• facebook
  • whatsapp
  • telegram

ఏక శాసనసభ, ద్వి శాసనసభ

శాసన వ్యవస్థ
* దేశంలోని ప్రజలకు అవసరమైన పరిపాలనా వ్యవస్థను రూపొందించడానికి, చర్చల్లో వివిధ వర్గాల వారు పాల్గొనడానికి, వివిధ వర్గాల అభిప్రాయాలను సమన్వయపరచి శాసనాలను రూపొందించడానికి శాసనవ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
* బ్రిటన్‌లో తొలిసారిగా క్లర్జీలు, నోబుళ్లు, కామన్స్ ప్రతినిధులతో వైట్ సెగ్మెంట్ ఏర్పడింది.

* క్రీ.శ.1265లో సైమన్ డి మౌంట్ బరో  ప్రతినిధులతో పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.
* క్రీ.శ.1295లో మొదటి ఎడ్వర్డ్ ఒక మోడల్ పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మోడల్ పార్లమెంట్ క్రమంగా గ్రేట్ నేషనల్ కౌన్సిల్‌గా ఏర్పడింది. ఈ కౌన్సిల్‌లో ప్రభువుల సభ, కామన్స్ సభ అనే రెండు సభలు ఏర్పడ్డాయి. ఈ రెండు సభలు బ్రిటన్ పార్లమెంట్‌గా అవతరించాయి. ఇదే ప్రపంచంలో తొలి పార్లమెంటు (శాసన వ్యవస్థ).
* శాసన సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ద్వారా ఎన్నికైన శాసన సభ్యులు తిరిగి ప్రజలకు బాధ్యత వహించాలి.

 

శాసన వ్యవస్థ రకాలు
* శాసన వ్యవస్థ నిర్మాణం ప్రపంచంలో రెండు రకాలుగా కొనసాగుతోంది. శాసన నిర్మాణ శాఖలో ఒకే సభ ఉంటే దాన్ని ఏక శాసనసభ, రెండు సభలు ఉంటే ద్వి శాసనసభ అని అంటారు.

 

ఏక శాసనసభ విధానం
 ఏక శాసనసభ విధానంలో కేవలం ఒక సభ మాత్రమే ఉంటుంది. దాన్ని దిగువ సభ అంటారు. ప్రజాస్వామ్యంలో సార్వభౌమాధికారం అంతిమంగా ప్రజల చేతిలో ఉంటుంది. కాబట్టి, వారి అభీష్టాన్ని తెలియజేయడానికి ఒక సభ ఉంటే సరిపోతుందని కొందరు భావిస్తారు
* ఫ్రాన్స్‌కు చెందిన అబీసాయిస్ అనే రాజనీతిజ్ఞుడు శాసన నిర్మాణ శాఖ ఒకే సభను కలిగి ఉండాలని పేర్కొన్నారు.
* అమెరికాకు చెందిన బెంజిమన్ ఫ్రాంక్లిన్ ఏక శాసనసభ విధానాన్ని సమర్థించారు.
* ఇంగ్లండ్‌కు చెందిన జెర్మీ బెంథామ్  'ఏక శాసనసభా విధానాన్ని సమర్థించి, శాసన నిర్మాణ శాఖలో ఎగువ సభ నిరుపయోగమైందని పేర్కొన్నారు.

 

ప్రస్తుతం ఒకే సభ ఉన్న దేశాలు

దేశం పేరు శాసనసభ పేరు
గ్రీస్ హెలెనిక్
పోర్చుగల్ అసెంబ్లీ ఆఫ్ ది రిపబ్లిక్
చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్
మాల్దీవులు మజ్లిస్
బంగ్లాదేశ్  జాతీయ సన్సద్
పెరు కాంగ్రెస్ ఆఫ్ రిపబ్లిక్
శ్రీలంక పార్లమెంటు
నేపాల్  రాష్ట్రీయ పంచాయతీ
ఇరాన్ మజ్లిస్
ఇరాక్ నేషనల్ అసెంబ్లీ
స్వీడన్ రిక్స్‌డాగ్
ఐర్లాండ్ ఐరిష్ టాచ్
డెన్మార్క్ ఫోకటింగ్
ఇజ్రాయెల్ నెస్సెట్
ఫిన్‌లాండ్ ఎడుస్కుంటా

ఏక శాసనసభ ఉపయోగాలు

శాసన నిర్మాణంలో జాప్యం నివారణ
* శాసన నిర్మాణంలో ఒకేసభ ఉండటం వల్ల బిల్లును ఆమోదించి, దేశాధ్యక్షుడి ఆమోదానికి పంపడం ద్వారా వెంటనే బిల్లు చట్టంగా మారుతుంది. దీని ఫలితంగా ఏ విధమైన జాప్యం లేకుండా వెంటనే శాసనాలు రూపొందించే వీలుంటుంది.

 

శాసనసభ ఏర్పాటు సులభం
* రెండు సభల విధానంతో పోల్చితే ఏకసభా విధానంలో శాసనసభ నిర్మాణాన్ని సులభంగా ఏర్పాటు చేయవచ్చు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సభకు కావాల్సిన ప్రతినిధులను ప్రజలు ఎన్నుకోవడంతో శాసనసభ నిర్మాణం పూర్తవుతుంది.
కార్యనిర్వాహక వర్గ నియంతృత్వాన్ని నియంత్రిస్తుంది
* శాసన నిర్మాణ శాఖలో రెండు సభల కంటే ఏకసభ ఉండటం వల్ల అది సమర్థంగా పనిచేయడంతో పాటు కార్యనిర్వాహక వర్గం నియంతృత్వాన్ని నియంత్రిస్తుంది.
* ద్విసభలు ఉంటే సార్వభౌమాధికారం రెండు సభల మధ్య విభజితమవుతుందని, దానివల్ల ఏ ఒక్క సభ సమర్థంగా పనిచేయలేదని విమర్శకులు పేర్కొంటారు.ఆదర్శ శాసన నిర్మాణం
* ద్వి సభా విధానంలో ఎగువ సభ ఉన్నత వర్గాల వారికి, సంప్రదాయ వాదులకు, ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ప్రాతినిధ్యం కల్పించడం వల్ల వారు ఆదర్శ భావాలతో కూడిన శాసన నిర్మాణానికి ఆటంకం కలిగించవచ్చు.
* ఏకసభా విధానంలో దిగువ సభకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఓటర్లు ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు. వీరు సాధారణంగా ప్రజలకు ఉపకరించే శాసనాలను మాత్రమే రూపొందిస్తారు. లేకపోతే తదుపరి ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల భవితవ్యం ప్రశ్నార్థకమవుతుంది.

ప్రతిష్టంభన ఉండదు
* ద్వి సభా విధానంలో ఒక సభ ఆమోదించిన బిల్లుకు రెండో సభలో ఏ దశలోనైన ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏకసభా విధానంలో దిగువ సభ ఒకే లక్ష్యంతో తన విధులను సాధించడానికి ప్రయత్నించడం వల్ల ప్రతిష్టంభనకు అవకాశం ఉండదు.
* ద్వి శాసనసభా నిర్మాణం, నిర్వహణతో పోల్చినట్లయితే ఏకసభా నిర్మాణానికి, నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుంది.
* 1950లో న్యూజిలాండ్, 1954లో డెన్మార్క్ దేశాలు తమ దేశంలోని ద్విసభా విధానాన్ని రద్దు చేసుకుని ఏకసభా విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.
* 'ఏకసభా విధానం సరళమైంది మాత్రమే కాకుండా, పౌరులు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా అధికారికంగా తమకు ప్రాతినిధ్యం కల్పించుకుంటారు' అని ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త విల్లోభి పేర్కొన్నారు.

 

ఏకసభా విధానం - లోపాలు

నియంతృత్వం దిశగా పయనం
* ఏకసభా విధానంలోని సభ్యులు నియంతృత్వంతో వ్యవహరిస్తూ, తమకు అనుకూలమైన శాసనాలను మాత్రమే రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఎగువసభ ప్రశ్నించే అవకాశం లేకపోవడంతో దిగువసభ ఇష్టానుసారంగా శాసనాలను రూపొందించే ప్రమాదం ఉంది.

తొందరపాటు, అనాలోచిత నిర్ణయాలు
* ఏకసభా విధానంలో పెద్దగా అనుభవం లేని యువకులు భావోద్వేగాలను నియంత్రించుకోలేక తొందరపాటు నిర్ణయాలతో శాసనాలను రూపొందించుకోవడం వల్ల ప్రజలకు లాభం కంటే నష్టాలే ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. దేశ విశాల ప్రయోజనాల కంటే తమ ప్రయోజనాలే లక్ష్యంగా శాసనాలు రూపొందించే అవకాశం ఉంది.

 

శాసనాల్లో నాణ్యత లేమి
* ఏకసభా విధానంలో రూపొందించిన శాసనాల్లో సమగ్రత లోపించి, లోపభూయిష్ఠమైన విధానాలను చట్టాలుగా చేసే అవకాశం ఉంది. ప్రజాప్రయోజనాల కోసం రూపొందించే శాసనాల్లో నాణ్యత ఉండకపోవచ్చు.
* ఏకసభా విధానాన్ని ఏర్పాటు చేసుకున్న అనేక దేశాలు అనతి కాలంలోనే ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏకసభా విధానంలో అనేక లోపాలున్నాయని వెల్లడవుతుంది.

 

ద్విసభా విధానం
* శాసన నిర్మాణంలో రెండు సభలు ఉంటే దాన్ని ద్విసభా విధానం అంటారు.
అవి: 1) ఎగువ సభ 2) దిగువ సభ
* ద్విసభా విధానంలో దిగువ సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోవడం వల్ల, ప్రభుత్వ ఖర్చులను మంజూరు చేసే అధికారంతోపాటు, ప్రభుత్వాన్ని నియంత్రించే అధికారం కూడా దిగువ సభకే ఉంటుంది. రెండు సభల్లోకెల్లా దిగువ సభయే శక్తిమంతమైంది.

ద్విసభా విధానం - ఎగువ సభ సభ్యుల నియామక పద్ధతులు
* అమెరికాలోని ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రతినిధులు ఎగువ సభ అయిన సెనేట్‌కు ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికవుతారు.
* మనదేశంలో రాజ్యసభ సభ్యులను రాష్ట్రాల శాసన సభ్యులు పరోక్ష విధానంలో ఎన్నుకుంటారు.
* మనదేశంలో కళలు, సాహిత్యం, సామాజిక సేవా రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు.
* కెనడాలో వివిధ రంగాల్లోని ప్రముఖులను జీవితకాలానికి గవర్నర్ జనరల్ ఎగువ సభ సెనేట్‌కు నామినేట్ చేస్తారు.
* బ్రిటన్‌లోని ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్‌ కు కొంతమంది ప్రతినిధులను రాజు లేదా రాణి నియమిస్తారు. సభ్యుల మరణానంతరం అతడి సంతతికి చెందిన వారసులను వారసత్వ సూత్రం ప్రకారం కొనసాగిస్తారు.
* సాధారణంగా పెద్ద రాజ్యాలు, సమాఖ్య వ్యవస్థ ఉన్న రాజ్యాలు తమ చట్టాలను రూపొందించుకోవడానికి ద్విసభా విధానాన్ని అనుసరిస్తున్నాయి.

 


 

ద్విసభా విధానం - ప్రయోజనాలు
* జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయం ప్రకారం తొందర పాటుతో దిగువ సభ తీసుకున్న నిర్ణయాలపై ఎగువసభ ఒక బ్రేకులా పని చేస్తుంది.
* అనాలోచితంగా, తొందరపాటుతో దిగువ సభ సభ్యులు తీసుకున్న నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో అనర్థాలకు దారితీయవచ్చు. కాబట్టి ఎగువ సభ సభ్యులు తమ అనుభవంతో దిగువ సభ సభ్యుల తొందరపాటు నిర్ణయాలను నియంత్రిస్తారు.
* దిగువసభ చేసే అపరిపక్వమైన నిర్ణయాలను ఎగువసభ తన మితవాద వైఖరితో నియంత్రిస్తుంది.
* మేధావులు, విజ్ఞాన వేత్తలు, నిపుణులు సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. వీరికి ఎగువసభలో ప్రాతినిధ్యం కల్పించడం వల్ల వారి సేవలను జాతి ప్రగతి కోసం వినియోగించవచ్చు.
* బ్రిటన్‌లో ప్రధాని సిఫారసుల మేరకు సాహితీవేత్తలను, సేవా తత్పరత ఉన్నవారిని బ్రిటన్ రాజు/రాణి ఎగువసభ అయిన ప్రభువుల సభకు ప్రాతినిధ్యం కల్పిస్తారు.
* మన దేశంలో సాహిత్యం, కళలు, శాస్త్ర విజ్ఞానం, సంఘసేవల్లో విశిష్ట స్థానం సంపాదించిన 12 మంది వ్యక్తులను ఎగువసభ అయిన రాజ్యసభకు నామినేట్ చేస్తారు.
* ద్విసభా విధానంలో రెండు సభల మధ్య అధికారాలు విభజించడం వల్ల ప్రజల స్వేచ్ఛకు, అల్పసంఖ్యాకుల స్వాతంత్య్రానికి రక్షణ లభిస్తుంది.
* మొదటి సభ నియంతృత్వాన్ని రెండో సభ నియంత్రిస్తుందని జె.ఎస్. మిల్ పేర్కొన్కారు.

* సమాజంలోని అన్ని వర్గాల వారికి ద్విసభా విధానం తగిన ప్రాతినిధ్యం కల్పిస్తుందని బ్లంట్‌ష్లీ పేర్కొన్నారు.
* ద్విసభా విధానంలో దిగువసభతో పాటు ఎగువసభ కూడా శాసన నిర్మాణ బాధ్యతను వహించడంతో దిగువసభకు పనిభారాన్ని తగ్గించడం ద్వారా ఎగువసభ ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచగలుగుతుంది.
* ద్విసభా విధానంలో ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* ఎగువసభలో అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యం కల్పించడం వల్ల సమాఖ్య స్ఫూర్తి వర్థిల్లుతుంది.
* రాజకీయ అనిశ్చిత సమయంలో దిగువసభ రద్దయినప్పటికీ ఎగువసభ తన విధులను నిర్వహించడం ద్వారా దేశ ప్రయోజనాలను కాపాడటానికి కృషి చేస్తుంది.
* ప్రారంభంలో ఏకసభను ఏర్పాటు చేసుకున్న అనేక దేశాలు తర్వాత ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాయని మెరియట్ అనే రాజనీతిజ్ఞుడు పేర్కొన్నారు.

 

ద్విసభా విధానం - లోపాలు
* ద్విసభా విధానం ఏర్పాటు, నిర్వహణ వల్ల ఎక్కువ ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.
* ఈ విధానంలో ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ప్రజాభిప్రాయం రెండుగా చీలిపోతుంది. దీనివల్ల ప్రభుత్వం కూడా తన పటిష్ఠతను కోల్పోవడంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ప్రతిష్టంభన ఏర్పడవచ్చు.
* ఎగువసభ సభ్యులు ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికవకుండా, ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం పరోక్ష పద్ధతి ద్వారా నామినేట్ అవుతారు. వీరు ప్రజలకు ప్రత్యక్షంగా బాధ్యత వహించరు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం.

* నామినేషన్ విధానంలో నియమితులైన సభ్యులు అభివృద్ధి నిరోధక శక్తులుగా పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి.
* ద్విసభా విధానంలో ఒక బిల్లును శాసనంగా రూపొందించే సందర్భంలో ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడుతుంది. దీనివల్ల అనవసర కాలయాపన జరుగుతుంది.
* ఉభయసభలకు సమాన అధికారాలు ఉండక పోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఎగువసభ అలంకారప్రాయంగా మిగిలిపోతుంది.
ఉదా: ఆర్థిక బిల్లులు
* ఎగువసభ పెట్టుబడిదారీ వర్గాలకు, సంప్రదాయ వర్గాలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా దిగువసభ నిర్వహించే కార్యకలాపాలకు ప్రతిబంధంగా మారుతుంది.
* సమాఖ్య స్ఫూర్తిని, రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటానికి ఎగువసభ మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు.
* జెర్మి బెంథామ్, హెచ్.జె. లాస్కి, బెంజిమన్ ఫ్రాంక్లిన్, శామ్యూల్ ఆడమ్స్ లాంటి ప్రముఖులు ఏకసభా విధానాన్ని సమర్థిస్తూ, ద్విసభా విధానాన్ని వ్యతిరేకించారు.

 

దత్త శాసనాధికారం/నియోజిత శాసనం (Deligated Legislation)
* శాసన నిర్మాణ సభ కార్యనిర్వాహక వర్గానికి ప్రసాదించే శాసన నిర్మాణాధికారాన్ని నియోజిత శాసనం లేదా దత్త శాసనాధికారం అంటారు. దీనివల్ల కార్యనిర్వాహక వర్గం అధికారాలు, బాధ్యతలు పెరిగాయి.
* శ్రేయోరాజ్య భావన వల్ల ప్రస్తుతం రాజ్య విధులు విస్తృతంగా పెరిగాయి. పరిమిత కాలం ఉండటం వల్ల ప్రజా సంక్షేమానికి సంబంధించిన సమగ్రమైన చట్టాలు, నియమ - నిబంధనలను రూపొందించడం పరిమిత కాలరీత్యా శాసనసభకు సాధ్యం కావడం లేదు.
* శాసన నిర్మాణ సభలు చట్టాల స్థూల రేఖా బిల్లులను మాత్రమే రూపొందించి, మిగిలిన అధికారాన్ని లేదా బాధ్యతను కార్యనిర్వాహక వర్గానికి అప్పగిస్తున్నాయి.

దత్త శాసనాధికారం - ప్రయోజనాలు
* క్షేత్రస్థాయిలో కార్యనిర్వాహక వర్గానికి మంచి అవగాహన ఉండటంతో వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా చట్టాల రూపకల్పన చేయగల్గుతుంది.
* మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు, చేర్పులను కార్యనిర్వాహక శాఖ సమర్థంగా చేస్తుంది.
* శాసన నిర్మాణ సమయం ఆదా అవుతుంది.
* శాసన సభ కొన్ని సందర్భాల్లో సమావేశంలో ఉండదు. అలాంటి సందర్భంలో శాసన సభ ఏవైనా విధానపరమైన చర్యలను తీసుకోవాల్సి వస్తే కార్యనిర్వాహక వర్గమే వాటిని నియంత్రిస్తుంది.
* శాసన నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించాల్సిన అవసరం శాసన సభకు ఉండకపోవడం వల్ల అది రాజ్యానికి సంబంధించిన ముఖ్య సమస్యలపై దృష్టి సారించగలదు.

 

దత్త శాసనాధికారం - లోపాలు
* కార్యనిర్వాహక వర్గం నియంతృత్వ పోకడతో, అవినీతి కార్యకలాపాలకు పాల్పడవచ్చు.
* ప్రజాస్వామ్యం మౌళిక భావన ప్రకారం శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థను నియంత్రించాలి. కానీ దత్త శాసనాధికారం వల్ల కార్యనిర్వాహక వ్యవస్థే శాసన వ్యవస్థను నియంత్రిస్తుంది.
* అధికార పృథక్కరణ (Separation of Powers) కు వ్యతిరేకంగా ఉంటుంది.
* ప్రభుత్వరంగాల్లో ఎవరి విధిని వారే నిర్వహించాలి. ఒకదానికి కేటాయించిన విధిలో మరొక యంత్రాంగం జోక్యం చేసుకుంటే అసలు లక్ష్యం దెబ్బతింటుంది.
* జాన్ మరియట్ అభిప్రాయం ప్రకారం శాసనాధికారాలను కార్యనిర్వాహక వర్గానికి దత్తత చేయడం అనేది ఒక నవ్య నియంతృత్వానికి దారితీస్తుంది.

పార్లమెంటరీ తరహా ప్రభుత్వం - ముఖ్య లక్షణాలు
* ప్రభుత్వాంగాలైన శాసన నిర్మాణ, కార్యనిర్వాహక శాఖల మధ్య ఉండే సంబంధాన్ని బట్టి ప్రభుత్వాలను పార్లమెంటరీ, అధ్యక్షతరహా ప్రభుత్వాలుగా వర్గీకరిస్తారు.
* శాసన శాఖకు, కార్యనిర్వాహక శాఖకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది.
* పార్లమెంటరీ విధానంలో శాసన శాఖ నుంచి కార్యనిర్వాహక శాఖ ఏర్పడి దాని విశ్వాసం ఉన్నంత వరకే అధికారంలో ఉంటుంది.
* పార్లమెంటరీ ప్రభుత్వాలకు పుట్టినిల్లు బ్రిటన్.
* పార్లమెంటరీ వ్యవస్థలో రెండు రకాలైన అధిపతులు ఉంటారు. వీరిలో రాజ్యాధినేత అయిన రాష్ట్రపతి లేదా రాజు నామమాత్రపు అధిపతిగా ఉంటారు. వీరినే DeJure సార్వభౌమాధికారి అంటారు. మొత్తం అధికారాలు వీరి పేరుమీదనే నిర్వహిస్తారు. కాబట్టి వీరిని చట్టపర అధిపతి అంటారు.
* పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వహణాధికారాలను చెలాయిస్తుంది. ప్రభుత్వాధినేత అయిన ప్రధానిని Defacto సార్వభౌమాధికారి అంటారు.
* ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి వ్యక్తిగతంగా రాజ్యాధినేత అయిన రాష్ట్రపతికి, శాసన శాఖకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది.
* ఈ విధానంలో ప్రధానమంత్రి కేబినెట్‌కు అధ్యక్షత వహిస్తూ, సర్వాధికారాలు చెలాయిస్తారు. అందుకే దీన్ని కేబినెట్ తరహా లేదా ప్రధానమంత్రి తరహా ప్రభుత్వ విధానం అంటారు.

అధ్యక్షతరహా ప్రభుత్వ లక్షణాలు
* మాంటెస్క్యూ స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథంలోని అధికార పృథక్కరణ సిద్ధాంతంలో ఉన్న మౌలికాంశాలన్నీ అధ్యక్షతరహా విధానాన్ని తెలియజేస్తున్నాయి.
* అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖల మధ్య ఎలాంటి సంబంధం ఉండదు.
* కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.
* అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో అధ్యక్షతరహా విధానం అమల్లో ఉంది. ఈ విధానంలో మంత్రులు శాసనసభలో సభ్యులుకారు.
* అధ్యక్షతరహా విధానంలో అధ్యక్షుడికి నిర్ణీత పదవీకాలం ఉంటుంది. అధ్యక్షుడు శాసన శాఖకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.
* అధ్యక్షుడిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించడానికి వీల్లేదు.
* ఈ విధానంలో దేశాధినేత, ప్రభుత్వాధినేతగా ఒక్కరే కొసాగుతారు. మొత్తం అధికారాలన్నీ అధ్యక్షుడి పరిధిలోనే ఉంటాయి.
* వివిధ రాజకీయ భావజాలం ఉన్నవారు కూడా అధ్యక్షతరహా విధానంలో మంత్రులుగా కొనసాగవచ్చు. అధ్యక్షుడు తన విచక్షణ మేరకు మంత్రి మండలిని ఏర్పాటు చేసుకోవచ్చు.
* ఈ విధానంలో మంత్రులు అధ్యక్షుడికి కేవలం సలహాలు మాత్రమే ఇస్తారు. మంత్రులకు అధ్యక్షుడితో సమాన హోదా ఉండదు.
* ఈ విధానాన్ని బాధ్యతారహిత ప్రభుత్వ విధానం అనికూడా అంటారు. భారత రాజ్యాంగ నిర్మాతలు భారత్‌లో పార్లమెంటరీ తరహా విధానాన్ని ప్రతిపాదించారు. దీనిలో బాధ్యతాయుత ప్రభుత్వ విధానం ఉంటుంది.
* వివిధ వైవిధ్యాలున్న భారత్‌లో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యాన్ని కల్పించాలంటే పార్లమెంటరీ వ్యవస్థ అనువైంది.
* రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులైన ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ భారత్‌లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రతిపాదించి సమర్థించారు.
బీ కె.టి. షా, కె.ఎమ్. మున్షీ భారత్‌లో అధ్యక్షతరహా ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌