• facebook
  • whatsapp
  • telegram

జ్ఞానేంద్రియాలు

   మనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే అవయవాలు జ్ఞానేంద్రియాలు. ఇవి సమాచారాన్ని గ్రహించి విద్యుత్ తరంగాల రూపంలో మెదడుకు పంపుతాయి. మెదడు వీటిని విశ్లేషిస్తుంది. జ్ఞానేంద్రియాల్లో జ్ఞాన సమాచారాన్ని గ్రహించే కణాలను గ్రాహకాలంటారు. ప్రతి గ్రాహకం ఒక ప్రత్యేకమైన జ్ఞానవార్తలను సేకరించడానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన గాఢత లేదా బలం ఉన్న క్షోభ్యతలను మాత్రమే స్పందించడం జ్ఞానేంద్రియ ముఖ్య లక్షణం. జ్ఞానేంద్రియాలు మన దేహానికి కిటికీల లాంటివి.

మానవ శరీరంలో అయిదు ముఖ్య జ్ఞానేంద్రియాలు ఉన్నాయి.

అవి:

1) కళ్లు

2) చెవులు

3) ముక్కు

4) నాలుక

5) చర్మం.


కన్ను:

ఇది జ్ఞానేంద్రియాన్నింటిలోకెల్లా అతి ముఖ్యమైంది. ఇది అతిశక్తిమంతమైన దృష్టి జ్ఞానేంద్రియం. చదువుకునేటప్పుడు పుస్తకానికి కంటికి కనీసం 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. మనం రెండు కళ్లతో ఒకే వస్తువుని చూడగలుగుతాం. దీన్ని బైనాక్యులర్ విజన్ అంటారు. కంటిలో కన్నీటిని స్రవించే అశ్రుగ్రంథులు ఉన్నాయి. అశ్రుస్రావం లవణయుతంగా ఉండి క్రిమిసంహారిగా, కంటిని తడిగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

    * కంటిలో మూడు పొరలు ఒకదానివెనుక ఒకటి ఉంటాయి. బయటి పొరను దృఢస్తరం అంటారు. ఇది దృఢంగా తంతురూపంలో ఉంటుంది. దృఢస్తరం కంటి ముందరి భాగంలో, శుక్లపటలాన్ని ఏర్పరుస్తుంది. ఇది పారదర్శకంగా ఉండి కాంతి కిరణాలను కంటిలోకి పోనిస్తుంది. దీన్ని కప్పి కంటిపొర ఉంటుంది. కంటిలోని రెండో పొరను రక్తపటలం అంటారు. దీనిలో అనేక రక్త నాళాలు ఉంటాయి. మూడో లోపలి పొరను నేత్రపటలం అంటారు. ఇదే కంటి జ్ఞానగ్రాహకం. ఇది కాంతిని గ్రహించి, కాంతిశక్తిని నాడీ ప్రచోదనాలుగా మారుస్తుంది.

    * శుక్లపటలం కింద గుండ్రంగా ఉండే పొరలాంటి నిర్మాణం కనుపాప. కంటిరంగు కనుపాపను బట్టి ఉంటుంది. కనుపాపలో ఉండే వర్ణకపదార్థం వల్లే కంటికి నలుపు, బూడిద, నీలం రంగు వస్తుంది. కనుపాప మధ్యలో గుండ్రంగా ఉండే రంధ్రాన్ని తారక అంటారు. ఇది కంటిలోపలి కుహరంలోకి కాంతిని ప్రవేశించేటట్లు చేస్తుంది. వెలుతురును బట్టి కనుపాప, తారకల పరిమాణం మారుతూ ఉంటుంది. కాంతి తక్కువగా ఉన్నప్పుడు చీకటిలో కనుపాప వ్యాకోచించి తారక పెద్దదవుతుంది. .

దీనివల్ల ఎక్కువ కాంతి తారక ద్వారా కంటిలోకి పోతుంది. పగటిపూట, కాంతి తీక్షణంగా ఉన్నప్పుడు తారక చిన్నది కావడం వల్ల తక్కువ కాంతి కంటిలోకి వెళ్లుతుంది. కనుపాప, తారకల పని కెమెరాలో ఉన్న డయాఫ్రమ్ పనిని పోలి ఉంటుంది.

    నేత్రపటలంలో రెండు రకాల కణాలున్నాయి. వీటిని దండ, కోను కణాలు అంటారు. వీటి నిష్పత్తి 15 :1 ఉంటుంది. దండకణాలు అతి తక్కువ కాంతిని గ్రహిస్తాయి. ఇవి రంగులను గుర్తించలేవు. ఈ కణాల్లో ఉన్న ఎర్రటి పదార్థం రొడాప్సిన్ లేదా విజువల్ పర్పుల్. రొడాప్సిన్ ఏర్పడటానికి విటమిన్-ఎ అవసరం. దీని లోపం వల్ల కంటి జబ్బులు వస్తాయి. కాబట్టి ఇది లభించే ఆకుకూరలు, పసుపుపచ్చని రంగు కూరలు, పండ్లు లాంటివి ఆహారంగా తీసుకోవాలి.

 * కోనుకణాలు ఎక్కువ కాంతిలో పనిచేస్తాయి. ఇవి రంగులను గుర్తుపట్టడానికి ఉపయోగపడతాయి. ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండే భాగాన్ని ఎల్లోస్పాట్ అంటారు. వస్తువు నుంచి వచ్చే కాంతి కిరణాలు శుక్లపటలం, తారకల ద్వారా ప్రయాణించి కటకం వల్ల నేత్రపటలంపైకి కేంద్రీకృతమవుతాయి. దీనివల్ల నేత్రపటలం మీద ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబం వస్తువు కంటే చిన్నదిగా ఉండి, తలకిందులుగా ఏర్పడుతుంది.

కంటి నుంచి మెదడుకు వార్తలను చేరవేసే నాడిని దృక్‌నాడీ అంటారు. నేత్రస్తరం దృక్‌నాడీ కలిసి ఉండేచోట దండ, కోనుకణాలు ఉండని ప్రదేశాన్ని అంధ చుక్క అంటారు.

కంటిలోని కటకం కాంతి కిరణాలను సరిగా కేంద్రీకరించలేకపోతే దృష్టి లోపాలు వస్తాయి. నేత్రపటలానికి ముందుగా ప్రతిబింబం ఏర్పడితే ఆ దృష్టి లోపాన్ని మయోపియా లేదా హ్రస్వదృష్టి అంటారు. నేత్ర పటలానికి వెనుకగా ప్రతిబింబం ఏర్పడితే ఆ దృష్టిలోపాన్ని దీర్ఘదృష్టి అంటారు.

ముక్కు:

దీని లోపల శ్లేష్మస్తరం ఆవరించి ఉంటుంది. దీనిలో ఉండే రసాయన గ్రాహకాలను ఘ్రాణ గ్రాహకాలంటారు. గాలిలోని వాసనను కలిగించే రసాయనాలు శ్లేష్మస్తరం తడిలో కరుగుతాయి. తద్వారా ఘ్రాణగ్రాహకాలు వీటిని గుర్తుపడతాయి. ఘ్రాణగ్రాహకాలు విద్యుత్ ప్రచోదనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ సమాచారం ఘ్రాణనాడి ద్వారా మెదడును చేరి విశ్లేషితమవుతుంది. జలుబు చేసినప్పుడు ముక్కుకు ఆవిరి పట్టాలంటే యూకలిప్టస్ నూనె వాడవచ్చు.

చెవి:

ఇది వినడానికే కాకుండా శరీరం సమతాస్థితిని కాపాడటానికి కూడా పనిచేస్తుంది. చెవిలో 3 భాగాలున్నాయి. అవి:1) బాహ్య చెవి 2) మధ్య చెవి 3) లోపలి చెవి. బాహ్య చెవిలో బయటకు కనిపించే చెవిదొప్ప, కుహరం, కర్ణభేరి ఉంటాయి. చెవిదొప్ప మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. బాహ్యచెవి శబ్దతరంగాల కేంద్రీకరణకు ఉపయోగపడుతుంది. మధ్యచెవిలో కూటకం, దాగలి, కర్ణాంతరాస్థి అనే ఎముకలు గొలుసుల్లా అమరి ఉంటాయి. వీటిలో కూటకం ఎముక కర్ణభేరితో కలిసి ఉంటుంది. శబ్ద తరంగాలు కర్ణభేరిని తాకగానే కర్ణభేరి ప్రకంపిస్తుంది. తద్వారా ఏర్పడిన ప్రకంపనాలు ఎముకల గొలుసు ద్వారా లోపలి చెవిలోని నిర్మాణాలకు అందుతాయి.
వినడంలో లోపలి చెవి ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనిలో రెండు కుహరాలు ఉన్నాయి. బయటి కుహరాన్ని అస్థిగహనం అంటారు. ఇది పరిలశిక ద్రవంతో నిండి ఉంటుంది. లోపలి కుహరాన్ని త్వచాగహనం అంటారు. ఇది అంతరలశిక ద్రవంతో ఉంటుంది. శబ్ద తరంగాలు ఎముకల గొలుసు ద్వారా అంతరలశిక ద్రవానికి చేరతాయి. అంతర లశికలోని ప్రకంపనాలు గ్రాహకకణంలోని శైలికలను చలింపజేయడం వల్ల ఇవి విద్యుత్ ప్రకంపనాలను కలుగజేస్తాయి. ఈ ప్రకంపనాలు శ్రవణనాడి ద్వారా మెదడును చేరి విశ్లేషితమతాయి. కొన్ని పెద్ద శబ్దాలు కపాలంలోని ఎముకల ద్వారా లోపలి చెవిని చేరతాయి. ఈ ప్రక్రియను బోని కండక్షన్ అంటారు.

నాలుక:

ఇది రుచిని తెలుపడానికి ఉపయోగపడే జ్ఞానేంద్రియం. దీనిపైన రుచికళికలు ఉంటాయి. వీటి కుహరంలో గ్రాహకాలు ఉంటాయి. నాలుక ముందరి భాగంలో ఉండే రుచికళికలు తీపి, ఉప్పును, అంచుల్లో ఉండేవి పులుపును గ్రహిస్తాయి. నాలుక వెనుక భాగంమీద చేదును గ్రహించే రుచికళికలు ఉన్నాయి. నోటిలో ఆహారంలో ఉండే రసాయనాలు లాలాజలంలో కరుగుతాయి. లాలాజలం రుచికళికల్లోకి వెళ్లి గ్రాహకాలను తాకుతుంది. దీనివల్ల గ్రాహకకణాలు విద్యుత్ తరంగాలను ఏర్పరచి నాడీ ద్వారా మెదడును చేరతాయి. అతిచల్లని, అతివేడి పదార్థాల వల్ల రుచి జ్ఞానం నశిస్తుంది. నాలుకపైన పుండ్లు పడటం ఆహారంలో విటమిన్ల లోపాన్ని తెలియజేస్తుంది.

చర్మం:

ఇది మన శరీరంలో అతిపెద్ద అవయవం. ఇది మనకు స్పర్శజ్ఞానాన్ని కలుగజేస్తుంది. శీతోష్ణస్థితుల ప్రభావం నుంచి రక్షిస్తుంది.

శరీర ఉష్ణోగ్రతను బయటకు పోకుండా కాపాడుతుంది. వ్యర్థపదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇది అరికాళ్లలో, అరిచేతుల్లో ఎక్కువ మందంతో ఉంటుంది. దీనికి సాగే లక్షణం ఉంటుంది. దీని అధ్యయనాన్ని డెర్మటాలజీ అంటారు.

చర్మంలో రెండు పొరలుంటాయి. అవి: 1) బాహ్య చర్మం 2) అంతశ్చర్యం. బాహ్య చర్మం బయటి వైపు ఉంటుంది. దీనిలోని వెలుపలి పొర కణాలను కార్నియస్ పొర అంటారు. ఇవి నిర్జీవ కణాలు. వీటిలో కెరాటిన్ అనే ప్రొటీను ఉంటుంది. కెరాటిన్ గోళ్లు, రోమాల్లో ఉంటుంది. కార్నియస్ పొర కణాలు పొలుసులుగా ఊడిపోతాయి. బాహ్యచర్మం లోపలి పొరను మాల్ఫీజియన్ స్తరం అంటారు. దీనిలోని కణాలు సజీవ కణాలు. అంతశ్చర్మం చర్మం లోపలి వైపునకు ఉంటుంది. దీని కింద కొవ్వు నిల్వలు ఉంటాయి. దీనిలో ఎత్తు పల్లాలుంటాయి. వీటి వల్లే వేలిముద్రలు ఏర్పడతాయి. ఇవి కవల పిల్లల్లో కూడా వేర్వేరుగా ఉండి వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగపడతాయి.

అంతశ్చర్మంలో ఉన్న రోమపుటికల నుంచి రోమాలు ఏర్పడతాయి. అంతశ్చర్మంలో సెబీషియస్ గ్రంథులు లేదా తైల, స్వేద గ్రంథులు ఉంటాయి. తైల గ్రంథి సెబెమ్ అనే తైల పదార్థాన్ని స్రవించి చర్మం ఎండిపోకుండా చూస్తుంది. స్వేదగ్రంథులు చెమటను స్రవిస్తాయి. స్వేదరంధ్రాల ద్వారా చెమట బయటకు వచ్చి ఆవిరిగా మారి శరీరాన్ని చల్లగా ఉండేటట్లు చేస్తుంది. స్వేద గ్రంథులు రక్తంలో ఎక్కువగా ఉన్న నీరు, సోడియం క్లోరైడ్, యూరియా లాంటి వాటిని బయటకు పంపిస్తాయి.

చర్మం, రోమాలు రంగుగా ఉండటానికి కారణం మెలనిన్ అనే వర్ణ పదార్థం. మెలనిన్ గాఢతను బట్టి చర్మం, వెంట్రుకల రంగు మారుతూ ఉంటుంది. మెలనిన్ గాఢత ఎక్కువయితే చర్మం నలుపు రంగులోకి మారుతుంది. చర్మానికి అధిక సూర్యరశ్మి సోకినప్పుడు చర్మంలో ఎక్కువ మెలనిన్ ఉత్పత్తి కావడం వల్ల చర్మం గాఢమైన రంగులోకి మారుతుంది. దీన్నే టానింగ్ అంటారు. మెలనిన్ అతి నీలలోహిత కిరణాల బారి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

చర్మంలో స్పర్శ, ఉష్ణం, పీడనం లాంటి వాటిని గ్రహించేందుకు ఉండే గ్రాహకాలను చర్మ గ్రాహకాలంటారు. స్పర్శను గ్రహించే గ్రాహకాలను స్పర్శ గ్రాహకాలనీ, పీడనానికి సంబంధించిన గ్రాహకాలను 'పాసినియన్ కణాలని అంటారు. స్పర్శ గ్రాహకాలు వేళ్ల కొనలమీద, పెదవులపైన ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. చర్మంలో బాధను కలిగించే గ్రాహకాలను నాసిసెప్టారులు అంటారు.

చర్మం శరీరానికి ప్రహరీగోడలా పనిచేస్తుంది. ప్రూరైటిస్, తట్టు, ఎక్జిమా, పెల్లగ్రా, మొటిమలు, గజ్జి, తామర, సోరియాసిస్ అనేవి చర్మ వ్యాధులు. ప్రూరైటిస్ లేదా దురదలు వాతావరణంలోని మార్పులు, కలుషితమైన నీటిలో స్నానం చేయడం వల్ల వస్తాయి. ఎక్జిమా వ్యాధిలో చర్మం దళసరిగా, ముదురు బూడిద రంగులోకి మారి పొలుసులుగా ఊడిపోతుంది. మనం తీసుకునే ఆహారంలో నియాసిన్ అనే విటమిన్ లోపం వల్ల పెల్లగ్రా అనే వ్యాధి వస్తుంది.

చర్మంలోని తైల గ్రంథి నాళాల్లో బ్యాక్టీరియా చేరి అడ్డంగా ఉండటం వల్ల మొటిమలు వస్తాయి. ఫంగస్ (శిలీంద్రం) వల్ల వచ్చే వ్యాధి తామర. ఈ వ్యాధిలో చర్మంపై మందంగా, క్రమరహిత మచ్చలు ఏర్పడి చర్మం పొలుసులుగా ఊడిపోతుంది. సోరియాసిస్‌లో చర్మం పొట్టులా రాలిపోతుంది. గజ్జి లేదా స్కెబిస్ చిన్నపిల్లల్లో అతి సామాన్యంగా వచ్చే చర్మ వ్యాధి. ఇది ఎకారస్ లేదా ఇచ్‌మైట్ అనే కీటకం వల్ల వస్తుంది. ఈ కీటకం శాస్త్రీయనామం సార్కోప్టిస్ స్కెబిస్. గజ్జి అనేది అంటు వ్యాధి. ఆడ కీటకం చర్మంలో బొరియలు చేస్తుంది. ఇవి ఏర్పడటం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వీటిని మోల్టింగ్ ప్యాకెట్లు అంటారు. గజ్జి వ్యాధిని నివారించడానికి సల్ఫర్ ఉన్న లేపనాలను వాడతారు.

Posted Date : 29-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌