• facebook
  • whatsapp
  • telegram

కాకతీయ అనంతర యుగం

తెలుగు సంస్కృతి పరిరక్షకులు

మధ్యయుగంలో తెలుగు జాతిని ఏకం చేసి పాలించిన కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తాన్‌ల దాడులతో అంతమవడంతో తెలుగునాట రాజకీయ స్తబ్దత నెలకొంది. కొంతకాలానికే ముస్లిం పాలకులపై ఈ ప్రాంతంలో వ్యతిరేకత రావడంతో పలు హిందూ స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటయ్యాయి. అలా కాకతీయ సామ్రాజ్య శిథిలాల నుంచి ఏర్పాటైనవే విజయనగర, నాయక, రెడ్డి, వెలమ రాజ్యాలు. ఇందులో ఆంధ్ర ప్రాంతం నుంచి ఆవిర్భవించిన ముసునూరి నాయకులు, రెడ్డి రాజుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. సుల్తాన్‌ పాలనను అంతమొందించి, హిందూ సంస్కృతిని పరిరక్షించి, తెలుగు నేలను సుభిక్షం చేసి, సంస్కృతీ సాహిత్యాల వికాసానికి పెద్దపీట వేసిన పాలకులుగా వీరు చరిత్రకెక్కారు. ఈ అచ్చ తెలుగు రాజుల వంశ క్రమం, పరిపాలనా విధానం, సమకాలీన రాజులతో నెరపిన సంబంధాలు, చేసిన యుద్ధాలు, నాటి సామాజిక పరిస్థితుల గురించి అవగాహన పెంచుకోవాలి.

ముసునూరి నాయక రాజ్యం ముసునూరు అనే గ్రామం కృష్ణా జిల్లా, ఉయ్యూరు సమీపంలో ఉంది. నేటికీ అక్కడ కోట శిథిలాలు ఉన్నాయి. వీరు కమ్మ కులస్థులు. ఈ వంశస్థాపకుడు ప్రోలయ నాయకుడు. ఈ రాజ్యం గురించి తెలుసుకోవడానికి ఆధారాలు 


1) విలాస తామ్ర శాసనం (ప్రోలయ నాయకుడు) 


2) పోలవరం శాసనం (కాపయ నాయకుడు) 


3) పెంటపాడు శాసనం (చోడ భక్తి రాజు) 


4) కలువచేరు శాసనం (రెడ్డిరాణి అనతల్లి).


ప్రోలయ నాయకుడు: ఇతడి గురించి విలాస తామ్ర శాసనం తెలియజేస్తోంది. తండ్రి పోతి నాయకుడు. రాజధాని రేకపల్లె. ‘ఆంధ్ర భూమండలధ్యక్ష’గా ప్రసిద్ధికెక్కాడు. వైదిక ధర్మాన్ని పునరుద్ధరించాడు. బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చాడు. ముస్లిం దండయాత్రలతో మైల పడిందంటూ ఆంధ్ర ప్రాంత భూములను యజ్ఞాయాగాది, క్రతువులతో పునీతం చేశాడు. రైతులు పంటలో ఆరో భాగం పన్నుగా చెల్లించేవారు. విలాస గ్రామాన్ని భరద్వాజస గోత్రానికి చెందిన ‘వెన్నమ’ అనే బ్రాహ్మణుడికి ఇచ్చాడు.


కాపయ నాయకుడు: ప్రోలయ నాయకుడికి సంతానం లేదు. పినతండ్రి దేవనాయనాయకుడి కుమారుడైన కాపయ నాయకుడు రాజు అయ్యాడు. ఇతడు 1336లో ఓరుగల్లు కోట నుంచి ఢిల్లీ సుల్తానులను పారదోలాడు. ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్రసురత్రాణ అనే బిరుదులు పొందాడు. ఓరుగల్లు రాజధానిగా చేసుకుని తెలంగాణ, తీరాంధ్ర ప్రాంతాలను పరిపాలించాడు. కాపయ నాయకుడిని కన్యానాయక్, కృష్ణనాయక్, కన్యాపాయక్, కనాబాయర్‌ అనే పేర్లతో మహమ్మదీయ చరిత్రకారులు పేర్కొన్నారు. ఇతడి కాలంలోనే హరిహర రాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1347లో అల్లావుద్దీన్‌ హసన్‌ గంగూ గుల్బర్గా రాజధానిగా రాజ్యాన్ని స్థాపించడంలో కాపయ నాయకుడు సహాయపడ్డాడు. కాపయ నాయకుని ఓడించడానికి అల్లావుద్దీన్‌ 1350లో సికిందర్‌ఖాన్‌ను పంపాడు. ఓడిపోయిన కాపయ నాయకుడు కైలాస దుర్గాన్ని, అపారమైన ధనరాశులను ఇచ్చి సంధి చేసుకున్నాడు. 1356లో బహమనీ షా మళ్లీ దాడి చేసినప్పుడు భువనగిరి దుర్గం ఇచ్చి సుల్తాన్‌తో సంధి చేసుకున్నాడు. బహమనీ షా మరణం తర్వాత విజయనగర రాజులతో మైత్రి చేసి తాను పోగొట్టుకున్న ప్రాంతాలను తిరిగి పొందాలని ప్రయత్నించాడు. కాపయ నాయకుడి కుమారుడు వినాయకదేవుడు భువనగిరిని ఆక్రమించాడు. బహమనీ రాజు మహ్మద్‌ షా వినాయకదేవుడిని ఓడించి చంపాడు. వరంగల్లును చుట్టుముట్టాడు. ఈ సమయంలో కాపయ నాయకుడు అపార ధనరాశులతో పాటు గోల్కొండ కోటను శాశ్వతంగా బహమనీ రాజులకు ఇచ్చి సంధి చేసుకున్నాడు. ఇతడు తరచూ యుద్ధాల్లో మునిగి ఉన్నప్పుడు సామంతులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు.


 రెడ్డి రాజులు


రెడ్డి రాజ్యస్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి. వీరి రాజధానులు అద్దంకి, కొండవీడు, రాజమండ్రి. కాకతీయుల పతనం తర్వాత రాజ్యానికి వచ్చారు. నెల్లూరు నుంచి ఉత్తరాన సింహాచలం వరకు ఉన్న సముద్ర తీరాంధ్ర ప్రాంతాన్ని సుమారు 150 ఏళ్లు పరిపాలించారు. తెలుగు భాష, సంస్కృతికి అపారమైన సేవ చేశారు. మొత్తం రెడ్డి రాజులు 9 మంది. వీరిది పంట వంశం. పంటకాపులు అని వ్యవహరిస్తారు.


ప్రోలయ వేమారెడ్డి: ఈ వంశంలో మొదటివాడు. ఇతడి రాజధాని అద్దంకి. వైదిక మతాన్ని ద్వేషించే ముస్లింలను ఓడించి తీరాంధ్ర నుంచి తరిమేశాడు. కాపయ నాయకుడికి సహాయపడిన 75 మంది నాయకుల్లో వేమారెడ్డి ఒకరు. కాపయ నాయకుడి కాలంలోనే ఇతడూ స్వాతంత్య్రం పొందాడు. వేమారెడ్డికి రాజ్య విస్తరణలో అతడి సోదరులు, బంధువులు సహాయపడ్డారు. తమ్ముడు మల్లారెడ్డి సర్వసైన్యాధ్యక్షుడు, మోటుపల్లిని ఆక్రమించాడు. బహమనీ రాజ్యస్థాపకుడు హసన్‌ గంగూ అమరావతి వరకు వచ్చినప్పుడు అతడిని ఓడించి తరిమేశాడు. వేమారెడ్డి వినుకొండ, కొండవీడు, కొండపల్లి, బెల్లంకొండ, ధాన్యకటకం మొదలైన ప్రాంతాల్లో 84 దుర్గాలు నిర్మించాడు. రాజ్యం పశ్చిమాన శ్రీశైలం, అహోబిలం నుంచి తూర్పున బంగాళాఖాతం వరకూ వ్యాపించింది. ధర్మ ప్రతిష్టాగురు, నిస్సమాభూదాన పరశురామా, అనవరత పురోహిత కృత సోమపాన అనే బిరుదులు పొందాడు.  ఆస్థానంలోని ఎర్రాప్రగడ ‘హరివంశం’ రచించి వేమారెడ్డికి అంకితం ఇచ్చారు. వేమారెడ్డికి ముగ్గురు కుమారులు. అనవోతారెడ్డి, అనమాబారెడ్డి, అనవేమారెడ్డి.


అనవోతారెడ్డి: ప్రోలయ వేమారెడ్డి పెద్ద కుమారుడు. 11 సంవత్సరాలు రాజ్యం పరిపాలించాడు. ఇతడు ఎదుర్కొన్న మొదటి యుద్ధం కళింగ దండయాత్ర. ఆనాటి కళింగ రాజు మూడో నరసింహదేవుడు. అనవోతారెడ్డి వసంతరాయలు, ద్వీపవిజేత, వీరన్నపోతుగా ప్రసిద్ధి చెందాడు. రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకి మార్చాడు. వాణిజ్య అభివృద్ధిని ప్రోత్సహిస్తూ అనవోతారెడ్డి తెలుగు, తమిళం, సంస్కృత భాషల్లో అభయశాసనం ప్రకటించాడు. బంగారంపై పన్ను రద్దు చేశాడు. ఆస్థాన కవి బాలసరస్వతి.


అనవేమారెడ్డి: అనవోతారెడ్డి తమ్ముడు. శాసనాలు ఇతడిని ‘రాజశ్రీ రమణ స్వయంపరపతి’ అని పేర్కొన్నాయి. అనవోతారెడ్డి మరణించేనాటికి అతడి కుమారుడైన కుమారగిరిరెడ్డి బాలుడు. దీంతో రాజ్య ప్రధాని, దండనాయకుడు, సామంతులు కలిసి అనవేమారెడ్డిని రాజుగా ఎన్నుకున్నారు. 20 సంవత్సరాల పాలనా కాలంలో అన్యాక్రాంతమైన రాజ్య విభాగాలను తిరిగి సంపాదించాడు. దివి దుర్గాన్ని జయించి ‘దివిదుర్గ విభాళా’ అనే బిరుదు పొందాడు. సింహాచలం నుంచి మొదలైన పర్వత పాదాల వద్ద కీర్తి స్తంభాలను ప్రతిష్ఠించి ‘సింహాచలాది వింధ్యపాద ప్రతిష్ఠత కీర్తి స్తంభ’ అనే బిరుదు పొందాడు. సంగీత, సాహిత్య, పోషకుడు. ఏటా వసంతోత్సవాలను జరిపి కవులు, పండితులు, కళాకారులను ప్రోత్సహించాడు. ఇతడికి ‘వసంతరాయుడు’ అనే బిరుదు కూడా ఉంది. వైదిక మతాభిమాని, శివభక్తుడు. శ్రీశైలంలో వీరశిరోమండపం, సింహాచలంలో అనవేమగిరి మండపం నిర్మించాడు. ‘ధర్మాన వేముడు’ అనే బిరుదు పొందాడు.


కుమారగిరిరెడ్డి: ఇతడి బిరుదు కర్పూర వసంతరాయలు. కుమారగిరిరెడ్డి సింహాసనం అధిష్టించడంపై వ్యతిరేకతలు ఎదురయ్యాయి. అంతర్యుద్ధంలో విజయం సాధించాడు. అందుకు కాటయ వేమారెడ్డి సహాయపడ్డాడు. రెడ్డి రాజులు అంతఃకలహాలలో మునిగి ఉన్నప్పుడు సామంతులు, దుర్గాధిపతులుగా స్వతంత్రులయ్యారు. విజయనగర రాజులు శ్రీశైలం, త్రిపురాంతకం ప్రాంతాలను ఆక్రమించారు. కలహాలు ముగిసిన అనంతరం రెడ్డి రాజులు పశ్చిమ ప్రాంతాలపై దృష్టి సారించారు. కాటయ వేమారెడ్డి నాయకత్వంలో పెద్ద సైన్యం విజయనగర రాజ్యంపై దండెత్తింది. ఫలితం తేలకముందే రెండో హరిహరరాయలతో సంధి చేసుకున్నారు. హరిహరాంబను కాటయ వేముడికిచ్చి వివాహం చేశారు. తర్వాత కాటయ వేమారెడ్డి తూర్పు దండయాత్రలు ప్రారంభించాడు. తూర్పు ప్రాంత దండయాత్రల్లో రాజమండ్రి రాజులు ప్రముఖ పాత్ర వహించినట్లు శ్రీనాథుడి ‘కాశీఖండం’, కొమ్మన రచించిన ‘శివలీలా విలాసం’ తెలియ జేస్తున్నాయి. కాటయ వేమారెడ్డి రంప నుంచి కటకం (కటక్‌) వరకు ఆక్రమించాడు. గోపవరం వద్ద ఉన్న శాసనంలో ఇతడికి ‘కటకచూరకార’ అన్న బిరుదు ఉంది. యుద్ధాల ద్వారా వచ్చిన ధనరాశులను కుమారగిరిరెడ్డికి సమర్పించాడు. కాటయ వేమారెడ్డి రాజ్యనిర్వహణ భారం వహిస్తే, కుమారగిరిరెడ్డి సాహిత్యంలో మునిగి తేలేవాడు. ఏటా వసంతోత్సవాలు నిర్వహించేవాడు. ఆస్థానంలో లకుమాదేవి అనే ప్రసిద్ధ నర్తకి ఉండేది. కుమారగిరిరెడ్డి అకాల మరణంతో రాజ్యంలో మళ్లీ అంతర్యుద్ధం జరిగింది. చివరికి పెదకోమటి వేమారెడ్డి రాజయ్యాడు.


పెదకోమటి వేమారెడ్డి: ఇతడి బిరుదు సర్వజ్ఞ చక్రవర్తి. 18 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. విజయనగర రాజ్యంలో ఏర్పడిన కలహాలను అవకాశంగా తీసుకుని పర్చూరును ఆక్రమించాడు. రాజమహేంద్రవరాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీనికి కారణం కాటయ వేమారెడ్డి, పేదకోమటి వేమారెడ్డిని తన ప్రభువుగా అంగీకరించక పోవడం. వీరి మధ్య కలహం ఉభయ రాజ్యాలను బలహీనపరిచింది. పెదకోమటి వేమారెడ్డి స్వయంగా కవి, పండితుడు, అలంకార శాస్త్రవేత్త, సంగీత శాస్త్రజ్ఞుడు. సాహిత్య చింతామణి, శృంగార దీపిక, సంగీత చింతామణి, సప్తశతీ సారదీపిక అనే కావ్యాలు రచించారు. ఆస్థాన కవులు వామనభట్టు, శ్రీనాథుడు.


రాచవేమారెడ్డి: కొండవీటి రెడ్డి రాజుల్లో చివరివాడు. పెదకోమటి వేమారెడ్డి కుమారుడు. 5 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అసమర్థుడు, వివేక శూన్యుడు. పురిటిసుంకం విధించి ప్రజాదరణ కోల్పోయాడు.


పరిపాలనా విధానం: సాంప్రదాయ పాలన జరిగేది. రాజు సర్వాధికారం చలాయించేవాడు. పరిపాలనలో రాజుకి ప్రధాని, సేనాధిపతి, పురోహితుడు తోడ్పడేవారు. పరిపాలనలో యువరాజుకి ప్రత్యేక స్థానం ఉండేది. పాలనలో ప్రధాన విభాగం ‘సీమ’. ప్రతి సీమను కొన్ని నాయంకరాలుగా విభజించేవారు. రాజ్యానికి గ్రామం పునాది. గ్రామ పరిపాలనను 12 మంది ఆయగాండ్రు చూసేవారు. వీరిలో రెడ్డి, కరణం, తలారి ముఖ్యులు. తలారినే ‘ఆరెకుడు’ అనేవారు. ఆరెకులు రాత్రుల్లో అవసరమైతే దివిటీలు పట్టుకొని కాపలా కాసేవారు. న్యాయపాలనకు ధర్మాసనాలు ఉండేవి. శిక్షలు కఠినంగా ఉండేవి. నేర విచారణకు అవసరమైతే దివ్యపరీక్షలు పెట్టేవారు.


ఆర్థిక పరిస్థితులు: వ్యవసాయం ప్రజల జీవనాధారం, ప్రధాన వృత్తి. రాజాస్థాన జీవితంతో విరక్తి చెందిన బ్రాహ్మణులు కూడా వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించేవారు. వ్యవసాయ అభివృద్ధికి చెరువులు, కాలువులు, బావులు తవ్వించేవారు. నేత పరిశ్రమ ప్రధానంగా ఉండేది. వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా రంగుల పరిశ్రమ ఉండేది. సింహాసన ద్వాత్రింశిక అనే గ్రంథం పలు రకాల పట్టువస్త్రాల గురించి పేర్కొంది. కత్తులు, గాజులు, అద్దాల పరిశ్రమలు ఉండేవి. దేశ, విదేశీ వాణిజ్యం జరిగేది. శ్రీనాథుని హరవిలాసం గ్రంథం ఆధారంగా నాడు సింహళం, సమత్రా, మలయా, ఇండోచైనా, ఆర్మజ్‌ దేశాలతో వాణిజ్యం చేసినట్టు తెలుస్తోంది. అనేక విలాస వస్తువులు దిగుమతి చేసుకొనేవారు. వ్యవసాయంపై పన్ను 1/6 వంతు.


మత పరిస్థితులు: రెడ్డి రాజులు శైవమతాభిమానులు. వీరి కాలంలో శైవం బాగా వ్యాప్తి చెందింది. పాశుపతంతో పాటు వీరశైవం ప్రజాదరణ పొందింది. అనవేమారెడ్డి శ్రీశైలంలో వీరశిరోమండపాన్ని నిర్మించాడు. కాళ్లు చేతులు నరుక్కోవడం, తలలు నరుక్కోవడం, నాలుకలు కత్తిరించుకోవడం, కండలు కోసి అర్పించడం వంటి క్రూర విధానాలు ఉండేవి. భృగుపాతం (కొండమీద నుంచి దూకి చనిపోవడం) వల్ల మోక్షం లభిస్తుందని కొందరు విశ్వసించేవారు. శ్రీశైలంలోని భృగుపాతం గురించి ‘పండితారాధ్య చరిత్ర’ గ్రంథంలో ఉంది. ప్రతి గ్రామానికి గ్రామదేవత ఉండేది. రెడ్డి రాజులకు మూలగూరమ్మ కులదేవత. గ్రామదేవత కొలువుల్లో జంతుబలులు సర్వసాధారణం. వైష్ణవానికి కూడా ఆదరణ ఉండేది. శ్రీ వైష్ణవాన్ని రామానుజాచార్యులు స్థాపించారు. దీనిలో 2 రకాలున్నాయి 1) తెంగళులు 2) వడగళులు


సాహిత్యం: రెడ్డి రాజులు సాహిత్య ప్రియులు, సంగీత పోషకులు. వీరు ఆదరించిన ప్రముఖ కవులలో ఎర్రాప్రగఢ, శ్రీనాథుడు ప్రముఖులు. ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనేవి బిరుదులు. హరివంశం, నృశింహపురాణం ఇతని రచనలు. శ్రీనాథుని బిరుదు కవి సార్వభౌముడు. ప్రాఢదేవరాయల వద్ద ఉండే గౌడడిండిమ భట్టును ఓడించి కనకాభిషేకం చేయించుకున్నాడు. అనే గ్రంథాలు రచించాడు.


రచయిత: గద్దె నరసింహారావు


 

Posted Date : 25-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌