• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రాలో కమ్యూనిస్టు ఉద్యమాలు

తెలుగు నేలపై సామ్యవాదం!

దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం, అనంతరం సమానత్వం, సమ సమాజం కోసం సామాన్యుల్లో పోరాట పటిమను కమ్యూనిస్టు ఉద్యమాలు నింపాయి. రష్యా స్ఫూర్తితో ఇక్కడ ప్రారంభమైన కమ్యూనిస్టు పార్టీ, అనతి కాలంలోనే దేశమంతా విస్తరించింది. చివరికి చైనా సిద్ధాంతాల కారణంగా నాయకుల్లో తలెత్తిన విభేదాలతో రెండుగా చీలిపోయింది. ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతం కేంద్రంగా జరిగిన కొన్ని ముఖ్యమైన పరిణామాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. కమ్యూనిజం వ్యాప్తిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నాయకులు, తొలితరం ఆంధ్రా రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీ పాత్ర, విశాలాంధ్ర ఉద్యమ నేపథ్యం, విజయవాడలో పార్టీ రెండుగా చీలిన చారిత్రక సందర్భాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

విప్లవ పోరాటం ద్వారా ఆర్థిక, సామాజిక సమానత్వాలను తీసుకురావడం కోసం జరిగినవే కమ్యూనిస్టు ఉద్యమాలు. జర్మనీకి చెందిన కార్ల్‌ మార్క్స్‌ గ్రంథం ‘కమ్యూనిస్ట్‌ మేనిఫెస్టో’లో సామ్యవాద సిద్ధాంతం గురించి వివరించారు. దాని పట్ల ప్రభావితుడైన లెనిన్‌ 1917లో మొదటిసారిగా రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ భావాలను ప్రపంచమంతా వ్యాప్తి చేయడానికి ‘కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌’ అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ సమావేశాలకు హాజరై ప్రేరణ పొందిన భారతీయుడు ఎం.ఎన్‌.రాయ్‌.. 1920, అక్టోబరు 17న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా(సీపీఐ)ని ఉజ్బెకిస్థాన్‌ రాజధాని తాష్కెంట్‌లో ఏర్పాటు చేశారు. ఈ పార్టీ రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీ/ రాడికల్‌ హ్యూమనిస్ట్‌ పార్టీగా ప్రసిద్ధి చెందింది. పార్టీ స్థాపనలో రాయ్‌కి సహాయపడినవారు ఎస్‌.ఎ.డాంగే, ముజఫర్‌ అహ్మద్‌. ఎం.ఎన్‌.రాయ్‌ రాసిన గ్రంథం ‘ఇండియన్‌ ట్రాన్సిషన్‌’, నడిపిన పత్రిక - ‘వాన్‌గార్డ్‌’. ఎస్‌.ఎ. డాంగే రాసిన గ్రంథం ‘గాంధీ వర్సెస్‌ లెనిన్‌’, నడిపిన పత్రిక ‘ద సోషలిస్ట్‌’. ముజఫర్‌ అహ్మద్‌ నడిపిన పత్రికలు - నవయుగ్, లాంగర్‌. దేశంలో కమ్యూనిస్టు పార్టీ మొదటి సమావేశం 1925లో కాన్పుర్‌లో జరిగింది. భారత్‌లో కమ్యూనిస్టు భావాలను వ్యాప్తి చేయడానికి ఇంగ్లండ్‌ నుంచి భారత్‌కు వచ్చిన కమ్యూనిస్టు నాయకుడు ‘స్ట్రాట్‌’. ఇతడిని భారతదేశం నుంచి తరిమేయడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం తెచ్చిన చట్టాలు - పబ్లిక్‌ సేఫ్టీ అమెండ్‌మెంట్‌ బిల్, ట్రేడ్‌ డిస్ఫ్యూట్‌ బిల్‌.

ఆంధ్రాలో వ్యాప్తి: ఆంధ్రాలో కమ్యూనిస్టు ఉద్యమ   వ్యాప్తిని 4 దశలుగా విభజించారు.

మొదటి దశ (1930-1934): ఈ దశలో కమ్యూనిస్టు సిద్ధాంతాల వ్యాప్తికి దోహదపడినవి జైళ్లు, విశ్వవిద్యాలయాలు, యంగ్‌ వర్కింగ్‌ లీగ్‌లు.

1) ఉప్పుసత్యాగ్రహ సమయంలో అనేకమంది జాతీయోద్యమ నాయకులు అరెస్టయ్యారు. వీరిలో ప్రముఖులు గద్దె లింగయ్య, ముద్దూరి చంద్రశేఖరరావు, అల్లూరి సత్యనారాయణ. వీరిని విశాఖపట్నం, రాజమండ్రి, బళ్లారి జైళ్లకు తరలించారు. అప్పటికే పెషావర్, మీరట్, లాహోర్‌ కుట్ర కేసుల్లో సంబంధం ఉన్న అనేకమంది ఆ జైళ్లలో ఉన్నారు. వీరితో ఏర్పడిన పరిచయం ఆంధ్రాలో కమ్యూనిస్టు భావాల వ్యాప్తికి దారితీసింది.

2) కాశీ, బెనారస్‌ విశ్వవిద్యాలయాల్లో చండ్ర రాజేశ్వరరావు, పొన్న వీరరాఘవయ్య, దర్శి చెంచయ్య లాంటివారు చదువుకున్నారు. వీటిల్లో కమ్యూనిస్టు సిద్ధాంత భావజాలం అధికంగా ఉండేది. వీరంతా ఆ సిద్ధాంతానికి ప్రభావితమై ఆంధ్రాలో వ్యాప్తి చేశారు.

3) మీరట్‌ నుంచి మద్రాసుకు వచ్చిన అమీర్‌ అలీ హైదర్‌ఖాన్‌ ‘యంగ్‌ వర్కింగ్‌ లీగ్‌’ అనే సంస్థను స్థాపించి కమ్యూనిస్టు భావాలను వ్యాప్తి చేశాడు. ఈ సంస్థలో చేరిన ప్రముఖ ఆంధ్రులు పుచ్చలపల్లి సుందరయ్య, కంభంపాటి సత్యనారాయణ, బసవ పున్నయ్య.

రెండో దశ: (1935 - 1939): ఆంధ్రాలో కమ్యూనిస్టులు 1934లో విజయవాడలోని కాట్రగడ్డ నారాయణరావు తోటలో సమావేశమయ్యారు. ఇందులో ఆంధ్రాలో కమ్యూనిస్టు సిద్ధాంతాల వ్యాప్తికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పడింది. ఆ సభ్యులు 1934లో కాకినాడలో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ప్రొఫెసర్‌ గాట్‌ హాజరయ్యారు. ఇతడిపై బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యులు కాంగ్రెస్‌తో కలిసి వారి సిద్ధాంతాలను వ్యాప్తి చేయాలని సూచించారు. ఈ పార్టీలో చేరిన ఎన్‌.జి.రంగా యువతలో కమ్యూనిస్టు భావాలను వ్యాప్తి చేశారు. 1938లో పుచ్చలపల్లి సుందరయ్య అధ్యక్షతన విజయవాడలో సమావేశం జరిగింది. దీనికి కేంద్ర కమిటీ నుంచి పి.సి.జోషి హాజరయ్యారు. అందులో కమ్యూనిస్టు సిద్ధాంతాలు త్వరితగతిన వ్యాప్తి చేయాలని నిర్ణయించారు. ఈ రెండో దశలో సోషలిస్టు భావాల వ్యాప్తికి కొత్తపట్నం, తుళ్లూరు, నిడుబ్రోలు వద్ద అన్నాప్రగడ కామేశ్వరరావు రాజకీయ పాఠశాలలు స్థాపించారు. రైతులను చైతన్యపరచడానికి ఎన్‌.జి.రంగా శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం నుంచి మద్రాసు వరకు రైతు యాత్రలు ప్రవేశపెట్టారు.

మూడోదశ (1939 - 1945): ఈ దశలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అది సామ్రాజ్యవాద యుద్ధమన్న భారత్‌లోని కమ్యూనిస్టులు ఇంగ్లండ్‌ను వ్యతిరేకిస్తూ రష్యాను అనుసరించారు. ప్రారంభంలో రష్యా కూడా ఇంగ్లండ్‌ను వ్యతిరేకించి, చివరికి ఇంగ్లండ్‌ పక్షాన చేరింది. ఈ యుద్ధ సమయంలో కమ్యూనిస్టు అధికార పత్రిక ‘ప్రజాశక్తి’ కమ్యూనిస్టు సిద్ధాంతాలను వ్యాప్తి చేసింది. 1943, జులైలో బ్రిటిష్‌ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని తొలగించింది. వీరు క్విట్‌ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీ విధానాలకు వ్యతిరేకంగా, బ్రిటిష్‌ ప్రభుత్వానికి మద్దతు పలికారు. దాని వల్ల కమ్యూనిస్టు పార్టీ కొంత ప్రజామద్దతు కోల్పోయింది. 1943లో విజయవాడలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో భూస్వామ్య వ్యతిరేక పోరాట దళాలు, ప్రజారక్షణ దళాలు, మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు.

నాలుగోదశ (1946 - 55): ఈ దశలో 1946 ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి రణధీన సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆంధ్రాలో కూడా ఈ సంఘటనలు తలెత్తడంతో అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి ప్రకాశం కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేసి జైళ్లకు పంపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతే వారిని జైళ్ల నుంచి విడుదల చేయాలని నెహ్రూ సూచించడంతో 1947, ఆగస్టు 15న కమ్యూనిస్టు నాయకులు విడుదలయ్యారు. వీరు బయటకు వచ్చాక ఆంధ్రాలోహింసాత్మక సంఘటనలు జరిగాయి. 1949, సెప్టెంబరులో తిరిగి ఆంధ్రాలో ఈ పార్టీ కార్యక్రమాలపై నిషేధం విధించారు.

స్వాతంత్య్రానంతరం భారత్‌తో రష్యా మంచి సంబంధాలు ఏర్పరచుకుంది. ఇండియాలో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం విరమించి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చింది. సాయుధ పోరాటం నిలిపివేయడంతో 1951, అక్టోబరులో ఈ పార్టీపై నిషేధం ఎత్తివేశారు. 1952 ఎన్నికల్లో రావి నారాయణరెడ్డి నల్గొండ నియోజకవర్గం నుంచి దేశంలోనే అధిక మెజారిటీతో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్, మద్రాసు రాష్ట్రాలు, ఆంధ్రాల్లోనూ కమ్యూనిస్టు పార్టీ అధిక సీట్లు గెలుచుకుంది. ఈ క్రమంలో తెలుగు మాట్లాడే ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలను విలీనం చేసి విశాలాంధ్రను ఏర్పాటుచేస్తే కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడుతుందని భావించి, విశాలాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. 1945లో పుచ్చలపల్లి సుందరయ్య ‘విశాలాంధ్ర పత్రిక’ను స్థాపించి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడానికి అనేకమంది నాయకులు ప్రయత్నించారు. వీరిలో చండ్ర రాజేశ్వరరావు, రావి నారాయణరెడ్డి ముఖ్యులు. కమ్యూనిస్టులు మద్దతు ప్రకటించడంతో 1953లో టంగుటూరి ప్రకాశం మొదటి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమాల వల్లే ఆయన రాజీనామా చేశారు. 1955లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీకి 15 సీట్లు మాత్రమే వచ్చాయి. 1956, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరించిన తర్వాత రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావు లాంటి కొందరు కమ్యూనిస్టు నాయకులు కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. చైనా సిద్ధాంతాలకు ప్రభావితులైన పుచ్చలపల్లి సుందరయ్య, బసవ పున్నయ్యలు ఈ విధానంతో విభేదించారు. 1961లో జరిగిన విజయవాడ సమావేశంలో ఈ విభేదాలు బయటపడ్డాయి. 1962లో చైనాతో యుద్ధం తర్వాత, 1964లో పార్టీ సీపీఐ, సీపీఐ(ఎం)లుగా చీలిపోయింది.

కమ్యూనిస్టులు బలహీనపడటానికి కారణాలు 

1945, డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఆంధ్రా నుంచి ఈ ఎన్నికల్లో పిల్లలమర్రి వెంకటేశ్వరరావు ఒక్కరే ఎన్నికయ్యారు. 1946 ఎన్నికల్లోనూ ఈ పార్టీ పరాజయం పాలైంది. దీనికి ప్రధాన కారణం క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో ప్రజావ్యతిరేక  కార్యకలాపాల్లో పాల్గొనడమే.

 

రచయిత: గద్దె నరసింహారావు 

 

Posted Date : 10-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌