• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ - వాణిజ్య బ్యాంకులు

స్టేట్‌ బ్యాంక్‌ ఇన్‌క్యూబ్‌

దీన్ని 2016, జనవరి 14న ప్రవేశపెట్టారు. దేశంలో ప్రత్యేక అంకుర స్థంస్థల కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఇన్‌క్యూబ్‌ను ఏర్పాటు చేశారు.


ప్రభుత్వ పథకాలు 

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (PMJDY)

* పీఎంజేడీవైను 2014, ఆగస్టు 28న ప్రవేశపెట్టారు. ఈ పథకం లక్ష్యం ‘ఆర్థిక సమ్మిళిత్వం’(Financial Inclusion) సాధించడం. అంటే బ్యాంకింగ్‌ సేవలు అందరికీ అందించడం. 

* దీని నినాదం ‘మేరా ఖాతా, భాగ్యవిధాతా’. 

* దేశంలోని అన్ని కుటుంబాలకు బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించడం ద్వారా విత్తసేవలు పొందే వీలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. 

* ఈ పథకాన్ని ప్రారంభించిన రోజు దేశవ్యాప్తంగా 1.5 కోట్ల పొదుపు ఖాతాలు తెరిచారు.

* 2018, జూన్‌ నాటికి పీఎంజేడీవై ఖాతాదార్ల సంఖ్య 3.18 కోట్లకి చేరింది.

202324 కేంద్ర బడ్జెట్‌ నివేదిక ప్రకారం, ప్రస్తుతం పీఎంజేడీవై కింద 47.8 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. 

* ఈ పథకంలో జీరో బ్యాలెన్స్‌తో ఖాతా తెరుస్తారు. ఖాతాదారుడికి రూపే డెబిట్‌ కార్డు ఇస్తారు.

ఇతర ప్రయోజనాలు:

* రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం.

* రూ.10,000 ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం.

* రూ.30 వేల జీవిత బీమా.

ఇంద్రధనుష్‌ పథకం 

* దీన్ని 2015, ఆగస్టులో ప్రవేశపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును మెరుగుపర్చడం.

నిరర్థక ఆస్తులు (NPAs)

*  వీటినే మొండి బకాయిలు/ పారు బాకీలు/ పాత బకాయిలు అంటారు. ఖాతాదార్లు బ్యాంకుకు చెల్లించే రుణాలను బ్యాంకు ఆస్తులుగా పరిగణిస్తారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీని వరుసగా ఆరు నెలలు (ఇంతకుముందు మూడు నెలలు) చెల్లించకపోతే ఆ రుణాలను నిరర్థక ఆస్తులుగా పరిగణిస్తారు.


రీకేపిటలైజేషన్‌ 

* ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, వాణిజ్య బ్యాంకులు 9 శాతం మూలధన ఆస్తుల నిష్పత్తిని కలిగి ఉండాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం కొంత మూలధనాన్ని సమకూర్చడాన్ని ‘రీకేపిటలైజేషన్‌’ అంటారు. 

* ప్రభుత్వం విడుదల చేసిన మొత్తంలో ఎంత శాతం మూలధనంగా ఉండాలనేది ఆర్‌బీఐ నిర్ణయిస్తుంది.


బ్యూరో ఆఫ్‌ ఇంటర్నేషనల్‌  సెటిల్‌మెంట్‌

దీన్ని 1930, మే 17న నెలకొల్పారు. ఇందులో భారత్‌ సహా 60 సభ్యదేశాలు ఉన్నాయి.

దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని బేసెల్‌ నగరంలో ఉంది. 

* వివిధ దేశాల్లో బ్యాంకింగ్‌ నిబంధనలు ఒక ఉమ్మడి ప్రమాణం ప్రకారం ఉండేలా చూడటం; ఆర్థిక స్థిరీకరణలో కేంద్ర బ్యాంకులకు సహకారం అందించడం దీని లక్ష్యాలు.


ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ బిల్లు 2017

*  ఈ బిల్లును 2017లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. వివిధ కారణాల వల్ల ఆర్థిక ఒత్తిడికి గురైన బ్యాంకులకు రీకేపిటలైజేషన్‌ ద్వారా ఆర్థిక సాయం చేయడం దీని ఉద్దేశం.

* ఈ పద్ధతిలో బ్యాంకులకు బయట నుంచి సహాయం లభిస్తుంది. దీన్నే ‘బెయిల్‌ ఔట్‌’ విధానం అంటారు. 

*  బ్యాంకులోని అంతర్గత వనరులను ఉపయోగించి, నష్టాలు భరించడాన్ని ‘బెయిల్‌ ఇన్‌’ పద్ధతి అంటారు.

*  ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లు కూడా ఉపయోగించుకోవడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఈ నిబంధనపై బ్యాంకు ఖాతాదార్లు, వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ బిల్లు అమలును వాయిదా వేశారు.


డిజిటల్‌ బ్యాంకులు (ఈ-బ్యాంక్స్‌)

* దేశంలో ప్రతి పౌరుడికి డిజిటల్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్‌ సేవలు అందిస్తారు. 

* డిజిటల్‌ చెల్లింపులు, నెట్‌ బ్యాంకింగ్, ఏటీఎం సేవల కోసం దేశంలో 75 జిల్లాల్లో 75 ఈ-బ్యాంకులు (డిజిటల్‌ బ్యాంకులు) ఏర్పాటు చేస్తున్నట్లు 2022 - 23 బడ్జెట్‌లో కేంద్రం తెలిపింది.


పారా బ్యాంకింగ్‌

ఇది ఒక రకమైన విత్తం. ఇందులో క్రెడిట్, బీమా వ్యాపారం; Factoring సేవలు ఉంటాయి.


బ్యాంక్‌ లాకర్‌

ఇది ఒక ఖాతా లాంటిది. విలువైన వస్తువులు, ఆభరణాలు, డాక్యుమెంట్లను ఇందులో భద్రపరచుకోవచ్చు. ప్రతి లాకర్‌కు రెండు కీలు (తాళం చెవులు) ఉంటాయి. ఒకటి బ్యాంక్‌ వద్ద, రెండోది లాకర్‌ యజమాని దగ్గర ఉంటాయి.

లాకర్‌ను తెరవాలంటే తప్పనిసరిగా రెండు కీలు ఉపయోగించాలి. అందుకే వీటిని సేఫ్‌ డిపాజిట్‌ లాకర్లు అని పిలుస్తారు.


ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్స్‌ కోడ్‌ (IBC)

* దీన్ని దివాలా పరిష్కార స్మృతి అంటారు.

దీన్ని 2016లో ప్రవేశపెట్టారు. అప్పులు తీసుకుని తిరిగి చెల్లించని వ్యాపార సంస్థల నుంచి కొంత మొత్తాన్నైనా వసూలు చేయడం; రుణాలు ఎగ్గొట్టిన సంస్థలను వేలంపాట నిర్వహించి మొండి బాకీల భారాన్ని తగ్గించుకోవడం దీని లక్ష్యం.


బ్యాడ్‌ బ్యాంక్‌/ మొండి బాకీల బ్యాంక్‌

* దేశంలో వ్యాపార సంస్థల వద్ద పేరుకుపోయిన మొండి బకాయిలను లెక్కించి, వాటికి పరిష్కారం చూపే ఆర్థిక సంస్థ బ్యాడ్‌ బ్యాంక్‌. 

* ఈ బ్యాడ్‌ బ్యాంక్‌ కంపెనీల మొండి బకాయిలను నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (NARCL) ద్వారా స్వాధీనం చేసుకుంటుంది. వాటిని మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తుంది. 

* కంపెనీలు కొద్దిపాటి నష్టానికి అవి తనఖా పెట్టిన అస్తులను బ్యాడ్‌ బ్యాంకుకు అప్పగిస్తే, వాటిని అధిక ధరకు అమ్మడం ద్వారా అప్పు ఇచ్చిన బ్యాంకు, సంబంధిత కంపెనీ యాజమాన్యం లబ్ధిపొందేలా చేయాలనేది బ్యాడ్‌ బ్యాంక్‌ లక్ష్యం.


2022-23లో ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు

* 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వరంగ బ్యాంకుల (Public Sector Banks-PSB) నికర లాభాలన్నీ కలిపి రూ. లక్ష కోట్లను అధిగమించాయి. 

* ఇందులో దాదాపు సగం వాటా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాదే. 201718లో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కలిపి రూ.85,390 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేశాయి. 2022-23లో ఇవి రూ.1,04,649 కోట్ల నికర లాభాన్ని ప్రకటించాయి. 2021-22లో నమోదైన రూ.66,539.98 కోట్ల లాభం కంటే ఇది 57 శాతం అధికం.

* 2022-23 మార్చి త్రైమాసికంలో పీఎస్‌బీల లాభాలు రూ.34,483 కోట్లుగా నమోదయ్యాయి. 2021-22 వీటి లాభాలు రూ.17,666 కోట్లుగా ఉన్నాయి.



డిజిటల్‌ రూపీ (ఈ-రూపీ)

2022-23 కేంద్ర బడ్జెట్‌లో ఆర్‌బీఐ డిజిటల్‌ రూపీని ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

* భౌతికంగా పేపర్‌ రూపంలో జారీచేసే కరెన్సీ తరహాలోనే దీనికి కూడా ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని అధికారికంగా పేపర్‌ కరెన్సీ రూపంలోకి మార్చుకోవచ్చు. 

* దీన్ని బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీతో రూపొందించారు. దీనివల్ల లావాదేవీల విషయంలో పారదర్శకత ఉంటుంది.

* రిజర్వ్‌బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌లో కూడా దీనికి చోటు కల్పిస్తారు. చట్టబద్ధత ఉంటుంది. దీన్ని సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీగా వ్యవహరిస్తారు.

ఈ-రూపీ విధానం/ డిజిటల్‌ చెల్లింపుల్లో ఓచర్‌ విధానం: ఈ-రూపీ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2021, ఆగస్టు 2న ప్రారంభించారు. దీన్ని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసింది.

* డిజిటల్‌ చెల్లింపులు మరింత సులభంగా, పారదర్శకంగా ఉండేందుకు దీన్ని రూపొందించారు. ప్రభుత్వం లక్షిత ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారులకే అందించాలనే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు.


* ఈ విధానం గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం లాంటిది కాదు. ఇందులో ప్రభుత్వం లేదా సంస్థలు క్యూఆర్‌ కోడ్‌ లేదా ఓచర్‌ నంబర్లను లబ్ధిదారుడి మొబైల్‌ ఫోన్‌కి పంపుతాయి. ఇవి ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ ఓచర్ల లాంటివి. బ్యాంకు ఖాతా, డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ లేకపోయినా వీటిని ఉపయోగించుకోవచ్చు. సేవలు పొందాక సంబంధిత వ్యక్తి/ సంస్థకు క్యూఆర్‌ కోడ్‌ లేదా ఓచర్‌ను చూపించాలి.

* ప్రస్తుతం ఆరోగ్య సేవల కోసం ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో ఇతర విభాగాలకు కూడా విస్తరింపజేస్తారు.

* దేశంలో డిజిటల్‌ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల అమల్లో ఈ-రూపీ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్రం భావిస్తోంది. 

*దీనివల్ల నగదు అవకతవకలకు అవకాశం ఉండదు. ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. 

* ప్రస్తుతం దేశంలో 11 బ్యాంకులు ఈ-రూపీ సేవలను అందిస్తున్నాయి.


వివిధ కమిటీలు

బ్యాంకుల పనితీరుపై నాయక్‌ కమిటీ: బ్యాంకుల పనితీరును సమీక్షించేందుకు 2014, జనవరిలో పీజే నాయక్‌ అధ్యక్షతన ఆర్‌బీఐ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 50 శాతం కంటే తక్కువ ఉండాలని సిఫార్సు చేసింది.


నరసింహం కమిటీ:

విత్తరంగ సంస్కరణలు: దేశంలోని విత్త వ్యవస్థ నిర్మాణాన్ని, పనితీరును పరిశీలించేందుకు; వాటిని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన సంస్కరలను సూచించాలని ఆర్‌బీఐ 1991, ఆగస్టులో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఎం. నరసింహం అధ్యక్షత వహించారు.

బ్యాంకింగ్‌ రంగం: బ్యాంకింగ్‌ రంగంలో తీసుకోవాల్సిన సంస్కరణలను సూచించాలని 1998లో భారత ప్రభుత్వం ఎం. నరసింహం అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది.

Posted Date : 14-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌