• facebook
  • whatsapp
  • telegram

ఢిల్లీ సుల్తానులు బానిస వంశం - ఇల్‌టుట్‌మిష్‌

ఇల్‌టుట్‌మిష్‌ క్రీ.శ.1211 నుంచి క్రీ.శ.1236 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు టర్కీ జాతీయుడు. ఇల్బారి తెగకు చెందినవాడు.

* ఇల్‌టుట్‌మిష్‌ సోదరులు అతడ్ని కుతుబుద్దీన్‌ ఐబక్‌కు బానిసగా అమ్మేశారు. కుతుబుద్దీన్‌ను మెప్పించిన ఇల్‌టుట్‌మిష్‌ అనతికాలంలోనే గ్వాలియర్, బులంద్‌ షహర్‌లకు గవర్నర్‌ అయ్యాడు. అంతేకాక తన యజమాని కుమార్తెను వివాహం చేసుకున్నాడు.

* ఇల్‌టుట్‌మిష్‌ ఢిల్లీ సుల్తాన్‌ అయ్యాక ఆరాంషా మద్దతుదారులు ఇతడిపై కక్ష కట్టారు. సరిహద్దుల్లో శత్రువుల దాడులు ఎక్కువయ్యాయి. 

* బెంగాల్‌ పాలకుడు అలీమర్దీఖాన్‌ తనకు తాను స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. నసీరుద్దీన్‌ కబచా సింధును ఆక్రమించాడు. గజనీ పాలకుడు తాజుద్దీన్‌ యాల్దజ్‌ ఢిల్లీ ఆక్రమణకు ప్రయత్నాలు చేశాడు. రాజపుత్ర పాలకులైన చందేలులు, పార్థియన్లు, చౌహాన్లు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. ఈ సమయంలోనే మంగోలులు భారతదేశంపై దాడులు ప్రారంభించారు.


రక్‌ఉద్దీన్‌ ఫిరోజ్‌షా 

ఇల్‌టుట్‌మిష్‌ మరణించాక అతడి పెద్ద కొడుకైన రక్‌ఉద్దీన్‌ ఫిరోజ్‌షా క్రీ.శ.1236లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడికి పాలనపై ఆసక్తి లేదు. అతడి తల్లి షాతుర్కన్‌ పాలనా వ్యవహారాలు చూసుకునేది. ఈమె మహాక్రూరురాలు. అధికారాన్నంతా తన చేతిలో ఉంచుకుని ఇష్టానుసారం రాజ్యాన్ని పాలించింది. దీంతో ప్రజలు తిరుగుబాటు చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఇల్‌టుట్‌మిష్‌ కుమార్తె రజియా సుల్తానా ఢిల్లీ సుల్తాన్‌ అయ్యింది.

రజియా సుల్తానా (క్రీ.శ.1236-1240) 

ఈమె భారతదేశాన్ని పరిపాలించిన తొలి మహిళా పాలకురాలు. రజియా సుల్తానా తన పాలనను సుస్థిరం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. మొదటగా వజీర్‌ జునైద్‌ని పదవి నుంచి తొలగించింది. 

* ఆ సమయంలో సుల్తాన్‌కు పాలనలో సహాయం చేసేందుకు ఒక వర్గం ఉండేది. ఇందులో 40 మంది మతపెద్దలు ఉండేవారు. దాన్ని చిహల్‌గని కూటమి అంటారు. ఈ కూటమి రజియా సుల్తానాను రాణిగా గుర్తించలేదు. 

 చిహల్‌గని కూటమి ప్రాబల్యం తగ్గించేందుకు ఆమె తురుష్కేతరులను ఉన్నత పదవుల్లో నియమించింది. 

* తనకు నమ్మకస్తుడైన జమాలుద్దీన్‌ యాకుబ్‌ను అశ్వదళాధిపతి (అమీర్‌-ఇ-అఖాత్‌)గా నియమించింది. ఇతడు అబిసీనియాకి చెందిన నీగ్రో జాతీయుడు.


ఇఖ్తియారుద్దీన్‌ అల్తూనియా:

రజియా సుల్తానాకు వ్యతిరేకంగా భటిండా పాలకుడు ఇఖ్తియారుద్దీన్‌ అల్తూనియా తిరుగుబాటు చేశాడు. దీన్ని రజియా అణచలేకపోయింది. ఈ యుద్ధంలో యాకుబ్‌ మరణించగా, రజియా బందీగా చిక్కింది.  

* అల్తూనియా రజియా సుల్తానాను వివాహం చేసుకుని, ఇల్‌టుట్‌మిష్‌ మూడో కుమారుడైన మొయినుద్దీన్‌ బెర్హాంను ఢిల్లీ సింహాసనంపై కూర్చోపెట్టాడు.

* మొయినుద్దీన్‌ రాజయ్యాక అల్తూనియాకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ కారణంగా అల్తూనియా, రజియా సుల్తానాలు మొయినుద్దీన్‌పై దండెత్తారు. 

* మొయినుద్దీన్‌ సైన్యం వారిని ఓడించగా, తిరిగి భటిండాకు వెళ్లిపోయారు. 

* క్రీ.శ. 1240లో వీరిద్దరినీ తియావాల్‌ వద్ద దొంగలు హతమార్చారు. 


రజియా సుల్తానా పాలనా విధానం: 

రజియాకు ధైర్యసాహసాలు ఎక్కువ. ఈమె కొంతకాలమే రాజ్యపాలన చేసినప్పటికీ, ఢిల్లీ సుల్తాన్‌ల ఖ్యాతిని ఇనుమడింపజేసింది. 

* రజియా సుల్తానా గొప్ప రాణి. తెలివైన స్త్రీ, విద్యావంతులను పోషించి, న్యాయంగా పాలించింది. కేవలం స్త్రీ అనే కారణంగా ఈమెను పాలనలో కొనసాగనివ్వలేదు. 

* రాజుకు ఉండాల్సిన అన్ని అర్హతలు రజియాకు ఉన్నాయని ‘మినాజ్‌ ఉస్‌ సిరాజ్‌’ లాంటి చరిత్రకారులు వ్యాఖ్యానించారు. 

* ఈమె పురుషవేషం ధరించి యుద్ధాల్లో పాల్గొనేది. 

* రజియా తరువాత 1204-66 మధ్య బహరాంషా, మసూద్‌ షా, నసీరుద్దీన్‌ మహమ్మద్‌ ఢిల్లీని పాలించారు. బహరాంషా కాలంలో ‘మంగూ’ నాయకత్వంలో మంగోలులు దండెత్తారు. నసీరుద్దీన్‌ ‘మివాటీలు’ అనే దారిదోపిడీ దొంగలను అణచివేశాడు.


విజయాలు

మొదటగా ఆరాంషా అనుచరులను అణచి ఢిల్లీ, ఔద్, బదాయన్, బెనారస్‌లో తన అధికారాన్ని స్థిరం చేసుకున్నాడు.

‘ గజనీ పాలకుడు తాజుద్దీన్‌ యాల్దజ్‌ ఢిల్లీని ఆక్రమించాలని దండయాత్ర చేశాడు. వీరిద్దరి మధ్య క్రీ.శ.1125లో తెరైన్‌ వద్ద యుద్ధం జరిగింది. ఇందులో యాల్దజ్‌ను ఇల్‌టుట్‌మిష్‌ ఓడించి, వధించాడు.

మంగోలులతో యుద్ధం: మంగోలులు మధ్య ఆసియాకి చెందిన ఆటవిక తెగవారు. వీరి నాయకుడు చెంఘిజ్‌ ఖాన్‌. ఇతడికి క్రూరుడు, నాశనం చేసేవాడు అనే పేరుంది. వీరు చైనా, మధ్య ఆసియా, పశ్చిమాసియాలపై దండెత్తి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అక్కడి నుంచి వారు క్వారజాన్‌వైపు ప్రయాణించి, దాన్ని నాశనం చేశారు.

* ఆ సమయంలో క్వారజాన్‌ను అల్లాఉద్దీన్‌ మహమ్మద్‌ పాలిస్తున్నాడు. అతడి కుమారుడైన జలాలుద్దీన్‌ మంగబారిని ఢిల్లీ వెళ్లి ఇల్‌టుట్‌మిష్‌ సాయం కోరాడు. 

* జలాలుద్దీన్‌కి ఆశ్రయం ఇస్తే మంగోలుల వల్ల తనకు ప్రమాదం ఏర్పడుతుందని భావించిన ఇల్‌టుట్‌మిష్‌ అందుకు నిరాకరించాడు.

* దీంతో మంగబారిని సింధు చేరుకుని నసీరుద్దీన్‌ కబచా ఆశ్రయం పొందాడు. మంగోలులు జలాలుద్దీన్‌ కోసం సింధుపై దాడి చేయాలనుకున్నా అది సాధ్యం కాలేదు. దానికి కారణం ఆ ప్రాంతంలో ఉన్న తీవ్రమైన వేడి గాలులు. 

* మంగోలులు వెళ్లిపోయాక జలాలుద్దీన్‌ నసీరుద్దీన్‌ కబాచాపై దాడి చేసి, సింధును ఆక్రమించాడు.

* మంగోలులు భారత్‌పైకి రాకుండా ఇల్‌టుట్‌మిష్‌ తెలివిగా వ్యవహరించాడు.


సింధు ఆక్రమణ: ఇల్‌టుట్‌మిష్‌ సింధుపై దాడి చేసి జలాలుద్దీన్‌ మంగబారిని ఓడించాడు. తర్వాత సింధు, ముల్తాన్‌లను ఢిల్లీలో కలుపుకున్నాడు.

బెంగాల్‌పై దండయాత్ర: అలీమర్దీఖాన్‌ మరణించాక హిసాయుద్దీన్‌ ఐవాజ్‌ ఖిల్జీ బెంగాల్‌ పాలకుడయ్యాడు.

* బెంగాల్‌ను తన అధీనంలోకి తెచ్చుకునేందుకు ఇల్‌టుట్‌మిష్‌ తన కుమారుడైన నసీరుద్దీన్‌ మహమ్మద్‌ను పంపాడు. ఈ యుద్ధంలో ఇవాజ్‌ మరణించాడు.

* ఇవాజ్‌ వారసుడైన బల్కా ఖిల్జీ ఇల్‌టుట్‌మిష్‌పై తిరుగుబాటు చేయగా, దాన్ని అతడు అణచివేశాడు. దీంతో  బెంగాల్, బిహార్‌ రాజ్యాలు ఢిల్లీ సుల్తాన్‌ల పాలన కిందకు వచ్చాయి.

రాజపుత్రులతో యుద్ధం: చందేలులు కలంజర్‌లో; పార్థియన్లు గ్వాలియర్, ఝాన్సీలో; చౌహాన్లు జలోర్, అజ్మీర్, భీమ్మల్లలో స్వతంత్రంగా పాలించుకుంటున్నారు. 

* రాజపుత్రులపై దృష్టిసారించిన ఇల్‌టుట్‌మిష్‌ మొదట రణ్‌తంబోర్, మండవార్లను ఆక్రమించాడు. తర్వాత గ్వాలియర్‌తో మొదలుపెట్టి మాళ్వా వరకు దాడులు కొనసాగించాడు. అయితే ఇవన్నీ విఫలం అయ్యాయి. 

* ఇతడు గుజరాత్‌లోని చాళుక్యులను, బుండిలోని చౌహాన్లను, కలంజర్‌లోని చందేలులను ఓడించలేకపోయాడు.

* బనియాన్‌కు చెందిన రాజపుత్రులను అణచివేసే ప్రయత్నంలో ఇల్‌టుట్‌మిష్‌ క్రీ.శ. 1236లో మరణించాడు.


ఇల్‌టుట్‌మిష్‌ పాలన - ఇతర విశేషాలు

ఢిల్లీ రాజ్యాధికారాన్ని సుస్థిరం చేయడంలో ఇల్‌టుట్‌మిష్‌ దాదాపు విజయం సాధించాడని చరిత్రకారులు పేర్కొన్నారు.

కుతుబుద్దీన్‌ ప్రారంభించిన కుతుబ్‌ మినార్‌ నిర్మాణాన్ని ఇతడు పూర్తి చేశాడు. కుతుబ్‌ మినార్‌కి దక్షిణంగా హౌజ్‌-ఐ-షంసీ రిజర్వాయర్‌ను తవ్వించాడు.

తన తెలివితేటలతో మంగోలుల దండయాత్రల నుంచి ఢిల్లీ రాజ్యాన్ని కాపాడాడు. 

ఇల్‌టుట్‌మిష్‌ అధికారాన్ని గుర్తించిన ఖలీఫా, ఇతడికి ‘విశ్వాసపాత్రుడైన సైనికాధికారి’ అని బిరుదు ఇచ్చాడు. ఇతడికి ‘నసీర్‌ అమీర్‌ ఉల్‌ మొమ్మిన్‌’ (విశ్వసనీయుడైన ఉపనాయకుడు) అనే బిరుదు కూడా ఉంది.

చరిత్రకారులు ఇతడ్ని ఢిల్లీ సుల్తానత్‌ నిజమైన స్థాపకుడిగా పేర్కొన్నారు.

రాజ్యాన్ని ‘ఇక్తాలు’గా (సైనిక రాష్ట్రాలుగా) విభజించాడు. వాటికి ‘ముక్తి’లు అనే పాలకులను నియమించాడు. 

టంకా (వెండి నాణెం), జిటాల్‌ (రాగి నాణెం) అనే నాణేలను విడుదల చేశాడు. వాటిపై ఖలీఫా పేరును అరబ్బీ భాషలో ముద్రించాడు. 

ఇతడు ధర్మగంటను నెలకొల్పి పాలన చేశాడని ‘ఇబన్‌ బటూటా’ పేర్కొన్నాడు. 

ఉజ్జయినిలోని సుప్రసిద్ధ మహంకాళీ దేవాలయాన్ని నేలమట్టం చేశాడు. 

ఇల్‌టుట్‌మిష్‌ సమాధి న్యూదిల్లీలోని మెహ్రౌలీ ఉంది.


కుతుబుద్దీన్‌ మరణం నాటి పరిస్థితులు

కుతుబుద్దీన్‌ ఐబక్‌కు కొడుకులు లేరని అటా-మాలిక్‌-జువ్యని తన గ్రంథం ‘తారిఖ్‌-ఐ-జహంగ్‌షే’లో పేర్కొన్నాడు. 

* కుతుబుద్దీన్‌ మరణించాక ఆరాంషా సుల్తాన్‌ అయ్యాడు. దీనికి వ్యతిరేకంగా ముల్తాన్‌ గవర్నర్‌ నసీరుద్దీన్‌ కబచా తిరుగుబాటు చేశాడు. మిలటరీ న్యాయమూర్తి (అమీర్‌-ఐ-డడ్‌) అలీ-ఇస్మాయిల్‌ ఇల్‌టుట్‌మిష్‌ను సింహాసనం అధిష్టించాల్సిందిగా కోరాడు. 

* ఇలాంటి పరిస్థితుల్లో ఇల్‌టుట్‌మిష్‌ కొంతమంది సైన్యంతో ఢిల్లీపైకి దండెత్తాడు. బాగ్‌-ఐ-జడ్‌ వద్ద ఆరాంషాను ఓడించి, వధించాడు. దీంతో ఇల్‌టుట్‌మిష్‌ అధికారానికి తిరుగులేకుండా పోయింది. కుతుబుద్దీన్‌కి అల్లుడు కావడం, ఇతడికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లను సమర్థవంతంగా అణచివేయడం లాంటి కారణాల వల్ల ఇల్‌టుట్‌మిష్‌ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించగలిగాడు. ఇతడు కూడా బానిస జీవితం నుంచి ఢిల్లీ సుల్తాన్‌ అయ్యాడు.

Posted Date : 28-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌