• facebook
  • whatsapp
  • telegram

పరాగసంపర్కం

రకాలు 

ఆవృతబీజాల్లోని పరాగ సంపర్కం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది.

అవి: 1. ఆత్మపరాగ సంపర్కం     2. పరపరాగ సంపర్కం


ఆత్మపరాగ సంపర్కం

పుష్పంలో కేసరాలు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలుగా ఉంటాయి. అందులోని పరాగ కోశాల్లో ఉన్న పరాగ రేణువులు అదే పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైన అండకోశంలోని కీలాగ్రంపై పడటాన్ని ఆత్మ పరాగసంపర్కం అంటారు. దీన్నే ‘ఆటోగమి’ అని కూడా పిలుస్తారు. ఇది ద్విలింగ పుష్పాల్లో సాధారణంగా జరుగుతుంది.


పరపరాగ సంపర్కం 

ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే జాతికి చెందిన మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు. దీన్నే ‘ఆల్లోగమి’ అని కూడా వ్యవహరిస్తారు. ఇలాంటి పరాగ సంపర్కం సాధారణంగా ఏకలింగ పుష్పాల్లో  కనిపిస్తుంది. ద్విలింగ పుష్పాల్లోనూ ఇది జరుగుతుంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అవి:

i. ఏకవృక్ష పరపరాగ సంపర్కం (గైటినోగమీ): ఒకే మొక్కకు చెందిన రెండు పుష్పాల మధ్య జరుగుతుంది. ఒక పువ్వులోని పరాగ రేణువులు అదే మొక్కపై ఉన్న మరొక పుష్ప కీలాగ్రంపై పడతాయి. ఇది జన్యుశాస్త్రపరంగా ఆత్మపరాగ సంపర్కానికి సమానం.

ii. భిన్న వృక్ష పరపరాగ సంపర్కం (జీనోగమీ): ఒక మొక్కపై ఉన్న పువ్వులోని పరాగ రేణువులు అదే జాతికి చెందిన మరొక పుష్పం కీలాగ్రాన్ని చేరడాన్ని భిన్న వృక్ష పరపరాగ సంపర్కం అంటారు. ఇది వైవిధ్యరీత్యా నిజమైన పరపరాగ సంపర్కం.


పరపరాగ సంపర్కానికి   సహకరించే కారకాలు

ఇందులో ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే జాతికి చెందిన మరొక పుష్ప కీలాగ్రాన్ని చేరి, ఫలదీకరణకు సాయపడతాయి. పరాగ రేణువులు చలించలేవు. ఈ కారణంగా ఇవి వాటంతట అవే కీలాగ్రాన్ని చేరలేవు. కాబట్టి మొక్కలు తమ పరిసరాలకు తగ్గట్లు అనేక బాహ్య కారకాలైన గాలి, కీటకాలు, నీరు, వివిధ రకాల జంతువులు మొదలైన వాటి సహాయం ద్వారా పరాగ సంపర్కాన్ని జరుపుకుంటాయి. ఈ బాహ్య కారకాలను రెండు ప్రధాన వర్గాలుగా విభజించారు. అవి: 

1. నిర్జీవ కారకాలు: పరపరాగ సంపర్కానికి గాలి (ఎనిమోఫిలి), నీరు (హైడ్రోఫిలి) సహాయపడతాయి.

2. జీవ సంబంధ కారకాలు: కీటకాలు (ఎంటమోఫిలి), పక్షులు (అర్నితోఫిలి), గబ్బిలాలు (ఖీరప్టెరిఫిలి), నత్తలు (మొలకోఫిలి) పరపరాగ సంపర్కానికి తోడ్పడతాయి.

వాయు పరాగ సంపర్కం: గాలి ద్వారా జరిగే పరపరాగ సంపర్కాన్ని ఎనిమోఫిలి అంటారు. దీన్ని జరిపే మొక్కలు కింది ప్రత్యేక లక్షణాలను ప్రదర్శిస్తాయి.

పుష్పాలు చిన్నగా, వర్ణ రహితంగా, సువాసన - మకరందం లేకుండా ఉంటాయి.

* పరి పత్రాలు పొలుసులుగా క్షీణించడం లేదా అసలు లేకుండా ఉంటాయి.

*  పుష్పాలు ద్విలింగకాలైనప్పటికి పుంభాగ ప్రథమోత్పత్తిని ప్రదర్శిస్తాయి.

* కేసరాలు పొడుగ్గా ఉండి, బిందు సంయోజితంగా దండానికి అతుక్కుని ఉంటాయి.

*పుప్పొడి అధిక మొత్తంలో ఏర్పడి పరాగకోశం గోడలపై తేలిగ్గా అతుక్కుని ఉంటుంది. ఇది గాలి కెరటాల ద్వారా ఎక్కువ దూరం వ్యాపిస్తుంది.

*  పరాగ రేణువులను స్వీకరించడానికి వీలుగా ఈ పుష్పాల్లో బహిర్గతంగా ఉండే ఈక  లేదా కుంచె లాంటి కీలాగ్రాలు ఉంటాయి.

జలపరాగ సంపర్కం: నీటి ద్వారా మొక్కల్లో జరిగే పరపరాగ సంపర్కాన్ని ‘జలపరాగ సంపర్కం’ అంటారు. నిజమైన జలపరాగ సంపర్కం పూర్తిగా నీటిలో మునిగి ఉన్న మొక్కల్లో మాత్రమే జరుగుతుంది.

* పొటామోజీటన్, బ్రయోఫిల్లం లాంటి మొక్కల్లో వాయు పరాగ సంపర్కం జరుగుతుంది. నింఫియా లాంటి మొక్కల్లో కీటక పరాగ సంపర్కం జరుగుతుంది. 

* నీటి ద్వారా పరపరాగ సంపర్కం జరగాలంటే నీటిలో పుష్పాలు అమరి ఉండే స్థానం, పరాగ రేణువుల విశిష్ట సాంద్రత మధ్య చక్కటి సహసంబంధం ఉండాలి. 

* పరాగ రేణువుల విశిష్ట సాంద్రత, నీటి విశిష్ట సాంద్రతతో సమానంగా లేదా కొద్దిగా తక్కువగా ఉండాలి. అలాంటి పరాగ రేణువులు నీటి అడుగున అవలంబితమై స్త్రీ పుష్పాలను చేరగలుగుతాయి. 

ఉదా: జోస్టిరా, సెరటోఫిల్లమ్‌. 


* మరికొన్ని నీటి మొక్కల స్త్రీ పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. పుప్పొడి విశిష్ట సాంద్రత, నీటి విశిష్ట సాంద్రత కంటే తక్కువగా ఉండటం వల్ల, పుప్పొడి రేణువులు నీటి ఉపరితలంపై తేలుతూ పువ్వులను చేరి పరపరాగ సంపర్కం జరుపుతాయి. 

పరాగ రేణువుల్లో ఒకటి లేదా రెండు పిండి రేణువులను నిల్వచేయడం ద్వారా వాటి  విశిష్ట సాంద్రతను మొక్కలు నియంత్రిస్తాయి. 

* జలపరాగ సంపర్కం జరుపుకునే మొక్కల్లో  పుష్పాలు చిన్నవిగా, ఆకర్షణీయంగా ఉంటాయి.


జలపరాగ సంపర్కం - రకాలు 

1) ఊర్థ్వ జలపరాగ సంపర్కం: పరాగ సంపర్కం నీటి ఉపరితలంపై జరుగుతుంది. వాలిస్‌నేరియా నీటిలోపల పెరిగే ఏకలింగాశ్రయ మొక్క. ఇందులో స్త్రీ, పురుష పుష్పాలు నీటి అడుగున ఏర్పడతాయి. పక్వదశలో పురుష పుష్పాలు మొక్క నుంచి విడిపోయి నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. ప్రతి పురుష పుష్పంలో మూడు కేసరాలు విస్తరించి ఉంటాయి. అదే సమయంలో స్త్రీ పుష్పాలు పక్వస్థితిలో ఉండి, పొడవైన వృంతాల సహాయంతో నీటి ఉపరితలంపైకి వస్తాయి. పురుష పుష్పాలు నీటిపై తేలుతూ స్త్రీ పుష్పాలున్న ప్రాంతానికి చేరినప్పుడు, కేసరాలు కీలాగ్రాలను తాకటం వల్ల పరపరాగ సంపర్కం జరుగుతుంది. పరాగ సంపర్కం పూర్తవగానే పుష్పాల వృంతాలు స్ప్రింగ్‌లా చుట్టుకుని, స్త్రీ పుష్పాలను నీటి అడుగు భాగానికి తీసుకుపోతాయి.


ii) అథోజల పరాగ సంపర్కం: ఇది నీటి లోపల జరుగుతుంది. నీటిలో మునిగి ఉండే మొక్కలైన నాజాస్, సెరటోఫిల్లం, జోస్టిరాలో ఇది కనిపిస్తుంది.

* సెరటోఫిల్లం మొక్కలోని పురుష పుష్పాల్లో 12-15 కేసరాలు ఉంటాయి. ప్రతి పరాగ కోశంలో కొమ్ము ఆకారంలో ఉండే పొడవైన నిర్మాణంతోపాటు, వాయుపూరిత మృదుకణజాలం ఉంటుంది. దీనివల్ల పరాగ కోశాలు నీటిలో అవలంబంగా ఉంటాయి. పరాగ రేణువులు సూదుల్లా ఉండి, వాటి విశిష్ట గురుత్వం విలువ నీటితో సమానంగా ఉంటుంది. ఇవి నీటిలో అవలంబంగా ఉంటాయి. కీలాగ్రం అడుగుభాగాన జిగురు లాంటి ప్రాంతంలో పరాగ రేణువులు అతుక్కుని, పరాగ సంపర్కం జరుపుతాయి. 


ఆత్మపరాగ సంపర్కాన్ని  ప్రోత్సహించే పద్ధతులు

ఆత్మపరాగ సంపర్కానికి మొక్కలు కింది అనుకూలనాలను ప్రదర్శిస్తాయి.


i)  ఏకకాల పక్వత: ద్విలింగ పుష్పాలు కేసరాలు, అండకోశం ఏకకాలంలో అంటే, ఒకే సమయంలో పక్వస్థితికి రావడాన్ని ఏకకాల పక్వత అంటారు. దీనివల్ల ఆత్మపరాగ సంపర్కం జరగడానికి వీలుకలుగుతుంది.

ఉదా: రానన్క్యులస్‌.

ii)  సంవృత సంయోగం: ఎప్పుడూ వికసించని పుష్పాలను సంవృత సంయోగ పుష్పాలు అంటారు. ఇలాంటి పుష్పాల్లో కేవలం ఆత్మపరాగ సంపర్కం మాత్రమే జరుగుతుంది. దీన్నే సంవృత సంయోగం అంటారు.

ఉదా: కొమ్మలైనా బెంగాలెన్సిస్‌.


పరపరాగ సంపర్కం - సిద్ధించే పద్ధతులు

మొక్కల్లో పరిణామక్రమపరంగా దీన్ని పరిణతి చెందిన లక్షణంగా పేర్కొంటారు. అందుకే పరపరాగ సంపర్కం జరుపుకోవడానికి మొక్కలు కొన్ని ప్రత్యేక అనుకూలనాలను కలిగి ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి:


i) ఏకలింగత్వం: కొన్ని జాతుల పుష్పాల్లో ఆవశ్యకాంగాలు లేదా ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఏదో ఒకటి మాత్రమే (కేసరావళి లేదా అండకోశం) ఉంటుంది. వీటినే ఏకలింగ పుష్పాలు అంటారు. కొన్ని మొక్కలు కేవలం పురుష లేదా స్త్రీ పుష్పాల్లో ఏదో ఒకదాన్నే కలిగి ఉంటాయి. అలాంటి స్థితిని ఏకలింగాశ్రయస్థితి అంటారు. 

ఉదా: బోరానస్, వాలిస్‌నేరియా మొక్కలు.

* మరికొన్ని మొక్కల్లో ఏకలింగ పుష్పాలు, స్త్రీ - పురుష పుష్పాలు ఒకే మొక్కపై ఏర్పడతాయి. ఈ స్థితిని ద్విలింగాశ్రయ స్థితి అంటారు. 

ఉదా: కోకాస్‌ న్యూసిఫెరా.

ii)  భిన్నకాల పక్వత: ద్విలింగ పుష్పాల్లోని కేసరావళి, అండకోశం వేర్వేరు సమయాల్లో పక్వానికి వస్తాయి. ఇది రెండు రకాలుగా ఉంటుంది.

* పుంభాగ ప్రథమోత్పత్తి: ద్విలింగ పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైన అండకోశం కంటే పురుష ప్రత్యుత్పత్తి భాగం కేసరావళి ముందుగా పక్వానికి రావడాన్ని పుంభాగ ప్రథమోత్పత్తి అంటారు. 

ఉదా: హీలియాంథస్, సాల్వియా, క్లీరో డెండ్రాన్, గాసిపియమ్‌.

* స్త్రీ భాగ ప్రథమోత్పత్తి: ఉభయలింగ లేదా ద్విలింగ పుష్పాల్లో కేసరావళి కంటే అండకోశం ముందుగా పక్వానికి రావడాన్ని స్త్రీ భాగ ప్రథమోత్పత్తి అంటారు.

ఉదా: సొలానం, అరిస్టలోఖియా.

iii) హెర్కోగమీ: ద్విలింగక పుష్పాల్లో ఉన్న స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు వేర్వేరు స్థానాల్లో అమరి ఉండటాన్ని ‘హెర్కోగమీ’ అంటారు. దీనివల్ల ప్రత్యుత్పత్తి అంగాలు ఒకేసారి పక్వానికి వచ్చినా, ఆత్మ పరాగ సంపర్కం జరగదు. 

* హైబిస్కస్, ట్రైడాక్స్‌ లాంటి మొక్కల పుష్పాల్లో కీలాగ్రాలు కేసరాల కంటే ఎత్తుగా ఉంటాయి. 

* గ్లోరియోసా సూపర్బ లాంటి మరికొన్ని మొక్కల పుష్పాల కీలాగ్రాలు, కేసరాలు వ్యతిరేక దిశలో వంగి ఉంటాయి.

iv) భిన్న కీలత: ఒకే జాతి మొక్కల్లోని పుష్పాల కీలాలు వేర్వేరు ఎత్తుల్లో అమరి ఉండటాన్ని భిన్న కీలత అంటారు. కొన్ని మొక్కల పువ్వుల్లో కీలాలు రెండు వేర్వేరు ఎత్తుల్లో అమరి ఉంటాయి. దీంతో ఇవి రెండు రూపాల్లో వ్యవస్థితమై ఉంటాయి. ఇలాంటి పుష్పాలను ద్విరూప పుష్పాలు అంటారు. 

ప్రిములేసి, ఆక్సాలిడేసి, రూబియేసి కుటుంబానికి చెందిన పుష్పాల్లో ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంది.

v) ఆత్మ వంధ్యత్వం: కొన్ని ద్విలింగ పుష్పాల్లోని పరాగ రేణువులు అదే పుష్పం కీలాగ్రంపై పడినప్పుడు అవి మొలకెత్తలేవు. దీన్నే ‘ఆత్మ వంధ్యత్వం’ అంటారు. 

ఉదా: పాసిఫ్లోరా.

vi) పుప్పొడి పూర్వ శక్తి: కొన్ని మొక్కల్లో పరాగ సంపర్కం ద్వారా అదే పుష్పంలోని పరాగరేణువులు, అదే జాతికి చెందిన మరొక పువ్వులోని పరాగ రేణువులు ఒకేసారి కీలాగ్రాన్ని చేరినప్పుడు, వేరే పుష్పం నుంచి వచ్చిన పరాగ రేణువులు ముందుగా మొలకెత్తుతాయి. ఈ విధంగా ఈ మొక్కల్లో పర ఫలదీకరణ జరుగుతుంది.

ఉదా: డాలికస్‌.


vii) సూక్ష్మ గ్రాహ్య కీలాలు: కొన్ని మొక్కల పుష్పాల్లో కీలాగ్రాలు, కీలాగ్ర తమ్మెలు స్పర్శకు సూక్ష్మ గ్రాహ్యతను చూపిస్తాయి. వీటిలో ఒకసారి పరపరాగ సంపర్కం జరిగాక కీలాగ్ర తమ్మెలు దగ్గరగా చేరి ముడుచుకుంటాయి లేదా కీలాగ్రం వడిలిపోతుంది. 


* మార్టీనియా, మిమ్యులస్‌ లాంటి మొక్కల్లో ఈ లక్షణాలు ఉంటాయి.

Posted Date : 12-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌