• facebook
  • whatsapp
  • telegram

గ్రామ/ వార్డు వాలంటీర్ల వ్యవస్థ

నూతన రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలోని నవరత్నాల్లో భాగంగా కులం, మతం, వర్గం, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలకు సులువుగా ప్రభుత్వ సేవలను అందించే ఉద్దేశంతో గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. సంక్షేమ పథకాల్లో అవకతవకలు, అవినీతి, అక్రమాలను నిరోధిస్తూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలన్నదే దీని ప్రధాన ధ్యేయం.

వాలంటీర్లు తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను గ్రామ పంచాయతీ/ మున్సిపల్‌ సంఘం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. 2019 జూన్‌ 22న గ్రామ వాలంటీర్లు, 23న వార్డు వాలంటీర్లకు సంబంధించిన రెండు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది.

గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను, పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతి 100 కుటుంబాలకు ఒక వార్డు వాలంటీర్‌ను నియమించారు. వారు ఆయా కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సేవలను అందిస్తారు. మైదాన ప్రాంతాల్లోని గ్రామ వాలంటీర్లు ఇంటర్మీడియట్‌ లేదా సమానమైన విద్యార్హతను కలిగి ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వార్డు వాలంటీర్లకు డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత ఉండాలి. వాలంటీర్‌గా నియమితులయ్యే వారు కచ్చితంగా సంబంధిత గ్రామ/ గ్రామ పంచాయతీ/ పట్టణ స్థానిక సంస్థలకు చెందినవారై ఉండాలనే నిబంధనను విధించారు. గ్రామ/ వార్డు వాలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా రూ.5,000 చెల్లిస్తారు. ఈ వేతనాలకు సంవత్సరానికి రూ.1200 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ

* విజయవంతంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్ని ఒకేచోట అందుబాటులో ఉంచడం, ప్రజా సమస్యల్ని పరిష్కరించి, నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించడం గ్రామ/ వార్డు సచివాలయాల ముఖ్య ఉద్దేశం.

1. గ్రామ సచివాలయ వ్యవస్థ:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాదిరి గ్రామ పంచాయతీల్లోనూ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వ్యవస్థ ఏర్పాటు కావాలనే లక్ష్యంతో భారత రాజ్యాంగానికి 1992లో 73వ రాజ్యాంగ సవరణ చేశారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం - 1994’ను తీసుకువచ్చింది. దీనిలో భాగంగా భారత రాజ్యాగంలోని 11వ షెడ్యూల్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి 29 రకాల అధికారాలను పేర్కొన్నారు. వీటిలో పదింటిని గ్రామ పంచాయతీలతో కూడిన స్థానిక ప్రభుత్వాలకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2007, 2008 సంవత్సరాల్లో వివిధ ఉత్తర్వులను జారీచేసింది. అయితే ఈ అధికారాల నిర్వహణకు ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేదు. నవరత్నాల పథకాలను అర్హులందరికీ సమర్థంగా అందజేసే లక్ష్యంతో గ్రామ పంచాయతీలను స్థానిక ప్రభుత్వాలుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. దీనిలో భాగంగా పంచాయతీలకు బదలాయించిన 29 రకాల అధికారాలను సమర్థంగా నిర్వహించేలా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడుతూ 2019 జులై 19న ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ సచివాలయాల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన విధి విధానాలను కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మారుస్తారు. రాష్ట్రంలో 13,065 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయను న్నారు. వీటిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఉన్న ఖాళీలతో పాటు కొత్తగా 95,088 ఉద్యోగాల నియామకాలను చేపట్టనున్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో 10 మంది శాశ్వత ఉద్యోగులను నియమించనున్నారు. వీరంతా ఒక బృందంగా ఏర్పడి ప్రజలకు సేవలు అందిస్తారు.

 మొదట 2,000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను గ్రామ సచివాలయంగా నిర్ణయించారు. ప్రతి గ్రామ పంచాయతీని గ్రామ సచివాలయంగా మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. (మొదట గిరిజన ప్రాంతాల్లో 2000 కంటే తక్కువ జనాభా ఉన్న చోట ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుకు వీలు కల్పించారు). పెద్ద పంచాయతీల్లో 2,000 కంటే ఎక్కువ జనాభా ఉంటే అక్కడ 2 వేల మందికి ఒకటి చొప్పున అనుబంధ సచివాలయాలను ఏర్పాటు చేయనున్నారు. అదనపు సచివాలయాల్లో కూడా సహాయ కార్యదర్శితో కలిపి 10 మంది చొప్పున ఉద్యోగ బృందాలు సేవలు అందిస్తాయి. ఈ అనుబంధ సచివాలయాలు పంచాయతీ ప్రధాన సచివాలయ కార్యదర్శి పరిధిలోనే పనిచేస్తాయి. గ్రామ సచివాయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు దాని పరిధిలోని వాలంటీర్లకు కన్వీనర్‌గా వ్యవహరించే గ్రామ కార్యదర్శి పేరు మీదగానే జీతాలు చెల్లిస్తారు. కార్యదర్శి సహా గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి సెలవు మంజూరు చేసే అధికారాన్ని సర్పంచ్‌కు ఇచ్చారు. గ్రామ సచివాలయ సిబ్బంది వివిధ లైన్‌ డిపార్ట్‌మెంట్‌లతో కలిపి అయిదేళ్లకు ఒకసారి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు తయారుచేసి అమలుచేస్తారు. ఉద్యోగ నియామక ప్రక్రియపై నిర్ణయాలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* గ్రామ సచివాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించే ఉద్యోగులకు మొదటి రెండు సంవత్సరాలపాటు ప్రొబెషనరీ పీరియడ్‌గా భావిస్తారు. ఆ కాలంలో నెలకు రూ.15,000 చొప్పున వేతనంగా చెల్లిస్తారు. రెండేళ్ల తర్వాత సంబంధిత శాఖల నిబంధనల మేరకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు.

గ్రామ సచివాలయ ఉద్యోగులు - బాధ్యతలు

గ్రామ పంచాయతీ సమావేశాలు, గ్రామ సభల నిర్వహణ, అయిదేళ్లకు ఒకసారి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీ, నిర్దేశించిన గడువులోగా ప్రజలకు పౌరసేవలు అందించడాన్ని గ్రామ సచివాలయ సిబ్బంది ప్రధాన బాధ్యతలుగా నిర్ణయించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ 2019 అక్టోబరు 2 నుంచి అమల్లోకి వస్తుంది. 2019-20 సంవత్సరానికి గ్రామ సచివాలయాల కోసం రూ.700 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. రాష్ట్రంలో 13,065 గ్రామ పంచాయతీలు ఉండగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1372, అత్యల్పంగా వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 791 ఉన్నాయి.


2. వార్డు సచివాలయ వ్యవస్థ:

పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో వార్డు సచివాలయాల ఏర్పాటు, ఉద్యోగాల భర్తీ, బడ్జెట్‌ కేటాయింపు, విధి విధానాలపై 2019 జులై 20న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 3,775 వార్డు సచివాలయాల్లో 37,750 మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో వార్డు సచివాలయాల వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి 4,000 మంది జనాభాకు ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అవసరాన్ని బట్టి కనీసం 3,000 నుంచి గరిష్ఠంగా 5,000 జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారు. 5000 కంటే అధిక జనాభా ఉన్న డివిజన్లలో 4,000కు ఒకటి చొప్పున, జనాభాను బట్టి రెండు, మూడు వార్డు సచివాలయాలను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. నాలుగు వేల కంటే తక్కువ జనాభా ఉంటే రెండు మూడు డివిజన్లను కలిపి ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటుచేస్తారు. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించిన అధికారాలన్నీ వార్డు సచివాలయాలకు బదలాయిస్తారు.

పట్టణ ప్రాంత ప్రజలకు ప్రస్తుతం పట్టణ స్థానిక సంస్థలకు 12వ షెడ్యూలు ద్వారా దఖలుపడిన 18 అంశాలను 10 విభాగాలుగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో విభాగానికి ఒక్కో కార్యదర్శిని వార్డు సచివాలయాల్లో నియమిస్తారు. వీరు తమ పరిధిలోని వార్డు వాలంటీర్లతో ఆ విభాగానికి చెందిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకువస్తారు. ఒక్కో వార్డు సచివాలయంలో ఆరోగ్యానికి సంబంధించిన సేవలను వైద్య, ఆరోగ్య శాఖ, ఆదాయానికి సంబంధించిన సేవలను రెవెన్యూ శాఖ, మహిళల సంక్షేమం, భద్రతకు సంబంధించిన సేవలను పోలీసు శాఖ పర్యవేక్షించనుంది. మిగిలిన సేవలన్నింటినీ (7 సేవలు) మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షిస్తుంది. వార్డు సచివాలయాల నిర్వహణ, కొత్తగా నియమించ నున్న వార్డు కార్యదర్శుల శిక్షణ, వేతనాల కోసం ప్రస్తుత సంవత్సరంలో రూ.629.99 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక్కో వార్డు కార్యదర్శికి శిక్షణ కాలంలో 2 సంవత్సరాల వరకు నెలకు రూ.15,000 స్టైఫండ్‌ను చెల్లిస్తారు. తర్వాత సంబంధిత శాఖల సర్వీసు రూల్స్‌ ప్రకారం శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వార్డు సచివాలయం కోసం వార్డులోని వార్డు కార్యాలయం, అంగన్‌వాడీ భవనం, పాఠశాల భవనం, సామాజిక రిసోర్స్‌ కేంద్రం, కమ్యూనిటీ హాల్, ప్రభుత్వ కార్యాలయంలో సరిపోయే ప్రదేశాన్ని గుర్తించి ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేస్తారు. వార్డులో ప్రభుత్వ భవనంలో సరైన స్థలం లేకపోతే రెండు, మూడు వార్డు సచివాలయాలను కలిపి ఒక భవనంలో నిర్వహించవచ్చు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోతే వార్డు సచివాలయాల కోసం ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటారు.

వార్డు కార్యదర్శి(సెక్రెటరీ) విధులు, బాధ్యతలు:

* వార్డుల్లో నియమితులైన వాలంటీర్ల విధులను పర్యవేక్షించాలి.
* లైన్‌ డిపార్ట్‌మెంట్‌లను ప్రజలతో సమన్వయం చేయాలి.
* అత్యవసరమైన సేవలను గుర్తించాలి.
* అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో పరిశీలించాలి.
* ప్రజల నుంచి వినతులను స్వీకరించి, ఆయా విభాగాల సిబ్బందితో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
* వార్డులోని కుటుంబాలకు వాలంటీర్ల ద్వారా విద్య, ఆరోగ్యం, ఇతర సాంఘిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
* పౌరులకు ఇంటి వద్దే వివిధ ప్రభుత్వ సేవలు అందేలా చూడాలి.

వార్డు సచివాలయంలోని 10 మంది వార్డు కార్యదర్శులు - విధులు

* వార్డు సచివాలయాల కోసం 2019-20 సంవత్సరానికి మొత్తం రూ.180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.


పట్టణ స్థానిక సంస్థల (ULB) అధికార పరిధి:

* 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌లో పేర్కొన్న 18 అంశాలకు సంబంధించి పట్టణ స్థానిక సంస్థలు అధికార పరిధిని కలిగి ఉన్నాయి. వీటినే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వార్డు సచివాలయాల కోసం 10 కేటగిరీలుగా విభజించి వీటి నిర్వహణ కోసం 10 మంది కార్యదర్శులను నియమిస్తుంది.
1. పట్టణ/ నగర ప్రణాళికీకరణ
2. భూ వినియోగం, భవనాల నిర్మాణం, నియంత్రణ
3. ఆర్థిక, సాంఘికాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడం.
4. రోడ్లు, వంతెనలు
5. గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు నీటి సరఫరా
6. ప్రజారోగ్యం, పరిశుభ్రత, వ్యర్థ పదార్థాల నిర్వహణ
7. అగ్నిమాపక సేవలు
8. పట్టణ అడవులు; పర్యావరణం, జీవావరణ పరిరక్షణ
9. సమాజంలోని జలహీన వర్గాలు; శారీరక, మానసిక వికలాంగుల ప్రయోజనాలు, పరిరక్షణ
10. మురికివాడల అభివృద్ధి
11. పట్టణ పేదరిక నిర్మూలన
12. పార్కులు, తోటలు, ఆటస్థలాలు లాంటి వసతులను పట్టణాల్లో ఏర్పాటుచేయడం.
13. సాంస్కృతిక విద్యను ప్రోత్సహించడం
14. శ్మ‌శాన వాటికల ఏర్పాటు, నిర్వహణ, వాటి ఏర్పాటుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు అవసరమైన సహాయ సహకారాలను అందించడం.
15. పశువులకు తాగునీటి కోసం నీటి కుంటలను ఏర్పాటు చేయడం, క్రూర జంతువులను సంరక్షించడం.
16. జనన, మరణ లెక్కల జాబితాను తయారు చేయడం.
17. వీధి దీపాలు, పార్కింగ్‌ స్థలాలు, బస్టాప్‌లు, ఇతర ప్రజా సౌకర్యాలు, సేవలను అందించడం.
18. జంతు వదశాలలను క్రమబద్ధీకరించడం.

గ్రామ పంచాయతీల అధికార పరిధి:

* 73వ రాజ్యాంగ సవరణలో భాగంగా రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో గ్రామ పంచాయతీలకు కేటాయించిన విధులు/ అధికారాలు కిందివిధంగా ఉన్నాయి.
1. వ్యవసాయం, వ్యవసాయ విస్తరణ పనులు
2. భూసారాన్ని మెరుగుపరచడం, భూసంస్కరణల అమలు, భూములను సాగులోకి తీసుకురావడం.
3. చిన్నతరహా సాగునీటి పథకాలు, నీటి నిర్వహణ, వాటర్‌షెడ్‌ల అభివృద్ధి
4. పశువుల సంరక్షణ, పాడిపరిశ్రమ, పాల ఉత్పత్తులు, కోళ్ల పరిశ్రమ
5. చేపల పెంపకం
6. సామాజిక అడవులు, వ్యవసాయ అడవులు
7. చిన్న తరహా అటవీ ఉత్పత్తులు
8. ఆహారశుద్ధి పరిశ్రమలతో కలిపి చిన్న తరహా పరిశ్రమలు
9. ఖాదీ, గ్రామీణ, కుటీర పరిశ్రమలు
10. గ్రామీణ గృహ నిర్మాణం
11. తాగునీటి సౌకర్యం
12. ఇంధనం, దాణా
13. రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జీలు, పెర్రీలు, జలమార్గాలు, ఇతర ప్రసార మార్గాలు.
14. విద్యుత్‌ సరఫరాతోపాటు గ్రామీణ విద్యుదీకరణ
15. సంప్రదాయేతర ఇంధన వనరులు
16. పేదరిక నిర్మూలనా పథకం
17. విద్య, (ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు)
18. సాంకేతిక శిక్షణ, వృత్తివిద్య
19. వయోజన, అనియత విద్య
20. గ్రంథాలయాలు
21. సాంస్కృతిక కార్యకలాపాలు
22. మార్కెట్లు, సంతలు
23. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఆసుపత్రులు (ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, డిస్పెన్సరీలు)
24. కుటుంబ సంక్షేమం
25. మహిళా, శిశు అభివృద్ధి
26. సాంఘిక సంక్షేమం (వికలాంగులు, మానసిక వికలాంగుల సంక్షేమంతో కలిపి)
27. అణగారిన వర్గాల సంక్షేమం, ముఖ్యంగా షెడ్యూల్డ్‌ కులాలు, తెగల సంక్షేమం
28. ప్రజా పంపిణీ వ్యవస్థ
29. సామాజిక ఆస్తుల నిర్వహణ 

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌