• facebook
  • whatsapp
  • telegram

 జాతీయ మహిళా కమిషన్

మహిళలను వెనుకబాటుతనం నుంచి అభివృద్ధి బాటలోకి నడిపించి, వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, భారత రాజ్యాంగం మహిళలకు ప్రసాదించిన రాజ్యంగపరమైన రక్షణలను, చట్టబద్ధమైన రక్షణలను సమీక్షించి, మహిళా ప్రగతికి కృషి చేసేందుకు 1990లో 'జాతీయ మహిళా కమిషన్ చట్టాన్ని' రూపొందించారు.
 1990, ఆగస్టు 30న ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొంది, 1992, జనవరి 31 నుంచి 'జాతీయ మహిళా కమిషన్‌'గా ఏర్పడింది. ఇది చట్టబద్ధమైన సంస్థ.
‣ జాతీయ మహిళా కమిషన్‌లో ఒక అధ్యక్షురాలు, 5 మంది సభ్యులు, ఒక సభ్యకార్యదర్శి ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. పదవీ కాలం 3 సంవత్సరాలు. సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన వారిని ఒక్కొక్కరిని నియమించాలి.
మహిళా కమిషన్ ఛైర్మన్, సభ్యుల తొలగింపు విధానం
‣ మహిళా కమిషన్ ఛైర్మన్, సభ్యులను కేంద్రం సిఫారసుల మేరకు రాష్ట్రపతి కింది కారణాల వల్ల తొలగిస్తారు.
 మానసిక స్థితి సరిగా లేదని కోర్టు ధ్రువీకరించినప్పుడు
‣ దివాలా తీసినప్పుడు
 పదవిని దుర్వినియోగం చేసినప్పుడు
 నైతిక విలువలు కోల్పోయి శిక్షార్హమైన నేరాన్ని చేసినప్పుడు
 కమిషన్ అనుమతి లేకుండా వరుసగా 3 కమిషన్ సమావేశాలకు గైర్హాజరైనప్పుడు
 తమ విధులను నిర్వహించలేని స్థితిలో ఉన్న సమయంలో


కమిషన్ అధికారాలు- విధులు
 మహిళా కమిషన్ ఛైర్మన్ భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాను కలిగి ఉంటారు.
 మహిళల రక్షణ కోసం అమల్లో ఉన్న చట్టాలను సమీక్షించి, అవసరమైతే వాటికి సవరణలను సూచించడం.
 రాజ్యాంగపరంగా, చట్టపరంగా మహిళలకు కల్పించిన రక్షణల అమలును పర్యవేక్షించడం.
 అన్యాయానికి గురైన మహిళలకు చట్టపరంగా పరిహార మార్గాలను సూచించడం.
 'పరివారక్ మహిళా అదాలత్‌'ల ద్వారా కుటుంబానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడం.
 కేంద్ర, రాష్ట్ర స్థాయిలో మహిళాభివృద్ధి, ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడం.
 మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు, వివక్షలను నివారించేందుకు అవసరమైన అధ్యయనాలు జరపడం.
 జైలులోని మహిళా ఖైదీలను పరిశీలించి వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయడం.
 మహిళా సమస్యలు, అత్యాచార ఘటనలపై అధ్యయనం చేసి, నేరస్థులకు తగిన శిక్ష పడేలా కృషి చేయడం.
 వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వడం.
 మహిళలను మీడియా అసభ్యకరంగా, ఆటబొమ్మగా చిత్రీకరించి చూపించడాన్ని నివారించడం.
 సాక్షులను విచారించడానికి సమన్లు జారీ చేయడం.
 అఫిడవిట్లను సమర్పించమని సంబంధిత పోలీస్ స్టేషన్‌లను, కార్యాలయాలను ఆదేశించడం.
 మహిళలను ప్రభావితం చేసే అన్ని విధానపరమైన విషయాల్లో ప్రభుత్వానికి సిఫారసులు చేయడం.
 మహిళల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన రాజ్యాంగ రక్షణల అమలు, చట్టాల గురించి వార్షిక నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం.
 కింది అంశాలకు సంబంధించి తనకు తాను కేసులను సుమోటోగా స్వీకరించడం.
             1. మహిళల సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో
             2. మహిళల సమానత్వం, అభివృద్ధికి సంబంధించిన చట్టాలు అమలు కాని సందర్భంలో
             3. మహిళల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం 1998 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పడింది. దీనిలో ఒక ఛైర్‌ప‌ర్సన్ , ఆరుగురికి మించకుండా సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు.
మహిళా కమిషన్ విధులు
  మహిళలకు సంబంధించి విధానపరమైన మార్పులను సూచించడం.
  నిరుపేద, బడుగువర్గాల మహిళలకు న్యాయసేవలను అందించడం.
  మహిళా జైళ్లు, వసతి గృహాలను తనిఖీ చేయడం.
  మహిళల సమగ్ర ప్రగతి కోసం వివిధ పథకాల రూపకల్పనకు కృషి చేయడం.
 మహిళాభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించి తగిన సూచనలు చేయడం.
 మహిళలను చైతన్యపరిచేందుకు వివిధ మహిళా సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసి ప్రచారం చేయడం.
  మహిళా కమిషన్ తన అధికార విధుల నిర్వహణలో సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది.
 రాజ్యాంగ పరంగా మహిళలకు కల్పించిన ప్రత్యేక రక్షణలను అమలు చేసేందుకు కృషి చేయడం.
  మహిళా కమిషన్ తన వార్షిక నివేదికను గవర్నర్‌కు సమర్పిస్తుంది. గవర్నరు దాన్ని రాష్ట్ర శాసనసభకు అందజేస్తారు.
  మహిళా కమిషన్ ఛైర్‌ప‌ర్సన్‌కు రాష్ట్ర కేబినెట్ హోదా లభిస్తుంది.
  ఆంధ్రప్రదేశ్‌లో జోగినులు, మాతంగిలు, దేవదాసీలకు చెందిన పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని సూచించడానికి జస్టిస్ వి. రఘనాథరావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించారు.

జాతీయ మైనార్టీ కమిషన్
‣ అల్పసంఖ్యాక వర్గాల వారికి రక్షణలను కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా మొరార్జీదేశాయ్ ప్రధానిగా ఉన్న కాలంలో 1978, జనవరి 12న 'మైనార్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో దీని అధ్యక్షుడు ఎం.ఆర్. మినూమసాని.
‣ 1979లో జాతీయ మైనార్టీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించారు. అప్పటి ఛైర్మన్ అహ్మద్ అన్సారీ.
 1984లో దీన్ని హోం మంత్రిత్వ శాఖ నుంచి సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు.
‣ భారత పార్లమెంటు జాతీయ అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ చట్టాన్ని 1992, మే 17న ఆమోదించగా, ఇది 1993, మే 17 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది చట్టబద్ధమైన సంస్థ.
 దీనికి రాజ్యాంగ భద్రతను కల్పించేందుకు 2004లో 103వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ విఫలమైంది.
 జాతీయ మైనార్టీ చట్టాన్ని అనుసరించి ప్రధానంగా మైనార్టీలు రెండు రకాలు.
1. మతపరమైన మైనార్టీలు దేశాన్ని యూనిట్‌గా తీసుకుని నిర్ణయిస్తారు.
2. భాషాపరమైన మైనార్టీలు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నిర్ణయిస్తారు.
 కింది వారిని జాతీయ మైనార్టీ చట్టం మైనార్టీలుగా గుర్తించింది
ముస్లింలు, క్రైస్తవులు , సిక్కులు, బౌద్ధులు, పార్శీలు
  ఈ చట్టం జైనులకు మైనార్టీహోదాను కల్పించలేదు. రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ (2002) జైనులకు కూడా మైనార్టీ హోదాను కల్పించాలని సూచించింది.
బాల్‌పాటిల్  Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జైనులకు కూడా మైనార్టీ హోదాను కల్పించాలని పేర్కొంది.

 

నిర్మాణం - పదవీకాలం
 జాతీయ మైనార్టీ కమిషన్‌లో ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులు ఉంటారు. అధ్యక్షునితో సహా అందరినీ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరంతా అల్పసంఖ్యాక వర్గానికి చెందినవారై ఉండాలి.
 ఛైర్మన్ కేంద్ర కేబినెట్ మంత్రి హోదాను, వైస్‌ఛైర్మన్, సభ్యులు కేంద్ర సహాయమంత్రి హోదాను కలిగి ఉంటారు. వీరి వేతనం రూ.80,000.
 వీరి పదవీకాలం 3 సంవత్సరాలు. తమ రాజీనామాను కేంద్రానికి సమర్పించాలి.

 

అధికారాలు-విధులు
 రాజ్యాంగం అల్పసంఖ్యాక వర్గాల వారికి కల్పించిన రక్షణలను అమలుపరచడం.
  మైనార్టీలకు కల్పించిన హక్కులను, రక్షణలను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వస్తే వాటిని స్వీకరించి, సంబంధిత అధికారికి ఫిర్యాదు చేసి, న్యాయం జరిగేలా చూడడం.
 అల్పసంఖ్యాక వర్గాల వారి అభివృద్ధిని సమీక్షించడం.
 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మైనార్టీల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన సలహాలు ఇవ్వడం.
 మైనార్టీ వర్గాల బాలికల విద్యాభివృద్ధికి కృషి చేయడం.
 అల్పసంఖ్యాక వర్గాల పట్ల ఎవరైనా వివక్షత చూపితే, ఆ సంఘటనలను అధ్యయనం చేసి, మైనార్టీలకు రక్షణ కల్పించడం.
 అల్పసంఖ్యాక వర్గాల వారి సామాజిక, ఆర్థిక అంశాలమీద అధ్యయనం చేసి వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడం.
 మైనార్టీల సంక్షేమానికి నూతన విధానాలను సిఫారసు చేయడం.
 మైనార్టీ కమిషన్ 'సివిల్‌కోర్టు' అధికారాలను కలిగి ఉంటుంది.
 దేశంలో ఏ ప్రాంతంలో నివసించే వ్యక్తినైనా తన ముందు హాజరు కావాలని ఆదేశిస్తుంది.
 అధికారిక సమాచారాన్ని అందజేయమని సంబంధిత కార్యాలయాలను ఆదేశిస్తుంది. సాక్ష్యాలను, డాక్యుమెంట్లను సమర్పించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశిస్తుంది.
‣ మైనార్టీ కమిషన్ సమర్పించిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పిస్తుంది.

‣ మైనార్టీ హక్కుల కోసం ఐక్యరాజ్యసమితి 1992, డిసెంబరు 18న ఒక హక్కుల ప్రకటనను విడుదల చేసింది. జాతీయ మైనార్టీల హక్కుల దినోత్సవం డిసెంబరు 18.
 

మైనార్టీ కమిషన్ - సిఫారసులు
 మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రాష్ట్ర మైనార్టీ కమిషన్‌లను ఏర్పాటు చేయాలి.
‣ రాష్ట్ర సచివాలయంలో మైనార్టీల కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలి.
‣ వక్ఫ్ భూములు, రెవెన్యూ రికార్డుల వివరాలను పునఃసర్వే చేయించి, వాటిని భద్రపరచాలి.
‣ మైనార్టీల పర్వదినాల్లో ఎటువంటి పరీక్షలను నిర్వహించరాదు.
‣ మైనార్టీ వర్గాల వారికి మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలు, సమాధుల కోసం ప్రత్యేక స్థలాలను రాష్ట్రాలు కేటాయించాలి.


‣ జాతీయ మైనార్టీ కమిషన్ టోల్‌ఫ్రీ నెంబర్: 1800 110 088.
 మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం గురించి అధ్యయనం చేసేందుకు రాజేంద్రసచార్ కమిషన్‌ను నియమించింది.
 మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి 15 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది.
 2004లో పంచాయతీరాజ్ మైనార్టీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు.
 మొదటి మైనార్టీ శాఖామంత్రి అబ్దుల్ రహ్మాన్ అంతూలే.
 మన దేశంలో అత్యధికంగా 31% మైనార్టీలు అసోం రాష్ట్రంలో ఉన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కమిషన్
‣ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కమిషన్ 1987లో ఏర్పడింది.
‣ ఈ కమిషన్‌లో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు.
‣ వీరిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. పదవీకాలం 3 సంవత్సరాలు.
‣ 1975లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఉర్దూ అకాడమీ'ని స్థాపించారు.
‣ 1993లో 'మైనార్టీల సంక్షేమ విభాగం' ఏర్పడింది. 


మైనార్టీల సంక్షేమ విభాగం విధులు
‣ మైనార్టీల సామాజిక, ఆర్థిక ప్రగతి కోసం వివిధ పథకాలను ప్రారంభించడం.
‣ మైనార్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శక సూచనలు ఇవ్వడం.
‣ మైనార్టీ వర్గాల మహిళలు, పిల్లల ప్రగతి కోసం నూతన పథకాలను అమలు చేయడం.
‣ మైనార్టీ యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించడం.
‣ మైనార్టీ సంక్షేమ విభాగానికి మైనార్టీల మంత్రి అధిపతిగా వ్యవహరిస్తారు.
‣ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీల ఆర్థిక సంస్థ 1985లో ఏర్పాటైంది. పేదరికంలో ఉన్న మైనార్టీల ఆర్థికాభివృద్ధికి ఇది కృషి చేస్తుంది.
 ఆంధ్రప్రదేశ్‌లో 'దుకాన్-ఓ-మకాన్' పథకం కింద మైనార్టీలకు ఉపాధి కోసం సబ్సిడీ రుణాలను అందిస్తున్నారు.
 మౌలానా అబుల్‌కలాం అజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ఉంది.
 రోష్నీ పథకం ద్వారా మైనార్టీల పేదరికాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.


మానవ హక్కుల కమిషన్

 మానవ హక్కులంటే తమ పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి మానవ సమాజంలో ఒక సభ్యుడిగా అనుభవించే కనీస హక్కులు. ఇవి మానవ స్వభావంలో అంతర్లీనంగా ఉంటాయి. ఈ హక్కులు ఇతరులకు అన్యాక్రాంతం చేయలేనివి.
మానవ హక్కులకు మూలాలు
 బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టిన 'ఇంగ్లిష్ పిటిషన్స్ ఆఫ్ రైట్స్' (1627)
 హెబియస్ కార్పస్ చట్టం (1674)
 అమెరికా స్వాతంత్య్ర ప్రకటన (1776)
 అమెరికా బిల్ ఆఫ్ రైట్స్ (1791)
 ఫ్రెంచ్ డిక్లరేషన్స్ ఆఫ్ రైట్స్ మ్యాన్ అండ్ సిటిజన్ (1789)
 ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన (1948 డిసెంబరు 10)
‣ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిటీ 2013, నవంబరు 26న 'వ్యక్తిగత జీవన హక్కు' పరిరక్షణ కోసం గూఢాచార వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించింది. బ్రెజిల్, జర్మనీ దేశాల నాయకులపై అమెరికా నిఘా పెట్టిందన్న వార్తలపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో ఈ తీర్మానాన్ని ‣ ఆమోదించింది. దీనికి 55 దేశాలు మద్దతిచ్చాయి.
అంతర్జాతీయ కోవనెంట్లు
 కోవనెంట్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఘాలు కలిసి ఒక లక్ష్యం కోసం పరస్పరం ఆమోదించుకున్న అంగీకార ఒప్పందం.
 ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1966, డిసెంబరు 16న ఆమోదించిన 'పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ కోవనెంట్', 'సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ కోవనెంట్'.
 1976లో ఆమోదించిన 'ఆప్షనల్ ప్రోటోకాల్ టు ది సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ కోవనెంట్' అత్యంత కీలకమైంది.
 భారత ప్రభుత్వం ఈ కోవనెంట్‌లను 1979, ఏప్రిల్ 10 నుంచి అనుసరిస్తోంది.


భారత రాజ్యాంగం - మానవ హక్కులు
 భారత రాజ్యాంగ నిర్మాతలు సర్వమానవ సౌభ్రాతృత్వం, శ్రేయస్సు లక్ష్యంగా మానవ హక్కులకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు.
‣ మన రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు పేర్కొన్న ప్రాథమిక హక్కులు, 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు పేర్కొన్న ఆదేశిక సూత్రాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన వర్గాలకు ఆర్టికల్స్ 330, 332, 335, 338, 339, 340లలో పేర్కొన్న ప్రత్యేక రక్షణలు ‣ మానవహక్కులకు మూలంగా ఉన్నాయి.


జాతీయ మానవ హక్కుల కమిషన్
‣ 1993లో 'వియన్నా'లో జరిగిన ప్రపంచ మానవ హక్కుల సమావేశంలో ఆయా దేశాలు తమ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విధానాలతో సంబంధం లేకుండా మానవ హక్కులను, ప్రాథమిక హక్కులను పరిరక్షించి, కాపాడే బాధ్యత వహించాలని తీర్మానం చేశారు.
‣ ఈ తీర్మానానికి అనుగుణంగా భారత రాష్ట్రపతి 1993, సెప్టెంబరు 27న మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. దీని ప్రకారం 1993, అక్టోబరు 12న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైంది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ.
‣ మానవ హక్కుల కమిషన్‌ను మానవ హక్కుల రక్షణ చట్టం 1993 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనిలో ఒక ఛైర్మన్, నలుగురు
సభ్యులు ఉంటారు.
‣ నిర్మాణం - ఛైర్మన్, సభ్యులు
‣ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వ్యక్తిని మానవహక్కుల కమిషన్‌కు ఛైర్మన్‌గా రాష్ట్రపతి నియమిస్తారు.
‣ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పనిచేసిన వ్యక్తిని ఒక సభ్యునిగా
 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పనిచేసిన వ్యక్తిని మరొక సభ్యునిగా, మానవ హక్కుల రంగంలో అనుభవజ్ఞులైన ఇద్దరు సభ్యులను నియమిస్తారు.
 వీరందరినీ ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు.
 ఛైర్మన్, సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు లేదా ఆ వ్యక్తికి 70 ఏళ్లు వచ్చే వరకు.
 వీరిని సుప్రీంకోర్టు విచారణ అనంతరం యూపీఎస్సీ సభ్యులను తొలగించే పద్ధతిలోనే రాష్ట్రపతి తొలగిస్తారు.
ఎంపిక కమిటీ
 ప్రధానమంత్రి     -     ఛైర్మన్
 కేంద్ర హోంమంత్రి     -     సభ్యుడు
 లోక్‌సభ స్పీకర్     -     సభ్యుడు
 రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్     -     సభ్యుడు
 లోక్‌సభ ప్రతిపక్ష నేత     -     సభ్యుడు
 రాజ్యసభ ప్రతిపక్ష నేత     -     సభ్యుడు

 2010లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో చేసిన సవరణను అనుసరించి ఛైర్మన్‌గా నియమించేందుకు (NHRC) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అందుబాటులో లేనప్పుడు సుప్రీంకోర్టులో సాధారణ న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వ్యక్తినైనా నియమించవచ్చు.
 భారత్‌లో మానవహక్కులకు కాపలాదారుగా - National Human Rights Commission (NHRC) పనిచేస్తుంది.
‣ NHRCలో అధికార రీత్యా సభ్యులుగా ఉండేవారు (2006 నుంచి)
 జాతీయ మైనార్టీ కమిషన్ ఛైర్మన్ 
 జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్ ఛైర్మన్
 జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్ ఛైర్మన్ 
 జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌ప‌ర్సన్ 
 మానవహక్కుల సంఘం ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది. ఈ కమిషన్‌కు అప్పగించిన అధికార విధులను నిర్వర్తించడానికి ఒక సెక్రటరీ జనరల్ ఉంటారు. సెక్రటరీ జనరల్‌గా నియమితుడైన వ్యక్తి భారత ప్రభుత్వ కార్యదర్శి హోదా పొందుతారు.


అధికారాలు - విధులు
 మానవహక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలను, రాజ్యాంగంలోని విశేషాలను సమీక్షించి, ఆయా చట్టాలు సమర్థంగా అమలయ్యేలా చూడటం.
 సమాజంలోని వివిధ వర్గాల్లో మానవ హక్కుల అభివృద్ధి దిశగా జాగృతిని పెంచేందుకు కృషి చేయడం, సెమినార్లు, సభలను నిర్వహించడం.
 హక్కుల అమలుకు సంబంధించి ఏ వ్యక్తి నుంచైనా, ఏ అధికారి నుంచైనా వాంగ్మూలాలను సేకరించవచ్చు. తన ముందు హాజరు కావాలని ఆదేశించవచ్చు.
 మానవ హక్కుల పరిరక్షణకై కృషిచేసే NGOలను, పరిశోధనలను ప్రోత్సహించడం
 కేవలం ఫిర్యాదులపైనే ఆధారపడకుండా తనకు తానుగా 'సుమోటో'గా కేసులను విచారిస్తుంది.
 చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన హక్కుల అమలుకు సంబంధించిన అంశాలపై విచారణ చేయడం
 జైళ్లలో ఉండే ఖైదీల హక్కులు, అరెస్టయి పోలీస్ స్టేషన్‌లో ఉన్న వ్యక్తుల హక్కుల గురించి విచారణ చేస్తుంది.
 సెమీ జ్యుడీషియల్ వ్యవస్థగా పనిచేయడం, సివిల్ కోర్ట్ అధికారాలు కలిగి ఉండటం.
 మానవ హక్కులను అనుభవించడానికి ఎదురవుతున్న ఉగ్రవాదం వంటి ఇతర కారకాలను సమీక్షించి వాటి అమలుకు తగిన సిఫారసులు చేయడం.
 మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసుల విచారణ న్యాయస్థానాల్లో జరుగుతున్నప్పుడు, ఆ న్యాయస్థానం అనుమతితో కమిషన్ సంబంధిత కేసులో జోక్యం చేసుకోవచ్చు.
‣ మానవ హక్కుల పరిరక్షణకు అవసరమైన పరిశోధనలను చేపట్టవచ్చు.
 మానవ హక్కులకు సంబంధించిన గ్రంథాలు, ఒడంబడికలు, అంతర్జాతీయ అధికార పత్రాలను అధ్యయనం చేసి, వాటి సక్రమ అమలుకు అవసరమైన చర్యలను సిఫారసు చేయడం.
 సాయుధ దళాలు జరిపే మానవహక్కుల ఉల్లంఘనలపై, మానవ హక్కులు ఉల్లంఘించినట్లు అభియోగాలు వచ్చినప్పుడు కమిషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన వివరణ కోరుతుంది.
 కమిషన్ తన వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించగా, కేంద్రం ఆ నివేదికను పార్లమెంటుకు అందజేస్తుంది.
 మానవ హక్కుల ఉల్లంఘన కారణంగా బాధలకు గురైన వ్యక్తికి లేదా వారి కుటుంబసభ్యులకు తాత్కాలిక సహాయాన్ని అందజేయాల్సిందిగా సంబంధిత ప్రభుత్వానికి లేదా సంస్థకు సూచించవచ్చు.
 కమిషన్ తన విచారణ నివేదిక ప్రతిని పిటిషన్‌దారులకు అందజేస్తుంది.
 ఒక సంవత్సరానికి సంబంధించిన కేసులను మాత్రమే కమిషన్ విచారణకు స్వీకరిస్తుంది.
 కమిషన్ తన దగ్గరకు వచ్చిన కేసుల విచారణలో భాగంగా సుమోటోగా విచారణ చేపట్టిన కేసుల విచారణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రిమైండర్లను జారీ చేయడం, షరతులతో కూడిన సమన్లు పంపడం, బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం లాంటి చర్యలను తీసుకుంటుంది.
 మానవ హక్కుల కమిషన్ విచారణలో ఉన్న కేసులపై సుప్రీంకోర్టు, హైకోర్టులు 'స్టే' ఇవ్వవచ్చు.
 జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్ద 2015, జూన్ 30 నాటికి 40,941 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రొసీజర్స్ 8(b) ప్రకారం కోర్టు విచారణలో ఉన్న విషయాలపై ఫిర్యాదులను సాధారణంగా కమిషన్ స్వీకరించదు. కానీ సెక్షన్ 12(b) ప్రకారం మానవ హక్కుల గురించి ఏదైనా విషయం కోర్టు విచారణలో ఉన్నప్పుడు సంబంధిత కోర్టు అనుమతితో కమిషన్ ఆ విషయంలో ‣ జోక్యం చేసుకోవచ్చని రామకృష్ణ కేసులో పేర్కొంది.

 

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
 మానవహక్కుల పర్యవేక్షణ చట్టం, 1993 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లను ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్‌లను ఏర్పాటు చేయడమనేది సెక్షన్ 21 ప్రకారం ఐచ్ఛికమైంది.
 ఇప్పటి వరకు మన దేశంలో 18 రాష్ట్రాలు రాష్ట్రస్థాయి మానవహక్కుల కమిషన్‌లను ఏర్పాటు చేశాయి.
 జాతీయ మానవ హక్కుల చట్టం, 1993 ప్రకారం 2005, ఆగస్టు 11న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 2005, ఆగస్టు 12 నుంచి పనిచేస్తోంది.
 రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఛైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. వీరిని గవర్నర్ నియమిస్తారు.
 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వ్యక్తిని ఛైర్మన్‌గా గవర్నర్ నియమిస్తారు.
 రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీకాలం - 5 సంవత్సరాలు లేదా ఆ వ్యక్తికి 70 ఏళ్లు వచ్చే వరకు.
ఎంపిక కమిటీ
 ముఖ్యమంత్రి     -     ఛైర్మన్
 హోంమంత్రి     -     సభ్యుడు
 శాసనసభ స్పీకర్     -     సభ్యుడు
 శాసనసభలో ప్రతిపక్ష నేత     -     సభ్యుడు

 రాష్ట్రంలో విధానపరిషత్ ఉన్నట్లయితే విధానపరిషత్ ఛైర్మన్, ప్రతిపక్ష నాయకులను ఈ కమిటీలో చేర్చవచ్చు.
 రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్, సభ్యులు తమ రాజీనామాను గవర్నర్‌కు సమర్పించాలి. వీరిని తొలగించే అధికారం గవర్నరుకు లేదు. కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంది.
 కమిషన్ ఛైర్మన్, సభ్యుల జీతభత్యాలను రాష్ట్రప్రభుత్వం నిర్ణయిస్తుంది.
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో రాష్ట్రంలోని అదనపు జిల్లా జడ్జి, అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, మేజిస్ట్రేట్ కోర్టులను మానవ హక్కుల కోర్టులుగా ప్రకటించింది.
 ఏడు సంవత్సరాలు న్యాయవాదిగా పని చేసిన వ్యక్తిని మానవ హక్కుల కోర్టులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది.


అధికారాలు - విధులు
 మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులను విచారిస్తున్నప్పుడు రాష్ట్ర కమిషన్ దానికి సంబంధించిన సమాచారాన్ని లేదా నివేదికలను నిర్ణీత సమయంలో అందజేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న ఏవైనా అథారిటీలను కోరవచ్చు.
 మానవ హక్కుల ఉల్లంఘన లేదా దానికి ప్రేరేపించేవారిని లేదా వాటిని నిలుపుదల చేయడంలో నిర్లక్ష్యం చేసిన పబ్లిక్ సర్వెంట్స్ చర్యలను మాత్రమే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారిస్తుంది.
 మానవ హక్కుల గ్రంథాలను, ఒడంబడికలను, అంతర్జాతీయ అధికార పత్రాలను అధ్యయనం చేసి, వాటిని అమలుపరచడానికి అవసరమైన చర్యలను సిఫారసు చేయడం జాతీయ మానవహక్కుల కమిషన్ విధి. ఈ నిబంధన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు వర్తించదు.
 రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర శాసనసభకు సమర్పిస్తుంది.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధికార పరిధిలోకి రాని అంశాలు:
 ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైనా కమిషన్ పరిశీలనలో ఉన్న అంశాలు
 జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణలో ఉన్న ఫిర్యాదులు
 ఉద్యోగ, పని నిబంధనలకు సంబంధించిన ఫిర్యాదులు
 ప్రాముఖ్యం లేని అంశాలపై వచ్చిన ఫిర్యాదులు
 న్యాయస్థానాల విచారణలో ఉన్న ఫిర్యాదులు
‣ ఒక సంవత్సర కాలం కంటే ఎక్కువ సమయం గల ఫిర్యాదులు (సంఘటన జరిగిన తేదీ నుంచి ఒక సంవత్సరం).
‣ జమ్మూకశ్మీర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తించే 7వ షెడ్యూల్‌లోని 3వ జాబితాలో పేర్కొన్న అంశాలను, జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రం కోసం రూపొందించిన చట్టాల్లోని మానవ హక్కుల ఉల్లంఘనలను మాత్రమే విచారిస్తుంది.
‣ మానవ హక్కుల చట్టంలోని సెక్షన్ 2(D) ప్రకారం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో పొందుపరచిన వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, గౌరవం, అంతర్జాతీయ ఒప్పందాల్లో పొందుపరచిన భారతీయ కోర్టుల ద్వారా అమలుపరచడానికి అవకాశం ఉన్న హక్కులన్నీ మానవ హక్కులే.
‣ ఎన్‌కౌంటర్ మరణాల గురించి మానవహక్కుల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు
 1997, మార్చి 29న ఎన్‌కౌంటర్ మరణాలకు సంబంధించిన మార్గదర్శకాలను NHRC జారీచేసింది.


ముఖ్యాంశాలు:
 ఎన్‌కౌంటర్ సమాచారాన్ని పోలీస్‌స్టేషన్ రిజిస్టరులో నమోదు చేయాలి.
 కేసును బట్టి చనిపోయిన వ్యక్తి వారసులకు నష్టపరిహారం చెల్లించాలి.
 ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు సంబంధిత పోలీసుస్టేషన్‌కు చెందిన వాళ్లయితే ఆ కేసు దర్యాప్తును సీఐడీ లాంటి ఇతర ఏజెన్సీలకు అప్పగించాలి.
 పోలీసు చర్యల వల్ల మరణించిన కేసుల వివరాలతో కూడిన స్టేట్‌మెంట్ ప్రతి 6 నెలలకు ఒకసారి అంటే జనవరి 15న, జులై 15 లోగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కమిషనర్‌కు తప్పకుండా పంపించాలి. ఈ స్టేట్‌మెంట్ కింద ఇచ్చిన నమూనాలా ఉండాలి. వీటితో పాటు పోస్ట్‌మార్టం రిపోర్టులు, ఎంక్వైరీ ‣ రిపోర్టులతో పాటు కింది వివరాలు ఉండాలి.
a) సంఘటన జరిగిన స్థలం, తేది
b) పోలీస్‌స్టేషన్ జిల్లా
c) మరణానికి దారి తీసిన పరిస్థితులు
d) క్లుప్తంగా సంఘటన వివరాలు
e) క్రిమినల్ కేసు
f) దర్యాప్తు సంస్థ
g) మెజిస్టీరియల్ లేదా పోలీసు విచారణ ఫలితాలు

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌