• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1967 వరకు కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఒకే రాజకీయ పార్టీ (కాంగ్రెస్‌) అధికారంలో ఉండటం వల్ల కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సక్రమంగా కొనసాగాయి.

* 1967లో దేశంలో జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం నిలబెట్టుకున్నప్పటికీ ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెసేతర పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. ఫలితంగా కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాల సాధన కోసం కేంద్ర ఆధిపత్యాన్ని ప్రశ్నించడం వల్ల కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో ఘర్షణ వాతావరణం ప్రారంభమైంది.

అధికారాల విభజన

 భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 3 రకాల అధికారాల విభజనను నిర్దేశించారు.

అవి

1. కేంద్రజాబితా: ఇందులో ప్రారంభంలో 97 అంశాలు, ప్రస్తుతం 100 అంశాలు ఉన్నాయి. ఈ జాబితాపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుంది.

2. రాష్ట్ర జాబితా: ఇందులో తొలుత 66 అంశాలు, ప్రస్తుతం 61 అంశాలు ఉన్నాయి. దీనిలోని అంశాలపై రాష్ట్ర శాసనసభలు శాసనాలు రూపొందిస్తాయి.

3. ఉమ్మడి జాబితా: ఇందులో ప్రారంభంలో 47 అంశాలు, ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి. ఈ జాబితాలోని అంశాలపై పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు శాసనాలు రూపొందించవచ్చు.

4. అవశిష్ట అధికారాలు: పైన పేర్కొన్న మూడు జాబితాల్లో లేని అంశాలను ‘అవశిష్టాంశాలు’ అంటారు. ఇవి కేంద్రానికి చెందేలా రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. ఈ అంశాన్ని కెనడా నుంచి స్వీకరించారు. ఒక అంశం అవశిష్టాధికారమా? కాదా? అని ధ్రువీకరించేది సుప్రీంకోర్టు. 

భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని పరిపాలనా పరమైన సమాఖ్యగా ఏర్పాటు చేశారు. కానీ సిద్ధాంత పరమైన సమాఖ్యగా ఏర్పాటు చేయలేదు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పాల్సిన ఆవశ్యకతను రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు.

* మన దేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు 3 విధాలుగా ఉన్నాయి. అవి:
1) శాసన సంబంధాలు - 11వ భాగంలోని 245 - 255 వరకు ఉన్న ప్రకరణల్లో వివరించారు.
2) పరిపాలన సంబంధాలు - 11వ భాగంలోని 256 - 263 వరకు ఉన్న ప్రకరణల్లో వివరించారు.
3) ఆర్థిక సంబంధాలు - 12వ భాగంలోని 264 - 300 (A) వరకు ఉన్న ప్రకరణల్లో వివరించారు.

రాజ్యాంగం ఏమంటోంది..? 

మన రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను మూడు విధాలుగా పేర్కొన్నారు. అవి:

1. శాసన సంబంధాలు -  XI వ భాగంలో ఆర్టికల్‌ 245 నుంచి 255 వరకు.

2. పరిపాలనా సంబంధాలు -  XIవ భాగంలో ఆర్టికల్‌ 256 నుంచి 263 వరకు.

3. ఆర్థిక సంబంధాలు - XIIవ భాగంలో ఆర్టికల్‌ 264 నుంచి 300(A) వరకు.


శాసన సంబంధాలు
రాజ్యాంగంలోని 11వ భాగంలో 245 నుంచి 255 వరకు ఉన్న 11 ప్రకరణల్లో కేంద్ర, రాష్ట్రాల శాసన సంబంధాలను వివరించారు.
ఆర్టికల్ 245
పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల శాసనాధికార పరిధిని వివరిస్తుంది.

ఆర్టికల్ 245 (1)
దేశం మొత్తానికి లేదా కొన్ని ప్రాంతాలకు అవసరమైన శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఒక రాష్ట్రం మొత్తానికి లేదా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు అవసరమైన శాసనాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంది.
ఆర్టికల్ 245 (2)
పార్లమెంటు చేసిన శాననాలు ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులకు కూడా వర్తిస్తాయి. (Extra Territorial Operations)
ఆర్టికల్ 246
పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల మధ్య అధికారాల విభజన, చట్టాలకు సంబంధించిన విషయాలు.
ఆర్టికల్ 246 (1)
7వ షెడ్యూల్‌లో పేర్కొన్న కేంద్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది.
ఆర్టికల్ 246 (2)
* 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఉంది.
* ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర చట్టాల మధ్య విభేదాలు వస్తే కేంద్ర శాసనమే చెల్లుతుంది. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ఆక్యుపైడ్ ఫీల్డ్స్ అంటారు.
ఆర్టికల్ 246 (3)
7వ షెడ్యూల్‌లో పేర్కొన్న రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంది.
ఆర్టికల్ 246 (4)
రాష్ట్ర ప్రభుత్వాల భౌగోళిక పరిధికి వెలుపల ఉన్న భారత్‌లోని ఇతర ప్రాంతాలకు సంబంధించి పార్లమెంటు ఎలాంటి శాసనాలనైనా రూపొందించవచ్చు.
ఆర్టికల్ 247
కేంద్ర జాబితాలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి పార్లమెంటు చేసిన చట్టాలను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేయవచ్చు.
ఆర్టికల్ 248
* అవశిష్ట అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఈ విధానాన్ని రాజ్యాంగ నిర్మాతలు కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* 1935 భారత ప్రభుత్వ చట్టంలోని అవశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్‌కు అప్పగించారు. ఒక అంశం అవశిష్ట అధికారమా? కాదా? అనేది సుప్రీంకోర్టు ధ్రువీకరిస్తుంది.
ఆర్టికల్ 249
* జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందించగలదు.

ఆర్టికల్ 249 (1)
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీ ద్వారా ఒక తీర్మానం చేస్తే, రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది. ఈ విధంగా రూపొందిన శాసనం ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది.
ఆర్టికల్ 250
భారత రాష్ట్రపతి ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే ఆర్టికల్ 250 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది.
¤ ఈ విధంగా రూపొందిన శాసనం అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల వరకు మాత్రమే అమల్లో ఉంటుంది.
ఆర్టికల్ 251
ఆర్టికల్ 249, 250 లను అనుసరించి పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై రూపొందించిన శాసనాలు రాష్ట్ర శాసనాలతో వైరుధ్యం కలిగి ఉంటే పార్లమెంటు రూపొందించిన శాసనాలే చెల్లుతాయి. పార్లమెంటు చేసే చట్టాలకు కాల పరిమితి ముగిసిన తర్వాత రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు తిరిగి అమల్లోకి వస్తాయి.

ఆర్టికల్ 252
రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు తమ ప్రయోజనార్థం శాసనాలను రూపొందించాలని కోరితే, రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది.
ఉదా: ఎస్టేట్ సుంకం చట్టం, 1955
     ప్రైజ్ కాంపిటీషన్ చట్టం, 1955
     వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972
     జల కాలుష్య నివారణ చట్టం, 1974
     పట్టణ ఆస్తుల పరిమితి చట్టం, 1976
ఆర్టికల్ 253
భారత ప్రభుత్వం విదేశాలతో చేసుకున్న ఒప్పందాలు, సంధులను అమలు చేయడానికి సంబంధించిన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది. ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాల శాసనాలు ఉంటే వాటిని పార్లమెంటు సవరించవచ్చు.
ఉదా: ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సౌకర్యాలు, రక్షణల చట్టం - 1947
     జెనీవా ఒప్పంద చట్టం - 1960
    హైజాకింగ్ వ్యతిరేక చట్టం - 1982

ఆర్టికల్ 254
* పార్లమెంటు చేసిన చట్టానికి, రాష్ట్ర శాసనసభ చేసిన చట్టానికి వైరుధ్యం ఏర్పడినప్పుడు పార్లమెంటు చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది.
* రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు చట్టాన్ని రూపొందిస్తే ఆ అంశంపై రాష్ట్రానికి ఎలాంటి అధికారం ఉండదని 1990లో బిహార్ రాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆర్టికల్ 255
* ఏదైనా అంశానికి సంబంధించి శాసనం చేయాలంటే రాష్ట్రపతి లేదా గవర్నర్ ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే వారి నుంచి ముందుగా అనుమతి పొందకుండానే పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ శాసనాన్ని రూపొందించి ఉండవచ్చు.
* ఈ విధంగా రూపొందించిన శాసనానికి రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే 'ముందస్తు అనుమతి లేకుండా శాసనం చేశారనే' కారణంపై చెల్లకుండా పోదు.
ఆర్టికల్ 201
* రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను సంబంధిత రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపవచ్చు. రాష్ట్రపతి ఆమోదంతో ఆ బిల్లు శాసనంగా మారుతుంది.

ఆర్టికల్ 352
* రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు రాష్ట్ర జాబితాలోని పాలనాంశాలపై చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది.
ఆర్టికల్ 356
* ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం కారణంగా రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ తరఫున పార్లమెంటు శాసనాలను రూపొందిస్తుంది.
ఆర్టికల్ 31 (ఎ)
* రాష్ట్రాల్లో ఆస్తులను జాతీయం చేసే బిల్లులను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి.
Doctrine of Pith and Substance:
      కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగిన సందర్భంలో ఒక నిర్ణీత అంశం లేదా చట్టాన్ని ఒక జాబితాలో పొందుపరుస్తారు. ఆ జాబితాలో పొందుపరచిన అంశం మరో జాబితాలో పొందుపరచిన అంశంతో సందర్భానుసారం కొంతవరకు అతిక్రమించినా ఆ చట్టాలు చెల్లుతాయి. దీన్నే Pith and Substance అంటారు.

బెంగాల్ vs బెనర్జీ కేసు:
      ఈ కేసులో మనీ లెండింగ్ (అప్పులు) అనే అంశంపై శాసనం చేసే సందర్భంలో కేంద్ర జాబితాలోని ప్రామిసరీ నోట్లు అనే అంశం కూడా ఇమిడి ఉండటం వల్ల అది రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. కొన్ని సార్లు అనుకోకుండా ఒక జాబితాలోని అంశంపై శాసనం చేసే సందర్భంలో మరో జాబితాలోకి చొచ్చుకుని రావడమే Pith and Substance అంటారు.

 

బల్లార్‌షా vs స్టేట్ ఆఫ్ ముంబయి కేసు:
      ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ముంబయి రాష్ట్రం మద్యపానాన్ని నిషేధిస్తూ చట్టం చేసింది. ఈ సందర్భంలో కేంద్ర జాబితాలో పేర్కొన్న విదేశీ మద్యం అనే అంశాన్ని అనుకోకుండా చేర్చడం వల్ల ఆ చట్టం చెల్లుతుందని, అది రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.

 

కేతన్ ఈశ్వర్ షుగర్ మిల్స్ vs స్టేట్ ఆఫ్ ఉత్తర్‌ప్రదేశ్ కేసు:
      ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూములను జాతీయం చేసే సందర్భంలో కేంద్ర జాబితాలోని 'షుగర్ ఫ్యాక్టరీ'ని కూడా జాతీయం చేస్తూ చట్టం చేయడమనేది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని ఈ చట్టం చెల్లుతుందని పేర్కొంది.
      సదరన్ ఫార్మాస్యూటికల్ vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు, చావ్లా vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్, సింథటిక్ కెమికల్స్ లిమిటెడ్ vs స్టేట్ ఆఫ్ ఉత్తర్‌ప్రదేశ్ కేసుల్లో Pith and Substance గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
Colourable Legislation:
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన శాసనాలు ఏవైనా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానాలు తీర్పునిచ్చిన తర్వాత, అవే శాసనాలను మరో రూపంలో తీసుకొచ్చినప్పుడు అవి కూడా చెల్లవని న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడాన్నే Colourable Legislation గా పేర్కొంటారు.
* ప్రత్యక్షంగా ఒప్పు కానిది ఏదీ పరోక్షంగా కూడా ఒప్పు కాదని, ఒక రూపంలో తప్పుగా భావించిన దాన్ని మరో రూపంలో కూడా ఒప్పు కాదని పేర్కొనడాన్నే Colourable Legislation అంటారు.
* కె.సి.జి. నారాయణ్‌దేవ్ vs స్టేట్ ఆఫ్ ఒడిశా కేసులో తొలిసారిగా సుప్రీంకోర్టు Colourable Legislation సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది.
* కామేశ్వరీ సింగ్ vs స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో Colourable Legislation సిద్ధాంతాన్ని అనుసరించి సుప్రీంకోర్టు తొలిసారిగా తీర్పు ఇచ్చింది.
* ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై కేంద్రం, రాష్ట్రాలు పరస్పర విరుద్ధమైన శాసనాలు రూపొందిస్తే, కేంద్ర శాసనమే చెల్లుతుందని చెప్పడాన్ని Doctrine of Repugnancy అంటారు.
* కానీ రాష్ట్రపతి ముందస్తు అనుమతితో రాష్ట్రాలు ముందుగా శాసనం రూపొందిస్తే రాష్ట్ర శాసనమే అమల్లో ఉంటుంది.

కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలు
* భారత రాజ్యాంగంలోని 11వ భాగంలో 256 నుంచి 263 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే పరిపాలనా సంబంధాలను వివరిస్తున్నాయి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధికి కట్టుబడి తమ కార్యనిర్వహణాధికారాలను నిర్వహించినప్పటికీ కొన్ని సందర్భాల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకార సంబంధాలు కూడా ఉంటాయి.
* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని తెలియజేయగా, ఆర్టికల్ 162 రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిని తెలియజేస్తుంది.
ఆర్టికల్ 256
* రాష్ట్రాలు తమ పరిపాలనను పార్లమెంటు చేసిన చట్టాలకు, కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు విరుద్ధంగా నిర్వహించరాదు.
* కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పరిపాలనాపరమైన ఆదేశాలను జారీ చేసినప్పుడు వాటిని రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
* డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అభిప్రాయం ప్రకారం కేంద్రానికి ఆర్టికల్ 256 ప్రకారం ఉన్న అధికారం లేకపోయినట్లయితే పార్లమెంటు చేసే చట్టాలను అమలు చేయడం సాధ్యం కాదు.

ఆర్టికల్ 257
* రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వహణాధికారాలను కేంద్రం నియంత్రిస్తుంది. రాష్ట్రాలు తమ అధికారాలను వినియోగించుకునే సందర్భంలో అవి కేంద్ర ప్రభుత్వ అధికారాలను ప్రశ్నించే విధంగా ఉండకూడదు.
* కేంద్ర ప్రభుత్వ ఆస్తులైన రైల్వేలు, టెలికమ్యూనికేషన్లు లాంటి వాటిని రాష్ట్రాలు పరిరక్షించాలి. జాతీయ ఆస్తుల సంరక్షణ విషయమై కేంద్ర ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
ఆర్టికల్ 258
* కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రైల్వేలు, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లు లాంటి నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించవచ్చు. వాటి నిర్మాణ ఖర్చులను కేంద్రమే భరిస్తుంది.
* రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర కార్యనిర్వాహక అధికార పరిధిలోని ఏవైనా అంశాలను కేంద్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులకు షరతులతో లేదా షరతులు లేకుండా అప్పగించవచ్చు. అయితే దీనికి కేంద్రం అంగీకరించాలి. దీన్ని 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా చేర్చారు.
ఆర్టికల్ 259
* శాంతి భద్రతల పరిరక్షణ కోసం కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రాల్లో మోహరించవచ్చు. దీన్ని 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా తొలగించారు.

ఆర్టికల్ 260
* భారతదేశం వెలుపల ఉన్న భూభాగాలపై శాసన, కార్యనిర్వాహక, న్యాయాధికారాలను కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండవచ్చు. అయితే దానికి సంబంధించిన ఒప్పందం భారతదేశానికి విదేశాలతో ఉండాలి. సంబంధిత ఒప్పందం విదేశీ భూభాగపు పరిపాలనకు సంబంధించి అమల్లో ఉన్న శాసనానికి అనుగుణంగా ఉండాలి.
ఆర్టికల్ 261
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ చట్టాలు, రికార్డులు, న్యాయపరమైన చర్యలను భారతదేశమంతా గౌరవించాలి.
* సివిల్ న్యాయస్థానాలు వెలువరించే అంతిమ తీర్పులను భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా చట్ట ప్రకారం అమలుచేయవచ్చు.
ఆర్టికల్ 262
* అంతర్‌రాష్ట్ర నదీ జలాల పంపకంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రైబ్యునల్ తీర్పును అనుసరించి పార్లమెంటు ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తే, దాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి, న్యాయ సమీక్షకు గురి చేయడానికి వీల్లేదు.
* అయితే నదీ జలాల పంపకంపై పార్లమెంటు రూపొందించిన చట్టాన్ని ఏదైనా రాష్ట్రం ఉల్లంఘిస్తే దానిపై సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు.
* భారత పార్లమెంటు 1956లో అంతర్‌రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం, రివర్ బోర్డ్ చట్టాన్ని రూపొందించింది.

ఇప్పటివరకు మన దేశంలో 8 అంతర్‌రాష్ట్ర నదీ జలాల ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేశారు. అవి:
1. కృష్ణా నదీ జలాల ట్రైబ్యునల్ (1969)
    దీని పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.
2. గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్ (1969)
    దీని పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.
3. నర్మదా నదీ జలాల ట్రైబ్యునల్ (1969)
    దీని పరిధిలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
4. రావి, బియాస్ నదీ జలాల ట్రైబ్యునల్ (1986)
    దీని పరిధిలో పంజాబ్, హరియాణా రాష్ట్రాలు ఉన్నాయి.
5. కావేరి నదీ జలాల ట్రైబ్యునల్ (1990)
    దీని పరిధిలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఉన్నాయి.
6. కృష్ణా నదీ జలాల ట్రైబ్యునల్ - II (2004)
    దీని పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.

7. వంశధార నదీ జలాల ట్రైబ్యునల్ (2010)
    దీని పరిధిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి.
8. మహదాయి (మాండవి నది) నదీ జలాల ట్రైబ్యునల్ (2010)
    దీని పరిధిలో గోవా, కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి.
ఆర్టికల్ 263
¤ అంతర్ రాష్ట్ర మండలి ఏర్పాటు గురించి తెలియజేస్తుంది.
¤ వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను విచారించి పరిష్కరించడానికి; అవసరమైన సలహాలు, సిఫార్సులు చేయడానికి రాష్ట్రపతి అంతర్‌రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారు.

 

అంతర్‌రాష్ట్ర మండలి నిర్మాణం
* 1990, మే 28న వి.పి.సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ అంతర్‌రాష్ట్ర మండలిని ఆర్టికల్ 263 ప్రకారం ఏర్పాటు చేశారు.
* అంతర్‌రాష్ట్ర మండలికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.
* దీనిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర హోంమంత్రితో సహా ఆరుగురు కేంద్ర కేబినెట్ మంత్రులు సభ్యులుగా ఉంటారు.
* దిల్లీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనాధికారులు సభ్యులుగా ఉంటారు.

* అంతర్‌రాష్ట్ర మండలి సంవత్సరానికి 3 సార్లు సమావేశం కావాలి.
* 1991లో అంతర్‌రాష్ట్ర మండలి విధులను నిర్వర్తించడానికి ఒక సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేశారు.
* సెక్రటేరియట్ 2011 నుంచి జోనల్ కౌన్సిల్ సెక్రటేరియట్ నిర్వహించే విధులను నిర్వర్తిస్తోంది.
* అంతర్‌రాష్ట్ర మండలికి సంబంధించి 1996లో ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్థాయీ సంఘానికి కేంద్ర హోంమంత్రి అధ్యక్షుడిగా, అయిదుగురు కేంద్ర కేబినెట్ మంత్రులు, 9 మంది ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు.
2015, డిసెంబర్ 18న అంతర్‌రాష్ట్ర మండలి సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ నియమించారు. వారు
1. రాజ్‌నాథ్ సింగ్
2. వెంకయ్యనాయుడు
3. సుష్మాస్వరాజ్
4. అరుణ్ జైట్లీ
5. నితిన్ గడ్కరీ
* 2013, డిసెంబర్ 12న డాక్టర్ మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా వ్యవహరిస్తూ అంతర్‌రాష్ట్ర మండలిని పునర్వ్యవస్థీకరించారు. దీని ప్రకారం కొత్తగా రైల్వే శాఖ మంత్రికి అవకాశం కల్పించారు. శాశ్వత ఆహ్వానితుల సంఖ్యను 6 నుంచి 5కు తగ్గించారు.

అంతర్‌రాష్ట్ర మండలి విధులు
* వివిధ రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించేందుకు, సూచనలు, సలహాలు ఇవ్వడం.
* కేంద్రానికి, కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య వివాదాలను పరిష్కరించడం.
* రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి, ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయడం.
* 1990 నుంచి 2005 వరకు అంతర్ రాష్ట్ర మండలి 9 సమావేశాలను నిర్వహించింది.
* 2006, డిసెంబర్ 9న అంతర్ రాష్ట్ర మండలి 10వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించారు.
* 2016, జులై 16న అంతర్ రాష్ట్ర మండలి 11వ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కశ్మీర్, కర్ణాటక ముఖ్యమంత్రులు తప్ప మిగిలిన ముఖ్యమంత్రులు అందరూ హాజరయ్యారు.
* ఈ సమావేశంలో ఆధార్ అనుసంధానానికి సంబంధించిన అంశాలతో పాటు ఎం.ఎం.పూంచీ కమిషన్ సిఫారసులపై చర్చించారు.

రాజ్యాంగంలోని ఇతర భాగాల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర పరిపాలనా సంబంధాలు
ఆర్టికల్ 155
    రాష్ట్రాల పరిపాలనలో కీలక పాత్రను పోషించే గవర్నర్లను నియమించేది, నియంత్రించేది, బదిలీ చేసేది కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి.
ఆర్టికల్ 312
   అఖిల భారత సర్వీసుల ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నింటిలో పరిపాలనా విధులను నిర్వహిస్తారు.
ఆర్టికల్ 315
  రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కోరితే ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ)ను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అఖిల భారత సర్వీసుల ఉద్యోగులను ఎంపిక చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ను కేంద్రమే నియమిస్తుంది.
ఆర్టికల్ 339
    షెడ్యూల్డ్ తెగల శ్రేయస్సును పెంపొందించడానికి తగిన కార్యక్రమాలను రూపొందించి, అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కార్యనిర్వాహక ఆదేశాలను జారీచేయవచ్చు.

ఆర్టికల్ 340
   వెనుకబడిన తరగతుల స్థితిగతులను దర్యాప్తు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సిఫారసులు చేయడానికి ఒక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్టికల్ 341
   షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాల్సిన ఇతర ప్రభావ వర్గాల విషయమై రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి రాష్ట్రపతి తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
ఆర్టికల్ 355
   రాష్ట్రాల సంరక్షణ బాధ్యత కూడా కేంద్రానిదే. కేంద్రం అనేక సందర్భాల్లో రాష్ట్రాల కోరికపై తన సాయుధ బలగాలను రాష్ట్రాలకు సహాయంగా పంపుతుంది.

 

కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలు
* భారత రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్ 264 నుంచి 300 (A) వరకు ఉన్న ఆర్టికల్స్‌లో కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక సంబంధాలను పొందుపరిచారు.
* ప్రొఫెసర్ అమల్ రే అభిప్రాయం ప్రకారం కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో మిగిలిన వాటి కంటే ఆర్థిక సంబంధాలే ఎక్కువ వివాదానికి కారణమవుతున్నాయి.

ఆర్టికల్ 264
కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల విధింపుకు సంబంధించి కచ్చితమైన విభజన చేశారు. కేంద్ర ప్రభుత్వం 15 రకాల పాలనాంశాలపై పన్ను విధించగలదు. అవి:
1. వ్యవసాయేతర ఆదాయంపై పన్ను
2. ఎగుమతి, దిగుమతి సుంకాలు
3. పొగాకుపై ఎక్సైజ్ పన్ను
4. కార్పొరేషన్ పన్ను
5. మూలధన విలువపై పన్ను
6. వ్యవసాయేతర ఎస్టేట్‌లపై పన్ను
7. వారసత్వ పన్ను
8. అంతర్ రాష్ట్ర రవాణా పన్ను
9. స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్ పన్ను
10. చెక్స్, ప్రామిసరీ నోట్లు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇన్సూరెన్స్ పాలసీల బదిలీలపై పన్ను
11. అంతర్ రాష్ట్ర వ్యాపారంలో విధించే అమ్మకం పన్ను
12. వార్తా పత్రికలపై అమ్మకపు, ప్రకటనలపై పన్ను
13. అంతర్ రాష్ట్ర వాణిజ్యంలో సరకులపై విధించే పన్ను
14. సర్వీసులపై పన్ను
15. వ్యవసాయేతర భూముల వారసత్వ బదలాయింపు పన్ను
రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 20 రకాల పాలనాంశాలపై పన్నులు విధిస్తాయి
1. భూమి శిస్తు
2. వ్యవసాయ ఆదాయంపై పన్ను
3. వ్యవసాయ భూములపై వారసత్వ పన్ను
4. వ్యవసాయ భూములపై ఎస్టేట్ పన్ను
5. స్థిరాస్తులపై పన్ను (భూములు, భవనాలు)
6. ఖనిజాలపై పన్ను
7. మద్యపానంపై పన్ను
8. ఆక్ట్రాయ్ పన్ను (స్థానిక ప్రాంతాల్లోకి రవాణా అయ్యే వస్తువులపై పన్ను)
9. విద్యుత్ వినియోగం, అమ్మకంపై పన్ను
10. వాణిజ్య పన్ను
11. ప్రకటనలపై పన్ను
12. రోడ్డు, జల రవాణాపై పన్ను
13. మోటారు వాహనాలపై పన్ను
14. పశువులపై పన్ను
15. టోల్ ట్యాక్స్
16. వృత్తి పన్ను
17. కస్టడీ పన్నులు
18. వినోదపు పన్నులు
19. కేంద్ర జాబితాలోని డాక్యుమెంట్లు మినహా మిగతావాటిపై స్టాంపు డ్యూటీ
20. రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించిన ఇతర ఫీజులు
అవశిష్ట వన్నులు: కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే విధించే పన్నులు
1. బహుమతి పన్ను
2. సంపద పన్ను
3. వ్యయంపై పన్ను
సేవా పన్ను
రాజా చెల్లయ్య కమిటీ సిఫారసుల మేరకు 1994 నుంచి సేవా పన్ను అమల్లోకి వచ్చింది. సేవలపై విధించే పన్నును సేవా పన్నుగా వ్యవహరిస్తారు. కేంద్ర స్థాయిలో ఇది విలువ అధారిత పన్నులో అంతర్భాగంగా ఉంది.

* ప్రస్తుతం సేవా పన్ను రేటు 12%. సేవా పన్నుపై అదనంగా 2% విద్యా సెస్, 1% సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ విధించారు. కాబట్టి ప్రస్తుతం మొత్తం సేవా పన్ను రేటు 12.36%.
ఆర్టికల్ 265
 మన దేశంలో చట్టబద్ధంగా మాత్రమే పన్నులు విధించి వసూలు చేయాలి. చట్టం చేయనిదే ఎలాంటి పన్నులు విధించకూడదు.
* పార్లమెంటు రూపొందించే చట్టాలను అనుసరించి దేశవ్యాప్తంగా పన్నులు విధిస్తారు.
* రాష్ట్ర శాసనసభలు రూపొందించే చట్టాల ప్రకారం రాష్ట్రాల్లో పన్నులు విధించి వసూలు చేయాలి.
ఆర్టికల్ 266
   సంఘటిత నిధి, ప్రభుత్వ ఖాతాల గురించి తెలియజేస్తుంది.
ఆర్టికల్ 266 (1)
 
 కేంద్ర ప్రభుత్వం పొందే అన్ని పన్నులు, ట్రెజరీ బిల్లుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించే రుణాలు, ఇతర రుణాలు, అడ్వాన్సులు, ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వానికి లభించే మొత్తాలన్నింటినీ భారత సంఘటిత నిధి (Consolidated Fund of India) లో జమ చేయాలి.
* రాష్ట్ర ప్రభుత్వాలు పొందే అన్ని పన్నులు, ట్రెజరీ బిల్లుల ద్వారా అడ్వాన్సులు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు లభించే మొత్తాలన్నింటినీ సంబంధిత రాష్ట్ర సంఘటిత నిధి (Consolidated Fund of State) లో జమ చేయాలి.

ఆర్టికల్ 266 (2)
 కేంద్ర ప్రభుత్వం స్వీకరించే ఇతర ప్రభుత్వ ధనాన్ని కేంద్ర ప్రభుత్వ ఖాతా (Credited to the Public Account of India) లో జమ చేయాలి.
* రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇతర ప్రభుత్వ ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలి.
ఆర్టికల్ 266 (3)
    కేంద్ర ప్రభుత్వ సంఘటిత నిధి లేదా రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధిలో జమ చేసిన మొత్తాలను రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా మాత్రమే శాసనబద్ధంగా వినియోగించాలి.
ఆర్టికల్ 267 (1)
   పార్లమెంటు ఒక శాసనం ద్వారా ఆగంతుక నిధి (Contingency Fund) ని ఏర్పాటు చేయవచ్చు. ఈ నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ప్రభుత్వ కార్యదర్శి నిర్వహిస్తారు.
* 1950, ఆగస్టు 14న ఏర్పడిన ఆగంతుక నిధికి కేంద్ర సంఘటిత నిధి నుంచి రూ.50 కోట్లను బదిలీ చేశారు.
* ప్రస్తుతం కేంద్ర ఆగంతుక నిధిని రూ.500 కోట్లతో నిర్వహిస్తున్నారు.
ఆర్టికల్ 267 (2)
రాష్ట్ర శాసన సభ ఒక చట్టం ద్వారా రాష్ట్ర ఆగంతుక నిధిని ఏర్పాటు చేయవచ్చు. ఇది సంబంధిత రాష్ట్ర గవర్నర్ ఆధీనంలో ఉంటుంది.
* ఊహించని, ఆకస్మికంగా వచ్చే ప్రకృతి వైపరీత్యాలు లాంటి సందర్భాల్లో ఖర్చులు ఎదురైనప్పుడు పార్లమెంటు అనుమతి పొందడానికి ముందే ఆగంతుక నిధి నుంచి నగదు ఖర్చు చేయవచ్చు. తర్వాత పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇదే నియమం రాష్ట్ర ఆగంతుక నిధికి కూడా వర్తిస్తుంది.
ఆర్టికల్ 268:
    కొన్ని పన్నులను కేంద్రమే విధిస్తుంది. కానీ రాష్ట్రాలు వసూలు చేసి వినియోగించుకుంటాయి.
ఉదా: స్టాంపు డ్యూటీలు, అలంకరణ వస్తవులు, మందులు, పాలసీ మార్పిడులు, చెక్కులు.
ఆర్టికల్ 268 (A)
* సేవలపై పన్నులను కేంద్రమే విధిస్తుంది. కానీ వసూలు చేసి వినియోగించేటప్పుడు కేంద్ర, రాష్ట్రాల ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు.
* 10వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 29% వాటా ఇవ్వాలి. ఈ పద్ధతినే ప్రత్యామ్నాయ నిధుల బదిలీ అంటారు. ఇది 1996, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కేంద్ర పన్నులైన కార్పొరేషన్ టాక్స్, ఎక్సైజ్ సుంకాల్లో రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది.
* 88వ రాజ్యాంగ సవరణ చట్టం (2003) ద్వారా ఆర్టికల్ 268 (A) సర్వీస్ టాక్స్‌ను చేర్చారు.

ఆర్టికల్ 269
కొన్ని పన్నులను కేంద్రమే విధిస్తుంది. వీటిని కేంద్రమే వసూలు చేసి రాష్ట్రాలకు కేటాయిస్తుంది.
* వస్తువుల కొనుగోలు, అమ్మకాలపై విధించే పన్నును; వస్తువుల కన్‌సైన్‌మెంట్‌పై పన్నును కేంద్ర ప్రభుత్వమే విధించి వసూలు చేస్తుంది. అయితే వీటిని 1996, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలి.
ఉదా: టెర్మినల్ ట్యాక్స్, విమానయానం, నౌకాయానం, రైల్వేలు.
ఆర్టికల్ 270
    కేంద్రం విధించి, వసూలు చేసి కేంద్ర, రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే పన్నుల గురించి వివరిస్తుంది.
ఆర్టికల్ 270 (1)
    కొన్ని పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేస్తుంది. ఆ విధంగా వచ్చిన మొత్తం రాబడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేస్తుంది.
ఉదా: వ్యవసాయేతర ఆదాయంపై పన్ను, ఎక్సైజ్ పన్ను.
ఆర్టికల్ 270 (2)
ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్టికల్ 270 (1)లో పేర్కొన్న పన్నులు లేదా డ్యూటీల ద్వారా లభించే నికర మొత్తంలో కొంత శాతం కేంద్ర సంఘటిత నిధిలో కలపరు. ఏ రాష్ట్రాల నుంచి ఆ పన్ను వసూలైందో ఆ మొత్తం సంబంధిత రాష్ట్రాలకే లభిస్తుంది.

ఆర్టికల్ 270 (3)
ఆర్థిక సంఘం ఏర్పాటయ్యే వరకు రాష్ట్రపతి ఆదేశం ద్వారా సూచించిన విధానంలో ఆర్థిక వనరుల పంపిణీ జరుగుతుంది.
* ఆర్థిక సంఘం ఏర్పాటైన తర్వాత దాని సూచనల మేరకు పంపిణీకి సంబంధించి రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేస్తారు.
ఆర్టికల్ 271
ఆదాయపు పన్నుపై విధించే సెస్‌ను కేంద్ర ప్రభుత్వమే వసూలు చేసుకుని వినియోగించుకుంటుంది. దీనిలో రాష్ట్రాలకు ఎలాంటి వాటా ఉండదు.
ఆర్టికల్ 272
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయాల్సిన పన్నులు. దీన్ని 80వ రాజ్యాంగ సవరణ చట్టం, 2000 ద్వారా తొలగించారు.
ఆర్టికల్ 273
అసోం, బిహార్, ఒడిశా, పశ్చిమ్‌ బంగ రాష్ట్రాలకు సంబంధించి జనుము, జనుము ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా వచ్చే ఎగుమతి సుంకాల్లో ఆ రాష్ట్రాలకు వాటా కేటాయించే బదులు ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత విధానం ప్రకారం సహాయక గ్రాంటుగా సంఘటిత నిధి నుంచి క్రేంద్ర ప్రభుత్వం చెల్లించాలి.
ఆర్టికల్ 274
రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభావం చూపే పన్నులకు సంబంధించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం అవసరం.

ఆర్టికల్ 274 (1)
కింద పేర్కొన్న అంశాలకు సంబంధించిన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి.
1. ఏదైనా ఒక పన్నును విధించడానికి లేదా సవరించడానికి సంబంధించిన బిల్లు (లేదా)
2. ఆదాయ పన్ను సంబంధిత చట్టాలకు చెందిన వ్యవసాయ ఆదాయం అనే పదానికి అర్థాన్ని సదరు బిల్లు సవరించే అవకాశం ఉన్నప్పుడు
ఆర్టికల్ 275
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మంజూరు చేసే సహాయక గ్రాంట్లు.
ఆర్టికల్ 275 (1)
ఏవైనా కొన్ని రాష్ట్రాలకు తగిన ఆర్థిక సహాయం అందించడం అవసరమని పార్లమెంటు భావించినట్లయితే, తనకు అవసరమని తోచిన మొత్తాన్ని సహాయక గ్రాంట్ల రూపంలో ఆయా రాష్ట్రాలకు అందజేయవచ్చు. ఈ సహాయక గ్రాంట్లను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* కేంద్ర ప్రభుత్వ అనుమతితో షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం సహాయక గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.
* ఏదైనా ఒక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల పరిపాలనతో సమానంగా ఆ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన అభివృద్ధికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు అవసరమైన మొత్తాన్ని కూడా సహాయక గ్రాంట్ల రూపంలో పార్లమెంటు అందజేయవచ్చు. ఉదా: అసోం.

ఆర్టికల్ 275 (2)
     సహాయక గ్రాంట్లకు సంబంధించి పార్లమెంటు శాసనం చేసే వరకు ఆయా అధికారాలను రాష్ట్రపతి కలిగి ఉంటారు. అయితే ఆర్థిక సంఘం ఏర్పాటు తర్వాత దాని సలహా లేనిదే రాష్ట్రపతి సహాయక గ్రాంట్లను కేంద్ర సంఘటిత నిధి నుంచి విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేయకూడదు.
ఆర్టికల్ 276
     వృత్తి, వ్యాపారం, ఉపాధి లాంటి అంశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వాలు ఒక్కో వ్యక్తిపై సంవత్సరానికి రూ.2500కు మించకుండా పన్ను విధించి వసూలు చేయవచ్చు.
ఆర్టికల్ 277: ఆర్థిక వనరులకు సంబంధించిన మినహాయింపులు.
ఆర్టికల్ 278: వివిధ రాష్ట్రాల ఆర్థిక ఒప్పందాలు.
ఆర్టికల్ 279: నికర ఆదాయం గురించి వివరణ, నిర్వచనం.
ఆర్టికల్ 279 (1)
     పన్నుల ద్వారా వసూలైన నికరాదాయం అంటే పన్ను వసూలుకు అయిన ఖర్చులు పోను మిగిలింది అని అర్థం. ఏ ప్రాంతం నుంచి ఎంత పన్ను వసూలైంది, అందులో నికరాదాయం ఎంత అనే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిర్ధారించి ధ్రువీకరించాలి. దీనికి సంబంధించి ఆయన ఇచ్చిన ధ్రువీకరణ పత్రమే అంతిమమైంది.

ఆర్టికల్ 279 (2)
     రాష్ట్రపతి లేదా పార్లమెంటు పన్ను ద్వారా వసూలైన మొత్తాన్ని రాష్ట్రాలకు గ్రాంట్లుగా మంజూరు చెయ్యాలి.
ఆర్టికల్ 280
* కేంద్ర ఆర్థిక సంఘం నియామకం, నిర్మాణం.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక అధికారాలు, ఆర్థిక వనరులు సమానంగా లేవన్నది స్పష్టం. రాజ్యాంగం కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇచ్చిందని, రాష్ట్రాలు కేవలం వాటి పరిధిలోని సొంత వనరులకే పరిమితమయ్యాయనే విమర్శ ఉంది. అందువల్ల సమాఖ్య ఆర్థిక విధానంలో ఆర్థిక విషయాలకు సంబంధించిన పన్నులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ లాంటి విషయాల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధమైన సమన్వయాన్ని సాధించడానికి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.
ఆర్టికల్ 280 (1)
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 2 సంవత్సరాల్లోపు, ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
* ఆర్థిక సంఘానికి ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్టికల్ 280 (2)
ఆర్థిక సంఘం సభ్యుల అర్హతలను, వారి ఎంపిక విధానాన్ని పార్లమెంటు శాసనం ద్వారా నిర్ణయిస్తుంది.

ఆర్టికల్ 280 (3)
ఆర్థిక సంఘం విధులు కింది విధంగా ఉంటాయి.
* భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో సహాయం చేయడానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను సూచించడం.
* రాష్ట్రపతి ఆదేశం మేరకు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడానికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వడం.
* పన్నుల ద్వారా వచ్చిన నికర రాబడులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య హేతుబద్దంగా పంపిణీ చేయడం. సంబంధిత రాబడులను రాష్ట్రాల మధ్య వారి వాటాలకు అనుగుణంగా కేటాయించడం.
* ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.
ఆర్టికల్ 280 (4)
    ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఇది తన పని విధానాన్ని రూపొందించుకోవడంతో పాటు పార్లమెంటు ద్వారా తనకు సంక్రమించిన అధికార విధులను కూడా నిర్వహించాలి.

14వ ఆర్థిక సంఘం
     ఆర్టికల్ 280 ప్రకారం 2015 - 2020 మధ్య కాలానికి సిఫారసులు చేసేందుకు 2013, జనవరి 2న డాక్టర్ వై.వేణుగోపాల రెడ్డి అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘాన్ని నియమించారు.
ప్రధాన సిఫారసులు
* కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచారు.
* రాష్ట్రాలకు మొత్తం గ్రాంట్లు రూ.5.37 లక్షల కోట్లు.
* విపత్తుల నిర్వహణకు రూ.55,000 కోట్లు.
గ్రాంట్ల మంజూరు కోసం 14వ ఆర్థిక సంఘం చేసిన/ అనుసరించిన ప్రామాణికాలు

ప్రామాణికాంశం ప్రాధాన్యత శాతం
జనాభా 17.5%
జనాభా వర్గీకరణలో మార్పు 10%
ఆదాయాంశం 50%
విస్తీర్ణం 15%
అటవీ విస్తీర్ణం 7.5%

ఆర్టికల్ 281
    రాష్ట్రపతి ఆర్థిక సంఘం సిఫారసులను, దానిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించే నోట్‌తో సహా పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించాలి.
ఆర్టికల్ 282
    ప్రజా ప్రయోజనం నిమిత్తం శాసనం చేసే అధికారం పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభకు లేకపోవచ్చు. అయినప్పటికీ అవి తమ రెవెన్యూల నుంచి అలాంటి ప్రయోజనాల నిమిత్తం గ్రాంట్లను విడుదల చేయవచ్చు.
ఆర్టికల్ 283
    ప్రభుత్వ నిధులైన సంఘటిత నిధి, ఆగంతుక నిధి, ప్రభుత్వ ఖాతాల నియంత్రణ గురించి తెలుపుతుంది.
ఆర్టికల్ 283 (1)
    భారత ప్రభుత్వ సంఘటిత నిధి, ఆగంతుక నిధుల్లో సొమ్మును జమ చేయడం, వాటి నుంచి ఖర్చు చేయడం, ఆ రెండింటిలోనూ జమ చేయని ఇతర ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం గురించి తెలియజేస్తుంది.
ఆర్టికల్ 283 (2)
    రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధి, ఆగంతుక నిధుల్లో సొమ్ము జమ చేయడం, వాటి నుంచి ఖర్చు చేయడం, ఆ రెండింటిలోనూ జమ చేయని ఇతర ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం గురించి తెలుపుతుంది.

ఆర్టికల్ 284
    కోర్టులు స్వీకరించే పిటిషనర్ డిపాజిట్లు, ఇతర మార్గాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే సొమ్ము భారత ప్రభుత్వ ఖాతాకు లేదా సందర్భానుసారం ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి.
* వివిధ వర్గాల నుంచి సేకరించిన డిపాజిట్లపై నియంత్రణను తెలుపుతుంది.
ఆర్టికల్ 285
    కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించకూడదు.
ఆర్టికల్ 286
    సరకుల క్రయవిక్రయాలపై పన్ను మినహాయింపులు.
ఆర్టికల్ 286 (1)
    రాష్ట్రం వెలుపల జరిగే వస్తువుల క్రయవిక్రయాలు లేదా భారతదేశంలోకి వస్తువులను దిగుమతి చేసుకునే లేదా ఎగుమతి చేసే క్రమంలో జరిగే క్రయవిక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు విధించకూడదు.
ఆర్టికల్ 286 (2)
    వస్తువుల క్రయవిక్రయాలను నిర్ధారించే క్రమాన్ని పార్లమెంటు శాసనం ద్వారా నిర్దేశిస్తుంది.
ఆర్టికల్ 287
    కేంద్ర ప్రభుత్వం వినియోగించిన విద్యుత్ లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన విద్యుత్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించకూడదు. కేంద్ర ప్రభుత్వ రైల్వేల నిర్మాణం, నిర్వహణలపై ఉపయోగించే విద్యుచ్ఛక్తిపై రాష్ట్రాలు చట్టరీత్యా పన్ను విధించకూడదు.

ఆర్టికల్ 288
    కొన్ని సందర్భాల్లో నీరు, విద్యుచ్ఛక్తిపై రాష్ట్రాలు పన్ను విధించడం నుంచి మినహాయింపులు.
ఆర్టికల్ 288 (1)
    కొన్ని సందర్భాల్లో అంతర్ రాష్ట్ర నదులు, నదీ లోయల అభివృద్ధికి పార్లమెంటు శాసనం ద్వారా ఏర్పాటు చేసిన అథారిటీ నిల్వ ఉంచుకునే, ఉపయోగించే నీరు లేదా విద్యుచ్ఛక్తిపై రాష్ట్రాలు పన్ను విధించకూడదు.
ఆర్టికల్ 288(2)
    రాష్ట్ర శాసనసభ పన్ను విధించడానికి అధికారం కల్పించే శాసనం చేయవచ్చు. ఇలాంటి శాసనం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు మాత్రమే అమల్లోకి వస్తుంది.
ఆర్టికల్ 289
    రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులపై, ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం నుంచి మినహాయింపు.
ఆర్టికల్ 289 (1)
    రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులు, ఆదాయాలపై కేంద్రం పన్నులు విధించకూడదు.
ఆర్టికల్ 289(2)
    రాష్ట్ర ప్రభుత్వం లేదా దాని తరఫున నిర్వహించే ఆర్థిక, వాణిజ్య లావాదేవీలపై పన్ను విధించే అధికారం పార్లమెంటుకు ఉంది.

ఆర్టికల్ 290
    కొన్ని రకాలైన ఖర్చులు, పెన్షన్లకు సంబంధించిన సర్దుబాట్లను తెలియజేస్తుంది.
ఆర్టికల్ 290(A)
    కొన్ని దేవస్థానాలకు సాలీనా చెల్లించాల్సిన మొత్తాలను తెలియజేస్తుంది. దీని ప్రకారం ట్రావెన్‌కోర్ దేవస్థాన నిధికి కేరళ రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఏటా రూ.46,50,000 చెల్లించాలి.
* హిందూ దేవస్థానాలు, గుడుల నిర్వహణ కోసం తమిళనాడు రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఆ రాష్ట్ర దేవస్థాన నిధికి ఏటా రూ.13,50,000 చెల్లించాలి.
* ఈ నిబంధనను 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956 ద్వారా చేర్చారు.
ఆర్టికల్ 291
    మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు చెల్లించే రాజభరణాల గురించి తెలియజేస్తుంది.
* 26వ రాజ్యాంగ సవరణ చట్టం (1971) ద్వారా ఇందిరా గాంధీ ప్రభుత్వం రాజభరణాలను రద్దు చేయడం వల్ల ఆర్టికల్ 291ని రాజ్యాంగం నుంచి తొలగించారు.
ఆర్టికల్ 292
    పార్లమెంటు నిర్ణయించిన మేరకు భారత సంఘటిత నిధిని హామీగా పెట్టి కేంద్ర ప్రభుత్వం రుణాలను పొందే కార్యనిర్వహణాధికారాన్ని కలిగి ఉంటుంది.

ఆర్టికల్ 293
    రాష్ట్ర ప్రభుత్వాల రుణ సేకరణ.
ఆర్టికల్ 293 (1)
    రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు రాష్ట్ర సంఘటిత నిధిని హామీగా పెట్టి దేశం లోపల ఎక్కడి నుంచైనా రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు పొందే కార్యనిర్వహణాధికారాన్ని కలిగి ఉంటాయి.
ఆర్టికల్ 293 (2)
    పార్లమెంటు నిర్ణయించిన షరతులకు లోబడి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల రుణాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వవచ్చు. కేంద్ర ప్రభుత్వం భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వగలదు.
ఆర్టికల్ 293 (3)
    ఇచ్చిన రుణాలు తీరక ముందే కేంద్ర అనుమతి లేకుండా ఒక రాష్ట్రం కొత్తగా అప్పులు చేయకూడదు.
ఆర్టికల్ 293 (4)
    కేంద్రం కొన్ని షరతులతో అంతకు ముందు ఇచ్చిన రుణాలను పూర్తిగా తీర్చకముందే కొత్త రుణాలను పొందడానికి రాష్ట్రాలకు అవకాశం ఇవ్వవచ్చు.

ఆర్టికల్ 294
    కొన్ని కేసుల్లో వారసత్వం, ఆస్తులు, హక్కులు, రుణాల విషయంలో ప్రభుత్వ బాధ్యత.
ఆర్టికల్ 295
    ఇతర వివాదాలకు సంబంధించి వారసత్వంగా సంక్రమించే ఆస్తులు, హక్కులు, బాధ్యతలు.
ఆర్టికల్ 296
    స్వాతంత్య్రానికి ముందు ఉన్న రాష్ట్రాలు, సంస్థానాల ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులు.
ఆర్టికల్ 297
 * సరిహద్దు జలాలు లేదా ఖండాంతర్భాగంలోని ఖనిజాలు, ఇతర వనరులన్నింటిపై కేంద్రానికి అధికారం.
 *  ఆర్టికల్ 298 వాణిజ్య కార్యకలాపాలు, అధికారాలు.
*  ఆర్టికల్ 299 ఆస్తి ఒప్పందాలు.
* ఆర్టికల్ 300 వాజ్యాలు, ఇతర అంశాలు
ఆర్టికల్ 300 (A)
    చట్ట ప్రకారం తప్ప వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకూడదు.

ఇతర అంశాలు
గాడ్గిల్ ఫార్ములా:
     కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి ఉద్దేశించిన ఫార్ములానే గాడ్గిల్ ఫార్ములా అని పేర్కొంటారు. 4వ ఆర్థిక సంఘం సూచనలు మొదలు 8వ ఆర్థిక సంఘం సూచనల వరకు ఈ ఫార్ములానే అనుసరించారు.


ముఖర్జీ ఫార్ములా
     8వ ఆర్థిక సంఘం సూచనల నుంచి నేటి వరకు దేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి దీన్నే వినియోగిస్తున్నారు.
* కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి జనాభా, విస్తీర్ణం, తలసరి ఆదాయం, అభివృద్ధి, పన్నుల వసూలు సామర్థ్యం లాంటి అంశాలను ఆధారం చేసుకుంటున్నారు.


 

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌