• facebook
  • whatsapp
  • telegram

 విష్ణుకుండినులు - 01

వైదిక సంస్కృతికి రాజపోషకులు!



 


  చరిత్ర పూర్వయుగంలో ఆంధ్ర దేశంలో పుట్టి స్వశక్తితో అధికారంలోకి వచ్చిన పాలకుల్లో విష్ణుకుండినులకు ప్రత్యేక స్థానం ఉంది. శాతవాహనుల తర్వాత తెలుగు నేలలో అత్యధిక ప్రాంతాన్ని పాలించిన రాజవంశమిది. నేటి దక్షిణ తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలను సుమారు రెండు శతాబ్దాలు పరిపాలించారు. పరమ శివ భక్తులుగా, వైదిక సంస్కృతికి రాజపోషకులుగా నిలిచారు. విశేషమైన యజ్ఞాలు, యాగాలు చేశాడు. పరిజ్ఞాన సంపన్నులుగా పాలన సాగిస్తూ, రాజ్య సంరక్షణ కోసం పరాక్రమాలను ప్రదర్శించారు. వీరి పాలనలో విద్యకు ప్రాధాన్యం, పండితులకు ప్రోత్సాహంతో పాటు వ్యవసాయ వాణిజ్యాలు వర్దిల్లాయి. బెజవాడ కనకదుర్గ ఆలయం సహా అనేక గుహాలయాలను నిర్మించి చిరస్మరణీయులయ్యారు. ఈ వంశ వృక్షం, రాజుల క్రమంలో పాలనా విశేషాలు, నాటి సాంఘిక, ఆర్థిక పరిస్థితులపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

ఇక్ష్వాకుల తర్వాత తూర్పు దక్కన్‌ ప్రాంతంలో అధికారం స్థాపించినవారు విష్ణుకుండినులు. వీరి వంశ నామం ‘విష్ణుకుండి’. పల్నాడు జిల్లాలోని వినుకొండకు సంస్కృతీకరణమే విష్ణుకుండి. వీరు బ్రాహ్మణులు, ఆంధ్రులు, శ్రీపర్వతస్వామి భక్తులు. శ్రీశైలం మల్లికార్జున స్వామినే శ్రీపర్వతస్వామి అంటారు. ఈ వంశ స్థాపకుడు ఇంద్రవర్మ. వీరిలో చివరివాడు మంచన భట్టారకుడు, గొప్పవాడు రెండో మాధవ వర్మ. హిందూ శిల్పకళను ప్రారంభించి అనేక గుహాలయాలు నిర్మించారు. గణపతిని పూజించడం వీరి కాలం నుంచే ప్రారంభమైంది. పురుష మేధ యాగాలు నిర్వహించారు. వీరి రాజధానుల్లో మొదటిది ఇంద్రపాలపురం, రెండోది వినుకొండ, మూడోది దెందులూరు. వీరి భాష సంస్కృతం. అధికారిక మతం వైదికం. నాణేలపై ఉన్న చిహ్నం నంది. రాజలాంఛనం పంజా ఎత్తిన సింహం.

శాసనాలు:

* చిక్కుళ్ల శాసనం - రెండో విక్రమేంద్ర వర్మ - తూర్పుగోదావరి 

* రామతీర్థం శాసనం - ఇంద్ర వర్మ - విశాఖపట్నం 

* పోలమూరు శాసనం - నాలుగో మాధవ వర్మ - తూర్పుగోదావరి 

* వేల్పూరు శాసనం - రెండో మాధవ వర్మ - గుంటూరు జిల్లా 

* ఈపూరు శాసనం - మొదటి మాధవ వర్మ - గుంటూరు జిల్లా.

రాజకీయ చరిత్ర:

ఇంద్రవర్మ: విష్ణుకుండి పాలకుల్లో మొదటి రాజు. వాకాటకులకు సామంతుడు. ఇంద్రపాల నగరాన్ని నిర్మించి రాజధానిగా మార్చాడు. ఇంద్రపాల శాసనం ఇతడి గురించి తెలియజేస్తుంది.రామతీర్థ శాసనాన్ని వేయించాడు.

మొదటి మాధవ వర్మ: ఇంద్రవర్మ కుమారుడు, గొప్ప ప్రతిభాశాలి, న్యాయదక్షుడు, రాజనీతిజ్ఞుడు. నూరువేల అగ్నిస్థోమ యాగాలు, 11 అశ్వమేధ యాగాలు నిర్వహించాడు.  వైదిక మతాన్ని ప్రోత్సహించాడు. పల్లవులు, శాలంకాయనులు, కళింగ రాజులను ఓడించాడు. వాకాటక రాజులతో వివాహ సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. చిక్కుళ్ల శాసనం వీరి బంధుత్వం గురించి వివరిస్తుంది. ఉండవల్లి, భైరవకోన, మొగల్రాజపురం గుహలు ఇతడి కాలం నాటివే.

మొదటి గోవింద వర్మ: మొదటి మాధవ వర్మ కుమారుడు. తొలి విష్ణుకుండి రాజుల్లో గొప్పవాడు. రాజ్య విస్తరణ చేశాడు. బౌద్ధ మతాభిమాని. మూలరాజ వంశస్థుడైన పృథ్వి మాలుడి కుమార్తె పరమ భట్టారక మహాదేవిని వివాహం చేసుకున్నాడు.

రెండో మాధవ వర్మ: ఈ వంశంలో గొప్పవాడు. వాకాటక రాజులతో మంచి సంబంధాలతో అధికారాన్ని స్థిరం చేసుకున్నాడు. ఇతడి రాజ్యం నర్మదా నది వరకు విస్తరించింది. రాజధానిని అమరాపురానికి (అమరావతి)కి మార్చాడు. పల్లవుల దండయాత్రల బెడద వల్ల సరిహద్దులను పటిష్ఠపరిచేందుకు దక్షిణా త్రికూటమలయ (కోటప్పకొండ) సంరక్షకుడిగా, రాజప్రతినిధిగా తన కుమారుడు దేవవర్మను నియమించాడు. దేవవర్మ మరణానంతరం అతడి కొడుకు మూడో మాధవ వర్మ త్రికూట మలయాధిపతి అయ్యాడు. రెండో మాధవ వర్మ శాలంకాయనులను తుదముట్టించి వేంగి రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో అంతర్భాగం చేసుకున్నాడు. అనేక అశ్వమేధ, రాజసూయ యజ్ఞాలు చేశాడు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ దేవాలయాన్ని నిర్మించాడు. ఇతడు సముద్రగుప్తుడికి సమకాలికుడు.

మొదటి విక్రమేంద్ర వర్మ: ఇతడు రెండో మాధవ వర్మ, వాకాటక రాజకుమార్తెకు జన్మించాడు. రామతీర్థం శాసనంలో మొదటి విక్రమేంద్ర వర్మను సత్పుత్రుడిగా అభివర్ణించారు. సింహాసనం అధిష్ఠించేనాటికి వయోవృద్ధుడు. ఇంద్రపాలన నగర శాసనంలో ఇతడిని వయోవృద్ధుడిగా పేర్కొన్నారు. జైన, బౌద్ధ మతాలను ఆదరించాడు. మొదటి విక్రమేంద్ర వర్మ మరణాంతరం సింహాసనం కోసం దాయాదుల మధ్య పోరు జరిగింది. ఇందులో హరిసేనుడు జోక్యం చేసుకున్నాడు. చివరకు ఇంద్రవర్మ/ఇంద్ర భట్టారకుడు రాజు అయ్యాడు.

ఇంద్ర భట్టారక వర్మ: ఇతడి గురించి చిక్కుళ్ల శాసనం తెలియజేస్తోంది. పరమ మహేశ్వరుడిగా పేరుగాంచాడు. శివారాధకుడు, దానశీలి. గోవులు, భూములను దానం చేశాడు. సత్యాశ్రయుడు, చతుర్దాయక యుద్ధవీరుడు అనే బిరుదులున్నాయి. ఆంధ్ర దేశంలో ఘటికలు అనే విద్యాసంస్థలను స్థాపించాడు. ఈ ఘటికల గురించి ఉద్ధంకుడు ‘సోమదేవం’ అనే గ్రంథంలో పేర్కొన్నాడు.

రెండో విక్రమేంద్ర వర్మ: విష్ణుకుండిన వంశ ప్రతిష్ఠను పునరుద్ధరించారు. కళింగలో కోల్పోయిన అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. తుని (తుండి) గ్రామాన్ని శివవర్మ అనే బ్రాహ్మణుడికి దానమిచ్చాడు. కళింగ రాజ్యానికి చేరువగా ఉండాలని రాజధానిని బెజవాడ నుంచి దెందులూరుకి మార్చాడు. పల్లవ రాజు నరసింహ వర్మ దాడిని తిప్పికొట్టాడు. ఉత్తమాశ్రయుడు అనే బిరుదు పొందాడు. ఇతడి కుమారుడు రెండో గోవింద వర్మ కొద్దికాలమే పరిపాలించాడు.

నాలుగో మాధవ వర్మ: ఇతడి పాలనా కాలం విష్ణుకుండినుల చరిత్రలో సువర్ణాధ్యాయం. 65 ఏళ్లు రాజ్యపాలన చేశాడు. బిరుదు జనాశ్రయ. వేంగిలో తన స్థానాన్ని సుస్థిర పరచుకున్నాడు. పరిపాలన ద్వితీయార్ధంలో అనేక యుద్ధాలు చేశాడు. చాళుక్యుల దాడిని ఎదుర్కొన్నాడు. రెండో పులకేశి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్దనుడి తోడ్పాటుతో పిఠాపురం, వేంగి ప్రాంతాలను ఆక్రమించాడు. వీరిని క్రీ.శ. 621లో తన భూభాగం నుంచి తరిమేయడానికి నాలుగో మాధవ వర్మ ప్రయత్నించి ఈ ప్రయత్నంలో యుద్ధభూమిలోనే మరణించాడు.

మంచన భట్టారక వర్మ: ఈ వంశంలో చివరివాడు. అనేక మంది సామంతులు ఇతడికి ఎదురుతిరిగారు. సిష్టీపురం దుర్జయుడైన పృథ్విమాల, భట్టారక వర్మను ఓడించి రాజ్యాన్ని ఆక్రమించినట్లు తాండివాడ శాసనం తెలియజేస్తోంది. క్రీ.శ. 624లో తూర్పు చాళుక్యులు వేంగిని ఆక్రమించారు.

పరిపాలన: విష్ణుకుండినులు పరిపాలన సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని అనేక రాష్ట్రాలు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. రాజ్యాన్ని రాజు, రాష్ట్రాన్ని రాష్ట్రీకులు, విషయాలను విషయాధిపతి, గ్రామాన్ని గ్రామణి పరిపాలించేవారు. శుక్రనీతిని అనుసరించి పరిపాలన జరిగేది. కీలక ప్రాంతాలకు రాజ కుటుంబీకులనే రాజ ప్రతినిధులుగా నియమించేవారు. గ్రామాలకు స్వయంప్రతిపత్తి ఉండేది. న్యాయపాలనలో రాజే అత్యున్నత న్యాయాధికారి. పాలకులకు న్యాయశాస్త్ర పరిజ్ఞానం, విచక్షణా జ్ఞానం మెండుగా ఉండేవి. వివాదాలను పరిష్కరించడంలో నిందితుడి చేతిని సలసలకాగే నీటిలో ముంచేవారు. నిష్పాక్షికంగా, ఉత్తమ తీర్పు ఇవ్వడంలో వీరు ప్రసిద్ధి. సైన్యంలో చతురంగ బలం ఉండేది. హస్తికోశ (గజబలాధ్యక్షుడు), వీరకోశ (పదాతి దళపతి) వంటి సైనికాధికారులు ఉండేవారు.


ఆర్థిక పరిస్థితులు: గ్రామాల్లో స్వయంసమృద్ధ ఆర్థిక వ్యవస్థ ఉండేది. ప్రజల ప్రధాన ఆర్థిక కార్యకలాపం వ్యవసాయం. వ్యవసాయాభివృద్ధికి బావులు, చెరువులు తవ్వించేవారు. స్వదేశీ, విదేశీ వాణిజ్యం ఉండేది. ఈ కాలంలో గవ్వలు కూడా ద్రవ్యంగా చెలామణి అయ్యాయని పాహియాన్‌ రాశాడు. వీరు తూర్పు ఆసియా దేశాలు, పశ్చిమ దేశాలైన గ్రీకు, రోమ్, ఈజిప్టులతో వ్యాపారం చేశారు. సంగమేశ్వరం (ఆలంపూర్‌ జిల్లా, తెలంగాణ) వద్ద రోమన్‌ చక్రవర్తి కానిస్టాంటైన్‌ నాణేలు లభించాయి.నాటి నాణేలను వెలుగులోకి తెచ్చింది రాయప్రోలు సుబ్రమణ్యం. రాగి పూత పూసిన ఇనుప నాణేలను చెలామణిలోకి తెచ్చారు. వీరి నాణేలపై ఓడ, సింహం చిహ్నాలు ఉండేవి.

మత పరిస్థితులు: రెండో మాధవ వర్మకి పూర్వం పరిపాలించిన రాజులు బౌద్ధ మతాభిమానులు. వీరిలో గోవింద వర్మ బౌద్ధ స్తూపాలు, విహారాలు నిర్మించారు. రెండో విక్రమేంద్ర వర్మ, మహాదేవి విహారానికి ఉదారంగా దానాలు ఇచ్చారు. వీరి కాలంలో ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ. పరమ భట్టారక మహాదేవి ఇంద్రపురంలో చతుర్ధ శౌర్య భిక్షువుల కోసం విహారం నిర్మించింది. ఈ విహారం కోసం మొదటి గోవింద వర్మ పెన్కపుర, ఎన్నదల గ్రామాలను దానం చేశాడు. గోవింద వర్మ తన పేరుతో చైతన్యపురి వద్ద విహారం నిర్మించాడు. విష్ణుకుండినులు ప్రధానంగా హిందూ మతాన్ని పోషించారు. కులదైవం శ్రీపర్వతస్వామి. రాజసూయ, పురుష మేధ, సర్వమేధ, అశ్వమేధ వంటి వైదిక క్రతువులు నిర్వహించారు. కొందరు రాజులు తమను తాము పరమ మహేశ్వరులుగా అభివర్ణించుకున్నారు. వీరికాలంలో శైవం, వైష్ణవం ఆదరణ పొందాయి. దక్షిణ భారతదేశంలో మొదటిగా గుహాలయాలు నిర్మించారు. వేల్పూరు శాసనం ప్రకారం రెండో మాధవ వర్మ గణపతి విగ్రహాలను నిర్మించాడు.

సాహిత్యం: వీరు గొప్ప సాహితీ అభిమానులు, విద్వాంసులైన బ్రాహ్మణులకు భూదానాలిచ్చారు. వేదాధ్యయనానికి ఘటికలు నిర్మించారు. సనాతన ధర్మానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ రాజులు సాహితీ అభిమానులే కాక వీరిలో కొందరు స్వయంగా విద్వాంసులు. విక్రమేంద్ర వర్మ మహాకవిగా కీర్తి పొందాడు. నాలుగో మాధవ వర్మ జనాశ్రయ ఛందోవిచ్ఛితి అనే అలంకార శాస్త్ర గంథ్రాన్ని రచించాడు. సంస్కృతం ప్రజాదరణ పొందింది. వీరు బ్రాహ్మణులకు విరివిగా అగ్రహారాలు దానం చేశారు. ఈ కాలంలో నిర్మించిన ఘటికలు విద్యాకేంద్రాలుగా భాసిల్లాయి. వీటిలో 14 రకాల విద్యలను బోధించేవారు.

వాస్తు శిల్పం: అనేక శైవ గుహాలయాలను నిర్మించారు. బెజవాడ దుర్గ కొండకు దిగువన అక్కన్న, మాదన్న గుహలు, మొగల్రాజపురం, ఉండవల్లి, భైరవకొండ గుహలు వీరికాలం నాటివే.

మొగల్రాజపురం గుహలు- విజయవాడ: దుర్గ గుహలో వెనుక గోడపై అర్ధనారీశ్వరమూర్తిని, అతిపెద్దదైన అయిదో గుహలో శివతాండవ నటరాజు విగ్రహాన్ని, కపోతం మీద కూడలిలో దేవీసహితులైన త్రిమూర్తుల విగ్రహాలను చెక్కారు.

ఉండవల్లి గుహలు: ఇక్కడ మూడు గుహలున్నాయి. వీటిల్లో బుద్ధుడు పద్మాసనంలో ఉన్న విగ్రహాన్ని పడగొట్టి విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కారు. ప్రస్తుతం ఇది అనంత పద్మనాభస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పూర్ణకుంభాన్ని చెక్కారు.

భైరవకోన: ఇక్కడ ఎనిమిది గుహలున్నాయి. కుంభ శీర్షాలతో ఉన్న సింహపాద స్తంభాలున్నాయి. ఈ గుహలు కాపాలిక మతానికి చెందినవి. వీటిని శివుడికి అంకితం ఇచ్చారు.

రచయిత: గద్దె నరసింహారావు

Posted Date : 16-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌