• facebook
  • whatsapp
  • telegram

విపత్తు నిర్వహణ వ్యవస్థ, నిర్మాణం

ఆపదల్లో ఆదుకునే అత్యున్నత సంస్థలు!

సహజ, మానవకారక విపత్తులకు అవకాశం ఉన్న దేశం మనది. విశాలమైన భూభాగం, అధిక జనాభా, భౌగోళికంగా, నైసర్గికంగా విభిన్న పరిస్థితులు, వాతావరణ వ్యత్యాసాలు, అస్థిర రుతుపవనాలు ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఏడాది పొడవునా దేశంలో ఏదో ఒక చోట విపత్తులు సంభవిస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి రాష్ట్రాల     వారీగా విపత్తు నిర్వహణ యంత్రాంగాలు ఉన్నప్పటికీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సేవలు సరిపోవు. అందుకే దేశవ్యాప్తంగా ఈ పరిస్థితులపై సత్వరం స్పందించి ఉపశమనం కల్పించే ఏర్పాట్లు సంస్థాగతంగా ఉన్నాయి. ప్రణాళికల నుంచి పునరావాసం వరకు బాధ్యత తీసుకునే ఈ వ్యవస్థ నిర్మాణంపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. కేంద్ర స్థాయిలో విపత్తు నిర్వహణలో కీలకమైన సంస్థలు, కమిటీలు, విభాగాలు, వాటి విధుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.


భారతదేశంలో విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయం చేస్తుంది. 2019 విపత్తు నిర్వహణ ప్రణాళిక ఈ మేరకు నిర్దేశించింది. విపత్తు నిర్వహణకు సంబంధించిన అత్యున్నత స్థాయి నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర భద్రతా కేబినెట్‌ కమిటీ, జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీలు కీలకంగా ఉంటాయి. ఏ విపత్తునైనా జాతీయ విపత్తుగా గుర్తించడానికి విపత్తు నిర్వహణ చట్టం-2005లో తగిన నిబంధనలు లేవు.


విపత్తు నిర్వహణలో జాతీయ స్థాయి నిర్ణాయక సంస్థలు:


1) కేంద్ర భద్రతా కేబినెట్‌ కమిటీ: ఈ కమిటీలో ప్రధాని, కేంద్ర రక్షణ మంత్రి, ఆర్థికమంత్రి, దేశీయవ్యవహారాల మంత్రి, విదేశీవ్యవహారాల మంత్రి ఉంటారు. ఏదైనా సంఘటనలో భద్రతకు సంబంధించిన అంశాలుంటే, ఈ కమిటీ దాన్ని జాతీయ భద్రతా దృక్కోణంలో అంచనా వేస్తుంది. రసాయన, జైవిక, రేడియోధార్మిక, అణుఅత్యవసర పరిస్థితులు, భద్రతాపరమైన అంశాలున్న విపత్తులకు సంబంధించి సంసిద్ధత, ఉపశమనం, నిర్వహణల అన్ని దృక్కోణాలను పరిశీలిస్తుంది. కెమికల్‌ బయోలాజికల్‌ రేడియోలాజికల్‌ న్యూక్లియర్‌ (సీబీఆర్‌ఎన్‌) ముప్పు, అత్యవసర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. విపత్తు నివారణ, ఉపశమనం, సంసిద్ధత, సమర్థ ప్రతిస్పందనకు చేపట్టాల్సిన చర్యలపై మార్గనిర్దేశకం చేస్తుంది.


2) జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ: ఈ కమిటీకి కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ఛైర్‌పర్సన్‌. నిర్దిష్ట విపత్తు నిర్వహణ బాధ్యతలున్న మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీల కార్యదర్శులు సభ్యులు. ఈ కమిటీ విపత్తు ప్రతిస్పందన ఆదేశాలు, నియంత్రణ, సమన్వయాన్ని పర్యవేక్షిస్తుంది. అవసరమైన పక్షంలో సంక్షోభ నిర్వహణ బృందానికి సూచనలిస్తుంది. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనే విధంగా నిర్దిష్ట కార్యాచరణలకు సంబంధించి మార్గనిర్దేశం చేస్తుంది.


3) జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎమ్‌ఏ): దీనికి ప్రధానమంత్రి ఛైర్‌పర్సన్‌. ప్రధాని నామినేట్‌ చేసినవారు సభ్యులుగా ఉంటారు. వీరి సంఖ్య 9 మందికి మించదు. ఈ విభాగం విపత్తు నిర్వహణకు సంబంధించిన విధానాలు, ప్రణాళికలతోపాటు వేర్వేరు కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన విపత్తు నిర్వహణ మార్గదర్శకాలు రూపొందిస్తుంది. దేశవ్యాప్తంగా వాటి అమలును సమన్వయం చేస్తుంది. 


4) జాతీయ కార్యనిర్వాహక కమిటీ: ఈ కమిటీకి కేంద్ర హోం సెక్రటరీ ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. వ్యవసాయం, అణుశక్తి, రక్షణ, తాగునీరు, పారిశుద్ధ్యం, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పిడి, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్షం, టెలీకమ్యూనికేషన్, పట్టణాభివృద్ధి, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులు, సమీకృత రక్షణ దళాల అధిపతి, సైనిక దళాల అధిపతులు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉంటారు.


విపత్తు నిర్వహణలో పాత్ర:

* భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు లేదా విభాగాలు సిద్ధం చేసిన జాతీయ ప్రణాళిక, ప్రణాళికల అమలును పర్యవేక్షిస్తుంది.

* అత్యవసర ప్రతిస్పందన, రెస్క్యూ సహాయక చర్యల కోసం తమ వద్ద ఉన్న మానవ వనరులు, సామగ్రి లేదా ఇతర వనరులను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ లేదా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీకి అందుబాటులో ఉంచాల్సిందిగా ప్రభుత్వ విభాగాలు లేదా ఏజెన్సీలకు సూచిస్తుంది.

* కేంద్ర ప్రభుత్వం జారీచేసే మార్గదర్శకాలు అమలయ్యే విధంగా చూస్తుంది.

* విపత్తు పరిస్థితి లేదా విపత్తు సంఘటన సమయంలో ప్రతిస్పందన చర్యలను సమన్వయం చేస్తుంది.

* ముందస్తు హెచ్చరికల పర్యవేక్షణకు బాధ్యత వహించే సంబంధిత వైజ్ఞానిక సంస్థలు, ఏజెన్సీలతో సమన్వయం చేస్తుంది.

* రాష్ట్ర ప్రభుత్వాల సంబంధిత పాలనా విభాగాల ద్వారా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, పౌర రక్షణ వాలంటీర్లు, హోంగార్డులు, అగ్నిమాపక సేవలను సమన్వయం చేస్తుంది.


5) జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం: వెంటనే రంగంలోకి దిగే విధంగా పారామిలటరీ తరహాలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన దళం. దీనికి డైరెక్టర్‌ జనరల్‌ నేతృత్వం వహిస్తారు. ఈ దళం వైపరీత్య సంఘటన సమయంలో లేదా సంభవించిన తర్వాత సంబంధిత రాష్ట్రం, జిల్లా పాలనా యంత్రాంగానికి సహకరిస్తుంది.


6) జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ: కేంద్ర హోంమంత్రి అధ్యక్షుడిగా, ఎన్‌డీఎమ్‌ఏ వైస్‌ ఛైర్మన్‌ ఉపాధ్యక్షుడిగా ఉంటారు. ప్రముఖ నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రాక్టీషనర్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోడల్‌ మంత్రిత్వశాఖలు, విభాగాలకార్యదర్శులు, జాతీయస్థాయి శాస్త్రవిజ్ఞాన, పరిశోధన సాంకేతికసంస్థల అధిపతులు సభ్యులుగా ఉంటారు.


విపత్తు నిర్వహణలో పాత్ర:

 * ఎన్‌డీఎమ్‌ఏ రూపొందించిన   విధానాలు, మార్గదర్శకాల పరిధిలో విపత్తు నిర్వహణ కోసం మానవ వనరుల అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం.

* శిక్షణా కార్యక్రమాల రూపకల్పన, అభివృద్ధి, అమలు.

* పరిశోధనలు చేపట్టడం

*  సమగ్ర మానవ వనరుల అభివృద్ధి ప్రణాళికను రూపొందించి, అభివృద్ధి చేయడం.

* జాతీయవిధాన రూపకల్పనకు సహకారం అందించడం, తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడానికి ఇతర పరిశోధన శిక్షణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలకు సహకరించడం.

* పంపిణీ చేయడానికి అవసరమైన విద్యాసామగ్రిని అభివృద్ధి చేయడం.

* విపత్తులు, వాటిని ఎదుర్కొనే విధానాలపై  అవగాహన పెంపొందించడం.


నమూనా ప్రశ్నలు


1.  ‘యాక్షన్‌ ఎయిడ్‌ ఇంటర్నేషనల్‌ సంస’్థ ఎక్కడ ఉంది?

1) కైరో   2) జోహెన్నస్‌ బర్గ్‌   

3) లాగోస్‌   4) కిన్షాస


2.  కిందివాటిలో అలర్ట్‌నెట్‌ అనే సంస్థ ఎక్కడ ఉంది?

1) మాంచెస్టర్‌    2) బర్మింగ్‌హామ్‌   

3) బ్రాడ్‌ ఫోర్డ్‌    4) లండన్‌


3. ‘ఆసియన్‌ డిజాస్టర్‌ రిడక్షÛన్‌ సెంటర్‌ సంస్థ’ ఎక్కడ ఉంది?

1) కోబ్‌   2) టోక్యో    3) క్యోటో    4) ఒసాకా


4. ‘ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌ క్రాస్‌ అండ్‌ రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీస్‌’ అనే సంస్థను ఎక్కడ నెలకొల్పారు? 

1) జెనీవా    2) జ్యూరిచ్‌    3) బెర్న్‌    4) బాసెల్‌


5.  ‘ఇంటర్నేషనల్‌ స్ట్రాటజీ ఫర్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ (ఐఎస్‌డీఆర్‌)’ అనే సంస్థ ఏ ప్రాంతంలో ఉంది? 

1) బెర్న్‌    2) జ్యూరిచ్‌    3) బాసెల్‌    4) జెనీవా 


6. ‘అంతర్జాతీయ వాతావరణ సంస్థ’ ఎక్కడ ఉంది?

1) ఇంటర్‌ లాకెన్   2) జెనీవా   

3) లాసాన్‌   4) బెర్న్‌


7. ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌   క్లైమేట్‌ ఛేంజ్‌’ సంస్థ ఎక్కడ ఉంది?

1) జెనీవా   2) ఇంటర్‌ లాకెన్‌  

3) బెర్న్‌   4) లాసాన్‌


8. సౌత్‌ ఆసియన్‌ డిజాస్టర్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌ అనే సంస్థను ఎక్కడ నెలకొల్పారు? 

1) లఖ్‌నవూ     2) దిల్లీ 

3) ముంబయి     4) హైదరాబాద్‌


సమాధానాలు

1-2; 2-4; 3-1; 4-1; 5-4; 6-2; 7-1; 8-2.


 రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌

Posted Date : 05-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు