• facebook
  • whatsapp
  • telegram

విజయనగర సామ్రాజ్యం (సంగమ వంశం)

తుంగభద్ర తీరంలో రాయల రాజ్యం!


కాకతీయ సామ్రాజ్య శిథిలాలపై విజయనగర రాజ్యం ఆవిర్భవించింది. వరుస విజయాలతో, విస్తరణలతో దక్షిణాన మహోన్నత చరిత్రను సృష్టించింది. ముసిం పాలకులను జయించి, ఇస్లాం మత వ్యాప్తిని అడ్డుకుంది. హైందవ సంస్కృతి, సంప్రదాయాలు, ద్రవిడ భాషలు, కళలను పరిరక్షించింది. మూడు శతాబ్దాలపాటు నాలుగు వంశాల పాలనలో  తుంగభద్ర తీరంలో రాయల రాజ్యం వర్ధిల్లింది. మొదట అధికారంలోకి వచ్చిన సంగం వంశ పాలకులు అనేక యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని దక్షిణంలో రెండు సముద్రాల మధ్య విస్తరించారు. రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆధునిక యుద్ధ తంత్రాలను అనుసరించారు ఈ అంశాలను పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 


దక్షిణ భారతంలోనే కాకుండా, దేశం మొత్తం మీద ఒక నూతన శకానికి విజయనగర సామ్రాజ్యం నాంది పలికింది. 14వ శతాబ్దం ప్రారంభంలో ఆవిర్భవించిన ఈ సామ్రాజ్యం దక్షిణాదిన ఇస్లాం మతవ్యాప్తిని అరికట్టి, హిందూమతాన్ని, హిందూ సంస్కృతిని కాపాడింది. దక్షిణ దేశ రాజకీయాల్లో, సాంఘిక, ఆర్థిక, మత, సాహిత్య, కళల్లో శాశ్వతమైన ముద్ర వేసింది. తెలుగు, కన్నడం, సంస్కృత భాషలను పోషించింది. విజయనగర సామ్రాజ్యం అనేక కళలకు కేంద్రంగా విరాజిల్లింది. చాలామంది విదేశీయులు ఈ సామ్రాజ్యాన్ని సందర్శించారు. ప్రధానంగా 4 రాజ్యవంశాలు సుమారు 300 ఏళ్ల పాటు పరిపాలించాయి. శాసన, లిఖిత ఆధారాలు (స్వదేశీ, విదేశీ) ఆ వివరాలను అందిస్తున్నాయి.


శాసన ఆధారాలు:

నెల్లూరి శాసనాలు - మొదటి హరిహర రాయలు. ఈ శాసనం మొదటి హరిహరరాయలను రాజుగా పేర్కొంది.

బిట్రగుంట శాసనం - మొదటి బుక్కరాయలు

మోటుపల్లి శాసనం - మొదటి దేవరాయలు

తిరుమల తిరుపతి శాసనాలు - విజయనగరంలోని అన్ని వంశాల రాజులు

హంపీ శాసనం - శ్రీకృష్ణదేవరాయలు

కొండవీడు, మంగళగరి శాసనాలు - శ్రీకృష్ణదేవరాయలు

విలపాకం శాసనం - రెండో వేంకటపతిరాయలు


గ్రంథాలు (లిఖిత ఆధారాలు):

విద్యారణ్యస్వామి కాలజ్ఞానం - విద్యారణ్యస్వామి

మధుర విజయం - గంగాదేవి *సాళువాభ్యుదయం - రాజనాథ డిండిముడు

జైమినీ భారతం - పిల్లలమర్రి పినవీరభద్రుడు  

ఆముక్తమాల్యద - శ్రీకృష్ణదేవరాయలు

వసుచరిత్ర - రామరాజ భూషణుడు

రామవాచకం - స్థానపతి

రాజశేఖర చరితం - మాదయగారి మల్లన

విస్తృత విజయనగర చరిత్ర - రాబర్ట్‌ సీవెల్‌

సోషల్‌ - అండ్‌ - పొలిటికల్‌ లైఫ్‌ ఇన్‌ ది విజయనగర - బి.ఎన్‌.సెలటోర్‌

విదేశీ యాత్రికులైన ఇబన్‌ బటూటా, అబ్దుల్‌ రజాక్, న్యూనిజ్, డోమింగో ఫెయిజ్, బార్బోసా లాంటి వారి రచనలు.

1805లో విజయనగర సామ్రాజ్య అవశేషాలు బయటకు తీసింది - కల్నల్‌ కొలెన్‌ మెకంజీ



విజయనగర రాజుల జాతి పట్ల భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ సామ్రాజ్య స్థాపకులైన హరిహర,  బుక్కరాయ సోదరులు ఆంధ్రులన్న సిద్ధాంతాన్ని నేలటూరి వెంకటరమణ, నీలకంఠశాస్త్రి, ఆర్‌.సుబ్రమణ్యం, రంగాచారి, రాబర్ట్‌ సీవెల్‌ లాంటివారు బలపరిచారు. అయితే హరిహర, బుక్కరాయ సోదరులు కన్నడిగులనే సిద్ధాంతాన్ని ఫాదర్‌ హీరాఫ్, శ్రీకృష్ణస్వామి అయ్యంగార్, వాయిస్‌రైస్‌ మొదలైనవారు బలపరిచారు. హరిహర, బుక్కరాయలు తొలుత కాకతీయ ప్రతాపరుద్రుడి ఆస్థాన ఉద్యోగులు. ఓరుగల్లు రాజ్యం పతనం తర్వాత 1323లో వీరు కంపిల దేవుని ఆశ్రయం పొందారు. 1328లో ఢిల్లీ సుల్తాను కంపిలను ఆక్రమించినప్పుడు రాయల సోదరులు బందీలుగా చిక్కారు. వీరిని ఢిల్లీ సుల్తాను దక్షిణ భారతదేశంలో చెలరేగిన తిరుగుబాటును అణచివేయడానికి పంపాడు. ఈ ఇద్దరు సోదరులు విద్యారణ్యస్వామి ప్రేరణతో 1336లో తుంగభద్ర ఒడ్డున విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. దీన్ని కర్ణాటక సామ్రాజ్యం అని కూడా అంటారు. దీని రాజధాని విజయనగరం. అంటే విజయాల నగరం. ఇదే నేటి ‘హంపి’. విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలు పరిపాలించాయి.


సంగమ వంశం (1336-1485): ఈ వంశ స్థాపకులైన హరిహర రాయలు, బుక్కరాయలు ‘సంగము’ని కుమారులు. అందుకే ఈ వంశానికి ‘సంగమ వంశం’ అని పేరొచ్చింది. ఇందులో తొలి రాజు మొదటి హరిహరరాయలు.


మొదటి హరిహర రాయలు (1336 - 1356): ఇతడి గురించి తెలుసుకోవడానికి భాగపల్లి శాసనం ఉపయోగపడుతుంది. 1336, ఏప్రిల్‌ 18న విరూపాక్ష దేవుడి సన్నిధిలో మొదటి హరిహర రాయలు పట్టాభిషేకం జరిగింది. ఇతడికి నలుగురు సోదరులు. కంపరాయలు, బుక్కరాయలు, మారప్ప, ముర్దప్ప. రాజ్య స్థాపనలో, విస్తరణలో ఇతడికి బుక్కరాయలు సహాయపడ్డాడు. హరిహరరాయల బిరుదు ‘పూర్వ పశ్చిమ సముద్రాధిపతి’. 1339 నాటికి హరిహరరాయల రాజ్యం తూర్పున బంగాళాఖాతం నుంచి పడమర అరేబియా సముద్రం వరకు వ్యాపించింది. ఈ విషయాన్ని ‘అటకల గుండు’ శాసనం తెలియజేస్తోంది. బాదామి శాసనం ప్రకారం ఇతడి రాజ్యం 1340 నాటికి బాదామి వరకు వ్యాపించింది. 1343లో ఉదయగిరి దుర్గం ఆక్రమణ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుందని నేలటూరి వెంకటరమణ పేర్కొన్నారు. హరిహర రాయలు 1346లో ‘హోయసాల’ రాజ్యాన్ని జయించి విజయనగరంలో విలీనం చేశాడు. ఆనాటి హోయసాల రాజైన నాలుగో భల్లాలుడు, బనవాసి ప్రాంతానికి పారిపోయాడు.1347లో గుల్బర్గా కేంద్రంగా బహమనీ సామ్రాజ్యాన్ని అల్లావుద్దీన్‌ హసన్‌గంగూ స్థాపించాడు. రాయచూర్‌ అంతర్వేది కోసం బహమనీ, విజయనగర రాజులకు యుద్ధం ప్రారంభమైంది. హసన్‌గంగూ సేనాని ముబారక్‌ ఖాన్‌ విజయనగరంపై దండెత్తి రాయచూర్‌ వరకు ఆక్రమించాడు.


హరిహరుడి సోదరుడు మారప్ప 1347లో కదంబుల రాజ్యమైన బనవాసిపై దాడి చేసి ఆక్రమించాడు. దీనికి కారణం హోయసాల రాజు నాలుగో భల్లాలుడికి కదంబులు ఆశ్రయం ఇవ్వడమే. హరిహరరాయల కాలంలోనే  తొండై మండల రాజు అయిన సాంబవరాయుడిని రక్షించడానికి మధురైని కూడా ఆక్రమించారు. 1352లో మధురైపై దాడి చేసింది కంపరాయల కుమారుడు ‘సావణ్ణ’, బుక్కరాయల కొడుకు ‘కుమార కంపన’. హరిహరరాయలు సోదరుల సహాయంతో రాజ్య విస్తరణ చేశాడు. ఇతడి మంత్రుల్లో సుప్రసిద్ధుడు అనంతరసు. అతడి బిరుదు ‘చిక్క ఉదయుడు’.


మొదటి బుక్కరాయలు (1356-1377): హరిహరరాయలకు కుమారులు లేరు. దీంతో అతడి రెండో తమ్ముడు బుక్కరాయలు రాజు అయ్యాడు. రాజ్య విస్తరణలో మొదటి నుంచి హరిహరరాయలకు సహాయపడ్డాడు. ఇతడి బిరుదులు ‘వైదికమార్గ ప్రవక్త’, ‘వేదమార్గ ప్రతిస్థాపక’, ‘ఆధునిక మనువు’. ఇతడి పరిపాలన గురించి చెన్నరాయపట్నం శాసనం వివరిస్తుంది. రాజధాని విజయనగరం నిర్మాణాన్ని పూర్తిచేశాడు. హరిహరరాయల మరణానంతరం విజయనగర సింహాసనానికి విధేయుడైన సాంబవరాయలు తిరుగుబాటు చేశాడు. అతడిని శిక్షించేందుకు బుక్కరాయల కుమారుడు కంపన వెళ్లాడు. ఈ క్రమంలో బహమనీ సామ్రాజ్యంపై దాడి చేసి మహ్మద్‌ షాను ఓడించి సంధి చేసుకున్నాడు. ఈ సంధితో ఇరురాజ్యల సరిహద్దు కృష్ణానది అయ్యింది. 1364లో రెడ్డిరాజు అయిన అనవోతారెడ్డిని బుక్కరాయలును ఓడించి అహోబిలం, వినుకొండ ప్రాంతాలను ఆక్రమించాడు. 1371లో కుమార కంపన, గోపన దండ నాయకుడు, సాళువ మంగురాజు మధురపై దాడి చేసి మధుర సుల్తాన్‌లను వధించారు. ఈ సమయంలో పరాక్రమం చూపిన సాళువ మంగుకు ‘పరపక్షిసాళువ’ అనే బిరుదు ఇచ్చారు. కుమార కంపన మధురైకి పాలకుడయ్యాడు. 1374లో అకాల మరణం చెందాడు. బుక్కరాయలు చైనాకు రాయబారిని పంపినట్లు చైనాను పరిపాలించిన మింగ్‌ వంశ చరిత్ర తెలియజేస్తుంది. బుక్కరాయల ప్రధాని అనంతరాయలు. ప్రముఖ కవి నాచన సోముడు బుక్కరాయల ఆస్థానంలో ఉండేవారు. బుక్కరాయలు 1377లో మరణించారు.



రెండో హరిహర రాయలు (1377-1404): ఇతడి బిరుదులు రాజవ్యాస్, రాజపరమేశ్వర, రాజవాల్మీకి, రాజాధిరాజా. బుక్కరాయల తర్వాత రాజ్యానికి వచ్చాడు. 27 ఏళ్లు రాజ్యపాలన చేశాడు. దాయాదులను, తిరుగుబాటుదారులను తొలగించి కుమారులను, అత్యంత విశ్వాసపాత్రులైన మంత్రులను, దండనాథులను వివిధ ప్రాంతాలకు పాలకులుగా నియమించాడు. వెలమ, బహమనీ రాజ్యాల మధ్య ఉన్న మైత్రిని విచ్ఛిన్నం చేశాడు. శ్రీశైలాన్ని ఆక్రమించే సమయంలో కాటమ వేమారెడ్డి చేతిలో ఓడిపోయాడు. సంధి చేసుకుని వేమారెడ్డి కుమారుడికి కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. కుమారగిరిరెడ్డి చివరికాలంలో జరిగిన అంతర్యుద్ధాలను ఆసరాగా తీసుకుని మోటుపల్లి దుర్గం ఆక్రమించాడు. రెండో హరిహర రాయలు మంత్రి మాధవుడు గోవాను ఆక్రమించాడు. కుమారుడు విరూపాక్షరాయలు సింహళ ద్వీపాన్ని ఆక్రమించి, అక్కడి నుంచి కప్పం వసూలు చేశాడు. ఈ కాలంలోనే రెండో బుక్కరాయలు బహమనీ సుల్తాన్‌ ఫిరోజ్‌షాపైకి రెండుసార్లు దండెత్తి పానగల్లు అనే ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాడు.


రెండో బుక్కరాయలు (1404-1406): రెండో హరిహరరాయలు మరణం తర్వాత విజయనగర చరిత్రలో మొదటి వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. యువరాజుగా ఉన్న బుక్కరాయలను కాదని విరూపాక్షరాయలు సింహాసనం ఆక్రమించాడు. తర్వాత రెండో బుక్కరాయలు సింహాసనాన్ని అధిష్టించి రెండేళ్లు పాలించాడు. 


మొదటి దేవరాయలు (1406-1422): ఇతడి పాలన అంతా యుద్ధాలతో గడిచిపోయింది. సింహాసనాన్ని అధిష్టించిన వెంçనే బహమనీ సుల్తాన్‌ ఫిరోజ్‌ షా దండయాత్రను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1406లో ఫిరోజ్‌ షా విజయనగరంపై దండెత్తాడు. ఈ యుద్ధానికి కారణం ముద్గల్లులోని కంసలి కుమార్తె ‘నేహల్‌’ గురించి ఫిరోజ్‌ షా, మొదటి దేవరాయలు పోటీపడటం. ఇందులో మొదటి దేవరాయలు ఓడి, కుమార్తెను ఫిరోజ్‌ షాకి ఇచ్చి వివాహం చేశాడు. రెడ్డి రాజుల మధ్య ఉన్న అంతఃకలహాల్లో దేవరాయల జోక్యం కారణంగా, వీరికి గజపతులతో పోరు మొదలైంది. కళింగ రాజైన నాలుగో భానుదేవుడు రాజమహేంద్రవరంపై దండెత్తాడు. ఈ సమయంలో రెడ్డి రాజుకి మొదటి దేవరాయలు సహాయం చేశాడు. మొదటి దేవరాయల మరణం తర్వాత రామచంద్రరాయలు, విజయ రాయలు అతిస్వల్పకాలం పరిపాలించారు.


రెండో దేవరాయలు (1423-1446): ప్రౌఢ దేవరాయలుగా ప్రసిద్ధి పొందాడు. సంగమ వంశంలో సుప్రసిద్ధుడు. ఇతడి కాలంలో విజయనగర సామ్రాజ్యం విస్తరించింది. బహమనీ సుల్తానులతో యుద్ధాలు చేశాడు. 1422లో మొదటి మహ్మద్‌ షా విజయ నగరంపై దండెత్తినప్పుడు, రెండో దేవరాయలు అతడిని ఓడించాడు. ఈ యుద్ధం అనంతరం బహమనీ సుల్తానులు వారి రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్‌కు మార్చారు. రెడ్డి రాజుల తీరాంధ్రని రెండో దేవరాయలు జయించాడు. కొండవీడును ఆక్రమించి సింహాచలం వరకు ఉన్న రెడ్డి రాజ్యాన్ని తన సామంత రాజ్యంగా చేసుకున్నాడు. సింహళం నుంచి కప్పం వసూలు చేశాడు. సైన్యంలో ముస్లింలను చేర్చుకున్నాడు. యుద్ధతంత్రాల్లో ఫిరంగులు, తుపాకులను ప్రవేశపెట్టాడు. ముస్లింల కోసం సైనిక శిబిరాల్లో మసీదులను నిర్మించాడు. ఇతడి ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు నికోలోకాంటే (ఇటలీ), అబ్దుల్‌ రజాక్‌ (పర్షియా). ఇతడి సాహిత్య సమావేశ మందిరం ‘ముత్యాలశాల’. ఆస్థాన కవి గౌడ డిండిమ భట్టు. రెండో దేవరాయలతో కనకాభిషేకం చేయించుకున్నది శ్రీనాథుడు. రెండో దేవరాయల తర్వాత మల్లికార్జునరాయ, రెండో విరూపాక్షరాయ రాజ్యాన్ని పాలించారు.


 

రచయిత: నరసింహా రావు


 

Posted Date : 31-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌