శాశ్వతమే.. కానీ రద్దవుతుంది!
అది మేధావుల సభ. కళాకారులు గళం విప్పే వేదిక. అక్కడ జరిగే సమావేశాల్లో ఉపాధ్యాయులూ ఉత్సాహంగా పాల్గొంటారు. విధాన నిర్ణయాల్లో సామాజిక, ఆర్థిక, విజ్ఞాన, సేవారంగాల నిపుణులు భాగస్వాములవుతారు. శాసన ప్రక్రియలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు. విభిన్న వర్గాల ప్రాతినిధ్యంతో విరాజిల్లే ఆ విశిష్ట మండలి ఉనికి శాశ్వతం. కానీ కావాలనుకున్నప్పుడు రద్దు చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే పునరుద్ధరించుకోవచ్చు.
రాష్ట్రస్థాయిలో అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థ శాసనసభ. ఇందులో రెండు రకాల సభలు ఉంటాయి. మొదటిది ఎగువసభ. దీనినే విధాన పరిషత్తు అంటారు. రెండోది దిగువసభ, దానినే విధానసభగా వ్యవహరిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో విధానపరిషత్తు ఉండదు.ఎగువ సభ బహుళ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వ్యవస్థ. విధాన పరిషత్తును ఎగువ సభ, పెద్దలసభ, శాశ్వతసభ, శాసన మండలిగా కూడా పేర్కొంటారు. దీనిలో ఉండే సభ్యులను ఎమ్మెల్సీ (మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్) అంటారు. 1950 నాటి భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం విధాన పరిషత్తులో ఉండే కనీస ఎమ్మెల్సీల సంఖ్య 40. గరిష్ఠ ఎమ్మెల్సీల సంఖ్య విధానసభ సభ్యుల (ఎమ్మెల్యే) సంఖ్యలో 1/3వ వంతు మించకూడదు.
* భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం అప్పటి 11 రాష్ట్రాల శాసనసభల్లోని 6 రాష్ట్రాల శాసనసభల్లో ‘ద్విసభా’ విధానాన్ని అమలు చేసి ఎగువసభగా విధాన పరిషత్తును ఏర్పాటు చేశారు. ఆ ఆరు రాష్ట్రాల్లో మద్రాస్, బాంబే, అస్సాం, బెంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్.ఉన్నాయి.
రాజ్యాంగ సభలో చర్చ
రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో విధాన పరిషత్తుపై విస్తృతమైన చర్చ జరిగింది. ఎగువసభ శాసన నిర్మాణంలో జాప్యాన్ని కొనసాగిస్తుందని, అప్రజాస్వామికమైందని, అనవసర ఖర్చుతో కూడుకున్నదని, దీన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని రాజ్యాంగ సభ సభ్యుడైన హెచ్.వి.కామత్ పేర్కొన్నారు.చివరికి విధాన పరిషత్తును ఏర్పాటు చేయడం/రద్దుచేయడం అనేది సంబంధిత రాష్ట్ర అభీష్టానికి వదిలిపెట్టాలని రాజ్యాంగ సభ తీర్మానించింది.
విధాన పరిషత్తు ఏర్పాటు/తొలగింపు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 169(1) ఒక రాష్ట్రంలో విధాన పరిషత్తు ఏర్పాటు/తొలగింపు ప్రక్రియ గురించి వివరిస్తుంది. దీని ప్రకారం ఏదైనా రాష్ట్రంలో ఎగువసభ అయిన విధాన పరిషత్తును కొత్తగా ఏర్పాటు చేయాలన్నా లేదా ఉన్న విధాన పరిషత్తును తొలగించాలన్నా ఆ రాష్ట్ర విధాన సభ 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ఆమోదించి పార్లమెంటుకి పంపాలి.పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆ మేరకు చట్టం చేస్తుంది. ‘విధానపరిషత్తును పూర్తిగా లేకుండా చేయడం కుదరదు, కానీ రద్దుచేయవచ్చు’ అని రాజ్యాంగంలో పేర్కొన్నారు.
సభ్యుల అర్హతలు
* విధాన పరిషత్తు సభ్యులుగా పోటీ చేసేందుకు ఉండాల్సిన కనీస వయసు - 30 సంవత్సరాలు.
* సభ్యుల పదవీ కాలం - 6 సంవత్సరాలు
* ప్రతి రెండేళ్లకొకసారి 1/3వ వంతు విధాన పరిషత్తు సభ్యులు పదవీ విరమణ చేస్తారు.
* బహుళ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడమే ఈ సభ లక్ష్యం.
నిర్మాణం
విధాన పరిషత్తుకు సభ్యులు అయిదు రకాలుగా ఎన్నికవుతారు.
1) పరిషత్తు మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు సభ్యులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది.
2) మొత్తం సభ్యుల్లో మరో 1/3వ వంతు మంది సభ్యులను విధానసభ సభ్యులు (ఎమ్మెల్యేలు) ఎన్నుకుంటారు.
3) మొత్తం సభ్యుల్లో 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలో కనీసం మూడేళ్లపాటు నివాసం ఉంటున్న అన్ని విశ్వవిద్యాలయాల పట్టభద్రులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది.
4) మొత్తం సభ్యుల్లో ఇంకో 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని సెకండరీ పాఠశాల స్థాయికి తగ్గకుండా కనీసం మూడేళ్లపాటు పనిచేసిన ఉపాధ్యాయులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది.
5) మొత్తం సభ్యుల్లో 1/6వ వంతు మంది సభ్యులను రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేస్తారు. ఈ సభ్యులు కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవారంగాల్లో ప్రావీణ్యం ఉన్నవారై ఉంటారు.
విధాన పరిషత్తు సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ సూత్రం ప్రకారం ఎన్నికవుతారు.
ప్రస్తుతం మన దేశంలో 6 రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు ఉన్నాయి. అవి 1) ఉత్తర్‌ప్రదేశ్ (100 మంది సభ్యులు), 2) మహారాష్ట్ర (78), 3) బిహార్ (75), 4) కర్ణాటక (75), 5) ఆంధ్రప్రదేశ్ (58), 6) తెలంగాణ (40).
* జమ్ము-కశ్మీర్ విధాన పరిషత్తులో 36 మంది ఎమ్మెల్సీలు ఉండేవారు. జమ్ము-కశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2019 ప్రకారం అక్కడి విధాన పరిషత్తును రద్దుచేశారు.
* విధాన పరిషత్తు మొత్తం సభ్యుల్లో 5/6వ వంతు సభ్యులు ఎన్నిక ద్వారా ఎన్నికవుతారు. మిగిలిన 1/6వ వంతు సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీల ఎన్నిక వివరాలు
ఆంధ్రప్రదేశ్-58 |
తెలంగాణ-40 | ఎన్నిక విధానం |
20 | 14 | స్థానిక సంస్థల ప్రతినిధుల ద్వారా |
20 | 14 | విధానసభ సభ్యుల (ఎమ్మెల్యేలు) ద్వారా |
5 | 3 | ఉపాధ్యాయుల ద్వారా |
5 | 3 | పట్టభద్రుల ద్వారా |
8 | 6 | గవర్నర్ నామినేట్ చేస్తారు |
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విధాన పరిషత్తు ఏర్పాటు, తొలగింపు, పునరుద్ధరణ
* 1958, జులై 1న నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారిగా విధాన పరిషత్తును ఏర్పాటు చేశారు. అప్పటి విధాన పరిషత్తు ఛైర్మన్ మాడపాటి హనుమంతరావు, డిప్యూటీ ఛైర్మన్ జి.ఎన్.రాజు.

* 2007, మార్చి 30న వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధాన పరిషత్తును పునరుద్ధరించారు. అప్పటి సభ ఛైర్మన్ ఎ.చక్రపాణి, డిప్యూటీ ఛైర్మన్ మహ్మద్ జాని.
* విభజన అనంతరం కొత్త ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్తుకు తొలి ఛైర్మన్ ఎ.చక్రపాణి, తొలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్.వి.సతీష్‌కుమార్ రెడ్డి.

* తెలంగాణ రాష్ట్ర విధాన పరిషత్తుకు తొలి ఛైర్మన్ కె.స్వామిగౌడ్, తొలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్.
* ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విధాన పరిషత్తు ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ పదవి ఖాళీగా ఉంది.
ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవులు
* రాజ్యాంగంలోని ఆర్టికల్ 182 విధాన పరిషత్తు ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవుల గురించి వివరిస్తుంది. సభ్యులు (ఎమ్మెల్సీలు) సభా కార్యకలాపాల నిర్వహణ కోసం తమలో నుంచి ఒకరిని ఛైర్మన్‌గాను, మరొకరిని డిప్యూటీ ఛైర్మన్‌గాను ఎన్నుకుంటారు.
* ఆర్టికల్ 183 విధాన పరిషత్తు ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లు తమ పదవులను ఏ విధంగా కోల్పోతారనే విషయాన్ని వివరిస్తుంది. శాసనమండలి/ విధాన పరిషత్తులో సభ్యత్వం రద్దయినప్పుడు, తమ పదవులకు రాజీనామా చేసినప్పుడు, విధాన పరిషత్తులో తొలగింపు తీర్మానం నెగ్గినప్పుడు పదవులను కోల్పోతారు. ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లను తొలగించే తీర్మానాన్ని 14 రోజుల ముందస్తు నోటీసు ద్వారా తెలియజేయాలి.
* ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లలో ఎవరిపై తొలగింపు తీర్మానం ప్రవేశపెడతారో వారు సభా సమావేశాలకు అధ్యక్షత వహించకూడదు. అయితే సభా సమావేశాల్లో పాల్గొనవచ్చు. ఛైర్మన్ తన రాజీనామాను డిప్యూటీ ఛైర్మన్‌కు, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులు (ఎమ్మెల్సీలు) తమ రాజీనామాలను ఛైర్మన్‌కు సమర్పించాలి.
* ఆర్టికల్ 184 ప్రకారం ఛైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడు డిప్యూటీ ఛైర్మన్ సభా సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
* రాజ్యాంగం ప్రకారం విధాన పరిషత్తు సమావేశాలు సంవత్సరానికి తప్పనిసరిగా రెండు సార్లు జరగాలి. రెండు సమావేశాల మధ్య వ్యత్యాసం 6 నెలలు మించకూడదు.
విధాన పరిషత్తు - సమీక్ష
* సాధారణ బిల్లులను విధానసభలో లేద విధాన పరిషత్తులో ప్రవేశపెట్టవచ్చు.
* విధాన సభ ఆమోదించి పంపిన సాధారణ బిల్లులను విధాన పరిషత్తు గరిష్ఠంగా 4 నెలలు పాటు నిలిపి ఉంచగలుగుతుంది.
* విధాన పరిషత్తును ఒక చేతికి ఉండే 6వ వేలిగా, రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం కల్పించే సంస్థగా విమర్శకులు పేర్కొన్నారు.
* విధాన పరిషత్తు భవితవ్యం విధాన సభ చేసే ప్రత్యేక తీర్మానంపై ఆధారపడి ఉంటుంది.
* విధాన సభ ఆమోదించి పంపిన ఆర్థిక బిల్లులను విధాన పరిషత్తు 14 రోజుల్లోగా ఆమోదించాలి. లేకపోతే ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు.
రాజ్యసభ, విధాన పరిషత్‌ల మధ్య వ్యత్యాసాలు
* రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. కానీ రాష్ట్రాల విధాన పరిషత్తు సభ్యులకు (ఎమ్మెల్సీలు) ఎలాంటి ఓటు హక్కు లేదు.
* సాధారణ బిల్లుల ఆమోదం విషయంలో రాజ్యసభ, లోక్‌సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ రాష్ట్రస్థాయిలో విధాన పరిషత్తు, విధాన సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే గవర్నర్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు.
* లోక్‌సభ ఆమోదించి పంపిన సాధారణ బిల్లులపై రాజ్యసభ 6 నెలల్లోగా నిర్ణయం ప్రకటించాలి. విధానసభ ఆమోదించి పంపిన సాధారణ బిల్లులపై విధాన పరిషత్తు 3 నెలల్లోగా నిర్ణయాన్ని ప్రకటించాలి.
* రాజ్యసభ శాశ్వతసభ. దీన్ని రద్దుచేయడానికి వీలులేదు. విధాన పరిషత్తును పార్లమెంటు చేసే చట్టం ద్వారా రద్దు చేయవచ్చు.
* రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాజ్యసభ పాల్గొంటుంది. కానీ విధాన పరిషత్తుకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.
రచయిత: బంగారు సత్యనారాయణ