• facebook
  • whatsapp
  • telegram

బల్వంత్‌రాయ్ మెహతా, ఇతర కమిటీలు

బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ
* జాతీయాభివృద్ధి మండలి 1957, జనవరి, 16న బల్వంత్‌రాయ్ గోపాల్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 1952, అక్టోబరు 2న ప్రవేశపెట్టిన సమాజ అభివృద్ధి కారక్రమం (CDP - Community Development Programme), 1953, అక్టోబరు, 2న ప్రవేశపెట్టిన జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (NESS - National Extension Service Scheme) పథకాలు ఎంతవరకు విజయవంతమయ్యాయో సమీక్షిస్తుంది. అంతేకాకుండా గ్రామ పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి అవసరమయ్యే సంస్థాగత ఏర్పాటును సూచిస్తుంది.
* బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ - ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేస్తూ, తన నివేదికను 1957, నవంబరు 24న జాతీయాభివృద్ధి మండలికి సమర్పించింది.
* కమిటీ నివేదికను జాతీయాభివృద్ధి మండలి 1958, జనవరిలో ఆమోదించింది. ఈ నివేదికలోని అంశాల అమలు కోసం వివిధ రాష్ట్రాలు పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు ప్రయత్నించాయి.
* మనదేశంలో 1959, అక్టోబరు 2న మూడు అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం - రాజస్థాన్.
* రాజస్థాన్‌లోని, నాగోర్ జిల్లాలోని, సికార్ అనే ప్రాంతంలో ఈ విధానాన్ని జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభిస్తూ, కింది విధంగా పేర్కొన్నారు.
* ''నేడు ప్రారంభమవుతున్న స్థానిక స్వపరిపాలనా సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పనిచేస్తూ జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ, భవిష్యత్ నాయకత్వానికి పాఠశాలలుగా తోడ్పడతాయి".
* మూడు అంచెల విధానాన్ని ప్రారంభించిన రెండో రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్. 1959, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌లోని రంగారెడ్డి జల్లాలోని శంషాబాద్ వద్ద నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ ప్రారంభించారు.

ముఖ్యమైన సిఫార్సులు
* దేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ విధానం ఏర్పాటు చేయాలి.
     1) జిల్లా స్థాయిలో - జిల్లా పరిషత్
     2) బ్లాకు స్థాయిలో - పంచాయతీ సమితి
     3) గ్రామ స్థాయిలో - గ్రామ పంచాయతీ

* ప్రభుత్వ అభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేయాలంటే అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి.
* ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి పంచాయతీరాజ్ వ్యవస్థను నెలకొల్పాలి.
* గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహంచాలి.
* ఈ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన కాకుండా, స్వతంత్ర ప్రాతిపదికపై జరపాలి.
* స్థానిక సంస్థలకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమబద్ధంగా ఎన్నికలు జరపాలి.
* స్థానిక సంస్థలకు తగిన అధికారాలను, ఆర్థిక వనరులను సమకూర్చాలి.
* పంచాయతీ సమితికి కార్యనిర్వాహక అధికారాలను, జిల్లా పరిషత్‌కు సలహా పర్యవేక్షణ అధికారాలను కల్పించాలి.
* భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పథకాలన్నీ స్థానిక సంస్థల ద్వారానే నిర్వహించాలి.
* స్థానిక స్వపరిపాలనలో జిల్లా కలెక్టరు కీలకపాత్ర పోషించాలి.
* కింది స్థాయిలో మినహాయించి, మాధ్యమిక, ఉన్నత స్థాయుల్లో పరోక్ష ఎన్నికలు నిర్వహించాలి.

వికేంద్రీకరణ

అశోక్ మెహతా కమిటీ

     కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 1977లో అధికారం కోల్పోయింది. కొత్తగా మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా ప్రభుత్వం పాలనా అధికారాలు చేపట్టింది. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగా 1977, డిసెంబరులో 18 మంది సభ్యులతో అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 132 సిఫార్సులతో ఉన్న తన నివేదికను 1978, ఆగస్టులో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

 

ముఖ్యమైన సిఫార్సులు
* పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానానికి బదులుగా రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలి.
అవి: 1) కింది స్థాయిలో - మండల పరిషత్
    2) ఉన్నత స్థాయిలో - జిల్లా పరిషత్
పైన పేర్కొన్న రెండు అంచెల్లో అతి ప్రధానమైంది - మండల పరిషత్
* అర్హుడైన న్యాయాధికారి అధ్యక్షతన న్యాయ పంచాయతీ సంస్థను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి.
* పంచాయతీరాజ్ సంస్థల వ్యవహారాల పర్యవేక్షణ కోసం పంచాయతీరాజ్ మంత్రిని నియమించాలి.
* ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి.
* పంచాయతీరాజ్ సంస్థలోని అన్ని పదవులకు కాల వ్యవధిని 4 సంవత్సరాలుగా నిర్ణయించాలి.
* పంచయతీరాజ్ సంస్థలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పన్నులు విధించి స్వతంత్రంగా నిధులు సమకూర్చుకోవాలి.
* 15000 - 20,000 జనాభా ఉండే గ్రామాలను ఒక మండలంగా ఏర్పాటు చేయాలి.
* సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఖర్చు చేసే విధానంపై సామాజిక తనిఖీ జరగాలి.
* స్థానిక సంస్థలకు స్వతంత్ర ప్రాతిపదికపై కాకుండా పార్టీ ప్రాతిపదికపై ఎన్నికలు జరపాలి.
* పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయరాదు. ఒకవేళ రద్దు చేస్తే 6 నెలల్లోగా ఎన్నికలను నిర్వహించాలి.
* జిల్లా పరిషత్ అధ్యక్షుడు పరోక్షంగా ఎన్నిక కావాలి. పంచాయతీ సమితి/ మండల పరిషత్ అధ్యక్షుడిని ప్రత్యక్షంగా/పరోక్షంగా ఎన్నుకోవచ్చు.
* స్థానిక సంస్థలకు తగిన అధికారాలను బదిలీ చేయాలి.
* అశోక్ మెహతా కమిటీ సిఫార్సులను 1979లో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించి, కొన్ని మార్పులతో ఆమోదించారు.
* అశోక్ మెహతా కమిటీ సూచించిన మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం - కర్ణాటక
* 1985, అక్టోబరు 2న రామకృష్ణ హెగ్డే కర్ణాటకలో మండల పరిషత్‌ను ప్రవేశపెట్టారు.
* మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్. 1986, జనవరి 13న ఎన్.టి. రామారావు ఆంధ్రప్రదేశ్‌లో మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అయితే రెవెన్యూ మండలాలను మాత్రం 1985లోనే ఆయన ప్రవేశపెట్టారు.
* బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచనల ద్వారా ఏర్పాటైన పంచాయతీ వ్యవస్థలను మొదటితరం పంచాయతీలని పేర్కొంటారు.
* అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల ఆధారంగా ఏర్పాటైన పంచాయతీ వ్యవస్థలను రెండోతరం పంచాయతీలని పేర్కొంటారు.

దంత్‌వాలా కమిటీ (1978)

* బ్లాకు స్థాయీ ప్రణాళికీకరణపై అధ్యయనం చేయడానికి దంత్‌వాలా కమిటీని ఏర్పాటు చేశారు.

ముఖ్యమైన - సిఫార్సులు
* బ్లాకుస్థాయి (మధ్యస్థ వ్యవస్థ)కి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి.
* గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి.
* బ్లాకును ఒక యూనిట్‌గా తీసుకుని ప్రణాళికలు రూపొందించాలి.
* జిల్లా ప్రణాళికలో కలెక్టరు కీలక పాత్రను పోషించాలి.

సి.హెచ్. హనుమంతరావు కమిటీ (1984)

* జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయాలి.
* జిల్లా పరిషత్ అభివృద్ధిలో కలెక్టరు కీలకపాత్రను పోషించాలి.
* బ్లాకు అభివృద్ధి అధికారి పోస్ట్‌ను రద్దుచేయాలి.

జి.వి.కె. రావు కమిటీ

* గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలనా పరిపాలనా ఏర్పాట్లు అనే అంశాన్ని పరిశీలించడానికి జి.వి.కె. రావు అధ్యక్షతన ప్రణాళికా సంఘం 1985లో ఒక కమిటీని నియమించింది.
* భారత్‌లో పరిపాలనాస్ఫూర్తి క్రమంగా బలహీనపడి ఉద్యోగస్వామ్యంగా మారిందని, ఇది పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీన పరుస్తుందని, దీని ఫలితంగా ప్రజాస్వామ్యం వేర్లులేని వ్యవస్థగా మారిందని విమర్శించింది.

ముఖ్యమైన సిఫార్సులు
* జిల్లా పరిషత్‌లను పటిష్టపరచాలి.
* బ్లాకు వ్యవస్థను రద్దు చేయాలి.
* జిల్లా పరిషత్‌కు కలెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరించాలి.
* క్రమం తప్పకుండా పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలను నిర్వహించాలి.
* జిల్లాస్థాయీ యూనిట్‌లకు ప్రణాళికా విధులను బదలాయించాలి.
* జిల్లా అభివృద్ధి అధికారి పేరుతో ఒక పదవిని ఏర్పాటు చేసి, అతడికి జిల్లా పరిషత్‌కు సంబంధించిన అతిముఖ్య కార్యనిర్వాహక బాధ్యతలను అప్పగించాలి.
* కలెక్టర్‌కు పనిభారం ఎక్కువైతే CEO (Chief Executive Officer), DDO (District Development Officer)ను అదనంగా నియమించాలి.

ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ (1986)

* ప్రజాస్వామ్యం, ఆర్థికాభివృద్ధిలో పంచాయతీరాజ్ సంస్థల పాత్ర అనే అంశంపై అధ్యయనానికి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1986లో ఎల్.ఎం. సింఘ్వి కమిటీని నియమించింది

ముఖ్యమైన సిఫార్సులు
* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ బద్ధతను కల్పించాలి.
* స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించాలి.
* గ్రామీణ న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి.
* గ్రామీణ పాలనలో గ్రామసభల ప్రాధాన్యాన్ని పెంపొందించాలి.
* స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేయాలి.
* రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
* రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేయాలి.

రంజిత్‌సింగ్ సర్కారియా కమిషన్ - సిఫార్సులు (1988)

* పంచాయతీరాజ్‌కు సంబంధించిన అధికారాలను రాష్ట్రాలకు అప్పగించాలి.
* దేశమంతటికీ అవసరమయ్యే పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించాలి
* స్థానిక సంస్థలను ఆర్థికంగా, విధుల పరంగా పటిష్టపరచాలి.
* స్థానిక సంస్థలను రద్దుచేయడానకి సంబంధించి, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన చట్టాన్ని అమలు చేయాలి.

పి.కె. తుంగన్ కమిటీ (1988)

* 1988లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పి.కె. తుంగన్ నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
ముఖ్యమైన - సిఫార్సులు
* స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధతను కల్పించాలి.
* జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్ ప్రణాళికను అభివృద్ధి ఏజెన్సీగా పరిగణించాలి.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌