• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - నదీ వ్యవస్థ 

  * భారతదేశంలో చిన్న పెద్ద నదులు కలిసి దాదాపు రెండు వేలకు పైగా ఉన్నాయి. అందుకే మన దేశానికి నదీ దేశమని పేరు. భారతదేశంలోని నదులను వాటి నుంచి ప్రవహించే నీటి పరిమాణం, పరీవాహక వ్యవస్థను బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు.
అవి: i) భారీ/ పెద్ద నదులు
       ii) మధ్యతరహా నదులు
       iii) చిన్న నదులు
సాధారణంగా 20,000 చ.కి.మీ. కంటే అధిక పరీవాహక వ్యవస్థ కలిగిన నదులను భారీ లేదా పెద్ద నదులు అంటారు. 20,000 నుంచి 2,000 చ.కి.మీ. మధ్యలో పరీవాహక వ్యవస్థ కలిగిన నదులను మధ్యతరహా నదులు అంటారు. 2,000 చ.కి.మీ. కంటే తక్కువ పరీవాహక వ్యవస్థ ఉన్న నదులను చిన్న నదులు అంటారు.
* దేశంలోని 14 భారీ నదులు, 44 మధ్యతరహా నదులు, 55 చిన్న నదులు ఉన్నాయి. వీటితోపాటు చిన్న చిన్న నదులు అనేకం ఉన్నాయి.
* దేశంలోని నదులను అవి జన్మించిన ప్రాంతాలు, వాటి లక్షణాలు, ప్రవాహ తీరు తెన్నులను బట్టి ప్రధానంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు. అవి:
i) హిమాలయ నదులు లేదా జీవనదులు
ii) ద్వీపకల్ప నదులు లేదా వర్షాధార నదులు


హిమాలయ నదులు: ఇవి ప్రధానంగా హిమాలయ పర్వతాల్లోని మంచు కరగడం వల్ల జన్మిస్తాయి. అందుకే వాటిని జీవనదులు అంటారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో అత్యంత వేగంగా ప్రవహించే ఈ నదులు మైదానాలకు చేరేసరికి వేగం తగ్గి మందకొడిగా సాగుతాయి.
ఉదా: గంగా, సింధు, బ్రహ్మపుత్ర, వాటి ఉపనదులు.
* ద్వీపకల్ప భారతదేశంలో పుట్టి, ప్రవహించే నదులను ద్వీపకల్ప నదులు అంటారు. వీటి ప్రవాహవేగం, నీటి పరిమాణం వర్షంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటిని వర్షాధార నదులు అని కూడా పిలుస్తారు. ప్రవహించే మార్గాన్ని బట్టి వీటిని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
a) తూర్పు వైపు ప్రవహించే నదులు
b) పశ్చిమం వైపు ప్రవహించే నదులు
* తూర్పు వైపు ప్రవహించే నదులు ప్రధానంగా పశ్చిమ కనుమల్లో జన్మిస్తాయి. తూర్పు వైపు ప్రవహిస్తూ చివరికి బంగాళాఖాతంలో కలుస్తాయి.
ఉదా: మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, వాటి ఉపనదులు.
* పశ్చిమం వైపు ప్రవహించే నదులు ప్రధానంగా మధ్య భారతదేశంలో పుట్టి, పశ్చిమానికి ప్రవహిస్తూ చివరికి అరేబియా సముద్రంలో కలుస్తాయి.
ఉదా: నర్మద, తపతి, వాటి ఉపనదులు.
* మనదేశంలో మరికొన్ని నదులు కూడా పుట్టి, ప్రవహిస్తున్నాయి.
ఉదా: లూని, మహి, సబర్మతి.


సింధు నదీ వ్యవస్థ 

      ఇది టిబెట్‌లోని మానస సరోవరం వద్ద ఉన్న కైలాస కొండల్లోని 'బొక్కరేఛు' హిమనీ నదం వద్ద జన్మిస్తుంది. అక్కడి నుంచి ఉత్తర దిశగా ప్రవహిస్తూ 'ధాంచోక్' అనే ప్రదేశం వద్ద భారతదేశంలోకి ప్రవేశించి, పశ్చిమ దిశగా తిరిగి జమ్మూ, కశ్మీర్ మీదుగా ప్రవహిస్తూ చివరికి పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ దక్షిణానికి మరలి అంతిమంగా కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 2880 కి.మీ. ఇది భారతదేశంలో కేవలం 709 కి.మీ. పొడవున మాత్రమే ప్రవహిస్తుంది. దీని ఉపనదులను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:
 i) పర్వత ప్రాంతంలో పుట్టి, పర్వత ప్రాంతంలోనే సింధూ నదితో కలిసే ఉపనదులు.
ఉదా: జస్కర్, ద్రాస్, అస్టార్, ష్యోక్, షిగార్, గిల్గిట్, కాబుల్.
ii) పర్వత ప్రాంతంలో పుట్టి, మైదాన ప్రాంతంలో సింధూనదిలో కలిసే ఉపనదులు.
ఉదా: జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్.
* టిబెట్ ప్రాంతంలో సింధూ నదిని 'సింగి - జంబన్' అని పిలుస్తారు. అంటే 'సింహపు నోరు' అని అర్థం. ఇది భారతదేశంలో ఒక్క జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మీదుగానే ప్రవహిస్తుంది. దీని ఉపనదులు మాత్రం హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తాయి.


సింధూనది ప్రధాన (మైదాన ప్రాంత) ఉపనదులు:


1. జీలం: ఇది కశ్మీర్ లోయలోని 'వెరినాగ్' వద్ద జన్మించి అక్కడి నుంచి ఉత్తర దిశగా ప్రవహిస్తూ ఉలార్ సరస్సులో కలుస్తుంది. తర్వాత నైరుతి దిశగా భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ప్రవహిస్తూ చివరికి పాకిస్థాన్‌లో త్రిమ్ము వద్ద చీనాబ్ నదిలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 724 కి.మీ. ఇది కశ్మీర్‌లో అత్యంత ప్రధానమైన నది. దీన్ని 'విటస్తా' అని కూడా అంటారు.


2. చీనాబ్: ఇది జస్కర్ శ్రేణుల్లోని 'బారాలాప్ చాలా' కనుమ వద్ద చంద్ర - భాగ అనే రెండు చిన్న నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని 'అక్నోర్' వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశించి పాకిస్థాన్‌లోని ముల్తాన్ వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది. ఈ నది సట్లెజ్‌లో కలవడానికి ముందు జీలం, రావి నదులను తనలో కలుపుకుంటుంది. ఈ నది మొత్తం పొడవు 1180 కి.మీ. ఇది సింధూ నది ఉపనదులన్నింటిలో అతి పెద్దది. ఈ నదిపై ఉన్న ప్రధాన జల విద్యుత్ కేంద్రాలు: సలాల్, బాగ్లిమార్, దుల్‌హస్తీ. ఈ నదిని 'ఆసికేని' అని కూడా పిలుస్తారు.


3. రావి: ఇది కులు పర్వతాల్లోని రోహ్‌తంగ్ కనుమల్లో పుట్టి, అక్కడి నుంచి పర్వతాల మీదుగా ప్రవహించి 'పాంగ్' వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది. చివరికి 'హరికె' వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 725 కి.మీ. దీన్ని ఐరావతి లేదా పరుషుని నది అని కూడా పిలుస్తారు.


4. సట్లెజ్: ఇది టిబెట్‌లోని రాకీస్ సరస్సు వద్ద పుట్టి అక్కడ నుంచి దౌలధర్, జస్కర్ పర్వతాల మీదుగా ప్రవహిస్తూ షిప్క్‌లా కనుమ వద్ద హిమాచల్‌ప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. చివరికి పాకిస్థాన్‌లోని 'మైదాన్‌కోట్' వద్ద సింధూ నదిలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 1450 కి.మీ. అయితే భారతదేశంలో ఇది ప్రవహించే దూరం మాత్రం 1050 కి.మీ. భారతదేశంలో ప్రవహించే సింధూ నది ఉపనదుల్లో ఇదే పెద్దది. ఈ నదిపైనే మన దేశంలోకెల్లా ఎత్తయిన, పెద్ద ఆనకట్ట 'భాక్రానంగల్‌'ను నిర్మించారు. ఈ నదిని శతద్రు లేదా సతుద్రి అని కూడా పిలుస్తారు.


5. బియాస్: ఇది రోహ్‌తంగ్ కనుమల్లోని బియాస్ కుండ్ వద్ద జన్మించి 'కపుర్తలా' వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు సుమారు 475 కి.మీ. దీన్ని విపాసా లేదా ఆర్గికేయ అని కూడా పిలుస్తారు.


గంగా నదీ వ్యవస్థ 

  ఇది భారతదేశంలో అతిపెద్ద నదీ వ్యవస్థ. గంగా నది కుమయూన్ హిమాలయాల్లో భగీరథి, అలకనంద అనే రెండు చిన్న నదుల కలయికతో ఏర్పడుతుంది. భగీరథ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కుమయూన్ హిమాలయాల్లోని కేదారనాథ్ సమీపంలో గంగోత్రి హిమనీ నదంలో జన్మించి, దేవప్రయాగ వద్ద అలకనంద నదితో కలుస్తుంది. అలకనంద నది కూడా కుమయూన్ హిమాలయాలు ఉన్న ఘర్వాల్ జిల్లా, బద్రీనాథ్ సమీపంలోని అలకనందా లేదా సతోపంత్ అనే హిమనీ నదంలో జన్మిస్తుంది.
* దేవప్రయాగలో అలకనందతో భగీరథ కలిశాక దాన్ని గంగా నదిగా పేర్కొంటారు. హరిద్వార్ వద్ద గంగానది మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ్ బంగ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ బ్రహ్మపుత్ర నదిని కలుపుకుని మరికొంత దూరం ప్రయాణించి, బంగాళాఖాతంలో కలిసేముందు అనేక పాయలుగా చీలి ప్రపంచంలోనే పెద్దదైన డెల్టాను ఏర్పరుస్తోంది.
* గంగానది ముఖ ద్వారంలో ఏర్పడిన అనేక పాయల్లో ప్రధానమైంది 'మేఘన'. పశ్చిమ్ బంగ రాష్ట్రంలో ఫరక్కాకు దక్షిణంగా గంగానది నుంచి 'హుగ్లీ - భగీరధ' అనే పాయ చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగా నది ప్రధాన పాయ మరికొంత దూరం ప్రయాణించి బంగ్లాదేశ్‌లో (అక్కడ దీన్ని పద్మా నదిగా పిలుస్తారు) 'గేలుండో' అనే ప్రాంతం వద్ద బ్రహ్మపుత్రా నదిని కలుపుకుని, చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 2525 కి.మీ. భారతదేశంలో ఇది సుమారు 2100 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. గంగా నదికి ఉన్న ఉపనదులను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:
(i) హిమాలయాల్లో పుట్టి గంగా నదితో కలిసే, హిమాలయ ఉపనదులు.
ఉదా: యమున, కోసి, రామ్‌గంగ, శారద, గండక్, తీస్తా.
(ii) ద్వీపకల్ప భారతదేశంలో పుట్టి గంగానదితో కలిసే, ద్వీపకల్ప ఉపనదులు.
ఉదా: సోన్, దామోదర్.


* పై నదులను తిరిగి రెండు రకాలుగా కూడా విభజించవచ్చు. అవి:


1) గంగా నదికి కుడివైపు కలిసే ఉపనదులు.
2) గంగా నదికి ఎడమవైపు కలిసే ఉపనదులు.
గంగా నది ప్రధాన ఉపనదులు 


యమున: గంగానది ఉపనదులలోకెల్లా అతిపెద్దది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఘర్‌వాల్ జిల్లాలో ఉన్న యమునోత్రి అనే హిమానీనదం వద్ద జన్మిస్తుంది. అక్కడి నుంచి హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుగా కొంతదూరం ప్రయాణించి చివరికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు. యమునా నది మొత్తం పొడవు 1376 కి.మీ. దీని ప్రధాన ఉపనదులు చంబల్, కెన్, బెట్వా, టాన్స్. ఇది నాగతిబ్బ, ముస్సోరి, శివాలిక్ కొండలను దాటి తాజెవాలా వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది.


చంబల్: ఇది యమునా నది ఉపనదులు అన్నింటిలో అతిపెద్దది. ఇది మధ్యప్రదేశ్‌లోని వింధ్య పర్వతాల్లో ఉన్న 'జనపావో' కొండల్లో జన్మించి, చివరికి ఉత్తర్ ప్రదేశ్‌లోని ఎట్వా జిల్లాలో యమునా నదితో కలుస్తుంది. దీని మొత్తం పొడవు సుమారు 1050 కి.మీ. దీని ప్రధాన ఉపనది 'బనాస్'. ఇది సవాయ్ మాధపూర్ వద్ద యమునా నదితో కలుస్తుంది. ఈ నదిపై ఉన్న ప్రధాన ఆనకట్టలు గాంధీసాగర్, రాణీ ప్రతాప్ సాగర్ (రావత్ భట్టా), జవహర్ సాగర్. కాళీసింద్, పర్‌బతి నదులు చంబల్ నదికి కుడివైపు ఉపనదులు.


సోన్: ఇది మధ్యప్రదేశ్‌లోని అమరకంటక్ పీఠభూమిలో పుట్టి, ఉత్తరదిశగా ప్రవహిస్తూ గంగా నదితో కలుస్తుంది. గంగా నదితో కుడివైపు కలిసే ఉపనదుల్లో ఇది అత్యంత ప్రధానమైంది. ద్వీపకల్పంలో పుట్టి ఉత్తరానికి ప్రవహిస్తూ గంగా నదితో కలిసే నదుల్లో ఇదే అతి పెద్దది. ఇది బిహార్‌లోని పట్నా జిల్లా, ధనీపూర్ వద్ద గంగానదితో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 780 కి.మీ. దీని ప్రధాన ఉపనదులు జోహిల్లా, కన్‌హార్, నార్త్‌కోయల్, సౌత్‌కోయల్.


దామోదర్: ఇది ఛోటానాగపూర్ పీఠభూమిలో జన్మించి పగులు లోయ మీదుగా తూర్పు వైపు ప్రవహిస్తూ చివరికి పశ్చిమ్ బంగ రాష్ట్రంలో గంగానది పాయ అయిన హుగ్లీ నదితో కలుస్తుంది. దీన్ని 'బెంగాల్ దుఃఖదాయని' అని కూడా పిలుస్తారు. కలకత్తా సమీపంలో దామోదర్ నదిపై 'హౌరా వారధిని' నిర్మించారు. ఈ నదికి ఉన్న ప్రధాన ఉపనదులు బార్కార్, కోనాల్. దీని మొత్తం పొడవు 541 కి.మీ.


రామ్‌గంగ: ఇది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘర్‌వాల్ జిల్లాలో జన్మించి 'కాలఘర్' వద్ద మైదానంలోకి ప్రవేశించి, చివరికి 'కనోజ్' వద్ద గంగానదితో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 596 కి.మీ.


ఘాగ్రా: ఇది టిబెట్‌లోని గుర్లామందాత్ శిఖరం వద్ద జన్మించి, బిహార్ రాష్ట్రంలోని చాప్రా వద్ద గంగానదితో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 1080 కి.మీ. దీన్ని నేపాల్‌లో 'కర్‌నైలి' అని పిలుస్తారు. దీని ప్రధాన ఉపనదులు - శారద, సరయు, రపత.


శారద: ఇది నేపాల్ హిమాలయాల్లోని 'మిలామ్' హిమనీ నదం వద్ద జన్మిస్తుంది. అక్కడ దీన్ని 'గోరిగంగా' అని పిలుస్తారు. దీనికి వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లు ఉన్నాయి. కాళీ నది అని, చౌకా నది అని అంటారు. ఇది సితాపూర్, బరబంకీ, డరాచ్ జిల్లాల కలయిక వద్ద 'ఘాగ్రా' నదితో కలుస్తుంది.


గండక్: ఇది నేపాల్‌లో జన్మించి బిహార్ రాష్ట్రంలో భారతదేశంలోకి ప్రవేశించి, చివరికి వైశాలి జిల్లాలోని హజీపూర్ వద్ద గంగానదితో కలుస్తుంది. దీన్ని నేపాల్‌లో సాలగ్రామ్, కాళీ గండక్ అని పిలుస్తారు. భారతదేశంలో 'నారాయణి' అనే పేరుతో కూడా పిలుస్తారు.


బ్రహ్మపుత్రా నది

      హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరాల్లో జన్మించి, సుమారు 2,900 కి.మీ. పొడవున ప్రవహించి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది టిబెట్, ఇండియా, బంగ్లాదేశ్ దేశాల మీదుగా ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్రా నదికి వివిధ పేర్లున్నాయి. టిబెట్‌లో త్సాంగ్‌పో అని, అరుణాచల్ ప్రదేశ్‌లో దిహంగ్ అని, అసోంలో బ్రహ్మపుత్ర అని, బంగ్లాదేశ్‌లో 'జమున' అని పిలుస్తారు. గంగానదితో కలిసిన తర్వాత 'పద్మానది'గా వ్యవహరిస్తారు.
* బ్రహ్మపుత్రా నది కైలాస శిఖరాల్లో జన్మించిన తర్వాత తూర్పు దిశగా టిబెట్ ప్రాంతం నుంచి ప్రవహిస్తూ నామ్చాబార్వా శిఖరం వద్ద దక్షిణ దిశగా ప్రయాణించి భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ 'ధుబ్రి' వద్ద బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ కొంతదూరం ప్రవహించి 'గేలుండే' వద్ద గంగానదితో కలుస్తుంది. చివరికి బంగాళాఖాతంలో కలిసేటప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా అయిన సుందర్‌బన్ డెల్టాను ఏర్పరుస్తుంది. దీని ప్రధాన ఉపనదులు లోహిత్, దిహంగ్.

Posted Date : 30-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌