• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రాలో సాంస్కృతిక వికాసం - వ్యవహారిక భాషోద్యమం

ఉన్నవ లక్ష్మీనారాయణ 

(1877-1958)

లక్ష్మీనారాయణ 1877, డిసెంబరు 4న గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలుకా వేములూరుపాడు గ్రామంలో జన్మించారు. తండ్రి శ్రీరాములు, తల్లి శేషమ్మ.

ఈయన సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేశారు. ప్రముఖ న్యాయవాది కూడా. గాంధేయవాది, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడు, స్వాతంత్య్ర సమరయోధుడిగా పేరొందారు.

* శ్రీరాములు ‘అచలయోగం’ అనే కుండలినీ విద్యను సాధన చేసేవారు.

* విద్యాభ్యాసం గుంటూరు, రాజమండ్రిలో జరిగింది. ఐర్లాండ్‌లో బారిస్టర్‌ చదివారు.

మద్రాస్‌ హైకోర్టులో న్యాయవాదిగా, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. పల్నాడు-పుల్లరి సత్యాగ్రహానికి న్యాయకత్వం వహించారు.

* 1931 ఉప్పు సత్యాగ్రహం, 1942 క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. సీఆర్‌.దాస్‌ స్థాపించిన ‘అఖిల భారత స్వరాజ్‌ పార్టీ’కి ఆంధ్రా కార్యదర్శిగా పనిచేశారు.

సాంఘిక సేవ: లక్ష్మీనారాయణ 1900లో గుంటూరులో ‘యంగ్‌ మెన్స్‌ లిటరరీ అసోసియేషన్‌’ను స్థాపించారు. 1902లో వితంతు శరణాలయాన్ని స్థాపించారు. 1912లో గుంటూరులో శారదానికేతన్‌ను స్థాపించారు. బాలికా విద్యకు, మహిళాభివృద్ధికి కృషి చేశారు.

* 1913లో జొన్నవిత్తుల గురునాథంతో కలసి విశాలాంధ్ర పటాన్ని తయారు చేశారు.

* 1917లో జరిగిన రష్యా విప్లవం (బోల్ష్‌విక్‌ విప్లవం) నుంచి స్ఫూర్తి పొంది సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి కృషి చేశారు.

* అగ్రవర్ణాల వారు, హరిజనులు కలసిమెలిసి ఉండాలని భావించారు. దీని కోసమే ‘మాలపల్లి’ అనే విప్లవాత్మక నవలను రచించారు. దీనికే ‘సంఘ విజయం’ అనే పేరు కూడా ఉంది. దీన్ని 1922లో బెల్లంకొండ రాఘవరావు రెండు భాగాలుగా ముద్రించగా, మద్రాస్‌ ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది.

* 1928లో ఈ నవలపై చర్చ జరిగి, కొన్ని మార్పులతో తిరిగి ప్రచురించారు. మద్రాస్‌ ప్రభుత్వం ఈ నవలను ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా ప్రచురించి, దీన్ని ఒక పాఠ్య గ్రంథంగా ఎంపిక చేసింది. 1936లో మద్రాస్‌ ప్రభుత్వం మళ్లీ ఈ నవలను నిషేధించి, పాఠ్యగ్రంథంగా తొలగించింది. 1937లో ‘మాలపల్లి’ నవలపై నిషేధాన్ని తొలగించారు.

* ‘మాలపల్లి’ ఒక సాంఘిక నవల. దీని పీఠికను కాశీనాథుని నాగేశ్వరరావు రచించారు. ఇది తెలుగు సాహిత్య విప్లవంలో వచ్చిన ప్రథమ రచన.  ఇది తెలుగు వారి రాజకీయ వాతావరణానికి, జీవన విధానానికి, గాంధీజీ ఆశయాలకు ప్రతిబింబంగా నిలిచింది. ఇందులో సాంఘిక దురాచారాలు, జాతీయ సత్యాగ్రహ ఉద్యమాలు, వర్గ-వర్ణ వ్యత్యాసాలు మొదలైన సమకాలీన పరిస్థితుల గురించి ఉంది. దీని ఆధారంగా 1938లో గూడవల్లి రామబ్రహ్మం సారథి స్టూడియో ద్వారా ‘మాలపిల్ల’ అనే సినిమాను నిర్మించారు.

* ఉన్నవ లక్ష్మీనారాయణ నాయకురాలు, బుడబుక్కల జోస్యం, స్వరాజ్య సోది, భావతరంగాలు లాంటి రచనలు చేశారు.

* ఈయన 1958 సెప్టెంబరు 25న మరణించారు.

గ్రాంథిక భాషోద్యమం

* వాడుక భాష సాహిత్య రచనకు పనికిరాదని గ్రాంథిక భాషోద్యమకర్తలు వాదించారు. తెలుగు భాషను పరిరక్షించడానికి గ్రాంథిక భాష ఉపయోగపడుతుందని; దీనికి ఏకరూపత, ప్రామాణికత లక్షణాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

* పరవస్తు చిన్నయసూరి బాల వ్యాకరణం అనే గ్రంథాన్ని రాశారు. తాను రచించిన నీతి చంద్రికను గ్రాంథిక భాషలో ప్రచురించారు. ఈ విధంగా చిన్నయసూరి గ్రాంథిక భాషోద్యమానికి తన వంతు కృషి చేశారు.

* గ్రాంథిక భాషను సమర్థించిన వారిలో జయంతి రామయ్య పంతులు ముఖ్యులు.

జయంతి రామయ్య పంతులు (1860 - 1941)

* 1860, జులై 18న కోనసీమలోని ముక్తేశ్వరంలో జన్మించారు.

* కవి, శాసన పరిశోధకులుగా పేరొందారు.

* వ్యవహారిక భాషోద్యమ సమయంలో గ్రాంథిక భాషకు ప్రాధాన్యమిచ్చారు.

* 188284 మధ్య పిఠాపురం మహారాజా పాఠశాలలో ప్రధాన ఆచార్యుడిగా పనిచేశారు. ప్రభుత్వ మండలాధికారిగా, రాష్ట్ర న్యాయాధీశులుగా పనిచేశారు.

* దేవులపల్లి, యుద్ధమల్లుడి శాసనాలను సేకరించి, వాటిపై పరిశోధనలు చేశారు. ఈ శాసనాల్లోని పద్యాలను క్రోడీకరించి ‘శాసన పద్య మంజరి’ పేరుతో రెండు భాగాలుగా ప్రచురించారు.

‘దక్షిణ హిందూదేశ శాసనాలు’ పదో సంపుటాన్ని ప్రభుత్వం వెలువరించేలా కృషి చేశారు.

* చెన్నపురిలో ఆంధ్రా సాహిత్య పరిషత్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని పిఠాపురం, బొబ్బిలి, వెంకటగిరి సంస్థానాదీశులు ప్రోత్సహించారు. తర్వాత ఈ పరిషత్‌ను కాకినాడకు మార్చారు.

* రామయ్య పంతులు అయిదువేల తాళపత్ర గ్రంథాలను సేకరించారు.

* ఆంధ్రా సాహిత్య పరిషత్‌ పత్రికను స్థాపించి అందులో ఎన్నో అముద్రిత గ్రంథాలను ముద్రించారు.

ఈయన ఉత్తర రామ చరిత్ర, చంపూ రామాయణం, కవిజనాశ్రయం-ఛందోశాస్త్రం అనే రచనలు చేశారు. 

* పిఠాపురం మహారాజా ఆర్థిక సాయంతో 1936లో ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ను రచించారు.

* ఆధునికాంధ్ర వాజ్మయ వికాస వైఖరి ్బ1937్శ అనే విమర్శనాత్మక గ్రంథాన్ని రాశారు.

నండూరి వెంకట సుబ్బారావు 

* ఈయన పశ్చిమగోదావరి జిల్లాలోని  వసంతవాడలో జన్మించారు. 

* ఏలూరు, కాకినాడలో విద్యను అభ్యసించారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.

* 1926 నుంచి ఏలూరులో న్యాయవాదిగా పనిచేశారు.

* నండూరి సుబ్బారావు రాసిన గేయ సంపుటి ఎంకి పాటలు. ఇందులో గోదావరి మాండలికాన్ని ఉపయోగించారు. దీనిలో ప్రణయ గీతాలు ఉన్నాయి.

* గురజాడ అప్పారావును గురువుగా భావించి, ఆయన అడుగుజాడల్లో నడిచారు. గురజాడ రాసిన ‘లవణరాజు కల’ వెంకట సుబ్బారావుని బాగా ఆకర్షించింది. తన ఎంకి పాటల రచనకు ఇదే ప్రేరణగా నిలిచింది.

* ఆధునిక తెలుగు సాహిత్యంపై ఆంగ్ల సాహిత్యంలోని కాల్పనిక భావ కవిత్వం (Romantic Poetry) ప్రభావం వల్ల ‘ఎంకి పాటలు’ వెలువడ్డాయి. ఇవి సంస్కృతాంధ్ర సాహిత్యాన్ని, పాశ్చ్యాత్య భావ కవిత్వ పోకడల్ని సమ్మిళితం చేశాయి. వీటిని అనుసరించి రేడియో నాటికలు కూడా వచ్చాయి. 

ఉదా: ఎండమావులు, చిత్రనళినీయం, చౌకబేరం, అద్దె ఇల్లు మొదలైనవి.

* సుబ్బారావు 1957లో మరణించారు.

బసవరాజు అప్పారావు (1894-1933)

* 1894, డిసెంబరు 13న విజయవాడలోని పడమటలో జన్మించారు.

* కవి, సంపాదకుడు, న్యాయవాది, భావకవిగా గుర్తింపు పొందారు. 

* గాంధీజీ చేపట్టిన ఉద్యమాల్లో పాల్గొని జాతీయ గీతాలు రాశారు.

* 1921లో ఆంధ్రాపత్రికకు, భారతికి సహ సంపాదకుడిగా పనిచేశారు.

‘నేను’ పేరుతో ఆత్మకథను రాశారు.

* హరిజనోద్ధరణకు కృషి చేశారు, వారిపై జరిగే అత్యాచారాలను ఖండించారు.

* ఈయన భార్య రాజ్యలక్ష్మి ‘సౌదామిని’ అనే కలం పేరుతో కవితలు రచించారు.

* ఈయన రచించిన పాటలు ‘మాలపిల్ల’ సినిమాలో ఉన్నాయి. 

* బసవరాజు 1933లో మరణించారు.

వ్యవహారిక భాషోద్యమం

20వ శతాబ్దం ప్రథమార్ధంలో పాఠశాలల్లో విద్యార్థులకు గ్రాంథిక భాషను బోధించేవారు. ప్రజలు మాట్లాడే భాష వేరుగా ఉండేది. ఈ నేపథ్యంలో  జేఏ యేట్స్, గురజాడ అప్పారావు, శ్రీనివాస అయ్యంగార్, గిడుగు రామ్మూర్తి పంతులు మొదలైనవారు వ్యవహారిక భాషోద్యమాన్ని ప్రారంభించారు. దీంతో భాషావాదులు రెండు వర్గాలుగా విడిపోయారు. గురజాడ అప్పారావు, శ్రీనివాస అయ్యంగార్‌ లాంటివారు వ్యవహారిక భాషోద్యమాన్ని విస్తృతం చేశారు. గిడుగు చేసిన కృషితో వ్యవహారిక భాషలో గ్రంథ రచనలు జరిగాయి. వ్యవహారిక భాషోద్యమంలో రామ్మూర్తి పంతులుకు కందుకూరి వీరేశలింగం పంతులు ప్రోత్సాహం లభించింది.

గిడుగు వెంకట రామ్మూర్తి (1863-1940)

* తెలుగులో వ్యవహారిక/ వాడుక భాషోద్యమానికి పితామహుడు.

* గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి వ్యవహారిక భాషోద్యమానికి మూలకారకులు అయ్యారు.

* సంఘ సంస్కర్తగా, చరిత్రకారుడిగా, బహుభాషాకోవిదుడిగా, హేతువాదిగా గుర్తింపు పొందారు.

* గిడుగు 1863, ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లా ముఖలింగ క్షేత్రం సమీపంలోని పర్వతాలపేటలో జన్మించారు. 

* తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ.

* ఈయన పుట్టిన రోజునే తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

* 1875-80 మధ్య విజయనగరంలో విద్యనభ్యసించారు. ఆ సమయంలో గురజాడ అప్పారావుతో స్నేహం ఏర్పడింది.

* 1880లో పర్లాకిమిడి పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా చేరారు. అనంతరం కళాశాలకు మారారు. 

* అడవుల్లో నివసించే సవర అనే గిరిజన జాతి ఉన్నతికి కృషి చేశారు. వారి కోసమే సవర భాషను నేర్చుకొని, అందులో పుస్తకాలు రాశారు. దీన్ని గుర్తించిన మద్రాస్‌ ప్రభుత్వం 1913లో ఆయనకు ‘రావ్‌ బహదూర్‌’ బిరుదునిచ్చింది.

* 1931లో ఆంగ్లంలో సవర భాషా వ్యాకరణాన్ని, 1936లో సవర - ఇంగ్లిష్‌ కోశాన్ని రచించారు. వీటిని మద్రాస్‌ ప్రభుత్వం ముద్రించింది.

* 1934లో ప్రభుత్వం గిడుగుకు ‘కైజర్‌-ఇ-హింద్‌’ అనే స్వర్ణపతకాన్ని బహూకరించింది.

* మనదేశంలో మొదటిసారి ముండా ఉపకుటుంబ భాషను శాస్త్రీయంగా పరిశీలించారు. ‘సవర’ దక్షిణ ముండా భాష.

* గిడుగు గాంగ వంశీయుల గురించి ఆంగ్లంలో వ్యాసాలు రాసి, వాటిని Indian Antiquary, Madras literature and science society journalలో ప్రచురించారు.

* అంటరానితనాన్ని వ్యతిరేకించారు. 

* పర్లాకిమిడిని ఒడిశాలో కలపడాన్ని వ్యతిరేకించారు.

* 1906 నుంచి 1940 వరకు తెలుగుభాషకు సేవలందించారు.

* 191920లో వ్యవహారిక భాషోద్యమ ప్రచారానికి ‘తెలుగు’ మాసపత్రికను నడిపారు.

* ఆంధ్రసాహిత్య పరిషత్‌ వ్యవహారిక భాషను వ్యతిరేకించింది. దీంతో 1925లో తణుకులో జరిగిన సభలో 4 గంటలు వ్యవహారిక భాష అవసరం గురించి ప్రసంగించి తీర్మానాన్ని ఆమోదింపజేశారు. సాహితీ సమితి, సాహిత్య పరిషత్‌లు గిడుగు వ్యవహారిక భాషకు చేయూతను అందించాయి.

* 1919, ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజాన్ని స్థాపించారు. దీనికి కందుకూరి వీరేశలింగం పంతులు అధ్యక్షులుగా, గిడుగు కార్యదర్శిగా వ్యవహరించారు.

* 1936లో నవ్య సాహిత్య పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిభ అనే సాహిత్య పత్రిక ప్రారంభమైంది. 1937లో తాపీ ధర్మారావు సంపాదకుడిగా ‘జనవాణి’ అనే పత్రిక ఏర్పాటైంది. వీటిలో వ్యవహారిక భాషా పదాలను వాడారు.

*  గిడుగు 1940, జనవరి 22న మరణించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఈయన్ను ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది.

రచయిత: డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 
 

Posted Date : 04-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌