• facebook
  • whatsapp
  • telegram

వృక్షశరీర ధర్మశాస్త్రం

* ఎక్కువ భాగం నీరు పత్రరంధ్రాల ద్వారా బయటికి పోతుంది. ఈ విధంగా మొక్క ఉపరితల భాగాల నుంచి ఆవిరి రూపంలో నీటిని కోల్పోయే ప్రక్రియను బాష్పోత్సేకం అంటారు. (లేదా) మొక్కల వాయుగత భాగాల్లోని సజీవ కణజాలాల నుంచి నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళ్లే ప్రక్రియను బాష్పోత్సేకం అంటారు.

ద్రవోద్గమం

బాష్పోత్సేకం వల్ల పనిచేసే ద్రవోద్గమం (నీరు, లవణాల ఊర్థ్వ స్థాన చలనం) ముఖ్యంగా కింద పేర్కొన్న నీటి భౌతిక ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. అవి:

1. సంసంజన బలం: నీటి అణువుల మధ్య ఉన్న పరస్పర ఆకర్షణ.

2. అసంజన బలం: ధృవ ఉపరితలాలకు, నీటి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణ బలం; దారు కణాల ఉపరితలం లాంటివి ఈ ఆకర్షణ బలాన్ని చూపిస్తాయి.

3. బాష్పోత్సేకకర్షణ బలం: నీటిని పైకి తోయగల తోపుడుబలం. 

* ఈ ధర్మాలు నీటికి అధిక తన్యతా బలాన్ని, అంటే కర్షణ బలాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని; అధిక కేశక బలాన్ని, అంటే సన్నటి కేశికలో ఉద్గమించే సామర్థ్యాన్ని కల్పిస్తాయి.

* మొక్కల్లో దారు మూలకాలు (దారు కణాలు, దారు మూలకాలు) అతి సన్నటి అవికాశికలను కలిగి ఉంటాయి. ఇవి కేశ నాళికల్లా పనిచేసి, నీటిని కేశిక బలంతో లాగుతాయి.

బాష్పోత్సేకం జరిగే పద్ధతి

* బాష్పోత్సేకం ప్రధానంగా పత్రరంధాలు, అవభాసిని, వాయు రంధ్రాల ద్వారా జరుగుతుంది.  

* పత్రరంధ్ర బాష్పోత్సేకం అధికంగా; అవభాసిని, వాయు రంధ్ర బాష్పోత్సేకం చాలా తక్కువగా జరుగుతాయి.

* చాలా మొక్కల్లో పత్రరంధ్రాలు ‘ఫోటోయాక్టివ్‌’ రకానికి చెందినవే. ఇవి పగలు తెరుచుకుని, రాత్రి పూట మూసుకుని ఉంటాయి. కానీ రసభరిత మొక్కల్లో పగటి పూట పత్రరంధ్రాలు మూసుకొని, రాత్రి సమయంలో తెరుచుకుంటాయి. ఇలాంటి పత్రరంధ్రాలను ‘స్కోటోయాక్టివ్‌’ అంటారు.

* బాష్పోత్సేకంతో పాటు ఆక్సిజన్, కార్బన్‌ డైఆక్సైడ్‌ వాయువుల వినిమయం కూడా పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది.

* సాధారణంగా పృష్టోదర పత్రం అధోతలంపై పత్రరంధ్రాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇవి సమద్విపార్శ్వ పత్రంలోని రెండు తలాలపై దాదాపు సమానంగా ఉంటాయి.

* పృష్టోదర పత్రం ద్విదళ బీజ మొక్కల్లో కనిపిస్తుంది. అంతర్నిర్మాణశాస్త్ర పరంగా సమద్విపార్శ్వ పత్రాన్ని చూపించే మొక్కలు ఏకదళబీజ మొక్కలు.

ప్రభావితం చేసే అంశాలు:

* బాష్పోత్సేకాన్ని అనేక బాహ్యకారకాలు ప్రభావితం చేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి ఉష్ణోగ్రత, సూర్యకాంతి, వాతావరణంలో తేమ, గాలి వేగం. 

* పత్రరంధ్రాల సంఖ్య, పత్రరంధ్ర విస్తరణ, మొక్కల్లోని నీటి స్థాయి, లభ్యంగా ఉన్న మృత్తిక జలం, వేరు - కాండం నిష్పత్తి మొదలైనవి అంతర కారకాలుగా మొక్కలు బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేస్తాయి.

ప్రయోజనాలు:

మొక్కలకు బాష్పోత్సేకం ఒక ప్రాధాన్యత కలిగిన జీవక్రియ. ఇది కింది ప్రయోజనాలను చేకూరుస్తుంది.

* శోషణకు, రవాణాకు కావాల్సిన బాష్పోత్సేకకర్షణను సృష్టిస్తుంది.

* కిరణజన్యసంయోగక్రియకు కావాల్సిన నీటిని సరఫరా చేస్తుంది.

* నేల నుంచి మొక్క భాగాలకు ఖనిజాలను రవాణా చేస్తుంది.

* బాష్పీభవన శీతలీకరణ ద్వారా పత్ర ఉపరితలాన్ని కొన్ని సందర్భాల్లో 10 - 15oC వరకూ ఉష్ణోగ్రతను తగ్గించి చల్లబరుస్తుంది.

* కణానికి స్ఫీతస్థితిని అందించడం ద్వారా ఆకారాన్ని, నిర్మాణాన్ని కలిగిస్తుంది.

* బాష్పోత్సేకం వల్ల మొక్క వేగంగా నీటిని కోల్పోయి, వడిలిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ ఆ చర్య మొక్కలకు కలిగించే ప్రయోజనాల దృష్ట్యా దాన్ని ‘ఆవశ్యకమైన అనర్థం’ అని అభివర్ణిస్తారు.

పత్రరంధ్ర సంక్లిష్టం - రక్షక కణాలు

* పత్రరంధ్ర సంక్లిష్టం పత్రరంధ్ర బాష్పోత్సేకానికి ప్రధాన మార్గం. పత్రరంధ్రం, దాన్ని ఆవరించి ఉండే రెండు రక్షక కణాలు, వాటిని ఆవరించి ఉండే అనుబంధక కణాలు అన్నీ కలిసి పత్రరంధ్ర సంక్లిష్టాన్ని ఏర్పరుస్తాయి.

* రక్షక కణాలు ద్విదళబీజ మొక్కల్లో చిక్కుడు గింజ ఆకారంలో కనిపిస్తాయి. అవే ఏకదళబీజ మొక్కల్లో డంబెల్‌ (ముద్గరం) ఆకారంలో ఉంటాయి. వీటిలో పత్రహరితం ఉంటుంది. వీటిని ఆవరించి ఉండే అనుబంధక కణాలు ఈ లక్షణాల్లో వీటితో విభేదిస్తాయి.

* రక్షక కణాల్లో కలిగే స్ఫీత మార్పులు పత్రరంధ్రాల కదలికకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. రక్షక కణాల లోపలి గోడలు దళసరిగా, స్థితిస్థాపకతను ప్రదర్శిస్తూ ఉంటాయి. 

* పత్రరంధ్రం రెండువైపులా ఉన్న రక్షక కణాల్లో స్ఫీతస్థితి పెరిగితే, లోపల పలుచగా ఉండే గోడలు ఉబ్బి, అర్ధచంద్రాకారంగా వంగుతాయి.

* రక్షక కణ కవచాల్లోని సూక్ష్మ తంతువుల అమరిక కూడా పత్రరంధ్రం తెరుచుకోవడానికి దోహదపడుతుంది.

* సెల్యులోజ్‌ సూక్ష్మతంతువులు కవచంలో నిలువుగా కాకుండా వ్యాసార్ధపు అమరికను ప్రదర్శించి, పత్రరంధ్రం సులభంగా తెరుచుకునేలా తోడ్పడతాయి.

* రక్షక కణాలు నీటిని కోల్పోయినప్పుడు లేదా నీటి కొరత ఏర్పడినప్పుడు లోపల ఉండే స్థితిస్థాపక కవచాలు తమ అసలు ఆకారాన్ని తిరిగి సంతరించుకుంటాయి. ఈ స్థితిలో రక్షక కణాలు శ్లథస్థితికి చేరి మూసుకుపోతాయి.

ఇతర ముఖ్యాంశాలు

* మొక్కల్లో కర్బన పదార్థాల స్థానాంతరణ పోషక కణజాలం (ఫ్లోయమ్‌) ద్వారా జరుగుతుంది. మొక్కల పత్రాలు ఉత్పత్తి స్థానాలుగా, ఇతర భాగాలైన వేరు, పుష్పాలు లాంటివి వినియోగ స్థానాలుగా వ్యవహరించి ఈ స్థానాంతరణలో పాల్గొంటాయి.

* ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రాలకు చక్కెరల స్థానాంతరణను వివరించే ఆమోదయోగ్యమైన యాంత్రికా విధానంగా పీడన ప్రవాహ పరికల్పనను పేర్కొంటారు. దీన్ని ముంచ్‌ రూపొందించాడు.

* కర్బన పదార్థాలు పోషక కణజాల రసంలో భాగంగా స్థానాంతరణను ప్రదర్శిస్తాయి. పోషక కణజాలరసంలో ముఖ్యంగా నీరు, సుక్రోజ్, ఇతర చక్కెరలు, హార్మోన్‌లు, అమైనో ఆమ్లాల స్థానాంతరణ జరుగుతుంది.

* పోషక కణజాలంలో ఆహారపదార్థాల రవాణా లేదా కర్బన పదార్థాల స్థానాంతరణ ద్విదిశా గమనంలో జరుగుతుంది.

* మొక్కలకు అవసరమైన నీరు - లవణాలు నీటిశక్మ ప్రవణత ఆధారంగా దారునాళాల ద్వారా చలిస్తూ ఉంటాయి.

* చలన స్థితిలో నీరు ప్రవేశించడం వల్ల దారు కణజాలంలో ఒక రకమైన పీడనం వృద్ధి చెందుతుంది. ఈ ధనాత్మక పీడనాన్ని వేరుపీడనం అంటారు. ఇది కాండంలో నీటిని పైకి రవాణా చేయడంలో సహకరిస్తుంది.

* వేరుపీడనం నీటిని తక్కువ ఎత్తుకు మాత్రమే రవాణా చేయగలదు. ఎత్తయిన వృక్షాల్లో నీటి స్థానాంతరణకు వేరుపీడనం సరిపోదు.

* బాష్పోత్సేకం వల్ల నీటి అవిచ్ఛిన్న గొలుసుపై తన్యతా బలం ఏర్పడుతుంది. దీంతో నీటి స్తంభం పెరగకుండా ఉండేందుకు వేరు పీడనం ఉపయోగపడుతుంది.

* పెద్దపెద్ద వృక్షాల్లో నీటి స్థానాంతరణ బాష్పోత్సేకకర్షణ ్బగి౯్చ-(్పi౯్చ్మi్న-్చః ్ప్యఃః్శపై ఆధారపడి ఉంటుంది. 

* పత్రాల్లోకి ప్రవేశించిన నీటిలో సుమారు ఒక శాతం కంటే తక్కువ నీరు మాత్రమే మొక్క పెరుగుదలకు, కిరణజన్యసంయోగక్రియకు ఉపయోగపడుతుంది.

మొక్కల్లో నీటి రవాణా

* కిరణజన్య సంయోగక్రియకు నీరు ఆవశ్యకం. దారునాళాల వ్యవస్థ వేరు నుంచి పత్రాల్లోని ఈనెలకు కావాల్సిన నీటిని సరఫరా చేస్తుంది. 

* పత్రరంధ్రాల నుంచి నీరు ఆవిరి అవుతున్న కొద్దీ కణాలపై పలచటి నీటిపొర అవిచ్ఛిన్నంగా ఏర్పడుతుంది. దీనివల్ల నీటి అణువులు ఒకదాని వెంట మరొకటి ఆకర్షితమై, నీటి స్తంభం దారువు నుంచి పత్రంలోకి వెళ్తాయి.

* ఉపపత్ర రంధ్ర కుహరంలో కణాంతర అవకాశాల్లో కంటే, బయట వాతావరణంలో నీటి ఆవిరి తక్కువగా ఉంటుంది. దీనివల్ల నీరు పరిసరాల్లోకి విడుదలవుతుంది. దీంతో బాష్పోత్సేకకర్షణ ఏర్పడుతుంది.

* బాష్పోత్సేకం వల్ల ఏర్పడిన బలం దారువులో నీటి స్తంభాన్ని 130 మీటర్ల ఎత్తుకు రవాణా చేసేందుకు కావాల్సిన పీడనాన్ని కల్పించగలదు.

* మృత్తిక నుంచి నీరు వేరు ద్వారా మొక్క దేహంలోకి ప్రవేశించి, ప్రకాండ వ్యవస్థ నుంచి వాతావరణంలోకి ప్రయాణించి, చివరకు వర్షం రూపంలో తిరిగి మృత్తికను చేరుతుంది. దీన్నే మృత్తిక - మొక్క - వాతావరణం - సాంతత్యకం అంటారు. (SPAC - Soil, Plant, Atmospheric, Continum) .


K+  పంపు సిద్ధాంతం 

* K+ పంపు సిద్ధాంతాన్ని మైఖేల్‌ లెవిట్‌ ప్రతిపాదించారు. పత్రరంధ్రాలు జరిపే ఫోటోయాక్టివ్‌ (కాంతిప్రేరేపక) చలన యాంత్రికం ఆధారంగా ఈయన ఈ ప్రతిపాదన చేశారు.

* K+ పంపు సిద్ధాంతం ప్రకారం పగటి సమయాల్లో K+, Cl- అయాన్లు రక్షక కణాల్లోకి ప్రవేశిస్తాయి. దీంతో నీటిశక్మం తగ్గి,  నీరు విసరణ చెంది, స్ఫీతస్థితి కలుగుతుంది. ఈ విధంగా పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి. 

* రాత్రి సమయాల్లో K+, Cl- అయాన్లు రక్షక కణాల నుంచి బయటకు వెళ్తాయి. దీంతో నీటిశక్మం పెరిగి, నీరు వెలుపలికి పోతుంది. ఫలితంగా పత్రరంధ్రాలు మూసుకుంటాయి.

* నీటి కొరత ఏర్పడిన సందర్భాల్లో అబ్‌సైసిక్‌ ఆమ్లం (ABA) అనే సహజ బాష్పోత్సేక నిరోధకం రక్షక కణాల నుంచి K+ అయాన్‌లను బయటికి పంపిస్తుంది. దీంతో రక్షక కణాలు ముడుచుకుని, పత్రరంధ్రం మూసుకుంటుంది.

* రసభరిత మొక్కల్లో కర్బనిక ఆమ్లాలు రాత్రి సమయంలో రక్షక కణాల్లోకి చేరతాయి. ఈ కారణంగా నీటి శక్మం ప్రవణత ఏర్పడి అవి స్ఫీతస్థితికి చేరతాయి. దీంతో ఆ మొక్కల్లో రాత్రివేళలో పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి.

మాదిరి ప్రశ్నలు

1. మొక్కల కణాల్లో ప్లాస్మాత్వచం కణకుడ్యంలో లగ్నం చెందినట్లు కనిపించే స్థితిని ఏమంటారు?

1) స్ఫీతస్థితి      2) శ్లథస్థితి 

3) ప్లాస్మాలిసిస్‌     4) ఆస్మోలైసిస్‌

2. ‘ఆవశ్యకమైన అనర్థంగా’ పేర్కొనే శరీర ధర్మ ప్రక్రియ ఏది?

1) నిపానం     2) విత్తన అంకురణ

3)  కిరణజన్యసంయోగక్రియ 

4)  బాష్పోత్సేకం

3. మైఖేల్‌ లెవిట్‌ ప్రతిపాదించిన ర్ఘీ పంపు సిద్ధాంతం మొక్కలకు సంబంధించిన ఏ క్రియను వివరిస్తుంది?

1) కిరణజన్యసంయోగక్రియ 

2) పత్రరంధ్ర చలన యాంత్రికం 

3) కణ శ్వాసక్రియ 

4) కణద్రవ్య సంకోచం 

4. సహజ బాష్పోత్సేక నిరోధకంగా పేర్కొన్న ఫైటోహార్మోన్‌ ....

1) ఆక్సిన్‌లు      2) సైటోకైనిన్‌లు

3) అబ్‌సైసిక్‌ ఆమ్లం 

4) బ్రాసినో స్టిరాయిడ్‌లు

5. గుల్మయుత మొక్కలు, గడ్డిజాతి మొక్కల్లో పత్రాలకొన ఈనెల వద్ద ఉండే ప్రత్యేక సూక్ష్మరంధ్రాల నుంచి నీటి బిందువులు వాతావరణంలోకి విడుదలయ్యే చర్యను ఏమంటారు?

1) బాష్పోత్సేకం     2) బిందుస్రావం

3) సంజనత్వం     4) రసస్రావం

6.  వేరుపీడనం ఎల్లప్పుడూ ......

1) ధనాత్మకం      2) రుణాత్మకం 

3) శూన్యం      4) ఒకటి

సమాధానాలు

1 - 1    2 - 4    3 - 2    4 - 3    5 - 2    6 - 1

Posted Date : 25-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌