• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో వ్యాధి నివారణ కార్యక్రమాలు

వ్యాధుల కట్టడికి వ్యూహాత్మక ప్రణాళికలు!


 

ఒక దేశ వాస్తవ అభివృద్ధిని ఆ దేశంలోని వ్యాధుల సంక్రమణ, వ్యాధిగ్రస్థుల సంఖ్య ఆధారంగా చెప్పవచ్చు. ఒక ప్రాంతం లేదా దేశంలో వ్యాధులు ఎంత తక్కువగా నమోదైతే అంతగా అభివృద్ధి చెందిందని భావించవచ్చు. వ్యాధుల వల్ల ప్రజల ఉత్పాదకత తగ్గి ఆర్థిక రంగంపై ప్రభావం పడుతుంది. అందుకే సంక్షేమ దేశాల్లో ప్రభుత్వాలన్నీ ప్రజారోగ్యం, వ్యాధుల నివారణ చర్యలకు ప్రాధాన్యమిస్తున్నాయి. భారతదేశంలో కూడా వ్యాధుల తీవ్రత తగ్గించడానికి, వ్యాప్తి నివారణ, నిర్మూలనకు ప్రణాళికాయుతంగా పలు చర్యలు అమలవుతున్నాయి. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు వీటి గురించి తెలుసుకోవాలి. సాంక్రమిక వ్యాధులైన మలేరియా, ఫైలేరియాసిస్, కాలా అజార్, క్షయ, కుష్ఠు సోకేందుకు కారణాలు, వాటి నివారణకు చేపట్టిన పథకాలు, ప్రత్యేక చర్యలు, ఇస్తున్న ఔషధాలపై అవగాహన పెంచుకోవాలి. 

వివిధ రకాల సాంక్రమిక వ్యాధులను తగ్గించడానికి వ్యాధి నిర్మూలన, నివారణ, నియంత్రణ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. వీటిలో వ్యాధిని పూర్తిగా తగ్గించే నిర్మూలన, నియంత్రణ చర్యలు ముఖ్యమైనవి. ఈ చర్యల్లో స్పష్టమైన భేదాలున్నాయి.

వ్యాధి నిర్మూలన (డిసీజ్‌ ఎరాడికేషన్‌): ప్రపంచ వ్యాప్తంగా ఆ వ్యాధిని పూర్తిగా తగ్గించడం, వ్యాధిగ్రస్థులను సున్నా స్థాయికి చేర్చడం. దీని తర్వాత ఆ వ్యాధి ప్రబలకుండా ఎలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు.

వ్యాధి నివారణ (డిసీజ్‌ ఎలిమినేషన్‌): ఒక ప్రాంతంలో ఆ వ్యాధిని పూర్తిగా తగ్గించడం లేదా వ్యాధిగ్రస్థులను ఆ ప్రాంతంలో సున్నా స్థాయికి చేర్చడమే వ్యాధి నివారణ. దీని తర్వాత ఆ వ్యాధి ప్రబలకుండా వివిధ రకాల చర్యలు చేపడతారు.

వ్యాధి నియంత్రణ (డిసీజ్‌ కంట్రోల్‌): ఒక ప్రాంతంలో ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా అనేక రకాల చర్యలు చేపడతారు.


జాతీయ వాహకవ్యాప్తి వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (నేషనల్‌ వెక్టర్‌బర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం - ఎన్‌వీబీడీసీపీ): ఈ కార్యక్రమంలో భాగంగా కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించాలని నిర్ణయించారు. అవి

1) మలేరియా

2) ఫైలేరియాసిస్‌

3) కాలా అజార్‌. దోమలు, రక్తాన్ని పీల్చే ఇతర కీటకాలు వ్యాధి సోకినవారి నుంచి మరొకరికి వ్యాధికారక జీవులను వ్యాపింపజేస్తాయి. ఇవి వాహకాలుగా ఉంటాయి.


మలేరియా: ఈ వ్యాధి ప్రోటోజోవాకు చెందిన ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి వల్ల వస్తుంది. ఈ సూక్ష్మజీవి ఆతిథేయి ఎర్రరక్త కణాలు, కాలేయంలో తన జీవిత చక్రాన్ని పూర్తిచేసుకుని, సంఖ్యను పెంచుకుని వ్యాధిని కలిగిస్తుంది. ఈ సూక్ష్మజీవి ఆడ ఎనాఫిలస్‌ దోమ కాటు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. భారతదేశంలో మలేరియా వ్యాధిని దశలవారీగా తగ్గించేందుకు భారత ప్రభుత్వం ‘నేషనల్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ మలేరియా ఎలిమినేషన్‌    (ఎన్‌ఎఫ్‌ఎమ్‌ఈ) 2016-2030’ను ప్రారంభించింది. దీనిలో భాగంగా 2027 నాటికి మలేరియాను సున్నా స్థాయికి చేర్చి, 2030 వరకు పూర్తిగా నివారించాలన్నది లక్ష్యం. ఇందుకోసం భారత ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది.   

 వ్యాధిని తొందరగా గుర్తించి చికిత్స చేయడం.

 వ్యాధిని వేగంగా నిర్ధారించే కిట్‌ను వాడటం.

 కీటక నాశనులను చల్లడం.

 కీటక నాశనులను పూసిన దోమతెరలు ఉపయోగించడం.


ఫైలేరియాసిస్‌ (లింఫాటిక్‌ ఫైలేరియాసిస్‌): ఈ వ్యాధినే ఏనుగు కాలు, బోదకాలు అంటారు. ఇది ఫైలేరియా పురుగు వల్ల సోకుతుంది. ఆడ క్యూలెక్స్‌ దోమ కాటు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధితో శరీరంలో శోషరస వ్యవస్థ, ముఖ్యంగా శోషరస నాళాలు ప్రభావితమవుతాయి. దీని నియంత్రణకు భారత ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది.

1) సమూహంగా ఔషధాలు ఇవ్వడం: ఈ చర్య వ్యాధి వ్యాపించకుండా ఉండేందుకు తోడ్పడుతుంది.

2) లింఫాటిక్‌ ఫైలేరియాసిస్‌ నివారణ పథకం - 2018

3) మూడు ఔషధాలు ఒకేసారి ఇవ్వడం: దీనిలో భాగంగా ఇస్తున్న మూడు ఔషధాలు ఐవర్‌మెక్టిన్, డైఈథైల్‌ కార్బమజైన్‌ (డీఈసీ), ఆల్బెండజోల్‌. ఈ కార్యక్రమాలతో మలేరియాను 2027 వరకు నివారించాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం.


కాలా అజార్‌: ఈ వ్యాధి లైష్మానియా అనే ప్రోటోజోవా సూక్ష్మజీవి వల్ల వస్తుంది. ఈ సూక్ష్మజీవి మానవుడిని కుట్టే శాండ్‌ఫ్లై అనే కీటకô వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధిని తగ్గించడానికి భారత ప్రభుత్వం మొదటిసారిగా 1990-91లో కాలా అజార్‌ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించింది. దీన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ 2023 వరకు వ్యాధిని నివారించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం భారత ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. 

 వ్యాధిని తొందరగా గుర్తించి చికిత్స చేయడం. 

 వాహకాల నియంత్రణ. 

 ఆరోగ్య రంగంలో వ్యాధులను నియంత్రించడానికి మానవ వనరులు పెంచడం. 

 లైపోసోమల్‌ ఆంఫోటెరిసన్‌-బి ని చికిత్స కోసం అందించడం.


జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమం (నేషనల్‌ లెప్రసీ ఎరాడికేషన్‌ ప్రోగ్రామ్‌ - ఎన్‌ఎల్‌ఈపీ): కుష్ఠు వ్యాధిని డాక్టర్‌ గెర్‌హార్డ్‌ ఆర్మర్‌ హాన్‌సెన్‌ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. మైకోబ్యాక్టీరియా లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల కుష్ఠు వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిగ్రస్థుల నోటి, ముక్కు తుంపరల ద్వారా వారికి దగ్గరగా ఎక్కువకాలం ఉన్నవారికి వ్యాపిస్తుంది. దీని నియంత్రణకు భారత ప్రభుత్వం మొదటగా 1954-55లో జాతీయ కుష్ఠు వ్యాధి నియంత్రణ కార్యక్రమం ప్రారంభించింది. 1982 నుంచి ఈ వ్యాధి చికిత్స కోసం బహుళ ఔషధ చికిత్స ప్రారంభించింది. ఇందులో భాగంగా డాప్‌సోన్, రిఫాంపిసిన్, క్లోఫాజిమైన్‌ అనే ఔషధాలను ఉచితంగా ఇస్తున్నారు. 1983లో జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమం మొదలైంది. 2023, జనవరి 30న జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక (నేషనల్‌ స్ట్రాటజిక్‌ ప్లాన్‌ - ఎన్‌ఎస్‌పీ), రోడ్‌ మ్యాప్‌ ఫర్‌ లెప్రసీ 2023-27ను ప్రారంభించారు. ‘లెప్రసీ ముక్త్‌ భారత్‌ -2027’లో భాగంగా 2027 వరకు కుష్ఠు వ్యాధిని సున్నా స్థాయికి తగ్గించాలన్నది లక్ష్యం.


జాతీయ క్షయ నివారణ కార్యక్రమం (నేషనల్‌ టీబీ ఎలిమినేషన్‌ ప్రోగ్రామ్‌ - ఎన్‌టీఈపీ):  క్షయ వ్యాధి మైకో బ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఊపిరితిత్తులను ఎక్కువగా ప్రభావితం చేసే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపిస్తుంది. టీబీ నివారణకు దేశంలో మొదటగా 1962లో జాతీయ క్షయ కార్యక్రమం ప్రారంభమైంది. 1997లో రివైజ్డ్‌ నేషనల్‌ టీబీ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌ (ఆర్‌ఎన్‌టీసీపీ) ప్రారంభించారు. క్షయ వ్యాధిని త్వరగా నియంత్రించడానికి రోగిని నేరుగా గమనిస్తూ, తక్కువ సమయంలో చికిత్స అందించే కార్యక్రమం DOTs  (డైరెక్ట్‌లీ అబ్జర్వ్‌డ్‌ ట్రీట్‌మెంట్‌ షార్ట్‌ కోర్సు) ప్రారంభించారు. 2025 నాటికి దేశంలో క్షయను పూర్తిగా నివారించే లక్ష్యంతో జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక 2017-2025 అమలవుతోంది. దీనిలో భాగంగా ఔషధ నిరోధక క్షయ చికిత్స (డ్రగ్‌ రెసిస్టెంట్‌- టీబీ) కోసం బెడాక్విలైన్, డెలామానిడ్‌ ఔషధాలు ఇస్తున్నారు. క్షయ వ్యాధి జాతీయ వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా నాలుగు కార్యక్రమాలను చేపట్టింది. 

క్షయ వ్యాధిగ్రస్థులను గుర్తించడం (Detect)

 చికిత్స అందించడం (Treat) 

 వ్యాప్తిని నిరోధించడం (Prevent)

 మానవ వనరులను, సంస్థలను అభివృద్ధి చేయడం (Build). క్షయ రోగులకు  పోషకాహారం అందించడానికి ‘నిక్షయ్‌ పోషణ్‌ యోజన (ఎన్‌పీవై)’ను ప్రారంభించారు.


జాతీయ కొడవలి కణ రక్తహీనత నివారణ మిషన్‌ (నేషనల్‌ సికిల్‌సెల్‌ అనీమియా ఎలిమినేషన్‌ మిషన్‌): కొడవలి కణ రక్తహీనత అనేది జన్యుసంబంధ వ్యాధి. ఇది ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధిలో వ్యాధిగ్రస్థుల రక్తంలోని ఎర్రరక్తకణాలు కొడవలి ఆకారంలోకి మారిపోతాయి. ఎక్కువగా గిరిజనుల్లో ఈ వ్యాధి కనిపిస్తుంది. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె లాంటి భాగాలను ప్రభావితం చేస్తుంది. 2047 నాటికల్లా ఈ వ్యాధి తర్వాతి తరానికి వ్యాప్తి చెందకుండా నివారించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్‌ను 2023, జులై 1న ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిలో భాగంగా మూడేళ్లలో 7 కోట్లమందిని పరీక్షించనున్నారు.


 


నమూనా ప్రశ్నలు


1.    మలేరియా వ్యాధి ఏ వాహకం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది?

1) ఆడ ఎనాఫిలస్‌ దోమ        2) శాండ్‌ ఫ్లై  

3) ఆడ క్యూలెక్స్‌ దోమ           4) మగ ఎనాఫిలస్‌ దోమ


2.    ‘నిక్షయ్‌ పోషణ్‌ యోజన’ అనే కార్యక్రమాన్ని కింది ఏ వ్యాధి నివారణలో భాగంగా ప్రారంభించారు?

1) మలేరియా  2) క్షయ   3) కుష్ఠు      4) ఫైలేరియా 


3.    ఫైలేరియాసిస్‌ వల్ల ఏ భాగాలు ప్రభావితమవుతాయి?

1) గుండె  2) మూత్రపిండాలు    3) శోషరస నాళాలు 4) చిన్నపేగు


4.    కింది వాక్యాల్లో సరికాని దాన్ని గుర్తించండి.

1)  వ్యాధి నిర్మూలన అంటే వ్యాధిని ప్రపంచవ్యాప్తంగా సున్నా స్థాయికి చేర్చడం.

2) వ్యాధి నివారణ అంటే ఒక ప్రాంతంలో వ్యాధిని సున్నా స్థాయికి చేర్చి, మళ్లీ ప్రబలకుండా చర్యలు చేపట్టడం.

3) వ్యాధి నియంత్రణ అంటే వ్యాధి ప్రబలకుండా ఒక ప్రాంతంలో చర్యలు చేపట్టడం.

4) వ్యాధి క్షీణత అంటే వ్యాధి కారక  సూక్ష్మజీవులను చంపడం.


5. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో మొదటగా నిర్మూలించిన వ్యాధి?

1) మశూచి    2) కలరా   3) టైఫాయిడ్‌   4) డయేరియా


6. వైరస్‌ వల్ల కలిగే ఏ వ్యాధిని భారతదేశంలో నివారించారు?

1) డెంగీ   2) రేబిస్‌  3) పోలియో   4) క్షయ


సమాధానాలు: 1-1; 2-2; 3-3; 4-4 ; 5-1; 6-3.


 

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌ 

Posted Date : 10-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌