• facebook
  • whatsapp
  • telegram

అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం

*భారత అంతరిక్ష రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వరంగ సంస్థ ఇస్రోతో పాటు ప్రైవేట్‌ రంగ సంస్థల భాగస్వామ్యం అత్యవసరం. 

*భారత్‌లోని అంకుర సంస్థలతో రోదసి పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు ఇస్రో సిద్ధంగా ఉంది. ఇదేకాకుండా ప్రైవేట్‌ సంస్థలు తయారుచేసిన రాకెట్లు, ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో తన కేంద్రాలను ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

*ఇందులో భాగంగా భారత ప్రభుత్వం  IN-SPACe(ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌), NSIL (న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌)లను ఏర్పాటు చేసింది.

IN-SPACe

* ఇది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ (Dos) అధీనంలో పనిచేసే స్వతంత్ర నోడల్‌ ఏజెన్సీ. దీన్ని కేంద్ర కేబినెట్‌ 2020, జూన్‌ 24న ప్రకటించింది. ఇది రోదసి రంగంలో ప్రైవేట్‌ సంస్థలన్నింటికీ ఒక సింగిల్‌ విండో సంస్థగా పనిచేస్తుంది.

*ప్రైవేట్‌రంగ సంస్థలను ప్రోత్సహించడం - వాటి రోదసి కార్యకలాపాలను పర్యవేక్షించి, సమీక్షించడం (supervise & authorise); వాహక నౌకలు, ఉపగ్రహాల నిర్మాణంలో తోడ్పాటు అందించడం; ఇస్రో అధీనంలోని మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే వీలు కల్పించడం ఇన్‌స్పేస్‌ విధి. ఇవేకాకుండా ఇది కొత్త పరిశోధన, ప్రయోగ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది.

NSIL

* ఇది ప్రభుత్వరంగ సంస్థ. ఇస్రో కొత్త వాణిజ్య విభాగం. దీన్ని 2019, మార్చి 6న ఏర్పాటు చేశారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. 

* ఇస్రో సాధించిన ప్రగతిని వాణిజ్యపరంగా ఉపయోగిస్తూ, ప్రైవేట్‌ రంగానికి టెక్నాలజీని బదలాయించి SSLV (Small satellite launch vechicle) PSLV (Polar satellite launch vechicle)రాకెట్ల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది.

ఇండియన్‌ స్పేస్‌ పాలసీ  2023

* 2023, ఏప్రిల్‌ 6న కేంద్ర కేబినెట్‌ కొత్త అంతరిక్ష విధానానికి ఆమోదం తెలిపింది. ఇది అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ రంగ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే బాధ్యతను ఇస్రో, NSIL,INSPACe’ లకు అప్పగించింది.

ఇందులోని ప్రధాన అంశాలు:

*రాకెట్లు, ఉపగ్రహాలను తయారుచేయటం - వాటిని ప్రయోగించడం. ఉపగ్రహాల సేవలను వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడంపై ప్రైవేట్‌ రంగ సంస్థలకు ఎలాంటి పరిమితులు ఉండవు.

* అంతరిక్ష రంగ పరిశోధన, అభివృద్ధి ఎంతో ఖర్చుతో కూడుకుంది. ఒక ప్రైవేట్‌ రంగ సంస్థ తన తొలి దశలోనే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను సమకూర్చుకోలేదు. కాబట్టి అది ఇస్రో వద్ద ఉండే మౌలిక వసతులను, టెక్నాలజీని అంకుర దశలో ఉపయోగించుకోవచ్చు.

* INSPACe ఏకగవాక్ష( single window) వ్యవస్థ. ఇది ప్రైవేట్‌ రంగ సంస్థలను ప్రోత్సహించి, వాటి అభివృద్ధికి తోడ్పడుతుంది.

* ఇస్రో కొత్త సాంకేతికతపై మరింత పరిశోధనలు చేసి, రోదసీ రంగంలో పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తుంది.

* కొత్త అంతరిక్ష విధాన పూర్తి ప్రతి (draft)ని కేంద్రం త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది.


ప్రైవేట్‌ రంగ సంస్థలు - విజయాలు

స్కైరూట్‌ ఏరోస్పేస్, హైదరాబాద్‌

* ఇస్రో నుంచి పదవీ విరమణ పొందిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. చిన్న తరహా రాకెట్ల శ్రేణిని ప్రయోగించడం దీని ప్రధాన ఉద్దేశం.

* మిషన్‌ ప్రారంభ్‌లో భాగంగా ఇది 2022, నవంబరు 18న భారత తొలి ప్రైవేట్‌ రాకెట్‌ విక్రం S ని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ప్రయోగించింది. ఇది 6 మీ. పొడవు, 545 కేజీల బరువైన ఏక ఘన ఇంధన అంచె రాకెట్‌. 

*ఇది 89.5 కి.మీ. ఎత్తుకు వెళ్లి, కొన్ని నిమిషాల్లోనే బంగాళాఖాతంలో పడిపోయింది.

* విక్రం S లోని ప్రొపల్షన్‌ సిస్టం కలాం-80.

* విక్రం శ్రేణిలో తయారయ్యే రాకెట్లు:

విక్రం 1- 480 కేజీల పేలోడ్‌ని నింగిలోకి మోసుకెళ్తుంది.
విక్రం 2- 590 కేజీల పేలోడ్‌ని మోసుకెళ్తుంది.

విక్రం 3- 815 కేజీల పేలోడ్‌ని మోసుకెళ్తుంది.

* స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ ధావన్‌  2 అనే 3D ముద్రిత క్రయోజెనిక్‌ ఇంజిన్‌ని 2023, ఏప్రిల్‌ 4న 200 సెకన్ల కాలంపాటు విజయవంతంగా మండించి, పరీక్షించింది. ఇది దృవీకృత సహజవాయువు (LNG), ద్రవీకృత ఆక్సిజన్‌ను ఇంధనం, ఆక్సీకరణిగా ఉపయోగించుకుంటుంది.

*‘ధృవాస్త్ర’ అనే మరో 3D ముద్రిత క్రయోజెనిక్‌ ఇంజిన్‌ని ఇది 2023, మార్చి 25 న 75 సెకన్లపాటు విజయవంతంగా మండించింది.

* ఈ సంస్థ రామన్‌-1 అనే ద్రవ ఇంధన రాకెట్‌ ఇంజిన్‌తోపాటు కలాం-5 పేరుతో ఘన ఇంధన ఇంజిన్లను అభివృద్ధి చేస్తోంది.

అగ్నికుల్‌ కాస్మోస్, చెన్నై

* IIT మద్రాస్‌కి చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కంబషన్‌ (R&D) తో ముడిపడిన అంకుర సంస్థ అగ్నికుల్‌ కాస్మోస్‌. అగ్నిబాణ్‌ లాంటి చిన్న రాకెట్లను ప్రయోగించడం దీని లక్ష్యం.

* భారత తొలి ప్రైవేట్‌ రాకెట్‌ లాంచ్‌ప్యాడ్‌ని అగ్నికుల్‌ 2022, నవంబరు 8న శ్రీహరికోటలో నెలకొల్పింది. ఇక్కడి నుంచే అగ్నిబాణ్‌ రాకెట్‌ని ప్రయోగించనుంది.

*అగ్నిబాణ్‌ రెండంచెల రాకెట్‌. ఇది 100 కేజీల పేలోడ్‌ని  700 కి.మీ. ఎత్తులోని  (LEO) లోకి ప్రయోగించగలదు. దీని మొదటి అంచెలో 7 ఆగ్నైట్‌ ఇంజిన్లు, రెండో అంచెలో అగ్నిలెట్‌ ఇంజిన్‌ ఉంటాయి. 

* అగ్నిలెట్‌ ప్రపంచంలోనే తొలి 3దీ ముద్రిత సింగిల్‌ పీస్‌ ఇంజిన్‌. ఇందులో ద్రవ ఆక్సిజన్, కిరోసిన్‌లను ఇంధనంగా వాడతారు. అగ్నిబాణ్‌ లాంచ్‌కి ముందస్తుగా అగ్నిలెట్‌ని ఈ మధ్యే 108 సెకన్ల కాలం పాటు మండించి, పరీక్షించారు. ఇది సముద్ర మట్టం వద్ద 6 కిలో న్యూటన్ల (6 kN) ఒత్తిడి (Thrust) ని ఉత్పత్తి చేసింది. 

Pixxel, బెంగళూరు

* Sun synchronous orbit (SSO) లో ముప్పైకి పైగా అత్యాధునిక హైపర్‌ స్పెక్ట్రల్‌ శాటిలైట్ల సమూహాన్ని ప్రయోగించి భూమి, అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడం పిక్సెల్‌ లక్ష్యం. 

* 5 మీ. స్పేషియల్‌ రిజల్యూషన్, పదింతల (10x)  సమాచారంలో మనం చూడలేని ఖగోళ వస్తువులను ఇవి గుర్తించగలవు. 

* పిక్సెల్‌ తొలి టెక్నాలజీ డెమోన్‌స్ట్రేషన్‌ శాటిలైట్‌ ‘ఆనంద్‌’. దీన్ని PSLV C-54 రాకెట్‌ ద్వారా 2022, నవంబరు 26న ప్రయోగించారు. ఇది సూక్ష్మస్థాయిలో భూమిని పరిశీలించే సామర్థ్యంతో LEO లో ఉండే ఒక మైక్రో శాటిలైట్‌.

పిక్సెల్‌ రెండో శాటిలైట్‌ శకుంతల/ TD-2 ని స్పేస్‌-ఎక్స్‌కి చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌తో ప్రయోగించింది.

ధృవస్పేస్, హైదరాబాద్‌ 

* చిన్న తరహా ఉపగ్రహాలను, గ్రౌండ్‌ స్టేషన్లను, శాటిలైట్‌ డిప్లాయర్లను వాణిజ్య, ప్రభుత్వ, విద్యా రంగాల్లో ఏర్పాటు చేయటం దీని లక్ష్యం.

* ఇది Thybolt-1,Thybolt-2 పేర్లతో రెండు క్యూబ్‌ శాట్‌లను శిళీలిజుది54 ద్వారా ప్రయోగించింది.

స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా, చెన్నై

*ఇది స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు అంతరిక్ష శాస్త్రంపై అవగాహన పెంపొందించి, వారితో శాటిలైట్లను తయారు చేయిస్తున్న ఏకైక సంస్థ.

* ఇది ఇప్పటికే 18 బెలూన్‌ శాటిలైట్లను, 2 సబ్‌ ఆర్బిటాల్‌ ఉప గ్రహాలను, మూడు ఆర్బిటాల్‌ శాటిలైట్లను ప్రయోగించింది.

* ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా సుమారు 75 ప్రభుత్వ పాఠశాలల్లోని 750 బాలికలు రూపొందించిన ఆజాదీశాట్‌-1, ఆజాదీశాట్‌-2 ఉపగ్రహాలను ఇది ప్రయోగించింది. ఆజాదీశాట్‌-1ని SSLV-D1 ప్రయోగించగా, అది విఫలమైంది. ఆజాదీశాట్‌-2ని SSLV-D2తో విజయవంతంగా ప్రయోగించారు.

*  భారత్, అమెరికా, యూఏఈ, మలేసియా, సింగపూర్, ఇండోనేసియాకి చెందిన 100 మంది విద్యార్థులు రూపొందించిన Fun SAT ఉపగ్రహాన్ని భారత తొలి ప్రైవేట్‌ రాకెట్‌ Vikram-S తో ప్రయోగించారు.

* 1200 గ్రా. బరువుతో ఉండే 10 సెం.మీ. క్యూబ్‌శాట్‌ కలాంశాట్‌- V2 ని PSLV-C44 ద్వారా 2019లో ప్రయోగించారు. PSLV నాలుగో అంచె PS4ని ప్రయోగ వేదికగా ఉపయోగించుకున్న తొలి శాటిలైట్‌ కలాంశాట్‌ - V2( ప్రపంచంలోనే అత్యంత తేలికైన (64 గ్రా., 3.8 సెం.మీ. Cube sat) శాటిలైట్‌ ‘కలాంశాట్‌’ అనే ఫెమిటో శాటిలైట్‌ను 2017లో నాసా ప్రయోగించింది.
దిగంతర, బెంగళూరు

* అంతరిక్ష పరిస్థితికి సంబంధించిన అవగాహనను (SSA - Space situational awareness) కల్పించేందుకు ఏర్పడిన సంస్థ దిగంతర రిసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. భారత తొలి SSA అబ్జర్వేటరీని ఇది ఘర్వాల్, ఉత్తరాఖండ్‌లో ఏర్పాటు చేస్తుంది. భూమి చుట్టూ తిరిగే 10 సెం.మీ. పరిమాణంలోని అంతరిక్ష వ్యర్థాలను (Space debris) ఇది గుర్తిస్తుంది. లినివీ నుంచి బినివీ వరకు ఉండే వ్యర్థాల సమాచారాన్ని ఇది అంతరిక్ష సంస్థలకు చేరవేస్తుంది. దీంతో అవి తమ కృత్రిమ ఉపగ్రహాలను వ్యర్థాల నుంచి రక్షించుకుంటాయి.

* PSLV -C53 లోని PSL4లో దిగంతర స్పేస్‌ వెదర్‌ ఇన్‌స్ట్రుమెంట్‌  ROBI (Robust integrating fluence meter) ని ప్రయోగించారు. 2023, జనవరిలో ‘పుషాన్‌-ఆల్ఫా’ అనే మరో ROBI నిSpaceX కి చెందిన  Transporter 6 ద్వారా ప్రయోగించారు. ఇది SSO లోని వికిరణాలమాపనం, వాతావరణ ఉపగ్రహాలపై కలగజేసే వ్యతిరేక బలం (drag), కణాలను గుర్తించి కక్ష్య-వ్యర్థాల తీరును అధ్యయనం చేస్తుంది.

Posted Date : 11-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌