• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగ పరిణామ క్రమం 

ఈస్టిండియా కంపెనీ 

బ్రిటిష్ రాణి ఎలిజిబెత్ - I బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం 1600 డిసెంబరు 31 న 'చార్టర్' ద్వారా అనుమతిని జారీ చేసింది. ఈ చార్టర్ కాలపరిమితి 15 సంవత్సరాలు. దీన్ని తర్వాతి కాలంలో పొడిగిస్తూ వచ్చారు.
*  కంపెనీ (ఈస్టిండియా కంపెనీ) బక్సార్ యుద్ధం (1765) లో విజయం సాధించి, 'బెంగాల్ దివానీ అధికారాన్ని' పొందడం ద్వారా ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇది కంపెనీ పాలనకు పునాదైంది. 1765 నుంచి 1773 వరకు ద్వంద్వ ప్రభుత్వం కొనసాగింది.
*  భారతదేశంపై బ్రిటిష్ ప్రభుత్వం తన సార్వభౌమాధికారాన్ని రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా ప్రకటించింది. అనేక మార్పులతో కంపెనీపాలన 1858 వరకు కొనసాగింది. 1858 నుంచి 1947 లో భారతదేశం స్వాతంత్య్రం పొందేవరకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలన సాగించింది. బ్రిటిష్ పాలనలో భారతీయుల డిమాండ్లు, విన్నపాలు, చర్చలు, విమర్శలు, ఉద్యమాల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది. ఈ చట్టాల క్రమాన్ని భారత రాజ్యాంగ చరిత్రగా చెప్పవచ్చు.
*  భారత రాజ్యాంగ చరిత్రను రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి:
    1) ఈస్టిండియా కంపెనీ పాలన (1773 - 1858)
    2) బ్రిటిష్ ప్రభుత్వ పాలన (1858 - 1947)

 

ఈస్టిండియా కంపెనీ పాలన 
కంపెనీని స్థాపించినప్పుడు బ్రిటిష్ రాణి / చక్రవర్తి సర్వాధికారి. కానీ 1773 నాటికి బ్రిటిష్ పార్లమెంటు సార్వభౌమాధికార సంస్థగా అవతరించింది. దీంతో బ్రిటిష్ పార్లమెంటు ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి, చక్కదిద్దడానికి అనేక చట్టాలు చేసింది. అందులో మొదటిది రెగ్యులేటింగ్ చట్టం 1773.

 

రెగ్యులేటింగ్ చట్టం 1773
 దీన్ని భారతదేశంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వర్ణిస్తారు. దీన్ని బ్రిటిష్ పార్లమెంటులో అప్పటి ప్రధాని 'లార్డ్ నార్త్' ప్రవేశపెట్టాడు. ఇది 1773 జూన్ నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే భారత రాజ్యాంగానికి పునాదైంది. 
ముఖ్యాంశాలు: ఈ చట్టం ఇంగ్లండ్, భారతదేశంలో కంపెనీకి సంబంధించి అనేక మార్పులను చేసింది.
ఇంగ్లండ్‌లో వచ్చిన మార్పులు:
* కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ (కంపెనీ పాలక వర్గం) పదవీకాలాన్ని ఒక సంవత్సరం నుంచి 4 సంవత్సరాలకు పెంచారు. ప్రతి సంవత్సరం మొత్తం సభ్యుల్లో 1/4 వ వంతు పదవీ విరమణ చేస్తారు. తిరిగి అంతేమంది ఎన్నికవుతారు.
* కంపెనీ ప్రొప్రైటర్లు (యజమానులు) ఓటు హక్కు అర్హత పొందడానికి కనీసం 6 నెలలకు బదులు సంవత్సర కాలం పాటు, 500 పౌండ్లకు బదులు 1000 పౌండ్లకు మించిన వాటాలున్న వారికి పరిమితం చేశారు.
భారతదేశంలో వచ్చిన మార్పులు:
* బెంగాల్ గవర్నర్ హోదాను బెంగాల్ గవర్నర్ జనరల్‌గా మార్చారు. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల నిర్వహణపై బెంగాల్ గవర్నర్ జనరల్‌కు పర్వవేక్షణ అధికారాన్ని కల్పించారు. 
* 'గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి'ని ఏర్పాటు చేశారు. ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. గవర్నర్ జనరల్‌కు విధి నిర్వహణలో సాయపడటం దీని ప్రధాన విధి. కౌన్సిల్‌లో నిర్ణయాలు మెజారిటీ ప్రాతిపదికపై తీసుకుంటారు. గవర్నర్ జనరల్‌కు నిర్ణాయక ఓటు (Casting Vote) ను కల్పించారు.
* కలకత్తాలోని ఫోర్ట్ విలియం (బ్రిటిష్ వర్తక స్థావరం)లో సుప్రీంకోర్టు ఏర్పాటును ప్రతిపాదించింది. ఇది 1774 లో ఏర్పాటైంది. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులు ఉంటారు. మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. సుప్రీంకోర్టు తీర్పులపై 'కింగ్ కౌన్సిల్' (రాజు లేదా రాణి కౌన్సిల్ నిర్ణయాలను పాటించడం) కు అప్పీల్ చేసుకోవచ్చు.
* గవర్నర్ జనరల్, కౌన్సిల్ సభ్యులు, సుప్రీంకోర్టు ప్రధాన, సాధారణ న్యాయమూర్తులు, ఇతర ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేటు వ్యాపారం చేయడాన్ని, స్థానికుల (భారతీయులు) నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బహుమతులు తీసుకోవడాన్ని నిషేధించింది.
* కంపెనీకి 20 సంవత్సరాల కాలపరిమితికి (పొడిగిస్తూ) చార్టర్ జారీ చేశారు.

 

పిట్స్ ఇండియా చట్టం 1784 
రెగ్యులేటింగ్ చట్టం 1773 లోని లోపాలను సవరిస్తూ, ప్రభుత్వ యంత్రాంగం సరిగా పనిచేయడమే ఈ చట్టం ఉద్దేశమని అప్పటి ఇంగ్లండ్ ప్రధాని 'విలియం పిట్' తెలియజేశారు. అతడి పేరు మీద ఈ చట్టం 'పిట్స్ ఇండియా' చట్టంగా ప్రాచుర్యం పొందింది. 
ముఖ్యాంశాలు: ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి 'బోర్డ్ ఆఫ్ కమిషనర్స్' ఏర్పాటైంది. దీన్నే 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' అని కూడా అంటారు. దీనికి 'సెక్రటరీ ఆఫ్ స్టేట్' అధ్యక్షుడు. ఇతడికి నిర్ణాయక ఓటును కల్పించారు. సభ్యుల కాల పరిమితి 4 సంవత్సరాలు.
* ఈస్టిండియా కంపెనీ విధులను వాణిజ్య, రాజకీయ విధులుగా విభజించి, వాణిజ్య విధులను పూర్తిగా 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌'కు, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌'కు అప్పగించారు. భారతదేశంలోని కంపెనీ భూభాగాలు, ఆదాయంపై ఈ బోర్డుకు సంపూర్ణ అధికారాన్ని కల్పించారు.
* గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చారు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి ఆదేశాలను పాటించని గవర్నర్లను, ప్రెసిడెన్సీ కౌన్సిళ్లను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ జనరల్‌కు ఇచ్చారు.
* 1786 లో జరిగిన సవరణ ఫలితంగా గవర్నర్ జనరల్ కౌన్సిల్ నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్ జనరల్‌కు వచ్చింది. అంతేకాకుండా గవర్నర్ జనరల్‌నే సర్వసైన్యాధ్యక్షుడిని చేశారు. ఈ సవరణ చట్టంతో గవర్నర్ జనరల్‌కు తన కౌన్సిల్ నిర్ణయాలను 'వీటో' చేసే అధికారం వచ్చింది. గవర్నర్ జనరల్ పదవి, అధికారాలు సుస్థిరం, విస్తృతమయ్యాయి.
* గవర్నర్ జనరల్, గవర్నర్ల కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 4 నుంచి 3 కు తగ్గించారు.

చార్టర్ చట్టం 1793 
ఫ్రాన్స్ పరిణామాలు (ఫ్రెంచి విప్లవం) ఇంగ్లండ్ వాణిజ్యంపై వ్యతిరేక ప్రభావం చూపడంతో విదేశీ వ్యాపారాన్ని, సముద్ర ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కంపెనీ సహకారం అవసరమైంది.
ముఖ్యాంశాలు: కంపెనీ అధీనంలోని ప్రాంతాలు, వాటిపై వచ్చే ఆదాయాన్ని మరో 20 సంవత్సరాలపాటు కంపెనీకే అప్పగించారు.
¤ స్వదేశీ ఖర్చుల పేరుతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యుల, కార్యాలయ సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చులను కంపెనీ ప్రభుత్వం (భారతదేశం నుంచి వచ్చే రెవెన్యూ) భరించే విధంగా చట్టంలో మార్పు చేశారు. ఇది 1793 నుంచి భారత ప్రభుత్వ చట్టం 1919 అమల్లోకి వచ్చేవరకు కొనసాగింది.
¤ గవర్నర్ జనరల్ కౌన్సిల్ సమావేశాలకు గవర్నర్ జనరల్ లేని సమయంలో 'వైస్ ప్రెసిడెంట్' అధ్యక్షత వహిస్తాడు. వైస్ ప్రెసిడెంట్‌ను నియమించే అధికారాన్ని గవర్నర్ జనరల్‌కు ఇచ్చారు.
¤ భారతదేశంలో ఆంతరంగిక పాలనకు తగిన నిబంధనలను తయారు చేసే అధికారాన్ని గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కు ఇచ్చారు. భారతీయుల వ్యక్తిగత ఆస్తులు, వారసత్వం, వివాహం, మత విషయాలకు సంబంధించి గవర్నర్ జనరల్ జారీచేసే నిబంధనలు శాసనాలతో సమానమైన విలువను కలిగి ఉంటాయి. దీని ఆధారంగానే 'కారన్ వాలీస్ కోడ్' రూపొందింది. దీంతో భారతదేశంలో రాతపూర్వక శాసన నిర్మాణం ప్రారంభమైందని చెప్పవచ్చు.
¤ కంపెనీ ఉద్యోగులకు 'సీనియారిటీ' ప్రాతిపదికపై ప్రమోషన్లను కల్పిస్తారు.

 

చార్టర్ చట్టం 1813 
భారత రాజ్యాంగ క్రమపరిణామంలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా చెప్పొచ్చు.
ముఖ్యాంశాలు: భారతదేశంలో కంపెనీ పాలనను మరో 20 సంవత్సరాల పాటు పొడిగించారు. కంపెనీ పాలన కొనసాగినప్పటికీ కంపెనీ ప్రాంతాలపై రాణి / చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా ప్రకటించింది.
* కంపెనీకి ఉన్న వ్యాపార గుత్తాధికారాన్ని తొలగించారు. బ్రిటిష్ పౌరులందరికీ భారతదేశంలో స్వేచ్ఛా వ్యాపారాన్ని అనుమతించింది. అయితే కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా తేయాకు, చైనాతో వ్యాపారంలోనూ కంపెనీకి ఉన్న గుత్తాధికారం కొనసాగింది.
* భారతీయులను సంస్కరించడం, విజ్ఞానవంతులను చేయడం కోసం మిషనరీల ప్రవేశానికి అవకాశం కల్పించారు. అవి భారతదేశంలో చర్చ్‌లు, ఆసుపత్రులు, విద్యాలయాలను స్థాపించడం ద్వారా మత మార్పిడులకు అవకాశం ఏర్పడింది.
* భారతీయులకు విజ్ఞానశాస్త్రాన్ని పరిచయం చేయడం, ప్రోత్సహించడం కోసం రూ.1,00,000 తో ఒక నిధిని భారతదేశంలో ఏర్పాటు చేశారు.
* పన్నులను విధించడానికి, వాటిని చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఇచ్చారు.
* కంపెనీ పరిపాలనలో పనిచేసే సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు. పౌర ఉద్యోగులకు హేలీబ్యూరి కాలేజ్‌లోను (ఇంగ్లండ్), సైనికోద్యోగులకు ఎడిస్ కోంబ్‌లోని మిలిటరీ సెమినరీలోను శిక్షణను ఏర్పాటు చేశారు. * ఈ రెండింటినీ 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' అధీనంలో ఉంచారు.

 

చార్టర్ చట్టం 1833 
భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం కేంద్రీకృత పాలనా వ్యవస్థను ఏర్పాటుచేసింది. కంపెనీ భూభాగాలు బ్రిటిష్ రాణి లేదా చక్రవర్తి వారసులకు చెందుతాయని ప్రకటించింది.  
ముఖ్యాంశాలు: ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 సంవత్సరాలు పొడిగించారు. అయితే తేయాకు, చైనాతో ఉన్న వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. 
* కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి, పరిపాలనా సంస్థగా మార్చారు.
* 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' నిర్మాణంలో మార్పు తెచ్చారు. అనేక మంది మంత్రులు పదవిరీత్యా సభ్యులయ్యారు. ఉదాహరణకు - లార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కౌన్సిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ మొదలైనవారు.
* 'గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్' హోదాను 'గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా'గా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 'విలియం బెంటింక్'.
* గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 3 నుంచి 4 కు పెంచారు. నాలుగో సభ్యుడిగా 'లా మెంబరు'ను చేర్చారు. కౌన్సిల్‌లో మొదటి లా మెంబరు లార్డ్ మెకాలే.
* బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీ కౌన్సిళ్లను రద్దు చేశారు. గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కే పూర్తి శాసనాధికారం లభించింది. గవర్నర్ జనరల్ అధ్యక్షతనున్న కౌన్సిల్ శాసనాలు 'బ్రిటిష్ - ఇండియా' మొత్తానికి, అందరు వ్యక్తులకు, న్యాయస్థానాలకు వర్తిస్తాయి.
* భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ 'లా కమిషన్‌'ను నియమించారు. దీనికి మొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.
* సివిల్ సర్వీస్ నియామకాల్లో బహిరంగ పోటీ పద్ధతి (open competition) ని ప్రతిపాదించారు. కానీ 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్' వ్యతిరేకించడంతో అది అమల్లోకి రాలేదు.
* భారత వ్యవహారాల మంత్రిని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా చేశారు.
* భారతదేశంలో బానిసత్వాన్ని రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను గవర్నర్ జనరల్ కౌన్సిల్‌పై ఉంచింది.
* యూరోపియన్లకు భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివాసం ఏర్పరచుకోవడానికి అనుమతించారు.

 

చార్టర్ చట్టం 1853 
బ్రిటిష్ పార్లమెంటు చేసిన చార్టర్ చట్టాల్లో చివరిది. అతి తక్కువ కాలం అమల్లో ఉన్న, నిర్దిష్ట కాలపరిమితి లేకుండా జారీ చేసిన చట్టం ఇది.
ముఖ్యాంశాలు: గవర్నర్ జనరల్ కౌన్సిల్ విధులను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభజించి, శాసనాలను రూపొందించడానికి 'ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌'ను ఏర్పాటు చేశారు. శాసన నిర్మాణం కోసం 12 మంది సభ్యులు ఉంటారు. ఇది రూపొందించే చట్టాలకు గవర్నర్ జనరల్ ఆమోదం అవసరం. గవర్నర్ జనరల్‌కు వీటో అధికారం ఉంటుంది. 'సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌'నే మినీ పార్లమెంటు అంటారు. దీంతో భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థను మొదటిసారిగా పరిచయం చేసినట్లయ్యింది.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ (కేంద్ర శాసన మండలి)లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. మొత్తం 12 మందిలో గవర్నర్ జనరల్, సర్వసైన్యాధ్యక్షుడు, కౌన్సిల్‌లోని నలుగురు సాధారణ సభ్యులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక సాధారణ న్యాయమూర్తి, నలుగురు సభ్యులను మద్రాసు, బొంబాయి, బెంగాల్, ఆగ్రా నుంచి తీసుకున్నారు.
* బ్రిటిష్ ఇండియాలో సివిల్ సర్వీసు నియామకాలను సార్వజనీన లేదా బహిరంగ పోటీ ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. అంతవరకూ 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్' నియమించేవారు.
* కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సంఖ్యను 24 నుంచి 18 కి తగ్గించారు. వీరిలో ఆరుగురిని నియమించే అధికారం రాణి లేదా చక్రవర్తికి ఇచ్చారు.
* 'గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా'కు ఉన్న 'గవర్నర్ ఆఫ్ బెంగాల్' అనే హోదాను రద్దు చేశారు.
* భారతదేశంలో వ్యాపార సంస్థగా ప్రారంభమైన ఈస్టిండియా కంపెనీ 1858 నాటికి కేవలం పరిపాలనా సంస్థగానే మిగిలింది. ఇది 1857 సిపాయిల తిరుగుబాటు (లేదా) ప్రథమ స్వాతంత్య్ర పోరాటం తర్వాత రద్దయింది. కంపెనీ స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలనాధికారాలను స్వీకరిస్తూ 1858 నవంబరు 1 న ఒక ప్రకటన జారీ చేసింది.  
 * భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ద్వారా రూపొందించినప్పటికీ ఇది ఒక సుదీర్ఘ చారిత్రక క్రమపరిణామ ఫలితమని చెప్పొచ్చు.
 *  బ్రిటిష్ - ఇండియా ప్రాంతాల పాలన కోసం 1773 నుంచి 1947 వరకు బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది.
 * ఇవి భారత రాజ్యాంగ రూపకల్పనలో రాజ్యాంగ పరిషత్‌కు ఆధారంగా నిలిచాయి. 

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌