• facebook
  • whatsapp
  • telegram

భారత్‌లో సంక్షేమ యంత్రాంగం - ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ప్రొవిజన్స్‌ - ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు - ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం

భారత్‌లో సంక్షేమ యంత్రాంగం

 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రొవిజన్లు, రిజర్వేషన్లు

రూస్కో పౌండ్ అభిప్రాయం ప్రకారం 'ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలే. సంక్షేమ రాజ్యాలే శ్రేయోరాజ్యాలు'.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అభిప్రాయం ప్రకారం 'భారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న సామాన్య ప్రజల ఆర్థిక, సామాజిక, విద్య, వైజ్ఞానిక రంగాల్లో వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నించడం'.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అభిలషణీయ విధానాల ద్వారా ప్రజలందరికీ మెరుగైన వసతులను కల్పించడం, అన్ని వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన విధి.
దీన్ని సాకారం చేసేందుకు షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన కులాలు, మహిళలు, మైనార్టీలు, కార్మికులు, వికలాంగులు, బాలబాలికలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.

 

రాజ్యాంగంలో సంక్షేమ మూలాలు
భారత రాజ్యాంగ ప్రవేశికలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చింది.
సామ్యవాదం అనే పదం ద్వారా ధనిక, పేద వర్గాల మధ్య వ్యత్యాసాలను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అవి:
జవహర్‌లాల్‌నెహ్రూ ప్రభుత్వం 1957లో దేశంలోని జీవిత బీమా సంస్థలన్నింటినీ జాతీయం చేసి ఎల్ఐసీ నియంత్రణలోకి తీసుకొచ్చింది.
ఇందిరా గాంధీ ప్రభుత్వం 1969లో 14 బ్యాంకులను, 1980లో 6 బ్యాంకులను జాతీయం చేసింది. 1970లో రాజభరణాలను రద్దుపరచింది. 1975లో 20 సూత్రాల ఆర్ధిక కార్యక్రమాన్ని ప్రకటించింది.
భారత రాజ్యాంగంలోని 16వ భాగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు కల్పించిన ప్రత్యేక సదుపాయాలను వివరించారు.
ఆర్టికల్ 15 (3) ప్రకారం మహిళలకు, బాలలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి.
ఆర్టికల్ 46 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా ప్రగతికి ప్రత్యేక పథకాలను చేపట్టాలి.
 ఆర్టికల్ 243 (D) ప్రకారం పంచాయతీరాజ్ ఎన్నికల్లోనూ, ఆర్టికల్ 243 (T) ప్రకారం నగర/ పట్టణ ప్రభుత్వాల ఎన్నికల్లోనూ ఎస్సీ, ఎస్టీ, మహిళా వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.
ఆర్టికల్ 338 - జాతీయ ఎస్సీ కమిషన్.
 ఆర్టికల్ 338 (A) - జాతీయ ఎస్టీ కమిషన్
‣  ఆర్టికల్ 340 - జాతీయ బీసీ కమిషన్
1989లో షెడ్యూల్డు కులాల, తెగల అకృత్యాల నిరోధక చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది.

 

ఎస్సీ వర్గాల సంక్షేమం
‣  షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వారికి 1979 నుంచి పంచవర్ష ప్రణాళికలో ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారు.
1989లో నిరుపేదలైన ఎస్సీ వర్గాల స్వయం ఉపాధి కార్యక్రమాల అమలుకు నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను నెలకొల్పారు.
ఎస్సీ వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా వసతిగృహాల స్థాపనకు 2008లో బాబూ జగ్జీవన్‌రామ్ ఛాత్రావాస్ యోజనను ప్రారంభించారు.
 డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఫౌండేషన్ కార్యక్రమం ద్వారా ఎస్సీ వర్గాల వారికి కిడ్నీ, లివర్ వ్యాధులు, క్యాన్సర్ చికిత్స కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
 హరిజనవాడల్లో అంబేడ్కర్ జలధార పథకం ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తున్నారు.
ఆర్టికల్ 16 (4A): రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఎస్సీ, ఎస్టీలకు సరైన ప్రాతినిధ్యం లేదని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లయితే కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి సీనియారిటీతో కూడిన పదోన్నతిని కల్పించడానికి ఆయా వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుందని, సీనియార్టీకి రిజర్వేషన్ వర్తించదని 2015 సెప్టెంబరు 12న సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆర్టికల్ 17: దీని ప్రకారం అంటరానితనం నిషేధం. అంటరానితనం పాటించడాన్ని నేరంగా పరిగణిస్తారు. 1955లో భారత పార్లమెంటు అస్పృశ్యత నేర నిషేధ చట్టాన్ని రూపొందించింది. దీన్ని పార్లమెంటు 1976లో పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మార్చింది.
ఆర్టికల్ 23: దీని ప్రకారం మనుషుల క్రయవిక్రయాలు, వెట్టిచాకిరీని నిషేధించారు. జోగిని, దేవదాసీ లాంటి సాంఘిక దురాచారాలను నిషేధించారు. 1976లో వెట్టిచాకిరీ నిషేధ చట్టం, కనీస వేతనాల అమలు చట్టం, సమాన పనికి సమాన వేతన చట్టాలను రూపొందించారు.
ఆర్టికల్ 330: ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి లోక్‌సభలో కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలి. ఆర్టికల్ 332 ప్రకారం రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని సీట్లను రిజర్వ్ చేయాలి.
ఆర్టికల్ 335: ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతులు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీల అర్హత మార్కులను ప్రభుత్వం తగ్గించవచ్చు.

 

అంబేడ్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి పథకం: షెడ్యూల్డు కులాలకు చెందిన పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి సహాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
జాతీయ సఫాయి కర్మచారి కమిషన్: పారిశుద్ధ్య కార్మికులను వారి వృత్తుల నుంచి విముక్తి చేసి ప్రత్యామ్నాయ సదుపాయాలను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం.
2004 - 05 సంవత్సరం నుంచి బాబాసాహెబ్ అంబేడ్కర్ జాతీయ ఉపకార వేతనాలను అందిస్తున్నారు.

 

గిరిజన ప్రాంతాలు, గిరిజనుల (ఎస్టీ) సంక్షేమం
భారత రాజ్యాంగంలోని 5, 6వ షెడ్యూళ్లలో షెడ్యూల్డు తెగల (ఎస్టీ) పరిపాలనాంశాలను పొందుపరిచారు.
ఆర్టికల్ 366 (25) ప్రకారం హిందు, బౌద్ధ, సిక్కు మతాలను అనుసరించేవారు, ఆదిమ మత పద్ధతులను అనుసరించేవారిని షెడ్యూల్డు తెగలుగా పరిగణిస్తారు.
ఆర్టికల్ 342 ప్రకారం రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర గవర్నరును సంప్రదించిన తర్వాత షెడ్యూల్డు తెగల నిర్వచనాన్ని తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగానే పార్లమెంటు చట్టాలు చేస్తుంది.
2007, మే 11న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రపతి ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన నిర్వచనాన్ని తెలియజేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు.

 

5వ షెడ్యూల్ ముఖ్యాంశాలు
దీనిలో షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనను చేర్చారు.
ఆర్టికల్ 244 (1) ప్రకారం సంబంధిత రాష్ట్ర గవర్నరుతో సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ఒక ప్రాంతాన్ని 'షెడ్యూల్డు ప్రాంతం'గా ప్రకటిస్తారు.
గవర్నర్లు ప్రతి సంవత్సరం తమ రాష్ట్రాల్లోని షెడ్యూల్డు ప్రాంతాల పరిపాలనపై రాష్ట్రపతికి నివేదిక పంపాలి.
రాష్ట్రపతి ఆదేశం మేరకు షెడ్యూల్డు ప్రాంతాలున్న ప్రతి రాష్ట్రంలో షెడ్యూల్డు తెగల సలహా మండలిని ఏర్పాటు చేయాలి.
ఈ మండలిలో సభ్యుల సంఖ్య 20 మంది. వీరిలో వ వంతు మంది షెడ్యూల్డు తెగలకు చెందిన శాసనసభ్యులై ఉండాలి.
షెడ్యూల్డు తెగల శాసనసభ్యులు తగినంతమంది లభించని పక్షంలో మిగిలిన స్థానాలను షెడ్యూల్డు తెగల పౌరులతో నింపాలి.

 

6వ షెడ్యూల్ ముఖ్యాంశాలు
‣ దీనిలో గిరిజన ప్రాంతాలను చేర్చారు.
అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర లాంటి 4 రాష్ట్రాలను చేర్చారు.
ఈ రాష్ట్రాల్లో స్వయంప్రతిపత్తి ఉన్న జిల్లాలు ఉన్నాయి.

 

గిరిజన జిల్లా కౌన్సిళ్లు
ఆర్టికల్ 244 (2), ఆర్టికల్ 275 (1) ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి గల జిల్లాలు, ప్రాంతాల ఏర్పాటు ద్వారా జిల్లా కౌన్సిళ్లు, ప్రాంతీయ కౌన్సిళ్ల ఏర్పాటు ద్వారా అసోంలోని గిరిజన ప్రాంతాల్లో పరిపాలన జరగాలని నిర్దేశించారు.
గిరిజనేతరుల వడ్డీ వ్యాపారాలను, ఇతర వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించడానికి జిల్లా కౌన్సిళ్లకు అధికారాలు కల్పించారు.
కేంద్ర, రాష్ట్రాల చట్టాలు తమ జిల్లాలకు వర్తించకుండా నిరోధించే అధికారాలు ఈ కౌన్సిళ్లు కలిగి ఉన్నాయి.
ఈ కౌన్సిళ్లు క్రమం తప్పకుండా ఆదాయ, వ్యయ ఖాతాలను నిర్వహించాలని రాజ్యాంగం నిర్దేశించింది.
ఈ కౌన్సిళ్ల పనితీరును మదింపు చేయడానికి అవసరమైతే గవర్నర్ ఒక కమిషన్‌ను నియమించవచ్చు.
‣ ఈ కౌన్సిళ్ల కార్యకలాపాల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లవచ్చని సందేహం కలిగినప్పుడు వీటిని రద్దు చేసే అధికారం గవర్నరుకు ఉంది.

 

జిల్లా మండళ్లు, ప్రాంతీయ మండళ్లల నిర్మాణం
ప్రతి స్వయంప్రతిపత్తి జిల్లాకు ఒక జిల్లా మండలి ఉంటుంది.
జిల్లా మండలిలో 30 మంది సభ్యులు ఉండాలి.
వీరిలో 26 మంది వయోజన ఓటు ద్వారా ఎన్నికవుతారు.
మిగిలిన నలుగురిని గవర్నర్ నామినేట్ చేస్తారు.
‣  ప్రతి స్వతంత్ర ప్రాంతానికి ఒక ప్రాంతీయ మండలి ఉంటుంది.
 ప్రతి జిల్లా మండలిని ఆ జిల్లా పేరుతో పిలుస్తారు.
 ప్రాంతీయ మండలిని ఆ ప్రాంతం పేరుతో పిలుస్తారు.
 స్వయంప్రతిపత్తి జిల్లా పరిపాలన మొత్తం జిల్లా కౌన్సిల్ చేతుల్లో ఉంటుంది.
 జిల్లాలోని స్వతంత్ర ప్రాంతాల పరిపాలన మాత్రం ప్రాంతీయ మండలి పరిధిలో ఉంటుంది.
 రాష్ట్ర గవర్నర్ ఆయా తెగల ప్రాతినిధ్య సంఘాలు, తెగల మండళ్లతోనూ సంప్రదించి జిల్లా మండలి, స్వతంత్ర మండళ్ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను రూపొందిస్తారు.
జిల్లా మండలి సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు.
 నామినేటెడ్ సభ్యుల పదవీ కాలం మాత్రం గవర్నర్ అభీష్టంపై ఆధారపడి ఉంటుంది.

 

షెడ్యూల్డు తెగల అభివృద్ధి చట్టాలు
 నేచర్ - మ్యాన్ - స్పిరిట్ భావన ప్రకారం ప్రకృతి, మానవుడు, ఆరాధనల మధ్య విడదీయలేని సంబంధం ఉంది.
‣  కొన్ని తెగల్లో వివాహానికి ముందుగా మామిడి చెట్లను వివాహం చేసుకునే ఆచారం ఇప్పటికీ ఉంది.

 

అటవీ చట్టం - 1878
 ఈ చట్టం ద్వారా అడవులపై రాష్ట్రాలకు ఉండే అధికారాన్ని మరింత విస్తృతపరిచారు.
 అడవుల్లో సంచరించడం, పశుపోషణ లాంటి కార్యకలాపాలను నిషేధించారు.
‣  భారతదేశ మొదటి అటవీ విధానాన్ని 1894లో ప్రకటించారు.భారత 

 

అటవీ చట్టం - 1927
ఈ చట్టం ద్వారా ఏర్పాటైన అటవీ శాఖ అధికారులు, అటవీ గార్డులు, ఐఎఫ్ఎస్ అధికారులతో కూడిన కార్యనిర్వాహక వ్యవస్థకు అధికారాలు సమకూర్చారు.
ఈ చట్టం ప్రకారం అటవీ వనరులకు నష్టం చేకూర్చే ఏ వ్యక్తినైనా వారంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం అటవీ శాఖ అధికారులకు ఉంది.
1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అడవులు అనే అంశాన్ని రాష్ట్ర జాబితాలోకి బదిలీ చేశారు.

 

గిరిజన భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం - 1959
ఈ చట్టాన్ని 1/70 అంటారు.
దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో 1959లో అమల్లోకి తెచ్చారు.

 

ఈ చట్టంలోని కీలకాంశాలు
గిరిజనేతరులు గిరిజనుల భూములను కొనకూడదు.
గిరిజనేతరులు తమ భూములను అమ్మాల్సి వస్తే గిరిజనులకే అమ్మాలి.
గిరిజనులు తమ భూములను తమవే అని నిరూపించుకోవాలి.

 

PESA చట్టం 1996
Panchayats Extension to the Scheduled Areas Act - PESA 1996, డిసెంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగంలోని 9వ భాగంలో ఆర్టికల్ 243 ప్రకారం పంచాయతీలకు సంబంధించిన అంశాలను షెడ్యూల్డు ప్రాంతాలకు కూడా వర్తించేలా చేసిన చట్టం ఇది.
దిలీప్‌సింగ్ భూరియా కమిటీ సిఫార్సుల మేరకు ఈ చట్టాన్ని చేశారు.

దిలీప్‌సింగ్ భూరియా కమిటీ గిరిజన ప్రాంతాల్లో స్వపరిపాలనకు 3 అంచెల వ్యవస్థను సిఫారసు చేసింది. అవి:
ఎ) గ్రామసభ: ఇది గిరిజనులు నివసించే సహజ ప్రాంతంపై ఆధిపత్యం కలిగి ఉండి, ఆ ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది.
బి) గ్రామ పంచాయతీ: ఇది గ్రామ సభ నుంచి ఎన్నికైన ప్రతినిధులతో ఏర్పడుతుంది.
సి) బ్లాకు/ తాలూకా: ఇది అత్యున్నత స్థాయి సంస్థ.  జిల్లా కౌన్సిల్‌లా ఉండే సంస్థ.
 

కీలకాంశాలు
గ్రామ ఓటరు జాబితాలో పేరు నమోదు అయిన వ్యక్తులతో కూడిన గ్రామసభ ఉంటుంది.
గ్రామసభ తమ ఆచార, సంప్రదాయాలు, సాంస్కృతిక గుర్తింపు, సామాజిక వనరులు, వివాద పరిష్కారాలు మొదలైన వాటిని భద్రంగా నిలిపి ఉంచడానికి, సంరక్షించుకోవడానికి అధికారాలు కలిగి ఉంటుంది.
  ప్రతి పంచాయతీ గ్రామసభ నుంచి ప్రణాళికలు, కార్యక్రమాల కోసం సక్రమంగా నిధుల వినియోగం జరిగినట్లు ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది.
  అన్ని పంచాయతీల ఛైర్మన్ పదవులు షెడ్యూల్డు తెగలకు మాత్రమే రిజర్వ్ చేస్తారు.
  మధ్యస్థాయిలో లేదా జిల్లా స్థాయిలో ఏదైనా ఒక తెగకు సరైన ప్రాతినిధ్యం లేదని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సీట్లలో  వ వంతు మించకుండా ప్రతినిధులను నామినేట్ చేయవచ్చు.
  షెడ్యూల్డు ప్రాంతాల్లోని చిన్నతరహా జలవనరుల నిర్వహణ కూడా ఆ స్థాయిలోని పంచాయతీలకు అప్పగించాలి.
  అభివృద్ధి కార్యక్రమాల కోసం షెడ్యూల్డు ప్రాంతాల్లో భూసేకరణ జరపాల్సి ఉన్నప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా గ్రామసభ లేదా పంచాయతీల అభిప్రాయాన్ని తీసుకోవాలి.
  షెడ్యూల్డు ప్రాంతాల్లో గనుల లీజు విషయంలో పంచాయతీల సిఫార్సులను ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
  రాజ్యాంగంలోని 9వ భాగంలో నిర్దేశించిన ప్రకారం జనాభాను అనుసరించి ఆయా వర్గాలకు సీట్లలో రిజర్వేషన్లు అమలు చేయాలి.


రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన పంచాయతీలకు బదిలీ చేసే అధికారాలు
  మద్యపాన నిషేధం, నియంత్రణ
  గ్రామీణ మార్కెట్లను నిర్వహించడం
  చిన్నతరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు
  భూమి పరాధీనం కాకుండా చర్యలు చేపట్టడం
  పరాధీనమైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం
  సాంఘిక విభాగాల్లో పనిచేస్తున్న సంస్థల నిర్వహణ
  షెడ్యూల్డు ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల నియంత్రణ


అటవీ హక్కుల గుర్తింపు చట్టం - 2006
  అనాది కాలం నుంచి గిరిజనులకు, అటవీ నివాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించడానికి 2006, డిసెంబరు 18న అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని చేశారు.
  ఈ చట్టం 2008, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
  దీని ద్వారా గిరిజనులకు మొదటిసారిగా అటవీ హక్కులు, వృత్తి హక్కులను కల్పించారు.
  ఈ చట్టం ద్వారా 95,022 మంది వ్యక్తులకు 8,09,059 ఎకరాల అటవీ భూమికి సంబంధించిన టైటిల్ డీడ్స్ పంపిణీ చేశారు.
  ఈ చట్టం గిరిజనులకు కమ్యూనిటీ హక్కులతో పాటు చిన్న అటవీ ఉత్పత్తులను సేకరించుకునే హక్కులను కూడా కల్పించింది.


 రాజ్యాంగపరంగా గిరిజనులకు కల్పించిన రక్షణలు
ఆర్టికల్ 15(4): ఎస్టీలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించకూడదు.
ఆర్టికల్ 16(4): ఉద్యోగాల భర్తీలో ఎస్టీ వర్గాలకు కల్పించే రిజర్వేషన్లను వివక్షగా భావించకూడదు.
ఆర్టికల్ 17: అస్పృశ్యతను నిషేధించారు.
‣ భారత ప్రభుత్వం 1955లో అస్పృశ్యత నేర నిషేధ చట్టాన్ని చేసింది. ఈ చట్టాన్ని 1976లో పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మార్చారు. ఈ చట్టం ప్రకారం 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధిస్తారు.
ఆర్టికల్ 46: ఎస్టీ వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించాలి.
ఆర్టికల్ 164: ఎస్టీల సంక్షేమం కోసం ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రత్యేక గిరిజన మంత్రిని నియమించాలి.
ఆర్టికల్ 244 (1): అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలను మినహాయించి ఏదైనా ఒక రాష్ట్రంలోని షెడ్యూల్డు ప్రాంతాలు, షెడ్యూల్డు తెగల పరిపాలనకు సంబంధించి 5వ షెడ్యూల్‌లోని నిబంధనలు అనుసరించాలి.
ఆర్టికల్ 244 (2): అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించి 6వ షెడ్యూల్‌లోని నిబంధనలను అనుసరించాలి. దీని ప్రకారం ప్రత్యేక జిల్లా కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలి. ఈ కౌన్సిళ్లకు శాసన, న్యాయ, కార్యనిర్వాహక అధికారాలు ఇచ్చారు.
ఆర్టికల్ 275 (1): వివిధ రాష్ట్రాల్లో ఎస్టీల సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
ఆర్టికల్ 330: లోక్‌సభలో ఎస్టీ వర్గాల వారికి 47 స్థానాలను రిజర్వ్ చేశారు.
ఆర్టికల్ 332: వివిధ రాష్ట్రాల విధాన సభల్లో ఎస్టీ వర్గాలకు అసెంబ్లీ స్థానాలను రిజర్వ్ చేశారు.
ఆర్టికల్ 338 (A): జాతీయ ఎస్టీ కమిషన్‌ను రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్టికల్ 339: షెడ్యూల్డు ప్రాంతాల పరిపాలన, షెడ్యూల్డు తెగల సంక్షేమంపై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంది.


గిరిజనుల పాలనాభివృద్ధి - కమిటీలు
‣ ఎం.ఎస్.చౌదరి కమిటీ - 1961 సిఫార్సులు
 వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కమిటీని నియమించారు.
 గిరిజనులకు లభిస్తున్న హక్కులు, రాయితీలను పునఃసమీక్షించడానికి, అటవీ ప్రాంతానికి 8 కి.మీ. పరిధిలో  ఉన్న గిరిజన, ఇతర వర్గాల వారికి మాత్రమే హక్కులు, రాయితీలు కల్పించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది.
  అటవీ పరిమాణం, స్వభావాన్ని అనుసరించి అందులో పశువులు మేపుకోవడానికి అనుమతి ఇవ్వాలి.
  చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణను రాష్ట్ర ప్రభుత్వాలే స్వయంగా చేపట్టి శాఖాపరమైన డిపోల ద్వారా గిరిజనులకు పంపిణీ చేయాలి.


రాయ్‌బర్మన్ కమిటీ - 1971
  ఈ కమిటీ గిరిజన జీవన విధానంలో అడవుల ప్రాధాన్యాన్ని గుర్తిస్తుంది.
  గతంలో చేసిన అటవీ విధానాల్లో గిరిజన ఆర్థిక వ్యవస్థలను నిర్లక్ష్యం చేయడాన్ని తప్పు పట్టింది.
‣ ఉచిత వంట చెరకు, పశుగ్రాసం, గృహ నిర్మాణం కోసం కలప మాత్రమే కాకుండా గిరిజనులకు మొత్తం చిన్న తరహా అటవీ ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయంలో మూడో వంతు కేటాయించాలని సిఫారసు చేసింది.
  త్రికోణ అటవీ విధానంలో మూడు భుజాలు గిరిజన వ్యక్తి, గిరిజన సముదాయం, జాతీయ ప్రయోజనాలు. ఈ మూడింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలి.
  అటవీ విధానం 3 రకాల అవసరాలను తప్పనిసరిగా తీర్చాలి.
               1. ఆవరణ సంబంధమైన సంరక్షణ
               2. ఆహారం, పండ్లు
               3. ఇంధనం, పశుగ్రాసం, ఇతర గిరిజన గృహసంబంధ అవసరాలు, మృత్తిక, నీటి యాజమాన్య పద్ధతులు, అడవుల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
  1988 నాటి జాతీయ అటవీ విధానం మొదటిసారిగా అడవుల్లో నివసించే ప్రజల అవసరాలను గుర్తించింది.
  క్షీణించిపోతున్న అడవులను పునరుద్ధరించడానికి చేపట్టిన కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, గ్రామీణ సంఘాలను భాగస్వాములను చేయడానికి అన్ని రాష్ట్రాల అటవీ కార్యదర్శులకు తగిన మార్గదర్శక సూత్రాలతో కూడిన ఆదేశాన్ని 1990, జూన్ 1న విడుదల చేశారు.
  1996, మే వరకు 16 రాష్ట్రాలు సంయుక్త అటవీ నిర్వహణ చర్యలు చేపట్టాయి.


వర్జీనియస్ జాక్సా కమిటీ - 2013
  ఈ కమిటీని గిరిజనుల సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య స్థాయిలను అధ్యయనం చేసేందుకు భారత ప్రభుత్వం నియమించింది.
  2014, మేలో ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు
  గిరిజనులకు సరైన రీతిలో పునరావాసాన్ని కల్పించాలి.
  PESA చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలి.
  గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  గిరిజనులు వివిధ కేసుల రీత్యా జైళ్లలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
  గిరిజన ఆరోగ్య ఉప ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి.


ఆదివాసీ ప్రాంతాలు - స్వయంప్రతిపత్తి జిల్లాలు
Part - 1 : అసోం
1. ఉత్తర కాచార్ హిల్స్ జిల్లా
2. కార్బీ అంగ్‌లాంగ్ జిల్లా
3. బోడోలాండ్ జిల్లా
Part - 2 : మేఘాలయ
1. ఖాసీ హిల్స్ జిల్లా
2. జైంతియా హిల్స్ జిల్లా
3. గారోహిల్స్ జిల్లా
Part - 2A
1. త్రిపురలోని ఆదివాసీ ప్రాంతాల జిల్లా
Part - 3 : మిజోరం
1. చక్మా జిల్లా
2. మారా జిల్లా
3. లాయి జిల్లా


గిరిజన అభివృద్ధి సంస్థలు
షెడ్యూల్డు కులాల, తెగల పరిశోధన, శిక్షణ సంస్థ: ఎస్టీ కమిషన్, దేబర్ కమిషన్ సిఫారసుల మేరకు ఈ సంస్థను ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఏర్పాటు చేశారు.
దీని విధులు
  గిరిజన కోటా కిందకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులను నిర్ధారించడం.
  గిరిజనులకు కల్పించిన రాజ్యాంగ పరమైన రక్షణలను అమలుపరచడం.
  గిరిజన ఎథ్నోగ్రఫిక్ అధ్యయనం.
  విద్యా సంస్థలు, ఉద్యోగ నియామకాల్లో చేరడానికి ముందు షెడ్యూల్డు తెగల అభ్యర్థుల పరిశీలన.
  గిరిజన భాష, హస్తకళలు, పాటలు, నృత్యాలను సంరక్షించడం.
  గిరిజన సంస్కృతి, వారసత్వం గురించి ప్రజలకు తెలియజేసేందుకు, గిరిజన మ్యూజియాలను ఏర్పాటు చేయాలి.


జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ - 2001
  గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో లాభాపేక్ష లేని ఒక సంస్థగా దీన్ని ఏర్పాటు చేశారు.
  గిరిజనులకు ఆదాయాన్ని చేకూర్చే కార్యక్రమాలను అమలు పరచడానికి తక్కువ వడ్డీతో రుణ సహాయాన్ని ఏర్పాటు చేయాలి.


గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య - 1987
‣ Tribal Co-operative Marketing Federation of India (TRIFED)
  దీన్ని న్యూదిల్లీ ప్రధాన కేంద్రంగా 1987లో స్థాపించారు.
  ఇది మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ చట్టం 1984 కింద ఏర్పడింది.
  గిరిజనులు సేకరిస్తున్న సూక్ష్మ, అటవీ ఉత్పత్తులను సరైన ధరలకు విక్రయించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం మార్కెట్ డెవలపర్‌గా పని చేస్తోంది.


గిరిజన కో - ఆపరేటివ్ కార్పొరేషన్ విధులు
  గిరిజనులు సేకరించే అటవీ ఫలసాయాన్ని తగిన ధరలకు కొనడం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి కృషి చేయడం.
  గిరిజనుల వ్యవసాయ, గృహావసరాల కోసం తక్కువ వడ్డీకి రుణ సౌకర్యం కల్పించడం.
  గిరిజనులకు నిత్యావసర సరకులను సరసమైన ధరలకు లభ్యమయ్యేలా చూడటం.


సమగ్ర గిరిజన అభివృద్ధి ఏజెన్సీ (Integrated Tribal Development Agency)
  గిరిజనుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారు.
  వీటికి అధికారి ప్రాజెక్టు ఆఫీసర్ (పీఓ).
  దేశంలో ఇప్పటివరకు 194 ఐటీడీఏలను ఏర్పాటు చేశారు.
  ఇవి సంబంధిత గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తాయి.
ట్రైబల్ సబ్ ప్లాన్
  అయిదో పంచవర్ష ప్రణాళికా కాలంలో కొత్త మార్గాన్ని అవలంబించి ఎస్టీల కోసం ట్రైబల్ సబ్ ప్లాన్‌ను ప్రారంభించారు.
‣  ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా 1974లో ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ప్రారంభించారు. దీన్నే ఇందిరమ్మ కలలు అంటారు.
‣ సమాజంలో ఎస్టీ జనాభా దామాషాలో ప్రతి సంవత్సరం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికా బడ్జెట్ నుంచి ఈ వర్గాల అభివృద్ధి కోసం నిధులను కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధంగా కేటాయించిన నిధులు మురిగిపోవు.
 ఎస్టీ ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే ఈ నిధులను వినియోగించాల్సి ఉంటుంది.
 ఎస్టీ ఉపప్రణాళిక నిధులను సద్వినియోగం చేసేందుకు నోడల్ ఏజెన్సీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలి.
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007లో నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది.


ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ (పీటీజీ)
 కొన్ని కొండ జాతుల వారిలో అక్షరాస్యత మరీ తక్కువగా ఉండి, వారి జనాభా రానురాను పడిపోతోంది.
 వారు ఉపయోగించే వ్యవసాయ పూర్వ సాంకేతిక పద్ధతులు, ఆర్థిక పరిస్థితులు చాలా వెనుకబడినవి.
 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇలాంటి 75 వర్గాలను ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ (పీటీజీ)గా గుర్తించారు.
 ఒక్కో వర్గంలోని వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.
 వారు మరీ మారుమూల ప్రాంతాల్లో ఉంటారు.
 నిర్వహణ వసతి సౌకర్యాలు వీరికి తక్కువగా అందుతాయి.
 వీరి అవసరాలు మిగతా కొండజాతుల వారితో పోలిస్తే పూర్తిగా వేరుగా ఉంటాయి.
 ట్రైబల్స్‌లో వీరు మరీ వల్నరబుల్ వర్గాలు.


ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం - 1989
 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని 1989, సెప్టెంబరు 11న పార్లమెంటు ఆమోదించింది. 1990, జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది.
 ఇది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆయా వర్గాలపై జరుగుతున్న దాడులను నియంత్రిస్తుంది.


గిరిజన బాలబాలికలకు హాస్టళ్ల నిర్మాణ పథకం
 ఈ పథకం ద్వారా మాధ్యమిక, ఉన్నత, విశ్వవిద్యాలయ స్థాయిల్లో అవసరమైన నూతన వసతిగృహాల నిర్మాణం, ఇదివరకే ఉన్న హాస్టళ్లకు అదనపు గదుల నిర్మాణం చేపట్టడం.
 ఈ భవనాలకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ఉచితంగా అందజేస్తాయి.
 హాస్టళ్ల నిర్వహణ, నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందుతుంది.


పుస్తక నిధి పథకం
 వృత్తి విద్య కోర్సులను అభ్యసించే గిరిజన విద్యార్థులు ఖరీదైన పుస్తకాల భారాన్ని భరించలేకపోతున్నారు.
 దీనివల్ల సంభవించే డ్రాప్ అవుట్లను తగ్గించడానికి పుస్తకాల కొనుగోలు కోసం ఆర్థిక సహాయం అందిస్తారు.
‣ ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలు
 గిరిజనులకు నాణ్యమైన విద్యను అందించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 (1) ప్రకారం నిర్దేశించిన సహాయం ప్రకారం దేశవ్యాప్తంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న 100 ఆదర్శ పాఠశాలలను స్థాపించాలని
‣ 1997 - 98లో నిర్ణయించారు.
 10వ పంచవర్ష ప్రణాళిక చివరి నాటికి 92 పాఠశాలలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి.


వనబంధు కళ్యాణ యోజన (2014)
 గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం 2014 జులైలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
 గిరిజనులకు, ఇతర ప్రజలకు హెచ్‌డీఐ సూచీలో ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు.
 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాల్లోని ఒక్కో గిరిజన జిల్లా చొప్పున ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.


రోష్ని పథకం:
 భారత గ్రామీణాభివృద్ధి శాఖ 2013, జూన్ 7న దేశవ్యాప్తంగా 24 జిల్లాల్లో ప్రారంభించింది. ఈ జిల్లాలన్నీ అత్యంత నక్సల్స్ ప్రభావిత జిల్లాలే.
 ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాను ఎంపిక చేశారు.
 ఈ పథకం కింద 50,000 మంది గిరిజన యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు.
 నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 : 25 నిష్పత్తిలో భరిస్తాయి.
 ఈ పథకాన్ని 3 సంవత్సరాల పాటు అమలుచేస్తారు.


CCD పద్ధతి: (Conservation Cum Develpoment)
 PTGల కోసం 11వ ప్రణాళికా కాలంలో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ CCD(సంరక్షణ, అభివృద్ధి) అనే నూతన ప్రణాళికను రూపొందించింది.
దీని లక్ష్యాలు
1. దారిద్య్ర నిర్మూలన
2. అక్షరాస్యత స్థాయి పెంపు
3. ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం
4. సంస్కృతి పరిరక్షణ
గిరిజన ప్రాంతాల్లో వృత్తి విద్య
 గిరిజనులు స్వయం ఉపాధిని, తమకు అనుకూలమైన సరైన ఉపాధిని పొందడానికి వారి విద్యార్హతలు, ప్రస్తుత మార్కెట్ ధోరణులను అనుసరించి సంప్రదాయ లేదా ఆధునిక వృత్తి విద్యల్లో వారికి శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను మెరుగుపరచడం ఈ పథకం ఆశయం.
నేషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎంపవర్‌మెంట్ స్కీమ్ లక్ష్యాలు
 ఆదిమ గిరిజనుల్లో చైతన్యం తీసుకురావడం.
 లబ్ధిదారులకు శిక్షణ కల్పించడం.
 మార్కెట్‌లను సంధానపరచడంలో సహాయపడటం.
 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం భూయాజమాన్య హక్కులు పొందిన గిరిజనులు ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందడానికి అర్హులు.


డాక్టర్ అంబేడ్కర్ స్కీమ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్
 కులాంతర వివాహం చేసుకున్న నవ దంపతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
 అంబేడ్కర్ ఫౌండేషన్ కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత శాఖ ఒక్కో నవ జంటకు రూ.2.5 లక్షలు చొప్పున అందిస్తుంది.
 ఇందులో 50% అయిదేళ్ల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు.
 నవ దంపతుల్లో ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ అయి ఉండి ఇద్దరి వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటనివారు ఈ పథకానికి అర్హులు.
MADA (Modified Area Development Approach)
 కనీసం పదివేల జనాభా ఉండి దానిలో 50% లేదా అంతకంటే ఎక్కువ ఎస్టీ జనాభా కలిగిన ప్రాంతాలే MADA.
 దేశంలో ఇప్పటివరకు గుర్తించిన MADAల సంఖ్య 259.
 ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పథకాలను అమలుపరచడానికి ప్రత్యేక యంత్రాంగం ఉండదు.
 ఈ పథకాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలు చేస్తారు.


బహుళార్థసాధక బ్లాకులు (1956)
 గిరిజనుల ఆర్థిక వ్యవస్థాపన, సాంస్కృతిక అభివృద్ధిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ఈ బ్లాకుల లక్ష్యం.
 ఈ బ్లాకుల పనితీరును పర్యవేక్షించడానికి ప్రజాప్రతినిధులతో కూడిన పంచాయతీలను ఏర్పాటుచేయాలని ఎల్విన్ కమిటీ సిఫారసు చేసింది.
 ఈ బ్లాకుల పనితీరు లోపభూయిష్టంగా ఉందని 1969లో నియమించిన షిలావో కమిటీ పేర్కొంది.


ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక
 ఉప ప్రణాళిక: ప్రణాళికా వ్యయంలో కొంత మొత్తాన్ని పక్కకు తీసి దాన్ని ప్రత్యేకంగా ఖర్చు చేయడాన్ని ఉప ప్రణాళిక అంటారు. ఇది ప్రణాళికా వ్యయంలో మరో ప్రణాళిక లాంటిది.
 మన దేశంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 1974లో ఎస్టీలకు గిరిజన ఉప ప్రణాళికను, 1979లో ఎస్సీలకు స్పెషల్ కాంపోనెంట్ ప్రణాళికను రూపొందించింది.
 మన దేశంలో ఎస్టీలకు 5వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి, ఎస్సీలకు 6వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి ఉప ప్రణాళికకు నిధుల కేటాయింపు ప్రారంభమైంది.
 ఆంధ్రప్రదేశ్‌లో ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దామోదర రాజనరసింహ అధ్యక్షతన ఒక ఉపసంఘాన్ని నియమించారు. ఈ ఉపసంఘం 2007 నుంచి 2012 మధ్య కాలంలో ప్రభుత్వం కేటాయించిన, ఖర్చు చేసిన వార్షిక బడ్జెట్‌ల వివరాలను విశ్లేషించింది.
 దీని ప్రకారం ఎస్సీ జనాభా ఆధారంగా ఎస్సీ ఉప ప్రణాళికకు 16.2% ఖర్చు చేయాలి. కానీ 12.5% మాత్రమే ఖర్చు చేశారు.
 ఎస్టీ జనాభా ఆధారంగా ఎస్టీ ఉప ప్రణాళికకు 6.6% ఖర్చు చేయాలి. కానీ 5.22% మాత్రమే ఖర్చు చేశారు.
 ఈ విశ్లేషణ ప్రకారం ఇప్పటివరకు రూ.21,000 కోట్లు నిధులు దారి మళ్లాయి.
 దామోదర రాజనరసింహ కమిటీ నిధుల సక్రమ వినియోగం కోసం ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలని, 32 సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించింది.
 వీటిలో 29 సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపి 2012లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధతను కల్పించింది. ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది.
 2013 - 14 ఆర్థిక సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమలుకు సంవత్సరానికి రూ.12,250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
 ఈ ఉప ప్రణాళిక ప్రకారం ఎస్సీ వర్గాల వారికి 16.41%, ఎస్టీ వర్గాల వారికి 7% నిధులు నిర్దేశించారు.


ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలోని ముఖ్యాంశాలు
 ఈ ఉప ప్రణాళిక అమలుకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి.
 దీన్ని జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ పర్యవేక్షిస్తుంది.
 ముఖ్యమంత్రి అధ్యక్షతన  ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి ఈ ఉప ప్రణాళిక అమలు తీరును పర్యవేక్షిస్తుంది.
 ఈ చట్టం 10 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అప్పటికి కూడా ఈ వర్గాల వారు అభివృద్ధి చెందకపోతే మరోసారి పొడిగిస్తారు.
 దీనికి సంబంధించిన నిధులు కేటాయించడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు.
 దీనిలో భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో చదువు కోవడానికి రూ.10 లక్షలు గ్రాంటుగా అందిస్తారు.
 ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమగ్రమైన అభివృద్ధిని సాధించేలా ప్రోత్సహించడం దీని లక్ష్యం.


మైనార్టీల సంక్షేమం
‣ భారత రాజ్యాంగంలో మైనార్టీ అనే పదాన్ని ఎక్కడా నిర్వచించలేదు. దేశ జనాభాలో తక్కువ శాతంగా ఉన్న వర్గాలను మైనార్టీలుగా పేర్కొనవచ్చు. మన దేశంలో మైనార్టీలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు.
1. మతపరమైన మైనార్టీలు
 జాతీయ మైనార్టీల కమిషన్ చట్టం - 1992లోని సెక్షన్ 2 (C) ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్శీలను జాతీయ స్థాయిలో మైనార్టీ కమ్యూనిటీలుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
 జైన మతస్థులకు కూడా మైనార్టీ హోదాను కల్పిస్తూ కేంద్ర కేబినెట్ 2014, జనవరి 20న నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ 2014, జనవరి 27న వెలువడింది.
2. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు
  రాష్ట్ర వ్యాప్తంగా లేదా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో  అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషకు భిన్నమైన భాషను మాతృభాషగా కలిగిన అల్పసంఖ్యాక వర్గాన్ని భాషాపరమైన మైనార్టీగా పరిగణిస్తారు.
ఆర్టికల్ 347: ఏదైనా ఒక రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న జనాభా తాము మాట్లాడే భాషను కూడా సదరు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిందిగా రాష్ట్రపతిని కోరవచ్చు. దానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఆ భాషను కూడా రాష్ట్రమంతటా అధికారికంగా గుర్తించాలని రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు.
ఆర్టికల్ 350: ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించే ఏ భాషలోనైనా తన సమస్యను సంబంధిత అధికారికి విన్నవించుకోవచ్చు.
ఆర్టికల్ 350 (A): భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రాథమిక స్థాయిలో వారి మాతృభాషలోనే విద్యా బోధన జరపాలి. అవసరమైతే ఇందుకు సంబంధించిన ఆదేశాలను రాష్ట్రపతి జారీ చేస్తారు.
ఆర్టికల్ 350 (B) (1): భాషాపరమైన మైనార్టీల ప్రగతి కోసం రాష్ట్రపతి ఒక ప్రత్యేక అధికారిని నియమించగలరు.
ఆర్టికల్ 350(B)(2): భాషాపరమైన మైనార్టీల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలపై పరిశీలన జరిపి, రాష్ట్రపతికి నివేదికలు సమర్పించడం ప్రత్యేక అధికారి బాధ్యత. ఈ నివేదికలను రాష్ట్రపతి పార్లమెంటుకు సమర్పించాలి. ఈ నివేదికల ప్రతులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రాష్ట్రపతి పంపుతారు.
 జాతి నిర్మాణంలో మైనార్టీల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఇందిరా గాంధీ ప్రభుత్వం తొలిసారిగా 15 అంశాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది
 రాజేంద్ర సచార్ కమిటీ సిఫార్సుల మేరకు మన్మోహన్‌ సింగ్ ప్రభుత్వం 2006, సెప్టెంబరు 10న మైనార్టీల ప్రగతి కోసం 15 సూత్రాల కార్యక్రమాన్ని ప్రారంభించింది.


జియో పార్శీ పథకం
 మన దేశంలోని పార్శీల జనాభా క్షీణతను నివారించేందుకు మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2013, సెప్టెంబరు 23న జియో పార్శీ అనే పథకాన్ని ప్రారంభించింది.
నయా రోష్ని పథకం
 మైనార్టీ మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2012 - 13 నుంచి నయా రోష్ని పథకాన్ని ప్రారంభించింది.
నయా మంజిల్
 మైనార్టీల విద్య, జీవనోపాధి అవసరాలను తీర్చడానికి 2015, ఆగస్టు 8న పట్నాలో నయా మంజిల్ పథకాన్ని కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా ప్రారంభించారు.
నందలాల్ జోత్వానీ కమిషన్
 భాషాపరమైన మైనార్టీల కమిషనర్ డాక్టర్ నందలాల్ జోత్వానీ 2013, జులై 25న తన నివేదికను కేంద్రానికి సమర్పించారు. భాషాపరమైన మైనార్టీ కమిషనర్ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించడం ఇది 49వ సారి.
కేంద్ర వక్ఫ్ మండలి (మత ధార్మిక సంస్థ)
 కేంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల నిర్వహణకు, దేశంలోని వక్ఫ్‌ల పాలనకు సంబంధించిన విషయాల్లో సహకరించేందుకు భారత ప్రభుత్వం 1964 డిసెంబరులో కేంద్ర వక్ఫ్ మండలిని ఏర్పాటు చేసింది.
 కేంద్ర వక్ఫ్ మండలిలో 20 మంది సభ్యులు ఉంటారు. దీనికి ఛైర్మన్‌గా కేంద్ర మైనార్టీల వ్యవహారాల మంత్రి ఉంటారు. ఈ మండలి సంవత్సరానికి 2 సార్లు సమావేశమవుతుంది.
జాతీయ మైనార్టీల అభివృద్ధి ఆర్థిక సంస్థ
 గోపాల్‌సింగ్ కమిటీ నివేదిక ఆధారంగా మైనార్టీలకు కంపెనీల చట్టం ప్రకారం 1994లో జాతీయ మైనార్టీల అభివృద్ధి ఆర్థిక సంస్థను ఏర్పాటు చేశారు. దీన్ని మొదటిసారిగా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తర్వాత దీన్ని 2005లో మైనార్టీల వ్యవహారాల మంత్రిత్వశాఖకు బదిలీ చేశారు.
 మైనార్టీలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహకారం, నైపుణ్యాల పెంపుదల కోసం ఇది కృషి చేస్తుంది.
 నేషనల్ వక్ఫ్ డెవలమెంట్ కార్పొరేషన్ (NAWADCO) ను 2014, జనవరి 29న రూ.500 కోట్లతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రారంభించింది.
మౌలానా ఆజాద్ ఫౌండేషన్
 దీన్ని 1989, జులై 6న ఏర్పాటు చేశారు. ఇది మైనార్టీల్లోని పేదవారి విద్యాభివృద్ధికి కృషి చేస్తుంది.
 ఇది భారత ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆర్థిక సహకారంతో నడుస్తుంది. దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 15. దీనికి అధ్యక్షుడిగా మైనార్టీ వ్యవహారాల మంత్రి వ్యవహరిస్తారు.
రంగనాథ్ మిశ్రా కమిటీ (2004)
 అటల్ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం మత, భాషా సంబంధమైన మైనార్టీలపై అధ్యయనం చేయడానికి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీని ఏర్పాటు చేశారు.
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు 10 శాతం, ఇతర మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది.
 ముస్లింలు, క్రైస్తవులు, జైన్లు, పార్శీలను ఎస్సీల పరిధి నుంచి మినహాయిస్తూ 1950లో వెలువరించిన ఆదేశాలను రద్దుచేయాలని సిఫారసు చేసింది.
రాజేంద్రసింగ్ సచార్ కమిటీ
 మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం 2005, మార్చి 9న రాజేంద్రసింగ్ సచార్ కమిటీని ఏర్పాటు చేసింది.
సిఫార్సులు
 మతపరమైన మైనార్టీల సమస్యల నివారణకు సమానావకాశాల కమిషన్లను ఏర్పాటు చేయాలి.
 అజ్లాఫ్ తరగతిని బీసీ వర్గాల జాబితాలో చేర్చాలి.
 ప్రాథమిక విద్యను ఉర్దూ భాషలో బోధించాలి.
 మదర్సాలను రాష్ట్ర విద్యా బోర్డులకు అనుసంధానం చేయాలి.
 ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎస్సీ వర్గాలకు రిజర్వ్ చేయకూడదు.


15 సూత్రాల పథకం
* రాజేంద్రసింగ్ సచార్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 15 సూత్రాల కార్యక్రమాన్ని 2006, సెప్టెంబరు 10న ప్రకటించింది. ఇవి విద్యారంగం, ఉపాధిరంగం, మైనార్టీల ఆవాస ప్రదేశాలను మెరుగుపరచడం, మతపరమైన ఉద్రిక్తలను నివారించడం, నియంత్రించడం మొదలైన వాటికి సంబంధించిన మౌలికాంశాలు. అవి
1) మైనార్టీలు నివసించే వాడల్లో సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ), కస్తూర్బాగాంధీ పాఠశాలను నెలకొల్పాలి.
2) సమీకృత బాలల అభివృద్ధి పథకం అమల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను మైనార్టీ వర్గాలు నివసించే ప్రదేశాల్లో నెలకొల్పాలి.
3) ముస్లిం విద్యార్థులు ఎక్కువగా ప్రవేశాలు పొందే పాఠశాలలను గుర్తించి, అందులో ఉర్దూ ఉపాధ్యాయులను నియమించడం.
4) మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ద్వారా విద్యారంగంలో మౌలిక సదుపాయాలను పెంపొందించడం.
5) ప్రతిభావంతులైన మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించడం.
6) మదర్సాలను ఆధునికీకరించి ముస్లిం కుటుంబాలకు అందుబాటులో ఉంచడం.
7) ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద అల్పసంఖ్యాక వర్గాల వారికి గృహాలను కేటాయించడం.
8) మైనార్టీలు నివసించే మురికివాడల్లో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణాభివృద్ధి పథకం కింద మౌలిక సదుపాయాలను కల్పించడం.
9) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్వయం ఉపాధి పథకాలను అమలు చేసేటప్పుడు 15% నిధులను అల్పసంఖ్యాక వర్గాలకు కేటాయించడం.
10) సాంకేతిక శిక్షణ ఇవ్వడం ద్వారా మైనార్టీలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం.
11) తక్కువ వడ్డీకి రుణ సౌకర్యాలు కల్పించడం.
12) మైనార్టీ అభ్యర్థులకు పోటీ పరీక్షల ఉచిత శిక్షణ సౌకర్యాలను పెంపొందించడం ద్వారా వారికి కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో ఎక్కువ భాగస్వామ్యం కల్పించడం.
13) మత కల్లోలాల బాధితులకు తగిన నష్టపరిహారాన్ని, పునరావాసాన్ని కల్పించడం.
14) మతపరమైన ఉద్రిక్తతలకు కారకులైన వారిని ప్రత్యేక న్యాయస్థానాల్లో త్వరితగతిన విచారించి నిందితులకు కఠిన శిక్ష విధించడం.
15) మతపరమైన ఉద్రిక్తతలు నెలకొనే ప్రాంతాల్లో తమ విధులను నిష్పక్షపాతంగా సమర్థంగా నిర్వహించే రెవెన్యూ, పోలీసు అధికారులను నియమించాలి.
ఈ 15 సూత్రాలకు అదనంగా 2009, అక్టోబరు 22న మరో 3 అంశాలను చేర్చారు. అవి:
1) జాతీయ గ్రామీణ తాగునీటి పథకం
2) చిన్న, మధ్య తరహా పట్టణాల్లో పట్టణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం
3) పట్టణ మౌలిక సదుపాయాల కల్పన పథకం.


సమాన అవకాశాల కమిషన్
 విద్యా, ఉద్యోగాల్లో మైనార్టీలు వివక్ష ఎదుర్కోకుండా నివారించేందుకు సమాన అవకాశాల కమిషన్ (EOC)ను ఏర్పాటు చేయాలని 2014, ఫిబ్రవరి 20న కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
 రాజేంద్రసింగ్ సచార్ కమిటీ నివేదిక ప్రకారం దేశ జనాభాలో 18.5% ముస్లింలు ఉండగా ప్రభుత్వ అధికార యంత్రాంగంలో వీరి సంఖ్య కేవలం 2.5% మాత్రమే. దీన్ని సమతౌల్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార/ అకృత్యాల నిరోధక చట్టం - 1989
 షెడ్యూల్డు కులాల, తెగల సంరక్షణకు భాతర పార్లమెంటు 1989లో షెడ్యూల్డు కులాల, తెగల అకృత్యాల నిరోధక చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1990 జనవరి 30 నుంచి జమ్మూకశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
ఈ చట్టంలోని ముఖ్యాంశాలు
 ఎస్సీ, ఎస్టీ వర్గాల వారిని కులం పేరుతో దూషించడం, అవమాన పరచడం నేరం.
 ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి భూములను చట్ట వ్యతిరేకంగా, బలవంతంగా స్వాధీనపరచుకోవడం నేరం.
 ఎస్సీ, ఎస్టీ వర్గాల వ్యక్తులను తినకూడని, తాగకూడని పదార్థాలను బలవంతంగా తీసుకోమని ఒత్తిడి చేయడం నేరం.
 వీరిపై తప్పుడు కేసులు, తప్పుడు సమాచార నిందలు మోపడం నేరం.
 వీరి నివాస స్థలాల్లోకి వ్యర్థ పదార్థాలను, కళేబరాలను విసరడం నేరం.
 బావులు, హోటళ్లు లాంటి ప్రాంతాల్లోకి అనుమతి నిరాకరించడం నేరం.
 వీరి ఆస్తులు కోల్పోయే విధంగా విస్ఫోటన పదార్థాలను వినియోగించిన వారికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించడం.
 వీరు ఉపయోగించే జలాశయాలను కలుషితం చేయడం వల్ల అలాంటి నేరానికి పాల్పడిన వారికి చట్టరీత్యా 6 నెలలకు తగ్గకుండా 5 సంవత్సరాల జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు.
 వీరిని ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించకుండా నిరోధించడం నేరం.
‣ ఈ వర్గాల వారితో బలవంతంగా వెట్టి చాకిరీ చేయించడం నేరం.
 ఈ వర్గాల వారిపై హత్యాయత్నం చేస్తే జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తారు.
 ఈ చట్టం ప్రకారం ఈ వర్గాల వారిపై అత్యాచారం చేసిన వ్యక్తులను అరెస్టు చేసి నేరుగా ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరచవచ్చు.
 ఈ చట్టాన్ని అమలు చేయడంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అశ్రద్ధ చేయడం ద్వారా లేదా ఉద్దేశపూర్వకంగా ఎస్సీ, ఎస్టీలకు అందాల్సిన  ప్రయోజనాలను నిలిపివేసినట్లయితే సంబంధిత ఉద్యోగి ఒక సంవత్సరం పాటు జైలు శిక్షకు గురవుతారు.
 ఈ కేసులు అధికంగా నమోదయ్యే ప్రాంతాల్లో విచారణ కోసం ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలి.
 ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు జిల్లా సెషన్స్ కోర్టులకు విచారణ అధికారాలు కల్పించారు.
‣  కనీసం 7 సంవత్సరాల న్యాయవాద వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించి బాధితుల తరఫున వాదించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి.
 ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు తమను తాము సంరక్షించుకునే సందర్భంలో అవసరమైతే వారు ఆయుధాలను సమకూర్చుకోవచ్చు.
 ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోని సంపాదించే వ్యక్తులు హత్యకు గురైనప్పుడు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నష్టపరిహారంతో పాటు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం, వారి పిల్లల చదువు బాధ్యతల్ని ప్రభుత్వం స్వీకరించాలి.
‣ కనీసం డీఎస్పీ స్థాయి అధికారి విచారణ తర్వాత మాత్రమే కేసులను నమోదు చేయాలి.
 1995లో ఈ చట్టంలో చేసిన సవరణను అనుసరించి  దుర్వినియోగపరిచే వ్యక్తులకు కూడా అంతే స్థాయిలో శిక్షను విధించాల్సి ఉంటుంది.
‣ ఈ చట్టం అమలుతీరును పర్యవేక్షించడానికి కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేశారు. అవి:
1) కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వంలో 18 మంది సభ్యుల మండలి
2) రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 25 మంది సభ్యుల మండలి.
3) జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో 16 మంది సభ్యుల మండలి.
  పైన పేర్కొన్న 3 మండళ్లలో ఎంఎల్ఏ, ఎంపీ, ప్రభుత్వ ఉద్యోగులు, అనధికారులు, మంత్రులు, సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు.
 జిల్లా కమిటీలు తమ నివేదికలను రాష్ట్ర కమిటీకి, రాష్ట్ర కమిటీలు తమ నివేదికలను కేంద్ర కమిటీకి పంపాలి. మార్చి 31లోగా ఈ అంశాలపై ఒక నివేదికను ప్రభుత్వం పార్లమెంటు ముందు ఉంచాలి.
 ఈ చట్టం ప్రకారం శిక్షకు గురైనవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.
 ఈ చట్టాన్ని కేంద్రం రూపొందించినప్పటికీ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.
 ఈ చట్టంపై అవగాహన కల్పించడానికి విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలి.


చట్టం అమలు
 ఈ చట్టం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 : 50 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తున్నాయి.
 ఈ చట్టం ప్రకారం 2002లో 27,894 కేసులు ఉంటే 2006లో 32,407 కేసులు నమోదయ్యాయి.
 ఈ చట్టం అమలుకు ఆంధ్రప్రదేశ్‌తో సహా 24 రాష్ట్రాల్లో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు.
 ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో సహా 17 రాష్ట్రాల్లో ప్రత్యేక సెల్స్‌ను ఏర్పాటు చేశారు.


ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక సవరణ చట్టం - 2015
 1989 నాటి ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేసే ఉద్దేశంతో ఈ చట్టానికి 2015లో సవరణ చేశారు. ఈ సవరణ చట్టం 2016, జనవరి 23 నుంచి అమల్లోకి వచ్చింది.
దీనిలోని ముఖ్యాంశాలు.
 ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి మెడలో చెప్పుల దండను వేయడం లేదా వారిని నగ్నంగా ఊరేగించడం నేరం.
 ఈ వర్గాల వ్యక్తిని మానవ లేదా జంతు కళేబరాలను మోయాలని లేదా పారవేయమని బలవంతం చేయడం నేరం.
 ఈ వర్గాల వారిని వివస్త్రను చేయడం, శిరోజాలు, మీసాలు తొలగించడం; వారి గౌరవాన్ని భంగపరచేలా ముఖానికి లేదా దేహానికి రంగు పూయడం నేరం.
 ఎస్సీ, ఎస్టీ వర్గాలు వారిలో వారు కలహించుకునేలా వారి మధ్య శతృత్వాన్ని పెంచేలా మాట్లాడటం, రాయడం, సైగలు చేయడం, దృశ్యాలను చూపడం నేరం.

అధికారుల బాధ్యతలు
 పోలీసు  అధికారులు బాధితులు చెప్పిన వివరాలను యదాతథంగా రాయాలి. వారి నుంచి సంతకం తీసుకునేముందు ఆ వివరాలను చదివి వినిపించాలి.
 ఫిర్యాదులను ఎఫ్ఐఆర్ రిజిస్టరులో నమోదు చేయాలి.
 ఫిర్యాదు కాపీని ఫిర్యాదుదారుడికి ఉచితంగా అందజేయాలి.
 బాధితుల లేదా సాక్షుల స్టేట్‌మెంటులను రికార్డు చేయాలి.
 బాధితులకు, సాక్షులకు, వారిపై ఆధారపడిన వారికి తగిన రక్షణలు కల్పించాలి.
 న్యాయ సహాయానికి సంబంధించిన వివరాలను వారికి తెలియజేయాలి.
 ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, గాయల పాలైనప్పుడు తగిన నష్ట పరిహారం చెల్లించాలి.
 విచారణ జరపబోయే ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగా వారికి తెలియజేయాలి.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌