• facebook
  • whatsapp
  • telegram

పరాగ సంపర్కం - 2

కీటక పరాగ సంపర్కం 

ఇందులో పరాగ సంపర్కానికి కీటకాలు సహకరిస్తాయి. దీన్నే ఎంటమోఫిలి అంటారు. ఆవృత బీజాల్లో ఎక్కువ శాతం మొక్కలు ఈ రకమైన పరాగ సంపర్కాన్ని జరుపుకుంటాయి. ఈ పుష్పాల్లో ఉత్పత్తయ్యే పుప్పొడి, మకరందం కోసం లేదా వాటి అండాశయంలో గుడ్లను పెట్టేందుకు కీటకాలు వీటిని చేరతాయి. కీటక పరాగ సంపర్కాన్ని జరిపే పుష్పాలు కింది లక్షణాలను కలిగి ఉంటాయి.

*  కీటకాలను ఆకర్షించడానికి వీలుగా పుష్పాలు పెద్దగా ఉండి, వివిధ రంగులతో ఆకర్షణ పత్రాలను కలిగి ఉంటాయి. పత్రాలు ఆకర్షణీయంగా లేకపోతే, పుష్పంలోని ఏదో ఒక భాగం (రక్షక పత్రాలు, కేసరాలు పుష్పపుచ్ఛాలు) ఆకర్షణీయంగా మారి కీటకాలను ఆరర్షిస్తాయి.

* పుష్పాల రంగులు కూడా కొన్ని రకాల కీటకాలను ఆకర్షిస్తాయి. ఉదాహరణకు తేనెటీగలు నీలం వర్ణాన్ని, తూనీగలు ఎరుపు రంగును, కొన్ని రకాల ఈగలు గోధుమ వర్ణాన్ని ఇష్టపడతాయి.

* పుష్పాలు వెదజల్లే సువాసనలు కూడా కీటకాలను ఆకర్షిస్తాయి. సాధారణంగా రాత్రివేళ వికసించే పుష్పాల్లో మంచి రంగులు ఉండవు. ఇవి తెల్లగా, సువాసనభరితంగా ఉండి కీటకాలను ఆకర్షిస్తాయి. 

ఉదా: సెస్ట్రమ్‌ నాక్టర్నమ్‌ (నైట్‌ క్వీన్‌), నిక్టాంథస్‌ (పారిజాతం), జాస్మినం (మల్లె).

* కీటకాలను ఆకర్షించేందుకు కొన్ని పుష్పాలు పుప్పొడిని కీటకాలకు (తేనెటీగలు) ఆహారంగా అందిస్తాయి. 

ఉదా: క్లెమాటిస్, అనిమోన్, సాలిక్స్‌.

*  కొన్ని పుష్పాలు ఎక్కువ మకరందాన్ని ఉత్పత్తి చేసి, కీటకాలను ఆకర్షిస్తాయి. సాధారణంగా మకరంద గ్రంథులు ఆకర్షణ పత్రావళి గొట్టంలో లేదా ఆకర్షణ పత్రాలపై  అమరి ఉంటాయి. 

  ఉదా: ఆర్కిస్, హయసింథస్, వెర్బస్కం.


పక్షి పరాగ సంపర్కం 

కొన్ని మొక్కల్లో పక్షులు పరపరాగ సంపర్కానికి తోడ్పడతాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే అనేక మొక్కల్లో ఇది జరుగుతుంది. 

ఉదా: హమ్మింగ్‌ బర్డ్స్, తేనె పిట్టలు, ఊర పిచ్చుకలు. 

పక్షి పరాగ సంపర్కం జరుపుకునే మొక్కలు కింది అనుకూలనాలను ప్రదర్శిస్తాయి.

*  పుష్పాలు పెద్దగా, వివిధ రంగుల్లో ముఖ్యంగా స్కార్లెట్‌ రంగులో ఉంటాయి.

* పుష్పాలకు సువాసన ఉండదు.

* మకరందం ఎక్కువగా ఉంటుంది.

* పుష్పభాగాలు మందంగా, దృఢంగా ఉంటాయి. లేకపోతే పక్షి పుష్పాన్ని చేరినప్పుడు, నలిగి - పాడైపోయే ప్రమాదం ఉంటుంది.

* హమ్మింగ్‌ బర్డ్స్‌ పుష్పాలపై ఎగురుతూ తమ పొడవాటి, సన్నటి ముక్కుద్వారా ఆకర్షణ పత్రావళిలోని మకరందాన్ని గ్రహిస్తాయి. ఈ సమయంలో వాటి తలపై పుప్పొడి రేణువులు పడతాయి. ఇది మరొక పుష్పాన్ని చేరినప్పుడు, దానిపై ఉన్న పుప్పొడి రేణువులు ఆ పుష్పంపై పడి పరపరాగ సంపర్కం జరుగుతుంది.


గబ్బిలాల ద్వారా పరాగసంపర్కం 

* గబ్బిలాల వల్ల జరిగే పరపరాగ సంపర్కాన్ని ‘ఖీరాప్టెరిఫిలి’ అంటారు. పరాగ సంపర్కంలో గబ్బిలాల పాత్రపై శాస్త్రవేత్తల మధ్య నిర్దిష్టమైన అభిప్రాయం లేదు. అవి మకరందాన్ని గ్రహించడానికి పుష్పాలను చేరతాయా లేదా వాటిలోని చిన్న కీటకాలను ఆహారంగా తీసుకోవడానికి వస్తాయా అన్నదానిపై స్పష్టమైన అవగాహన లేదు.

* ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే ఆంథోసిఫాలస్‌ కదంబ (కదంబం), కైజీలియా పిన్నేటా, బాహీనియా మొగలాండ్ర, మ్యూస మొక్కల్లో గబ్బిలాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. ఈ మొక్కల్లో పుష్పాలు/ పుష్ప విన్యాసాలు పెద్దగా ఉంటాయి.


మాదిరి ప్రశ్నలు 

1. ఆవృత బీజ మొక్కల పరాగకోశాల్లో ఏర్పడిన పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటారు?

1) పరాగ సంపర్కం  2)ఫలదీకరణం

3) ప్రస్తారణ       4) చోదకత్వం


2. ఒక పుష్పంలోని పరాగ కోశాల్లో ఉండే పరాగ రేణువులు అదే పుష్పంలోని అండకోశంలోని కీలాగ్రంపై పడటాన్ని ఏమంటారు?

1) పరపరాగ సంపర్కం    2)  స్వపరాగ సంపర్కం

3) సంకరీకరణం     4) ఏక స్థితికత్వం


3. ఎప్పుడూ వికసించని పుష్పాలను ఏమంటారు?

1) వివృత సంయోగ పుష్పాలు     2) స్వయం రూపక పుష్పాలు

3)  సంవృత సంయోగ పుష్పాలు    4) బాహ్య సంయోగ పుష్పాలు


4. కిందివాటిలో పుంభాగ ప్రథమోత్పత్తి, స్త్రీభాగ ప్రథమోత్పత్తికి సంబంధించింది ఏది?

1) ఏకలింగత్వం   2) హెర్కోగమి

3) భిన్న కీలత    4) భిన్నకాల పక్వత


5. కొన్ని ద్విలింగ పుష్పాల్లో పరాగ రేణువులు అదే పుష్ప కీలాగ్రంపై పడినప్పుడు అవి మొలకెత్తలేవు. దీన్ని ఏమంటారు?

1) పుప్పొడి పూర్వశక్తి      2) ముందస్తు పక్వత సాధించిన కీలాగ్రాలు

3) భిన్న కీలత    4) ఆత్మ వంధ్యత్వం 


6. వాయు బాహ్య కారకం ద్వారా జరిగే పరపరాగ సంపర్కాన్ని ఏమంటారు?

1) అర్నితోఫిలి     2) హైడ్రోఫిలి 

3) ఎనిమోఫిలి     4) ఎంటమోఫిలి


7. కిందివాటిలో ఊర్థ్వ జలపరాగ సంపర్కం దేనిలో జరుగుతుంది?

1) నాజాస్‌   2) వాలిస్‌నేరియా

3)  జోస్టర    4) సెరటోఫిల్లం


8. పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఏమంటారు?

1) అర్నితోఫిలి   2) హైడ్రోఫిలి

3) ఎనిమోఫిలి     4) ఎంటమోఫిలి


9. ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే ఆంథోసెఫాలస్‌ కదంబ, కైజీలియా పిన్నేటా, బాహీనియా మెగలాండ్ర మొక్కల్లో కింది దేని ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది?

1) చీమలు      2) గబ్బిలాలు     3) నత్తలు     4) గాలి


10. కిందివాటిలో నిర్జీవ పరాగ సంపర్క కారకానికి ఉదాహరణ?

1) ఉష్ణోగ్రత   2)  ఆర్థ్రత   3) గాలి    4) లవణీయత


11. కొన్ని మొక్కల్లో పుష్పాలు పెద్దగా ఉండి, వివిధ రంగుల ఆకర్షణ పత్రాలను కలిగి ఉంటాయి. పత్రాలు ఆకర్షణీయంగా లేకపోతే పుష్పంలోని ఏదో ఒక భాగం (రక్షక పత్రాలు, కేసరాలు, పుష్పపుచ్ఛాలు) ఆకర్షణీయంగా మారతాయి. ఇలాంటి అనుకూలనాలను చూపించే మొక్కలు ఏ రకమైన పరాగసంపర్కం జరుపుకుంటాయి?

1) కీటకాల ద్వారా పరాగ సంపర్కం  

2) పక్షుల ద్వారా పరాగ సంపర్కం

3) గాలి ద్వారా అపరాధ సంపర్కం   

4) గబ్బిలాల ద్వారా పరాగ సంపర్కం


12. వాలిస్‌నేరియా ఒక....

1) నీటి లోపల పెరిగే ఏకలింగాశ్రయ మొక్క

2) నీటి బయట పెరిగే ఏకలింగాశ్రయ మొక్క

3) నీటి లోపల పెరిగే ద్విలింగాశ్రయ మొక్క

4)నీటి బయట పెరిగే ద్విలింగాశ్రయ మొక్క

13. ఉభయలింగ పుష్పాలు లేదా ద్విలింగ పుష్పాల్లో కేసరావళి కంటే అండకోశం ముందుగా పక్వానికి రావడాన్ని ఏమంటారు?

1) పుంభాగ ప్రథమోత్పత్తి       2) స్త్రీభాగ ప్రథమోత్పత్తి     

3) భిన్న సిద్ధబీజత     4) ప్రోటాండ్రీ


14. ద్విలింగ పుష్పాల్లో పరాగ రేణువులు అదే పుష్పం కీలాగ్రంపై పడినప్పుడు అవి మొలకెత్తలేవు. దీన్ని ఏమంటారు?

1) ఆత్మ వంధ్యత్వం   2) సమ వంధ్యత్వం   

3) విషమ వంధ్యత్వం    4) అసమ వంధ్యత్వం


15. కిందివాటిలో సూక్ష్మగ్రాహ్యకీలాలు కలిగిన మొక్కకు ఉదాహరణ?

1) ట్రిబ్యులస్‌      2) ప్యాసిప్లవర్‌    

3) ట్రైడెక్స్‌        4) మిమ్యులస్‌


16. జీనోగమీ అంటే?

1) భిన్న వృక్ష పరాగసంపర్కం    

2)  ఏక వృక్ష పరాగసంపర్కం

3) పరాగసంపర్కం లోపించడం   

4) పరాగసంపర్కం ఎక్కువగా జరగడం


17. ఏకవృక్ష పరపరాగ సంపర్కానికి మరోపేరు?

1) జీనోగమీ     2) గైటినోగమీ   3) సైఫనోగమీ      4) చలాజోగమీ


18. వాయుబాహ్య కారకం ద్వారా జరిగే పరపరాగ సంపర్కాన్ని ఏమంటారు?

1) జీనోగమీ    2) గైటినోగమీ     3) సైఫనోగమీ   4) ఎనిమోఫిలీ


19. కిందివాటిలో పరపరాగసంపర్కాన్ని ప్రేరేపించే క్షీరదం ఏది?

1) పిల్లి       2) ఎలుక     3) గుడ్లగూబ     4) గబ్బిలం


20. లైంగిక ప్రత్యుత్పత్తిలో భాగంగా స్త్రీ, పురుష సంయోగబీజాల కలయికను ఏమంటారు?

1) మాదికరణం   2) ఫలదీకరణం    

3) సంలీనం      4) ఐక్యలీనం


21. పరాగరేణువులు దేన్ని చేరాక మొలకెత్తుతాయి?

1)  కీలాగ్రం   2) అండాశయం   3) అండం    4) స్త్రీ బీజకణం


22. సాధారణంగా ఒక పరాగరేణువు నుంచి ఎన్ని పరాగనాళాలు ఏర్పడతాయి?

1) అనేకం    2) సున్నా    3) ఒకటి     4) రెండు


23. కొన్ని సందర్భాల్లో ఏ కుటుంబ మొక్కలో పరాగనాళం శాఖాయుతంగా ఉంటుంది?

1) మాల్వేసి    2) కుకుర్బిటేసి    

3) సొలనేసి     4) అమెంటిఫెరి


24. పరాగనాళం గోడ కింది వేటితో నిర్మితమై ఉంటుంది?

1) సెల్యులోస్, పెక్టిన్‌    2)సుక్రోస్, పెక్టిన్‌    

3) సెల్యులోస్, లిగ్నిన్‌   4) సెల్యులోస్, ఖైటిన్‌


25. పరాగనాళం కొనభాగంలో పారదర్శకంగా ఉండే అర్ధగోళాకార ప్రాంతాన్ని ఏమంటారు?

1)  శీర్షిక   2) శీర్ష అవరోధం    3) శీర్షరూపం     4) పరాగ అవరోధం


26. కిందివాటిలో ఏది విభజన చెంది, రెండు పురుష బీజాలను ఏర్పరుస్తుంది?

1) అంకురచ్ఛదం   2) శాఖీయ కణం    

3) ఉత్పాదక కణం    4) పరాగ రేణువు


27. పరాగనాళం అండద్వారం ద్వారా అండంలోకి ప్రవేశించడాన్ని ఏమంటారు?

1) పరాగ సంయోగం   2) చలాజోగమీ    

3) మీసోగమీ     4) రంధ్ర సంయోగం


28. ద్వి ఫలదీకరణం కింది వేటిలో జరుగుతుంది?

1) ఆవృత బీజాలు    2) వివృత బీజాలు   

3) టెరిడోఫైట్స్‌      4) బ్రయోఫైట్స్‌

29. త్రిసంయోగం వల్ల ఏర్పడేది?

1) ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం

2) ప్రాథమిక అంతఃసిద్ధబీజ కేంద్రకం

3) ద్వితీయ అంకురచ్ఛద కేంద్రకం

4) ప్రాథమిక బాహ్యసిద్ధబీజ కేంద్రకం


సమాధానాలు

1-1,  2-2,  3-3,  4-4,  5-4,  6-3,  7-2,  8-1,  9-2,  10-3, 11-1,  12-1,  13-2, 14-1,  15-4,  16-1,  17-3,  18-4,  19-4,  20-2,  21-1,  22-3,  23-4,  24-1,  25-2,  26-3,  27-4,  28-1, 29-1.

Posted Date : 19-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌