• facebook
  • whatsapp
  • telegram

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)

* 1793లో లార్డ్ కారన్ వాలీస్ మన దేశంలో పబ్లిక్ సర్వీసులను పునర్ వ్యవస్థీకరించారు.
* 1853లో సర్వీసు నియామకాల్లో నామినేషన్ విధానాన్ని తొలగించి, మెరిట్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
* లార్డ్ మెకాలే నివేదిక ఆధారంగా మొదటిసారిగా భారతదేశంలో అఖిల భారత సర్వీసుల్లో భాగంగా ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్) ను ప్రవేశపెట్టారు.
* ఉద్యోగస్వామ్యానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లను బ్రిటన్ నుంచి గ్రహించారు.
* పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగుల ఎంపిక పద్ధతిని ప్రవేశపెట్టిన మొదటి దేశం చైనా.
* 1772లో వారన్ హేస్టింగ్స్ భారత్‌లో కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.
* మన దేశంలో మేధోసంపత్తికి సంరక్షకులుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లను పేర్కొంటారు.
* 1919 నాటికి మాంటేగ్ చేమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం సిఫార్సుల మేరకు 1923లో ఏర్పడిన లీ కమిషన్ తన సిఫార్సులను 1924లో సమర్పించింది. అప్పటికే మన దేశంలో ఉన్న 9 అఖిల భారత సర్వీసుల్లో నాలుగింటిని వెంటనే రద్దు చేయాలని పేర్కొంది.
* లీ కమిషన్ సిఫార్సుల మేరకు 1926లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లను కూడా ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.
* ఈ చట్టం ద్వారానే ఐసీఎస్, ఐపీఎస్, ఐఎంఎస్ లాంటి అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
* స్వాతంత్య్రానంతరం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా ఏర్పాటు చేశారు.
* యూపీఎస్సీ తొలి ఛైర్మన్ హెచ్.కె. కృపలానీ.
* మన దేశంలో అఖిల భారత సర్వీసుల పితామహుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను పేర్కొంటారు.
* 1947లో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లు; 1966లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అఖిల భారత సర్వీసులుగా ఏర్పడ్డాయి.
* ఐఏఎస్‌లను ఉద్యోగ బృంద మంత్రిత్వ శాఖ, ఐపీఎస్‌లను హోం మంత్రిత్వ శాఖ, ఐఎఫ్ఎస్‌లను పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నాయి.
* 1947, ఏప్రిల్ 21న న్యూదిల్లీలోని మెట్‌కాఫ్ హౌస్‌లో భారత తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తొలి సివిల్ సర్వీసుల ప్రొబేషనరీ బ్యాచ్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.
* 2006 నుంచి ఏటా ఏప్రిల్ 21న సివిల్ సర్వీసుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
* సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబరు 31ని రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ సమైక్యతా దినం - నేషనల్ యూనిటీ డే) గా నిర్వహిస్తున్నారు.
* అఖిల భారత సర్వీస్ ప్రొబేషనర్లకు, ఇతర సర్వీసు ప్రొబేషనర్లకు శిక్షణ ఇవ్వడానికి 1959లో నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్‌ను ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా ముస్సోరిలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీన్ని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని పిలుస్తున్నారు.
* ఐపీఎస్ ప్రొబేషనర్లకు వృత్తిపరమైన శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ని నెలకొల్పారు.
* భారత రాజ్యాంగంలోని 14వ భాగంలో 308 నుంచి 323 వరకు ఉన్న ఆర్టికల్స్‌లో అఖిల భారత సర్వీసులు; యూనియన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి వివరించారు.

ఆర్టికల్ 315 : యూనియన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు
 

ఆర్టికల్ 315(1): కేంద్ర ప్రభుత్వానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటాయి.
 

ఆర్టికల్ 315(2): రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా ఒకే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే దానికి అనుగుణంగా పార్లమెంటు ఒక శాసనం ద్వారా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయవచ్చు.
 

ఆర్టికల్ 315(3): పార్లమెంటు శాసనం ద్వారా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పుడు ఆ శాసనంలోనే దానికి సంబంధించిన అనుబంధ అంశాలను కూడా పొందుపరచాలి.
 

ఆర్టికల్ 315 (4): ఏదైనా ఒక రాష్ట్ర గవర్నర్ కోరితే రాష్ట్రపతి అనుమతితో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ రాష్ట్రానికి సంబంధిత సేవలను అందించవచ్చు.
 

ఆర్టికల్ 315(5): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావనలు వచ్చినా అవి కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు వర్తిస్తాయి.
 

ఆర్టికల్ 316: సభ్యుల నియామకం, పదవీ కాలం
 

ఆర్టికల్ 316 (1): యూనియన్ పబ్లిక్ కమిషన్ ఛైర్మన్, సభ్యులను; జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.
 

* ప్రస్తుతం యూపీఎస్సీలో ఒక ఛైర్మన్, 10 మంది సభ్యులు ఉన్నారు.
* రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు.

ఆర్టికల్ 316 (2): యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. దీనిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.
* రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు. దీనిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.

ఆర్టికల్ 316 (3): పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా ఒకసారి పనిచేసినవారు తిరిగి అదే పదవిలో నియమితులయ్యే అవకాశం లేదు.
 

ఆర్టికల్ 317: పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల తొలగింపు, సస్పెన్షన్
 

ఆర్టికల్ 317 (1): యూపీఎస్సీ, జేపీఎస్సీ, ఎస్‌పీఎస్సీల ఛైర్మన్, సభ్యుల దుష్ప్రవర్తన కారణంగా వారిపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్రపతి సుప్రీంకోర్టును కోరవచ్చు.
 

ఆర్టికల్ 317(2): సుప్రీంకోర్టు నివేదిక అందే లోపు యూపీఎస్సీ, జేపీఎస్సీల ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చు.
 

* రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులను గవర్నర్ సస్పెండ్ చేయవచ్చు.

ఆర్టికల్ 317(3): యూపీఎస్సీ, జేపీఎస్సీ, ఎస్‌పీఎస్సీల ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి తొలగించవచ్చు.
* రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులను గవర్నర్ సస్పెండ్ చేయగలరు. రాష్ట్రపతి మాత్రమే వారిని తొలగించగలరు.

ఆర్టికల్ 318: యూపీఎస్సీ, జేపీఎస్సీల సభ్యుల సంఖ్యను, వారి ఉద్యోగ నిబంధనలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు.
* రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల సంఖ్యను, వారి ఉద్యోగ నిబంధనలను గవర్నర్ నిర్ణయిస్తారు.

ఆర్టికల్ 319: యూపీఎస్సీ ఛైర్మన్ పదవీ విరమణ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టకూడదు.
* రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ పదవీ విరమణ అనంతరం యూపీఎస్సీ ఛైర్మన్‌గా లేదా యూపీఎస్సీ సభ్యుడిగా లేదా వేరొక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమించవచ్చు. ఇతర ప్రభుత్వ ఉద్యోగం చేపట్టకూడదు.
* యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మినహా ఇతర సభ్యులు పదవీ విరమణ అనంతరం యూపీఎస్సీ, ఎస్‌పీఎస్సీల ఛైర్మన్‌గా నియమించవచ్చు. కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేపట్టకూడదు.

ఆర్టికల్ 320 (1): కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగ నియామకాల కోసం పరీక్షలను నిర్వహించడం యూపీఎస్సీ బాధ్యత. అందుకే యూపీఎస్సీని దేశంలో మెరిట్‌ను పరిరక్షించే కాపలాదారుడిగా పేర్కొంటారు.
* రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల ఉద్యోగ నియామకాల కోసం పరీక్షలను నిర్వహించడం ఎస్‌పీఎస్సీల బాధ్యత.

ఆర్టికల్ 320 (2): ఏవైనా ఉమ్మడి సర్వీసులకు ప్రత్యేక అర్హతలున్న అభ్యర్థుల నియామకం అవసరమని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు భావించినట్లయితే వాటి అభ్యర్థన మేరకు ఉమ్మడి నియామకాలకు అవసరమైన నిబంధనలను యూపీఎస్సీ రూపొందిస్తుంది.
 

ఆర్టికల్ 320 (3): అఖిల భారత సర్వీసులు లేదా రాష్ట్ర సర్వీసుల ఉద్యోగుల ఇంక్రిమెంట్ లేదా పదోన్నతిని నిలిపివేయడం, ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయికి పంపివేయడం, పదవీ విరమణకు ఆదేశించడం, ఉద్యోగం నుంచి తొలగించడం లాంటి క్రమశిక్షణ చర్యలపై సూచనలు, సలహాల కోసం కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీని, రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌పీఎస్సీని సంప్రదించాలి.
 

ఆర్టికల్ 320 (4): ఆర్టికల్ 16(4)లో పేర్కొన్న రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను అమలు చేయాల్సి వచ్చినప్పుడు లేదా ఆర్టికల్ 335లో పేర్కొన్న నిబంధనలను అమలు చేయాల్సి వచ్చినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్సీ, ఎస్‌పీఎస్సీలను సంప్రదించాల్సిన అవసరం లేదు.
 

ఆర్టికల్ 320(5): రాష్ట్రపతి యూపీఎస్సీకి సంబంధించి, గవర్నర్ ఎస్‌పీఎస్సీకి సంబంధించి జారీ చేసే ఏవైనా ఉత్తర్వులు 14 రోజుల్లో పార్లమెంటు లేదా సంబంధిత రాష్ట్ర శాసనసభల్లో ప్రవేశపెట్టి అదే సమావేశాల్లో ఆమోదించాలి.
 

ఆర్టికల్ 321: యూపీఎస్సీ లేదా ఎస్‌పీఎస్సీ విధులను విస్తరింపచేస్తూ పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు శాసనాలను రూపొందించవచ్చు.
 

ఆర్టికల్ 322: యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల, ఇతర ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, కార్యాలయ ఖర్చులు మొదలైన చెల్లింపులన్నీ కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
 

* ఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల, ఇతర ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, కార్యాలయ ఖర్చులు మొదలైన చెల్లింపులన్నీ రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

ఆర్టికల్ 323 (1): ఒక వార్షిక సంవత్సరంలో కమిషన్ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలతో కూడిన ఒక వార్షిక నివేదికను ప్రతి సంవత్సరం యూపీఎస్సీ రాష్ట్రపతికి పంపుతుంది.
 

ఆర్టికల్ 323 (2): రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వార్షిక నివేదికను రాష్ట్ర గవర్నర్‌కు సమర్పిస్తుంది.
 

సివిల్ సర్వీసుల సంస్కరణలు - వివిధ కమిటీల సిఫారసులు
  దేశంలో సివిల్ సర్వీసుల నియామకానికి సంబంధించి 1854లో మొదటిసారిగా లార్డ్ మెకాలే అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ బహిరంగ పోటీ పరీక్ష, స్కోలాస్టిక్ స్వభావ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించింది.
 

కొఠారి కమిటీ:
  1974లో సివిల్ సర్వీసెస్ నియామకానికి సంబంధించి అధ్యయనం చేయడానికి యూపీఎస్సీ డి.ఎస్. కొఠారి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 1976లో తన నివేదికను సమర్పించింది. ఈ కమిటీ సిఫార్సులు 1979 నుంచి అమల్లోకి వచ్చాయి.

 

ముఖ్య సిఫార్సులు:
* ఆలిండియా, సెంట్రల్ సర్వీసులకు ఒకే పరీక్ష ఉండాలి.
* రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లోనూ మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలి.
* ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే మెయిన్స్ పరీక్షలకు అనుమతించాలి.

సతీష్ చంద్ర కమిటీ:
* 1988లో సివిల్ సర్వీసులపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం సతీష్ చంద్ర అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను 1989లో సమర్పించింది. ఈ సిఫార్సులు 1993 నుంచి అమల్లోకి వచ్చాయి.

ముఖ్య సిఫార్సులు: 
* ఇంటర్య్వూ మార్కులను 250 నుంచి 300 మార్కులకు పెంచాలి.
* సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షల్లో వ్యాస సంబంధ (ఎస్సే) పేపర్‌ను 200 మార్కులకు ప్రవేశపెట్టాలి.

వై.కె. అలఘ్ కమిటీ:
* సివిల్ సర్వీసులపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో వై.కె. అలఘ్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను 2001లో సమర్పించింది.
ముఖ్యమైన సిఫార్సు: సివిల్ సర్వీసుల్లో సమర్థతను పెంచడానికి పరీక్షల నిర్వహణలో సమూలమైన మార్పులను చేపట్టాలి.

పి.సి. హోతా కమిటీ:
  సివిల్ సర్వీసులపై అధ్యయనం కోసం 2004లో పి.సి. హోతా అధ్యక్షతన ఏర్పడిన కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ, సివిల్ సర్వీస్ ఉద్యోగుల్లో అవినీతిని, అలసత్వాన్ని తగ్గించడానికి కీలకమైన సిఫార్సులను చేసింది.

 

ముఖ్యమైన సిఫార్సులు
* సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక చేసే అభ్యర్థుల వయోపరిమితిని 21 - 30 నుంచి 21 - 24 సంవత్సరాలకు తగ్గించాలి.
* సివిల్ సర్వెంట్‌గా పని చేయలేడనుకున్న ట్రైయినీని తొలగించే అధికారం ట్రైనింగ్ అకాడమీల డైరెక్టర్లకు ఉండాలి.
* సివిల్ సర్వెంట్స్ పనితీరును ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి సమీక్షించి, నిర్ణీత ప్రమాణాల మేరకు పని చేయనివారిని రిటైర్‌మెంట్ బెనిఫిట్‌లతో ఇంటికి పంపాలి.
* రిటైర్ అయిన తర్వాత సివిల్ సర్వెంట్లు కనీసం 2 సంవత్సరాల పాటు రాజకీయాల్లో చేరకుండా ఉండేలా చట్టం చేయాలి.

నిగవేకర్ కమిటీ
* సివిల్ సర్వీసులపై అధ్యయనం కోసం 2012లో యూజీసీ మాజీ ఛైర్మన్ అయిన ప్రొఫెసర్ అరుణ్ నిగవేకర్ అధ్యక్షతన ఒక కమిటీని యూపీఎస్సీ నియమించింది.

ముఖ్యాంశాలు
* సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షా విధానాన్ని సంస్కరించాలని 2012, ఆగస్టు 30న తన నివేదికను యూపీఎస్సీకి సమర్పించింది.
* ఈ కమిటీ నివేదిక ఆధారంగా 2013 నుంచి మెయిన్స్ పరీక్షా విధానంలో సంస్కరణలను అమలుచేయాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
అరవింద్ వర్మ కమిటీ:
* సివిల్ సర్వీసుల ప్రిలిమ్స్ పరీక్ష 'సీ - శాట్' గ్రామీణ నేపథ్యం కలిగిన వారికి కఠినంగా మారిందని, అందులోని అంశాలు సంక్లిష్టంగా ఉంటున్నాయని వివిధ వర్గాల అభ్యర్థులు ఆందోళన చేశారు. వారి విజ్ఞప్తుల పరిశీలనకు భారత ప్రభుత్వం 2014లో అరవింద్ వర్మ కమిటీ ని ఏర్పాటు చేసింది.


యూపీఎస్సీ ద్వారా జరిపే నియామకాలు
1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
2. ఇండియన్ ఫారిన్ సర్వీస్
3. ఇండియన్ పోలీస్ సర్వీస్
4. ఇండియన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, గ్రూప్ ఎ
5. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ఎ
6. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్), గ్రూప్ ఎ
7. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ఎ
8. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐటీ), గ్రూప్ ఎ
9. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీస్, గ్రూప్ ఎ
10. ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్ ఎ
11. ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ఎ
12. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, గ్రూప్ ఎ
13. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ఎ
14. ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, గ్రూప్ ఎ
15. అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గ్రూప్ ఎ
16. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్ ఎ
17. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (జూనియర్ గ్రేడ్), గ్రూప్ ఎ
18. ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్ ఎ, గ్రేడ్ 3
19. ఇండియర్ కార్పొరేట్ లా సర్వీస్, గ్రూప్ ఎ
20. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీసెస్, గ్రూప్ బి
21. దిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలి సివిల్ సర్వీస్ గ్రూప్ బి
22. దిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలి పోలీస్ సర్వీస్, గ్రూప్ బి
23. పాండిచ్చేరి సివిల్ సర్వీసెస్, గ్రూప్ బి
24. పాండిచ్చేరి పోలీస్ సర్వీసెస్, గ్రూప్ బి
* ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది.
* ఐసీఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్. 1947లో దీన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్‌గా మార్చారు.
* ఎస్.కె. ఖన్నా కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వ అనుమతితో యూపీఎస్సీ 2011లో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షా విధానాన్ని మార్పు చేసింది.
* అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవడం, అత్యుత్తమ విధానాలను పంచుకోవడం కోసం యూపీఎస్సీ 2010లో సార్క్ దేశాల పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల ఛైర్మన్ల సమావేశాన్ని నిర్వహించింది.
* భారత ప్రభుత్వం 2007, మే 1న యూపీఎస్సీ ఛైర్మన్ స్థాయిని ప్రధాన ఎన్నికల కమిషనర్ స్థాయికి సమానంగా, యూపీఎస్సీ సభ్యుల స్థాయిని ఎన్నికల కమిషనర్ స్థాయికి సమానంగా పెంచింది. దీనికి అనుగుణంగా అధికార హోదాల క్రమంలో మార్పులు చేశారు.

యూపీఎస్సీ ఛైర్మన్లు

ఛైర్మన్ పేరు పదవీ కాలం
1. హెచ్.కె.కృపలానీ 1947 − 1949
2. ఆర్.ఎస్.బెనర్జీ 1949 − 1955
3. ఎస్.గోవింద రాజన్ 1955 − 1955
4. వి.ఎస్.హెజ్‌మాది 1955 − 1961
5. వి.ఎన్.ఝా 1961 − 1967
6. ఆర్.కె.దాంబ్లే 1967 − 1971
7. ఆర్.సి.ఎస్.సర్కార్ 1971 − 1973
8. ఎ.ఆర్.కిద్వాయ్ 1973 − 1979
9. ఎం.ఎల్.సహారే 1979 − 1985
10. హెచ్.ఎల్.కపూర్ 1985 − 1990
11. జె.పి.గుప్తా 1990 − 1992
12. శ్రీమతి ఆర్.ఎం.బాత్సూ 1992 − 1996
13. ఎస్.జె.ఎస్.చత్వాల్ 1996 − 1996
14. జె.ఎం.ఖురేషి 1996 − 1998
15. జనరల్ సురేంద్రనాథ్ 1998 − 2002
16. పి.సి.హోతా 2002 − 2003
17. మాతా ప్రసాద్ 2003 − 2005
18. ఎస్.ఆర్.హాసిం 2005 − 2006
19. గురుబచన్ జగత్ 2006 − 2007
20. సుబీర్ దత్తా 2007 − 2008
21. డి.పి.అగర్వాల్ 2008 − 2014
22. రజనీ రజ్ధాన్ 2014 − 2014
23. దీపక్ గుప్తా 2014 − 2016
24. అల్కా శిరోహి 2016 − 2017
25. ప్రొ.డేవిడ్‌ ఆర్‌ స్యిమ్‌లెహ్ 2017 − 2018
26. అరవింద్‌ సక్సేనా 2018 - 2020
27. ప్ర‌దీప్‌కుమార్ జోషి 2020 -  ప్ర‌స్తుతం
Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌