• facebook
  • whatsapp
  • telegram

సామాజిక అభివృద్ధి పథకాలు

* స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సమాజ సమగ్ర ప్రగతిని సాధించే లక్ష్యంతో భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. వాటిలో భాగంగా కింది ప్రయత్నాలు ప్రారంభించింది.

* భారత ప్రభుత్వం సమగ్ర గ్రామీణాభివృద్ధి ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో గ్రోమోర్‌ఫుడ్ అనే నినాదంతో ఆహారధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రారంభించాలని భావించింది.

* మొదటి పంచవర్ష ప్రణాళికలో గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి తగిన సిఫార్సులను సూచించమని వి.టి. కృష్ణమాచారి అధ్యక్షతన ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

* ఈ కమిషన్ సిఫార్సుల మేరకు దేశంలోని 50 జిల్లాల్లో ఎంపిక చేసిన 55 బ్లాకుల్లో 1952, అక్టోబరు, 2న సమాజ అభివృద్ధి కార్యక్రమం (CDP - Community Development Programme)ను ప్రాంభించారు.

CDPలోని ముఖ్యాంశాలు

* Community Development అనే భావనను మనం అమెరికా నుంచి గ్రహించాం.

* భారతదేశ ప్రగతిలో గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేయడం దీని లక్ష్యం.

* దీనిలో ప్రజలే సంఘటితమై, తమకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.

* అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ మనదేశంలోని CDP కార్యక్రమానికి 1971 సంవత్సరం నాటికి 104 మిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందించింది.

* దేశాన్ని కొన్ని బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకులో సుమారు 100 గ్రామాలను చేర్చారు.

* ఈ పథకాన్ని ప్రారంభంలో 55 బ్లాకుల్లో ప్రారంభించినప్పటికీ, తర్వాత కాలంలో 5011 బ్లాకులకు విస్తరించారు. ఒక్కో బ్లాకులో 70,000 నుంచి 80,000 జనాభా ఉంటుంది.

* CDP ద్వారా వ్యవసాయం, ప్రాథమిక విద్య, సామాజిక సేవ, గ్రామీణ కుటీర పరిశ్రమలు, గృహవసతి, ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం, నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలన, గ్రామీణ సమాచార వ్యవస్థ లాంటి అంశాలపై దృష్టిసారించారు.

* గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, స్వయం స్వావలంబన, సాముదాయిక ధృక్పథం అలవరచుకోవడానికి ప్రభుత్వం ఈ పథకం ద్వారా సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందించింది.

* ప్రతి బ్లాకులో ఒక బ్లాకు డెవలెప్‌మెంట్ అధికారి (BDO) బ్లాకు స్థాయిలో ప్రధాన కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు.

* ఈ కార్యక్రమ అమలుకు కేంద్రప్రభుత్వమే నిధులను సమకూరుస్తుంది.

* ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి గ్రామ్‌సేవక్ అనే అధికారిని నియమించారు.

జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం: (1953) (NESS - Nantional Extension Service Scheme)

* NESS పథకాన్ని మనదేశంలో 1953, అక్టోబరు, 2న ప్రారంభించారు.

* సమాజ అభివృద్ధి కార్యక్రమాని (CDP)కి కొనసాగింపుగా NESSను 1700 బ్లాకుల్లో ప్రారంభించారు.

* సమాజ అభివృద్ధి పథకాన్ని 3 సంవత్సరాల కాలానికి రూపొందించగా, జాతీయ విస్తరణ పథకాన్ని శాశ్వత ప్రాతిపదికపై ప్రారంభించారు.

NESS ముఖ్యాంశాలు

* గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగం, ప్రచ్ఛన్న నిరుద్యోగాలను తగ్గించడం.

* వ్యవసాయ విధానంలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించడం ద్వారా గణనీయమైన ఉత్పత్తిని సాధించడం.

* గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, బావులు, పాఠశాలలు, సమాజసేవా కేంద్రాలు, సామాజిక ప్రయోజనం ఉన్న పనులను చేపట్టడం ద్వారా సమాజ ప్రగతికి కృషిచేయడం.

* గ్రామీణ కుటుంబాలకు రుణ సౌకర్యాలను కల్పించడం కోసం సహకార రంగాన్ని విస్తృత పరచడం.

NESS అమలుకు సంబంధించిన - పాలనా విభాగాలు

కేంద్రస్థాయి: కేంద్రస్థాయిలో సమాజాభివృద్ధి, సహకార మంత్రిత్వశాఖ నాయకత్వంలో నిర్వహిస్తారు.

రాష్ట్రస్థాయి: రాష్ట్రస్థాయిలో రాష్ట్రముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర అభివృద్ధి సంఘం ఉంటుంది. దీనిలో రాష్ట్ర సమాజాభివృద్ధి శాఖా మంత్రి సభ్యుడిగా, అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యదర్శిగా ఉంటారు.

జిల్లాస్థాయి: జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ పథకం నడుస్తుంది.

గ్రామస్థాయి: NESS అమలుకు గ్రామస్థాయిలో Village Level Workers (VLW) ను నియమించారు. వీరికి సమగ్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలపై శిక్షణ ఇచ్చారు. వీరిని Multipurpose Workersగా పిలిచేవారు.

* CDP, NESS ప్రాజెక్ట్ కేంద్ర అడ్మినిస్ట్రేటర్ ఎస్.కె. డే. ఇతడు NESS పథకాన్ని సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనంగా అభివర్ణించారు.

* జవహర్‌లాల్ నెహ్రూ NESS పథకాన్ని నిశబ్ద విప్లవంగా అభివర్ణించారు.

స్వాతంత్య్రానికి ముందు జరిగిన సమాజ వికాస ప్రయోగాలు

గుర్గావ్ ప్రయోగం: (1920)

* 1920లో పంజాబ్ రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలో ఎఫ్.ఐ. బ్రేయన్ అనే డిప్యూటీ కమిషనర్ గుర్గావ్ ప్రయోగం ద్వారా గ్రామీణాభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు.

* వ్యవసాయోత్పత్తిని, ప్రజారోగ్యాన్ని పెంపొందించడం ఈ ఉద్యమ లక్ష్యం.

* ఉత్సవాలు, వివాహాల్లో జరిగే వృథావ్యయాన్ని తగ్గించి, సమాజప్రగతికి దోహదపడటం.

* ఈ ఉద్యమ ప్రాముఖ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం కోటి రూపాయలను కేటాయించి ప్రోత్సహించింది.

మార్తాండం ప్రయోగం: (1921)

* తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఉన్న మార్తాండం ప్రాంతంలో అమెరికన్ వ్యవసాయ నిపుణుడైన స్పెన్సర్‌హాచ్ 70 గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. ఈయన YMCA (Young Mens Christian Association) సహకారంతో గ్రామీణ ప్రజల జీవితాల్లో కీలకపాత్ర పోషించే మౌలికాంశాలపై శిక్షణ ఇస్తూ, తద్వారా ప్రజల్లో అభివృద్ధిపై చైతన్యం కలిగించడానికి ప్రయత్నించారు.

శ్రీనికేతన్ ప్రయోగం: (1921)

* రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తాలోని శాంతినికేతన్‌లో విద్యాబోధనలో భాగంగా, 1921లో ఆత్మగౌరవంతో స్వయంసమృద్ధిని సాధించడం గురించి ప్రయత్నించారు.

* చిన్నతరహా కుటీర పరిశ్రమల నిర్వహణకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తూ, వయోజన విద్య, ఆరోగ్య సంరక్షణ లాంటి అంశాలపై ప్రత్యేక శిక్షణను ఇచ్చారు.

బరోడా ప్రయోగం: (1932)

* బరోడా సంస్థానంలో దివాన్‌గా పనిచేసిన వి.టి. కృష్ణమాచారి ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు.

* దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ యువకులను సమీకరించి, రహదారులు వేయడం, కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమాభివృద్ధి లాంటి రంగాల్లో వారిని చైతన్యవంతులను చేసి, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు.

సేవాగ్రామ్: (1933)

* మహారాష్ట్రలోని వార్ధాలో ప్రయోగాత్మకంగా గాంధీజీ దీన్ని స్థాపించారు.

* సర్వోదయ, నవోదయ సిద్ధాంతాలపై ఈ సంస్థను నిర్వహించారు.

* ఆచార్య వినోబా భావే, జయప్రకాష్ నారాయణ ఈ సిద్ధాంతానికి ఆకర్షితులై, అనేక సమాజ వికాస కార్యక్రమాలను నిర్వహించారు.

ఫిర్కా ప్రయోగం: (1946)

* 1946లో అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు తాలూకాలను కొన్ని ఫిర్కాలుగా విభజించి, ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం కొన్ని ప్రయోగాలు చేశారు. దీన్ని ఫిర్కా ప్రయోగం అంటారు.

* 1952లో సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఫిర్కాలను బ్లాకుల్లో విలీనం చేశారు.

ఇటావా ప్రయోగం: (1948)

* ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోహతక్ జిల్లాలో ఇటావా అనే ప్రాంతంలో ఆల్బర్ట్ మేయర్ అనే ఇంజినీర్ 97 గ్రామాలను ఎంచుకుని ప్రయోగాత్మకంగా పౌరసౌకర్యాలను కల్పించడానికి ప్రయత్నం చేశారు.

* కళారూపాల ద్వారా సామాజిక చైతన్యం, సమాజ అభివృద్ధికి సంబంధించిన అంశాలను, వ్యవసాయ, పాడిపరిశ్రమ, చేనేత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కృషి చేసింది.

నీలోఖరి ప్రయోగం: (1948)

* హర్యానలోని కర్నాల్ జిల్లాలోని నీలోఖరి అనే ప్రాంతంలో భారత విభజన సందర్భంగా, నిరాశ్రయులైన 7000 మందికి పునరావాసం కల్పించడం, స్వయంశక్తితో అభివృద్ధి చెందేలా ఎస్.కె.డే నాయకత్వంలో వ్యవసాయ పనిముట్లను తయారు చేయడం, ఇంజినీరింగ్ వర్క్స్ లాంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.

స్థానిక ప్రభుత్వాలు - ఇతర ముఖ్యాంశాలు

* 73వ రాజ్యాంగ సవరణ తర్వాత 3 స్థాయుల్లోని సంస్థలకు గ్రామస్వరాజ్ పేరుతో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించిన తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్

* స్థానిక సంస్థల పనివిధానంలో జవాబుదారీతనాన్ని నెలకొల్పడం కోసం నిఘా కమిటీలను ఏర్పాటు చేసిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్

* స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% స్థానాలను రిజర్వ్ చేసిన తొలిరాష్ట్రం బీహార్

* స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడాన్ని తప్పనిసరిచేస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రం గుజరాత్

* గ్రామసభ ద్వారానే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న రాష్ట్రం కేరళ

* స్థానిక సంస్థల ప్రతినిధులకు శిక్షణను ఇవ్వడం కోసం గ్రామ్‌శాట్ అనే ఉపగ్రహ ఛానెల్ ద్వారా శిక్షణ ఇస్తున్న రాష్ట్రం కర్ణాటక

* 1978 నుంచి నియమబద్ధంగా నేటివరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్రం పశ్చిమ్‌బంగ

* స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు సమర్థంగా పనిచేయనప్పుడు వారిని మధ్యలోనే తొలగించే రీకాల్ పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించినవారు మహాత్మాగాంధీ

* స్థానిక సంస్థల ప్రతినిధులను వెనక్కు పిలిచే పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్

* మధ్యప్రదేశ్‌లోని చాబ్రానగర పాలక సంస్థ అధ్యక్షుడు అనుప్సర్ చౌహాన్ రీకాల్ ద్వారా తొలగించిన మొదటి వ్యక్తి.

* Village Development Council పేరుతో గ్రామీణ సంస్థలను ఏర్పాటు చేసిన తొలిరాష్ట్రం హర్యానా

* ఎస్సీలు లేని కారణంగా స్థానిక సంస్థల్లో ఎస్సీల రిజర్వేషన్లు రద్దుచేసిన తొలిరాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్

* దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా కేవలం 14 రాష్ట్రాల్లో మాత్రమే జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేశారు.

* కేంద్రంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను 2004లో ఏర్పాటు చేశారు.

* మనదేశంలో 4 అంచెల పంచాయతీరాజ్ సంస్థలను అమలు చేస్తున్న ఒకేఒక రాష్ట్రం - పశ్చిమ్ బంగ

* పీపుల్స్ ప్లాన్‌తో జిల్లా ప్రణాళికా బోర్డుల ద్వారా ప్రణాళికా వికేంద్రీకరణను సమర్థంగా అమలు చేస్తున్న రాష్ట్రం - కేరళ

PESA Act

* షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఏర్పాటు కోసం భారత పార్లమెంటు PESA (Panchayat Raj Extension in Scheduled Areas) చట్టాన్ని 1996లో ఏర్పాటు చేసింది.

దీనిలోని ముఖ్యాంశాలు

* గ్రామసభ ఆమోదం లేనిదే స్థానిక అటవీ ఉత్పత్తులపై నిర్ణయాలు తీసుకోరాదు.

* గ్రామసభ ఆమోదం లేనిదే ఆ ప్రాంత భూమిని ఎలాంటి అభివృద్ధి పనులకు వినియోగించరాదు.

* గ్రామసభ ఆమోదం లేనిదే ఎలాంటి తవ్వకాలు జరపరాదు.

* గ్రామసభ ఆమోదంతోనే గ్రామపంచాయతీ విధాన నిర్ణయాలను తీసుకోవాలి.

Posted Date : 06-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌