• facebook
  • whatsapp
  • telegram

తుపాను

* సముద్రంపైన ఉష్ణోగ్రత, పీడనాల్లో తేడా వల్ల వేగంగా వీచేగాలిని తుపాను అంటారు. దీని వల్ల అధిక వర్షపాతం సంభవిస్తుంది. సముద్రంలో కెరటాల ఉధృతి పెరుగుతుంది. దీంతో సముద్ర తీరప్రాంతాలకు అధిక నష్టం వాటిల్లుతుంది. వేగంగా వీచే గాలుల వల్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయి. జనావాసాలు దెబ్బతింటాయి. పండ్ల తోటలకూ అపార నష్టం.


  తుపాను వల్ల కలిగే వర్షంతో వరదలు సంభవించి ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తుపాను ప్రభావం తీవ్రతను బట్టి వందల సంఖ్య నుంచి వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుంది. పశుసంపదకు నష్టం వాటిల్లుతుంది. వరదల వల్ల ఆవరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.తుపానులను ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. అట్లాంటిక్ సముద్రంపైన వచ్చే తుపానులను హరికేన్‌లనీ; పసిఫిక్ మహా సముద్రంపై కలిగే వాటిని టైఫూన్‌లనీ, ఆస్ట్రేలియాలో సంభవించే వాటిని విల్లి - విల్లిలనీ పిలుస్తారు. ప్రపంచంలో తుపాన్లు ఎక్కువగా సంభవించే 6 ప్రాంతాల్లో భారతదేశం కూడా ఒకటి. భారతదేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపానులు సంభవిస్తాయి. బంగాళాఖాతం తీరప్రాంతంలోని పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాలకు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ తుపాను ముప్పు పొంచి ఉంది. అరేబియా తీరప్రాంతంలో ఉండే గుజరాత్, మహారాష్ట్రల్లో మిగతా వాటి కంటే ముప్పు కొద్దిగా ఎక్కువ. భారతదేశంలో 8.5 % ప్రాంతానికి తుపాను ముప్పు ఉంది.          భారతదేశంలో 7516 కి.మీ. ప్రాంతానికి తుపాను ముప్పు పొంచి ఉంది. పాండిచ్చేరితోపాటు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లు తుపాను ప్రభావానికి గురవుతున్నాయి. వీటితోపాటుగా అండమాన్ నికోబార్, లక్ష ద్వీప్ కూడా తుపాను తాకిడికి గురయ్యే ప్రాంతాలు. ఏటా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో దాదాపుగా 5 నుంచి 6 తుపానులు సంభవిస్తాయి.
వీటిలో 2 నుంచి 3 ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. అరేబియా సముద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో ఎక్కువ తుపానులు వస్తాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో సంభవించే తుపానుల నిష్పత్తి 4 : 1. సాధారణ తుపాను సమయంలో గాలి సరాసరి వేగం గంటకు 65 కి.మీ. నుంచి 117 కి.మీ. వరకు ఉండవచ్చు. 


* తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటే గాలివేగం గంటకు 119 కి.మీ. నుంచి 164 కి.మీ. వరకు, అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. 1999 అక్టోబరు 29 న ఒరిస్సాలో సంభవించిన సూపర్‌సైక్లోన్‌లో గంటకు 250 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.


నష్టాన్ని తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యలు


* తీరప్రాంతాల్లో ముఖ్యంగా తుపానులు తరచుగా సంభవించే ప్రాంతాల్లో చెట్లను పెంచాలి. ఇక్కడి అడవులను పరిరక్షించాలి. తీర ప్రాంతాల్లో ఉండే మాంగ్రూవ్ అడవులు (మడ అడవులు), ఎత్తయిన వృక్షాలు తుపాను తీవ్రతను తగ్గిస్తాయి. దీనివల్ల వరదలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. సముద్రపు ఒడ్డుకు దగ్గరలో ఉన్న వృక్షసంపద సహజ కవచంలా పనిచేసి తుపాను నష్టాన్ని తగ్గిస్తుంది. తీరప్రాంతాల్లో అడవులను పూర్తిగా కొట్టివేయడం వల్ల తుపాను ముప్పు పెరిగి సహజ విపత్తు కాస్తా మానవ సంబంధ విపత్తుగా మారుతోంది.


* తరచుగా తుపాన్లు సంభవించే ప్రాంతాలను గుర్తించి పటాలను తయారుచేయాలి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత చర్యలను చేపట్టవచ్చు. తుపానులను ఉపగ్రహాల సహాయంతో ముందుగానే గుర్తించవచ్చు. గాలి వీచే దిశ, వేగాన్ని బట్టి అక్కడి ప్రజలను హెచ్చరించి తుపాను నష్టాన్ని తగ్గించవచ్చు.


* తుపాను సంభవించే ప్రాంతాల్లో తక్కువ నష్టతీవ్రత ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ నివాసాలు, వసతులను, ఏర్పాటు చెయ్యాలి. తుపాను తాకిడికి ఎక్కువగా గురయ్యే ప్రదేశాల్లో ఇళ్లు, భవనాల నిర్మాణాల్లో మార్పులు చెయ్యాలి. ఇవి తుపానును తట్టుకునే విధంగా ఉండాలి. గృహాలను నేలమట్టం నుంచి ఎత్తుగా నిర్మించాలి, పైకప్పు వేలాడినట్టుగా కాకుండా మూసినట్టుగా ఉండాలి. ఇంటి చుట్టూ చెట్లను నాటడం వల్ల అవి సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. సమాచార, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినకుండా ఉండేందుకు వాటిని భూగర్భ కేబుల్స్ ద్వారా సరఫరా చెయ్యాలి. తుపాన్లు సంభవించేటప్పుడు వరదలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని ఎదుర్కొనే చర్యలను కూడా చేపట్టాలి.  


* భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) రుతుపవనాలు, వర్షపాతం, తుపాన్ల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాడార్‌లు, ఉపగ్రహాల ద్వారా గ్రహించి అందజేస్తోంది. ఈ సమాచారం అందుకున్న ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ (ACWCs) తగిన హెచ్చరికలను జారీ చేస్తాయి. భారతదేశ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఐ) తుపాన్ల గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది.


* తుపాన్ల వల్ల జరిగే నష్ట తీవ్రతను తగ్గించడానికి, భారత పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 1990 జులైలో బిల్డింగ్ మెటీరియల్స్, టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. తీర ప్రాంతాల్లో ఉన్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీల ద్వారా తగిన సమాచారాన్ని అందిస్తూ రక్షణ చర్యలను చేపడుతున్నాయి.


* ఇన్‌శాట్ ఉపగ్రహాలు, 10 రాడార్‌ల సహాయంతో కేంద్రం తుపాను ముప్పులను గమనించి తీర ప్రాంతాల ప్రజలను 48 నుంచి 24 గంటల ముందుగా హెచ్చరిస్తోంది. స్థానిక భాషల్లో తుపాను హెచ్చరిక సూచనలు అందిస్తోంది.


జాతీయ తుపాను ముప్పు నియంత్రణా ప్రాజెక్ట్


  భారతదేశంలోని తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలను తుపాను బారి నుంచి రక్షించడానికి, వారి ఆస్తులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. దీన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రారంభించింది. దీన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) అమలు చేస్తోంది. హోంమంత్రిత్వశాఖ, ఎన్‌డీఎంఏ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నాయి.
2011 నుంచి 2015 మధ్య ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తారు. ప్రపంచ బ్యాంక్ దీనికి నిధులను సమకూరుస్తుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రూ. 626.87 కోట్లు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 165.13 కోట్లను సమకూర్చుకుంది. 
* ఇదేవిధంగా ఒరిస్సాకు కేంద్ర ప్రభుత్వం రూ. 520.93 కోట్లు కేటాయించగా ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 132.85 కోట్లు సమకూర్చుకుంది.
మొదట విడతగా ఈ ప్రాజెక్ట్‌ను ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ల్లో అమలు చేయనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ నిధులతో తుపాను సమయంలో తలదాచుకునే భవనాలు నిర్మిస్తారు. తుపాను వల్ల దెబ్బతిన్న రహదారులను, కరకట్టలను మరమ్మత్తు చేస్తారు. తుపాను విపత్తు గురించిన అవగాహనను ప్రజలకు కలిగిస్తారు.


ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ (ఐసీజడ్ఎంపీ): కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల సూచన మేరకు భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీనిలో భాగంగా గుజరాత్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌ల తీర ప్రాంతాల రక్షణకు చర్యలు చేపడతారు. ఈ రాష్ట్రాల్లో తుపాను ముప్పు ప్రాంతాలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం, రాష్ట్రంలో తుపానును ఎదుర్కొనేందుకు పని చేస్తున్న శాఖలకు, సంస్థలకు నిధులను అందజేయడం ఈ ప్రాజెక్ట్ విధి. ఈ ప్రాజెక్టు కింద పశ్చిమ బెంగాల్‌కు రూ. 1425 కోట్లను కేటాయించారు.


కోర్‌గ్రూప్ ఆన్ సైక్లోన్ మిటిగేషన్: తుపాను ముప్పును గమనించడానికి, నివారణకు జాతీయస్థాయిలో ముఖ్యమైన వ్యక్తులతో ఒక గ్రూపును ఏర్పరిచారు. దీనిలో భారత వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం, నేషనల్ రిమోట్‌సెన్సింగ్ ఏజెన్సీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన నిపుణులు ఉంటారు. వీరితోపాటుగా తుపాను కార్యక్రమాలను పర్యవేక్షించే వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఉంటారు. వీరు తుపాను, వరదలకు సంబంధించిన హెచ్చరికలను జారీచేయడం; రాష్ట్ర, జాతీయస్థాయిలో వివిధ శాఖలు, సంస్థలను సమన్వయపరచడం లాంటి పనులను చేస్తారు.

Posted Date : 08-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌