• facebook
  • whatsapp
  • telegram

పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు

పౌర సేవలకు ప్రత్యేక వ్యవస్థలు!

  పట్టణాల్లో స్థానిక సమస్యల పరిష్కారానికి, పౌరులకు అవసరమైన సేవలను అందించడానికి, సదుపాయాలను కల్పించడానికి ప్రత్యేక స్వపరి పాలనా సంస్థలు ఉన్నాయి. అవి సమర్థ పాలనతో సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహిస్తాయి. తద్వారా దేశాభివృద్ధికి దోహదపడతాయి. రాజ్యాంగ హోదాను కలిగి, ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేస్తున్న ఆ పట్టణ స్థానిక పరిపాలన సంస్థల గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 


  భారతదేశంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతోంది. పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న పౌరులకు పౌర సదుపాయాలను కల్పించేందుకు మున్సిపల్‌ వ్యవస్థలు కృషి చేస్తున్నాయి. వీటికి పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో 74వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా రాజ్యాంగ హోదా కల్పించారు. దేశంలో మూడంచెల పట్టణ స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టారు.


నగర పంచాయతీ: ఒక గ్రామం పట్టణంగా అభివృద్ధి చెందుతుంటే, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నగర పంచాయతీగా ఏర్పాటు చేస్తుంది. అక్కడ జనాభా 20 వేల నుంచి 40 వేల వరకు ఉంటుంది. జనసాంద్రత ప్రతి చ.కి.మీ.కు 400పైన నమోదవుతుంది. నివసిస్తున్న వారిలో 75% పైగా పురుషులు వ్యవసాయేతర పనులు చేస్తుంటారు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నగర పంచాయతీని పరిపాలన సౌలభ్యం కోసం వార్డులుగా విభజిస్తారు. ఆ వార్డు సభ్యులను ఓటర్లు  ప్రత్యక్ష పద్ధతిలో రహస్య ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారు. వార్డు సభ్యుల్లో ఎన్నికైనవారు పదిమంది, నామినేటెడ్‌ ముగ్గురు ఉంటారు.


* వార్డు సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. నగర పంచాయతీకి రాజకీయ అధిపతిగా, ప్రథమ పౌరుడిగా అధ్యక్షుడు వ్యవహరిస్తారు. ఈ అధ్యక్ష, ఉపాధ్యక్షులను అవిశ్వాస తీర్మానం ద్వారా వార్డు సభ్యులు తొలగించవచ్చు.


* స్థానిక లోక్‌సభ సభ్యుడు (ఎంపీ), శాసనసభ్యుడు (ఎమ్మెల్యే), నగర పంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉన్న రాజ్య సభ సభ్యుడు (ఎంపీ), శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) నగర పంచాయతీ సమావేశాలకు హోదా రీత్యా సభ్యులుగా హాజరవుతారు. ఇక్కడి పరిపాలన కమిటీల ద్వారా జరుగుతుంది.


కార్యనిర్వహణాధికారి: నగర పంచాయతీ పాలనలో అధ్యక్షుడికి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉద్యోగి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఉంటారు. తీర్మానాల అమలు, బడ్జెట్‌ రూపకల్పనలో ఈ అధికారి కీలకపాత్ర పోషిస్తారు.


పురపాలక సంఘం: నగర పాలక సంస్థ (మున్సిపల్‌ కార్పొరేషన్‌)కు దిగువన, నగర పంచాయతీకి ఎగువన ఏర్పాటయ్యే పట్టణ స్థానిక సంస్థే పురపాలక సంఘం (మున్సిపాలిటీ). దీని పరిధిలో జనాభా 40 వేలకుపైన, 3 లక్షల్లోపు ఉంటుంది. మున్సిపాలిటీని పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులుగా విభజిస్తారు. ఆ వార్డుల నుంచి ఓటర్లు రహస్య ఓటింగ్‌తో కౌన్సిలర్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. మైనార్టీ వర్గానికి చెందిన ఒకరిని కో-ఆప్టెడ్‌ సభ్యుడిగా నామినేట్‌ చేస్తారు. కౌన్సిలర్లు తమలో నుంచి ఒకరిని పురపాలక సంఘానికి ఛైర్మన్‌గా, మరొకరిని వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. అవసరమైనప్పుడు ఆ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌లను అవిశ్వాస తీర్మానం ద్వారా కౌన్సిలర్లు తొలగించవచ్చు. 


* పురపాలక సంస్థలను వాటి వార్షికాదాయం ఆధారంగా అయిదు రకాలుగా వర్గీకరించారు. 1) గ్రేడ్‌ - 3 మున్సిపాలిటీ రూ.2 కోట్ల లోపు 2) గ్రేడ్‌ - 2 మున్సిపాలిటీ కోట్ల నుంచి రూ.4 కోట్లు 3) గ్రేడ్‌ - 1 మున్సిపాలిటీ రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్లు 4) స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్లు 5) సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ రూ.8 కోట్ల పైన.


* ‘ఆంధ్రప్రదేశ్‌ పురపాలక సంఘాల చట్టం 1965’ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఏపీలో పురపాలక సంఘాలు 77 ఉన్నాయి. 


* ‘తెలంగాణ పురపాలక సంస్థల చట్టం 2019’ ప్రకారం  తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు (పురపాలక సంస్థలు) కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని పురపాలక సంఘాలు 128.


పురపాలక సంస్థ ఛైర్మన్‌:  ఈ ఛైర్మన్‌ మున్సిపాలిటీకి రాజకీయ అధిపతిగా, ప్రథమ పౌరుడిగా వ్యవహరిస్తారు. సమావేశాలకు, కొన్ని స్థాయీ సంఘాలకు అధ్యక్షత వహిస్తారు.


మున్సిపల్‌ కమిషనర్‌: రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉద్యోగి. పురపాలక సంస్థ చేసిన తీర్మానాలను అమలు చేస్తారు. రికార్డులు నిర్వహిస్తారు. సిబ్బంది, ఆస్తులపై కమిషనర్‌కి పర్యవేక్షణాధికారం ఉంటుంది.


నగర పాలక సంస్థ: రాష్ట్రంలోని పెద్ద పట్టణాలను నగరపాలక సంస్థలు (మున్సిపల్‌ కార్పొరేషన్‌లు)గా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చట్టం చేయవచ్చు. జనాభా 3 లక్షల కంటే ఎక్కువ ఉండే నగరాలను ‘మున్సిపల్‌ కార్పొరేషన్‌’గా ప్రకటిస్తారు. మన దేశంలో మొదటి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను 1687లో మద్రాసులో ఏర్పాటు చేశారు.


* హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1950 ప్రకారం, 1950లో హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాలు వేర్వేరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లుగా మారాయి.హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1955 ప్రకారం 1960, ఆగస్టు 3న హైదరాబాద్, సికింద్రాబాద్‌ కార్పొరేషన్లను విలీనం చేసి ఒకే మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. 


* ప్రస్తుతం తెలంగాణలో 13, ఆంధ్రప్రదేశ్‌లో 16 మున్సిపల్‌ కార్పొరేషన్‌లు ఉన్నాయి. 


* పరిపాలనా సౌలభ్యం కోసం నగర పాలక సంస్థను డివిజన్లుగా విభజిస్తారు. వాటిలోని ఓటర్లు రహస్య ఓటింగ్‌ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో కార్పొరేటర్లను ఎన్నుకుంటారు. 


* మైనార్టీ వర్గాలకు చెందిన ఇద్దరిని ‘కో-ఆప్టెడ్‌’ సభ్యులుగా నామినేట్‌ చేస్తారు. 


మేయర్, డిప్యూటీ మేయర్‌: కార్పొరేటర్లు తమలో ఒకరిని మేయర్‌గా, మరొకరిని డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకుంటారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రాజకీయ అధిపతిగా, ప్రథమ పౌరుడిగా మేయర్‌ వ్యవహరిస్తారు, సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.


మున్సిపల్‌ కార్పొరేషన్‌-కమిషనర్‌: సీనియర్‌ ఐఏఎస్‌ క్యాడర్‌ వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం ఈ పదవిలో నియమిస్తుంది. నగరపాలక సంస్థకు పరిపాలనాపరమైన అధిపతిగా కమిషనర్‌ వ్యవహరిస్తారు.కార్పొరేషన్‌ సమావేశాల అజెండాను రూపొందిస్తారు. తీర్మానాల అమలుకు కృషి చేస్తారు.


* పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం అయిదేళ్లు.


స్థాయీ సంఘాలు (స్టాండింగ్‌ కమిటీలు): పట్టణ స్థానిక సంస్థలకు స్థాయీ సంఘాలను ‘కళ్లు, చెవులు, చేతులు’గా పేర్కొంటారు. వీటిలో సంబంధిత సంస్థల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సభ్యులుగా ఉంటారు. ఇవి వార్షిక బడ్జెట్‌ రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తాయి. అధికారుల నుంచి అవసరమైన సమాచారాన్ని, రికార్డులను పొందుతాయి. 


స్థాయీ సంఘాలు - రకాలు: పురపాలక సంస్థలు పరిపాలనను సమర్థంగా నిర్వహించడానికి 6 రకాల స్థాయీ సంఘాలు సహకరిస్తాయి. * ఆర్థిక అంశాల స్థాయీ సంఘం * విద్యకు సంబంధించిన స్థాయీ సంఘం * వైద్య ఆరోగ్య స్థాయీ సంఘం * మహిళా సంక్షేమ స్థాయీ సంఘం * వెనుకబడిన వర్గాల సంక్షేమ స్థాయీ సంఘం * పన్నుల


స్థాయీ సంఘం


కంటోన్మెంట్‌ బోర్డు: సైనిక స్థావరాలున్న ప్రాంతాల్లో ప్రజలకు పౌర సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ బోర్డులను ఏర్పాటుచేస్తారు. వీటికి సంబంధించిన చట్టాలను పార్లమెంటు రూపొందిస్తుంది. మన దేశంలో ఆంగ్లేయుల పాలనా కాలంలో 1924లో ‘కంటోన్మెంట్‌ బోర్డ్‌ యాక్ట్‌’ను తొలిసారిగా చేశారు. ఈ చట్టాన్ని 2006లో సవరించారు. ప్రస్తుతం మనదేశంలోని కంటోన్మెంట్‌ బోర్డుల సంఖ్య 62. వీటిలో ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్‌ సభ్యులు ఉంటారు. ఏడుగురు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటారు. సంబంధిత ప్రాంత మిలిటరీ కమాండింగ్‌ ఆఫీసర్‌ ఈ బోర్డుకు హోదా రీత్యా అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. కార్యనిర్వాహక అధికారిని రాష్ట్రపతి నియమిస్తారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లో కంటోన్మెంట్‌ బోర్డు ఉంది.


నోటిఫైడ్‌ ఏరియా కమిటీలు: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, మున్సిపల్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడానికి అనువైన పరిస్థితులు లేని చోట ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా నోటిఫైడ్‌ ఏరియా కమిటీలను ఏర్పాటు చేస్తుంది. దీనిలోని సభ్యులందరినీ నామినేట్‌ చేస్తుంది. ఎన్నికైన సభ్యులు ఉండరు. ఇవి చట్టబద్ధమైన సంస్థలు కావు.


టౌన్‌ ఏరియా కమిటీలు: చిన్న చిన్న పట్టణాల్లో ప్రజలకు పౌర సదుపాయాలను కల్పించడానికి రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ‘టౌన్‌ ఏరియా కమిటీ’లను ఏర్పాటు చేస్తారు. ఇవి ‘సెమీ మున్సిపల్‌ అథారిటీ’ పద్ధతిలో ఉంటాయి. వీటిలో పూర్తిగా ఎన్నికైన లేదా నామినేట్‌ చేసిన లేదా కొంతమంది ఎన్నికైన లేదా నామినేట్‌ అయిన సభ్యులుంటారు. ఇవి చట్టబద్ధమైన సంస్థలు.


పోర్ట్‌ ట్రస్టు: నౌకాశ్రయాల పరిరక్షణ, నిర్వహణతోపాటు అందులోని ఉద్యోగులు, కార్మికులకు పౌరసదుపాయాలు కల్పించడానికి చట్టం ద్వారా పోర్టు ట్రస్టులను పార్లమెంటు  ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఎన్నికైన, నామినేటెడ్‌ సభ్యులు ఉంటారు. వీటికి ఛైర్మన్లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. మేజర్‌ పోర్ట్‌ చట్టం-2021 ప్రకారం ప్రస్తుతం మన దేశంలో 13 పోర్ట్‌ ట్రస్టులు ఉన్నాయి.


ప్రత్యేక ప్రయోజన సంస్థలు: పట్టణాల్లో బహుళ ప్రయోజనాల కోసం వివిధ అంశాలపై రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ప్రభుత్వం ఇలాంటి ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేస్తుంది. ఇవి స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో కలిసి పనిచేస్తాయి. ఒక్కోసారి స్వతంత్రంగానూ విధులు నిర్వహిస్తాయి. వీటి అధిపతులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.


ఉదా: పట్టణాభివృద్ధి సంస్థలు, హౌసింగ్‌ బోర్డులు, ఎలక్ట్రికల్‌ సప్లయ్‌ బోర్డులు.


రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 29-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌