హనుమంతును ఆంగ్లేయులు 1921 సెప్టెంబరు 23న మించాలపాడు వద్ద కాల్చి చంపారు. అటవీ ఉత్పత్తులను వాడుకోవడానికి ఆంగ్లేయులు విధించే పన్ను ‘పుల్లరి’. పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వంలో పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమ కాలంలోనే వీరయ్య చౌదరి శాంతిసేన అనే వాలంటీర్‌ దళాన్ని ఏర్పాటు చేశారు. దీని గురించి నాటి ఇంగ్లండ్‌ పార్లమెంటులో కూడా చర్చించారు.  


రంపా విప్లవం - అల్లూరి సీతారామరాజు

అటవీ పుత్రులపై ఆంగ్లేయుల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా 1921 - 22 మధ్య అల్లూరి సీతారామరాజు రంపా విప్లవాన్ని నిర్వహించాడు. సీతారామరాజు స్వగ్రామం మోగల్లు (పశ్చిమ గోదావరి) కానీ ఆయన పాండ్రంకి గ్రామం (విశాఖపట్టణం)లో జన్మించారు. గాంగంటందొర, గాంమల్లుదొర, ఎండుపడాలు, అగ్గిరాజు లాంటి అనుచరులతో అల్లూరి ఈ  విప్లవాన్ని నడిపించాడు. అగ్గిరాజు అసలు పేరు సూర్య నారాయణ రాజు (సత్యనారాయణరాజు). అల్లూరి సీతారామరాజు 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై తొలిసారిగా దాడి చేశాడు. 1923 ఏప్రిల్‌లో చివరి దాడి అన్నవరం పోలీస్‌ స్టేషన్‌పై జరిగింది. సీతారామరాజును పట్టుకోవడానికి వచ్చిన అస్సాం రైఫిల్స్‌ దళానికి నాయకుడు రూథర్‌పర్డ్‌. 1922 మే 7న అల్లూరి సీతారామరాజును జమేదార్‌ కంచుమీనన్‌ బంధించగా, మేజర్‌ గూడాల్‌ కాల్చి చంపాడు. 1923లో ఏర్పడిన స్వరాజ్య పార్టీ ఆంధ్ర శాఖకు వి.వి.రామదాసు అధ్యక్షుడిగా, ఉన్నవ లక్ష్మీనారాయణ కార్యదర్శిగా పనిచేశారు.


సైమన్‌ కమిషన్‌

1928లో సైమన్‌ కమిషన్‌ ఆంధ్రదేశంలో పర్యటించింది. మద్రాసులో సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ఉద్యమానికి టంగుటూరి ప్రకాశం పంతులు నాయకత్వం వహించారు. రైల్వేస్టేషన్‌లో దిగిన సైమన్‌ కమిషన్‌కు ‘సైమన్‌ గో బ్యాక్‌’ అని రాసి ఉన్న కాగితాన్ని నాటి విజయవాడ మున్సిపల్‌ ఛైర్మన్‌ అయ్యదేవర కాళేశ్వర రావు పంపారు. ఈ ఉద్యమం కాలంలోనే టంగుటూరి ప్రకాశం పంతులును ‘ఆంధ్రకేసరి’గా గుర్తించారు. 1928 ఫిబ్రవరి 3న మద్రాసులో మహర్షి బులుసు సాంబమూర్తి అధ్యక్షతన సైమన్‌ కమిషన్‌ నిరసనసభ జరిగింది.   


ఉప్పు సత్యాగ్రహం

 1929 నాటి లాహోర్‌ కాంగ్రెస్‌ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు. 1930 - 34 మధ్య గాంధీ నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం జరిగింది. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 6 మధ్య దండియాత్ర సాగింది. 24 రోజుల పాటు 375 కి.మీ. మేర జరిగిన ఈ యాత్రలో మొత్తం 79 మంది పాల్గొన్నారు. దండియాత్రలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు యెర్నేని సుబ్రహ్మణ్యం. 1930 ఏప్రిల్‌ 6న తూర్పు గోదావరి జిల్లాలోని చొల్లంగిలో తొలి సత్యాగ్రహాన్ని దువ్వూరి సుబ్బమ్మ, బులుసు సాంబమూర్తి, తెన్నేటి విశ్వనాథం ప్రారంభించారు. ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహాలకు కొండా వెంకటప్పయ్య (ఈయన బిరుదు దేశభక్త) నాయకత్వం వహించారు. ఈ ఉద్యమ కాలంలోనే త్రిపురనేని రామస్వామి చౌదరి ‘వీర గంధం తెచ్చినారము వీరులెవ్వరో తెల్పుడి’,  బసవరాజు అప్పారావు ‘కొల్లాయి గట్టాతేనేమీ.. మా గాంధీ కోమటై పుట్టేతేనేమీ’ అనే పాటలను రాశారు. 1930 జనవరి 26న మచిలీపట్నంలో జాతీయ జెండాను ఎగురవేసిన తొలి వ్యక్తి తోట నర్సయ్య. ఈ ఉద్యమ కాలంలోనే కాకినాడ బాంబు కేసు నమోదైంది. 1934లో ఎన్‌జీ రంగా ఆంధ్రా సోషలిస్ట్‌ పార్టీని స్థాపించారు. దీనికి మద్దూరి అన్నపూర్ణయ్య కార్యదర్శిగా వ్యవహరించారు.


క్విట్‌ ఇండియా ఉద్యమం

గాంధీ 1942లో డూ ఆర్‌ డై నినాదంతో క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమ సమయంలోనే కర్నూలు సర్క్యులర్‌/ఆంధ్రా సర్క్యులర్‌ను రూపొందించారు. 1942 జులై 29న మచిలీపట్నంలో కళా వెంకటరావు (ఆంధ్రా కాంగ్రెస్‌ కార్యదర్శి) రూపొందించిన ఈ రహస్య సర్క్యులర్‌ కర్నూలు కార్యాలయంలో లభించడంతో దాన్ని కర్నూలు సర్క్యులర్‌గా పేర్కొన్నారు. 1942 ఆగస్టు 12న తెనాలి రైల్వేసేష్టన్‌ వద్ద జరిగిన ఈ ఉద్యమంలో పోలీసులు ఆరుగురు ఉద్యమకారులను కాల్చి చంపారు. వారి సమాధులు ప్రస్తుత తెనాలిలోని మారిస్‌పేటలో ఉన్నాయి. ఈ ఉద్యమ సమయంలోనే కరుణశ్రీ, జంధ్యాల పాపయ్య శాస్త్రి ‘లేచిపోయినవి పోలీసుల టోపీలు వందల వేల రాబందులట్లు, కాలిపోయినవి సర్కారు కచేరీలు ఖర దుషాణాదుల కాష్టమట్లు’ అని రాశారు. క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలోనే కనపర్తి ఉప్పు కొఠారుపై దాడి జరిగింది. ఎం.ఎన్‌.రాయ్‌ ‘రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీ’ని స్థాపించి, తెనాలిలో జరిగిన ఆంధ్ర శాఖ తొలి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ ఉద్యమ కాలంలో తెనాలి, చీరాల, బాపట్ల, గుంటూరు, భీమవరం, పాలకొల్లు, మచిలీపట్నం ప్రాంతాల్లో అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇలాంటి అనేక ఉద్యమాల ఫలితంగా ఆంగ్లేయులు 1947లో భారతదేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించారు.

Posted Date : 31-01-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు