• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ శీతోష్ణస్థితి 

రోళ్లు పగిలే ఎండలు.. మంచు కురిసే కొండలు

వడదెబ్బ కొట్టేంత ఎండలు, భరించలేని ఉక్కపోత, విరుచుకుపడే తుపాన్లు, ఆకస్మిక వర్షాలతో వరదలు, మంచు కురిసే కొండలు, గజగజ వణికించే చలి, ఇదే ఆంధ్రప్రదేశ్‌ శీతోష్ణస్థితి. విభిన్న వాతావరణ పరిస్థితులకు నెలవైన ఈ రాష్ట్రం సుదీర్ఘ సముద్ర తీరం, విశాల మైదానం, పీఠభూమి, కొండల వంటి నైసర్గిక స్వరూపాలతో విలక్షణంగా విస్తరించి ఉంది. ఏటా కాలానుగుణంగా అసమాన తీరులో, అనిశ్చిత రీతిలో మారుతూ ఉండే ఏపీ శీతోష్ణస్థితితోపాటు వివిధ ప్రాంతాల విశేషాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

ఆంధ్రప్రదేశ్‌ భూమధ్య రేఖకు - కర్కట రేఖకు మధ్యలో విస్తరించి, ఉష్ణమండల ప్రాంతంలో ఉంది. ఆయన రేఖకు దిగువన ఉన్న ఈ రాష్ట్రంలో ఏటా రుతుపవనాల ప్రభావం ఉంటుంది. అందుకే ఏపీ శీతోష్ణస్థితిని ‘ఆయన రేఖా రుతుపవన శీతోష్ణస్థితి’గా పేర్కొంటారు. కానీ, రాష్ట్రంలో శీతోష్ణస్థితి పరంగా ఎంతో వైవిధ్యం ఉంది. పల్నాడు జిల్లాలోని రెంటచింతల ప్రాంతంలో వేసవిలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగిలో శీతాకాలంలో అత్యల్పంగా -2 డిగ్రీలు నమోదు కావడంతో పాటు, మంచు కురిసే పరిస్థితులున్నాయి.

* రాష్ట్రంలో వర్షపాతంలోనూ అనేక వ్యత్యాసాలున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు బేసిన్‌ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుండగా, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు అత్యల్ప వర్షపాతంతో ఎడారి శీతోష్ణస్థితిని తలపిస్తుంటాయి.

* ఇటీవల కాలంలో మార్చిలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, నవంబరు, డిసెంబరుల్లో తీవ్ర తుపాన్లతో ప్రధానంగా వ్యవసాయ రంగంతోపాటు అధిక సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

వాతావరణం: భూమి చుట్టూ విస్తరించిన వాయువుల పొరను వాతావరణం అంటారు. ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవన వేగం, గాలిలో తేమ, మేఘాల స్థితి, అవపాతం మొదలైనవాటిని వాతావరణ అంశాలు అంటారు.

వాతావరణ స్థితి (వెదర్‌), శీతోష్ణస్థితి (క్లైమేట్‌): ఒక ప్రాంతంలో నిర్దిష్ట కాలానికి (10 రోజుల వరకు) ఉష్ణోగ్రత, పీడనం, పవన వేగం, ఆర్ద్రత, అవపాతం వంటి అంశాల స్థితిని వాతావరణ స్థితి అంటారు. ఈ పరిస్థితులు తక్కువ కాలంలో తరచూ మారుతుంటాయి.

* ఒక విశాలమైన ప్రాంతానికి వాతావరణ పరిస్థితులను దీర్ఘకాలిక సగటుగా (30 సంవత్సరాలు) లెక్కించి సూచించడాన్ని శీతోష్ణస్థితి అంటారు. దశాబ్దాల వివరాలను సేకరించి వాటి సగటు లెక్కకట్టడం ద్వారా శీతోష్ణస్థితులను తెలియజేస్తారు. ఈ వివరాలతో ఏ కాలంలో వాతావరణం ఎలా ఉంటుందో అర్థమవుతుంది.

క్లైమోగ్రాఫ్‌లు: ఒక ప్రదేశం నెలవారీ సగటు అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రత, వర్షపాత వివరాలను క్లైమోగ్రాఫ్‌లు సూచిస్తాయి.

ఏపీ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలు: 1) అక్షాంశం 2) సముద్రం నుంచి దూరం 3) ఎత్తు 4) గనుల తవ్వకం 5) సముద్ర ప్రవాహాలు.

1) అక్షాంశం: ఆంధ్రప్రదేశ్‌ అక్షాంశ పరంగా 12 C0 37 Cనుంచి 19C0 7 C0 మధ్య విస్తరించి ఉష్ణమండలంలో ఉంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటానికి ఇదీ ఒక కారణమే.

2) సముద్రం నుంచి దూరం: సముద్ర సమీప ప్రాంతాల్లో సమ శీతోష్ణస్థితి ఉంటుంది. అంటే పగలు - రాత్రి, వేసవి - శీతాకాల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం తక్కువగా ఉంటుంది. ఉదా: కోస్తా ప్రాంతం * సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాలను ఖండాంతర్గత ప్రాంతాలు అంటారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వ్యత్యాసాలు అధికంగా ఉంటాయి. ఉదా: రాయలసీమ

3) ఎత్తు: ఏపీ ఉపరితలం ఒకే ఎత్తులో లేదు. మైదానం, పీఠభూమి, కొండలు, పర్వతాలు వంటి వివిధ స్వరూపాలున్నాయి. ఎత్తు పెరిగేకొద్దీ ప్రతి వెయ్యి మీటర్లకు 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత తగ్గుతుంది. రాష్ట్రంలో ఎత్తయిన ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఉదా: లంబసింగి, తిరుమల

4) గనుల తవ్వకం: గనుల తవ్వకం జరిగే ప్రాంతాల్లో విడుదలయ్యే వాయువుల వల్ల ఆ ప్రాంత ఉష్ణోగ్రతలు ప్రభావితమవుతాయి. ఉదా: రాయలసీమ

5) సముద్ర ప్రవాహాలు: ఉత్తర హిందూ మహా సముద్రంలో ఏర్పడే నైరుతి రుతుపవన డ్రాఫ్ట్, ఈశాన్య రుతుపవన డ్రాఫ్ట్‌ అనే సముద్ర ప్రవాహాలు ఆంధ్రప్రదేశ్‌ శీతోష్ణస్థితిని కొంతమేర ప్రభావితం చేస్తున్నాయి.

వాతావరణ పరిశోధన: రాష్ట్ర వాతావరణ శాఖ ప్రధాన కేంద్రం అమరావతిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 20 వాతావరణ కేంద్రాలున్నాయి. వాటిలో నమోదు చేసిన వివరాలతో రాష్ట్ర శీతోష్ణస్థితికి సంబంధించిన పటం, పట్టికలు తయారు చేయాలని ప్రణాళికా విభాగాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సంఘం ఆదేశిస్తుంది.

కాలాలు: భారత వాతావరణ శాఖ ప్రకారం ఆంధ్రపదేశ్‌లో సంవత్సరాన్ని నాలుగు కాలాలుగా విభజించవచ్చు. 1) శీతాకాలం: డిసెంబరు-ఫిబ్రవరి. 2) వేసవి కాలం: మార్చి-మే. 3) నైరుతి రుతుపవన కాలం: జూన్‌-సెప్టెంబరు 4) ఈశాన్య రుతుపవన కాలం: అక్టోబరు-డిసెంబరు.

శీతాకాలం: రాష్ట్రంలో డిసెంబరు మధ్య నాటికి ఉష్ణోగ్రతలు తగ్గి చలి మొదలు కావడంతో పాటుగా, ఈశాన్య రుతుపవనాల తీవ్రత తగ్గి వాతావరణం పొడిగా ఉంటుంది. అన్ని కాలాల్లోకి శీతాకాలంలోనే వర్షపాతం తక్కువ. జనవరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదై ఫిబ్రవరి నెలాఖరు నాటికి చలి తగ్గుతుంది. రాత్రి సమయాల్లో మంచు కురుస్తూ, ఉష్ణోగ్రత విలోమం వల్ల ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కూడా ఉంటుంది. ఈ కాలంలో సముద్రానికి దగ్గరున్న కోస్తా ప్రాంతం కంటే దూరంగా ఉన్న రాయలసీమలో చలి తీవ్రత ఎక్కువ. మైసూరు పీఠభూమిని ఆనుకొని ఉన్న చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో మిగతా రాయలసీమ జిల్లాల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. * రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రదేశం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగి (-2 C0). దక్షిణ భారత్‌లో మంచు కురిసే ఏకైక ప్రాంతం ఇదే. అందుకే లంబసింగిని ‘ఆంధ్రా కశ్మీర్‌’గా పిలుస్తారు. ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే మరో ప్రదేశం ‘వంజంగి’(అల్లూరి సీతారామరాజు జిల్లా).

వేసవి కాలం: మార్చిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళం వైపు ప్రవేశించడంతో నిట్టనిలువు సూర్యకిరణాలతో ఉష్ణోగ్రతలు పెరిగి మే నాటికి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మే రెండు, మూడు వారాల్లో వీచే వడగాలులతో వాతావరణం బాగా వేడెక్కి వడదెబ్బ పరిస్థితులు నెలకొంటాయి. ఈ కాలంలో తీర ప్రాంతాల్లో ఆర్ద్రత అధికంగా ఉండటంతో ప్రజలు అధిక చెమట, ఉక్కపోతకు గురవుతారు. సముద్రం దగ్గరున్న కోస్తా ప్రాంతం కంటే ఖండాంతర్గత ప్రాంతమైన రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే మైసూర్‌ పీఠభూమిని ఆనుకొని ఉన్న చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలు మిగతా రాయలసీమ జిల్లాల కంటే చల్లగా ఉంటాయి. ఈ కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులు, వడగండ్ల వర్షాలు కురుస్తాయి. వీటినే సాయంకాల వర్షాలు/ ఏరువాక/ మ్యాంగో షవర్స్‌ అంటారు.

రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాలు కడప, కర్నూలు, పల్నాడు, ఎన్టీఆర్‌. * అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రదేశం రెంటచింతల (పల్నాడు జిల్లా). 

ముఖ్య వేసవి విడిది అన్నమయ్య జిల్లాలోని మదనపల్లికి సమీపంలో ఉన్న హార్స్‌లీ హిల్స్‌. 

వేసవిలో అత్యధిక సగటు ఉష్ణోగ్రత 31.5 C0, అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 18 C0. సరాసరి ఉష్ణోగ్రత 27 C0.

నైరుతి రుతుపవన కాలం/ వర్షాకాలం: నైరుతి రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలో కేరళలో ప్రవేశించి జూన్‌ రెండో వారం నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాల్లోకి ప్రవేశిస్తాయి. రాష్ట్రంలో 2/3వ వంతు వర్షపాతం ఈ రుతుపవనాల కాలంలో కురుస్తుంది. రాష్ట్రంలో వర్షపాత విస్తరణ నైరుతి దిశ నుంచి ఈశాన్య దిశకు వెళ్లే కొద్దీ అధికమవుతుంది. దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు వెళ్లేకొద్దీ కూడా ఎక్కువవుతుంది. ఈ రుతుపవనాలు తూర్పు కనుమలకు సమాంతరంగా ప్రయాణించే క్రమంలో కనుమల ఎత్తు అధికంగా ఉన్న ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు, దక్షిణ కోస్తాలో తక్కువ వర్షాలు నమోదవుతాయి.

* నైరుతి రుతుపవనాల కాలంలో రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదవుతుంది. జిల్లాలో అల్లూరి సీతారామరాజు జిల్లా (సీలేరు బేసిన్‌). అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురం జిల్లా (హగరి లోయ). * రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదయ్యే నెలలు జులై, ఆగస్టు. రాష్ట్ర సగటు వర్షపాతం 556 మి.మీ. * వార్షిక వర్షపాతంలో రాయలసీమలో 73%, కోస్తా ప్రాంతంలో 51% నైరుతి రుతుపవనాల ద్వారానే సంభవిస్తుంది. * భారత వాతావరణ శాఖ సవరించిన రుతుపవన క్యాలెండర్‌ ప్రకారం నైరుతి రుతుపవనాలు ఒంగోలులో జూన్‌ 8, మచిలీపట్నంలో జూన్‌ 13, విశాఖపట్నంలో జూన్‌ 11న ప్రవేశిస్తాయి. * రాష్ట్రంలో 2022-23 సంవత్సరంలో నైరుతి రుతుపవనాల వల్ల 607.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 9.2% అధికం.

ఈశాన్య రుతుపవన/ తిరోగమన రుతుపవన కాలం: ఉష్ణోగ్రత, పీడనంలో వ్యత్యాసం వల్ల నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెంది ఈశాన్యం నుంచి పవనాలు వీయడం వల్ల ఈ పవనాలను ఈశాన్య రుతుపవనాలు లేదా తిరోగమన రుతుపవనాలు అంటారు. ఏపీలో ఈశాన్య రుతుపవనాల కాలంలో తుపాన్లు ఏర్పడి, దక్షిణాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో అధిక వర్షాలు, వరదలు సంభవిస్తాయి. ఇలా గత వందేళ్ల కాలంలో 75 తుపాన్లు చెన్నై, విశాఖపట్నం మధ్య తీరం దాటాయి.

అక్టోబరు, నవంబరు నెలలను తుపాను నెలలుగా పిలుస్తారు. ఈ రుతుపవనాల కాలంలో రాష్ట్రంలో సగటు వర్షపాతం 296 మి.మీ. అయితే 2021 - 22 సంవత్సరంలో ఈశాన్య రుతుపవనాల వల్ల 368.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 24.4% అధికం.

వర్షపాత విస్తరణ: ఆంధ్రప్రదేశ్‌ సగటు వార్షిక వర్షపాతం 966 మి.మీ. అయితే ఈ వర్షపాతం అన్ని ప్రాంతాల్లో సమానంగా లేదు. అన్ని ప్రాంతాలకు ఒకేసారి వర్షం ఉండదు. అంటే రాష్ట్రంలో వర్షపాతం అసమానంగా, అనిశ్చితంగా ఉంటుంది. కొన్ని చోట్ల అధిక వర్షాలతో అతివృష్టి, కొన్నిచోట్ల అల్పవర్షంతో కరవులు సంభవిస్తాయి. అందుకే వ్యవసాయాన్ని రుతుపవనాలతో ఆడే జూదంగా అభివర్ణిస్తారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు కరవు కాటకాలకు ప్రసిద్ధి. కారణం 1. రాయలసీమ ప్రాంతం నైరుతి రుతుపవన మార్గంలో పశ్చిమ కనుమల వర్షచ్ఛాయా మండలంలోనూ, ఈశాన్య రుతుపవనాల మార్గంలో తూర్పు కనుమల వెనుక వైపున ఉండటం. 2. రాయలసీమ సముద్ర తీరానికి దూరంగా ఉండటంతో పవనాలు తీరం నుంచి వెళ్లేకొద్దీ బలహీనమవడం.

ధారన్‌ త్వైట్‌ శీతోష్ణస్థితి వర్గీకరణ: అమెరికాకు చెందిన ధారన్‌ త్వైట్‌ 1948లో జల సంతులన భావన ఆధారంగా శీతోష్ణస్థితిని వర్గీకరించాడు. ఇతడి ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాల వర్గీకరణ స్థూలంగా నాలుగు రకాలుగా ఉంది. 

1) శుష్క ఉప ఆర్ధ్ర శీతోష్ణస్థితి: రాష్ట్రంలోని ఉత్తర, మధ్య, దక్షిణ సరిహద్దు భాగాలు.

2) తేమ ఉప ఆర్ధ్ర శీతోష్ణస్థితి: గోదావరి జిల్లాల ప్రాంతం.

3) శుష్క శీతోష్ణస్థితి: రాష్ట్రంలోని నైరుతి ప్రాంతం (రాయలసీయ)

4) అర్ధ శుష్క శీతోష్ణస్థితి: రాష్ట్రంలోని అధిక భాగం.

కొప్పెన్‌ వర్గీకరణ: ఇతడిని శీతోష్ణస్థితి శాస్త్ర పితామహుడుగా అభివర్ణిస్తారు. నెల వారీ ఉష్ణోగ్రత, వర్షపాతం ఆధారంగా 1884లో ఈయన శీతోష్ణస్థితి మండలాలను వర్గీకరించాడు. 

1) అయనరేఖా వర్షపాత శీతోష్ణస్థితి: రాష్ట్రంలోని ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలు.

2) శుష్క ప్రాంతం: రాష్ట్రంలోని నైరుతి ప్రాంతం (రాయలసీమ).

ప్రశ్నలు

1. కిందివాటిలో ఖండాంతర్గత శీతోష్ణస్థితికి సంబంధించిన ప్రదేశం.

1) విశాఖపట్నం 2) అనంతపురం 3) కాకినాడ 4) మచిలీపట్నం

2. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రదేశం.

1) లంబసింగి 2) వంజంగి 3) అరకు లోయ 4) రెంటచింతల

3. ధారన్‌ త్వైట్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ అధిక భాగం ఏ శీతోష్ణ మండలానికి చెందుతుంది.

1) ఉప శుష్క 2) శుష్క 3) అర్ధ శుష్క 4) తేమ ఉప ఆర్ధ్ర

4. 2021 - 22 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల ద్వారా నమోదైన వర్షపాతం ఎంత?

1) 535 మి.మీ 2) 705 మి.మీ 3) 607 మి.మీ 4) 457 మి.మీ

5. నైరుతి రుతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం?

1) ఉత్తర కోస్తా 2) గోదావరి ఏజెన్సీ 3) రాయలసీమ 4) దక్షిణ కోస్తా

6. ఆంధ్రప్రదేశ్‌లో ఈ దిశగా వెళ్లేకొద్దీ వర్షపాతం పెరుగుతుంది.

ఎ) నైరుతి దిశ నుంచి ఉత్తరం బి) దక్షిణ దిశ నుంచి ఉత్తరం

1) ఎ మాత్రమే సరైనది 2) బి మాత్రమే సరైనది 3) ఎ, బి రెండూ సరైనవి 4) ఎ, బి రెండూ సరైనవి కావు

7. ‘మాండస్‌’ తుపాన్‌ అనే పేరును సూచించిన దేశం?

1) శ్రీలంక 2) యు.ఎ.ఇ. 3) ఒమెన్‌ 4) సౌదీ అరేబియా

8. ‘హార్స్‌లీ హిల్స్‌’ కింది వాటిలో ఏ పట్టణానికి సమీపంలో ఉంది?

1) మదనపల్లి 2) చిత్తూరు 3) తిరుపతి 4) రాయచోటి

9. కిందివాటిలో ఉష్ణోగ్రతా తారతమ్యాలు తక్కువగా ఉండే ప్రాంతం?

1) కడప 2) కర్నూలు 3) తిరుపతి 4) రాజమండ్రి

10. ఎత్తుపెరిగే కొద్దీ ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉంటుంది.

1) ఉష్ణోగ్రత తగ్గుతుంది 2) ఉష్ణోగ్రత పెరుగుతుంది 3) ఉష్ణోగ్రత మారదు 4) ఉష్ణోగ్రత తగ్గి పెరుగుతుంది

సమాధానాలు: 1-2,   2-4,   3-3,   4-3,   5-4,   6-3,   7-2,   8-1,   9-4,   10-1

రచయిత: దంపూరు శ్రీనివాసులు 
 

Posted Date : 09-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌