• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ - సహకార బ్యాంకులు

మన దేశంలో సహకార పరపతి వ్యవస్థను మూడంచెల స్థాయిలో ఏర్పాటు చేశారు. అవి:

1. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (PACCS)

2. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (DCCBs)

3. రాష్ట్ర సహకార బ్యాంకులు (SCBs)


ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు

* ఇవి గ్రామ స్థాయిలో ఉంటాయి. ఒకే గ్రామానికి చెందిన 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది రైతులు కలిసి ఒక సంఘంగా మారి, వీటిని ఏర్పాటు చేసుకుంటారు.

*  ఇవి రైతులకు ప్రత్యక్షంగా స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలు ఇస్తాయి.


వనరుల సమీకరణ:

*  ప్రవేశ రుసుం

* షేర్లద్వారా వచ్చే మూలధనం

 ప్రజల వద్ద నుంచి వచ్చే డిపాజిట్లు

* రుణాలు

*  జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నుంచి వచ్చే నిధులు


జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు

*  సాధారణంగా జిల్లాకు ఒక కేంద్ర సహకార బ్యాంకు ఉంటుంది. అందుకే దీన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అంటారు. 

*  ఇవి రాష్ట్ర సహకార బ్యాంకుకు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు మధ్యవర్తిగా పనిచేస్తాయి. 

*  ఇది జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల సమాఖ్య.


వనరుల సమీకరణ: 

*  వాటా మూలధనం    *  డిపాజిట్లు 

*  రుణాలు    * ప్రవేశ రుసుం

*  రాష్ట్ర సహకార బ్యాంకు నుంచి వచ్చే నిధులు


రాష్ట్ర సహకార బ్యాంకులు

రాష్ట్ర సహకార వ్యవస్థకు రాష్ట్ర సహకార బ్యాంకు శిఖరం లాంటిది. 

* ఇది గ్రామీణ పరపతి వ్యవస్థకు నాబార్డుకు మధ్య అనుసంధానంగా ఉంటుంది. 

* ఇది వ్యక్తులకు రుణాలు ఇవ్వదు. బ్యాంకుల ద్వారా శితిదిదిళీ లకు రుణ సౌకర్యం కల్పిస్తుంది.


వనరుల సేకరణ:

నాబార్డు నుంచి 50%  90% వరకు రుణాలు పొందుతుంది.

* వాటా మూలధనం

రిజర్వ్‌ నిధులు

* సభ్యులు, సభ్యులు కానివారి నుంచి సేకరించిన డిపాజిట్లు.

* ఆర్‌బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాలు.


భూమి అభివృద్ధి బ్యాంకులు

ఈ బ్యాంక్‌ను మొదటిసారి 1920లో పంజాబ్‌లో ఏర్పాటు చేశారు. 1925లో మద్రాస్, 1929లో బొంబాయిలో ప్రారంభించారు. 

* ఇవి రైతులకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తాయి. వీటినే భూమి తనఖా బ్యాంకులు అంటారు.

* ప్రస్తుతం వీటిని సహకార వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకులు (Cooperative Agricultural and Rural Development Banks n- CARDB) అని పిలుస్తున్నారు.

పారిశ్రామిక అభివృద్ధి విత్త బ్యాంకులు

*  దేశంలోని పరిశ్రమల విత్త అవసరాలు తీర్చడం కోసం ప్రత్యేకంగా కొన్ని విత్త సంస్థలు పనిచేస్తాయి. ఇవి పరిశ్రమలకు మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడంతోపాటు, పూచీదారుగా వ్యవహరిస్తాయి. 

*  ఇవి పారిశ్రామిక సంస్థల వాటాలు, బాండ్లు, రుణ పత్రాలు మొదలైన విత్త సాధనాలకు పూచీదారుగా ఉంటాయి. 

*  యాజమాన్య సంబంధమైన సలహాలు ఇవ్వడం, సాంకేతిక శిక్షణ నిర్వహించడం లాంటివి చేస్తాయి.


ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా  IFCI

ఐఎఫ్‌సీఐను 1948, జులైలో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. 

* 1993, జులై 1 నుంచి ఇది ప్రభుత్వ లిమిటెడ్‌ కంపెనీగా మారింది. 

ఇది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి విత్త సంస్థ. పారిశ్రామిక సంస్థలకు విత్త సహాయం అందిస్తుంది.


ఇండస్ట్రియల్‌ క్రెడిట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా  ICICI

* ఐసీఐసీఐని 1955, జనవరిలో స్థాపించారు. ఇది అఖిల భారత స్థాయిలో నెలకొల్పిన రెండో విత్త సంస్థ. 

* ప్రైవేట్‌ రంగంలో చిన్న-మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు మిషన్‌ దీన్ని ఏర్పాటు చేసింది.

* దీని ప్రధాన కార్యాలయం ముంబయి. భారతదేశంలోని బ్యాంకులు, బీమా సంస్థలు; అమెరికాకు చెందిన సంస్థలు, వ్యక్తులు; ఇంగ్లండ్‌కు చెందిన వినిమయ బ్యాంకులు మన దేశంలోని సాధారణ ప్రజలు ఈ సంస్థ మూలధనానికి చందాదారులు.


స్మాల్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  SIDBI

*  దీన్ని ప్రత్యేక చట్టం ద్వారా 1990, ఏప్రిల్‌ 2న ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం లఖ్‌నవూ (ఉత్తర్‌ ప్రదేశ్‌). ఇది ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ)కి అనుబంధ బ్యాంక్‌. జాతీయ స్థాయిలో చిన్న పరిశ్రమల అభివృద్ధికి నిధులు సమీకరించడం ద్వారా వాటిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. 

* చిన్న పరిశ్రమలకు విత్త సహాయం అందించే సంస్థలకు నిధులు సమకూర్చడం, వాటి కార్యకలాపాలను సమీక్షించడం; గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం, ఉపాధిని పెంచడం, వాటి ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయ అవకాశాలు విస్తరించడం లాంటి విధులను ఇది నిర్వహిస్తుంది.


ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా IIBI

* భారత కంపెనీల చట్టం కింద 1971, ఏప్రిల్‌లో భారత పారిశ్రామిక పునర్నిర్మాణ సంస్థను (Industrial Reconstruction Corporation of India - IRCI) ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఖాయిలా పడిన (అప్పుల్లో ఉన్న) పరిశ్రమలకు, మూసివేసిన పరిశ్రమలకు విత్తసహాయం అందించడం దీని లక్ష్యాలు. 

* 1985, మార్చి నుంచి దీని పేరును భారత పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంక్‌ (Industrial Reconstruction Bank of India - IRBI) గా మార్చారు. 

* 1997లో ఐఆర్‌బీఐను IIBI గా మార్చారు. దీని ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది. న్యూదిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, గౌహతిలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థ.


ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs)

* ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం 1975, సెప్టెంబరు 26 న ఉత్తర్వులు జారీ చేసింది.

* ఆర్‌ఆర్‌బీలను ఎం.నరసింహం అధ్యక్షతన 1975, అక్టోబరు 2న ఏర్పాటు చేశారు.

* గ్రామీణ బ్యాంకును ప్రారంభించే వాణిజ్య బ్యాంకును స్పాన్సర్డ్‌ బ్యాంక్‌ అంటారు.

ప్రతి గ్రామీణ బ్యాంకుకు రూ. కోటి అధీకృత మూలధనం ఉండాలి. 

* ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద 50%, రాష్ట్ర ప్రభుత్వం 15%, స్పాన్సర్డ్‌ బ్యాంకులు 35% నిధులను సమకూరుస్తాయి.

* వీటిని మొదటిసారి దేశంలోని అయిదు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అవి:

1. గోరఖ్‌పూర్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌)

2. మొరాదాబాద్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌)

3. బివాని (హరియాణా)

4. జైపూర్‌ (రాజస్థాన్‌)

5. మాల్డా (పశ్చిమ్‌ బంగా)

* ప్రస్తుతం దేశవ్యాప్తంగా 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో..

1. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌

స్థాపన: 2006, జూన్‌ 1

ప్రధాన కార్యాలయం: వైఎస్సార్‌ కడప

ప్రస్తుత ఛైర్మన్‌: రాకేష్‌ కశ్యప్‌

స్పాన్సర్డ్‌ బ్యాంక్‌: కెనరా బ్యాంక్‌


2. సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ 

స్థాపన: 2006, జూన్‌ 29

ప్రధాన కార్యాలయం: చిత్తూరు

ప్రస్తుత ఛైర్మన్‌: ఎ.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌

స్పాన్సర్డ్‌ బ్యాంక్‌: ఇండియన్‌ బ్యాంక్‌


3. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌ 

స్థాపన: 2006, మార్చి 1

ప్రధాన కార్యాలయం: గుంటూరు 

ఛైర్మన్‌: టి.కామేశ్వరరావు

స్పాన్సర్డ్‌ బ్యాంక్‌: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

4. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ 

స్థాపన: 2006, మార్చి 31. ప్రధాన కార్యాలయం: వరంగల్‌

ప్రస్తుత ఛైర్మన్‌: కె.ప్రవీణ్‌కుమార్‌

స్పాన్సర్డ్‌ బ్యాంక్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)

* ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సేవలు అందిస్తుంది. ఏపీలో అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు బ్యాంకింగ్‌ సేవలు అందిస్తోంది. 


తెలంగాణలో.. 

తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌

స్థాపన: ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006, మార్చి 24న ‘దక్కన్‌ గ్రామీణ బ్యాంక్‌’ పేరుతో ఏర్పాటైంది. రాష్ట్రం విడిపోయాక 2014, అక్టోబరు 20న దీని పేరును ‘తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌’ అని మార్చారు. 

ప్రధాన కార్యాలయం: హైదరాబాద్‌

ఛైర్మన్‌: వి.శోభ

స్పాన్సర్డ్‌ బ్యాంక్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)


* తెలంగాణలో 20 జిల్లాలకు ఇది తన సేవలు అందిస్తుంది. అవి: భద్రాద్రి కొత్తగూడెం, భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, గద్వాల్‌ జోగులాంబ, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్‌ (గ్రామీణ), వరంగల్‌ (అర్బన్‌), యాదాద్రి భువనగిరి.

Posted Date : 11-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌