• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర న్యాయవ్యవస్థ (సుప్రీంకోర్టు)

    'ఒక దేశ ఔన్నత్యాన్ని, నాగరికతను ఆదేశ న్యాయవ్యవస్థ పనితీరులో చూడవచ్చని' లార్డ్‌బ్రైస్ పేర్కొన్నారు. మనదేశం ఏకీకృత, సమీకృత న్యాయవ్యవస్థను అనుసరిస్తుంది. జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, దాని కింద రాష్ట్రస్థాయిలో హైకోర్టులు, వాటి కింద స్థానిక స్థాయిలో సబార్డినేట్ కోర్టులు ఉన్నాయి. దేశంలోని న్యాయస్థానాలన్నీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తాయి.
* భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఏకీకృత, సమన్యాయ పాలనను; అమెరికా రాజ్యాంగం నుంచి న్యాయసమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థను గ్రహించారు.


సుప్రీంకోర్టు చరిత్ర
* ఈస్టిండియా కంపెనీ మనదేశాన్ని పాలిస్తున్న సమయంలో 1773లో రూపొందించిన రెగ్యులేషన్ చట్టం ప్రకారం 1774, మార్చి 16న కలకత్తాలోని పోర్టువిలియంలో తొలి సుప్రీంకోర్టును ఏర్పాటుచేశారు.
* దీని తొలి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజాఇంఫే.
* ఇతర న్యాయమూర్తులు సీజర్ లైమెస్టర్, జాన్‌హైడ్, రాబర్ట్ చాంబర్స్.
* కలకత్తాలోని సుప్రీంకోర్టును 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టుగా మార్చి1937లో న్యూదిల్లీలో ఏర్పాటు చేశారు.
* ఫెడరల్ కోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ మారిస్ గ్వేయర్.
* భారతదేశంలో న్యాయవ్యవస్థను ప్రవేశపెట్టిన వారు వారన్ హేస్టింగ్స్.
* భారత్‌లో న్యాయవ్యవస్థను అభివృద్ధి పరిచి, న్యాయవ్యవస్థకు పితామహుడిగా పేరొందిన వారు కారన్‌వాలీస్.
* భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 124 నుంచి 147 వరకు ఉన్న ఆర్టికల్స్‌లో సుప్రీంకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల అర్హతలు, అధికారాలు, విధుల గురించి వివరించారు.
* 1950, జనవరి 28 నుంచి భారత సుప్రీంకోర్టు న్యూదిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు భవన నిర్మాణ రూపకర్త గణేశ డియోల్కర్. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్.జె. కానియా
సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడానికి కారణాలు
 * భారత రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటం.
 * ప్రాథమిక హక్కుల సంరక్షకులుగా వ్యవహరించడం.
 * మన దేశ సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించడం.
 * భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం.
 * రాజ్యాంగానికి అర్ధవివరణను ఇవ్వడం.

సుప్రీంకోర్టు నిర్మాణం
* ఆర్టికల్, 124 సుప్రీంకోర్టు నిర్మాణాన్ని తెలియజేస్తుంది. 1950లో సుప్రీంకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులతో ప్రారంభమైంది. ఈ సంఖ్య కింది మార్పులకు గురైంది.
1950 - 1 + 7
1956 - 1 + 10
1960 - 1 + 13
1978 - 1 + 18
1985 - 1 + 25
2008 - 1 + 30
* సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
* సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి సంతకం, సీలు వేసిన వారెంటు ద్వారా నియమిస్తారు.

 

అర్హతలు
* భారత పౌరుడై ఉండాలి.
* 5 ఏళ్లు హైకోర్టు న్యాయమూర్తిగా (Judge) పనిచేసి ఉండాలి. లేదా 10 ఏళ్లు హైకోర్టు న్యాయవాదిగా (Lawyer)
పనిచేసి ఉండాలి.
* రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడై ఉండాలి.

* న్యాయమూర్తుల నియామకం సందర్భంగా కనీస వయసు నిర్ణయించలేదు.
* న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు.
* లా కమిషన్, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌లు పదవీ విరమణ వయసును 67 సంవత్సరాలకు పెంచాలని సూచించాయి.

 

ప్రధాన న్యాయమూర్తి నియామకం
* సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియర్‌ను ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించడం ఒక సంప్రదాయం. కానీ 1973లో ఇందిరా గాంధీ ప్రభుత్వ సిఫారసుల మేరకు సీనియర్ న్యాయమూర్తులైన జె.ఎం. షేలట్, ఎ.ఎన్. గ్రోవర్, కె.ఎస్. హెగ్డేలను విస్మరించి 4వ స్థానంలో ఉన్న జూనియర్ అయిన ఎ.ఎన్. రేనును ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
* 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ సిఫారసుల మేరకు సీనియర్ న్యాయమూర్తి హెచ్.ఆర్. ఖన్నాను కాదని, జూనియర్ అయిన ఎమ్.హెచ్. బౌగ్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

న్యాయమూర్తుల నియామకం - కొలీజియం వ్యవస్థ

ఎస్.పి. గుప్తా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1982)
* సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో రాష్ట్రపతి కొలీజియాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదని ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.
* దీన్నే మొదటి జడ్జెస్ కేసుగా పేర్కొంటారు.

 

సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1993)
* సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియామకం చేసే సమయంలో రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) ని కొలీజియంగా తప్పనిసరిగా సంప్రదించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
* దీన్నే సెకండ్ జడ్జెస్ కేసుగా పేర్కొంటారు.
* 1998లో అప్పటి భారత రాష్ట్రపతి ఆర్టికల్, 143 ప్రకారం కొలీజియంపై సుప్రీంకోర్టు న్యాయసలహాను కోరారు.
* 1999లో 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కొలీజియంకు సంబంధించి ఈ విధంగా వివరణను ఇచ్చింది.
a) కొలీజియం అంటే సీజేఐతోపాటు మరో నలుగురు ఇతర న్యాయమూర్తులుంటారు.
b) రాష్ట్రపతి కొలీజియం సలహాను తప్పనిసరిగా పాటించాలి.
c) రాష్ట్రపతి కొలీజియంను సంప్రదించిన తర్వాత న్యాయమూర్తులను నియమించాలి.

నేషనల్ జడ్జెస్ అపాయింట్‌మెంట్ కమిటీ (NJAC)
   మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 120వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా న్యాయమూర్తుల నియామకం కోసం జడ్జెస్ అపాయింట్‌మెంట్ కమిటీ(JAC) ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది.
* నరేంద్ర మోదీ ప్రభుత్వం 120వ సవరణ బిల్లును ఉపసంహరించి, దాన్ని 121వ సవరణ బిల్లుగా రూపొందించి నేషనల్ జడ్జెస్ అపాయింట్‌మెంట్ కమిషన్(NJAC) ను ఏర్పాటు చేసింది. దీన్ని పార్లమెంటు 2/3వ వంతు మెజార్టీతో ఆమోదించడంతో పాటు, భారత్‌లోని 15 రాష్ట్రాలు కూడా ఆమోదించిన తర్వాత, అది 99వ రాజ్యాంగ సవరణ చట్టంగా 2014, డిసెంబరు 31న రాష్ట్రపతి సంతకంతో చట్టబద్ధమైంది.
* నేషనల్ జడ్జెస్ అపాయింట్‌మెంట్ కమిషన్ (NJAC) 2015, ఏప్రిల్ 13 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ఫలితంగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి కొలిజీయంకు బదులుగా ఎన్‌జేఏసీని సంప్రదించాల్సి ఉంటుంది.

 

ఎన్‌జేఏసీ ఏర్పాటు చెల్లదు - సుప్రీం తీర్పు
* సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎన్‌జేఏసీ ఏర్పాటు చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని 2015, అక్టోబరు 16న ప్రకటించింది. దీన్నే థర్డ్ జడ్జెస్ కేసుగా పేర్కొంటారు.
* ఎన్‌జేఏసీ ఏర్పాటు చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో తిరిగి సీజేఐ నేతృత్వంలోని కొలీజియం వ్యవస్థ అమల్లోకి వచ్చింది.

న్యాయమూర్తుల తొలగింపు విధానం
* అవినీతి, అసమర్థత, దుష్ప్రవర్తన అనే కారణాలపై రాష్ట్రపతిని తొలగించే పద్ధతిలోనే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను పార్లమెంటు 2/3వ వంతు మెజార్టీతో రాష్ట్రపతి తొలగిస్తారు. న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
* న్యాయమూర్తులను తొలగించే అభిశంసన తీర్మాన నోటీస్‌పై లోక్‌సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది సభ్యుల సంతకాలు అవసరం.
* 14 రోజుల ముందస్తు నోటీసుతో తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడతారో సంబంధిత సభాధిపతి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు.
* కమిటీ విచారణ తర్వాత ఇచ్చే రిపోర్ట్‌పై ఆ సభ చర్చించి 2/3వ వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదిస్తే, రెండో సభకు కూడా పంపి అక్కడ కూడా 2/3వ వంతు మెజార్టీతో ఆమోదిస్తే రాష్ట్రపతి వారిని తొలగిస్తారు.
* తీర్మానం ఏ సభలో ప్రవేశపెడతారో ఆ సభ తీర్మానాన్ని తిరస్కరిస్తే రెండోసభకు పంపాల్సిన అవసరం లేదు. ఒక సభ ఆమోదించిన తీర్మానాన్ని రెండో సభ తిరస్కరిస్తే తీర్మానం రద్దు అవుతుంది.
* మనదేశంలో ఇప్పటి వరకు ఈ తీర్మానం ద్వారా ఎవరినీ తొలగించలేదు.
* 1991లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామస్వామిపై ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ అది వీగిపోయింది. తర్వాత రామస్వామి తన పదవికి రాజీనామా చేశారు.

జీతభత్యాలు
* సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను ఆర్టికల్, 125 తెలియజేస్తుంది.
* వీరి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీటిని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఆదాయపు పన్ను నుంచి మినహాంపు ఉంటుంది.
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం నెలకు రూ.1,00,000.
* సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తుల వేతనం నెలకు రూ.90,000.
* ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో వీరివేతనాలు తగ్గించకూడదు.
* సుప్రీంకోర్టు తాత్కాలిక (అడ్‌హాక్) ప్రధాన న్యాయమూర్తిని ఆర్టికల్, 126 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు.
* ఆర్టికల్, 127 ప్రకారం సుప్రీంకోర్టులో అడ్‌హాక్ (తాత్కాలిక) న్యాయమూర్తులను రాష్ట్రపతి అనుమతితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు. ఈ విధంగా నియమించిన తాత్కాలిక న్యాయమూర్తుల పదవీ కాలం 2 సంవత్సరాలు.
* సాధారణ న్యాయమూర్తులకు కల్పించే సౌకర్యాలన్నీ తాత్కాలిక న్యాయమూర్తులకు వర్తిస్తాయి.
* ఆర్టికల్, 128 ప్రకారం సుప్రీంకోర్టులో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను రాష్ట్రపతి అనుమతితో సుప్రీంకోర్టుకు హాజరు కావాలని ప్రధాన న్యాయమూర్తి కోరవచ్చు.
* ఆర్టికల్, 130 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన కేంద్రం న్యూ దిల్లీలో ఉంది.
* కేంద్ర కేబినెట్ సుప్రీంకోర్టు బెంచ్‌లను కలకత్తా, చెన్నై, ముంబయిలలో ఏర్పాటు చేయాలని చేసిన ప్రతిపాదనను 25 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2000 సంవత్సరంలో తిరస్కరించింది.

సుప్రీంకోర్టు - అధికారాలు - విధులు

ప్రారంభ/ ప్రాథమిక/ ఒరిజినల్ విచారణాధికార పరిధి (ఆర్టికల్, 131)
* ఆర్టికల్, 131 ప్రకారం మనదేశ సమాఖ్య స్వభావాన్ని కాపాడటం సుప్రీంకోర్టు అధికార పరిధిలోకి వస్తుంది. సమాఖ్య వివాదాలన్నింటినీ సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలి.
* కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలు.
* కేంద్రం ఒకవైపు, కొన్ని రాష్ట్రాలు మరొకవైపు ఉన్నప్పుడు వాటి మధ్య ఉండే సమస్యలు.
* దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలు.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు.
* ఏవైనా రాజ్యాంగబద్ధతను నిర్ణయించే అంశాలు ఒరిజినల్ విచారణాధికార పరిధిలో ఉంటాయి.
* 1967లో భారత ప్రభుత్వం గనులను జాతీయం చేసిన అంశంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పశ్చిమ్ బంగా రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయగా దాన్ని సమర్థిస్తూ, సుప్రీంకోర్టు తొలిసారిగా ఒరిజినల్ విచారణాధికార పరిధిని వినియోగించింది.
* కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించేందుకు భారత ప్రభుత్వం న్యాయవిచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం సమంజసమేనని సుప్రీంకోర్టు 1978లో పేర్కొంది.

ప్రాథమిక/ ఒరిజినల్ విచారణాధికార పరిధి నుంచి మినహాయించిన అంశాలు
* ఆర్టికల్, 253 - భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు.
* ఆర్టికల్, 262 - అంతర్ రాష్ట్ర నదీజలాల పంపకం విషయంలో కేంద్రం ద్వారా ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పులను లేదా అవార్డులను అనుసరించి పార్లమెంటు చేసిన చట్టాలు.
* ఆర్టికల్, 275 - కేంద్రం రాష్ట్రాలకు మంజూరు చేసే సహాయక గ్రాంట్లు.
* ఆర్టికల్, 280 - కేంద్ర ఆర్థిక సంఘం కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరులను పంపిణీ చేయడానికి చేసిన
సిఫారుసులకు సంబంధించిన అంశాలు.
* ఆర్టికల్, 290 - కేంద్ర, రాష్ట్రాల మధ్య జరిగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు.
* ఆర్టికల్, 304 - అంతర్ రాష్ట్ర వ్యాపార వాణిజ్యానికి సంబంధించిన చట్టాలు.
* ఆర్టికల్, 81 - నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ కమిటీ చేసిన సూచనలను అనుసరించి లోక్‌సభ, విధానసభల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై పార్లమెంటు రూపొందించిన చట్టాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయకూడదు.

 

అప్పీళ్ల విచారణాధికార పరిధి
    సుప్రీంకోర్టు అనేది దేశంలో అత్యున్నతమైన అప్పీళ్ల కోర్టు. హైకోర్టు తీర్పుతో అసంతృప్తి చెందినవారు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.

1. రాజ్యాంగ పరమైన అప్పీళ్లు (ఆర్టికల్, 132)
* రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించే విధంగా ఉన్నప్పుడు, హైకోర్టు ఇచ్చిన తీర్పుల విషయంలో రాజ్యాంగాన్ని మరింత లోతుగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ధ్రువీకరిస్తే అలాంటి వాటిని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.
ఉదా: ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దుచేయగా, దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది.

 

2. సివిల్ అప్పీళ్లు (ఆర్టికల్, 133)
* ఆస్తికి సంబంధించిన సివిల్ వివాదంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో చట్టానికి సంబంధించిన లోతైన అంశం, రాజ్యాంగ పరమైన అంశం ఇమిడి ఉందని భావించినా, హైకోర్టు ఇచ్చే ధ్రువీకరణతో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.
* 30వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆస్తి విలువపై ఉన్న పరిమితిని తొలగించారు. కానీ ఆర్టికల్, 134 (A) ప్రకారం హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరి.

 

3. క్రిమినల్ అప్పీళ్లు (ఆర్టికల్, 134)
* హైకోర్టులు వివిధ క్రిమినల్ కేసుల్లో ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.
* జిల్లా సెషన్స్ కోర్టు ఏదైనా కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించినప్పుడు అదే కేసును హైకోర్టు విచారించి నిందితుడికి ఉరిశిక్ష/ యావజ్జీవ కారాగార శిక్ష విధించినప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.

* జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరుపుతున్న కేసును హైకోర్టు తనకు బదిలీ చేయించుకుని నిందితుడికి
ఉరిశిక్ష/ యావజ్జీవ కారాగార శిక్ష విధించినప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.
* కింది కోర్టు విధించిన మరణశిక్షను పునఃసమీక్షించి, హైకోర్టు మరణశిక్షను రద్దుచేసిన సందర్భంలో సంబంధిత వ్యక్తులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.
* 1970లో పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం 10 ఏళ్ల కంటే ఎక్కువ కాలం శిక్షకు గురైన వ్యక్తులు కూడా సుప్రీంకోర్టులో నేరుగా అప్పీల్ చేసుకోవచ్చు.

 

4. ప్రత్యేకమైన అప్పీళ్లు (ఆర్టికల్, 136) (Special Leave Petitions)
* వివిధ కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి హైకోర్టు తిరస్కరించినప్పుడు ప్రత్యేకమైన అప్పీళ్లకు ప్రయత్నిస్తారు.
* సంబంధిత కేసుల్లో ఏదైనా న్యాయపరమైన ప్రత్యేక అంశాన్ని పరిగణనలోకి తీసుకోని సందర్భంలో సుప్రీంకోర్టులో ప్రత్యేక అప్పీళ్లకు అవకాశం కల్పిస్తారు.
* సుప్రీంకోర్టులో ఉండే స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి ప్రత్యేక అప్పీల్‌కి అనుమతిస్తుంది.

 

కోర్ట్ ఆఫ్ రికార్డ్ (ఆర్టికల్, 129)
* సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరచడాన్నే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు.
* కోర్ట్ ఆఫ్ రికార్డ్‌నే అనుపూర్వికాలు అని కూడా అంటారు.
* కోర్టుకు సమర్పించిన రికార్డులు, డాక్యుమెంట్లు; కోర్టులో ప్రమాణ పూర్తిగా సమర్పించిన సాక్ష్యాధారాలను కోర్ట్ ఆఫ్ రికార్డ్‌ లో అంతర్భాగంగా పరిగణిస్తారు.

* కోర్ట్ ఆఫ్ రికార్డ్ కింది న్యాయస్థానాలన్నింటికీ శిరోధార్యమే.
* కోర్ట్ ఆఫ్ రికార్డ్ ధిక్కరణను కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణిస్తారు. దీనికి రూ.2000 జరిమాన, 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు.

 

మహ్మద్ సలీం ఇస్మాయిల్ Vs భారత ప్రభుత్వం కేసు
 ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, అయోధ్యలో వివాదాస్పద ప్రాంతం పరిరక్షణలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైనందుకు ఒకరోజు జైలుశిక్ష, రూ.2000 జరిమానా విధించింది.

 

తీర్పుల పునఃసమీక్ష (ఆర్టికల్, 137)
* సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పులను తానే పునఃసమీక్ష చేయగలదు.
* 1960లో బెరుబారి కేసు సందర్భంగా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని పేర్కొన్న సుప్రీంకోర్టు 1973లో కేశవానంద భారతి కేసు సందర్భంగా ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగమని పేర్కొంది.
* 1967లో గోలక్‌నాథ్ కేసు సందర్భంగా ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని పేర్కొన్న సుప్రీంకోర్టు 1973లో కేశవానంద భారతి కేసు సందర్భంగా పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించవచ్చని, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించరాదని పేర్కొంది.

రిట్‌లు జారీచేయడం (ఆర్టికల్, 32)
* వ్యక్తులు తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని భావిస్తే వారు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఆర్టికల్, 32 ప్రకారం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం 5 రకాల రిట్లు జారీచేస్తుంది. అవి:
1. హెబియస్ కార్పస్
2. మాండమస్
3. ప్రొహిబిషన్
4. సెర్షియోరరీ
5. కోవారంటో

 

సలహా పూర్వక అధికార పరిధి (ఆర్టికల్, 143)
* రాష్ట్రపతి ఆర్టికల్, 143 ప్రకారం 2 రకాలుగా సుప్రీంకోర్టు న్యాయసలహాను పొందవచ్చు. అవి:
1. చట్టానికి సంబంధించిన వివాదం లేదా ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంశానికి సంబంధించిన విషయాలపై
2. రాజ్యాంగం అమల్లోకి రాకముందు కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన వివాదాల్లో మొదటి రకం వివాదాల్లో సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. రెండో రకం వివాదాల్లో సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియజేయాలి.
* పైన పేర్కొన్న రెండు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాను రాష్ట్రపతి పాటించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. సుప్రీంకోర్టు వెలువరించిన అభిప్రాయాలను కింది న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలి.

ఇప్పటి వరకు భారత రాష్ట్రపతులు ఆర్టికల్, 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహాను కింద పేర్కొన్న అంశాలపై పొందారు అవి:
1. దిల్లీ న్యాయ చట్టం, 1951
2. కేరళ విద్యా బిల్లు, 1958
3. బెరుబారి యూనియన్, 1960
4. సీ - కస్టమ్స్ యాక్ట్, 1963
5. ఉత్తర్‌ప్రదేశ్‌లో కేశవ్‌సింగ్ వివాదం, 1964
6. రాష్ట్రపతి ఎన్నికలు, 1974
7. ఇందిరా గాంధీపై విచారణకు ఏర్పడిన ప్రత్యేక కోర్టుల చట్టం, 1978
8. కావేరి నదీ జలాల ట్రైబ్యునల్ వివాదం, 1992
9. కొలీజియం వ్యవస్థ, 1998
10. గుజరాత్ శాసనసభ ఎన్నికలు, 2002
11. పంజాబ్ నదీ జలాల ఒప్పందం, 2004
12. లాభదాయక పదవులు, 2006
13. జమ్మూకశ్మీర్ పునరావాస, పౌరసత్వ విషయం, 1981
14. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, ప్రసారభారతి సీఈవో బి.ఎస్. లల్లీపై చర్యలు, 2010
15. రామ జన్మభూమి వివాదం, 1993

న్యాయసమీక్షా అధికారం
  పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రూపొందించే శాసనాలు; ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు, చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్నే న్యాయ సమీక్ష అంటారు.

 

రాజ్యాంగ పరిరక్షణ కర్త
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలో వ్యవహరించేలా సుప్రీంకోర్టు నియంత్రిస్తుంది.
* ఆర్టికల్, 147 ప్రకారం రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే విషయంలో సుప్రీంకోర్టుదే అంతిమ నిర్ణయం.
* ఏదైనా ఒక అంశం అవశిష్టాధికారమా? కాదా? అని ధ్రువీకరిస్తుంది.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ఎన్నికల వివాదాలను విచారిస్తుంది.
* యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్మన్లు, సభ్యుల తొలగింపు విషయాల్లో రాష్ట్రపతి సలహా మేరకు సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది.

 

కింది న్యాయస్థానాలపై నియంత్రణ (ఆర్టికల్, 141)
* సుప్రీంకోర్టు దేశంలోని కింది న్యాయస్థానాలపై నియంత్రణ కలిగి ఉంటుంది.
* సుప్రీంకోర్టు తీర్పులు దేశంలోని మిగిలిన న్యాయస్థానాలన్నింటికీ శిరోధార్యమే.
* న్యాయ నిర్వహణలో దిగువ న్యాయస్థానాలు అనుసరించాల్సిన పద్ధతుల గురించి సుప్రీంకోర్టు జారీచేసే మార్గదర్శక సూత్రాలను అన్ని న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలి.
* సుప్రీంకోర్టులో పనిచేసే సిబ్బందిని సుప్రీంకోర్టు నియమిస్తుంది.

విచారణ అధికార పరిధి
* సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు లేదా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసే విచారణ సంఘాలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.
* ఇందిరా గాంధీ హత్యానంతరం విచారణకు - థక్కర్ కమిషన్
* రాజీవ్ గాంధీ హత్యానంతరం విచారణకు - జైన్ కమిషన్, వర్మ కమిషన్
* బాబ్రీ మసీద్ విధ్వంసం అనంతరం - ఎం.ఎస్. లిబర్హాన్ కమిషన్
* రాజకీయ నాయకులు, నేరస్థుల మధ్య సంబంధాలు - ఎన్.ఎన్. వోహ్రా కమిషన్
* గోద్రా అల్లర్ల అనంతరం విచారణకు - నానావతి కమిషన్
* నిర్భయ ఘటన తర్వాత విచారణకు - ఉషామెహ్రా కమిషన్
* కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం - రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్; మదన్ మోహన్ పూంచీ కమిషన్

 

స్వలింగ సంపర్కం కేసు
* ఇద్దరు పురుషులు లేదా స్త్రీల మధ్య జరిగే స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనని 2009లో దిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.
* ఈ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నాయకుడైన బి.పి. సింఘాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరమని 2013, డిసెంబరు 11న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

* న్యాయస్థానాల్లో మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్ లాంటి సంబోధనలతో న్యాయమూర్తులను పిలవడం తప్పనిసరి కాదని, 'సర్' అనే పదాన్ని వాడినా సమ్మతమేనని హెచ్.ఎల్. దత్తు, ఎస్.ఎ. బాబ్డేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
* సుప్రీంకోర్టు ప్రత్యేక పిన్‌కోడ్ - 110201. ఇది 2013, సెప్టెంబరు 26 నుంచి అమల్లోకి వచ్చింది.

 

సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేసిన మహిళలు
1. ఫాతిమాబీబీ
2. రుమా పాల్
3. సుజాత మనోహర్
3. జ్ఞాన్ సుధా మిశ్రా
5. రంజనా రాయ్
6. ఆర్. భానుమతి

 

అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా నియమితులైన/ పనిచేసిన భారతీయులు
1. బెనగళ్ నర్సింగ్ రావు
2. నాగేంద్ర సింగ్
3. రఘునందన్ పాఠక్
4. దల్వీర్ భండారీ

 

కీలకాంశాలు
* సుప్రీంకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్.జె. కానియా.
* సుప్రీంకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమాబీబీ.
* ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించింది వై.వి. చంద్రచూడ్ (7 సంవత్సరాల 140 రోజులు).
* అతి తక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించింది కె.ఎన్. సింగ్ (18 రోజులు).
* మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్.
* గోలక్‌నాథ్ కేసు సమయంలో ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు.
* కేశవానంద భారతి కేసు సమయంలో ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎం. సిక్రీ.
* ఆంతరంగిక అత్యవసర పరిస్థితి సమయంలో ప్రధాన న్యాయమూర్తి ఎ.ఎన్. రే.
* ఎస్.ఆర్. బొమ్మై కేసు సమయంలో ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎన్. వెంకటాచలయ్య.
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి ఆంధ్రుడు కోకా సుబ్బారావు.
* 1993లో ఇచ్చిన తీర్పు ద్వారా కొలీజియం వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది జస్టిస్ జె.ఎస్. వర్మ.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌