• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం-ముఖ్యనిర్వచనాలు

రీఫారెస్ట్రేషన్‌ (Reforestation) : అడవులు నశించిన ప్రాంతంలో తిరిగి మొక్కలు నాటి, అడవులు పెంచడం.

ఎఫారెస్ట్రేషన్‌ (Afforestation) : అటవీ పరిసరాలు లేదా ఒక ప్రాంతంలో అటవీ వ్యవస్థను లేదా వృక్ష సంపదను పెంచడం. 

డీఫారెస్ట్రేషన్‌Â (Deforestation)  : విస్తృతంగా వ్యాపించి ఉన్న అటవీ ప్రాంతాన్ని నిర్మూలించి, దాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించడం. 

ఫారెస్ట్‌ కవర్‌: ఒక హెక్టారు లేదా అంతకు మించి విస్తీర్ణంలో వృక్షసంపద, 10 శాతం కంటే tree canopy విస్తరించి ఉండటం (వీటికి చట్టబద్ధత, ఓనర్‌షిప్‌ వర్తించదు.) 

ట్రీ కవర్‌: అటవీ ప్రాంతానికి బయట ఒక హెక్టారు కంటే తక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న చెట్లను ట్రీ కవర్‌ అంటారు.

ఆల్గల్‌ బ్లూమ్‌: జలావరణ వ్యవస్థలో శైవలాలు లేదా ఆల్గే వాటి స్థాయికి మించి పెరుగుదలను నమోదు చేయడం. 

* ఇవి మంచినీరు, సముద్ర వాతావరణంలోనూ పెరుగుతాయి.

కీమోట్రోఫ్స్‌:  పర్యావరణంలో ఉన్న రసాయన పదార్థాల నుంచి శక్తిని సమకూర్చుకునే జీవులు. 

ఫొటోహెటిరోట్రోఫ్స్‌: పరపోషకాలుగా ఉన్న జీవులు సూర్యరశ్మి నుంచి శక్తిని గ్రహిస్తాయి. కానీ ఇవి కార్బన్‌ డైఆక్సైడ్‌ని ఉపయోగించుకుని కర్బన పదార్థాలను తయారుచేయలేవు. 

క్యారీయింగ్‌ కెపాసిటీ (Carrying capacity): పర్యావరణంలోని వనరులైన ఆహారం, ఆవాసం, నీటిని ఉపయోగించుకుని ఒక ప్రజాతి స్థిరంగా అత్యధిక వృద్ధి సాధించడాన్ని క్యారీయింగ్‌ కెపాసిటీ అంటారు.

ఆవాస పరిరక్షణ (Habitat Conservation):  వన్యమృగాలు, అడవుల పరిరక్షణ కోసం ఆయా జీవుల ఆవాస ప్రాంతాలను పరిరక్షించి, ఆ జాతులు అంతరించిపోకుండా చూడటం.

యూట్రోఫిక్‌ లేక్స్‌: ఈ సరస్సుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. దీంతో ఆల్గల్‌ బ్లూమ్స్‌ ఏర్పడి, తాగునీటికి ఉపయోగపడని సరస్సులుగా మారతాయి. 

ఫ్లాగ్‌షిప్‌ స్పీసిస్‌: ఈ జాతి జీవులను పర్యావరణ పరిరక్షకులుగా గుర్తిస్తారు. వీటిని పరిరక్షించి, వృద్ధి చేయటం ద్వారా మొత్తం ఆవరణ వ్యవస్థను పరిరక్షించవచ్చు. 

ఇండికేటర్‌ స్పీసిస్‌: ఈ రకమైన జీవులు వాటి చుట్టూ ఉన్న పర్యావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. కాలుష్య ప్రాంతాలు, క్లైమేట్‌ ఛేంజ్‌ పరిస్థితుల్లో ఈ జాతి జీవులు వాటిలో వచ్చే మార్పుల ద్వారా ముందస్తు హెచ్చరికలు చేస్తూ ఉంటాయి.

ఫౌండేషన్‌ స్పీసిస్‌: ఈ జాతి జీవులు ఉత్పత్తిదారులుగా ఎక్కువ సంఖ్యలో ఉండి, ఆవరణ వ్యవస్థను అధికంగా ప్రభావితం చేస్తాయి.

బయో టెర్రరిజం: ఉద్దేశపూర్వకంగా హానికరమైన సూక్ష్మజీవులను ఒక దేశంలో లేదా ప్రదేశంలో ప్రవేశపెట్టడాన్ని బయో టెర్రరిజం అంటారు. 

కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌: ఒక వ్యక్తి లేదా కంపెనీ లేదా వ్యవస్థ ఉత్పత్తి చేసే మొత్తం గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌లను, కార్బన్‌ డైఆక్సైడ్‌ను టన్నుల రూపంలో లెక్కిస్తారు.

కార్బన్‌ క్రెడిట్‌: ఇది ఒక మెట్రిక్‌ టన్ను కార్బన్‌ డైఆక్సైడ్‌కి సమానం. 

* జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను తగ్గించడానికి కార్బన్‌ క్రెడిట్‌లను వాడతారు. 

* కార్బన్‌ క్రెడిట్‌లను కార్బన్‌ ట్రేడింగ్‌ పద్ధతిలో విరివిగా ఉపయోగిస్తారు.

జీవ వైవిధ్యం: భూమండలంపై అనేక రకాల జీవులు జీవిస్తాయి (భూమిపై నివసించేవి, జలచరాలు). ఇవి వాటి ఆవరణ వ్యవస్థకు తగ్గట్లు వివిధ వనరులను వాటికి అనుగుణంగా ఉపయోగించుకుంటాయి. ఆయా జాతులు కనబరిచే వైవిధ్యాన్ని జీవ వైవిధ్యంగా పేర్కొంటారు.

ఫొటోసింథటిక్‌ యాక్టివ్‌ రేడియేషన్‌ (పీఏఆర్‌): భూమిపై ఉన్న మొక్కలు కిరణజన్యసంయోగక్రియకు ఉపయోగించుకునే సౌరశక్తిని పీఏఆర్‌గా పేర్కొంటారు. ఇది 400nm - 700nm వరకు ఉంటుంది.

ఆమ్ల వర్షాలు (Acid rains) : కొన్ని హానికర ఆమ్లాలు వాయు రూపంలో పైకి వెళ్లి మేఘాలుగా ఏర్పడి, తిరిగి వర్షం రూపంలో భూమిపై పడటాన్ని ఆమ్ల వర్షాలు అంటారు. 

* సాధారణంగా ఆమ్ల వర్షాల ద్వారా సల్ఫ్యూరిక్‌ ఆమ్లం, నత్రికామ్లం, కార్బోనిక్‌ ఆమ్లం మొదలైనవి భూ ఉపరితలం, సముద్రాలలోకి చేరతాయి. 

* సాధారణ సముద్ర నీటి pH విలువ 8గా ఉంటుంది. ఈ వర్షాలు ఎక్కువగా కురిస్తే, pH విలువలో హెచ్చు తగ్గులు వస్తాయి.pH విలువ 8 కంటే తగ్గితే, సముద్ర ఆమ్లీకరణగా పేర్కొంటారు.

మైకోరెమిడియేషన్‌: శిలీంద్రాలు లేదా ఫంగై జీవులను ఉపయోగించి, అత్యంత కాలుష్య ప్రదేశాలను శుభ్రపరచడాన్ని మైకోరెమెడియేషన్‌ అంటారు.

వర్మీకల్చర్‌: వానపాముల పెంపకాన్ని వర్మీకల్చర్‌ అంటారు. ఇవి భూసారాన్ని పెంచే ఎరువుగా ఉపయోగపడతాయి.

కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (సీఓడీ): దీని ద్వారా నీటిలో ఉన్న కాలుష్య భారాన్ని లెక్కిస్తారు. ఈ ప్రక్రియలో బయోడీగ్రేడబుల్, నాన్‌ బయోడీగ్రేడబుల్‌ వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడానికి అవసరమైన ఆక్సిజన్‌ సమతౌల్యంగా  (oxygen equivalent) దీన్ని భావిస్తారు. 

ట్రాన్స్‌ ఫాట్స్‌: నూనెలకు హైడ్రోజన్‌ అణువులను కలపటం ద్వారా ఈ రకమైన కొవ్వు పదార్థాలు ఏర్పడతాయి.

*నూనెలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి, నూనెల తయారీ సమయంలో మురికి లేకుండా ఉంచేందుకు ట్రాన్స్‌ ఫాట్స్‌ని ఉపయోగిస్తారు. 

* ఈ పదార్థాలు ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు (డయాబెటిస్, హృద్రోగ సమస్యలు, క్యాన్సర్లు) కారణమవుతాయి. 

*ట్రాన్స్‌ ఫాట్స్‌ జంక్‌ ఫుడ్‌లోనూ అధికంగా ఉంటాయి.

* భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2008లో ప్రమాదకరమైన ట్రాన్స్‌ ఫాట్స్‌ నిరోధానికి కావాల్సిన చర్యలు ప్రారంభించింది. 


Montreux record: దీన్ని 1996 బ్రిస్బేన్‌ (ఆస్ట్రేలియా)లో ఆమోదించారు. 

* అంతర్జాతీయంగా రామ్‌సర్‌ కన్వెన్షన్‌ ఆధారంగా వెట్‌ల్యాండ్స్‌ను గుర్తించేందుకు మాన్‌ట్రిక్స్‌ రికార్డ్‌ను ఉపయోగిస్తారు. 

* మానవులు, కాలుష్యం వల్ల ఆయా ప్రాంతాల్లో దెబ్బ తిన్న ఆవరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం ఈ సమాచారం ఉపయోగపడుతుంది. 


విండ్‌ ఫామ్స్‌: పవన శక్తిని గతి శక్తిగా మార్చి, విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పవన టర్బైన్లు ఉన్న ప్రాంతాలను విండ్‌ ఫామ్స్‌గా పిలుస్తారు. 


నియోనికోటినాయిడ్స్‌ (Neonicotinoids): నికోటిన్‌ కలిగిన క్రిమిసంహారక మందులను నియోనికోటినాయిడ్స్‌ అంటారు. వీటిని సాధారణ పరిభాషలో new nicotine - like insecticides అంటారు. 

*ఈ రసాయనాలు అకశేరుకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. 


ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ (ఈఐఏ): ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు లేదా ప్రాజెక్టులు, కర్మాగారాలు నెలకొల్పే ముందు వాటి ప్రభావం పర్యావరణంపై ఏ విధంగా ఉంటుందని అంచనా వేయడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు.

* ప్రభుత్వ యంత్రాంగం ఈ రిపోర్టు ద్వారానే ఆయా ప్రాజెక్టులకు కావాల్సిన అనుమతులను మంజూరు చేస్తుంది. 

* పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986కి అనుగుణంగా ఈఐఏను అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో సమర్పించాలని 1994 నోటిఫికేషన్‌ ద్వారా భారత ప్రభుత్వం తెలిపింది.


కోరల్‌ బ్లీచింగ్‌: సముద్రాల్లో ఉష్ణోగ్రతల మార్పుల వల్ల పగడపు దిబ్బల రంగు మారుతుంది. దీన్నే కోరల్‌ బ్లీచింగ్‌ అంటారు. 

* దీనికి ముఖ్య కారణం గ్రీన్‌హౌస్‌ వాయువుల ప్రభావం.

*సాధారణంగా ఇది పగడపు జీవుల్లో ఉండే Zooxanthellae అనే సింబయాటిక్‌ ఆల్గే ఫొటోసింథటిక్‌ పిగ్మెంట్‌లను కోల్పోవటం వల్ల జరుగుతుంది.


ఫొటోట్రోఫ్స్‌: సాధారణంగా ఈ రకమైన జీవులు (మొక్కలు) సూర్యరశ్మి, కార్బన్‌ డైఆక్సైడ్, నీటిని ఉపయోగించుకుని కిరణజన్యసంయోగక్రియ ద్వారా కర్బన పదార్థాలను తయారుచేసుకుంటాయి. దీనిద్వారా ఉత్పన్నమయ్యే శక్తిని ఇతర జీవక్రియలకు, శ్వాసక్రియకు ఉపయోగించుకుంటాయి.


ఆవాస విధ్వంసం(Habitat destruction): ఒక సహజ ఆవాసంలోని జీవులు అనుకూల వాతావరణాన్ని పొందలేకపోతే, అవి ఆ ప్రాంతం నుంచి స్థానచలనం చెందుతాయి లేదా అక్కడే ఉండి అంతరించిపోతాయి. ఆ ప్రదేశంలో జీవవైవిధ్య సమతౌల్యత కూడా లోపిస్తుంది.


ఒలిగోట్రోఫిక్‌ లేక్‌: అత్యంత పారదర్శకమైన నీటిని కలిగిఉన్న సరస్సులను ఒలిగోట్రోఫిక్‌ లేక్స్‌ అంటారు. ఈ సరస్సుల్లో పోషకాలు అతి తక్కువగా ఉంటాయి. దీంతో శైవలాలు కూడా అతి తక్కువగా ఉండి, ఆ నీరు తాగడానికి ఉపయోగపడతాయి.


కీస్టోన్‌ స్పీసిస్‌: ఈ జాతి జీవులు అధిక సంఖ్యలో ఆవరణ వ్యవస్థలో ఉండటం లేదా పూర్తిగా నశించడం వల్ల మొత్తం ఆవరణ వ్యవస్థ క్రమంగా అంతరించి పోవడం లేదా కొత్త ఆవరణ వ్యవస్థతో స్థానభ్రంశం చెందడం జరుగుతుంది. ఈ జీవులపైనే ఆయా ఆవరణ వ్యవస్థల ఉనికి ఆధారపడి ఉంటుంది.


బయో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌: నీటి ఆవరణ వ్యవస్థలో ఉన్న బ్యాక్టీరియా లేదా సూక్ష్మజీవులు కర్బన పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ని ఉపయోగించుకుంటాయి. దీన్నే బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ) అంటారు. సాధారణంగా జల కాలుష్యాన్ని బీఓడీ రూపంలో లెక్కిస్తారు. దీని ద్వారా బయోడీగ్రేడబుల్‌ వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడిన ఆక్సిజన్‌ శాతాన్ని లెక్కిస్తారు. ఈ ఆక్సిజన్‌ కర్బన పదార్థాల విచ్ఛిన్నానికి ఉపయోగపడుతుంది. దీన్ని నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట సమయానికి అనుగుణంగా లెక్కిస్తారు.


బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌: బీచ్‌ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు డెన్మార్క్‌కి చెందిన ఫౌండేషన్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ ఈ అవార్డును అందిస్తోంది. బీచ్, తీర ప్రాంతాల్లో నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, పర్యావరణ విద్య, భద్రత మొదలైన అంశాలను ఇందులో పరిగణనలోకి తీసుకుంటారు.


బెంతోస్‌ (Benthos): సముద్రంలోని అత్యంత అడుగుభాగంలో లేదా సరస్సు అడుగు భాగాల్లో నివసిస్తున్న మొక్కలను, జంతువులను బెంతోస్‌ అంటారు. వీటినే బెంతిక్‌ కమ్యూనిటీస్‌ అని పేర్కొంటారు.

* బెంతోస్‌ అనేది గ్రీకు భాషా పదం. దీని అర్థం అత్యంత అడుగు భాగం.


రెడ్‌ టైడ్‌: అనుకూల వాతావరణంలో శైవలాలు విపరీతంగా పెరిగి, అవి ఉన్న సముద్ర ప్రాంతంలో నీటి రంగు మార్పునకు కారణమవుతాయి.దీన్నే రెడ్‌ టైడ్‌ అటారు. సాధారణంగా ఆల్గే జాతికి చెందిన జీవులు ఎరుపు లేదా బ్రౌన్‌ రంగులో ఉంటాయి


Four R’s:


వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి 4R’s ప్రణాళికను రూపొందించారు. అవి:


* 1.  Refuse

మార్కెట్లో లభించే కొత్త ప్లాస్టిక్‌ వస్తువులను కొనకుండా తిరస్కరించడం. వాటి స్థానంలో జ్యూట్‌ బ్యాగ్స్, చేతి సంచులను వాడటం.


* 2. Reuse

మనం ఉపయోగించిన డబ్బాలు, సీసాలను వ్యర్థాలుగా పారేయకుండా, వాటిని వివిధ కార్యకలాపాలకు ఉపయోగించడం.


* 3. Recycle

అవసరం లేని వస్తువులను రీసైకిల్‌ చేసి, వివిధ రకాల బ్యాగులు, ఇతర ఉపయోగ కారకాలుగా మార్చడం.


* 4.  Reduce

అధిక మొత్తంలో ఉత్పన్నమయ్యే వ్యర్థాలను నివారించడం దీని ఉద్దేశం. అంటే, వస్తువులు కొనుగోలు చేసినప్పుడు సొంత చేతి సంచులను వినియోగించడం వల్ల ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని తగ్గించవచ్చు. 

Posted Date : 13-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌