• facebook
  • whatsapp
  • telegram

  ఆంగ్లో - సిక్కు యుద్ధాలు

  19వ శతాబ్దం ప్రారంభంలో మహారాజా రంజిత్‌ సింగ్‌ సిక్కు రాజ్యాన్ని విస్తరింపజేసి ఏకీకృతం చేశాడు. అదేసమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వం పంజాబ్‌ సరిహద్దులను స్వాధీనం చేసుకుంటోంది. రంజింత్‌ సింగ్‌ సట్లెజ్‌ నదికి దక్షిణంగా కొంత భూభాగాన్ని ఆంగ్లేయులకు విడిచి, వారితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాడు. అయితే అతడు బ్రిటిష్‌ వారి దురాక్రమణలను నిరోధించడానికి, ఆఫ్గన్‌లకు వ్యతిరేకంగా పోరాడటానికి తన సైనిక బలాన్ని పెంచుకున్నాడు. వారి శిక్షణ కోసం అమెరికా, యూరప్‌ నుంచి సైనికులను రప్పించాడు. ఇతడు తన సైన్యంలో హిందూ, ముస్లింలను చేర్చుకున్నాడు. రంజిత్‌ సింగ్‌ మరణానంతరం బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ పంజాబ్‌ సరిహద్దుల వద్ద తన సైనిక బలాన్ని పెంచింది. దీంతో ఆంగ్లేయులు, సిక్కు సైన్యాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామాలే మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధానికి కారణమయ్యాయి.

మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం 

* ఈ యుద్ధం 1845, డిసెంబరు 11 నుంచి 1846, మార్చి 9 వరకు జరిగింది.

* మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగింది. ఇందులో బ్రిటిష్‌ వారు విజయం సాధించి, జమ్మూకశ్మీర్‌ను ఆక్రమించారు.

కారణాలు

* భారత్‌లో బ్రిటిష్‌వారి ఆధీనంలోకి రాకుండా స్వతంత్రంగా ఉన్న ఆఖరి రాజ్యం పంజాబ్‌ అని బ్రిటిష్‌ రాజకీయ ప్రతినిధి మేజర్‌ జార్జ్‌ బ్రాడ్‌ఫుట్‌ ఈస్టిండియా కంపెనీకి నివేదించాడు. దీంతో ఈ రాజ్యాన్ని కూడా తమ హస్తగతం చేసుకోవాలని ఆంగ్లేయులు భావించారు. 

* రంజిత్‌ సింగ్‌ మరణించాక, బ్రిటిష్‌ వారు సట్లెజ్‌ నది దగ్గల్లో ఉన్న ఫిరోజ్‌పూర్‌లో సైనిక కంటోన్మెంట్‌ను ఏర్పాటు చేసి, పంజాబ్‌ పరిసర ప్రాంతాల్లో సైనిక బలాన్ని పెంచారు.

* 1843లో ఈస్టిండియా కంపెనీ సింధ్‌ ప్రాంతాన్ని ఆక్రమించింది. 

* బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఎలెన్‌బరో, సర్‌ హెన్రీ హార్డింజ్‌ నేతృత్వంలోని బ్రిటిష్‌ సేనలు బ్రిడ్జింగ్‌ రైళ్లు (ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్‌ బ్రిడ్జ్‌లు), కోటలను ధ్వంసం చేయడానికి వాడే ఫిరంగులను సిద్ధం చేశారు. 

* పంజాబ్ ఆధీనంలో ఉన్న అమూల్యమైన సంపద కూడా ఈస్టిండియా కంపెనీ ఈ రాజ్యంపై దృష్టిసారించేలా చేసింది.

వాడ్నికోట యుద్ధం (1845)

రాజా గుర్దిత్‌ సింగ్‌ మరణించాక అతడి కొడుకైన అజిత్‌ సింగ్‌ లాడ్వా రాజయ్యాడు. బ్రిటిష్‌వారిని ఎదుర్కొనేందుకు ఇతడు లాడ్వాలోని తన కోటను పటిష్ఠపరిచాడు. ఇతడు సిక్కు సైన్యానికి నేతృత్వం వహించాడు. అయితే ఈ యుద్ధంలో అజిత్‌ సింగ్‌ ఓడిపోయాడు. 

ఫిల్లౌర్‌ కోట యుద్ధం (1845) 

ఇది అజిత్‌ సింగ్‌ చేసిన చివరి యుద్ధం. ఇతడు ఫిల్లౌర్‌ కోట నుండే, ఆంగ్లేయులతో పోరాడాడు. ఈ కోట ఒక ప్రత్యేకమైన పాత్ర ఆకారంలో ఉంటుంది. దీని చుట్టూ గొయ్యి ఉండి, అందులో నీరు ఉండేది. నాలుగు మూలల్లోనూ బురుజులతో, చుట్టూ ఎత్తయిన గోడలు ఉన్నాయి. ఈ కారణంగానే అజిత్‌ సింగ్‌ యుద్ధంలో గెలిచాడు. అయితే బ్రిటిష్‌ వారి సైనిక బలాన్ని చూసి అతడు ఆంగ్లేయులకు లొంగిపోయాడు.

ముడ్కీయుద్ధం (1845)

సిక్కు సైన్యానికి నేతృత్వం వహించిన లాల్‌ సింగ్‌ ఈ యుద్ధంలో బ్రిటిష్‌ కమాండర్‌ సర్‌ హ్యూ గోఫ్‌ చేతిలో ఓడిపోయాడు.


ఫిరోజ్‌పూర్‌ యుద్ధం (1845) 

తేజ్‌సింగ్‌ బహదూర్‌ నాయకత్వంలోని సిక్కు సైన్యం బ్రిటిష్‌ వారి చేతిలో ఓడిపోయింది.

బుద్దేవాల్‌ యుద్ధం (1846) 

ఇందులో సిక్కు సేనలకు రంజోద్‌ సింగ్‌ మజితియా నేతృత్వం వహించాడు. సిక్కు సైన్యం హ్యారీ స్మిత్‌ ఆధ్వర్యంలోని బ్రిటిష్‌ సైన్యాన్ని ఓడించింది.

సోబ్రావన్‌ యుద్ధం, లీలావత్‌ యుద్ధం (1846) 

* హ్యారీ స్మిత్‌ నాయకత్వంలోని బ్రిటిష్‌ సేనలు విజయం సాధించాయి.

* మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం లాహోర్‌ సంధి ్బ1846్శతో ముగిసింది. 

* ఈ ఒప్పందం మహారాజా దిలీప్‌ సింగ్, హెచ్‌.హార్డింజ్‌ మధ్య జరిగింది. దీని ప్రకారం రంజిత్‌ సింగ్‌ కొడుకైన దిలీప్‌ సింగ్‌ ్బ5్శను పంజాబ్‌ రాజుగా గుర్తించారు. దిలీప్‌ సింగ్‌ ప్రతినిధిగా అతడి తల్లి జింద్‌ కౌర్‌ను నియమించారు.

* సిక్కులు తమ సైన్యాన్ని నిర్దిష్ట సంఖ్యకు పరిమితం చేయాలని పేర్కొన్నారు.

* ఆంగ్లేయులకు యుద్ధ నష్టపరిహారం కింద రూ.1.5 కోట్లు, జలంధర్, అంతర్వేది, కశ్మీర్, హజారా, బియాస్‌-సింధు నదుల మధ్య ఉన్న ప్రాంతాలు దక్కాయి.

* సిక్కు సామ్రాజ్య రాజధాని లాహోర్‌ బ్రిటిష్‌ వారి ఆధీనంలోకి వెళ్లింది. దీనికి సర్‌ హెన్రీ లారెన్స్‌ను బ్రిటిష్‌ రెసిడెంట్‌గా నియమించారు. 

బైరాహోల్‌ సంధి (1846) 

* ఈ సంధి ప్రకారం రాణి జింద్‌ కౌర్‌ను ప్రతినిధి పదవి నుంచి తొలగించారు.

* హెన్రీ లారెన్స్‌ నాయకత్వంలో 8 మంది సర్దారులతో కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు.

రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం (1848 - 49)

* రామ్‌నగర్, చిలియన్‌వాలాలో పోరాటాలు జరిగాయి. 

* రామ్‌నగర్‌లో జరిగిన యుద్ధంలో ఫలితం తేలలేదు. చిలియన్‌వాలాలో సిక్కులు విజయం సాధించారు. 

* 1849లో చినాబ్‌ సమీపంలోని గుజరాత్‌లో చివరి యుద్ధం జరిగింది. ఇందులో బ్రిటిష్‌ దళాలు విజయం సాధించాయి. 

* రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధంలో దోస్త్‌ మహ్మద్‌ ఖాన్‌ నేతృత్వంలోని ఆఫ్గన్‌ దళాలు సిక్కులకు సహకరించారు.

కారణాలు

* బ్రిటిష్‌వారు సిక్కులను అణచివేయడం, రాణి జింద్‌ కౌర్‌ పట్ల ఆంగ్లేయులు అనుసరించిన విధానాలు రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధానికి ప్రధాన కారణం.

* 1818లో రంజిత్‌ సింగ్‌ లాహోర్‌ను స్వాధీనం చేసుకున్నాక, అందులోని ముల్తాన్‌ కూడా సిక్కు సామ్రాజ్యంలో భాగంగా మారింది. 

* ముల్తాన్‌ను దివాన్‌ మూలరాజు పాలించాడు. లాహోర్‌ బ్రిటిష్‌వారి పరమయ్యాక వారు అక్కడ పన్ను మదింపు, ఆదాయాలు పెంచాలని మూలరాజును ఆదేశించారు. దీంతో అతడు బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు చేశాడు. 

* మూలరాజు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా షేర్‌సింగ్‌ నాయకత్వంలో సేనలను  పంపాడు. 

* 1848లో సిక్కు సేనలు లార్డ్‌ గాఫ్‌ నేతృత్వంలోని బ్రిటిష్‌ సైన్యంతో రెండు  యుద్ధాలు చేశాయి. అవే రాంనగర్, చిలియన్‌వాలా. వీటి తర్వాత లార్డ్‌గాఫ్‌ ముల్తాన్‌ను స్వాధీనం చేసుకొని మూలరాజు తిరుగుబాటును అణచివేశాడు.

యుద్ధ ఫలితాలు

* ఈ యుద్ధం సిక్కు సామ్రాజ్య పతనానికి దారితీసింది. పంజాబ్‌ ఈస్టిండియా కంపెనీ వాయవ్య సరిహద్దు ప్రావిన్స్‌గా మారింది. 

* లార్డ్‌ డల్హౌసీ పంజాబ్‌ను ఆక్రమించాడు. దిలీప్‌ సింగ్, రాణి జింద్‌ కౌర్‌లకు పెన్షన్‌ కల్పించి ఇంగ్లండ్‌కు పంపారు.

* పంజాబ్‌ పాలనా బాధ్యతల పర్యవేక్షణకు హెన్రీ లారెన్స్, జాన్‌ లారెన్స్‌ ఛార్లెస్‌ జివున్మెల్‌లతో బోర్డు ఏర్పాటు చేశారు. 

* 1853లో ఈ బోర్డును రద్దుచేసి దాని స్థానంలో చీఫ్‌-కమిషనర్‌ను నియమించారు. జాన్‌ లారెన్స్‌ పంజాబ్‌కు మొదటి చీఫ్‌-కమిషనర్‌ అయ్యాడు.

మహారాజా రంజిత్‌ సింగ్‌

* రంజిత్‌ సింగ్‌ 1780 నవంబరులో గుజ్రన్‌వాలాకు చెందిన మహాన్‌ సింగ్‌కు జన్మించాడు. మహాన్‌ సింగ్‌ సిక్కు సమాఖ్య సుకర్‌ చౌకియా మిజిల్‌ నాయకుడు.

* పన్నెండేళ్ల వయసులో తండ్రి మరణంతోరంజిత్‌ సింగ్‌ సిక్కు సమాఖ్య అధిపతి అయ్యాడు.

* 1799లో లాహోర్‌ను ఆక్రమించి, రాజధానిగా చేసుకున్నాడు. పంజాబ్‌లోని 12 సిక్కు సమాఖ్యలను, ఇతర చిన్న రాజ్యాలను జయించి, 1801లో పంజాబ్‌ మహారాజు అయ్యాడు.

* రంజిత్‌ సింగ్‌ అనేక ఆఫ్గన్‌ దండయాత్రలను విజయవంతంగా ఎదుర్కొన్నాడు.

* ఇతడికి ‘షేర్‌-ఇ-పంజాబ్‌’ (పంజాబ్‌ సింహం) అనే బిరుదు ఉంది

* 1805లో భాంగమ్‌ మిజిల్‌ నుంచి అమృత్‌సర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. 

* తన సామ్రాజ్యాన్ని సట్లెజ్‌ నదికి ఉత్తరం నుంచి వాయవ్య హిమాలయాలకు దక్షిణం వరకు విస్తరింపజేశాడు.

* సిక్కు రాజ్యంలో లాహోర్, ముల్తాన్, శ్రీనగర్‌ (కశ్మీర్‌), పెషావర్, రావల్పిండి, జమ్మూ, సియాల్‌కోట్, కాంగ్రా మొదలైనవి ప్రధాన పట్టణాలు.

* 1809, ఏప్రిల్‌ 25న ఆంగ్లేయ ప్రతినిధి చార్లెస్‌ టి.మెట్‌కాఫ్‌తో ‘అమృత్‌సర్‌ సంధిని’ కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం మాల్వా తదితర ప్రాంతాలను బ్రిటిష్‌ వారికి అప్పగించాడు. రెండు వర్గాలకు సట్లెజ్‌ నదిని సరిహద్దుగా నిర్ణయించారు.

* వెంటూరా, అల్లార్డ్‌ అనే ఫ్రెంచ్‌ సైనికాధికారుల సహాయంతో రంజిత్‌ సింగ్‌ తన సైన్యానికి యూరోపియన్‌ తరహా శిక్షణ ఇప్పించాడు.

* కోర్డ్, గార్డెనర్‌ అనే యూరోపియన్ల పర్యవేక్షణలో ఆయుధగారాన్ని నెలకొల్పాడు.

* రంజిత్‌సింగ్‌ ఆర్థికమంత్రి - ధీనానాథ్, విదేశాంగమంత్రి - ఫకీర్‌ అజిజుద్దిన్‌ 

* ఇతడు సైనికులు, అధికారులు/ఉద్యోగులకు నెలవారీ జీతాలు చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీనికి మహాదారీ పద్ధతి అని పేరు.

* గురునానక్, గురుగోబింద్‌సింగ్‌ల చిత్రాలను తన నాణేలపై ముద్రించాడు.

* రంజిత్‌సింగ్‌ సైన్యాన్ని ‘ఫౌజ్‌-ఎ-ఖాస్‌’గా వ్యవహరించేవారు.

* ఇతడు తన అనుచరుడైన గుర్దిత్‌ సింగ్‌ను బడోవాల్‌ జిల్లాకు ప్రతినిధిగా నియమించడంతో పాటు లాడ్వాకు రాజును చేశాడు. ఇతడి కొడుకైన అజిత్‌ సింగ్‌ మొదటి సిక్కు-ఆంగ్లో యుద్ధంలో బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు.

* రంజిత్‌సింగ్‌ అమృత్‌సర్‌ ్బ1802్శ, లుథియానా ్బ1806్శ, గుజరాత్‌ ్బ1804్శ, ముల్తాన్‌ ్బ1818్శ, అట్టన్‌ ్బ1813్శ, పెషావర్‌ ్బ1834్శ, లద్ధాఖ్‌ ్బ1836్శలను ఆక్రమించాడు.

* రంజిత్‌ సింగ్‌ 1839, జూన్‌ 27న పక్షవాతం (పెరాలసిస్‌)తో బాధపడుతూ మరణించాడు. దీంతో వారసత్వం కోసం అతడి బంధువులు పోరాటాలు చేశారు. ఇది పంజాబ్‌ రాజ్య విచ్ఛిన్నానికి దారితీసింది.

* రంజిత్‌ సింగ్‌ తర్వాత అతడి పెద్ద కొడుకైన ఖరక్‌ సింగ్‌ రాజయ్యాడు. 

* ఖరక్‌ సింగ్‌ అనంతరం షేర్‌సింగ్, దులిప్‌ సింగ్‌లు రాజ్యపాలన చేశారు.

Posted Date : 22-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌