• facebook
  • whatsapp
  • telegram

సమాచార హక్కు చట్టం

ప్రభుత్వ పాలనలో పాదర్శకతను పెంపొందించి, పరిపాలనా వ్యవహారాల్లో గోప్యతను నివారించి, ప్రభుత్వ పాలనా విధానాలను ప్రజల ముందు ఉంచేందుకు పౌరులకు కల్పించిన అద్భుత అవకాశమే సమాచార హక్కు. సమాచారాన్ని ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతయితే దాన్ని పొందడం పౌరుల హక్కు. ఇది ప్రభుత్వ పాలనలో బాధ్యతాయుత విధానానికి అవకాశాన్ని కల్పిస్తుంది.

నేపథ్యం:

  పారదర్శక ప్రభుత్వ పాలనే లక్ష్యంగా 1776లో స్వీడన్‌ తన దేశ రాజ్యాంగంలో తొలిసారిగా సమాచార హక్కును పొందుపరిచి మిగిలిన ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.

1951లో ఫిన్‌లాండ్, 1966లో అమెరికా, 1970లో డెన్మార్క్, నార్వే దేశాలు సమాచార హక్కును చట్టబద్ధం చేశాయి.

‣  1923లో ఆంగ్లేయులు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో ‘అధికార రహస్యాల చట్టాన్ని (The Official Secrets Act, 1923)' రూపొందించి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయరాదని నిర్ణయించారు.

సుప్రీంకోర్టు తీర్పు

1976లో రాజ్‌ నారాయణ్‌ Vs ఇందిరా గాంధీ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ప్రజలు సార్వభౌములని, ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని పౌరులకు తప్పనిసరిగా అందించాల్సిందేనని, సమాచార హక్కు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని పేర్కొంది.

 రాజ్యాంగంలోని స్వేచ్ఛా స్వాంతంత్య్రపు హక్కును తెలిపే ఆర్టికల్‌ 19 (1)(a) లోనే సమాచార హక్కు కూడా ఉంది.

 రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీతలు సందీప్‌ పాండే (సామాజికవేత్త), అరుణారాయ్‌ (మాజీ ఐఏఎస్‌ అధికారి) కృషి ఫలితంగా మనదేశంలో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు.

 అటల్‌ బిహారి వాజ్‌పేయీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2002లో ‘సమాచార స్వాతంత్య్ర చట్టాన్ని’ రూపొందించింది. ఈ చట్టంలోని లోపాలను సవరించి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం జాతీయ సమాచార హక్కు చట్టాన్ని 2005, అక్టోబరు 12 నుంచి జమ్ముకశ్మీర్‌ మినహా దేశవ్యాప్తంగా అమలుచేసింది. జమ్ముకశ్మీర్‌లో ఈ చట్టం 2009 నుంచి అమల్లోకి వచ్చింది.

ముఖ్యాంశాలు:

 ఈ చట్టంలో మొత్తం 6 చాప్టర్లు ఉన్నాయి.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 2(J) ప్రకారం ప్రభుత్వ పాలనకు సంబంధించిన 17 రకాల సమాచారాలను పౌరులు పొందవచ్చు.

అవి:

1) రికార్డులు

2) పత్రాలు

3) సలహాలు

4) అభిప్రాయాలు

5) ఈ - మెయిల్స్‌

6) నివేదికలు

7) మెమోలు

8) కాంట్రాక్టులు

9) ఆర్డర్లు

10) లాగ్‌ పుస్తకాలు

11) సర్క్యులర్లు

12) పత్రికా ప్రకటనలు

13) రాతపుస్తకాలు

14) నమూనాలు

15) మోడల్స్‌

16) ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉన్న గణాంకాలు

17) అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ప్రభుత్వ అధికారికి అందుబాటులో ఉండే ప్రైవేట్‌ సంస్థల వివరాలు

 రికార్డులు, సర్టిఫైడ్, జిరాక్స్‌ కాపీలు; డాక్యుమెంట్లు, వీడియో టేపులు, సీడీలు, ఫొటోలు, ప్లాపీల ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.

సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాని అంశాలు (సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 8, 24 ప్రకారం)

 భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే అంశాలు

 దేశ రక్షణకు సంబంధించిన, గూఢచార సంస్థలు అందించే సమాచారం

 విదేశాలు, అంతర్జాతీయ సంస్థలతో భారతదేశం కుదుర్చుకునే ఒప్పందాలు

 రాష్ట్రపతికి పరిపాలనలో కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సలహాలు

 గవర్నర్‌కు పరిపాలనలో రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చే సలహాలు

 న్యాయ విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన అంశాలు

  కేరళ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలన్నింటినీ సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ జారీచేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు రద్దుచేసింది. సహకార సంఘాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావని, వాటిని ప్రభుత్వ సంస్థలుగా పరిగణించలేమని జస్టిస్‌ సిక్రీ, జస్టిస్‌ రాధాకృష్ణన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

సమచారాన్ని పొందడం

  సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 5(1) ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి/సహాయ ప్రజా సమాచార అధికారి ఉంటాడు. సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలిపే బోర్డును ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయాలి. దీని ఆధారంగా సంబంధిత అధికారి నుంచి సమాచారాన్ని పొందవచ్చు.

దరఖాస్తు నమూనా - దరఖాస్తు రుసుము

  సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తుకు నిర్దిష్ట నమూనా లేదు.

  సమాచారం కోసం తెల్ల కాగితంపై విన్నపం అని రాసి ఇస్తే సరిపోతుంది.

  గ్రామస్థాయి సంస్థలకు దరఖాస్తు రుసుము ఉచితం. మండల స్థాయిలో రూ.5; జిల్లా, రాష్ట్ర, కేంద్రస్థాయిలో రూ.10 చెల్లించాలి.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 7(5) ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి దరఖాస్తు రుసుము ఉచితం.

 జి.ఓ.ఎం.ఎస్‌ నెం.740 ప్రకారం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 7(3) ప్రకారం దరఖాస్తు రుసుమును నగదు లేదా ఇండియన్‌ పోస్టల్‌ ఆర్డర్‌ లేదా బ్యాంక్‌ చెక్కు లేదా డీడీ లేదా చలానా రూపంలో చెల్లించవచ్చు.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 6(2) ప్రకారం సమాచారాన్ని ఎందుకు కోరుతున్నారని దరఖాస్తుదారుడిని అడిగే అధికారం ప్రభుత్వ అధికారికి లేదు.

సమచారం ఇచ్చేందుకు గడువు

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 7(1) ప్రకారం కోరిన సమాచారాన్ని సంబంధిత అధికారి 30 రోజుల వ్యవధిలో ఇవ్వాలి.

 వ్యక్తి జీవించే హక్కు, స్వేచ్ఛలకు సంబంధించిన సమాచారాన్ని 48 గంటల్లోగా ఇవ్వాలి.

సమాచారం కోసం అప్పీలు

 నిర్దేశించిన గడువులోగా ఏ విషయాన్ని తెలియజేయకపోతే సమాచారం ఇవ్వడానికి తిరస్కరించినట్లుగానే భావించాలి.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 19(1) ప్రకారం ప్రభుత్వ కార్యాలయ ఉన్నత అధికారికి మొదట అప్పీలు చేయాలి. అప్పుడు సంబంధిత అధికారి 30 - 45 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి. అయినప్పటికీ సమాచారం ఇవ్వకపోతే సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్‌కు 90 రోజుల వ్యవధిలో అప్పీలు చేస్తే, తదుపరి గడువును సమాచార కమిషన్‌ నిర్ణయిస్తుంది.

సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానా, శిక్షలు

 దరఖాస్తు తీసుకోవడానికి నిరాకరించిన, ఎక్కువ దరఖాస్తు రుసుము కోరిన; అసంపూర్తి, తప్పుడు సమాచారం ఇచ్చినా, కోరిన సమాచారాన్ని ధ్వంసం చేసినా, ఇవ్వడాన్ని అడ్డుకున్నా సమాచార హక్కు చట్టం ప్రకారం నేరాలుగా పరిగణిస్తారు. వీటికి పాల్పడిన ప్రజా సమాచార అధికారికి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 20(1) ప్రకారం రోజుకు రూ.250 చొప్పున గరిష్ఠంగా రూ.25000 జరిమానా విధిస్తారు. తరచూ ఈ చట్టం ఉల్లంఘనకు పాల్పడే అధికారులపై సెక్షన్‌ 20(2) ప్రకారం క్రమశిక్షణ చర్యలు చేపడతారు.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 7(6) ప్రకారం 30 రోజుల వ్యవధి దాటితే సమాచారాన్ని ఉచితంగా అందించాలి.

సమాచారం - స్వచ్ఛంద వెల్లడి

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 4(1)(బి) ప్రకారం ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన విధులు, బాధ్యతలు, విధి నిర్వహణలో పాటించే సూత్రాలు, జవాబుదారీతనం, ఉద్యోగుల వివరాలు, వారి జీతభత్యాలు, బడ్జెట్‌ కేటాయింపు, రికార్డుల పట్టికలు, రాయితీల వివరాలు, ప్రజా సమాచార అధికారి వివరాలు, సలహా సంఘాల సమాచారాన్ని కార్యాలయాల్లో స్వచ్ఛందంగా వెల్లడించాలి.

 జి.ఒ.ఎం.ఎస్‌. నెం.454 ప్రకారం సమాచారాన్ని పొందేందుకు A3/A4 కాగితానికి రూ.2, ప్లాపీకి రూ.50, సీడీకి రూ.100, డీవీడీకి రూ.200 చెల్లించాలి.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 6(3) ప్రకారం దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఒక సంస్థకు చెందనట్లయితే సంబంధిత P.I.O. (Public Information Officer) సంస్థకు పంపాలి. దరఖాస్తు అందిన అయిదు రోజుల్లోపు విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియజేయాలి. అతడు కోరిన రూపంలోనే సమాచారాన్ని అందించాలి.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 7(9) ప్రకారం ఎక్కువ ఆర్థిక వనరులు ఖర్చయ్యే, రికార్డు భద్రత ప్రమాదంలో ఉన్న సందర్భంలో తప్ప, దరఖాస్తుదారుడు కోరిన రూపంలో సమాచారాన్ని ఇవ్వాలి.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 21 ప్రకారం దరఖాస్తుదారుడిపై ఎలాంటి దావాలు, న్యాయవిచారణ, చట్టపరమైన చర్యలు తీసుకోరాదు.

 నిర్ణీత గడువులోగా సమాచారం లభించనప్పుడు సమాచార కమిషన్‌కు వెళ్లాల్సివస్తే, సమాచార చట్టంలోని సెక్షన్‌ 19(8)(బి) ప్రకారం పరిహారం పొందవచ్చు.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 23 ప్రకారం సమాచార కమిషన్‌ జారీ చేసిన ఆదేశాలపై దావాను వేయరాదు. ఇతర విచారణను ఏ న్యాయస్థానాలు చేపట్టరాదు, ప్రశ్నించకూడదు.

చట్టం - ప్రచార బాధ్యత

‣ సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం దీని ప్రయోజనాలను ప్రజలకు అందించి, వారిలో అవగాహన కల్పించే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించాలి.

 కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ‘ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ పోర్టల్‌’ను 2013, ఆగస్టు 21న ప్రారంభించింది. ఈ పోర్టల్‌ ద్వారా 82 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కేంద్ర సమాచార కమిషన్‌

 సమాచార హక్కు చట్టంలోని అధికార విధులను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2005, అక్టోబరు 13న న్యూదిల్లీ కేంద్రంగా ‘సెంట్రల్‌ ఇన్‌ఫర్మేషన్‌ కమిషన్‌’ను ఏర్పాటు చేసింది. దీనిలో ఒక ప్రధాన సమాచార కమిషనర్, పది మందికి మించకుండా ఇతర కమిషనర్లు ఉంటారు.

 ప్రధాని నాయకత్వంలోని ఎంపిక కమిటీ చేసిన సిఫారసుల మేరకు రాష్ట్రపతి సమాచార కమిషనర్లను నియమిస్తారు. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వరకు (ఏది ముందయితే అది వర్తిస్తుంది). జీతభత్యాలు, సర్వీసు నియమాలు కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమానంగా ఉంటాయి.

 ప్రధాన, ఇతర సమాచార కమిషనర్లను సుప్రీంకోర్టు విచారణ అనంతరం ఆరోపణలు రుజువైతే రాష్ట్రపతి తొలగిస్తారు.

 సమాచార హక్కు చట్టాన్ని అమలు చేస్తున్న 57వ దేశం భారత్‌.

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్లు

విజిల్‌ బ్లోయర్స్‌ రక్షణ చట్టం, 2014

 ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం కోరే వ్యక్తులకు బెదిరింపులు ఎదురైనప్పుడు వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం సమాచార హక్కు కార్యకర్తలకు పరిరక్షణ బిల్లు (విజిల్‌ బ్లోయర్స్‌)ను తీసుకువచ్చింది. దీన్ని రాష్ట్రపతి 2014, మే 9న ఆమోదించగా, 2014 మే, 12న ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించారు.

ముఖ్యాంశాలు

  సమాచార హక్కుకు సంబంధించిన కార్యకర్తలకు రక్షణ కల్పించడం.

  సమాచార హక్కు కార్యకర్తల గోప్యతను నిర్లక్ష్యంగా లేదా ఉద్దేశ పూర్వకంగా బయటపెట్టే అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50,000 జరిమానా విధిస్తారు.

  అవినీతి అధికారుల వివరాలను ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం.

  కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమాచారం పొందే వ్యక్తులు ‘కాంపిటెంట్‌ అథారిటీ’ అంటే సంబంధిత కేంద్ర పాలిత ప్రాంత పాలకుడి లేదా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను సంబోధిస్తూ దరఖాస్తులో సమాచారాన్ని కోరాలి.

 రాజకీయ పార్టీలు కేంద్రం నుంచి పరోక్షంగా నిధులు పొందడంతో పాటు ప్రజావిధుల్లో పాల్గొంటాయి కాబట్టి అవి ప్రజాసంస్థల కిందకే వస్తాయని 2013 జూన్, 3న కేంద్ర సమాచార కమిషన్‌ స్పష్టం చేసింది. జాతీయ రాజకీయ పార్టీలు ఆరు వారాల్లోగా సమాచార అధికారులు, అప్పిలేట్‌ యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది.

 అన్ని రాజకీయ పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ‘ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951’ కింద నమోదైన రాజకీయ పార్టీలను ప్రజా సంస్థలుగా భావించరాదని పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాయి.

 సమాచార హక్కు చట్టం - 2005 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు.

  సమాచార హక్కు చట్టం - 2005లో పొందుపరిచిన అధికార విధులను అమలు చేయడానికి ఈ చట్టంలోని సెక్షన్‌ 15(1) ప్రకారం రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ‘రాష్ట్ర సమాచార కమిషన్‌’ను ఏర్పాటు చేయాలి.

 ఆంధ్రప్రదేశ్‌లో 2005, అక్టోబరు 13న రాష్ట్ర సమాచార కమిషన్‌ అమల్లోకి వచ్చింది.

  రాష్ట్ర సమాచార కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్‌తో పాటు పది మందికి మించకుండా ఇతర సమాచార కమిషనర్లు ఉంటారు. వీరందరినీ రాష్ట్ర గవర్నర్‌ నియమిస్తారు.

 సమాచార హక్కు చట్టంపై కేవలం 23% మంది ప్రజలకు మాత్రమే అవగాహన ఉందని ‘ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌’ అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది.

 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం ఇంటర్వ్యూలు నిర్వహించే బోర్డు సభ్యుల పేర్లు, చిరునామాలను సమాచార హక్కు చట్టం ప్రకారం వెల్లడించడం కుదరదు. ఇంటర్వ్యూ చేసినవారి పేర్లను వెల్లడిస్తే వారి భద్రతకు అపాయం కలుగుతుందని బిహార్‌ రాష్ట్రానికి చెందిన పోలీసు ఉద్యోగాల ఇంటర్వ్యూ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.

Posted Date : 13-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌