• facebook
  • whatsapp
  • telegram

ప్రజాస్వామ్యంలో సివిల్‌ సర్వీసుల పాత్ర - నేపథ్యం

ధునిక ప్రజాస్వామ్య రాజ్యవ్యవస్థ ఆవిర్భవించాక, దాని ఆశయ సాధనకు తోడ్పడే సివిల్‌ సర్వీసుల ప్రాముఖ్యత మరింత పెరిగింది. సివిల్‌ సర్వీసుల సమర్థతపైనే ప్రజాస్వామ్య రాజ్యవ్యవస్థ మనుగడ ఆధారపడి ఉంది. వీటి నేపథ్యంపై పోటీ పరీక్షార్థులకు అవగాహన అవసరం.

ఇ.ఎన్‌.గ్లాడెన్‌ "The Civil Service: Its Problems and Future" అనే గ్రంథాన్ని రాశారు. అందులో సివిల్‌ సర్వీస్‌ అంటే ‘జాతి సివిల్‌ పాలనకు చెందిన వివిధ లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమైన విభిన్న వ్యక్తుల సమూహం’ అని నిర్వచించారు.

సిబ్బంది పాలన

స్ట్రాస్, సేలెస్‌ అనే పాలనా తత్వవేత్తలు సిబ్బంది పాలనలోని ముఖ్యమైన అంశాలను కిందివిధంగా పేర్కొన్నారు.

* ఉద్యోగాలు భర్తీ చేయడం, ఎంపిక, కేటాయింపు.

* ఉద్యోగ విశ్లేషణ, ఉద్యోగ వివరణ, ఉద్యోగ మదింపు.

* నష్టపరిహారం చెల్లింపు, అంచనా వేయడం.

* ఉద్యోగికి చెందిన రికార్డులను నిర్వహించడం.

* ఉద్యోగి సంక్షేమ పథకాలు.

* ప్రత్యేక సేవలు

* శిక్షణ, విద్యా విషయ కార్యకలాపాలు

* కార్మిక సంబంధాలు    

* ప్రజా సంబంధాలు

* సిబ్బంది ప్రణాళిక, మదింపు

లక్షణాలు 

* సివిల్‌ సర్వీస్‌ సిబ్బంది రాజ్యానికి అవసరమైన విధాన నిర్ణయాలను రూపొందించడంలో సలహాలు ఇస్తారు. వాటి ఆచరణకు సహాయపడతారు.

* సివిల్‌ సర్వీసులు శాశ్వతమైనవి. సమాజాన్ని సుస్థిరంగా ఉంచడానికి తోడ్పడతాయి.

* సివిల్‌ సర్వీసులు వర్గ శ్రేణిలో నిర్మితమై ఉంటాయి. వీరిలో కిందిస్థాయి, మధ్యస్థాయి, ఉన్నతస్థాయి అధికారులు ఉంటారు.

* సివిల్‌ సర్వీస్‌ వాస్తవానికి రాజకీయాధికారానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి బాధ్యత వహించినా, అంతిమంగా ప్రజలకే జవాబుదారీగా ఉంటాయి.

* సివిల్‌ సర్వీస్‌ అధికారులు సేవాభావంతో పనిచేస్తారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా వారి సేవలు ఒకేలా ఉంటాయి. వీరికి సొంత రాజకీయ అభిప్రాయాలు, భావజాలం ఉండకూడదు. వీరు నిష్పక్షపాత ధోరణితో పనిచేయాలి.

* సివిల్‌ సర్వీసులు తటస్థ వైఖరిని అవలంబిస్తాయి. రాజ్యాంగ ఆశయాలను నెరవేర్చడమే వీటి పరమావధి.

* సివిల్‌ సర్వీసులు పౌరులకు ఒకే విధమైన సేవలు అందిస్తాయి. ‘చట్టం ముందు అందరూ సమానులే, చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుంది’ అనే భావనలు సివిల్‌ సర్వీస్‌కి ప్రధాన ప్రమాణాలు.

* సివిల్‌ సర్వీస్‌ అధికారులు ఒక నిర్ణీత పరిధిలో పనిచేయాలి. శాసన వ్యవస్థకు నిరంతరం తమ సలహాలను అందించాలి. వీరు ‘మంత్రి బాధ్యత’ అనే సూత్రం ద్వారా రక్షణ పొందుతారు. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం అమలు చేసినా దాని ఫలితాలకు సంబంధిత మంత్రి బాధ్యత వహిస్తారు.

నేపథ్యం

* సివిల్‌ సర్వీసుల ఆవిర్భావంలో ‘ప్రష్యా’ పేరు మొదట వినిపిస్తుంది. ఈ దేశాన్ని పాలించిన ఫ్రెడరిక్‌ విలియం, ఫ్రెడరిక్‌ ద గ్రేట్‌ సుస్థిర పరిపాలనా విధానాలను అభివృద్ధి చేశారు. 

* ప్రష్యా 174870 మధ్యకాలంలో రాత పరీక్షల ద్వారా ఉన్నతస్థాయి ఉద్యోగులను ఎంపిక చేసే విధానాన్ని ప్రారంభించింది. ఆధునిక సివిల్‌ సర్వీసుల తొలిరూపం ఇక్కడే మొదలైంది.

* ఫ్రెంచ్‌ పాలనా విధానంలో కేంద్రీకరణ ఒక అంతర్గత భాగంగా ఉండేది. వీరి పాలనలో మూడో రిపబ్లిక్‌ కీలకమైంది. 1882లో ఫ్రెంచ్‌ పార్లమెంట్‌ సివిల్‌ సర్వీసులను నియంత్రించేందుకు చట్టాలు చేసింది.

* 1915లో ఫ్రాన్స్‌లో సివిల్‌ సర్వీస్‌లు 5 విభాగాలుగా ఉండేవి. అవి:

1. అత్యున్నత పాలనా తరగతి

2. కార్యనిర్వాహక గుమస్తా బృందం

3. గుమస్తా సేవా బృందం 

4. కార్మిక, రక్షణ ఉద్యోగులు

5. సాంకేతిక ఉద్యోగి బృందం

* ఫ్రెంచ్‌ సివిల్‌ సర్వీసులు చాలా శక్తిమంతమైనవి. వీరు న్యాయ నిపుణులు కూడా. ఇక్కడి ప్రజలు సివిల్‌ సర్వీసులను ఒక కెరీర్‌గా భావిస్తారు. సివిల్‌ సర్వెంట్లకు రాజకీయ హక్కులు ఉంటాయి. రాజకీయ పార్టీల తరఫున ప్రచారం చేయొచ్చు. రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని సైతం పొందొచ్చు. సివిల్‌ అడ్మినిస్ట్రేటివ్స్‌ అనే ఉన్నతస్థాయి సర్వీస్‌ అన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

 అమెరికా సివిల్‌ సర్వీసులు

* అమెరికాలోని ఫెడరల్‌ ప్రభుత్వం 1883లో సివిల్‌ సర్వీసులను ప్రారంభించింది. అంతకు ముందు అక్కడ ‘స్పాయిల్స్‌’ విధానం అమల్లో ఉండేది. దీని ప్రకారం రాజకీయ పార్టీకి నమ్మకంగా, విశ్వాసంగా ఉన్నవారికి పదవులు ఇచ్చేవారు. ఈ విధానాన్ని జాక్సన్‌ ప్రారంభించారు. ‘పెండల్టన్‌’ చట్టం ద్వారా స్పాయిల్స్‌ విధానాన్ని రద్దు చేశారు.

* బ్రిటిష్‌ సర్వీస్‌ విధానం స్ఫూర్తితో అమెరికా ప్రభుత్వం 1883లో సివిల్‌ సర్వీసుల చట్టాన్ని రూపొందించింది. 

* 1939లో రూపొందిన హాచ్‌ చట్టం ప్రకారం, అమెరికాలో ఫెడరల్‌ ఉద్యోగులు ఓటింగ్‌లో తప్ప మిగతా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. 

* 1943 నాటికి అమెరికాలో మొత్తం ఫెడరల్‌ సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగుల్లో 80 శాతం పైగా సివిల్‌ సర్వీసుల కిందికి వచ్చారు.

* 1978లో కార్టర్‌ పాలనాకాలంలో చేసిన సివిల్‌ సర్వీస్‌ సంస్కరణల చట్టం రెండు ప్రత్యేక ఏజెన్సీలను నెలకొల్పింది. అవి:

1. ఆఫీస్‌ ఆఫ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌

2. మెరిట్‌ సిస్టమ్‌

ఫెరల్‌ హెడీ పాలనా వర్గీకరణ విధానం

* సౌదీ అరేబియా, మొరాకో లాంటి దేశాల్లోని పాలనా విధానాలు ‘సంప్రదాయ నియంతృత్వ ధోరణి’కి చెందినవి.

* థాయ్‌లాండ్, పాకిస్థాన్, బ్రెజిల్‌ లాంటి దేశాల్లో ‘కులీన ఉద్యోగస్వామ్య విధానం’ అమల్లో ఉంది.

* మలేసియా, కోస్టారికా, గ్రీస్‌ లాంటి దేశాల్లో ‘బహుళవర్గ పోటీ ఉద్యోగ విధానం’ అమలవుతోంది.

* అల్జీరియా, బొలీవియా, ఈజిప్ట్‌ లాంటి దేశాల్లో ‘‘ప్రధానమైన పార్టీ విధానంతో కూడిన ఉద్యోగ విధానం’ అమల్లో ఉంది.

* ఇటీవలి కాలంలో సివిల్‌ సర్వీసుల్లో మానవ వనరుల అభివృద్ధి (Human Resource Development), మానవ వనరుల నిర్వహణ (Human Resource Management) అనే భావనలు బాగా ప్రాచుర్యం పొందాయి.

బ్రిటన్‌ సివిల్‌ సర్వీసులు

* బెంథామ్‌ అనే రాజనీతిజ్ఞుడు సివిల్‌ సర్వీసుల భర్తీ, జీతాల చెల్లింపు, సర్వీసు నిబంధనలు ఎలా ఉండాలో వివరించారు. 

* సివిల్‌ సర్వీసుల భర్తీకి లిఖిత పరీక్ష (Written exam)తో పాటు మౌఖిక పరీక్ష (Oral test) కూడా ఉండాలని తొలిసారి పేర్కొన్నది ఈయనే.

* లార్డ్‌ మెకాలేను ఆధునిక బ్రిటిష్‌ సివిల్‌ సర్వీసుల పితామహుడిగా పేర్కొంటారు.

* 1813లో ఇంగ్లండ్‌లో భారతీయ సివిల్‌ సర్వీస్‌కి ఎంపికైన అధికారులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో ‘హెయిలీబరీ స్కూల్‌’ను స్థాపించారు.

* 1854లో భారతీయ సివిల్‌ సర్వీసుల భర్తీ విధానాన్ని సిఫార్సు చేసేందుకు ఒక కమిటీని నియమించారు. దీనికి మెకాలే ఛైర్మన్‌గా ఉన్నారు. ఈయన బహిరంగ పోటీ, మెరిట్‌ విధానం ఉండాలని పేర్కొన్నారు.

* 1854లో నార్త్‌కోట్‌ ట్రెవిలియన్‌ కమిటీ సిఫార్సుల మేరకు భారత్‌లో సివిల్‌ సర్వీసులు మొదలయ్యాయి.

* 1855లో స్థాపించిన సివిల్‌ సర్వీస్‌ కమిషన్‌ మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ విధానం ఉండాలని సిఫార్సు చేసింది.

* 1870లో గ్లాడ్‌స్టన్‌ సిఫార్సుతో భర్తీ విధానంలో మెరిట్‌ పద్ధతి మొదలైంది.

* 1944లో ఆషెటన్‌ కమిటీ నివేదిక ఆధారంగా బ్రిటన్‌లో సివిల్‌ సర్వీసుల శిక్షణ ప్రారంభమైంది.

నమూనా ప్రశ్నలు

1. గ్లాడెన్‌ అనే పాలనా తత్వవేత్త ఏ గ్రంథంలో సివిల్‌ సర్వీసుల గురించి వివరించారు?

1) The Civil Service: Its Problems and Future

2) The History of Civil Services

3) Civil Services and Service Matters

4) Chronical Civil Services 

2. ఆధునిక సివిల్‌ సర్వీసుల తొలిరూపం ఏ దేశంలో ప్రారంభమైంది?

1) ప్రష్యా    2) గ్రీస్‌  

3) బ్రెజిల్‌   4) కోస్టారికా

3. ఫ్రెంచ్‌ సివిల్‌ సర్వీసులకు సంబంధించి కిందివాటిలో సరైంది?

1) ఇక్కడి సివిల్‌ సర్వీసులు చాలా శక్తిమంతమైనవి.

2) సివిల్‌ సర్వెంట్లకు రాజకీయ హక్కులు ఉన్నాయి.

3) సివిల్‌ సర్వెంట్లు రాజకీయ పార్టీల సభ్యత్వాన్ని పొందొచ్చు.

4) పైవన్నీ 

4. సివిల్‌ సర్వీసుల భర్తీకి లిఖిత పరీక్షతో పాటు, మౌఖిక పరీక్ష కూడా ఉండాలని మొదటగా పేర్కొంది ఎవరు?

1) గిల్‌క్రైస్ట్‌    2) బెంథామ్‌  

3) సీలే        4) డబ్ల్యూ.హెచ్‌.గార్నల్‌ 

5. ఆధునిక బ్రిటిష్‌ సివిల్‌ సర్వీసుల పితామహుడిగా ఎవర్ని పేర్కొంటారు?

1) మెకాలే      2) కారన్‌వాలీస్‌  

3) బెంథామ్‌    4) జాన్‌లాక్‌

6. భారతీయ సివిల్‌ సర్వీస్‌కి ఎంపికైన అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు దేన్ని నెలకొల్పారు?

1) మెకాలే ట్రైనింగ్‌ సెంటర్‌

2) గ్లాడ్‌స్టన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌

3) హెయిలీబరీ స్కూల్‌

4) లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌

7. ఏ కమిటీ సిఫార్సుల మేరకు భారత్‌లో సివిల్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి?

1) నార్త్‌కోట్‌ ట్రెవిలియన్‌ కమిటీ

2) థామస్‌ రాలీగ్‌ కమిటీ3్శ ఆషెటన్‌ కమిటీ    

4) కారన్‌వాలీస్‌ కమిటీ

సమాధానాలు: 1-1  2-1  3-4  4-2 5-1 6-3 7-1.


రచయిత: బంగారు సత్యనారాయణ, విషయ నిపుణులు 

Posted Date : 21-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌