• facebook
  • whatsapp
  • telegram

మొక్కల వృద్ధి నియంత్రకాలు

మొక్కల హార్మోన్లు - రకాలు

చర్య ఆధారంగా మొక్కల హార్మోన్లను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:

1. మొక్కల పెరుగుదల ప్రమోటర్లు లేదా ప్రేరేపకాలు

2. మొక్కల పెరుగుదల నిరోధకాలు


ప్రేరేపకాలు


ఆక్సిన్‌ హార్మోన్‌:

* ఆక్సిన్‌ అంటే ‘పెరగడం’ అని అర్థం. వీటిని వ్యవసాయ, ఉద్యానవన పద్ధతుల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇవి వేర్లు, కాండం పెరుగుతున్న అగ్రభాగాల్లో కనిపిస్తాయి. తర్వాత ఇతర భాగాలకూ రవాణా అవుతాయి.

డచ్‌కి చెందిన ఫ్రిట్స్‌ వార్మోల్డ్‌ వెంట్‌ అనే శాస్త్రవేత్త అవెనా వక్రత పరీక్ష ద్వారా మొదటిసారి ఈ హార్మోన్‌ను కనుక్కున్నారు.

* అత్యంత సాధారణంగా, సహజంగా లభించే ఆక్సిన్‌ IAA (ఇండోల్‌-3-ఎసిటిక్‌ యాసిడ్‌). ఇది సంశ్లేషణ చెందిన అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్‌ను పోలి ఉంటుంది.


* సహజ ఆక్సిన్లు: IAA, ఇండోల్‌ బ్యూట్రిక్‌ యాసిడ్‌ (IBA)..


*సింథటిక్‌ ఆక్సిన్లు: 2, 4-D (2, 4-డైక్లోరోఫినాక్సిఎసిటిక్‌ యాసిడ్‌), NAA (నాఫ్తలీన్‌ ఎసిటిక్‌ యాసిడ్‌).


విధులు:

* కాండం, వేరు భాగాల కణాలు పొడుగ్గా కావడానికి దోహదం చేస్తుంది.

*అగ్రాధిక్యత లేదా ఎపికల్‌ డామినెన్స్‌కు ఇదే కారణం. అంటే అగ్రకణాల్లో లేదా ఎపికల్‌ బడ్‌లోని IAA పార్శ్వ మొగ్గల పెరుగుదలను అణచివేస్తుంది.

ఫొటోట్రోపిజం (కోలియోప్టైల్స్‌ కాంతి వైపు వంగడం), జియోట్రోపిజం (గురుత్వాకర్షణకు ప్రతిస్పందనగా పెరుగుదల)ను నియంత్రిస్తుంది.

* పార్థినోకార్పిని లేదా అనిషేక ఫలాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అంటే ఫలదీకరణం లేకుండా పండు అభివృద్ధి చెందుతుంది. 

ఉదా: టమాటా.

* ఆకులు, పువ్వులు, ఫలాల అకాల పతనాన్ని నిరోధిస్తుంది.

* వేర్లు పెరిగే చోట కాండం కోతలు (స్టెమ్‌కటింగ్స్‌), అంటుకట్టడంలో ఉపయోగపడుతుంది.

* పార్శ్వ మూలాలు, అబ్బురపు వేర్లఏర్పాటును ప్రోత్సహిస్తుంది.

* పైనాపిల్‌ మొక్కలు పుష్పించేలా చేస్తుంది.

* 2, 4-D ని ఏకదళ బీజ మొక్కలను ప్రభావితం చేయకుండా, ద్విదళ బీజ మొక్కల అవాంఛనీయ కలుపు మొక్కలను చంపడానికి హెర్బిసైడ్‌గా ఉపయోగిస్తారు.

* కణ విభజన, దారు కణాల విభేదనంలో సహాయపడుతుంది.

జిబ్బరెల్లిన్స్‌ హార్మోన్‌: 100 కంటే ఎక్కువ జిబ్బరెల్లిన్లు (GA1, GA2, GA3.....) ఉంటాయి.

* ఇవి ఆమ్ల స్వభావం కలిగి, ఎత్తయిన మొక్కలు, శిలీంద్రాల్లో కనిపిస్తాయి.

* జిబ్బరెల్లిన్లను మొదటిసారి జిబ్బరెల్లా ఫుజికురోయ్‌ నుంచి వేరు చేశారు. ఇది Ascomycetes ఫంగస్‌. ఇది వరిలో ‘బకానే’ లేదా ‘మూర్ఖపు’ లేదా ‘తెలివి తక్కువ మొలక’ అనే వ్యాధికి కారణమవుతుంది.

* జిబ్బరెల్లిన్లు విత్తనాలు, కొమ్మల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇక్కడ అవి కణ విభజన, పొడవును ప్రేరేపించి కాండం పొడవును నియంత్రిస్తాయి.

* జిబ్బరెల్లిన్లు గ్జైలం లేదా దారువు, ఫ్లోయమ్‌ లేదా పోషక కణజాలాల ద్వారా వివిధ భాగాలకు చేరతాయి.


విధులు:

* క్యాబేజీ, దుంప లాంటి రోసెట్టే మొక్కల్లో పుష్పించే ముందు బోల్టింగ్‌ను ప్రోత్సహిస్తుంది.

* మొక్కల్లో వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది.

* మొక్కల్లో పార్థినోకార్పిని ప్రేరేపిస్తుంది.

* కాండం పొడుగ్గా లేదా మరుగుజ్జు రూపంలో ఉండేలా చేస్తుంది.

* గంజాయి లాంటి కొన్ని మొక్కల్లో పురుషత్వాన్ని ప్రేరేపిస్తుంది.

* తృణధాన్యాలు, బార్లీ గింజలు మొలకెత్తే సమయంలో ఎండోస్పెర్మ్‌లో లిపేస్, అమైలేస్‌ లాంటి హైడ్రోలైటిక్‌ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

* వాణిజ్యపరంగా GA3 విత్తన రహిత ద్రాక్షలో కొమ్మ పొడవును పెంచడానికి ఉపయోగపడుతుంది. ద్రాక్ష పెద్దగా అయ్యేందుకు సహకరిస్తుంది. ఇది సిట్రస్‌ మొక్కల సెన్సెన్స్‌ను ఆలస్యం చేస్తుంది. చెరకు మొక్కలు ఎత్తుగా పెరిగేలా సహాయపడుతుంది.

* విత్తనాల నిద్రాణస్థితిని విచ్ఛిన్నం చేస్తుంది.


సైటోకైనిన్స్‌: ఇవి సహజంగా లభించే వృద్ధి ప్రమోటర్లు. ఇవి ఆక్సిన్‌తో కలిసి మొక్కల్లో కణ విభజన, భేదాన్ని ప్రోత్సహిస్తాయి.

* రసాయనికంగా సైటోకైనిన్లు అడెనిన్‌ మాదిరిగా ప్యూరిన్‌ ఉత్పన్నాలు. అన్ని మొక్కల్లో సహజంగా లభించే సైటోకైనిన్లలో జియాటిన్‌ (ట్రాన్స్‌-6-ప్యూరిన్‌) ఎక్కువగా ఉంటుంది. అయితే డైహైడ్రోజియాటిన్, ఐసోపెంటెనిల్‌ అడెనిన్‌ కూడా సాధారణంగా మొక్కలు, బ్యాక్టీరియాలో కనిపిస్తాయి.

* కణద్రవ్య విభజన లేదా సైటోకైనిసిస్‌ ప్రక్రియలో సైటోకైనిన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

* వేగంగా కణ విభజన జరిగే మొక్కల్లో సైటోకైనిన్లు సహజంగా సంశ్లేషణ చెందుతాయి. 

ఉదా: రూట్‌ ఎపిసెస్, షూట్‌ మొగ్గలు.

* సైటోకైనిన్ల కదలిక ఆధారభిసార క్రమంలో, ధ్రువం దిశగా ఉంటుంది.

* సహజ సైటోకైనిన్స్‌: జీటిన్‌ (మొక్కజొన్న గింజలు, కొబ్బరి పాలు), ఐసోపెంటెనిలాడెనిన్‌.

* సింథటిక్‌ సైటోకైనిన్స్‌: కైనెటిన్, బెంజిలాడెనిన్, డైఫెనిలురియా.


విధులు:

* ఇది పార్శ్వ, సాహసోపేతమైన రెమ్మల పెరుగుదలను ప్రోత్సహిసుంది.  

* ఆక్సిన్‌లతో ప్రేరేపితమైన ఎపికల్‌ ఆధిపత్యాన్ని అధిగమించడంలో ఇది సహాయపడుతుంది.

* ఆకుల్లో క్లోరోప్లాస్ట్‌ ఏర్పడటాన్ని ప్రేరేపించి, క్లోరోప్లాస్ట్‌ పరిపక్వతను ప్రోత్సహిస్తుంది.

* మొక్క ఇతర భాగాల నుంచి ఆకులకు పోషకాలు అందేలా చేస్తుంది.

* పత్రాల వృద్ధాప్యాన్ని, జీర్ణతను ఆలస్యం చేస్తుంది.

* కణజాల వర్ధనంలో కాండం, వేరు భాగాల స్వరూప జననాన్ని నియంత్రిస్తుంది.


మొక్కల పెరుగుదల నిరోధకాలు

అబ్సిసిక్‌ యాసిడ్‌ (ABA):

* ఇది పెరుగుదలను నిరోధించే హార్మోన్‌.  బితి లకు విరోధిగా పనిచేస్తుంది.

* ఇది మొక్కల జీవక్రియను, అబ్సిషన్, నిద్రాణస్థితిని నియంత్రిస్తుంది.

* ఇది మొక్కల ప్రతిబల సహనాన్ని పెంచుతుంది. అందుకే దీన్ని ‘స్ట్రెస్‌ హార్మోన్‌’ లేదా ‘ప్రతిబల హార్మోన్‌’ అంటారు.


విధులు:

* ఆకులు, పండ్ల అబ్సిషన్‌ను ప్రేరేపిస్తుంది.

* విత్తనాల అంకురోత్పత్తిని నిరోధిస్తుంది.

* ఆకుల్లో వృద్ధాప్యాన్ని ప్రేరేపిస్తుంది.

* నిల్వ ప్రయోజనం కోసం ఉపయోగపడే విత్తనాల్లో నిద్రాణస్థితిని వేగవంతం చేస్తుంది.

* నీరు లభ్యం కాని స్థితిలో బాష్పీభవనం లేదా ట్రాన్స్‌పిరేషన్‌ను నిరోధించడానికి పత్ర రంధ్రాల లేదా స్టొమాటా మూసివేతను ప్రేరేపిస్తుంది.


ఇథిలీన్‌:

ఇథిలీన్‌ లేదా ఈథీన్‌ (CH2 = CH2 ) పొగ, ఇతర పారిశ్రామిక వాయువుల్లో ఉండే అస్థిర వాయువు.

* బ్రిటన్‌కి చెందిన రిచర్డ్‌ గనే అనే శాస్త్రవేత్త ఇథిలీన్‌ పండ్లు పక్వానికి కారణమయ్యే సహజమైన మొక్కల హార్మోన్‌ అని నిర్ధారించారు.

* ఇది పెరుగుదల ప్రేరేపకం, నిరోధకంగా పనిచేస్తుంది.

* వాయు రూపంలో వ్యవస్థితమై ఉంటుంది. ఇథిలీన్‌ వాయువు ఒక కణజాలం నుంచి వ్యాపిస్తుంది, ఇతర కణజాల అవయవాలను ప్రభావితం చేస్తుంది.

* ఇథిలీన్‌ జీవ సంశ్లేషణకి పూర్వగామి మెథియోనిన్‌ అనే అమైనో ఆమ్లం. (IAA), సైటోకైనిన్స్, నీటి ఒత్తిడి ద్వారా ఇథిలీన్‌ బయోసింథసిస్‌ లేదా జీవ సంశ్లేషణ పెరుగుతుంది.

* ఇది పండిన ఫలాలు, వృద్ధాప్య కణజాలాల్లో సంశ్లేషణ చెందుతుంది.

ఇథిలీన్‌తో చికిత్స చేసిన కాండ భాగాలు మూడురెట్ల ప్రతిస్పందనను (ట్రిపుల్‌ రెస్పాన్స్‌) ప్రదర్శిస్తాయి. ఉదా: బఠానీ విత్తనంలో భౌతిక అడ్డంకులకు ప్రతిస్పందనగా కాండం పొడవు తగ్గడం, పార్శ్వ పెరుగుదల (కణ విస్తరణ), సమాంతర పెరుగుదల ఉంటాయి.

* ఎథెఫాన్‌ను పిచికారీ చేసినప్పుడు మొక్క దాన్ని గ్రహించి నెమ్మదిగా ఇథిలీన్‌ను విడుదల చేస్తుంది. దీన్ని వాణిజ్యపరంగా పండ్ల పక్వానికి, సిట్రస్‌ ఫలాల్లో పసుపు పచ్చ వర్ణ స్థాయిని పెంచడానికి వాడతారు.

* ఇది అనేక శారీరక ప్రక్రియలను నియంత్రిస్తుంది. దీన్ని వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.


విధులు:

* పండ్ల పక్వాన్ని వేగవంతం చేస్తుంది.

*  ఆకుల ఎపినాస్టీని నియంత్రిస్తుంది.

* విత్తనం, మొగ్గ నిద్రాణస్థితిని విచ్ఛిన్నం చేస్తుంది.

* పత్ర వృంతం, కణుపు మధ్యమాలు వేగంగా పెరిగేలా ప్రేరేపిస్తుంది.

* ఆకులు, పువ్వుల్లో వృద్ధాప్యం, క్షీణతను ప్రోత్సహిస్తుంది.

వేరు పెరుగుదల, మూల కేశాల ఏర్పాటును ప్రేరేపిస్తుంది. దీనివల్ల శోషణ ఉపరితలం పెరుగుతుంది.

* ద్విలింగాశ్రయ మొక్కల్లో స్త్రీతత్వాన్ని ప్రేరేపిస్తుంది.


మాదిరి ప్రశ్నలు

1. పంటలు పడిపోకుండా కాపాడటంలో ఏ మొక్కల హార్మోన్‌ ఉపయోగపడుతుంది?

1) సైటోకైనిన్‌     2) జిబ్బరెల్లిన్‌   3) ఆక్సిన్‌       4) ఇథిలీన్‌


2. కిందివాటిలో వాయు రూపంలో కనిపించే హార్మోన్‌ ఏది?

1) ఫ్లోరిజెన్స్‌    2) అబ్సిసిక్‌ యాసిడ్‌    3) ఇథిలీన్‌     4) ఆక్సిన్‌


3. పండ్లలో పక్వానికి కారణమయ్యే హార్మోన్‌?

1) ఇథిలీన్‌     2) ఆక్సిన్‌     3) ట్రామాటిక్‌   4)  సైటోకైనిన్స్‌


4. ఆర్‌ఎన్‌ఏ, ప్రోటీన్లను తయారుచేయడంలో ఏ మొక్కల హార్మోన్‌ సహాయపడుతుంది?

1) జిబ్బరెల్లిన్లు     2) ఆక్సిన్లు  3) సైటోకైనిన్లు     4) ఇథిలీన్‌


5. కింది వాక్యాల్లో సరికానిది?

1) ఆక్సిన్లు అత్యంత ముఖ్యమైన మొక్కల హార్మోన్లు.

2) ఆక్సిన్లు పొడవు ప్రాంతంలో ఉత్పత్తి అవుతాయి.

3) ఇండోఎసిటిక్‌ యాసిడ్‌ (IAA) ఒక ప్రధాన ఆక్సిన్‌.

4) ఆకులు, పండ్లు రాలడాన్ని నియంత్రించడంలో ఆక్సిన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి.


6. మొక్క సుప్తావస్థ లేదా నిద్రాణస్థితిని విచ్ఛిన్నం చేయడంలో ఏ మొక్కల హార్మోన్‌ సహాయపడుతుంది?

1) ఆక్సిన్‌       2) జిబ్బరెల్లిన్‌    3) సైటోకైనిన్‌     4) ఇథిలీన్‌


7. కలపను ఇచ్చే మొక్కల్లో కాంబియం లేదా విభాజ్య కణజాల చర్యను పెంచే హార్మోన్‌ పేరు?

1) జిబ్బరెల్లిన్‌    2) సైటోకైనిన్‌     3) ఆక్సిన్‌    4) ఇథిలీన్‌


సమాధానాలు

1-3   2-3   3-1   4-3   5-2   6-2   7-1.

* ఫైటోహార్మోన్లు మొక్కల్లో చాలా తక్కువ సాంద్రతలో ఉండే రసాయన సమ్మేళనాలు. ఇవి మొక్కల అభివృద్ధి, పెరుగుదల, దీర్ఘజీవితకాలం, పునరుత్పత్తి ప్రక్రియలను నియంత్రిస్తాయి.


*  మొక్కల పెరుగుదల, అభివృద్ధికి సూర్యకాంతి, నీరు, ఆక్సిజన్, ఖనిజాలు అవసరం. ఇవి బాహ్య కారకాలు. ఇవి కాకుండా, మొక్కల పెరుగుదల, అభివృద్ధిని నియంత్రించే కొన్ని అంతర్గత కారకాలూ ఉన్నాయి. అవే మొక్కల హార్మోన్లు లేదా ఫైటోహార్మోన్లు. ఆధునిక భాషలో వీటిని మొక్కల వృద్ధి నియంత్రకాలు అంటారు.


*  మొక్కల హార్మోన్లు ఇండోల్‌ (ఆక్సిన్స్‌), టెర్పెనెస్‌ (జిబ్బరెల్లిన్స్‌), అడెనిన్‌ (సైటోకైనిన్స్‌), కెరోటినాయిడ్స్‌ (అబ్సిసిక్‌ యాసిడ్‌), వాయువుల (ఇథిలీన్‌) ఉత్పన్నాలు.


*  ఫైటోహార్మోన్లు దాదాపు మొక్కలోని అన్ని భాగాల్లో ఉత్పత్తయ్యి, వివిధ భాగాలకు ప్రసారమవుతాయి. ఇవి సినర్జిస్టిక్‌ లేదా వ్యక్తిగతంగా పని చేస్తాయి. వివిధ హార్మోన్లు పరిపూరకమైన లేదా విరుద్ధమైన పాత్ర పోషిస్తాయి.


* వెర్నలైజేషన్, కాంతి కాలావధి (ఫొటోట్రోపిజం), విత్తనాల అంకురోత్పత్తి, విత్తన నిద్రాణస్థితి లేదా సుప్తావస్థ మొదలైన ప్రక్రియల్లో బాహ్య కారకాలతో పాటు ఈ ఫైటోహార్మోన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. నియంత్రిత పంట ఉత్పత్తి కోసం సింథటిక్‌ మొక్కల హార్మోన్లు బయట నుంచి ఉపయోగపడతాయి.

Posted Date : 23-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌