• facebook
  • whatsapp
  • telegram

విజయనగర సామ్రాజ్యం (తుళువ వంశం)

దక్షిణ భారతంలో రాయల యుగం!


దక్షిణ భారతదేశాన్నంతటినీ ఏకం చేసి సమర్థంగా పాలించిన ఘనత మధ్యయుగంలో ఒక్క విజయనగర పాలకులకే దక్కింది. ఆ సామ్రాజ్య వైభవం, స్థాయి తుళువ వంశ పాలకుల హయాంలో పతాక స్థాయికి చేరింది. సాగునీటిపారుదల, ఆలయ నిర్మాణాల్లో వీరు చేసిన కృషి నేటికీ ప్రయోజనాలను అందిస్తోంది. ప్రాచీన కళలు, సాహిత్యాన్ని అమితంగా పోషించి, తెలుగు భాష, సంస్కృతిని ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఈ వంశపు రాజులు, వారి విశేషాలు, సైనిక విధానాలు, రాజ్యవిస్తరణ తీరు, వారసత్వ అంతర్యుద్ధాలు, తుదివరకు ముస్లిం పాలకులతో కొనసాగిన శత్రుత్వం, పతనానికి దారితీసిన పరిస్థితుల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. విజయనగర పాలకుల్లో అత్యంత గొప్పవాడైన శ్రీకృష్ణదేవరాయల విజయ ప్రస్థానాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. 


తుళువ వంశ మూలపురుషుడు తిమ్మరాజు. మైసూరు రాష్ట్రంలోని తుళువ ప్రాంతానికి చెందినవారు కావడంతో వీరి వంశానికి ఆ పేరొచ్చింది. తాము చంద్రవంశ క్షత్రియులమని చెప్పేవారు. 1342లో మొదటి హరిహరరాయలు తుళువ ప్రాంతాన్ని జయించడంతో, అది విజయనగర పాలకుల ఆధీనంలోకి వచ్చింది. తిమ్మరాజు కుమారుడైన ఈశ్వర నాయకుడు సాళువ నరసింహరాయలు వద్ద సేనాపతిగా పనిచేశాడు. ఇతడి బిరుదు దేవకీ పురాధిపుడు. 1481లో బహమనీ రాజు మహ్మద్‌ షాను కందుకూరు వద్ద ఓడించాడు. ఇతడి పేరు మీద దేవకీపురం అనే నగరాన్ని నిర్మించారు. ప్రస్తుతం దీనిని దేవికాపురం అని పిలుస్తున్నారు. ఇది ఉత్తర ఆర్కాట్‌ జిల్లాలో ఉంది. ఈశ్వర నాయకుడి కుమారుడు నరసనాయకుడు. ఇతడి కుమారుడైన వీర నరసింహరాయలు తుళువ రాజ్య స్థాపకుడిగా నిలిచాడు. వీరి మాతృభాష కన్నడం. అయితే అధికంగా ఆదరించిన, అభిమానించిన భాష తెలుగు. తొలి తెలుగు జంట కవులైన నంది మల్లయ్య, ఘంట సింగనలు ‘వరాహ పురాణం’ రచించి తుళువ నరసనాయకుడికి అంకితం ఇచ్చారు.


వీరనరసింహరాయలు (1505 - 1509): తక్కువ కాలం రాజ్యపాలన చేశాడు. అనేకమంది విజయనగర సామంతులు ఇతడిపై తిరుగుబాటు చేశారు. వారిలో ఆదోని రాజు కానప్ప వడయార్, ఉమ్మత్తూరు పాలకుడు దేవరాజు, శ్రీరంగపట్నం రాజు గుండరాజు ముఖ్యులు. దీనికితోడు బహమనీ సుల్తాన్‌ మహ్మద్‌ షా, బీదర్‌లో ఒక సమావేశం ఏర్పాటుచేసి ఏటా హిందువులపై జిహాద్‌ జరపాలని నిర్ణయించాడు. బహమనీ రాజు యూసఫ్‌ ఆదిల్‌ఖాన్‌ విజయనగరంపై దండెత్తాడు. ఈ సమయంలో ఆదోని పాలకుడు కానప్ప వడయార్‌ ఆదిల్‌ఖాన్‌కు సహాయపడ్డాడు. ఆదిల్‌ఖాన్‌ను ఓడించి తరిమివేసింది కందనవోలు ప్రాంతానికి చెందిన రామరాజు, అతడి కుమారుడు తిమ్మరాజు. ఈ విజయంతో వీరనరసింహరాయలు కుందనవోలు, ఆదోని ప్రాంతాలను వారికి ఇచ్చారు.


వీరనరసింహరాయలకు పోర్చుగల్‌ గవర్నర్‌ ‘ఆల్మిడా’తో స్నేహ సంబంధాలు ఉండేవి. పోర్చుగీసు వారు పశ్చిమ తీరం నుంచి దిగుమతి చేసుకునే గుర్రాలను తనకు అమ్మాలని ఒప్పందం చేసుకున్నాడు. దాంతో విజయనగర సామ్రాజ్యంలో పటిష్టమైన అశ్వదళం సిద్ధమైంది. రైతుల కోసం వ్యవసాయ అభివృద్ధికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. ప్రజా సంక్షేమం కోసం సుంకాలు రద్దు చేశాడు. కూచిపూడి నృత్యాన్ని ఆదరించాడు. చివరి రోజుల్లో ఉమ్మత్తూరు, శ్రీరంగ పట్టణంపై దాడి చేసి ఓటమి పాలయ్యాడు. వ్యాధిగ్రస్థుడై 1509లో మరణించారు.


శ్రీకృష్ణదేవరాయలు (1509 - 1529): విజయనగరాన్ని పరిపాలించిన చక్రవర్తుల్లో గొప్పపాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్రభోజుడు, యవనరాజ్య స్థాపనాచార్య, సాహితీ సమరాంగణ సార్వభౌమ, గజపతిగజకూటహర మొదలైనవి ఈయన బిరుదులు. తండ్రి తుళువ నరసనాయకుడు, తల్లి నాగమాంబ. ఆస్థాన మంత్రి సాళువ తిమ్మరసు. కృష్ణదేవరాయలు రాసిన గ్రంథాలు ఆముక్తమాల్యద (తెలుగు), ఉషాపరిణయం (సంస్కృతం), జాంబవతి పరిణయం (సంస్కృతం). ఈయన సాహిత్యభవనం పేరు ‘భువన విజయం’. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని పేర్కొన్నాడు. వీరనరసింహరాయల సవతి తల్లి కుమారుడైన శ్రీకృష్ణదేవరాయలకు 1509, ఆగస్టు 8న పట్టాభిషేకం జరిగింది. హంపీ శిలాశాసనం ఆయన గుణగణాలను వివరిస్తుంది. రాజు కావడానికి సహకరించింది సాళువ తిమ్మరుసు. ఈ విషయం గురించి న్యూనిజ్‌.రచనల్లో తెలిసింది. కృష్ణదేవరాయల బాల్యమంతా తిమ్మరసు పరిరక్షణలో గడిచింది. ఆయన శిక్షణలో సకల విద్యల్లో ఆరితేరాడు. తిమ్మరుసుని కృష్ణదేవరాయలు ‘అప్పాజీ’ అని సంబోధించేవాడు. కృష్ణదేవరాయల సమకాలీన రాజులు బాబర్‌ (మొగల్‌ చక్రవర్తి), మహ్మద్‌ షా (బహమనీ).


కృష్ణదేవరాయలు సింహాసనం అధిష్టించే నాటికి విజయనగర సామ్రాజ్యంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమై 5 రాజ్యాలుగా విడిపోయింది. రాయచూర్, అంతర్వేదిని యూసఫ్‌ ఆదిల్‌ షా ఆక్రమించాడు. విజయనగర సామంతులైన ఉమ్మత్తూరు, శ్రీరంగపట్టణం పాలకులు తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. తూర్పున కళింగరాజు ప్రతాపరుద్ర గజపతి ఉదయగిరిని ఆక్రమించాడు. ఆనాటి విదేశీ వర్తకులైన పోర్చుగీసు వారు స్థానిక రాజులను ఎదిరించి కోటల నిర్మాణం చేస్తున్నారు. ఈ సమయంలో కృష్ణదేవరాయలు ‘శత్రువు శత్రువులు మిత్రులు’ అన్న రాజనీతిని అనుసరించి బీజాపూర్‌ సుల్తానుకు శత్రువులైన పోర్చుగీసు వారితో స్నేహం చేశాడు. వారు ‘గోవా’ని ఆక్రమించుకోడంలో సహాయపడ్డాడు. ఆనాటి పోర్చుగల్‌ గవర్నర్‌ ఆల్బూకర్క్‌. 1510లో ఆల్బూకర్క్‌కి, కృష్ణదేవరాయలకి మధ్య పోర్చుగల్‌ రాయబారి ‘లూయిడ్‌ ప్రయర్‌’ సంధి కుదిర్చారు. దీంతో కృష్ణదేవరాయలు పోర్చుగల్‌ నుంచి మేలుజాతి గుర్రాలు, మందుగుండు సామగ్రి దిగుమతి చేసుకున్నాడు. పోర్చుగీసువారితో తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు.


కృష్ణదేవరాయల దండయాత్రలు: సైన్యాన్ని పటిష్టం చేసుకుని, ఆర్థిక వనరులు సమకూర్చుకున్న తర్వాత రాజ్య విస్తరణకు సిద్ధమయ్యాడు.


బహమనీ సుల్తానులతో యుద్ధాలు: 1509లో బీజాపూర్‌ సుల్తాన్‌ యూసఫ్‌ ఆదిల్‌ షా, బీదర్‌ సుల్తాన్‌ మామూద్‌ షా ‘జిహాద్‌’ను ప్రకటించి విజయనగర సామ్రాజ్యంపై దండెత్తారు. వారిని కృష్ణదేవరాయలు దివానీ, కొవిలకొండ యుద్ధాల్లో ఓడించి తరిమివేశాడు. శత్రువులైనప్పటికీ బీజాపూర్‌ సుల్తాన్‌ మరణం తర్వాత అతడి కుమారుడు ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా, బీదర్‌ పాలకుడు మామూద్‌ షా సింహాసనం అధిష్టించడానికి సహాయపడి రాజనీతిని ప్రదర్శించారు. ఆ సమయంలో పొందిన బిరుదు ‘యవనరాజ్య స్థాపనాచార్య’ఉమ్మత్తూరుపై దాడి: ఈ ప్రాంత పాలకుడైన గంగరాజు శివసముద్ర దుర్గాన్ని కేంద్రంగా చేసుకుని రాయల అధికారాన్ని ధిక్కరించాడు. కృష్ణదేవరాయలు గంగరాజుపై దాడి చేసి ఉమ్మత్తూరు, శివసముద్ర దుర్గాలను నేలమట్టం చేశారు.  కావేరి నదిలో దూకి గంగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణదేవరాయలు శ్రీరంగపట్నాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత దానిని రాజధానిగా చేసుకుని రాష్ట్రంగా పునర్నిర్మించాడు. తన ప్రతినిధిగా సాళువ గోవిందుడిని అక్కడ నియమించాడు. సైనిక అధికారులైన విజయప్ప, వేంకటప్ప, వీరరాఘవలతో కన్యాకుమారి వరకు రాజ్యాన్ని విస్తరించి ‘ **దక్షిణ దేశాధీశ్వర’ అనే బిరుదు పొందాడు.


ఉదయగిరిపై దండయాత్ర: ఈ ప్రాంత పాలకుడు తిరుమలరాయలు గజపతులకు సామంతుడు. ఇతడిని కృష్ణదేవరాయలు ఓడించారు. ఈ కోటలో లభించిన బాలకృష్ణుడి విగ్రహాన్ని హంపీకి తీసుకొచ్చి కృష్ణాలయం నిర్మించారు. ఈ విజయం తర్వాత కృష్ణదేవరాయలు తన భార్యలైన తిరుమలదేవి, చిన్నాదేవిలతో తిరుపతిని సందర్శించారు. వీరి విగ్రహాలు తిరుమలలో ప్రధాన ద్వారం వద్ద ఉన్నాయి. మహామంత్రి తిమ్మరుసు ఆధ్వర్యంలో అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, కొండవీడు ప్రాంతాలను ఆక్రమించారు. కృష్ణానదికి దక్షిణాన ఉన్న తీరాంధ్ర దేశం రాయల వశమైంది. అనంతరం కొండపల్లి, రాజమహేంద్రవరం, సింహాచలం, పోట్నూరు, కళింగ రాజధాని కటక్‌లను కైవసం చేసుకున్నాడు.కృష్ణదేవరాయలతో ప్రతాపరుద్ర గజపతి సంధి చేసుకుని, తన కుమార్తె అన్నపూర్ణదేవిని ఇచ్చి వివాహం చేశాడు.

రాయచూరు యుద్ధం: కృష్ణదేవరాయలు రాయచూర్‌ను ఆక్రమించుకున్నారు. ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా గతంలో ఆక్రమించిన అంతర్వేదిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో పోర్చుగల్‌ సేనాని క్రిస్టోసిరి పోగారిడో సాయం చేశాడు. 1523లో గుల్బర్గా కూడా రాయల వశమైంది.

శ్రీకృష్ణదేవరాయలు తన కుమార్తె తిరుమలాంబను అరవీటి అళియ రామరాయలుకు ఇచ్చి వివాహం చేశాడు. 1528లో కుమారుడు తిరుమల రాయలకి పట్టాభిషేకం చేయించాడు. తిరుమల రాయలు అకాల మరణంతో సోదరుడు అచ్యుతరాయలను తన వారసుడిగా ప్రకటించాడు. 1529లో మరణించారు. భారతదేశంలోని మేటి చక్రవర్తుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఒకరుగా నిలిచారు. ఇతడి పాలనా కాలం విజయనగర చరిత్రలో స్వర్ణయుగం. బాబర్‌ కూడా ‘తుజిక్‌-ఇ-బాబరీ’లో కృష్ణదేవరాయల గొప్పతనాన్ని ప్రస్తావించారు. ఇతడి ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు డోమింగ్‌ఫేస్‌ (కృష్ణదేవరాయల భౌతిక స్వరూపం గురించి వివరించారు), సి.బార్బోసా (పరిపాలన గురించి వివరించారు).


అచ్యుత దేవరాయలు (1529 - 42): ఇతడి గురించి వివరించిన పోర్చుగల్‌ యాత్రికుడు న్యూనిజ్‌. కృష్ణదేవరాయల మరణం తర్వాత అచ్యుత దేవరాయలు రాజు అయ్యాడు. ఇతడి సేనాని అళియ రామరాయలు కూడా సింహాసనం కోసం ప్రయత్నించాడు. ఈ సమయంలో రామరాయలకు, అచ్యుతరాయలకు మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తర్వాత అచ్యుత రాయలు రాజ్య వ్యవహారాలను తన బావమరిది చినతిరుపతిరాయల పరం చేశాడు. వ్యసనాలకు బానిసై, చివరకు ప్రజాభిమానం కోల్పోయి 1542లో మరణించాడు.


మొదటి వేంకటపతిరాయలు (1542 - 1543): అచ్యుతదేవరాయ కుమారుడు. బాలుడు కావడంతో అతడి మేనమామ చినతిరుమలరాయలు రక్షకుడిగా రాజ్యపాలన సాగించాడు. చినతిరుమల రాయలు, అతడి సోదరుడు పెదతిరుమల రాయలు మొదటి వేంకటపతి రాయలను చంపి సింహాసనం అధిష్టించారు. ఈ విషయం తెలుసుకున్న అళియ రామరాయలు గుత్తి నుంచి బయలుదేరి పెనుగొండను ఆక్రమించి పెద తిరుమలరాయలను, చిన తిరుమలరాయలను వధించి సదాశివరాయలను రాజుగా ప్రకటించాడు.


సదాశివ రాయలు (1543-1576): తుళువ వంశంలో చివరివాడు. పేరుకు మాత్రమే రాజు. అధికారమంతా అళియ రామరాయలదే. ఇతడు సమర్థుడు, యోధుడు, రాజనీతి చతురుడు. మొదట గోల్కొండ సుల్తానులు కుతుబ్‌ షాహీల ఆస్థానంలో సేనాపతిగా ఉండేవాడు. ఆదిల్‌ షాతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి అవమానం ఎదుర్కొన్నాడు. దాన్ని సహించలేక వచ్చి కృష్ణదేవరాయల కొలువులో చేరాడు.


అళియ రామరాయలు బహమనీ సుల్తానులతో యుద్ధాలు చేసి రాజ్యం విస్తరించాడు. 1565, జనవరి 26న జరిగిన యుద్ధాన్ని తళ్లికోట యుద్ధం/బన్నిహట్టి యుద్ధం/రాక్షస తంగడి యుద్ధం అని అంటారు. ఇందులో బహమనీ సుల్తానులు ఇబ్రహీం కుతుబ్‌ షా (గోల్కొండ), హుస్సేన్‌ నిజాం షా (అహ్మద్‌ నగర్‌), ఆలీబరీద్‌ షా (బీదర్‌), ఆలీదిల్‌ షా (బీజాపూర్‌) పాల్గొన్నారు. ఈ యుద్ధంలో అళియ రామరాయలు, అతడి సోదరుడు వేంకటాద్రి రాయలు మరణించారు.. తిరుమలరాయలు, సదాశివ రాయలు పెనుగొండకు పారిపోయారు. కొంతకాలానికి సదాశివరాయలు మరణించాడు.



 

 


రచయిత: గద్దె నరసింహారావు
 

Posted Date : 14-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌