• facebook
  • whatsapp
  • telegram

73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992

అధికార వికేంద్రీకరణకు రాజముద్ర! 

  ఒక మారుమూల ఊరికి నీరు కావాలి. పక్క గ్రామానికి వెళ్లేందుకు పక్కా రోడ్డు అవసరం. విస్తరించిన పల్లెకు విద్యుత్తు లైను వేయాలి. విద్య, వైద్యాలకు సంబంధించి ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరికి చేర్చాలి. ఇలాంటి వాటి కోసం పార్లమెంటు నుంచి ప్రత్యక్ష పాలన సాగించడం సాధ్యమయ్యే పనికాదు. అందు కే పంచాయతీ రాజ్‌ వంటి స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా స్థానిక సమస్యలను స్థానికులే గుర్తించి, స్థానికంగా నిధులు సమీకరించి, ప్రణాళికలు రూపొందించి, అమలు చేసి పరిష్కరిస్తారు. ఇదంతా సక్రమంగా సాగేందుకు, అధికార వికేంద్రీకరణకు వీలు కల్పిస్తూ కొన్ని ప్రత్యేక సవరణ చట్టాలను చేసి రాజ్యాంగ భద్రత కల్పించారు. వాటిపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. 

  

కేంద్రంలో పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో చేసిన 73వ రాజ్యాంగ సవరణ చట్టంతో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత ఏర్పడింది. ఆ చట్టాన్ని సమర్థంగా అమలుచేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం వదిలిపెట్టింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి రాష్ట్రానికి ఒక ఎన్నికల సంఘాన్ని, నిధుల పంపకానికి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. 

ఈ చట్టం వల్ల రాజ్యాంగంలో రెండు ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. మొదటిది రాజ్యాంగానికి తొమ్మిదో భాగాన్ని చేర్చారు. అందులో ఆర్టికల్‌ 243, 243 (A) నుంచి 243 (O) వరకు మొత్తం 16 ఆర్టికల్స్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ విధి విధానాలను వివరించారు. రెండో మార్పు పదకొండో షెడ్యూల్‌ను చేర్చడం. అందులో పంచాయతీ రాజ్‌కు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను పేర్కొన్నారు. ఈ చట్టం 1993, ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది.

ఆర్టికల్‌ 243 (E): పదవీకాలం: * పంచాయతీ సంస్థల పదవీ కాలం అవి ఏర్పడిన తేదీ నుంచి అయిదేళ్లు. అయితే పదవీకాలం కంటే ముందే పంచాయతీ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు. ఆ విధంగా రద్దు చేస్తే ఆరు నెలల్లోగా తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి.

* పంచాయతీ సంస్థల సభ్యుల పదవులకు ఖాళీ ఏర్పడినప్పుడు వాటి భర్తీ కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన సభ్యులు మిగిలిన పదవీకాలం వరకు మాత్రమే కొనసాగుతారు. కానీ పంచాయతీ సంస్థ మొత్తానికి ఎన్నికలు ఆలస్యంగా జరిగితే మాత్రం పూర్తి కాలం అధికారంలో కొనసాగుతారు.

ఆర్టికల్‌ (E) : అర్హతలు, అనర్హతలు: * పంచాయతీ సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే సంబంధిత స్థానిక సంస్థలోని ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి. * 21 ఏళ్లు నిండి ఉండాలి.* దివాలా తీసి ఉండకూడదు.* 1995, మే 30 తర్వాత వివాహమైన దంపతులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండకూడదు.* ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన దేశ ప్రయోజనాల రీత్యా సమంజసమేనని ‘మహ్మద్‌ షరీఫ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ హరియాణా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఆర్టికల్‌ 243 (G): పంచాయతీ సంస్థల అధికారాలు, విధులు: పంచాయతీరాజ్‌ సంస్థలు స్వయంసమృద్ధి సాధించి సమర్థంగా పనిచేయాలంటే వాటికి నిర్దిష్టమైన అధికారాలు, విధులు కల్పించాలి. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ సంస్థలకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను నిర్దేశించారు. ఆ విధంగా విధులను పంచాయతీరాజ్‌ సంస్థలకు బదిలీ చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (6+1): 1) కేరళ   2) కర్ణాటక   3) తమిళనాడు  4) రాజస్థాన్‌  5) సిక్కిం   6) పశ్చిమ బెంగాల్‌   7) డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలి.

ఆర్టికల్‌ 243 (H): రాష్ట్ర శాసన సభ రూపొందించే చట్టం ఆధారంగా పంచాయతీ సంస్థలు పన్నులు విధించి వసూలు చేస్తాయి.

పంచాయతీరాజ్‌ సంస్థలకు ఆదాయ వనరులు: * కేంద్ర ప్రభుత్వం అందించే సహాయక గ్రాంట్లు * రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే నిధులు, రాష్ట్రాల పన్నుల్లో వాటా * స్థానిక సంస్థలకు కింది పన్నుల ద్వారా ఆర్థిక వనరులు లభిస్తాయి.అవి  ఇంటిపన్ను, నీటిపన్ను, ఆస్తుల బదిలీపై పన్ను, దుకాణాలపై పన్ను, ప్రకటనలపై పన్ను, సంతలు, మార్కెట్ల నుంచి లభించే ఆదాయం, జరిమానాలు, విరాళాలు, స్థిరాస్తులను అద్దెకు ఇవ్వడం ద్వారా లభించే ఆదాయం, వృత్తిపన్ను, మూలధనం నుంచి వచ్చే ఆదాయం. 

ఆర్టికల్‌ 243 (I): రాష్ట్ర ఆర్థిక సంఘం: పంచాయతీరాజ్‌ సంస్థలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అవసరమైన విధానాల అధ్యయనం, సిఫార్సులు చేయడంలో ‘రాష్ట్ర ఆర్థిక సంఘం’ కీలక భూమిక పోషిస్తుంది. ఈ సంఘాన్ని గవర్నర్‌ అయిదు సంవత్సరాలకోసారి ఏర్పాటు చేస్తారు.

విధులు: * రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు మంజూరు చేయాల్సిన నిధులు, రాష్ట్ర పన్నుల్లో వాటా గురించి సిఫార్సు చేస్తుంది.

* పంచాయతీ సంస్థలు వసూలు చేసుకునేందుకు అవకాశం ఉన్న పన్నులు, ఇతర సుంకాలను నిర్ధారించి సిఫార్సు చేస్తుంది.

* కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక వనరుల కోసం కేంద్ర ఆర్థిక సంఘానికి గవర్నర్‌ ద్వారా నివేదికలు సమర్పిస్తుంది.

* రాష్ట్ర ఆర్థిక సంఘం వార్షిక నివేదికను గవర్నర్‌కు నివేదిస్తుంది. గవర్నర్‌ ఆ నివేదికను రాష్ట్ర శాసనసభకు సమర్పిస్తారు.

* రాష్ట్ర ఆర్థిక సంఘం నిర్మాణం, సభ్యుల నియామకం, వారి అర్హతలకు సంబంధించిన నియమ నిబంధనలను రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.

ఆర్టికల్‌ 243 (J): అకౌంట్స్, ఆడిటింగ్‌: * పంచాయతీ సంస్థలకు వివిధ మార్గాల ద్వారా లభించిన నిధులు, వాటిని ఖర్చు చేసిన విధానాలపై ఆడిట్‌ నిర్వహించాలి. ఈ ఆడిట్‌ విధానం ఎలా ఉండాలనేది రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నిర్దేశిస్తుంది. * రాష్ట్ర స్థాయిలో పంచాయతీ సంస్థల ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేయడంలో ‘రాష్ట్ర అకౌంటెంట్‌ జనరల్‌’ కీలకపాత్ర పోషిస్తారు. * ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పంచాయతీ సంస్థల్లో 3 రకాల ‘ఆడిట్‌’ విధానాలను నిర్వహిస్తున్నారు. అవి 1) లోకల్‌ ఫండ్‌ ఆడిట్‌ 2) డిపార్ట్‌మెంటల్‌ ఆడిట్‌ 3) జనరల్‌ ఫండ్‌ ఆడిట్‌.

ఆర్టికల్‌ 243 (K): రాష్ట్ర ఎన్నికల సంఘం: * పంచాయతీ సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు స్వయంప్రతిపత్తి ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరం.* రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గవర్నర్‌ ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్‌ నియమిస్తారు. * రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కాలపరిమితి, ఉద్యోగ నిబంధనలను రాష్ట్ర శాసనసభ చేసిన చట్టంలోని నిబంధనలకు లోబడి గవర్నర్‌ నిర్ణయిస్తారు.* రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించే విధానం హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిని పోలి ఉంటుంది. అనగా రాష్ట్రపతి తొలగిస్తారు.

విధులు:  * పంచాయతీ సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా రూపకల్పన.* పంచాయతీ సంస్థల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ. * గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించడం. * పంచాయతీ సమితి/ మండల పరిషత్‌ స్థాయిలో ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, ఎంపీటీసీ పదవులకు ఎన్నికల నిర్వహణ. * జిల్లా పరిషత్‌ స్థాయిలో జడ్పీ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, జడ్పీటీసీ పదవులకు ఎన్నికల నిర్వహణ.

సుప్రీంకోర్టు తీర్పు- కిషన్‌ సింగ్‌ థోమర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసు:  ‘‘ఆర్టికల్‌ 243 ్బర్శీ ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఆర్టికల్‌ 324 ప్రకారం ఏర్పాటైన కేంద్ర ఎన్నికల సంఘం మాదిరిగా రాజ్యాంగ ప్రతిపత్తి ఉంది. అందువల్ల స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయ్యే సందర్భంలో, స్వయం ప్రతిపత్తితో పనిచేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది’’ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఆర్టికల్‌ 243 (L): కేంద్రపాలిత ప్రాంతాలకు అన్వయింపు: * 73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992లోని అంశాలను కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయాలా, వద్దా అనే విషయాన్ని రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటిస్తారు.* శాసనసభలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరిలో ప్రభుత్వాలు అక్కడి స్థానిక సంస్థలకు సంబంధించిన చట్టాలను రూపొందించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలకు లోబడే అవి కొనసాగుతాయి.

ఆర్టికల్‌ 243 (M): మినహాయించిన ప్రాంతాలు:  * 73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 నుంచి కొన్ని ప్రాంతాలను మినహాయించారు. ఆర్టికల్‌ 244 (1)లో పేర్కొన్న ‘షెడ్యూల్డు  ప్రాంతాలు’, ఆర్టికల్‌ 244 (2) లో పేర్కొన్న ‘ఆదివాసీ ప్రాంతాల’ను ఈ చట్టం నుంచి మినహాయించారు. వాటిలో * నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లోని ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ పరిధిలో ఉన్న ప్రాంతాలు. * మణిపుర్‌లోని కొండ ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లో డార్జిలింగ్‌ ప్రాంతంలోని ‘గూర్ఖాహిల్‌ కౌన్సిల్‌’ ఉన్నాయి.

ఆర్టికల్‌ 243 (N): పూర్వ శాసనాల కొనసాగింపు: * 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) అమల్లోకి వచ్చినప్పటికీ ఆ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి అంటే 1993, ఏప్రిల్‌ 24 నుంచి ఒక సంవత్సరం వరకు అంటే 1994, ఏప్రిల్‌ 23 వరకు వివిధ రాష్ట్రాల్లో అప్పటికే అమల్లో ఉన్న పూర్వశాసనాలు కొనసాగుతాయి.* ఈ సంవత్సర కాలం గడువు ముగియక ముందే 73వ రాజ్యాంగ సవరణ (1992) లోని మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత శాసనాలను రూపొందించుకోవాలి. .

ఆర్టికల్‌ 243 (O): ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్ల ఏర్పాటు: * 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారాల కోసం నియోజకవర్గాల ఏర్పాటు, నియోజకవర్గాల రిజర్వేషన్లు మొదలైన వాటికి సంబంధించి వివాదాలను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన అనంతరం ఎన్నికలను సవాలు చేస్తూ న్యాయస్థానాల్లో కేసులు వేయకూడదు. * పంచాయతీ ఎన్నికల వివాదాలను విచారించడానికి అన్ని రాష్ట్రాలు ‘ప్రత్యేక న్యాయ ట్రైబ్యునల్స్‌’ ఏర్పాటు చేయాలి. * ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల వివాదాలను ప్రత్యేక న్యాయ ట్రైబ్యునల్‌ హోదాలో జిల్లా మున్సిఫ్‌ కోర్టులు విచారిస్తున్నాయి.

పెసా(PESA)చట్టం: గిరిజన ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమలుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేసేందుకు పార్లమెంటు సభ్యుడైన ‘దిలీప్‌ సింగ్‌ భూరియా’ అధ్యక్షతన 1994, జూన్‌లో భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. భూరియా కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ‘గిరిజన ప్రాంతాల్లో స్థానిక/పంచాయతీరాజ్‌ విధానం అమలు చట్టం’ (Panchayatraj Extension to Scheduled Areas Act) రూపొందించింది. ఈ చట్టం 1996, డిసెంబరు 24 నుంచి అమల్లోకి వచ్చింది.

పెసా చట్టం - 1996 ముఖ్యాంశాలు:  * ప్రతి గిరిజన గ్రామ పంచాయతీకి ఎన్నికైన గ్రామసభ ఉండాలి. ఈ సభ గిరిజన సంప్రదాయాలను పరిరక్షించాలి.* ప్రభుత్వ పథకాలను పొందేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ఎంపికచేసే అధికారం గ్రామసభకు ఉండాలి. * గ్రామసభ అమోదముద్ర ద్వారానే సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఉద్దేశించిన ప్రణాళికలను, పథకాలను అమలు చేయాలి.* గిరిజన ప్రాంతాల్లో గనుల తవ్వకానికి, వేలంపాట ద్వారా ఖనిజ సంపద వినియోగానికి లైసెన్సులు మంజూరు చేసే అధికారం గ్రామసభ, గ్రామ పంచాయతీలకు ఉంటుంది.* వివిధ ప్రణాళికలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వినియోగానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను గ్రామసభ నుంచి గ్రామ పంచాయతీ పొందాలి.* గ్రామసభ, గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాలను చట్టబద్ధమైనవిగా పరిగణించాలి. పెసా చట్టం ప్రకాకం గ్రామసభ కీలకపాత్ర వహిస్తుంది. * పంచాయతీ సంస్థలోని అన్ని స్థాయుల్లో అధ్యక్ష పదవులను షెడ్యూల్డు తెగల వారికే కేటాయించాలి.

రచయిత: బంగారు సత్యనారాయణ


 

Posted Date : 26-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌