• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగం - ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, స్త్రీలు

సమానత్వం, న్యాయం అనే రాజ్యాంగ ప్రవేశిక స్ఫూర్తిని అమలు చేసే ఉద్దేశంతో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), వెనుకబడిన తరగతులు (బీసీ), మైనారిటీలు, మహిళలకు భారత రాజ్యాంగంలో కొన్ని నిబంధనలను పొందుపరిచారు. తదనుగుణంగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఆయా వర్గాల ప్రగతికోసం కమిటీలను, కమిషన్లను నియమిస్తున్నాయి.
 

వర్గాల వివరణ
 

షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ జాతులు (ఎస్టీ): రాజ్యాంగం ప్రజలను వీరు ఈ కులానికి, ఈ తెగకు చెందినవారని ఎక్కడా పేర్కొనలేదు. ఈ విషయంలో ఆ అధికారాన్ని రాష్ట్రపతికి విడిచిపెట్టింది. ప్రతి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏ కులం లేదా ఏ తెగను ఎస్సీ లేదా ఎస్టీగా పరిగణించాలనే అంశాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ప్రకరణం 341 ప్రకారం రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి షెడ్యూల్డ్ కులాలను, ప్రకరణం 342 ప్రకారం షెడ్యూల్డ్ తెగలను నిర్ణయిస్తారు. ఎస్సీ, ఎస్టీల జాబితా అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకే విధంగా ఉండదు. రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి నోటిఫికేషన్ విడుదల చేసినా, ఆ నోటిఫికేషన్ నుంచి ఏదైనా కులాన్ని లేదా తెగను తొలగించాలన్నా, లేదా పొందుపరచాలన్నా పార్లమెంటు ఆమోదం అవసరం. రాష్ట్రపతి తదుపరి నోటిఫికేషన్ ద్వారా ఈ మార్పులను చేయలేరు.


 వెనుకబడిన తరగతులు (బీసీ): రాజ్యాంగం ప్రత్యేకించి వీరు వెనుకబడిన తరగతులకు చెందినవారని పేర్కొనలేదు. అదేవిధంగా వారికి ఒకే సారూప్య విశేష లక్షణాలను కూడా ఆపాదించలేదు. బీసీలు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఎస్సీలు, ఎస్టీలు కాకుండా మిగిలిన వెనుకబడిన తరగతులకు చెందిన పౌరులుగా పేర్కొంది. ఈ సందర్భంలో ఎస్సీలు, ఎస్టీలు కూడా వెనుకబడిన తరగతులే. కాబట్టి బీసీలను ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ)గా పరిగణించవచ్చు.


 మైనారిటీలు (అల్పసంఖ్యాక వర్గాలు): రాజ్యాంగంలో 'మైనారిటీ' అనే పదాన్ని ప్రకరణం 29 లో ప్రస్తావించినప్పటికీ, దానికి ప్రత్యేకమైన నిర్వచనం లేదు. సాధారణంగా దేశ జన సంఖ్యలో తక్కువ శాతంలో ఉండే వర్గాలను మైనారిటీలు అంటారు. వీరిని రెండు రకాలుగా వర్గీకరించారు.
 

ఎ. మతపరమైన అల్ప సంఖ్యాక వర్గాలు:
జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం 1992 ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్శీలు (జొరాస్టియన్లు) అనే ఐదు వర్గాలను జాతీయ స్థాయిలో మతపరమైన అల్ప సంఖ్యాకవర్గాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2014 లో జైనులకు కూడా మతపరమైన మైనారిటీ హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది.

 

బి. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు:
రాష్ట్రవ్యాప్తంగా లేదా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లోని అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషకు భిన్నమైన భాషను మాతృభాషగా కలిగిన అల్పసంఖ్యాక వర్గాన్ని 'భాషాపరమైన మైనారిటీ'లుగా పరిగణిస్తారు. ఈ రకమైన మైనారిటీని రాష్ట్ర స్థాయిలోనే గుర్తిస్తారు. ఇది రాష్ట్రాన్ని బట్టి మారుతుంది.

రాజ్యాంగ నిబంధనలు

1. ఎస్సీ, ఎస్టీలు:

రాజ్యాంగ నింబంధన 15(1) - పౌరుల విషయంలో జాతి మత, కుల, లింగ, జన్మస్థల పరంగా వివక్ష చూపకూడదు.
15(2) - ప్రజా ఉపయోగ ప్రదేశాల్లో అందరికీ సమాన ప్రవేశం కల్పించాలి.
15(4) - ఈ వర్గాలకు సామాజిక, విద్యారంగంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు. (మొదటి రాజ్యాంగ సవరణ చట్టం -1951).
15(5) - ప్రైయివేటు విద్యాసంస్థలతో సహా అన్ని విద్యాసంస్థల్లో వీరి ప్రవేశానికి ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయవచ్చు (93 వ రాజ్యాంగ సవరణ చట్టం - 2005).
16(1) - ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల, మత, లింగ వివక్ష చూపకూడదు.
16(4) - ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ వర్గాలకు ప్రత్యేక మినహాయింపులు.
16(4A) - ప్రభుత్వ ఉద్యోగ పదోన్నతుల్లో ప్రత్యేక రిజర్వేషన్లు (77 వ రాజ్యాంగ సవరణ చట్టం 1995)
16(4B) - ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ కోటా భర్తీ కాకపోతే మిగిలినవాటిని తర్వాతి సంవత్సరం రిజర్వేషన్ కోటాలో కలుపుతారు. తద్వారా రిజర్వేషన్లు 50% మించినా చెల్లుబాటవుతాయి. (81 వ రాజ్యాంగసవరణ చట్టం - 2000)
17 - అంటరానితనం నిషేధం
19(1)(e) - ప్రతి పౌరుడికి తనకు నచ్చిన ప్రదేశంలో నివాసం
19(1) (g) - ప్రతి పౌరుడూ తనకు నచ్చిన వృత్తిని ఎంపిక చేసుకోవచ్చు
23 - మనుషుల క్రయవిక్రయాలు, బలవంతపు వెట్టిచాకిరి నిషేధం
25(2) (b) - హిందూ దేవాలయాల్లోకి అన్ని వర్గాలకు ప్రవేశం
29(2) - ప్రభుత్వ విద్యాలయాల్లో కుల, మత, భాషా వివక్ష చూపకూడదు.
46 - ఆర్థికంగా, విద్యాపరంగా షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి శ్రద్ధ చూపాలి.
164 - ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి.
243(D) - పంచాయతీ వ్యవస్థలో రిజర్వేషన్లు (73 వ రాజ్యాంగ సవరణ చట్టం1992)
243 (T) - మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు (74 వ రాజ్యాంగ సవరణ చట్టం 1992)
275 (1) - వీరి సంక్షేమం కోసం కేంద్రం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ నిధులను కేటాయించవచ్చు.
244 - 5 వ షెడ్యూల్‌లో ప్రస్తావించిన షెడ్యూల్డ్ ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు.
244(2) - అసోంలోని గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు, జిల్లా కౌన్సిల్‌లను ఏర్పాటు చేయడం.
330 - లోక్‌సభలో ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు.
332 - విధానసభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు.
334 - ఈ నిబంధనను అనుసరించి ఎస్సీ, ఎస్టీలకు లోక్‌సభ, విధానసభల్లో రిజర్వేషన్లను జనవరి 26, 2020 వరకు పొడిగించారు (మరొక పది సంవత్సరాలు) (95 వ రాజ్యాంగ సవరణ చట్టం - 2009).
335 - ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, ప్రమోషన్లలోనూ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అర్హత మార్కులను ప్రభుత్వం తగ్గించవచ్చు
338 - ఎస్సీల స్థితిగతుల అధ్యయనానికి జాతీయ కమిషన్
338 - (A) ఎస్టీల స్థితిగతుల అధ్యయనానికి జాతీయ కమిషన్
339 - ఈ వర్గాల పాలనకు సంబంధించి రాష్ట్రపతి ప్రత్యేక నివేదిక కోరవచ్చు.


 

2. ఇతర వెనుకబడిన తరగతులు
ప్రకరణలు: 15(1), 16, 16(4), 46.
 ఎస్సీ, ఎస్టీలకు వర్తించే పై ప్రకరణలు వీరికీ వర్తిస్తాయి.
 ప్రకరణ-340: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులను విచారించి, వారి అభివృద్ధికి అవసరమైన సూచనలు చేయడానికి ఒక జాతీయ కమిషన్‌ను రాష్ట్రపతి ఆదేశం ద్వారా ఏర్పాటు చేయవచ్చు.

 

గమనిక:
ఇతర వెనుకబడిన తరగతులను గుర్తించడానికి కేంద్రం 1953 లో కాకా కలేల్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ తన నివేదికను 1955 లో సమర్పించింది.
  బి.పి. మండల్ నాయకత్వంతో రెండో బీసీ కమిషన్‌ను 1978 లో మొరార్జీదేశాయ్ (జనతా ప్రభుత్వం) ఏర్పాటు చేశారు. 1980 లో కమిషన్ నివేదికను సమర్పించింది.
  నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం (వి.పి.సింగ్) 13 ఆగస్టు 1990 న మండల్ కమిషన్ సిఫారసులను ఆమోదించింది. దీన్ని సవాలు చేస్తూ ఇందిరా సహానీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. (ఇందిరా సహానీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా) దీన్నే మండల్ కేసు అని కూడా అంటారు.
‣  ఈ కేసులో సుప్రీంకోర్టు కొన్ని షరతులతో ఓబీసీలకు 27% రిజిర్వేషన్లకు రాజ్యాంగబద్ధతను కల్పించింది. అయితే వెనుకబడిన తరగతుల్లో ఉన్నత వర్గాలను (క్రీమీ లేయర్) రిజర్వేషన్ల సదుపాయాల నుంచి మినహాయించాలని, ఇతర వెనుకబడిన తరగతులకు ఒక శాశ్వత చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కోరింది.
  ఓబీసీల్లో క్రీమీ లేయర్‌ను గుర్తించడానికి ప్రభుత్వం రామ్ నందన్ కమిటీని నియమించింది. 1993 లో ఈ కమిటీ నివేదిక సమర్పించగా, ప్రభుత్వం ఆమోదించింది.

 

3. అల్ప సంఖ్యాక వర్గాలు (మైనారిటీలు)
 29 (1) - ప్రకరణ: భారతదేశంలో నివసిస్తున్న పౌరుల్లో ఏ వర్గం వారైనా తమ విశిష్ట భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు.
29 (2) - రాజ్యం నిర్వహిస్తున్న లేదా రాజ్య ఆర్థిక సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని మత, జాతి, కుల, భాషా ప్రాతిపదికపై ఏ పౌరుడికీ నిరాకరించరాదు.
30 - మత, భాషా అల్ప సంఖ్యాక వర్గాల వారందరూ తమకు నచ్చిన విధంగా విద్యా సంస్థలను నెలుకొల్పుకునే, నిర్వహించుకునే హక్కుంది.
30 (1)(a) - అల్ప సంఖ్యాక వర్గాల విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వారికి చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో వారికి సంక్రమించిన హక్కులకు ఎలాంటి భంగం కలిగించకూడదు.
30(2) - అల్ప సంఖ్యాక వర్గాల నిర్వహణలోని విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం మంజూరు చేసే సందర్భంలో రాజ్యం ఎలాంటి వివక్ష చూపకూడదు.
347 - ఏదైనా ఒక రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న జనాభా తాము మాట్లాడే భాషను సదరు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిందిగా రాష్ట్రపతిని కోరవచ్చు. రాష్ట్రపతి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవచ్చు.
350 - ఏ వ్యక్తయినా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించే ఏ భాషలోనైనా తనకున్న సమస్యను సంబంధిత అధికారికి విన్నవించుకోవచ్చు. ఆ విన్నపాన్ని అధికార భాషలో లేదనే కారణంగా తిరస్కరించకూడదు.
350 A - భాషాపరమైన అల్ప సంఖ్యాక వర్గాలవారికి ప్రాథమిక స్థాయిలో వారి మాతృభాషలోనే విద్యాబోధన జరిగేందుకు సదుపాయాలు కల్పించాలి.
350 B (1) - భాషాపరమైన మైనారిటీల కోసం ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమించాలి.
350 B (2) - పై ప్రత్యేక అధికారి సంబంధిత నివేదికను రాష్ట్రపతికి సమర్పించాలి.

 

4. మహిళలు

ప్రకరణ 14- చట్టం ముందు అందరూ సమానులే.
15 - పౌరులకు సంబంధించి జాతి, మత, కుల, లింగ, జన్మస్థలం పరంగా వివక్ష చూపకూడదు.
15(3) - మహిళలకు ప్రత్యేక మినహాయింపులు
16 - ప్రభుత్వ ఉద్యోగాల్లో లింగ వివక్ష చూపకూడదు.
23 - స్త్రీలను అసభ్య, అశ్లీల, అవినీతి కార్యకలాపాలకు వినియోగించకూడదు.
39 (A) - పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలి.
39(D) - స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం
42 - మహిళలకు ప్రసూతి సౌకర్యాలు
51 (A) (e) - మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతులను విడిచిపెట్టాలి
243 (D) - పంచాయతీల్లో మహిళలకు 1/3 వ వంతు స్థానాలను రిజర్వు చేయాలి.
243 (T) - మున్సిపాలిటీల్లో మహిళలకు 1/3 వ వంతు స్థానాలను రిజర్వు చేయాలి.


 

ఎస్సీ, ఎస్టీ చట్టాలు - సంక్షేమ పథకాలు

ఎస్సీ, ఎస్టీ చట్టాలు:
 అస్పృశ్యతా నిషేధచట్టం - 1955
 పౌరహక్కుల పరిరక్షణ చట్టం - 1976
 ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాల నిషేధ చట్టం - 1989
 జాతీయ అటవీ విధానం - 1988
 పంచాయతీ ఎక్స్‌టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ (PESA) - 1996
 గిరిజన సంప్రదాయ హక్కుల పరిరక్షణ చట్టం - 2006

 

ఎస్సీ సంక్షేమ పథకాలు:
 వీరి సంక్షేమానికి కేంద్రంలో సామాజిక న్యాయ మంత్రిత్వశాఖను 1998 లో ఏర్పాటు చేశారు. ప్రస్తుత మంత్రి ధావర్‌చంద్ గెహ్లాట్ (Thawarchand Gehlot)
 1979 నుంచి ఎస్సీ ఉపప్రణాళికలో భాగంగా వనరులను కేటాయిస్తున్నారు.
 దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారి ఉపాధి కోసం జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ స్థాపన (1989)
 ఎస్సీ బాలబాలికలకు వసతి గృహస్థాపనకు బాబూ జగ్జీవన్‌రామ్ ఛాత్రవాస్ యోజన 2008
 రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్స్ 2005
 ఎస్సీ బాలికల అక్షరాస్యతా అభివృద్ధి పథకం - 2003
 పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత విద్యా పథకం - 2003
‣ ఎస్సీల సంక్షేమానికి పార్లమెంటులో స్థాయీ సంఘం ఏర్పాటు - 1998

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌