• facebook
  • whatsapp
  • telegram

విష్ణుకుండినులు

విష్ణుకుండినులు క్రీ.శ.5, 6 శతాబ్దాల్లో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలను పాలించారు. వీరి వంశ స్థాపకుడు ఎవరనే విషయంలో చరిత్ర

కారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. వీరి కులదైవం శ్రీపర్వతస్వామి, మల్లికార్జునుడు అని కొందరు పేర్కొంటారు.  అయితే, వీరిద్దరూ ఒకటేనని కీల్‌హారన్‌ అనే పండితుడు తెలిపాడు. శ్రీపర్వతస్వామి అంటే బుద్ధ భగవానుడని నేలటూరు వెంకటరమణయ్య అభిప్రాయపడ్డారు. 

* విష్ణుకుండినులు క్రీ.శ.358 నుంచి క్రీ.శ.569 వరకు సుమారు 210 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. వీరు ప్రధానంగా కృష్ణా నదికి ఉత్తరంగా ఉన్న తెలంగాణను, ఉత్తరాంధ్రను పాలించారు. 

* వీరి రాజధానులు అమరపురం (అమరావతి), ఇంద్రపాలనగరం, దెందులూరు. అమరపురం ప్రస్తుతం ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమ్రాబాద్‌ మండల కేంద్రం.  ఇంద్రపాలనగరాన్ని శుక్రపురం అని కూడా అంటారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలం, తుమ్మలగూడెం గ్రామ శివార్లలో ఉంది. దెందులూరు పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి దగ్గర ఉంది. వీరు  కొంతకాలం ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడ (విజయవాడ)ను రాజధానిగా చేసుకుని పాలించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 

* గోవింద వర్మ ఇంద్రపాలనగరంలో తామ్ర శాసనాన్ని వేయించాడు. అందులో మహా రాజేంద్ర వర్మ క్రీ.శ.358లో విష్ణుకుండిన రాజ్యాన్ని స్థాపించినట్లు ఉంది. మహా రాజేంద్ర వర్మ ఇంద్రపాల నగరాన్ని  నిర్మించి, రాజధానిగా చేసుకున్నాడు. ఇతడు రామతీర్థ శాసనాన్ని వేయించాడు. 

మొదటి మాధవ వర్మ

ఇతడు రాజేంద్రవర్మ కుమారుడు. తన రాజ్యాన్ని అమరపురం, కీసర, భువనగిరి ప్రాంతాలకు  విస్తరింపజేశాడు. ఇతడికి విక్రమ మహేంద్ర అనే బిరుదు ఉండేదని పొలమూరు శాసనంలో పేర్కొన్నారు.

గోవింద వర్మ

ఇతడు మొదటి మాధవ వర్మ కుమారుడు. ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. గొప్ప రాజనీతిజ్ఞుడు, విజేత, బౌద్ధ మత పోషకుడు. అనేక బౌద్ధ స్తూపాలను నిర్మించాడు. 

* ఇతడి భార్య పరమమహాదేవి. ఈమె పేరున ఇంద్రపురిలో బౌద్ధ భిక్షువుల కోసం చాతుర్దశౌర్య  మహావిహారాన్ని నిర్మించారు. 

* దీని పోషణ కోసం గోవింద వర్మ పెణ్కపర గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. హైదరాబాద్‌ నగర సమీపంలో ఉన్న చైతన్యపురిలోని మూసీనది తీరంలో ప్రాకృత శాసనం లభించింది. అందులో ఇతడి పేరుపై ఉన్న గోవిందరాజ విహారం, చైత్యాలయాల గురించి ఉంది. అయితే ఈ నిర్మాణాలు శిథిలం కాగా, శాసనం మిగిలిఉంది.

గోవింద వర్మ కాలంలో ఫణిగిరి, గాజులబండ, తిరుమలగిరి, వర్దమానుకోట, జగ్గయ్యపేట, నేలకొండపల్లి, రామిరెడ్డిపల్లి మొదలైన ప్రాంతాల్లో బౌద్ధారామ విహారాలు ప్రసిద్ధి చెందాయి.

* హైదరాబాద్‌ శివారులోని కీసరగుట్ట (కేసరిగుట్ట)పై ఉన్న విష్ణుకుండిన కోట, దేవాలయాన్ని నిర్మించాడు. కీసరగుట్ట కింద కేసరి వాగు ఉంది. దీని గట్టున ఉన్న ప్రాంతం పేరు గట్టు కేసరి. దీన్ని ప్రస్తుతం ఘట్‌కేసర్‌ అని పిలుస్తున్నారు. 

* కేసరి అంటే సింహం. ఇది విష్ణుకుండినుల రాజచిహ్నం. ఆ రాజముద్ర ఒకటి కీసరగుట్టపై లభించింది.

రెండో మాధవ వర్మ

ఇతడు విష్ణుకుండినుల్లో గొప్పవాడు. రాజ్యాన్ని నర్మదా నది వరకు విస్తరింపజేశాడు. తన రాజధానిని ఇంద్రపురి నుంచి అమరపురానికి (అమరావతి) మార్చాడు. 

* సరిహద్దు రక్షణ కోసం తన కుమారుడైన దేవవర్మను దక్షిణాన త్రికూట మలయానికి (కోటప్పకొండ) రాజప్రతినిధిగా నియమించాడు. 

* ఇతడు వైదిక మతాభిమాని. అశ్వమేధ, రాజసూయ, వాజపేయ, అగ్నిష్టోమ, నరమేధ మొదలైన క్రతువులు నిర్వహించాడు. ఇతడు కీసరలో పురుషమేధ యజ్ఞాన్ని నిర్వహించినట్లు ఆధారాలున్నాయి. 

* రెండో మాధవ వర్మ వందకు పైగా యుద్ధాలు చేసి అన్నింటిలోనూ గెలుపొందాడు. తన ఒక్కో విజయానికి గుర్తుగా కీసరగుట్టపై ఒక్కో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. విజయం సాధించిన ప్రతి చోటా రామలింగేశ్వర దేవాలయాన్ని కట్టించాడు. 

* ఇతడి శాసనం ఒకటి మహారాష్ట్రలోని ఖానాపూర్‌లో దొరికింది. విష్ణుకుండినుల నాణేలు మహారాష్ట్ర అంతటా దొరికాయి. 

* రెండో మాధవ వర్మకు ‘త్రివరనగర భవనగత సుందరీ హృదయనందన’, ‘త్రిసముద్రపతి’ అనే బిరుదులు ఉన్నాయి.

నాలుగో మాధవవర్మ 

ఇతడికి జనాశ్రయ అనే బిరుదు ఉంది. ఇతడు విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి భక్తుడు. ఇతడి న్యాయపాలన ప్రశంసనీయమైంది. 

విష్ణుకుండినుల్లో చివరి పాలకుడు మంచభట్టారకుడు. చాళుక్యులు ఇతడ్ని యుద్ధంలో ఓడించి, వీరి రాజ్యాన్ని ఆక్రమించారు. 

* విష్ణుకుండినుల రాజలాంఛనం సింహం. వీరి శాసన కడియాలపై ఉన్న రాజముద్రికల్లో లంఘించే సింహాన్ని ముద్రించారు. వీరి నాణేల్లో కూడా ఈ చిహ్నం కనిపిస్తుంది.

పరిపాలన - అధికారులు

* భూములను పగ్గాలతో కొలిచి ఆయకట్టు నిర్ణయించడానికి ‘రజ్జుక’ అనే అధికారి ఉండేవాడు. 

* ‘ఫలదారుడు’ పంటను అంచనా వేసి, భూమి శిస్తును నిర్ణయించేవాడు. 

* ‘గుల్మికుడు’ సరిహద్దు రాష్ట్రాలపై నియమితుడైన సైనిక ప్రతినిధి. 

* ప్రభుత్వానికి చెందాల్సిన రాజ్య ఆదాయాన్ని కొలవడానికి ‘సెట్టి’ అనే అధికారి ఉండేవాడు. 

* రాజాజ్ఞలను రాయించే అధికారిని ‘అక్షపటలాధికృతుడు’ లేదా ‘అక్షపటలాధికారి’ అని పిలిచేవారు. 

రాజు తరఫున దానాలు చేయడానికి ‘హస్తికోశుడు’, ‘వీరకోశుడు’ అనే సైనికాధికారులు ఉండేవారు. 

ఆర్థిక పరిస్థితులు

* ఇక్ష్వాకుల తర్వాత నాణేలు ముద్రించింది విష్ణుకుండినులే. రాగి మలామా చేసిన ఇనుముతో వీటిని తయారు చేశారు. దీంతో వీటి నాణ్యత లోపించింది.

* ఇది పరిశ్రమలు, వాణిజ్యం క్షీణతకు కారణమైంది. ప్రాచీన నగరాలు, వాటిని అనుసంధానం చేసే రహదారులు అస్తవ్యస్తమయ్యాయి. విదేశీ వాణిజ్యం తగ్గడంతో ఓడ గుర్తు నాణేలను ముద్రించలేకపోయారు. 

లంఘించే సింహం గుర్తు ఉన్న నాణేలు అచ్చువేశారు. విక్రమేంద్ర వర్మ వేయించిన నాణేలు ఏలేశ్వరంలో లభించాయి. ఇందులోని నాణేలు రాగి, సత్తుల మిశ్రమం. కుంభం, సింహం దాని మీది సంకేతాలు. వీటిలో కొన్నింటి మీద ‘వి-క-ర-మ’ అనే అక్షరాలు కనిపిస్తాయి. 

* భువనగిరి, సుల్తానాబాద్‌ తాలుకాలో రాగి నాణేలు దొరికాయి. వీటితో బర్మా, సయాం, కాంబోడియా, చీనా, జపాన్, సిలోన్‌ దేశాలతో విదేశీ వ్యాపారం జరిపినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు.

* రెండో మాధవ వర్మ రాజ్యానికి ఉత్తారాన రేవానది ఉండేది. నదుల్లో స్వదేశీ వ్యాపారం జరిగేది. 

అలంపురంలోని సంగమేశ్వరంలో రోమన్‌ కాన్‌స్టాంటైన్‌ బంగారు నాణెంతో పాటు ఇతర నాణేలు దొరికాయి.

* వీరి రాజ్యంలో గవ్వలు ద్రవ్యంగా చలామణి అయినట్లు చైనా యాత్రికుడు పాహియాన్‌ పేర్కొన్నాడు. మరో చైనా యాత్రికుడైన హుయాన్‌త్సాంగ్‌ శ్రీపర్వతంపై బంగారంతో చేసిన నిలువెత్తు బుద్ధ విగ్రహాలు ఉన్నాయని తెలిపాడు. 

* బుద్ధ విగ్రహాలు బుద్ధాం, అమరావతిలో దొరికాయి. కీసరగుట్టపై 7 సెం.మీ. పరిమాణంలో ఉన్న నశ్యం డబ్బీ (పోత ఇనుములతో మామిడి పిందె ఆకారంలో చేసింది) దొరికింది.

* పన్ను వసూలు చేసే యంత్రాంగంలో  సామంత రాజులను భాగం చేయడం మొదట వీరి కాలంలోనే ప్రారంభమైంది.

సాంఘిక పరిస్థితుల

విష్ణుకుండినులు వైదిక మతాన్ని ఆచరించి, దాని అభివృద్ధికి పాటుపడ్డారు. వీరు బ్రాహ్మణులు. వైదిక మతంతో పాటు బౌద్ధ మతాన్ని ఆదరించారు. వీరిలో చాలా మందికి పరమ మహేశ్వర, పరమ భాగవత అనే బిరుదులున్నాయి. 

* గోవింద వర్మకు వర్ణాశ్రమ ధర్మాల పట్ల భక్తి విశ్వాసాలు ఎక్కువగా ఉండేవని ఇంద్రపాలనగర శాసనం ద్వారా తెలుస్తోంది. ఇతడి ఆస్థానంలో దశబలబలి అనే పండితుడు ఉండేవాడు. ఈయనకు 18 మత శాఖల సిద్ధాంతాలు పూర్తిగా తెలుసని, మానవులను మరణ దుఃఖాల నుంచి కాపాడేందుకు యజ్ఞాది కర్మలు చేసేవాడని చరిత్రకారులు పేర్కొన్నారు. గోవింద వర్మ దశబలబలి పండితుడికి పెంకపర గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. 

* మాధవ వర్మ గణపతిని ప్రతిష్ఠించినట్లు వేల్పూరు శాసనం తెలుపుతుంది.

బౌద్ధమతం

* గోవింద వర్మ బౌద్ధమతాన్ని ఆదరించి అనేక నిర్మాణాలు చేశాడు.

* హైదరాబాద్‌ సమీపంలోని చైతన్యపురిలో బౌద్ధమతానికి చెందిన హీనయాన శాఖ ఉండేది. అక్కడ కొసగుండ్ల నరసింహస్వామి గుహాలాయం దగ్గర ఉన్న పెద్ద బండరాయిపై ఆరు వరుసల ప్రాకృత శాసనం ఉంది. 

* కీసరగుట్టపై మహాయాన బౌద్ధం ఆనవాళ్లు ఉన్నాయి. అక్కడ ఆచార్య నాగార్జునుడి లోహ విగ్రహం దొరికింది. 

బౌద్ధమతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు విష్ణుకుండినులు. ఈ మతానికి సంబంధించిన చివరి తత్వవేత్తలు వీరి రాజ్యంలో నివసించారు. 

* తర్కపండితుడైన దిజ్నాగుడు కొంతకాలం వేంగిలో నివసించాడు. అక్కడ ఆయన సాంఖ్యకారిగా రచయిత అయిన ఈశ్వర కృష్ణుడితో వాగ్వాదాలు జరిపాడు. 

దిజ్నాగుడు కొంతకాలం కరీంనగర్‌ జిల్లాలోని రామగిరి (రామగుండం), మునులగుట్ట ప్రాంతంలో జీవించాడు. ఈ విషయం కాళిదాసు రచించిన మేఘసందేశం ద్వారా తెలుస్తోంది. 

* దిజ్నాగుడు వందకుపైగా రచనలు చేశాడు. ‘ప్రమాణ సముచ్చయం’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. యోగాచార పంథను బోధించాడు. తెలుగు ప్రాంతాలకు చెందిన బౌద్ధ మహాపండితుల్లో ఈయన చివరివాడు. ఈయన బాసరలోనూ కొంతకాలం ఉన్నారు. అక్కడ ఒక స్తూపం, కొన్ని చిన్న శిలాఫలకాలు లభించాయి. 

* బౌద్ధమతంలో వజ్రయాన శాఖ వ్యాపించింది. దీని నుంచి తాంత్రికాచారాలు, శక్తి పూజలు వచ్చాయి. ఈ శాఖ వారి దుర్నీతి, నీతిబాహ్య చర్యల వల్ల బౌద్ధమతం ప్రజాదరణ కోల్పోయింది.

మూడో మాధవ వర్మ 

ఇతడు బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలను దానం చేశాడు. అమరపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. ఇతడు ఇంద్రశర్మ, అగ్నిశర్మ అనే బ్రాహ్మణులకు మ్రోతుకలి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చినట్లు శాసనం ఉంది. 

ఇంద్రభట్టారక వర్మ

ఇతడు అనేక ఘటికాస్థానాలను (హిందూ విద్యా కేంద్రాలు) స్థాపించాడు. కీసర సమీపంలో ఉన్న ఘటకేశ్వరం (ఘట్‌కేసర్‌) ఇతడు నెలకొల్పిందే. ఇతడికి సత్యాశ్రయుడు అనే బిరుదు ఉంది.

విక్రమేంద్ర భట్టారక 

ఇతడు తన రాజధానిని అమరపురం నుంచి దెందులూరు (లెందులూరు)కు మార్చాడు. బ్రాహ్మణులకు తుండి (తుని) గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. 

* ఇతడికి ఉత్తమాశ్రయుడు అనే బిరుదు ఉంది. ఇతడు తన 11వ రాజ్య సంవత్సరంలో ఇంద్రపాలనగరంలోని పరమమహాదేవి విహారానికి ఇరుందెర గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. 

రచయిత: డా. ఎం. జితేందర్‌ రెడ్డి, విషయ నిపుణులు 

Posted Date : 05-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌