• facebook
  • whatsapp
  • telegram

బ్రిటిష్‌ పాలనాకాలంలో సివిల్‌ సర్వీసుల పరిణామ క్రమం

ఆధునిక ప్రపంచంలో ఉద్యోగస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదులు ఏర్పర్చిన దేశం బ్రిటన్‌. భారత్‌లో 1772లో వారన్‌ హేస్టింగ్స్‌ పాలనా కాలంలో మొదటిసారి ‘జిల్లా కలెక్టర్‌’ పదవిని ప్రవేశ పెట్టారు. 1793లో కారన్‌ వాలీస్‌ కాలంలో సివిల్‌ సర్వీసులను పునర్‌వ్యవస్థీకరించారు.

❉ 1853లో లార్డ్‌ డల్హౌసీ పాలనా కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో నామినేషన్‌ విధానాన్ని రద్దుచేసి మెరిట్‌ విధానాన్ని (Merit system) ప్రవేశపెట్టారు.

అఖిల భారత సర్వీసులు

❉ స్వాతంత్య్రానంతరం సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కృషి ఫలితంగా ‘అఖిల భారత సర్వీసులను’ ఏర్పాటు చేశారు. అందుకే ఈయన్ను అఖిల భారత సర్వీసుల పితామహుడిగా పేర్కొంటారు.

❉ 1947లో ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌), ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఐపీఎస్‌)లతో అఖిల భారత సర్వీస్‌ ఏర్పాటైంది. 1966లో దీనికి ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)ను చేర్చారు.

❉ 1947, ఏప్రిల్‌ 21న మనదేశ తొలి హోం మంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ న్యూదిల్లీలో మొదటి సివిల్‌ సర్వీసెస్‌ ప్రొబేషనరీ బ్యాచ్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. మనదేశంలో ఏటా ఏప్రిల్‌ 21న ‘సివిల్‌ సర్వీసుల దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు.

సివిల్‌ సర్వీస్‌ సంస్కరణలు - వివిధ కమిటీల సిఫార్సులు

సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగుల్లో పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడానికి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాలను అలవర్చుకోవడానికి, నూతన సాంకేతికతను పాలనలో ప్రవేశపెట్టడానికి అవసరమైన అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది.

డి.ఎస్‌.కొఠారి కమిటీ:

సివిల్‌ సర్వీసుల నియామకానికి సంబంధించిన అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం 1974లో డి.ఎస్‌.కొఠారి కమిటీని ఏర్పాటు చేసింది. ఇది కింది సిఫార్సులు చేసింది. 

❉ రాజ్యాంగంలోని జుఖిఖిఖివ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో యూపీఎస్సీ నిర్వహించే మెయిన్స్‌ పరీక్షలు రాసేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించాలి.

❉ ఆలిండియా, సెంట్రల్‌ సర్వీసులకు ఒకే పరీక్ష ఉండాలి.

❉ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే మెయిన్స్‌ పరీక్షకు అవకాశం కల్పించాలి.

సతీష్‌చంద్ర కమిటీ:

సివిల్‌ సర్వీసులపై అధ్యయనం కోసం 1988లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది కింది సిఫార్సులు చేసింది.

❉ సివిల్‌ సర్వీస్‌ మెయిన్స్‌ పరీక్షలలో వ్యాస సంబంధ పేపర్‌ (Essay Paper)ను 200 మార్కులకు నిర్వహించాలి.

❉ ఇంటర్వ్యూ మార్కులను 250 నుంచి 300కు పెంచాలి.

వై.కె.అలఘ్‌ కమిటీ:

సివిల్‌ సర్వీసులపై అధ్యయనం కోసం ప్రభుత్వం 2000లో వై.కె.అలఘ్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. 

❉  ఇది సివిల్‌ సర్వీసుల సమర్థతను పెంచడానికి పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు చేయాలని సిఫార్సులు చేసింది.

పి.సి.హోతా కమిటీ:

ఈ కమిటీ 2004లో ఏర్పాటైంది. దీని సిఫార్సులు:

❉ సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగుల్లో అవినీతిని, అలసత్వాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలి.

❉ సివిల్‌ సర్వెంట్స్‌ పనితీరును ప్రతి పదిహేనేళ్లకోసారి సమీక్షించాలి. విధులు సక్రమంగా నిర్వహించని వారిని పదవీ విరమణ ప్రయోజనాలు ఇచ్చి, ఉద్యోగం నుంచి తొలగించాలి.

❉ సివిల్‌ సర్వీసులకు ఎంపికచేసే అభ్యర్థుల వయోపరిమితి 21-30 సంవత్సరాల నుంచి 21-24 ఏళ్లకు తగ్గించాలి.

❉ పదవీ విరమణ పొందిన సివిల్‌ సర్వెంట్లు కనీసం రెండేళ్ల పాటు రాజకీయాల్లోకి రాకుండా నియమావళిని రూపొందించాలి.

❉ అవినీతికి పాల్పడిన సివిల్‌ సర్వెంట్లను తొలగించే అధికారాన్ని రాష్ట్రపతి/ రాష్ట్రాల గవర్నర్లకు కల్పించాలి.

అరుణ్‌ నిగవేకర్‌ కమిటీ:

❉ సివిల్‌ సర్వీస్‌ మెయిన్స్‌ పరీక్షల విధానాన్ని సమీక్షించడానికి 2011 డిసెంబరులో యూజీసీ మాజీ ఛైర్మన్‌ అరుణ్‌ నిగవేకర్‌ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీని కింది లక్ష్యాల సాధనకు అవసరమైన సిఫార్సులు చేయాలని యూపీఎస్సీ కోరింది.

❉ సివిల్‌ సర్వెంట్ల ఎంపికలో ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడం.

❉ ఎంపికైన అభ్యర్థుల శిక్షణాకాలంలో, శిక్షణ పూర్తయ్యాక వారి సామర్థ్యాన్ని అంచనా వేయడంలో యూపీఎస్సీ పోషించాల్సిన పాత్రను అధ్యయనం చేయడం.

❉ దేశీయంగా, అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న సామాజిక, ఆర్థిక, సాంకేతిక పరిస్థితుల్లో సుపరిపాలనను అందించడానికి సివిల్‌ సర్వెంట్లలో అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను గుర్తించడం.

❉ రాబోయే కాలంలో భారతదేశ స్థితిగతులకు అనుగుణంగా అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తగిన విధానాపై అధ్యయనం.

❉ ఈ కమిటీ 2012 ఆగస్టు 30న తన నివేదికను యూపీఎస్సీకి సమర్పించింది. దీనికి అనుగుణంగా 2013 నుంచి సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షా విధానంలో సంస్కరణలు ప్రవేశపెట్టారు.

ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ (ఐసీఎస్‌) ఏర్పాటు

❉ 1854 నాటి లార్డ్‌ మెకాలే నివేదిక ఆధారంగా భారత్‌లో తొలిసారి ‘ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ (ఐసీఎస్‌)’ను ఏర్పాటు చేశారు. మనదేశ మొదటి సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగి ‘సత్యేంద్రనాథ్‌ ఠాగూర్‌’.

❉ 1919 నాటి మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల సంఘం సిఫార్సుల మేరకు 8 అఖిల భారత సర్వీసులను అదనంగా ఏర్పాటు చేశారు. 

❉ 1923లో ఏర్పాటు చేసిన ‘లీ కమిషన్‌’ 1924లో తన నివేదికను సమర్పించింది. అందులో జాతీయ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం ‘కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. దీని ఫలితంగా 1926లో ‘కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ ఏర్పాటైంది.

❉ 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేరును ‘ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’గా మార్చారు.

❉ 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీంతో ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేరును ‘యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’గా మార్చి, స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థగా ఏర్పాటు చేశారు.

అరవింద్‌ వర్మ కమిటీ:

సివిల్‌ సర్వీసుల ప్రిలిమ్స్‌లో ఉండే సివిల్‌ సర్వీసెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సీశాట్‌) గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులకు కఠినంగా ఉందని, అందులోని అంశాలు సంక్లిష్టంగా ఉంటున్నాయని అభ్యర్థులు  ఆందోళన చేశారు. ఈ అంశంపై అధ్యయనం కోసం 2014లో కేంద్ర ప్రభుత్వం అరవింద్‌ వర్మ కమిటీని ఏర్పాటు చేసింది.

భారతదేశంలో వివిధ శిక్షణా సంస్థలు

మన దేశంలో సివిల్‌ సర్వీస్‌ అధికారులకు, ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి కొన్ని ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేశారు. అవి:

లాల్‌ బహదూర్‌ శాస్త్రి జాతీయ పాలనా అకాడమీ: దీన్ని 1959లో ‘ముస్సోరి’లో ఏర్పాటు చేశారు. ఇది జాతీయ స్థాయిలో పేరుపొందిన శిక్షణా సంస్థ. 

❉ దీని నిర్వహణను ‘కేంద్ర సిబ్బంది - శిక్షణ శాఖ’ పర్యవేక్షిస్తుంది. 

❉ కేంద్ర సివిల్‌ సర్వీసుల్లో చేరిన అధికారులందరికీ ఇక్కడ ఉమ్మడి శిక్షణ ఇస్తారు. రాష్ట్ర సర్వీసుల నుంచి పదోన్నతిపై కేంద్ర సర్వీసుల్లో చేరిన అధికారులు కూడా ఇక్కడ శిక్షణ పొందుతారు.

ఫారెన్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌:

ఇందులో ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)కు ఎంపికైన అధికారులకు, విదేశీ రాయబారులకు అత్యుత్తమ శిక్షణ అందిస్తారు.  అంతర్జాతీయ సంబంధాలు, మిత్రదేశాలతో సత్సంబంధాలు మొదలైన అంశాలపై ట్రైనింగ్‌ ఉంటుంది. 

❉ ఇది న్యూదిల్లీలో ఉంది. ఈ సంస్థలో విదేశీ భాషలు కూడా నేర్పిస్తారు.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌:

ఈ శిక్షణా సంస్థ న్యూదిల్లీలో ఉంది. ఇందులో ఉన్నతస్థాయి, మధ్యస్థాయి సివిల్‌ సర్వెంట్లకు శిక్షణ ఇస్తారు. వివిధ స్థాయుల్లో వృత్యంతర శిక్షణ (In-service training) సైతం ఉంటుంది.

జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ:

గ్రామీణాభివృద్ధిపై శాస్త్రీయ శిక్షణను అందించడానికి 1958లో హైదరాబాద్‌లో ‘సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టడీ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌’ను నెలకొల్పారు. 

❉ దీని పేరును 1970లో ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఐఆర్‌డీ)గా మార్చారు. ఇక్కడ మధ్యస్థాయి, ఉన్నతస్థాయి సివిల్‌ సర్వీస్‌ అధికారులకు గ్రామీణాభివృద్ధిపై అత్యున్నత శిక్షణను అందిస్తున్నారు.

సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ:

❉ ఇండియన్‌ పోలీస్‌ సర్వీసెస్‌ (ఐపీఎస్‌)కు ఎంపికైన అభ్యర్థులకు మొదట్లో రాజస్థాన్‌లోని ‘మౌంట్‌ అబూ’లో శిక్షణ ఇచ్చేవారు. 

❉ కోహ్లి కమిటీ నివేదిక ఆధారంగా 1976 నుంచి హైదరబాద్‌లోని ‘సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీ’లో శిక్షణ ఇస్తున్నారు. 

❉ ఇక్కడ ఐపీఎస్‌ అధికారులకు, పోలీస్‌ శిక్షణా సంస్థల్లో పనిచేసే శిక్షకులకు ట్రైనింగ్‌ ఇస్తున్నారు. 

❉ ఈ అకాడమీ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రత్యక్ష నియంత్రణలో పనిచేస్తుంది.


సచివాలయ శిక్షణ - నిర్వహణ సంస్థ:

1948లో న్యూదిల్లీలో ‘సెంట్రల్‌ సెక్రటేరియట్‌ ట్రైనింగ్‌ స్కూల్‌’ను స్థాపించారు. దీని పేరును 1971లో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్రటేరియట్‌ ట్రైనింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌’గా మార్చారు. 

❉ ఇందులో సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీసుల్లోకి వెళ్లే అధికారులకు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. మధ్యస్థాయి, ఉన్నతస్థాయి సెక్రటేరియట్‌ సర్వీసు అధికారులకు కూడా ఇక్కడ ట్రైనింగ్‌ ఇస్తారు.

ఇందిరాగాంధీ జాతీయ అటవీ విద్యాలయం:

1987లో దెహ్రాదూన్‌లో ఇందిరాగాంధీ నేషనల్‌ ఫారెస్ట్‌ అకాడమీని స్థాపించారు. అటవీ సంరక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, అడవుల సంరక్షణ విధానం, మదింపు మొదలైన అంశాలపై ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారులకు ఇక్కడ అత్యున్నత స్థాయి శిక్షణ అందిస్తారు.


రచయిత: బంగారు సత్యనారాయణ, విషయ నిపుణులు 

Posted Date : 01-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌