• facebook
  • whatsapp
  • telegram

రవాణా సౌకర్యాలు

వర్గీకరణ


మన దేశంలో రవాణా సౌకర్యాలను 4 రకాలుగా వర్గీకరించారు. అవి:


1. రోడ్డు రవాణా (ఎక్కువ వినియోగిస్తారు.) 


2. రైలు రవాణా (దీని ద్వారా అత్యధికంగా ఆదాయం లభిస్తుంది.)


3. వాయు రవాణా (అత్యంత వేగమైన, ఖర్చుతో కూడుకున్నది)


4. జల రవాణా (నెమ్మది, స్వల్ప ఖర్చుతో కూడుకున్నది)

రోడ్డు రవాణా (Road Transport)


* రోడ్డు మార్గాలను మానవ శరీరంలో రక్తాన్ని తీసుకెళ్లే సిరల్లాంటివని పేర్కొంటారు. 


* ఇవి దేశ రవాణాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. రైలు, జల, వాయు మార్గాలకు రోడ్డు మార్గాలు అనుసంధానంగా ఉంటాయి.


* నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ కమిటీ ప్రకారం రోడ్ల ద్వారా 90% ప్రయాణికులు, 69% సరకు రవాణా జరుగుతోంది.

రోడ్డు రవాణా ప్రణాళికలు


జయకర్‌ కమిటీ (1927): ఈ కమిటీ రహదారుల అభివృద్ధికి ఒక నిధిని ఏర్పాటు చేయాలని సూచించింది. దీని ప్రకారం, 1929లో కేంద్ర రహదారుల నిధిని ఏర్పాటు చేశారు.


నాగ్‌పుర్‌ ప్లాన్‌ (1943): భారతదేశంలో రోడ్లను జాతీయ, రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారులు అని 4 రకాలుగా విభజించారు.


* రోడ్ల సాంద్రతను 100 చ.కి.మీ.కు 16 కి.మీ.లుగా నిర్దేశించారు. ఇది మొట్టమొదటి ప్రణాళికాబద్ధమైన రోడ్ల అభివృద్ధి పథకం.

లఖ్‌నవూ ప్రణాళిక (1984): 20 సంవత్సరాల  కాలానికి రోడ్ల అభివృద్ధి కోసం ఈ ప్రణాళికను రూపొందించారు. ఇందులో రోడ్లను 5 రకాలుగా వర్గీకరించారు. అవి: జాతీయ, రాష్ట్ర, జిల్లా, గ్రామీణ, సరిహద్దు రోడ్లు.


* రహదారుల సాంద్రతను 82 కి.మీ./ 100 చ.కి.మీ.లకు పెంచారు.


* కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ట్రాన్స్‌పోర్ట్‌ రిసెర్చ్‌ వింగ్‌ 2019 లో విడుదల చేసిన నివేదిక ప్రకారం రహదారులు ఎక్కువగా ఉన్న మొదటి మూడు రాష్ట్రాలు:


* జాతీయ రహదారులు: మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌


* రాష్ట్ర రహదారులు: మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌

* జిల్లా రహదారులు: మహారాష్ట్ర, పశ్చిమ్‌ బంగా, కేరళ


* పట్టణ రహదారులు: పశ్చిమ్‌ బంగా, ఉత్తర్‌ ప్రదేశ్, కర్ణాటక


* గ్రామీణ రహదారులు: మహారాష్ట్ర, అసోం, ఉత్తర్‌ ప్రదేశ్‌


* దేశంలో అన్నిరకాల రహదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు: మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్, కర్ణాటక.


* ప్రపంచంలో అత్యధిక జాతీయ రహదారులు ఉన్న దేశం ఆస్ట్రేలియా. రెండో స్థానంలో భారత్‌ ఉంది.

జాతీయ రహదారులు 


* దేశంలోని ప్రధాన నగరాలు, రాష్ట్ర రాజధానులు, ముఖ్య పారిశ్రామిక పట్టణాలను కలిపే రోడ్లను జాతీయ రహదారులు అంటారు. వీటిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.


* కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదిక 202021 ప్రకారం, ప్రస్తుతం దేశంలోని జాతీయ రహదారుల పొడవు 1,36,440 కి.మీ. ఇవి మొత్తం రహదారుల్లో 2.13%, మొత్తం రవాణాలో 40 శాతంగా ఉన్నాయి.


* జాతీయ రహదారుల నిర్మాణం, వాటి పర్యవేక్షణ, రిపేరింగ్‌ పనులను కేంద్ర ప్రభుత్వ విభాగమైన CPWD (Central Public Works Department) చేపడుతుంది. 


* National Highways Authority Of India - NHAI నివేదిక ప్రకారం 2021, మార్చి నాటికి దేశంలో జాతీయ రహదారుల పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు: మహారాష్ట్ర (17,930 కి.మీ.), ఉత్తర్‌ ప్రదేశ్‌ (11,831 కి.మీ.), రాజస్థాన్‌ (10,350 కి.మీ).


* జాతీయ రహదారుల పొడవు తక్కువగా ఉన్న రాష్ట్రాలు: గోవా (299 కి.మీ.), సిక్కిం (709 కి.మీ.), త్రిపుర (854 కి.మీ.)


* జాతీయ రహదారుల పొడవు ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు: జమ్మూ-కశ్మీర్, అండమాన్‌ నికోబార్‌ దీవులు.


* జాతీయ రహదారులు తక్కువ పొడవులో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు: చండీగఢ్, పుదుచ్చేరి.


* లక్షదీవుల్లో జాతీయ రహదారులు లేవు.


నేషనల్‌ హైవేస్‌ అథారిటీ అఫ్‌ ఇండియా (NHAI): పార్లమెంట్‌లో చేసిన NHAI Act. ప్రకారం దీన్ని 1988లో ఏర్పాటు చేశారు.


* దీని విధులు 1995 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది. జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణ దీని బాధ్యతలు.


నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NHIDCL): కేంద్ర కేబినెట్‌ అనుమతితో 2014లో ఏర్పాటైంది.దేశ సరిహద్దులు, ఈశాన్య రాష్ట్రాల్లోని జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.


సరిహద్దు రహదారుల అభివృద్ధి సంస్థ (BRDO): దీన్ని 1960, మే 7న ఏర్పాటు చేశారు. దేశ సరిహద్దులు, ఈశాన్య భారత దేశంలో రోడ్లు నిర్మించడం దీని ప్రధాన విధి.


* ఇది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ 20 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో క్రియాశీలంగా పని చేస్తోంది. ఈ సంస్థ మొదట మనాలి నుంచి లేహ్‌ మధ్య ఒక రహదారిని నిర్మించింది. దీని పొడవు 5328 కి.మీ.


* BRDO, ప్రాజెక్ట్‌ హిమాంక్‌ సంయుక్తంగా 1985లో లద్దాఖ్‌ ప్రాంతంలో 6400 కి.మీ. ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తయిన రోడ్డును నిర్మించాయి. దీని పొడవు 86 కి.మీ. ఇది ఉమ్‌బింగ్‌ లా కనుమ వద్ద ఉండే చిస్‌ములే, డెమ్‌చక్‌ గ్రామాల మధ్య ఉంది.

రాష్ట్ర రహదారులు 


రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలు, జిల్లా కేంద్రాలను కలిపే రహదారులు. వీటి నిర్మాణ, నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.


* 2020 - 21 కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక ప్రకారం, దేశంలో సుమారు 1,86,528 కి.మీ. రాష్ట్ర రహదారులు ఉన్నాయి. 

జిల్లా రహదారులు 

జిల్లాలోని ముఖ్య పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలు, యాత్రా స్థలాలను కలిపే రహదారులు. వీటిని ప్రధాన జిల్లా, ఇతర/ పొరుగు జిల్లా రహదారులుగా విభజించారు.

* ఈ రకమైన రహదారులు మహారాష్ట్ర, పశ్చిమ్‌ బంగా, కేరళలో ఎక్కువగా ఉన్నాయి. 

గ్రామీణ రహదారులు 

దేశంలోని మొత్తం రహదారుల్లో వీటి వాటా 70%. వీటిని గ్రామ పంచాయతీలు నిర్వహిస్తాయి. ఈ రకమైన రోడ్లు ఎక్కువగా మహారాష్ట్ర, అసోం, ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఉన్నాయి.


ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన (PMGSY): దీన్ని 2000, డిసెంబరు 25న వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రారంభించింది. రోడ్డు సదుపాయం లేని గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం దీన్ని ఉద్దేశించారు. 500 జనాభా ఉన్న మైదాన గ్రామాలు, 250 జనాభా కలిగిన కొండ/ గిరిజన/ ఎడారి ప్రాంతాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం లక్ష్యం 133 కి.మీ. మేర గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టడం, 2019 నాటికి 65 వేల గ్రామాలను రోడ్లతో అనుసంధానించడం. దీని పరిధిలోకి జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులు రావు. ఈ కార్యక్రమ అమలు బాధ్యత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సంబంధించింది.


పట్టణ రహదారులు 

* ఇవి దేశంలోని పట్టణ అభివృద్ధి విభాగం అధీనంలో ఉంటాయి. మొత్తం పొడవు 5,44,683 కి.మీ. పట్టణ రహదారులు ఎక్కువగా పశ్చిమ్‌ బంగాలో ఉన్నాయి.


నేషనల్‌ హైవే డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (NHDP) 1998

  అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో ‘నిర్మించు, నిర్వహించు, బదిలీచెయ్‌ (Build - Operate - Transfer - BOT) ఆధారంగా ప్రైవేట్‌ యాజమాన్యం టోల్‌ ఫీ ప్రాతిపదికన రోడ్లు నిర్మించారు. ఎన్‌హెచ్‌డీపీ కార్యక్రమంలో మొత్తం 7 దశలు ఉన్నాయి. వీటిలో మొదటి రెండు దశలు ముఖ్యమైనవి.


మొదటి దశ: దీనిలో భాగంగా స్వర్ణ చతుర్భుజి పథకం (Golden Quadrilateral) అమలు చేశారు. దీన్ని వాజ్‌పేయీ హయాంలో 2001లో ప్రారంభించగా, 2012 నాటికి పూర్తయ్యింది.


స్వర్ణ చతుర్భుజి ముఖ్య ఉద్దేశం: దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి లాంటి మెట్రోపొలిస్‌ నగరాలను 4/6 లైన్ల రోడ్ల ద్వారా అనుసంధానించడం. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా దీన్ని నిర్వహిస్తుంది.

  స్వర్ణ చతుర్బుజి మొత్తం దూరం 5846 కి.మీ. దీనిలో ఎక్కువ పొడవున్న భాగం కోల్‌కతా - చెన్నై మధ్య ఉంది. ఈ పథకంతో 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం (దిల్లీ) అనుసంధానమై ఉన్నాయి. ఈ పథకంలో అత్యధిక దూరం 4/6 లైన్ల రోడ్లు ఆంధ్రప్రదేశ్‌లో (1014 కి.మీ.) ఉన్నాయి.

రెండో దశ: ఇందులో రెండు కీలకమైన పథకాలు ఉన్నాయి. అవి:

ఉత్తర, దక్షిణ కారిడార్‌ (North - South Corridor):  ఇందులో శ్రీనగర్, కొచ్చి, సేలం, కన్యాకుమారిలను కలుపుతూ 4000 కి.మీ. దూరాన్ని 4/6 వరుసలుగా విస్తరిస్తారు. అంటే విబీ 44ను విస్తరిస్తారు.

తూర్పు పడమర కారిడార్‌ (East - West Corridor): అసోంలోని సిల్చేర్‌ను గుజరాత్‌ పోరుబందర్‌తో కలుపుతారు. దీని పొడవు 3300 కి.మీ.

* ఈ రెండు కారిడార్లు ఝాన్సీ పట్టణం వద్ద కలుస్తాయి.

ముఖ్యమైన జాతీయ రహదారులు

రచయిత

పి.కె. వీరాంజనేయులు

విషయ నిపుణులు 

Posted Date : 17-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌