• facebook
  • whatsapp
  • telegram

చిరుధాన్యాలు

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధులను అరికట్టడంతో పాటు, భారత్‌లో పెరుగుతున్న జనాభాకు తగిన పోషణ అందించడంలో చిరుధాన్యాలు ఉపయోగపడతాయి.

* చిరుధాన్యాలను భారతీయ వారసత్వ సంపదగా పేర్కొంటారు. ఇవి మనదేశంలో పెరిగే స్థానిక జాతులు (endemic species).

* ఈ మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకుని మెరుగైన జీవవైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి.

* చిరుధాన్యాలు భారత్‌లో ఆహార భద్రతను కల్పించగలవు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2018లో దేశాన్ని చిరుధాన్యాల కేంద్రంగా (global hub of millets) మార్చాలని భావించింది. 

ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల ఆవశ్యకతను తెలిపేందుకు 2023 ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని భారత ప్రభుత్వం ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌లో ప్రతిపాదించింది. 

* అంతేకాకుండా భారత ప్రభుత్వం దీనికి కావాల్సిన విధి విధానాలను రూపొందించి, ఐక్యరాజ్యసమితిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. దీన్ని 70 దేశాలు ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 2023 ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. 

* అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 థీమ్‌ - ‘చిరుధాన్యాల్లో ఇప్పటివరకు గుర్తించని సామర్థ్యాన్ని, ఆహార వనరులను గుర్తించి తద్వారా ఆహార భద్రతను, పోషణను, సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం’.(‘Harnessing the untapped potential of millets for food security, nutrition, and sustainable agriculture’).


వర్గీకరణ

చిరుధాన్యాలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:

1. స్థూల చిరుధాన్యాలు: జొన్నలు, సజ్జలు, రాగులు.

2. సూక్ష్మ చిరుధాన్యాలు: వరిగెలు, సామలు, కొర్రలు. 


ప్రభుత్వ లక్ష్యాలు

* ఆహార భద్రత, పోషణ అవసరాలను తీర్చడంలో చిరుధాన్యాల పాత్రను తెలియజేయడం. 

* వివిధ వర్గాల ప్రజలకు మిల్లెట్ల ప్రాముఖ్యతని తెలుపుతూ, నాణ్యత కలిగిన చిరుధాన్యాలను పండించడం, ఉత్పత్తి చేయటంలో అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం. 

* మిల్లెట్ల ఉత్పాదకతను పెంచడంలో కావాల్సిన పరిశోధన, అభివృద్ధి రంగాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం. 


మిల్లెట్స్‌ ప్రాముఖ్యత

ప్రధాన ఆహార ధాన్యాల సాగుతో పోలిస్తే, మిల్లెట్స్‌ను తక్కువ ఖర్చుతో, త్వరగా పండించవచ్చు.

* చిరుధాన్యాలు ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి. వీటిలో అధిక శాతంలో మాంసకృత్తులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఐరన్, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. 

* చిరుధాన్యాల్లో అధిక శాతం కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఉదా: రాగులు. 

* మొత్తం ఆహారధాన్యాల్లో రాగుల్లో అధిక శాతం కాల్షియం ఉంటుంది. 

* చిరుధాన్యాలు ఆహార భద్రతను కల్పిస్తాయి. స్త్రీలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గిస్తాయి. వీటిలోని ఐరన్‌ శిశువులు, మహిళల్లో ఐరన్‌ లోపాలను నివారిస్తుంది. 

*మానవ జీవనశైలిలో వచ్చే మార్పుల కారణంగా సంభవించే ఊబకాయం, డయాబెటిస్‌ లను చిరుధాన్యాలు అత్యంత మెరుగ్గా నియంత్రిస్తాయి. దీనికి ప్రధాన కారణం వీటిలో గ్లూటెన్‌ లేకపోవడం, అత్యంత తక్కువ స్థాయిలో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ను కలిగి ఉండటం.

* మొక్కలు పుష్పించడానికి నిర్దిష్ట సమయంలో సూర్యరశ్మి అవసరం. చిరుధాన్యాల మొక్కలకు ఆ అవసరం లేదు. కాబట్టి వీటిని త్వరితగతిన పెంచొచ్చు. శీతోష్ణస్థితి మార్పులు ఉన్న ప్రాంతాల్లోనూ వీటిని సాగు చేయొచ్చు. తక్కువ సారవంతమైన, అంతగా నీటి వసతి లేని ప్రదేశాల్లోనూ మిల్లెట్స్‌ను పండించొచ్చు. అందుకే వీటిని ‘సూపర్‌ క్రాప్‌’గా పిలుస్తారు. 

* వీటిని కరవు, అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లోనూ పెంచొచ్చు.

* చిరుధాన్యాలకు ఉండే విశేష లక్షణం సుస్థిర వ్యవసాయ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించడం. వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పోషించడంలో మిల్లెట్స్‌ ముఖ్య పాత్రను పోషిస్తాయి. 


 

మిల్లెట్స్‌ సాగు

* ప్రపంచవ్యాప్తంగా 131 దేశాల్లో ధాన్యాలను సంప్రదాయ ఆహారంగా పండిస్తున్నారు. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని సుమారు 60 కోట్ల మంది ప్రజల పోషకాహారం ఇవే.

* భారత్, నైజీరియా, చైనా దేశాలు ప్రపంచంలో అత్యధికంగా చిరుధాన్యాలను సాగు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల ఉత్పత్తిలో వీటి వాటా 55 శాతంగా ఉంది. 

* ఆఫ్రికా దేశాలైన నైగర్, నైజీరియా, సూడాన్, మాలి, ఇథియోపియా, బుర్కినా ఫాసో, సెనెగల్, చాద్‌ మిల్లెట్స్‌ని ఎక్కువగా సాగు చేస్తున్నాయి. 2015 - 16లో ఆఫ్రికా దేశాలు 14.52 మిలియన్‌ టన్నుల చిరుధాన్యాలను ఉత్పత్తి చేయగా, 2020 - 21 లో ఈ ఉత్పత్తి 17.96 మిలియన్‌ టన్నులుగా నమోదైంది. 

* ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్‌ అగ్రగామిగా ఉంది. అగ్రికల్చర్‌ అండ్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (APEDA)  నివేదిక ప్రకారం, 2020 - 21లో మనదేశంలో 180.21 మిలియన్‌ టన్నుల చిరుధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. 


ప్రోత్సాహక కార్యక్రమాలు

భారతదేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది. అవి:

* చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు మినిమం సపోర్ట్‌ ప్రైస్‌ (ఎంఎస్‌పీ)ని ప్రతిపాదించాలని కేంద్రం భావిస్తోంది.

* ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మిల్లెట్లను అందించి, చిరుధాన్యాల మార్కెట్‌ను పెంచాలని భారత ప్రభుత్వం ప్రణాళిక రచించింది.

* నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ మిషన్‌లో చిరుధాన్యాలను న్యూట్రి సెరియల్స్‌గా ప్రభుత్వం సబ్‌ స్కీంను ఏర్పాటు చేసింది. 

* ఆహార భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లో చిరుధాన్యాల ఉత్పత్తిని వేగవంతం చేశారు. దీనికి ఆయా రాష్ట్ర మిషన్లు సహకారం అందిస్తున్నాయి.

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొర్రలు, వరిగెలు, ఊదలు మొదలైన మిల్లెట్లకు క్వింటాలుకు రూ.2500 ఎంఎస్‌పీగా నిర్ణయించింది. చిరుధాన్యాల ప్రోత్సాహ పాలసీలో భాగంగా వచ్చే అయిదేళ్లలో మిల్లెట్స్‌ పంట విస్తీర్ణాన్ని అయిదు లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

* తెలంగాణలో 2022లో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద భూపాలపల్లిలో చిరుధాన్యాలను పండించడం ప్రారంభించారు. దీనికి కావాల్సిన శిక్షణ, మార్కెటింగ్‌ సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. 2023, మే 14న భూపాలపల్లిలో మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది.

* హైదరాబాద్‌లోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌’, ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ సంయుక్తంగా మిల్లెట్ల పరిశోధనకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నాయి. ఈ పరిశోధనా కేంద్రాన్ని ‘న్యూట్రి హబ్‌’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. 

* వివిధ వర్గాల్లో మిల్లెట్లపై అవగాహనను కల్పిస్తూ, కొత్త స్టార్టప్‌లను కూడా మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటి ఉత్పత్తిని వ్యవసాయ రంగంతో అనుసంధానించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను త్వరితగతిన చేరాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. 


మిల్లెట్ల వినియోగంలో సవాళ్లు

* తక్కువ విస్తీర్ణంలో పండించటం. 

* కొన్ని రాష్ట్రాల్లో ఎంఎస్‌పీ సదుపాయం లేకపోవడం.

భారతదేశం - చిరుధాన్యాలు

* కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, మానవుడు చిరుధాన్యాల జాతులనే మొదట సాగు చేశాడు. 

* భారతదేశంలో క్రీ.పూ. 3000 నుంచి చిరుధాన్యాల వాడకం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 

* ప్రస్తుతం మన దేశంలో మిల్లెట్స్‌ను ఖరీఫ్‌ (జూన్‌ - అక్టోబరు) పంటగా సాగు చేస్తున్నారు. వీటికి అనువైన ఉష్ణోగ్రత 270C నుంచి 320C. కావాల్సిన వర్షపాతం 50 నుంచి 100 సెంటీమీటర్లు. తక్కువ సారవంతమైన ఒండ్రు నేలలు, లోమీ నేలలు వీటి సాగుకు అనుకూలం. 

* భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 20 శాతం; ఆసియా ఖండంలో 80 శాతం చిరుధాన్యాలను పండిస్తోంది.

* మనదేశంలో అత్యధికంగా చిరుధాన్యాలు పండించే రాష్ట్రాలు వరుసగా: రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ ప్రదేశ్‌.


భారత్‌లో పండే చిరుధాన్యాల రకాలు

1. రాగులు (ఫింగర్‌ మిల్లెట్‌): శాస్త్రీయ నామం ఎల్యుసైన్‌ కోరకాన. ఇది వర్షాభావ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. భారతదేశంలోనే కాకుండా ఉగాండా, ఇథియోపియా, నేపాల్‌ దేశాల్లోనూ ఇది పెరుగుతుంది. దీన్ని అత్యంత శక్తిమంతమైన పోషకాహారంగా పేర్కొంటారు. మనుషులకే కాక, పశువులకు మేతగానూ దీన్ని వాడతారు. కొన్ని దేశాల్లో బీరు తయారీలోనూ దీన్ని ఉపయోగిస్తారు. 

2. జొన్న (సొర్గం): శాస్త్రీయ నామం సొర్గం వల్గేర్‌. ఇది వేడి ప్రాంతాల్లో పెరుగుతుంది. దీన్ని ఆహార ధాన్యంగా, పశువుల మేతగా, ఆల్కహాలిక్‌ పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. జొన్న మొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అత్యంత వేడిని, నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. నైజీరియా, సెంట్రల్‌ అమెరికా, దక్షిణాసియా ప్రాంతాల్లోనూ వీటిని పెంచుతారు. 

3. సామలు (లిటిల్‌ మిల్లెట్‌): శాస్త్రీయ నామం పానికం సుమత్రనీస్‌. దీన్ని మధ్య భారతదేశంలో ఎక్కువగా సాగు చేస్తారు. పచ్చి రొట్ట మేతగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. 

4. సజ్జలు (బాజ్ర - పెరల్‌ మిల్లెట్‌): శాస్త్రీయ నామం పెన్నిసెటం గ్లౌకం. దీన్ని ఆఫ్రికా దేశాలు ఎక్కువగా సాగు చేస్తున్నాయి. ఈ పంటను సుమారు 2500 - 3000 ఏళ్ల నుంచి పండిస్తున్నట్లు శాస్త్రవేత్తల అభిప్రాయం.

* ప్రపంచ చిరుధాన్యాల ఉత్పత్తిలో 50 శాతం సజ్జలే ఉన్నాయి. మనదేశంలో ఉత్తర, మధ్య ప్రాంతాల్లోని ప్రజలు దీన్ని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్నారు. 

5. వరిగ (ప్రోసో మిల్లెట్‌): శాస్త్రీయనామం పానికం మిలేషియం. దీన్ని ఇన్‌స్టంట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ తయారీలో విరివిగా వాడతారు. ఇందులో ల్యూసిన్, ఐసోల్యూసిన్, మిథియోనైన్‌ అనే అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వరిగెల్లో కాల్షియం శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ఉపయోగకరం.

6. ఊదలు (బనియాడ్‌ మిల్లెట్‌): శాస్త్రీయనామం ఇకైనోకోలా ఎస్క్యూలెంటా. చైనా,   కొరియా, జపాన్‌లో దీన్ని ఎక్కువగా పండిస్తారు. దీన్ని జపనీస్‌ మిల్లెట్‌ అని కూడా అంటారు. వరి పంటకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో దీన్ని పండిస్తారు. 

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌