• facebook
  • whatsapp
  • telegram

కొత్త రాష్ట్రాల ఏర్పాటు - ఉద్యమాలు

     భారత రాజ్యాంగ నిర్మాతలు దేశాన్ని ‘రాష్ట్రాల సముదాయం’ (Union of States) గా పేర్కొన్నారు. వీరు దేశాన్ని పాలనాపరమైన సమాఖ్యగా ఏర్పాటు చేశారు కానీ సిద్ధాంతపరమైన సమాఖ్యగా పేర్కొనలేదు. దీనివల్ల దేశం నుంచి రాష్ట్రాలు విడిపోయే అవకాశం లేదు. ఒకే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధి విషయంలో అసమానతలకు గురైనవారు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ, దేశంలోనే అంతర్భాగంగానే కొనసాగుతున్నారు. ఇది భారత ఉపఖండం విశిష్టతను తెలియజేస్తుంది.


కారణాలు


* కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమాల వెనుక సాంస్కృతిక, ఆర్థిక, సాంఘిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంత సహజవనరులను ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించకుండా మిగిలిన ప్రాంతాలకు బదిలీ చేసినప్పుడు కొత్త రాష్ట్రం కోసం డిమాండ్‌లు వస్తాయి.
* ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాల పట్ల మిగిలిన ప్రాంతాల ఆధిపత్యం పెరిగినప్పుడు; ఉద్యోగ, ఉపాధి రంగాల్లో నిర్లక్ష్యానికి గురై, మిగిలిన ప్రాంతాలు వాటిని పొందడంలో ఆధిక్యం ప్రదర్శించినప్పుడు ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి.

* ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర రాజధాని చుట్టూ కేంద్రీకృతమై, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబాటుకు గురైనప్పుడు; నదీజాలలు, ఖనిజ సంపద ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలినప్పుడు కొత్త రాష్ట్రాల కోసం ఉద్యమాలు వస్తాయి.

* ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, భౌగోళిక సామీప్యత ఉన్న కొన్ని ప్రాంతాలు కొత్త రాష్ట్రంగా ఏర్పడాలని భావిస్తాయి.

* రాజకీయ నాయకులూ తమ మనుగడ కోసం కొన్ని సముదాయాలను ఏకీకృతం చేసి కొత్త రాష్ట్రాల కోసం ఉద్యమిస్తున్నారు.

* రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే అభివృద్ధి ప్రణాళికలు, పారిశ్రామిక విధానాలు, బడ్జెట్‌ కేటాయింపులు లోపభూయిష్టంగా ఉన్నప్పుడు నష్టపోతున్న ప్రాంతాల వారు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఉద్యమిస్తారు.


1956 తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రాలు


  ఫజల్‌ అలీ నేతృత్వంలోని రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కమిషన్‌ ్బళీళిద్శి సిఫార్సుల మేరకు 1956లో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో భారత రాజకీయ చిత్రపటంలో అనేక మార్పులు వచ్చాయి. వాటికి ప్రజా ఉద్యమాలు, రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణంగా నిలిచాయి. భాష ప్రాతిపదికన లేదా సాంస్కృతిక సజాతీయత కారణాలపై ఏర్పడిన డిమాండ్‌ల వల్ల రాష్ట్రాలను తిరిగి విభజించాల్సి వచ్చింది.


15. గుజరాత్‌: భూమిపుత్రుల సిద్ధాంతం పేరుతో ‘మరాఠా’ ప్రాంతం మరాఠీయులకే చెందాలని కోరుతూ గుజరాతీ భాష మాట్లాడేవారిని వేరుచేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బాంబేలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. 1960లో ద్విభాషా రాష్ట్రమైన బాంబేని విభజిస్తూ గుజరాతీయుల కోసం ప్రత్యేకంగా సౌరాష్ట్రను కలిపి గుజరాత్‌ను 15వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న బొంబాయిని మహారాష్ట్రగా పేరు మార్చారు.


16. నాగాలాండ్‌: ఎ.జి.పి.జో నేతృత్వంలోని నాగాలు, అసోంను విడగొట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని ఉద్యమించారు. దీంతో నాగాహిల్స్, ట్యూన్‌సాంగ్‌లను వేరు చేసి 1963లో నాగాలాండ్‌ను 16వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


17. హరియాణా: మాస్టర్‌ తారాసింగ్‌ నాయకత్వంలో అకాళీదళ్‌ ప్రత్యేక ‘సిక్కుల మాతృభూమి’ (పంజాబ్‌ సుబా) అనే డిమాండ్‌తో పంజాబ్‌ రాష్ట్రం పంజాబీయులకే (సిక్కులు) చెందాలని, హిందీ మాట్లాడేవారిని వేరు చేయాలని ఉద్యమించింది. 1966లో షా కమిషన్‌ సూచనల మేరకు పంజాబీ మాట్లాడే ప్రాంతాలను పంజాబ్‌ రాష్ట్రంగా ఉంచి, హిందీ మాట్లాడే ప్రాంతాలను వేరు చేసి హరియాణా పేరుతో 17వ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చండీగఢ్‌ను నిర్ణయించి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.


18. హిమాచల్‌ప్రదేశ్‌: రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ ఫలితంగా 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌కు బిలాస్‌పూర్‌ ప్రాంతాన్ని కలిపి 1971లో దాన్ని 18వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


19. మణిపూర్‌: 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటైన మణిపూర్‌ను 1972లో 19వ రాష్ట్రంగా మార్చారు.


20. త్రిపుర: 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న త్రిపురను 1982లో 20వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


21. మేఘాలయ: ప్రజా ఉద్యమం కారణంగా అసోం రాష్ట్రాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తూ 1972లో ఉప ప్రాంతంగా ఉన్న మేఘాలయను 21వ రాష్ట్రంగా నిర్ణయించారు. ఈ సందర్భంలోనే మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌లు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి.


22. సిక్కిం: బ్రిటిషర్ల పాలనా కాలంలో ‘సిక్కిం’ చోగ్యాల్‌ అనే వారసత్వపు రాజు నియంత్రణలో ఉండేది. 35వ రాజ్యాంగ సవరణ చట్టం (1975) ద్వారా సిక్కిం భారత్‌లో ‘సహరాష్ట్ర హోదా’ (Associate State) గా విలీనమైంది. ఇది విమర్శకు దారి తీయడంతో కేంద్ర ప్రభుత్వం 36వ రాజ్యాంగ సవరణ చట్టం (1975) ద్వారా సిక్కింను భారత్‌లో 22వ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది.


23. మిజోరం: రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో (1986) మిజో నేషనల్‌ ఫ్రంట్‌తో జరిగిన ‘మిజోరం శాంతి ఒప్పందం’ ఫలితంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న మిజోరంను 1987లో 53వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 23వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


24. అరుణాచల్‌ప్రదేశ్‌: కేంద్రపాలిత ప్రాంతమైన అరుణాచల్‌ప్రదేశ్‌ను రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 55వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1987లో 24వ రాష్ట్రంగా మార్చింది.


25. గోవా: ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరుతో పోర్చుగీసు వారి నుంచి 1961లో విముక్తి పొందిన గోవా, డయ్యూ డామన్‌లను 10వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 56వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1987లో గోవాను 25వ రాష్ట్రంగా ఏర్పాటు చేసి డయ్యూ డామన్‌లను కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగించారు.
 

* అటల్‌బిహారి వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2000 సంవత్సరంలో భారత్‌లో మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అవి చత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్, ఝార్ఖండ్‌.


26. చత్తీస్‌గఢ్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని పునర్‌ వ్యవస్థీకరించి 2000, నవంబరు 1న చత్తీస్‌గఢ్‌ను 26వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


27. ఉత్తరాంచల్‌: ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని పునర్‌ వ్యవస్థీకరించి 2000, నవంబరు 9న ఉత్తరాంచల్‌ను 27వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


28. ఝార్ఖండ్‌: బిహార్‌ను పునర్‌ వ్యవస్థీకరించి 2000, నవంబరు 15న ఝార్ఖండ్‌ను 28వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


29. తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం, 2014 ద్వారా డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించి 2014 జూన్‌ 2న తెలంగాణను 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది.
 

ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్‌ చేస్తున్న ప్రాంతాలు: మహారాష్ట్ర - విదర్భ; అసోం - బోడోలాండ్‌; కర్ణాటక - కొడుగు; ఉత్తరప్రదేశ్‌ - హరితప్రదేశ్, బుందేల్‌ఖండ్‌; పశ్చిమ్‌ బంగ - గూర్ఖాలాండ్‌; గుజరాత్‌ - సౌరాష్ట్ర.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌