• facebook
  • whatsapp
  • telegram

విజయనగర సామ్రాజ్యం

      విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించారు. ఈ సామ్రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, అరవీడు అనే నాలుగు రాజ వంశాలు పాలించాయి. విద్యారణ్యస్వామి సహాయంతో తుంగభద్రా నదీ తీరంలోని అనెగొంది రాజధానిగా సంగమ సోదరులు సామ్రాజ్యాన్ని స్థాపించారు. విద్యారణ్యస్వామి పేరు మీదుగా విద్యానగరం/ విజయనగరం అనే నూతన నగరాన్ని నిర్మించారు. 1344లో రాజధానిని అనెగొంది నుంచి విజయనగరానికి మార్చారు.
 

ఆధారాలు


శాసనాలు
      బాగపెల్సి తామ్రశాసనం మొదటి హరిహరరాయల విజయాలను వివరిస్తోంది. రెండో సంగముడు వేయించిన బిట్రగుంట దాన శాసనం సంగమ సోదరుల గురించి తెలుపుతుంది. రెండో హరిహరుడు వేయించిన చెన్నరాయపట్టణ శాసనం, రెండో దేవరాయలు వేయించిన శ్రీరంగం తామ్ర ఫలకాలు, ఇమ్మడి నరసింహుడు వేయించిన దేవులపల్లి తామ్ర శాసనాలు (సాళువ వంశావళి) ప్రధాన ఆధారాలు.

 

నాణేలు
       విజయనగర కాలంలో ప్రధాన బంగారు నాణెం గద్యాణం. దీన్నే వరహా అనేవారు. ప్రతాప, ఫణం, చిన్నం కూడా బంగారు నాణాలే. తార్ వెండినాణెం. జిటాలు, కాసు రాగి నాణేలు. దీనారం ఈజిప్షియన్ నాణెం, నాణేలపై హిందూ దైవాల ప్రతిమలు, ఏనుగులు, నంది, గండబేరుండ పక్షి ఒక పక్క, రాజుల పేర్లు, బిరుదులు మరో పక్క ఉండేవి. రెండో దేవరాయలు వేయించిన పావలా వరహాలపై అతడి బిరుదైన గజబేటకార ముద్రితమై ఉండేది.

సాహిత్య ఆధారాలు - దేశీయ, విదేశీ రచనలు

    మొదటి హరిహరుని కాలంలో ఇబన్ బటూట (మొరాకో) రాజ్యాన్ని సందర్శించాడు. మొదటి దేవరాయల కాలంలో నికోలోడీ కాంటే (ఇటలీ), రెండో దేవరాయల కాలంలో అబ్దుల్ రజాక్ (పర్షియా), శ్రీకృష్ణదేవరాయల కాలంలో డొమింగోపేస్, న్యూనిజ్‌లు వచ్చారు.
     సతీసమేతంగా విజయనగర రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు నికోలోడీ కాంటే. ఇతడు విజయనగర చుట్టుకొలత, వసంతోత్సవాలు, సతీ సహగమనం గురించి రాశాడు. అబ్దుల్ రజాక్ విజయనగర ఐశ్వర్యం, 300 ఓడరేవులు, గులాబీపూల ప్రాముఖ్యం, పాలెగాళ్లు, తలారుల గురించి వివరించాడు. డొమింగోపేస్ శ్రీకృష్ణదేవరాయలు రూపం, వ్యక్తిత్వం, బలులు, బ్రాహ్మణులు, అధ్యాపక, పూజారి, సైనిక వృత్తులు, దేవాదాసీల ఉన్నత స్థానం గురించి వివరించాడు. బార్బోజా (పోర్చుగల్) విజయనగరరాజుల పరమత సహనం, న్యాయ విధానం గురించి పేర్కొన్నాడు. అథనేషియన్ నికెటిన్ (రష్యా) విజయనగర సామ్రాజ్యంలోని ఆర్థిక అసమానతలు, ఆర్థిక డొల్లతనం గురించి వివరించాడు.
      పెరిస్టా అనే పర్షియన్ చరిత్రకారుడు బీజాపూర్ సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్ షా ఆస్థానంలో నివసించాడు. ఇతడు హిస్టరీ ఆఫ్ ది రైజ్ ఆఫ్ మహ్మడన్ పవర్ గ్రంథాన్ని రచించాడు. విజయనగర నిర్మాతలు ముస్లిం బందిఖానా నుంచి విడుదలైన హిందూ రాజులని, వీరు తమ సైన్యంలో ముస్లింలను చేర్చుకున్నారని పెరిస్టా పేర్కొన్నాడు.
     న్యూనిజ్ ప్రకారం రెండో దేవరాయలు బర్మా, శ్రీలంకల నుంచి కప్పం వసూలు చేశాడని; శ్రీకృష్ణ దేవరాయల కళ్లు తీసేయమని సాళువ తిమ్మరుసుకు వీరనరసింహుడు ఆదేశించాడని; పల్లకి మోసేవారుగా స్త్రీలను నియమించారని; అట్టావనంలో సైనిక లెక్కలు చూసే కరణాలు, 200 మంది అమర నాయకులున్నారని తెలుస్తోంది. రాబర్ట్ సూయెల్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు విజయనగర సామ్రాజ్య పతనం గురించి ఎ ఫర్‌గాటెన్ ఎంపైర్ (విస్మృత విజయనగర సామ్రాజ్యం) అనే రచన చేశాడు.

దేశీయ సాహిత్యం
     గంగాదేవి - మధురా విజయం, తిరుమలాంబ - వరదాంబికా పరిణయం, రెండో దేవరాయలు - మహానాటక సుధానిధి, 2వ రాజనాథ డిండిముడు - సాళువాభ్యుదయం, 3వ రాజనాథ డిండిముడు - రామాభ్యుదయం, శ్రీకృష్ణ దేవరాయలు - ఆముక్తమాల్యద, నాచనసోముడు - ఆంధ్రభాషా చరిత్ర, స్థానాపతి - రాయవాచకం, మహాలింగదేవుడు - ఏకోత్తర నటస్థల, లక్ష్మణ దండనాయకుడు - శివతత్త్వ చింతామణి, చామరసు - ప్రభులింగలీల, హరిదాసు - ఇరుశమయ విళక్కమ్, దూబగుంట నారాయణకవి - పంచతంత్రమ్ (తెలుగు), అల్లసాని పెద్దన - మనుచరిత్రం, గంగాధరుడు - గంగాదాస ప్రలాప విలాసం.. రచనలు విజయనగర సామ్రాజ్యం గురించి వివరిస్తున్నాయి.

 

రాజకీయ చరిత్ర 

సంగమ వంశం
    కర్ణాటకలోని మంగళ నిలయ నివాసి సంగముని కుమారులు హరిహరరాయులు, బుక్కరాయలు 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరు కాకతీయ రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానంలో పనిచేశారు. మహ్మద్ బీన్ తుగ్లక్ దాడిచేసినప్పుడు కంపిలి రాజ్యంలో ఆశ్రయం పొందారు. తుగ్లక్ కంపిలిని కూడా ఆక్రమించి, సంగమ సోదరులను దిల్లీకి తీసుకొనిపోయి ఇస్లాం మతంలోకి మార్చాడు. దక్షిణ భారతదేశంలో జరుగుతున్న ముస్లిం వ్యతిరేక తిరుగుబాట్లను అణచడం కోసం వీరిని తుగ్లక్ తిరిగి పంపాడు. ముసునూరి పాలకుల చేతిలో ఓడిపోయిన సంగమ సోదరులు విద్యారణ్యస్వామి సహాయంతో హిందూమతంలోకి మారి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విరూపాక్షస్వామి పేరున స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు.

మొదటి హరిహరరాయలు (1336 - 1356):
     ఇతడి కాలంలోనే బహమనీ సామ్రాజ్యం స్థాపించారు. హోయసాల చివరి రాజు విరూపాక్ష వల్లభుడిని (నాలుగో భళ్లాలుడు) మధురై సుల్తాన్ హత్యచేసిన అనంతరం 1346లో హరిహరుడు హోయసాల రాజ్యాన్ని ఆక్రమించాడు. 1336, ఏప్రిల్ 18న పట్టాభిషేకం జరిగింది. తుంగభద్రా నది దక్షిణ తీరంలో విద్యానగరం/ కోవెలపురం నిర్మించాడు. పంపావతి ఆలయం కట్టించాడు. ఇబన్‌బటూట అనే మొరాకో దేశస్థుడు 1347లో ఇతడి రాజ్యాన్ని సందర్శించాడు. మొదటి హరిహరుడు బాగపెల్సి, అటకల గూడు శాసనాలు వేయించాడు. బాదామి శాసనం ఇతడిని పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర అని పేర్కొంటోంది.

 

మొదటి బుక్కరాయలు (1356 - 77)(1353 - 79):
       ఇతడు విజయనగర పట్టణ నిర్మాణం పూర్తి చేశాడు. శ్రావణ బెళగోళ కోసం జైనులు - వైష్ణవులు, శ్రీరంగం కోసం శైవులు - వైష్ణవుల మధ్య జరిగిన ఘర్షణలను తీర్చాడు. విజయనగర, బహమనీ ఘర్షణలు ఇతని కాలంలోనే (1367) ప్రారంభమయ్యాయి. ఇతని కుమారుడు కంపన మధురపై దండెత్తి విజయం సాధించాడు. కంపన భార్య గంగాంబ మధురా విజయం గ్రంథాన్ని రచించింది. నాచనసోముడు ఇతడి ఆస్థానకవి. అతడు ఉత్తర హరివంశం, ఆంధ్రభాషా చరిత్ర లాంటి గ్రంథాలు రచించాడు. సాయణుడు, మాధవుడు అనే కవులు (మంత్రులు) వేదాలకు భాష్యాలు రాశారు. వైదిక మార్గ ప్రవర్తక అనే బిరుదు బుక్కరాయలు పొందారు. బుక్కరాయల కాలంలోనే సోదరుడు మారప్ప సహాయంతో మాధవమంత్రి గోవా (రేవతి ద్వీపం) రేవు పట్టణాన్ని ఆక్రమించాడు. మాధవుడు తాత్పర్యదీపిక, శైవామ్నయ సారం గ్రంథాలు రచించాడు. బుక్కరాయలు పిచ్చుకల దిన్నె గ్రామాన్ని నాచన సోముడికి దానంచేసి పిచ్చుకల దిన్నె శాసనం వేయించాడు. చైనాకు వర్తక బృందాన్ని పంపాడు.

రెండో హరిహరరాయలు (1377 - 1404):
    రాజాధిరాజ, రాజపరమేశ్వర, రాజ వ్యాస, రాజవాల్మీకి లాంటి బిరుదులతో పాలించాడు. మొదటి బుక్కరాయలు విజయాలను తెలుపుతూ చెన్నరాయ పట్టణ శాసనం వేయించాడు. కాటయ వేమారెడ్డి చేతిలో ఓడిపోయి తన కుమార్తె హరిహరాంబికను ఇచ్చి పెళ్లి చేశాడు. విరూపాక్షుడు సింహళంపై దండెత్తి కప్పం వసూలు చేసినట్లు తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో తీవ్ర కరవు సంభవించింది (దుర్గాదేవి కరవు). రెండో హరిహరుడి గురువు శవణాచారి. 1404లో ఇతని మరణం తర్వాత మొదటి వారసత్వ యుద్ధం జరిగింది. రెండో బుక్కరాయల్ని తొలగించి విరూపాక్షుడు రాజయ్యాడు. మళ్లీ అతడిని తొలగించి రెండో బుక్కరాయలు 1406 వరకు పాలించాడు.

 

మొదటి దేవరాయలు (1406 - 22):
      ఇతడు వెలమలతో మైత్రి కుదర్చుకున్నాడు. ముద్గల్ కంసాలి కుమార్తె నెహాల్ విషయంలో బహమనీ సుల్తాన్ ఫిరోజ్‌షాతో యుద్ధం చేసి, ఓడిపోయాడు. రాజమండ్రి కాటయవేముడితో సంధి చేసుకుని సహాయం చేశాడు. విజయనగరం చుట్టూ బురుజులు నిర్మించాడు. తుంగభద్రా నదికి ఆనకట్టలు కట్టించి నగరానికి నీటి సౌకర్యం కల్పించాడు. చామన దండనాయకుడు ఇతడి మంత్రి. విక్రమార్క చరిత్ర గ్రంథాన్ని రాసిన జక్కన, దాన్ని సిద్దనకు కృతి ఇచ్చాడు. సిద్దనను చామన ఆదరించాడు. 1422లో రాయల మరణం తర్వాత కుమారుడు రామచంద్ర రాయలు రాజయ్యాడు. అతడిని తొలగించి సోదరుడు విజయ రాయలు పాలన చేశాడు. విజయ రాయల కుమారుడే రెండో దేవరాయలు.

రెండో దేవరాయలు (1426 - 46):
    ఇతడు సంగమ వంశంలో గొప్పవాడు. ఇతడిని ప్రౌఢ దేవరాయలు అని కూడా అంటారు. గజబేటకార బిరుదాంకితుడు (ఏనుగుల వేటలో సిద్ధహస్తుడు). కొండవీడును ఆక్రమించి, సింహాచలం వరకు ఉన్న రెడ్డి రాజ్యాన్ని సామంతరాజ్యంగా చేసుకున్నాడు. కపిలేశ్వర గజపతి దండయాత్రలను అరికట్టడానికి మల్లప్పవడయ సేనానిని పంపాడు. లక్కన్న దండనాయకుడు జాఫ్నా నుంచి కప్పం వసూలు చేశాడు. దక్షిణ సముద్రాధీశ్వర బిరుదు ధరించాడు. బహమనీ సుల్తాన్ అహ్మద్ షా రాజధానిని బీదర్‌కు మార్చి రెండో దేవరాయల్ని ఓడించాడు. రాయలు త‌న సైన్యంలో ముస్లింల‌ను నియ‌మించాడు (పెరిస్టా). ప్రభులింగలీల గ్రంథాన్ని రచించిన చామరసు ఇతడి ఆస్థానంలోని వ్యక్తే. ఇతడి మంత్రి ప్రోలుగంటి తిప్పన. రాజధాని(పాన్ సుపారీ బజార్)లో జైనులకు జినాలయం నిర్మించుకోవడానికి అనుమతించాడు. తురకవాడ అభివృద్ధికి, ప్రార్థనా సౌకర్యాలు కల్పించడానికి కృషిచేశాడు. రాయల ఆస్థాన కవి అరుణగిరినాథు డిండిముడు. శ్రీనాథుడు రెండో దేవరాయల ఆస్థానానికి వచ్చి డిండిముడిని ఓడించి కవిసార్వభౌమ బిరుదు పొంది గండపెండేరం తొడిగించుకున్నాడు. అబ్దుల్ రజాక్, నికోలోడీ కాంటే ఇతడి కాలంలో రాజ్యాన్ని సందర్శించారు. రెండో దేవరాయలు తన సింహాసనం ముందు ఖురాన్‌ను ఉంచేవాడు.
      రెండో దేవరాయల తర్వాత అతడి కుమారుడు మల్లికార్జునరాయలు 1446-1465 వరకు పాలించాడు. ఇతడి కాలంలో కపిలేశ్వర గజపతి వెలమల సహాయంతో తీరాంధ్రను జయించినట్లు పెనుగొండ శాసనం తెలుపుతోంది. తర్వాత రెండో దేవరాయల తమ్ముడి కుమారుడు రెండో విరూపాక్షరాయలు పాలించినట్లు ప్రసన్నామృతం గ్రంథం తెలుపుతోంది. ఇతడి దుష్పరిపాలనను సహించలేక కుమారుడే హత్యచేసి ప్రౌఢ దేవరాయలకు అధికారం అప్పగించాడు. ఈ పరిస్థితుల్లో సాళువ నరసింహరాయలు తన సేనాని తుళువ నరసింహనాయకుడిని పంపి ప్రౌఢ దేవరాయలును ఓడించి సాళువ వంశపాలన ప్రారంభించాడు.

సాళువ వంశం (1485 - 1505)
      సాళువ వంశస్థుల జన్మస్థలం కళ్యాణి (కర్ణాటక). ఈ వంశం వారు కళ్యాణపురవరాధీశ్వర బిరుదు ధరించారు. మంగిరాజుకు ప్రతిపక్షసాళువ బిరుదు ఉంది. సాళువ నరసింహుడి ఆస్థాన కవి రెండో రాజనాథ డిండిమ భట్టు- సాళువాభ్యుదయం అనే గ్రంథాన్ని రాశాడు. నరసింహరాయలు రాజధానిని కళ్యాణి నుంచి చంద్రగిరికి మార్చాడు. తెలంగాణపై దండెత్తి బాలకొండ దగ్గర ముస్లిం సైన్యాలను ఓడించి రాయ మహారసు బిరుదు పొందాడు. విజయనగర చరిత్రలో మొదటి దురాక్రమణదారుడుగా పేరొందాడు. 15 సంవత్సరాలపాటు విజయనగర సామ్రాజ్యంలో తిరుగుబాట్లను అణిచి శాంతిభద్రతలు నెలకొల్పాడు. సాముగరిడీలను ప్రోత్సహించాడు. రాజనాథ డిండిముడే రాఘవాభ్యుదయం అనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతం, శృంగార శాకుంతలం గ్రంథాలను ఇతడి కాలంలోనే రచించాడు. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు ఇతడి కాలంలోనే జీవించారు.


    సాళువ నరసింహుడి పెద్దకుమారుడు తమ్మరాజును సింహాసనం ఎక్కించి, సర్వాధికారాలు తుళువ నరసనాయకుడు చెలాయించాడు. ఇదేకాలంలో ఖాశింబరీద్ బహమనీ సుల్తాన్ మహమ్మద్ షాను బంధించి సర్వాధికారాలు హస్తగతం చేసుకున్నాడు. నరసనాయకుడు యూసఫ్ ఆదిల్‌షాతో మానవ దుర్గం యుద్ధంలో గెలిచినప్పటికీ రెండోసారి యుద్ధంలో తమ్మరాజు మరణించాడు. ఫలితంగా అతడి సోదరుడు ఇమ్మడి నరసింహరాయలును సింహాసనం ఎక్కించాడు.

ఇమ్మడి నరసింహుడు తుళువ నరసను తొలగించి నాదెండ్ల తిమ్మరుసును మంత్రిగా నియమించుకున్నాడు. చివరికి 1505లో తుళువ వీరనరసింహుడు పెనుగొండలో బందీగా ఉన్న ఇమ్మడి నరసింహరాయలను హత్య చేయించి, తుళవ వంశపాలన ప్రారంభించాడు. (వాస్తవానికి తుళువ నరసనాయకుడే ఇమ్మడి నరసింహుడిని పెనుగొండలో బంధించి, అధికారాలను హస్తగతం చేసుకుని రెండో దురాక్రమణదారుడుగా పేరొందాడు)
 

తుళువ వంశం (1505 - 1575)
     మైసూర్‌లోని తుళు ప్రాంతం జన్మస్థలం. మూలపురుషుడు తిమ్మరాజు. ఇతడి కుమారుడు ఈశ్వర నాయకుడు సాళువ నరసింహుడి సేనానిగా అనేక విజయాలు సాధించి దేవకీపురాధిపుడు అనే బిరుదు పొందినట్లు వరాహపురాణం గ్రంథం తెలుపుతోంది. ఈ గ్రంథాన్ని నంది మల్లయ్య, ఘంట సింగనలు రచించి తుళువ నరసనాయకుడికి అంకితం చేశారు. వీరనరసింహుడు 1505-09 వరకు రాజ్యపాలన చేశాడు. దేవులపల్లి శాసనం వేయించింది ఇతడే. బహమనీ సుల్తాన్ మహమూద్ షా హిందువులపై ఏటా జీహాద్ ప్రకటించాలని బీదర్ సమావేశంలో పిలుపునిచ్చాడు. నంది మల్లయ్య, ఘంట సింగన (తొలి తెలుగు జంట కవులు)లు ప్రబోధ చంద్రోదయం గ్రంథాన్ని రచించారు. వైవాహిక సుంకాన్ని రద్దుచేసిన తొలి విజయనగర చక్రవర్తి వీర నరసింహుడు.

 

శ్రీకృష్ణ దేవరాయలు (1509 - 1529): 

  తుళువ నరసనాయకుడు, నాగలాంబిక కుమారుడు శ్రీకృష్ణ దేవరాయలు. 1509, ఆగస్టు 8 (శ్రీ జయంతి) రోజున పట్టాభిషేకం జరుపుకున్నాడు. మహామంత్రి తిమ్మరుసు (మనోహరా గ్రంథం) సహాయంతో రాజయ్యాడు. రాయల పట్టాభిషేకానికి లూయిఫ్రెజర్/ ప్రేయర్ లూయిస్ అనే పోర్చుగీసు రాయబారిని ఆల్బూకర్క్ పంపాడు. 1510లో శ్రీకృష్ణదేవరాయలు ఆల్బూకర్క్‌తో సంధి చేసుకుని, బీజాపూర్ సుల్తాన్‌ను ఓడించి గోవాను పోర్చుగీసువారి పరం చేశాడు. భట్‌కల్‌లో కోట నిర్మాణానికి కూడా రాయలు అనుమతి ఇచ్చాడు. కోవిలకొండ, దీవాన్ యుద్ధాల్లో బహమనీ సైన్యాలను ఓడించి కోవిలకొండను ఆక్రమించాడు.

ఆదిల్‌ఖాన్ చనిపోయాడు. బీదర్‌లో అలీబరీద్ సుల్తాన్‌ను బంధించిన కారణంగా బెల్గాం పౌరులు శ్రీకృష్ణదేవరాయలను దండయాత్రకు ఆహ్వానించారు. మహమూద్‌షాను విడిపించి, సుల్తాన్‌గా నియమించాడు. దీంతో యవన రాజ్యస్థాపనాచార్య అనే బిరుదు రాయలు పొందాడు. దక్షిణ భారత దేశంలో యూరోపియన్లతో తన సైన్యానికి శిక్షణ ఇప్పించిన తొలిరాజుగా శ్రీకృష్ణదేవరాయలు పేరొందారు. గాంగరాజును ఓడించి ఉమ్మత్తూర్, శివసముద్రం ప్రాంతాలను ఆక్రమించి, శ్రీరంగపట్నం రాజధానిగా చేసి, కెంపెగౌడ, వరప్పగౌడలను నియమించాడు. వీరిద్దరూ ఆధునిక బెంగళూరు నిర్మాతలు. శ్రీకృష్ణదేవరాయలు తన ప్రతినిధిగా సాళువ గోవింద రాజును నియమించినట్లు బీఎస్ఎల్ హనుమంతరావు తన రచనలో పేర్కొన్నారు. క్రీ.శ. 1513-1519 మధ్య రాయలు తూర్పు దిగ్విజయ యాత్రలు నిర్వహించాడు. క్రిస్టియన్ ఓడ్ ఫిగరిడో సహాయంతో ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, సింహాచలం ప్రాంతాలను ఆక్రమించాడు. తిరుమల రాహత్తరాయలను ఓడించి, ఉదయగిరిలో కొండ మరుసయ్యను నియమించాడు. బాలకృష్ణ విగ్రహాన్ని తెచ్చి హంపిలో కృష్ణాలయం నిర్మించాడు. వీరరుద్ర గజపతిని ఓడించి, కొండవీడును ఆక్రమించి తిమ్మరాజు పినకొండ్రాజును నియమించాడు. ప్రహరేశ్వరపాత్రుడు, అతని సేనాని బిజిలిఖాన్‌లను ఓడించి కొండపల్లిని ఆక్రమించాడు. చితాబ్‌ ఖాన్ పాలనలో ఉన్న తెలంగాణను కూడా రాయలు ఆక్రమించినట్లు తెలుస్తోంది. సింహాచలం వద్ద ఉన్న పొట్నూరులో శ్రీకృష్ణదేవరాయలు చితాబ్‌ ఖాన్‌ను ఓడించి విజయస్తంభాన్ని నాటాడు. తర్వాత ఒరిస్సాను పాలిస్తున్న ప్రతాపరుద్ర గజపతిని ఓడించి రాజధాని కటక్‌ను ఆక్రమించాడు. గజపతి కుమార్తె అన్నపూర్ణాదేవి/ చిన్నదేవి/ భద్రదేవి/ తుక్క దేవిని వివాహం చేసుకున్నాడు (గజపతి కుమార్తె పేరు భద్రదేవి అని ప్రబోధ చంద్రోయ వ్యాఖ్యానంలో నాదెండ్ల గోపమంత్రి పేర్కొన్నాడు).

తూర్పు దిగ్విజయ యాత్రలో ఉండగానే కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయంలో స్వప్నం రావడం ఫలితంగా ఆముక్త మాల్యద/ విష్ణుచిత్తీయం అనే గ్రంథ రచనకు శ్రీకారం చుట్టాడు. 1520-1521లో ఇస్మాయిల్ ఆదిల్ షాతో గొబ్బూరు యుద్ధం చేశాడు. విజయప్ప, వేంకటప్ప, వీర రాఘవప్పల సహాయంతో చోళ, చేర, పాండ్య రాజ్యాలను ఓడించాడు. సింహాచల దేవాలయానికి ముఖ మండపం, మంగళగిరి దేవాలయానికి మండపాలు, సోపానాలు నిర్మించాడు. ప్రకాశం జిల్లాలోని కంభం చెరువును అన్నపూర్ణాదేవి నిర్మించింది. తల్లి నాగులాంబ పేరుతో నాగులాపురం పట్టణం, తటాకాన్ని నిర్మించాడు. పెనుగొండలో గగన్‌మహల్‌ను నిర్మించాడు. 1522లో రాయలు రాయచూర్‌ని ఆక్రమించినట్లు ఓరుగంటి రామచంద్రయ్య రాశారు. ఇస్మాయిల్ ఆదిల్ షా అసద్ ఖాన్ లారీ అనే రాయబారిని శ్రీకృష్ణదేవరాయల వద్దకు పంపాడు.
     శ్రీకృష్ణదేవరాయలు తన కుమార్తె తిరుమలాంబను అరవీటి కామరాజు/ అళియరామరాయలతో వివాహం చేశాడు. వ్యాసరాయలు శ్రీకృష్ణదేవరాయల వైష్ణవమత గురువు. పోర్చుగీసు ఇంజినీర్ల సాయంతో కాలువలు, చెరువులు తవ్వించాడు. 1513లో సాధించిన కళింగ విజయానికి గుర్తుగా భువనవిజయం అనే ఆస్థాన భవనాన్ని నిర్మించాడు. వల్లభాచార్యుడు రాయల ఆస్థానాన్ని సందర్శించాడు. హంపిలో హజార రామాలయం, విఠలస్వామి దేవాలయాలను పూర్తిచేశాడు. శ్రీకృష్ణదేవరాయలు పూర్తి ఇస్లామిక్ పద్ధతిలో పద్మమహల్‌ను నిర్మించాడు. ఇతడి ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారు. దేశ భాషలందు తెలుగులెస్స అని రాయలు పేర్కొన్నారు. బండారు లక్ష్మీ నారాయణ కవి సంస్కృత భాషలో సంగీత సూర్యోదయం గ్రంథాన్ని రచించాడు. దీన్ని రాయలకు అంకితమిచ్చారు.

     శ్రీకృష్ణ దేవరాయలు జాంబవతి పరిణయం, మదాలస చరిత్ర, సత్యవధు ప్రియతము, సకల కథాసార సంగ్రహం, జ్ఞాన చింతామణి వంటి సంస్కృత భాషా గ్రంథాలు రచించాడు. అల్లసాని పెద్దన - మనుచరిత్ర, ధూర్జటి - శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం (శతకం), నంది తిమ్మన - పారిజాతాపహరణం, అయ్యలరాజు రామభద్రుడు- రామాభ్యుదయం, మాదయగారి మల్లన - రాజశేఖర చరిత్ర, పింగళి సూరన - రాఘవ పాండవీయం, కళా పూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం, తెనాలి రామలింగడు - పాండురంగ మహాత్మ్యం, రామరాజభూషణుడు/ భట్టుమూర్తి - వసుచరిత్ర, హరిశ్చంద్రనలోపాఖ్యానం, నరసభూపాళీయం గ్రంథాలు రచించారు.
 

అచ్యుతరాయలు (1530-1542):
     అచ్యుతరాయలు తిరుపతిలో పట్టాభిషేకం జరుపుకుని సింహాసనాన్ని ఆక్రమించాడు. ఇతడు గజపతిని ఓడించినట్లు రాధామాధవకవి తారకాభ్యుదయం చెబుతోంది. సాళువ నరసింగరాయల తిరుగుబాటును బావమరుదులు సలకం చిన్న, పెద్ద తిరుమల సహాయంతో అణచివేశాడు. ఇతడి ఆస్థానాన్ని కర్ణాటక సంగీత పితామహుడు పురంధరదాసు సందర్శించాడు.

 

సదాశివరాయలు (1542 - 1576):
     అళియరామరాయలు సహాయంతో సదాశివరాయలు 'గుత్తి' దుర్గంలో రాజుగా ప్రకటించబడ్డాడు. సదాశివుడు అచ్యుతరాయల అన్న రంగరాయ కుమారుడు. కానీ సలకం తిరుమలుడు రామరాయల్ని, సదాశివరాయల్ని వ్యతిరేకించి తిరుగుబాటు చేశాడు. ఈ అంతర్యుద్ధ సమయంలో వరదాంబిక ఆదిల్ షాను దండయాత్రకు ఆహ్వానించింది. చివరికి సదాశివుడు ఆదిల్ షాను ఓడించి పట్టాభిషేకం జరుపుకున్నాడు.

అళియ రామరాయలు సర్వాధికారాలు చెలాయించాడు. ముస్లింలను అధిక సంఖ్యలో సైన్యంలో చేర్చుకోవడమే కాకుండా తురకవాడలో గోవధను సైతం అనుమతించాడు. ఇతడి కాలంలో పోర్చుగీసు గవర్నర్ మార్టిన్ అపాన్జో డిసౌజా శ్రీరంగం, కాంచీపురం ఆలయాలపై దాడిచేశాడు. కానీ అనంతరం గవర్నర్‌గా వచ్చిన జావోడ కాస్ట్రో రామరాయలతో సంధి చేసుకున్నాడు. విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన తళ్లికోట/ రాక్షస తంగడి యుద్ధం 1565లో ఇతడి కాలంలోనే జరిగింది. యుద్ధంలో అళియ రామరాయలు మరణించగా, సోదరుడు తిరుమలరాయలు సదాశివరాయల్ని తీసుకుని పెనుగొండకు పోయి అరవీటి వంశాన్ని స్థాపించాడు. రాక్షస తంగడి యుద్ధం గురించి కేలదినృపవిజయం గ్రంథం వివరిస్తోంది. యుద్ధంలో సుల్తానుల సైన్యానికి గోల్కొండ రాజ్యం నాయకత్వం వహించింది. బీరార్ రాజ్యం మాత్రం యుద్ధంలో పాల్గొనలేదు.
 

అరవీటి వంశం 

     అరవీటి తిమ్మరాజు సాళువ నరసింహుని కొలువులో పనిచేశాడు. అతడి కుమారులే రామరాయలు, వెంకటాద్రి, తిరుమలరాయలు. తళ్లికోట యుద్ధంలో రామరాయలు, వెంకటాద్రి చనిపోగా తిరుమలరాయలు పెనుగొండకు పోయి అరవీటి వంశ పాలన ప్రారంభించాడు. తన రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించి తన కుమారులను పాలకులుగా నియమించాడు. పెనుగొండ కేంద్రంగా తెలుగు ప్రాంతాలను శ్రీరంగరాయలు, శ్రీరంగపట్నం కేంద్రంగా కన్నడ ప్రాంతాలను రామరాయలు, చంద్రగిరి కేంద్రంగా తమిళ ప్రాంతాలను వెంకటపతి రాయలు పాలించారు. రామరాజ భూషణుడు తన వసుచరిత్ర గ్రంథాన్ని తిరుమలరాయలకు అంకితం ఇచ్చాడు.

    క్రీ.శ.1572 నుంచి 1585 వరకు శ్రీరంగరాయలు అరవీటి వంశం పాలన చేశాడు. ఇతడి కాలంలోనే కోడూరు యుద్ధం (1579) జరిగింది. తర్వాత రెండో వెంకటపతి రాయలు (1586 - 1614) పాలనకు వచ్చాడు. రాజధానిని పెనుగొండ నుంచి వెల్లూరుకు మార్చాడు. అక్బర్ తన సార్వభౌమత్వాన్ని అంగీకరించాల్సిందిగా పంపిన రాయబారాన్ని తిరస్కరించిన వ్యక్తిగా ఇతడిని పేర్కొంటారు. రెండో వెంకటపతి భార్య బాయమ్మ. వీరికి సంతానం లేదు. దీంతో రాయలు తన అన్న కొడుకు శ్రీరంగరాయల్ని వారసుడిగా ప్రకటించి మరణించాడు. బాయమ్మ రహస్యంగా ఒక బ్రాహ్మణ బాలుడ్ని పెంచి అతడిని రాజును చేయాలని ప్రయత్నించింది.
 

తోపూరు యుద్ధం 1686:
      బాయమ్మ సోదరుడు గొబ్బూరు జగ్గరాజు తన మేనల్లుడ్ని సింహాసనం ఎక్కించడానికి కుట్రపన్ని శ్రీరంగరాయల కుటుంబాన్ని ఖైదు చేశాడు. కానీ వెలుగోటి కస్తూరి రంగప్ప కొడుకు యాచమ నాయకుడు శ్రీరంగరాయల కుమారుడు రామదేవరాయల్ని బందీ నుంచి తప్పించాడు. దాంతో జగ్గరాజు శ్రీరంగరాయల కుటుంబాన్ని మొత్తం హత్య చేయించాడు. జగ్గరాజును యాచమ నాయకుడు ఓడించి, వెల్లూరును ఆక్రమించి, రామదేవరాయల్ని రాజును చేశాడు. కానీ జగ్గరాజు మధుర, జింజి పాలకులతో కూటమి ఏర్పాటు చేసి 1686లో తోపూరు యుద్ధం చేశాడు. దక్షిణ దేశంలో పెద్ద ఎత్తున ఫిరంగులు వాడింది ఈ యుద్ధంలోనే. జగ్గరాజు కూటమి పూర్తిగా ఓడిపోయింది. ఈ యుద్ధం గురించి వెలిగోటివారి వంశావళి వివరిస్తుంది. రామదేవరాయల కాలంలోనే కందనవోలు బీజాపూర్‌లో విలీనమైంది.

మూడో వెంకటపతి రాయలు (1630-1642):
    రామదేవరాయల అనంతరం అళియ రామరాయల పెద మనవడైన మూడో వెంకటపతిరాయలు పాలనకు వచ్చాడు. బీజాపూర్, గోల్కొండ సుల్తానులతో యుద్ధాలు చేశాడు. చివరికి పరాజయం పొంది చిత్తూరు జిల్లా అడవుల్లోకి పోయి మరణించాడు.

 

మూడో శ్రీరంగరాయలు:
      చివరి విజయనగర పాలకుడు మూడో శ్రీరంగరాయలే. వెంగల్లు యుద్ధంలో గోల్కొండ సైన్యాలను ఓడించాడు. మీర్ జుమ్లా నాయకత్వంలో గోల్కొండ సైన్యాలు, ముస్తఫాఖాన్ నాయకత్వంలో బీజాపూర్ సైన్యాలు రాయల రాజ్యంపై దండెత్తాయి. 1642లో వెల్లూరు వద్ద జరిగిన యుద్ధంలో రాయలు పరాజయం పొందాడు. రాయల ప్రోత్సాహంతో మధుర, వెల్లూరు నాయకులు మీర్‌జుమ్లాతో పోరాడినా వందవాసి యుద్ధంలో పరాజయం పొందారు. 1665లో రాయలు మళ్లీ పెనుగొండను ఆక్రమించి 1680 వరకు పాలించాడు. సామ్రాజ్యం అస్తమించింది.

 

విజయనగర యుగ విశేషాలు 

పాలన: సంప్రదాయ రాచరికం. వంశానుగత పాలన, రాజు దైవాంశ సంభూతుడునే భావన ఉంది. ఆముక్తమాల్యద, పరాశరమాధవీయం, సకలనీతిసమ్మతం లాంటి గ్రంథాల్లో నాటి పాలనా విధానాలను వర్ణించారు. రాజ్యాన్ని రాష్ట్రం - మండలం - నాడు - స్థలం - సీమ - గ్రామం అనే రకాలుగా వర్గీకరించారు. మంత్రిమండలికి అధ్యక్షుడు ప్రధానమంత్రి (సర్వశిరః). ఇతడినే సభానాయక, తంత్రనాయక అని పిలిచేవారు. సమావేశాలు కొలువు కూటాల్లో జరిగేవి. రెండో దేవరాయల సభా భవనాన్ని ముత్యాలశాల అనీ, శ్రీకృష్ణదేవరాయల సభా భవనాన్ని భువన విజయం అనీ, అచ్యుతరాయల సభను వెంకట విలాస మంటపం అని పిలిచేవారు.

    ప్రభుత్వ నిర్వహణలో అట్టావన (రెవెన్యూ శాఖ), కందాచార (మిలటరీ సైనిక శాఖ), భాండార (ఖజానా), ధర్మాసన (న్యాయ శాఖ) లాంటి శాఖలు ఉండేవి. ప్రతి శాఖకు సంప్రతులు, కరణాలు ఉండేవారు. తొమ్మిది మంది సంప్రతులు ఉండటం వల్ల 9 శాఖలున్నట్లు భావించవచ్చు. సీమలు, స్థలాల పొలిమేరలు; భూకామాందులు, శిస్తుల గురించి సంప్రతులు చిట్టాలు తయారుచేసేవారు. రాష్ట్ర పాలనను నాయంకర రాజులు నిర్వహించేవారు. ఆంధ్ర ప్రాంతంలో రాష్ట్రాలను రాజ్యాలు అనేవారు. అచ్యుతరాయల కాలంలో 17 రాజ్యాలు (రాష్ట్రాలు) ఉన్నట్లు శాసనాధారాలు ఉన్నాయి. రాజ్యంపై అధికారిని దుర్గదన్నాయకుడు అనేవారు. అతడి కార్యస్థానాన్ని చావడి అనేవారు. సీమ అధిపతిని పారుపత్యదారు అనేవారు. సీమ ఆదాయ వ్యయాలను చూడటం, రైతులకు పట్టాలివ్వడం, పన్నులు విధించడం ఇతడి విధులు. స్థలాలకు అధిపతులుగా రెడ్డి/ గౌడ/ స్థల కరణాలు ఉండేవారు. గ్రామ పాలనకు 12 మంది ఆయగాండ్రులను నియమించేవారు. కరణం, రెడ్డి, తలారి అనే ఆయగాండ్రకు స్థల ఉద్యోగులు, ప్రభుత్వంతో సంబంధం ఉండేది. ఆయగాండ్రకు జీతాలు లేవు. ప్రజల నుంచి మేర పేరుతో పంటలో కొంతభాగం పొందేవారు.
     గ్రామాల్లో భాండారవాడలు, అమర గ్రామాలు, మాన్య గ్రామాలు అనే మూడు రకాలు ఉండేవి. మాన్య గ్రామాల్లో దేవ, బ్రాహ్మణ అగ్రహారాలు, ఉబ్బలి గ్రామాలు అనే రకాలుండేవి. ప్రభుత్వానికి చేసిన సేవకు ప్రతిఫలంగా ఇచ్చే గ్రామాలను ఉబ్బలి గ్రామాలు అనేవారు. మాన్య గ్రామాలు జోడి అనే నామమాత్రపు పన్నును చెల్లించేవి. ఆయగాండ్రకు ఇచ్చే భూమి మిరాసీ అనేవారు.

ఆర్థిక పరిస్థితులు:
      ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. భూములను సర్వే చేయించి పన్ను విధించేవారు. తెలుగు ప్రాంతాల్లో తిమ్మరుసు మంత్రి సర్వే నిర్వహించాడు. సర్వే కోసం తీరాంధ్రలో కేసరిపాటిగడ, రేనాడులో దోరగడ అనే కొలమానాలను వినియోగించారు. బ్రాహ్మణ ఈనాములపై 1/6వ వంతు, దేవాలయ భూములపై 1/30వ వంతు పన్ను వసూలు చేసేవారు. భూమి శిస్తు మాత్రం 1/3వ వంతు ఉండేది. మాగాణి (నీరాంబర), మెట్ట (కాడాంబర) పన్నుల్లో తేడాలుండేవి. ప‌న్నులు ధ‌న‌, ధాన్యరూపంలో చెల్లించవ‌చ్చు. పన్నులు ధన రూపంలోనే చెల్లించాల్సిందిగా కట్టడి చేసినట్లు పరాశరమాధవీయం ద్వారా తెలుస్తోంది. సువర్ణాదాయాన్ని సిద్ధాయం అనేవారు. గ్రామాల్లో పొలాలు, శిస్తు వివరాలను కవిలెలో నమోదు చేసి ఉంచేవారు (కవిలె సంప్రతులు). పశువులను మేపినందుకు పుల్లరి చెల్లించాలి. బిచ్చగాళ్లపై గణాచారి పన్ను విధించేవారు. కొండోజు అనే మంగలి అభ్యర్థన మేరకు అళియరామరాయలు కొన్ని ప్రాంతాల్లో మంగలి పన్నును తొలగించాడు. సాలెవారు మగ్గరి, పింజ సిద్ధాయం పన్నులను; కుమ్మరి చక్రకానిక పన్నును; ఉప్పుకొటార్లపై ఉప్పరి పన్ను; ఇండ్లపై ఇల్లరి పన్ను; నిధి నిక్షేపాలు, తోటలు, పశువులు, నీటిబుగ్గలపై సంపత్తి పన్ను విధించేవారు. నాగలాపురంలో ప్రవేశించే వస్తువులపై 42 వేల పగోడాల ఆదాయం వచ్చేదని న్యూనిజ్ రాశాడు. వివాహాల సమయంలో కల్యాణానికే, గుడి కళ్యాణం అనే పన్నులు విధించేవారు. శ్రీకృష్ణదేవరాయలు కందనవోలు, చంద్రగిరి ప్రాంతాల్లో కళ్యాణ పన్నులను తొలగించాడు. మహానవమితో ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేదని పేస్ రాశాడు.
     విజయనగర రాజ్యంలో బంగారం, వెండి, రాగి నాణేలు అమల్లో ఉండేవి. గద్వాణం బంగారు నాణెం. దాన్నే వరాహ అనేవారు. గద్వాణంలో సగం ప్రతాప. ఫణం, చిన్నం అనే ఇతర బంగారు నాణేలు కూడా వాడుకలో ఉండేవి.

ఎక్కువ వాడుకలో ఉన్న నాణెం మాత్రం ఫణం. తార్ అనేది వెండి నాణెం. ఇది ఫణంలో ఆరో వంతు. జిటలు, కాసు అనేవి రాగి నాణేలు. దీనారం అనే ఈజిప్షియన్ నాణెం కూడా వాడుకలో ఉండేది.
     వ్యవసాయ అభివృద్ధికి చెరువులు, కాలువలు, తటాకాలను తవ్వించారు. బుక్కరాయల కాలంలో పెనుగొండ వద్ద శిరువేరు తటాకం, సాళువ నరసింహుడి కాలంలో అనంతపురం దగ్గర నరసాంభుది తటాకం, శ్రీకృష్ణదేవరాయల కాలంలో నాగలాపురం తటాకాలను నిర్మించారు. కొండవీటి రాజ్యంలో కొండమరసు తిమ్మసముద్రం, కొండ సముద్రాలను నిర్మించాడు. నాటి తటాకాల గురించి కోడుమామిళ్ల శాసనం తెలుపుతోంది. చెరువు కింద సాగు చేసుకునే రైతులు చెరువు నిర్మించిన వారికి దశబంధ మాన్యం (1/10) చెల్లించేవారు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు ఇంజినీర్ల సహాయంతో తుంగభద్ర నదిపై తూరుట్టు ఆనకట్టను నిర్మించాడు. వ్యవసాయేతర, వృత్తి పన్నులను శుల్కాదాయం అనేవారు. సాలె, కమ్మరి, కుమ్మరి... వృత్తులవారు జాతి సిద్ధాయం అనే వృత్తి పన్నును చెల్లించేవారు. కావేరి నదిపై కృష్ణరాయలు కృష్ణరాయ సాగర్‌డ్యామ్, కోరుగల్లు వద్ద ఆనకట్టను నిర్మించాడు. మొదటి బుక్కరాయల మంత్రి చిక్కప్పవడయార్ బుక్కసాగరం, అనంతసాగరం చెరువులను తవ్వించాడు. దేశమంతటా తోటలు విస్తారంగా ఉన్నాయనీ, పండ్లు చవకగా లభించేవని పేస్ పేర్కొన్నాడు. వ్యవసాయ సంబంధ పరిశ్రమలు ఎక్కువగా ఉండేవి. తాడిపత్రి, ఆదోని, గుత్తి, వినుకొండ నూలు పరిశ్రమకు కేంద్రాలుగా ఉండేవి. కలంకారీ వస్త్ర పరిశ్రమ కూడా వృద్ధి చెందింది. కర్నూలు, గుత్తి, అనంతపురం ప్రాంతాల్లో వజ్రాలు అధికంగా దొరికేవి. వజ్రకరూర్ గనులు ప్రసిద్ధి చెందాయి. నకిలీ వజ్రాలు తయారవుతున్నట్లు బార్బోసా రాశాడు.

    గ్రామాల్లో జరిగే స్థానిక సంతల గురించి ఆముక్త మాల్యద పేర్కొంటోంది. వ్యాపార కేంద్రాల గురించి హంశవింశతి గ్రంథం వివరిస్తోంది. విజయనగరంలో 300 ఓడరేవులున్నాయని అబ్దుల్ రజాక్ రాశాడు. మోటుపల్లి రేవు కోసం కొండవీడు, విజయనగర రాజ్యాల మధ్య చాలా కాలం ఘర్షణ జరిగింది. మొదటి దేవరాయలు మోటుపల్లిని ఆక్రమించి ధర్మశాసనం (1416) వేయించాడు. పులికాట్ రేవులో హిందు, ముస్లింల వర్తక వాణిజ్యాలు; ఎగుమతి, దిగుమతుల గురించి బార్బోసా రాశాడు. టోకు వర్తకులు హెర్నుకం అనే పన్ను చెల్లించేవారు. నాడు కాలికట్ ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రంగా ఉండేది. వ్యాపార, వాణిజ్య కేంద్రాలను నకరములు అనేవారు.
 

సాంఘిక పరిస్థితులు:
    సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉండేది. డొమింగో పేస్ చాతుర్వర్ణ వ్యవస్థ గురించి వివరించాడు. నాటి గ్రామీణ జీవనం గురించి బార్బోసా రాశాడు. భోక్తలు భోజనం మినహా ఏ ఇతర పనీ చేయరని రాశాడు. క్షత్రియ స్త్రీలు సతీసహగమనం పాటించేవారని, నరబలి ఆచారం ఉందని పేర్కొన్నాడు. యుద్ధ ఖైదీలను ఎక్కువగా బలి ఇచ్చేవారని, ఆర్థిక వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయని, గ్రామీణులు పేదరికం అనుభవించేవారని, పూరి గుడిసెల్లో నివసిస్తూ అర్ధ నగ్నంగా ఉండేవారని బార్బోసా తెలిపాడు. మొదటి దేవరాయల కాలంలో వచ్చిన నికోలోడీ కాంటే విజయనగరం చుట్టుకొలత, అందచందాలను; దీపావళి, నవరాత్రి ఉత్సవాలను ప్రజలు జరుపుకునే విధానం గురించి రాశాడు. రెండో దేవరాయల కాలంలో వచ్చిన అబ్దుల్ రజాక్ విజయనగరం లాంటి పట్టణం ప్రపంచంలో మరెక్కడా లేదని కితాబిచ్చాడు. ఇక్కడ వజ్రాలను రాశులుగా పోసి అమ్మేవారని పేర్కొన్నాడు. వేశ్యా వృత్తిపై విధించిన పన్నుల ద్వారా సమకూరిన ఆదాయాన్ని పోలీస్ వ్యవస్థకు జీతభత్యాలుగా చెల్లించేవారని తెలిపాడు. వేశ్యలను రూపాజీవాళి అని పిలిచేవారని చెప్పాడు. వేట, కుస్తీ, మల్లయుద్ధం, తోలుబొమ్మలాట, సంగీతం, నాట్యం, వీధి నాటకం, యక్షగానం, చదరంగం నాటి ప్రజల ముఖ్య వినోదాలని రజాక్ పేర్కొన్నాడు.

     శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చిన డొమింగో పేస్ చాతుర్వర్ణ వ్యవస్థ, దేవదాసీ విధానం, బ్రాహ్మణులు నిర్వహించిన ఇతర వృత్తుల గురించి వివరించాడు. విజయనగరాన్ని రోమ్ పట్టణంతో పోల్చాడు. అతడి కాలంలోనే వచ్చిన బార్బోసా కూడా నాటి సాంఘిక, మత పరిస్థితులను వివరించాడు. అచ్యుతరాయల కాలంలో వచ్చిన న్యూనిజ్ సమాజంలో ఉన్న భూస్వాములు, ప్రభువుల శృంగార ప్రియత్వం; సాంఘిక దురాచారాల గురించి రాశాడు. విజయనగర కాలంలో అద్భుతంగా చేసిన పండగ దసరా. కృష్ణరాయలు పంచములు కూడా దేవుడి పూజకు అర్హులని మాలదాసరి కథలో పేర్కొన్నాడు. విజయనగర కాలంలోనే మొదటిసారిగా పంచమ కులస్థులు (మాల, మాదిగ, వలయ, చక్కిటి, పరయ) ఏర్పాడ్డారు. కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, పశుకాపరులను పాంచాలులు లేదా పంచాననంవారు అనేవారు. నాటి సమాజంలో సాలెవారిని కైకోలులు అనీ, గారడీ చేసేవారిని విప్రవినోదులు అనీ, వ్యవసాయదారులను వక్కలి లేదా వెళ్లాల అనీ, పశుకాపరులను కురుబలు, ఇదయనులు అని పిలిచేవారు. వైశ్యులను నకరములు అనేవారు.
    బహుభార్యత్వం, కన్యాశుల్కం, వరశుల్కం, సతీసహగమనం లాంటి ఆచారాలు ఎక్కువగా ఉండేవి. రెండో దేవరాయలు బ్రాహ్మణులతో కన్యాదాన విధానాన్ని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేయించాడు. రాయల ఆస్థానంలోని అనేక వందల మంది స్త్రీలు అతడితో సహగమనం చేయడానికి సిద్ధం అని నికోలో కాంటే రాశాడు. భర్త శవంతో పాటు భార్యను పూడ్చిపెట్టే ఆచారం తెలుగువారిలో ఉన్నట్లు న్యూనిజ్ రాశాడు. కుల కట్టుబాట్లు పాటించని వారిపై సమయ సుంకం విధించేవారు.

సైనిక, న్యాయపాలన:
      న్యాయ నిర్వహణకు క్రమబద్ధమైన న్యాయస్థానాలు లేవనే చెప్పాలి. నాలుగు రకాల న్యాయస్థానాలున్నట్లు పరాశరమాధవీయం పేర్కొంటోంది. రాయలు అత్యున్నత న్యాయాధికారి. కానీ రాయలకు బదులు ప్రధాని న్యాయ నిర్వహణ జరిపేవాడని అబ్దుల్ రజాక్ పేర్కొన్నాడు. మహామంత్రి తిమ్మరుసుకు ధర్మప్రతిపాలక అనే బిరుదు ఉండేది. రాయలకు న్యాయనిర్వహణలో తోడ్పడే ఉద్యోగులను ప్రాడ్వివాక్కులు అనేవారు. నేర నిరూపణకు దివ్య పరీక్షలు అమల్లో ఉన్నట్లు నికోలోడీ కాంటే రాశాడు. గ్రామంలో శాంతి భద్రతలకు తలారి, స్థలానికి కావలివారు, పర్వతారణ్య సరిహద్దు ప్రాంతాల్లో పాళెగార్లు బాధ్యత వహించేవారు. ఆయగాండ్రకు ఈనాములు, పాలెగార్లకు జాగీర్లు ఇచ్చేవారు.
   విజయనగర సైన్యంలో సిద్ధ సైన్యం, కైజీత సైన్యం అనే రెండు భాగాలుండేవి. సిద్ధ సైన్యంపై అజమాయిషీకి కందాచారశాఖ ఉండేది. రాయలు సొంతంగా జీతం ఇచ్చి పోషించే సైన్యం కైజీత సైన్యం. కందాచార శాఖకు సేనాపతి లేదా దళవాయి అధిపతిగా ఉండేవాడు. ఇతడు మంత్రిమండలిలో కూడా సభ్యుడు. ముస్లిం సైన్యాలకు రాయలు ఈనాములిచ్చాడని పెరిస్టా రాశాడు. ఇవేకాకుండా అమరనాయక సైన్యం కూడా ఉండేది. ఇది భూస్వామ్య విధానాన్ని పోలి ఉంటుంది. సైనిక సహాయానికి ఇచ్చే భూమి లేదా దానిపై వచ్చే ఆదాయాన్ని అమరము అనేవారు. అచ్యుతరాయల కాలంలో ఆరు లక్షల అమర నాయక సైన్యం ఉండేదని న్యూనిజ్ రాశాడు. నౌకా బలం కూడా ఉండేది. కృష్ణదేవరాయల కాలంలో హోనోవర్ రాష్ట్రాధిపతి తిమ్మోజు నౌకాదళపతిగా ఉన్నట్లు తెలుస్తోంది. గోవా ఆక్రమణలో పోర్చుగీసు వారికి రాయల నౌకాబలం సహాయం చేసిందని ఫాదర్ హీరాస్ పేర్కొన్నాడు. రాయవాచకం చతుర్విద దుర్గాలను పేర్కొంటోంది. శత్రువులపై రాళ్లురువ్వే దంబోళి అనే యుద్ధ పరికరం ఉన్నట్లు రాశాడు. ద్వంద్వ యుద్ధం, సాము గరిడీలు ఉండేవి.

మత పరిస్థితులు:
    విజయనగర పాలకులు వేదమార్గ ప్రతిష్ఠాపనాచార్య అనే బిరుదు ధరించారు. రాజులు హిందూ మతాభిమానులు అయినప్పటికీ పరమత సహనాన్ని ప్రదర్శించారు. సైన్యంలో అన్ని మతాలవారినీ చేర్చుకున్నారు. శ్రీరంగంలోని వైష్ణవులు జైనులను హింసిస్తుంటే బుక్కరాయలు కల్పించుకుని వారి మధ్య సంధి కుదిర్చాడు. దేవరాయలు జైనులకు, ముస్లింలకు ప్రార్థనా సౌకర్యాలు కల్పించాడు. శ్రీశైలంలోని జైనులను శాంతలింగప్ప హింసిస్తుంటే శ్రీకృష్ణదేవరాయలు వెలుగోటి గని తిమ్మానాయుడిని పంపించి శిక్షించాడు. అళియరామరాయలు రాజధానిలోని తురకవాడలో గోవధను సమ్మతించాడు. కాకతీయుల కాలంలో ప్రారంభమైన స్మార్త మతం రాయల కాలంలో పోషణకు నోచుకుంది. సంగమ వంశీయులు కాలాముఖ శైవులు. వారి కుల దైవం విరూపాక్షుడు. కుల గురువు క్రియాశక్తి ఆచార్యులు. స్మార్త గురుపీఠమైన శృంగేరి ప్రాబల్యం పొందింది. హరిహరరాయలు శృంగేరిని దర్శించి విద్యాతీర్థులకు దానధర్మాలు చేశాడు. మాధవాచార్యులు (బుక్కరాయల మంత్రి), అతడి తమ్ముడు శాయణాచార్యులు వేదాలకు, స్మృతులకు భాష్యాలు రాశారు. మాధవాచార్యులు కర్మ మీమాంస పద్ధతిని పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. అతడు జైమినీయ న్యాయ మాలావిస్తర, యజ్ఞతంత్ర సుధానిధి అనే గ్రంథాలు రచించాడు. రెండో వెంకటపతి రాయల ఆస్థానంలో ప్రముఖ అద్వైత ప్రవక్త అయిన అప్పయ్యదీక్షితులు నివసించాడు.
       సామాన్య ప్రజలు మాత్రం శైవ, వైష్ణవ మతాలను ఆదరించారు. కాలాముఖ శాఖకు పరిమిత ఆదరణే ఉండేది. దేవరాయల కాలం వరకు క్రియాశక్తి కుల గురువుగా ఉన్నాడు. హరిహరుని సోదరుడైన మారప్ప మంత్రి మాధవమంత్రికి కూడా క్రియాశక్తి పండితుడే గురువు.

తుళువ వంశ పాలనా కాలం నుంచి వైష్ణవం రాజాదరణ పొందింది. మధ్వాచార్యులు ఆంధ్రదేశం పర్యటించి గోదావరి తీరంలో శ్యామశాస్త్రి (నరహరితీర్థ), శోభనభట్టు (పద్మనాభతీర్థులు)లను శిష్యులుగా స్వీకరించాడు. మధ్వాచార్యుల అనంతరం ద్వైత గురుపీఠాన్ని అలంకరించింది పద్మనాభ తీర్థులే. నరహరి తీర్థులు శ్రీకూర్మం కేంద్రంగా ద్వైత మతాన్ని ప్రచారం చేశాడు. విజయనగర కాలంలో ప్రసిద్ధ ద్వైతాచార్యులు మాత్రం వ్యాసతీర్థులే. సాళువ నరసింహుడి గురువు వ్యాస తీర్థులు. ఆంధ్రదేశంలో ప్రచారమైన విశిష్టాద్వైత శ్రీ వైష్ణవ శాఖ వడగల శాఖ. కృష్ణరాయలు గోవింద దేశికుడిని తొలగించి తాతాచార్యులను రాజగురు పీఠంలో నియమించాడు. వల్లభాచార్యులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించాడు. అళియరామరాయల గురువు కూడా తాతాచార్యులే. దొడ్డయాచార్య అప్పయ్య దీక్షితులను ఓడించి శైవక్షేత్రమైన చిదంబరంలో గోవిందరాజస్వామి పూజోత్సవాలు నిర్వహించాడు. శ్రీరంగరాయల గురువు తిరుమల తాతాచార్యులు. రెండో వెంకటపతి కాలం నుంచి శాసనాల్లో విరూపాక్షుని బదులు వేంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అతడి నాణేలపై కూడా శ్రీవేంకటేశాయనమ: అనే లేఖనం కనిపిస్తుంది. తిరుపతి, శ్రీశైలం, అహోబిలం, శ్రీకాళహస్తి నాటి ప్రసిద్ధ దేవాయాలు. కడప జిల్లాలోని పుష్పగిరి వద్ద శృంగేరిస్మార్త మఠ శాఖ ఏర్పడింది. స్మార్త మతస్థులు పంచాయతన దేవతలకు కుమారస్వామిని చేర్చి షణ్మాతా విధానాన్ని పాటించగా, మద్వాచార్యుడి వల్ల హనుమంతుడి పూజకు ఆదరణ పెరిగింది. మహారాష్ట్ర నుంచి విఠోబా ఆరాధన ప్రవేశించింది. నవరాత్రుల్లో జంతువులను బలి ఇస్తారని పేస్ పేర్కొన్నాడు. రాజధానిలో శివరాత్రి నాడు సిడమెక్కేవారని, రథానికున్న ఇనుప గాలాలకు వీపు చర్మం గుచ్చి వేలాడేవారని నికోలోడీ కాంటి రాశాడు. తిరుపతి కొండకు వెళ్లి వింత మొక్కలు మొక్కే భక్తుల గురించి తరిగొప్పల మల్లన్న తన చంద్రభాను చరిత్ర గ్రంథంలో పేర్కొన్నాడు. అరవీటి వంశస్థుల కాలంలో రాబర్ట్ డినోబిలి అనే ఇటాలియన్ తత్వబోధ స్వామిగా పేరు మార్చుకుని క్రైస్తవ మత ప్రచారం చేశాడు.

     రాయల నాణేలపై రాజు పేరు లేదా బిరుదు (కన్నడంలో మాత్రమే) ఒకవైపు; ఎద్దు, ఏనుగు, గద్ద గుర్తులు మరో వైపు ముద్రించారు. ఆలయ ప్రాంగణ గోడలపై గుర్రం ప్రతిమ ఎక్కువగా కనిపిస్తుంది. విజయనగర పట్టణం నిర్మాణానికి ముందే నిర్మించిన పంపావతి ఆలయం విరూపాక్షుడికి అంకితం చేశారు. దీన్ని మొదటి హరిహరరాయలు నిర్మించగా దాని ముందు రంగమండపంను తన పట్టాభిషేకానికి గుర్తుగా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు.
 

విద్యాసారస్వతాలు - కళలు:
    అధికార భాష సంస్కృతం అయినప్పటికీ తెలుగు, తమిళ, కన్నడ భాషలకు ప్రాధాన్యం ఇచ్చారు. శృంగేరి పీఠ గ్రంథాలయ అధిపతి, కవి అయిన కృష్ణభట్టుకు ఈనాములిచ్చి రెండో బుక్కరాయలు గౌరవించాడు. తాళ్లపాక అన్నమాచార్యులు తన కీర్తనలను రాగి రేకులపై రాసి సరస్వతీ గ్రంథాలయంలో భద్రపరిచాడు.

 

సంస్కృత భాషా రచనలు 

విద్యారణ్యస్వామి - ఐతరేయదీపిక, తైతరేయదీపిక, పంచదశి, జీవన్ముక్తి వివేక.
మాధవాచార్యులు - పరాశర మాధవీయం, జైమినీయ న్యాయమాలా విస్తర, సర్వదర్శన సంగ్రహ.
శాయణుడు - వేదార్థ ప్రకాశిక (ధాతువృత్తి) (సత్యార్థ ప్రకాశిక - స్వామి దయానంద సరస్వతి)
వెంకటముఖి - శుల్బమీమాంస (లింగాధ్వరి - వేదార్థ తత్వ నిర్ణయం)
వేదాంతదేశికుడు - తత్వటీక, తాత్పర్య చంద్రిక, న్యాయ సిద్ధాంజనం, యాదవాభ్యుదయం, రామాభ్యుదయం.
వ్యాసతీర్థులు - తర్కతాండవ, తాత్పర్య చంద్రిక, న్యాయామృతం.

అప్పయ్య దీక్షితులు - శైవార్కమణిదీపిక
మాధవ మంత్రి - శైవామ్నాయ సారం
రెండో దేవరాయలు - మహానాటక సుధానిధి
ఉద్దండ కవి - మల్లికామారుత (నాటకం)
గంగాదేవి - మధురా విజయం
తిరుమలాదేవి - వరదాంబికా పరిణయం
అరుణ గిరినాథ డిండిముడు - సోమవల్లీ యోగానంద ప్రహసన
రెండో రాజనాథ డిండిముడు - సాళువాభ్యుదయం
మూడో రాజనాథ డిండిముడు - అచ్యుతరామాభ్యుదయం
శ్రీకృష్ణదేవరాయలు - జాంబవతీ పరిణయం, మదాలస చరిత్ర, ఉషా పరిణ‌యం రసమంజరి, సత్యవధూప్రియతం, సకల కథాసార సంగ్రహం, జ్ఞాన చింతామణి.
గోవింద దీక్షితులు (రఘనాథ రాయల మంత్రి) - సాహిత్య సుధ
సాయణుడు - ధాతువృత్తి
బోగనాథుడు - ఉదాహరణమాల గ్రంథాలు, అలంకారశాస్త్ర గ్రంథాలు
దేవనభట్టు - సంగీత ముక్తావళి
గోపతిప్ప - తాళదీపిక

లక్ష్మీధరుడు - సంగీత సూర్యోదయం
రఘునాథరాయలు - సంగీత సుధ
    శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద గ్రంథంలో గోదాదేవి, రంగనాథుల ప్రేమ గురించి వివరించింది. తిరుమలాంబ అచ్యుతరాయలు, అతడి ఆస్థాన నర్తకి వరదాంబిక మధ్య గల ప్రేమ గురించి రాసింది.

 

తెలుగు భాషాభివృద్ధి:
     తెలుగు భాషా చరిత్రలో విజయనగర యుగం స్వర్ణయుగం. దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. శ్రీనాథ కవిసార్వభౌముడు ఆంధ్రవాణికి కనకాభిషేకం చేయించాడు. నాచన సోముడు రెండో బుక్కరాయలచే పంచాకలదిన్నెను అగ్రహారంగా పొందాడు. ఉత్తర హరివంశం గ్రంథాన్ని రచించి హరిహర దేవుడికి అంకితం ఇచ్చాడు. ఉదయగిరి పాలకుడు పూసపాటి బసవరాజుకు, దూబగుంట నారాయణ కవి తన పంచతంత్రాన్ని అంకితం చేశాడు. దగ్గుపల్లి దుగ్గన్న - నచికేతోపాఖ్యానం; నంది మల్లయ, ఘంట సింగయల - ప్రబోధ చంద్రోదయం గ్రంథాలు గంగన్న మంత్రికి అంకితం ఇచ్చారు. సంస్కృత నాటకాన్ని తెలుగు కావ్యంగా రచించిన మొదటి జంట కవులు వీరే. పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతం, శృంగార శాకుంతలం గ్రంథాలను రచించాడు.
    వాణి నారాణి అని పలికిన పిల్లలమర్రి, అన్నమాచార్యులు సాళువ నరసింహుడి కాలంవారు. ప్రోలుగంటి చెన్నమంత్రి నారసింహ పురాణం, బాలభారతం, సౌరభ చరిత్ర (యక్షగానం)లను రచించి నరసింహుడు దగ్గర అగ్రహారాదులు పొందాడు. 'తెలుగులో ప్రథమ యక్షగానంగా సౌరభ చరిత్ర రచయితగా చెన్నమంత్రి ఆంధ్ర సాహిత్య చరిత్రలో విశిష్ఠ స్థానాన్ని అలంకరిస్తారు' అని ఆరుద్ర పేర్కొన్నాడు.

మల్లయ, సింగయ జంట కవులు తుళువ నరస నాయకుడిని ఆశ్రయించి వరాహ పురాణాన్ని అంకితం ఇచ్చారు. శతలేఖనీ సురత్రాణ బిరుదు పొందిన చరిగొండ ధర్మన్న చిత్రభారతం గ్రంథాన్ని రచించాడు. కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రంశిక త్సాలభంజిక గ్రంథాన్ని రచించాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం (భువన విజయం)లో అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారు. ఆస్థాన కవి అల్లసాని పెద్దన మనుచరిత్ర (స్వారోచిత మనుసంభవం) గ్రంథాన్ని రచించి రాయలకు అంకితం చేశాడు. ఇది తెలుగులో ప్రథమ ప్రబంధం. నంది తిమ్మన పారిజాతాపహరణం గ్రంథాన్ని రచించాడు. మాదయగారి మల్లన తన రాజశేఖర చరిత్రను నాదెండ్ల అప్పరుసు (కొండవీడు)కు అంకితమిచ్చాడు. ధూర్జటి తన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, శ్రీకాళహస్తీశ్వర శతకాలను దైవానికి అంకితమిచ్చాడు. కృష్ణరాయ విజయంను కూడా కుమార ధూర్జటి రచించాడు. అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం కావ్యాన్ని రచించి గొబ్బూరు నరసరాజుకు అంకితమిచ్చాడు. పింగళి సూరన కళాపూర్ణోదయం, రాఘవ పాండవీయం, ప్రభావతీ ప్రద్యుమ్నం అనే గ్రంథాలను రచించాడు. రాఘవ పాండవీయం తెలుగులో మొదటి ద్వ్యర్థి కావ్యం. పెదవెంకటాద్రికి అంకితం ఇచ్చారు. పద్య నవలగా పేర్కొన్న కళాపూర్ణోదయంను కృష్ణభూపతికి అంకితం ఇచ్చారు.
    తెనాలి రామకృష్ణుడి అసలు పేరు గార్లపాటి రామలింగయ్య. నాదెండ్ల గోపరుసు మంత్రి అయిన ఊరదేచయ్యకు అంకితంగా ఉద్భటారాధ్య చరిత్ర గ్రంథాన్ని రామలింగడు రచించాడు. తర్వాత ఘటికాచల మహాత్మ్యం, పాండురంగ మహాత్మ్యంలను రచించి విరూరి వేదాద్రికి అంకితం ఇచ్చాడు. భట్టుమూర్తి లేదా రామరాజ భూషణుడు మొదటి కావ్యం నరస భూపాలీయం లేదా కావ్యాలంకార సంగ్రహం. తర్వాత వసుచరిత్ర, హరిశ్చంద్ర నలోపాఖ్యానం గ్రంథాలు రచించాడు.

సంకుసాల నరసింహ కవి - కవికర్ణ రసాయన గ్రంథాన్ని, చింతలపూటి ఎల్లన రాధామాధవ కావ్యాన్ని కృష్ణరాయల ఆస్థానంలో రచించారు. నాదెండ్ల గోపరుసు - కృష్ణార్జున సంవాదం పేరుతో గయోపాఖ్యానంను ద్విపదలో రాశాడు. మనుమంచిభట్టు అశ్వలక్షణసారం గ్రంథాన్ని రచించి కంపరాయలు (ఉదయగిరి)కు అంకితం ఇచ్చాడు.
     అరవీటి వంశస్థుల కాలంలో నాయక రాజ్యాలు ఆంధ్రభాషకు ప్రధాన కేంద్రాలయ్యాయి. తంజావూరు యక్షగానానికి, మధుర వచనానికి పేరొందాయి. 132 ఆయుధాలను వర్ణిస్తూ వననప్ప - ఖడ్గ లక్షణం గ్రంథాన్ని రచించాడు. గోపనమంత్రి - సింధుమతీ విలాసం, తిరువెంగళనాథుడు - చొక్కనాథ చరిత్ర, భద్రకవిలింగయ - సానంద చరిత్ర గ్రంథాలను రచించారు. రఘనాథ నాయకుని ఆస్థాన కవి చేమకూర వెంకటకవి - సారంగధర చరిత్ర, విజయవిలాస కావ్యాలను రఘునాథ నాయకుడికి అంకితం ఇచ్చాడు. కృష్ణాధ్వరి - నైషధ పారిజాతం గ్రంథాన్ని, విజయరాఘవుడు - రఘనాథాభ్యుదయం గ్రంథాన్ని రచించాడు. రఘునాథ నాయకుడు - వాల్మీకి చరిత్ర గ్రంథాన్ని రాశాడు. అతడి ఆస్థానంలో రామభద్రాంబ, మధురవాణి అనే కవయిత్రులున్నారు.
     మధురవాణి రాయలతో కనకాభిషేకం పొందింది. విజయ రాఘవుడు చెంగళ్వకాళకవి, రంగాజమ్మలను పోషించాడు. రంగాజమ్మ - మన్నారుదాస విలాసం గ్రంథాన్ని రచించింది. ప్రతాపసింహుడి ప్రియురాలు ముద్దుపళని - రాధికాస్వాంతనం అనే శృంగార కావ్యాన్ని రాసింది. రెండో శరభోజి కాలంలో త్యాగరాజు నివసించాడు. ఇతడిది కాకర్ల వంశం. మధుర నాయకరాజు విశ్వనాథుడి స్థానాపతి - రాయవాచకం గ్రంథాన్ని రచించాడు. ఏకామ్రనాథుడు ప్రతాప చరిత్ర పేరుతో కాకతీయుల చరిత్ర రాశాడు. కాసె సర్వప్ప - సిద్ధేశ్వర చరిత్ర, కామేశ్వర కవి - సత్యభామా స్వాంతనం, విజయరంగ చొక్కనాథుడు - శ్రీరంగ మహాత్మ్యం, మాఘమహాత్మ్యం గ్రంథాలను రచించాడు.

రఘనాథ తొండమాన్ (పుదుక్కోట) - పార్వతీ పరిణయం అనే తెలుగు ప్రబంధాన్ని రచించాడు. ఇతడి ఆస్థానంలో ఉన్న నుదురుపాటి వెంకన్న - ఆంధ్రభాషార్ణవం (తెలుగులో ప్రథమకోశం లేదా నిఘంటువు)ను రూపొందించాడు. కళువె వీరరాజు (మైసూర్) మహా భారతాన్ని తెలుగు వచనంలో రాశాడు.
     విద్యారణ్య మహర్షి తన సంగీతసారం గ్రంథంలో అనేక రాగాలను వివరించాడు. కృష్ణరాయలు కృష్ణ అనే విద్వాంసుడి వద్ద వీణ నేర్చుకున్నాడు. రామయ మంత్రి సర్వమేళా కళానిధి కర్ణాటక సంగీతానికి వేదం లాంటిది. వీణ ప్రధాన వాయిద్యంగా పేరొందింది. వీరనరసింహుడి కాలానికే కూచిపూడి భాగవతులు ప్రాచుర్యంలోకి వచ్చారు.

 

వాస్తు నిర్మాణాలు - కళలు
     ఆలయాల నిర్మాణం ఎక్కువగా జరిగింది. చోళ, చాళుక్య శైలిని అనుసరించారు. ఈ ఆలయాలను సువిశాల ప్రాంగణంలో ఎత్తయిన గోపురాలతో ప్రాకారాల మధ్య గంభీర విమానాలు, దేవీ ఆలయం, రంగ కళ్యాణ మండపాలతో సర్వాంగ సుందరంగా రూపొందించారు. మండపాలు విశాలంగా ఉండి సహస్ర స్తంభ మండపాలుగా ప్రసిద్ధి చెందాయి. పంపావతి ఆలయాన్ని మొదటి హరిహరరాయలు నిర్మించి విరూపాక్షుడికి అంకితమివ్వగా, శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయం ముందు రంగమండపం నిర్మించాడు. హంపిలో హజరరామాలయం, విఠలస్వామి దేవాలయాలను నిర్మించాడు. హజరరామాలయం గోడలపై రామాయణ గాథలను శిల్పాలుగా చెక్కారు. విఠలస్వామి ఆలయం విజయనగర వాస్తు నిర్మాణాల్లో మకుటాయమైంది. దీన్నే సప్తస్వర మండపం అంటారు. ఫెర్గూసన్ ఈ ఆలయ గొప్పతనాన్ని పొగిడాడు. దీన్ని రాయలు తూర్పు దిగ్విజయ యాత్రలకు చిహ్నంగా నిర్మించాడు. ఇండో - ఇస్లామిక్ శైలిలో నిర్మించిన కట్టడం 'పద్మమహల్'. పట్టపుటేనుగుల శాలలో కూడా ఇస్లామిక్ వాస్తు ప్రభావం కనిపిస్తుంది.   

    అచ్యుతరాయల ఉద్యోగి విరూపన్న అనంతపురం జిల్లా లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం వర్ణచిత్రాలకు నిలయం. చిదంబరంలో పార్వతి ఆలయం, కాంచీపురంలో ఏకాంబరనాథ స్వామి ఆలయాన్ని నిర్మించారు. రాతి గోపురాలను నిర్మించారు. నాటి చిత్రలేఖనాలు హంపి, సోమపాలెం, లేపాక్షి, తాడిపత్రి మొదలైన చోట్ల కనిపిస్తాయి. విఠలాలయంలో ఉన్నట్లే తాడిపత్రి ఆలయంలో కూడా ఏకశిలారథం ఉంది. లేపాక్షి బసవన్న పెద్ద శిల్పం. సుందరమైన శిల్ప సంపదకు బేలూరు, హళేబీడుల ఆలయాలతో పోటీగా విజయనగర ఆలయాల్లో నిలవగలిగింది ఒక తాడిపత్రియే అని ఫెర్గూసన్ అభిప్రాయం.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌