• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకింగ్‌ - 1

పొదుపు.. పెట్టుబడి.. ప్రగతి!

 

వ్యక్తులు, వ్యాపారాలు, వర్తక, వాణిజ్య వ్యవహారాలకు, సమాజ సంక్షేమానికి, ఆర్థిక ప్రగతికి అసమాన సేవలు అందించే రంగం బ్యాంకింగ్‌. పొదుపులు సేకరించి, పెట్టుబడులకు సహకరించి, అభివృద్ధిని ప్రోత్సహించి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో బ్యాంకింగ్‌ చరిత్రను, వివిధ రకాల బ్యాంకులు, ఇతర వివరాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. 

బ్యాంకు అనే పదానికి ఆధారం బ్యాంకో, బాంక్వీ. ఈ పదాలకు అర్థం బల్ల. Banca అనే ప్రాచీన ఇటాలియన్, Banc అనే జర్మన్‌ పదాల నుంచి Bank అనే ఆంగ్ల పదం ఆవిర్భవించింది. క్రీ.పూ.600లో బాబిలోన్‌ దేశంలో బ్యాంకులు, బ్యాంకు పత్రాలు ఉండేవని రెవిల్‌ పౌట్‌ అనే ఫ్రెంచి రచయిత పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ అంటే ద్రవ్యాన్ని మారకం చేయడం. క్రౌధర్‌ ప్రకారం బ్యాంకులకు పూర్వీకులు ముగ్గురు ఉన్నారు. 1) వర్తక వ్యాపారి 2) వడ్డీ వ్యాపారి 3) స్వర్ణకారుడు

బ్యాంకు నిర్వచనం: భారత బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం 1949, సెక్షన్‌-5 ప్రకారం కోరిన వెంటనే లేదా మరో సమయంలో చెక్కు, డ్రాఫ్టు, ఆర్డర్ల ద్వారా లేదా మరో విధంగా తిరిగి చెల్లించే షరతుల మీద డిపాజిట్లు స్వీకరించి, ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి, పెట్టుబడి కోసం ఉపయోగించే సంస్థ బ్యాంకు.


షెడ్యూల్డ్‌ బ్యాంకులు: రిజర్వు బ్యాంకు చట్టం (1934) రెండో షెడ్యూల్‌లో నమోదైన బ్యాంకులను షెడ్యూల్డ్‌ బ్యాంకులు అంటారు.

అర్హతలు: 

* బ్యాంకింగ్‌ వ్యాపారం చేస్తూ ఉండాలి. 

* వాటా మూలధనం నిధులు రూ.అయిదు లక్షల నికర విలువకు తక్కువ కాకుండా ఉండాలి. 

* జాయింట్‌ స్టాక్‌ కంపెనీగా రిజిస్టర్‌ కావాలి.

* డిపాజిటర్ల క్షేమానికి భంగం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొనకూడదు.


నాన్‌ షెడ్యూల్డ్‌ బ్యాంకులు: రిజర్వు బ్యాంకు చట్టం (1934) రెండో షెడ్యూల్‌లో నమోదు కాని బ్యాంకులను నాన్‌ షెడ్యూల్డ్‌ బ్యాంకులు అంటారు.

భారత దేశంలో బ్యాంకింగ్‌ చరిత్ర: 1770లో అలెగ్జాండర్‌ అండ్‌ కో అనే ఆంగ్ల ఏజెన్సీ హౌస్, బ్యాంక్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ను స్థాపించింది. ఇది భారత దేశంలో స్థాపించిన మొదటి బ్యాంకు. తర్వాత ఏజెన్సీలతో సంబంధం లేకుండా ప్రెసిడెన్సీ బ్యాంకులను నెలకొల్పారు. అవి- బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌ (1806), బ్యాంక్‌ ఆఫ్‌ బాంబే (1840), బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌ (1843). ఈ మూడు ప్రెసిడెన్సీ బ్యాంకుల వాటా మూలధనంలో అధిక భాగం ఐరోపా వాటాదారులది. పూర్తి భారతీయ యాజమాన్యంలో నెలకొల్పిన మొదటి బ్యాంకు ఔధ్‌ వాణిజ్య బ్యాంకు. దీన్ని 1881లో స్థాపించారు. ఆ తర్వాత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (1894), పీపుల్స్‌ బ్యాంకు (1901)లను ప్రారంభించారు. 1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను కలిపి భారతీయ ఇంపీరియల్‌ బ్యాంకుగా పేరు మార్చారు. ఆర్‌బీఐ ఏర్పడక ముందు ఇంపీరియల్‌ బ్యాంకు కేంద్ర బ్యాంకు విధుల్లో కొన్నింటిని నిర్వహించేది. 1955, జులై 1న గోర్వాలా కమిటీ సిఫార్సు మేరకు ఇంపీరియల్‌ బ్యాంకును స్టేట్‌ బ్యాంకుగా పేరు మార్చారు. 1959లో భారతీయ స్టేట్‌ బ్యాంకు చట్టం చేశారు. ఈ చట్టం కింద ఎనిమిది ప్రాంతీయ బ్యాంకులను జాతీయం చేసి భారతీయ స్టేట్‌ బ్యాంకుకు అనుబంధ బ్యాంకులుగా చేశారు.  అవి 1) బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ 2) బ్యాంక్‌ ఆఫ్‌ జైపుర్‌ 3) బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌ 4) బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ 5) బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా 6) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ 7) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర 8) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌. 1963లో బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్, బ్యాంక్‌ ఆఫ్‌ జైపుర్‌ విలీనమై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపుర్‌గా రూపొందింది. 2008లో ఎస్‌బీఐ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర, 2010లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌ (2010)లను విలీనం చేసుకుంది. ఆ తర్వాత 2017లో ఏప్రిల్‌లో మిగిలిన అయిదు అనుబంధ బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనమయ్యాయి. 

జాతీయం చేసిన బ్యాంకులు: 1967లో హజారీ కమిటీ ప్రకారం కుటీర పరిశ్రమలు, ప్రాథమిక రంగాలకు రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకులపై సామాజిక నియంత్రణను విధించారు. కానీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో 1969, జులై 19న రూ.50 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. 

అవి:

1. అలహాబాద్‌ బ్యాంకు  2. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా  3. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర   4. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా   5.సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 6. ఇండియన్‌ బ్యాంకు  7. ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు  8. దేనా బ్యాంకు  9. కెనరా బ్యాంకు  10. సిండికేట్‌ బ్యాంకు  11. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 12. యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా   13. యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంకు  14. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 

ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు, ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు 1980, ఏప్రిల్‌ 15న రూ.200 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న ఆరు వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. అవి 1) ఆంధ్రా బ్యాంకు2) కార్పోరేషన్‌ బ్యాంకు 3) పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు 4) న్యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 5) విజయ బ్యాంకు 6) ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌

న్యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాల్లో ఉండటంతో దాన్ని 1993లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో కలిపేశారు. 2019, ఏప్రిల్‌లో దేనా బ్యాంకు, విజయ బ్యాంకులు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనమయ్యాయి. 2020, ఏప్రిల్‌లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో విలీనం చేశారు. ఇదే సంవత్సరంలో సిండికేట్ బ్యాంకు- కెనరా బ్యాంకులో, అలహాబాద్‌ బ్యాంకు- ఇండియన్‌ బ్యాంకులో, ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్‌ బ్యాంకులు.. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కలిసిపోయాయి. ప్రస్తుతం జాతీయం చేసిన బ్యాంకులు 11. ఎస్‌బీఐతో కలిపి ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 12. 

భారతీయ మహిళా బ్యాంకు: 2013, నవంబరు 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మొదటి భారతీయ మహిళా బ్యాంకును దిల్లీ ప్రధాన కేంద్రంగా ప్రారంభించారు. దీని తొలి సీఎండీ ఉషా అనంత సుబ్రహ్మణ్యం. ఈ బ్యాంకు లక్ష్యం మహిళలకు సహాయం అందించి విత్త సమ్మిళితానికి దోహదపడటం. డిపాజిట్లను ప్రజలందరి నుంచి స్వీకరిస్తుంది. రుణాలు మాత్రం మహిళలకే అందిస్తుంది. 2017 ఏప్రిల్‌లో ఇది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనమైంది. ప్రపంచంలో మహిళలకు ప్రత్యేకంగా బ్యాంకులను ఏర్పాటు చేసిన మూడో దేశం ఇండియా. మొదటిది పాకిస్థాన్, రెండోది టాంజానియా. 

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు: బ్యాంకులను జాతీయం చేసినప్పటికీ గ్రామాల్లో రుణగ్రస్తత తగ్గలేదు. వడ్డీ వ్యాపారుల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. అందువల్ల ఎం.నరసింహన్‌ కమిటీ సిఫార్సు మేరకు 20 సూత్రాల పథకంలో భాగంగా 1975, అక్టోబరు 2న అయిదు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు. అవి- 1) మోరాబాద్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) 2) గోరఖ్‌పుర్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) 3) బివానీ (హరియాణా) 4) జైపుర్‌ (రాజస్థాన్‌) 5) మాల్టా (పశ్చిమ బెంగాల్‌).

తర్వాత ఈ బ్యాంకులను వాటికి స్పాన్సర్‌ చేసిన బ్యాంకుల్లో విలీనం చేశారు. 1987 నుంచి కొత్త ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్థాపించలేదు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం, కేంద్ర ప్రభుత్వం 50 శాతం, స్పాన్సర్‌ చేసిన బ్యాంకు 35 శాతం వాటాలను కలిగి ఉంటాయి. 

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్పాన్సర్‌ చేసే బ్యాంకులు

* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 

* ఇండియన్‌ బ్యాంకు 

* ఆంధ్రా బ్యాంకు

* యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంకు

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు     స్పాన్సర్‌ చేసిన బ్యాంకు

1. మోలాబాద్‌                              సిండికేట్‌ బ్యాంకు

2. గోరఖ్‌పుర్‌                                సిండికేట్‌ బ్యాంకు 

3. బీవానీ                                    పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు

4. జైపుర్‌                                   యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంకు

5. మాల్టా                                  యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంకు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు నాగార్జున జాతీయ గ్రామీణ బ్యాంకు. దీన్ని 1976లో, ఖమ్మంలో ఏర్పాటు చేశారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు లేని రాష్ట్రాలు సిక్కిం, గోవా. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ బ్యాంకులు           స్పాన్సర్‌ చేసిన బ్యాంకు

1. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణా వికాస్‌ బ్యాంకు - వరంగల్‌          స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

2. దక్కన్‌ గ్రామీణా బ్యాంకు - హైదరాబాద్‌                        స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌

3. ఆంధ్రప్రగతి గ్రామీణా బ్యాంకు - కడప                          సిండికేట్‌ బ్యాంకు

4. సప్తగిరి గ్రామీణా బ్యాంకు - చిత్తూరు                             ఇండియన్‌ బ్యాంకు

5. చైతన్య గోదావరి గ్రామీణా బ్యాంకు - గుంటూరు            ఆంధ్రా బ్యాంకు

ప్రాంతీయ గ్రామీణా బ్యాంకులు లేని రాష్ట్రాలు సిక్కిం, గోవా. 1997 నుంచి ప్రాధాన్య రంగానికి రుణాలు ఇవ్వడమనే భావన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కూడా వర్తింపజేశారు. అవి ఇచ్చే రుణాల్లో 75% ప్రాధాన్య రంగాలకు ఇవ్వాలని చక్రవర్తి కమిటీ సూచించింది.


ముద్రా బ్యాంకు: మైక్రో యూనిట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీ-ఫైనాన్స్‌ ఏజెన్సీ ్బలీగీదీళిత్శి అనేది ఒక ప్రభుత్వ రంగ విత్త సంస్థ. ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం కింద దీన్ని నెలకొల్పారు. భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు అనుబంధ సంస్థగా దీన్ని 2015, ఏప్రిల్‌ 8న ప్రారంభించారు. తక్కువ వడ్డీ రేట్లకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణ సౌకర్యం కల్పిస్తుంది. సూక్ష్మ విత్త సంస్థలకు, బ్యాంకేతర విత్త సంస్థలకు కూడా రుణ సహాయం అందిస్తుంది. ఈ సంస్థకు లక్ష కోట్ల రూపాయల పరపతి హామీ నిధిని కేటాయించారు. చిన్న తయారీ సంస్థలు, దుకాణదారులు, పండ్లు కూరగాయలు అమ్మేవారు, చేతి వృత్తులవారికి ఈ సంస్థ రుణాలను అందిస్తుంది. రుణగ్రహీతలకు ముద్రా కార్డు పేరుతో ఒక రూపే డెబిట్‌ కార్డు ఇస్తారు.


పేమెంట్‌ బ్యాంకులు:  ఇవి కొత్త తరహా బ్యాంకులు. 2014, జనవరిలో నచికేత్‌ మోర్‌ కమిటీ ఈ బ్యాంకుల స్థాపనను సిఫార్సు చేసింది. 2014, నవంబరు 27న రిజర్వు బ్యాంకు పేమెంట్‌ బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను విడుదల చేసింది. 2015, ఆగస్టు 19న ఆర్‌బీఐ 11 పేమెంటు బ్యాంకుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆరు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ బ్యాంకులు వ్యక్తి నుంచి లక్ష రూపాయల వరకు డిమాండ్‌ డిపాజిట్లు స్వీకరించవచ్చు. చెల్లింపు సేవలు అందించవచ్చు. మొబైల్‌ ద్వారా చెల్లింపు బదిలీలు చేయవచ్చు. అల్ప ఆదాయ వర్గాల వారు, చిన్న వ్యాపారస్థులు, వలస కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి విత్తసేవలు అందుబాటులో ఉంచడమే వీటి లక్ష్యం. ఈ బ్యాంకులు రుణాలు అందించడానికి, క్రెడిట్‌ కార్డులు జారీ చేయడానికి వీలు లేదు. డెబిట్‌ కార్డులు జారీ చేయవచ్చు.


చిన్న విత్త బ్యాంకులు: బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో లేని జనాభా సౌకర్యార్థం ఏర్పాటు చేసినవి చిన్న విత్త బ్యాంకులు. వీటి లక్ష్యం సమ్మిళిత విత్తసేవ. రూ.100 కోట్ల కనీస ఈక్విటీ మూలధనంతో వీటిని స్థాపించవచ్చు. 2014, నవంబరు 27న రిజర్వు బ్యాంకు ఈ తరహా బ్యాంకుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2015, సెప్టెంబరు 17న బ్యాంకేతర విత్త సంస్థలకు లైసెన్సు జారీ చేసింది. ఈ బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తాయి. సన్నకారు, ఉపాంత రైతులకు, చిన్న వ్యాపార సంస్థలకు అసంఘటిత రంగాల్లోని వారికి రుణాలు అందిస్తాయి. 


బంధన్‌ బ్యాంకు: ఆర్థిక మంత్రి అరుణ్‌ జైెట్లీ 2015లో కోల్‌కతాలో ఈ బ్యాంకును ప్రారంభించారు. ఇది దేశంలో మైక్రో ఫైనాన్స్‌ కంపెనీగా ఉండి పూర్తిస్థాయి వాణిజ్య బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి బ్యాంకు. స్వాతంత్య్రం తర్వాత తూర్పు భారతదేశంలో ప్రారంభించిన మొదటి బ్యాంకు. ఇది ప్రైవేటు సంస్థ.


ఐడీఎఫ్‌సీ బ్యాంకు: 2015, అక్టోబరు 19న ప్రధాని న్యూదిల్లీలో ప్రారంభించారు. దీని ప్రధాన కేంద్రం ముంబయి. మొదట ఇది అవస్థాపన సదుపాయాల  కల్పనకు విత్త సంస్థగా ఉండేది. దీన్ని వాణిజ్య బ్యాంకుగా మార్చారు.. ఇది ఒక ప్రైవేటు సంస్థ.


ప్రైవేటు బ్యాంకులు: ప్రస్తుతం భారతదేశంలో 22 ప్రైవేటు బ్యాంకులున్నాయి. 


విదేశీ బ్యాంకులు: 2022 నాటికి 46 విదేశీ బ్యాంకులున్నాయి. వీటిలో స్టాండర్డ్‌ చార్టర్‌ బ్యాంకు, సిటీ బ్యాంకు, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులకు ఎక్కువగా శాఖలున్నాయి. విదేశీ బ్యాంకును ఏర్పాటు చేయాలంటే 2013 ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రూ.500 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేయాలి.


స్టేట్‌బ్యాంకు ఇన్‌క్యూబ్‌: భారత దేశంలో ప్రత్యేకంగా అంకుర సంస్థల (స్టార్టప్‌) కోసం ఏర్పడిన వాణిజ్య బ్యాంకు శాఖ. దీన్ని బెంగళూరులో 2016, జనవరి 14న భారతీయ స్టేట్‌ బ్యాంకు ప్రారంభించింది. 

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 06-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌